‘జనం తలరాతలతోనా నాయనా ఈ తరహా పిచ్చి ప్రేలాపన? ’ అని అక్కడికీ లక్షకోట్ల సార్లు మొత్తుకు చూశా! ఊహూ! పశుపాలుడు చెబితే శిశుపాలుడు విన్నాడా భారతంలో?
గతంలో వాతానికి విరుగుడుగా నాలుక పై వాతలేసేవారు భూతవైద్యులు! మంచి భవిత కోసం జనమే మళ్లీ ఆ తరహా మొరటు చోద్యానికి పూనుకోక తప్పదు! నాలుక జాతి తరఫున మాటిస్తున్నా... మాకు అభ్యంతరం లేదు! ప్రజల బాగోగుల కోసం బాధ ఎంతటిదైనా భరించేందుకు మేం సిద్ధం. దుష్టులతో జట్టు కట్టినందుకు మాలోని కొన్ని తిక్క నాలుకలకు ముందు బుద్ధి రావాలి. అదీ మా సదుద్దేశం. నలుగురిలో మంచివాడన్న గురి కుదరడానికైనా మా నాలుకల చేత మంచిగా పని చేయించుకోవచ్చుగదా ఈ దగా నేతలు! మా పనితనాన్ని బట్టే కదా నేతల పెత్తనం ఎంత కాలం సాగేదో తేలేది!
అడ్డమైన గడ్డీ గాదానికి ఆశపడే బుద్ధి కొద్ది మంది నేతలది. అవి కుతి తీరా మెక్కి అరక్కపోతే అజీర్తి రోగం తగిలి చివరకు అల్లాడేది మేం నాలుకలమే. కక్కుర్తి నేతల అజీర్తి జబ్బుకు వైద్యుడి ముందు మేమే ముందుగా దోషులమై నిలబడాలి!
మాటా-మంతీ నడిపే శిక్షణ మా నాలుకలకు శిబిరాల్లో ఎవరూ ఎప్పుడూ ఇప్పించింది లేదు. అనుభవాన్ని బట్టే మంచీ చెడూ అన్నీ ప్రదర్శించే నైపుణ్యం మాకు ఆ ప్రకృతి ప్రసాదించిన పుణ్యం. చట్టాన్నే తన పని తాను చేసుకుపోనీయరీ నేతా గణాలు! మా నాలుకలను ఇక అంత తేలికగా వదిలేస్తారా? అక్కడికీ ఫిర్యాదు చేద్దామని న్యాయదేవత చుట్టూతా ఎన్ని పర్యాయాలు చక్కర్లు కొట్టి వచ్చామో... హక్కుల నేతల నోళ్ల అండ చూసుకుని! ఆ తల్లి నోటి నాలుక పరిస్థితే అంతకు మించి దైన్యంగా ఉంది!
ఇదీ అదీ ఇక్కడా అక్కడా అనేముంది... ఏ చట్ట సభ చూసినా మంచినీళ్ల పంపు దగ్గరి దృశ్యాలే మంచిగా అనిపిస్తున్నాయిప్పుడు. నాలుకలు తెగ్గోసే భాషకే శభాషంటూ చప్పట్లూ మోగడం విచారం... అంతకుమించి ప్రమాదకరం!
ఏ నాలుకైనా కలకండ రుచి పలుకే చిలుకు. తెగల పేరుతో నాలుకలు తెగ్గోసుకొనే అనాగరిక దశను మనిషి దాటి ఎన్ని యుగాలయిందీ! లింగ భేదం ఇంకానా? రంగుల మీదా వివాదాలా? ఊదా, నలుపు, పసుపు; వంటి రంగు ఏదైతే ఏం? మనిషన్న ప్రతివాడి శరీరంలో కనిపించేది ఒకే రంగు నాలుక కదా! పిచ్చి కూతలు కూసే నేతలకు అందుకే నోటి నాలుక తెగ్గోసి పంచ భక్ష్య పరమాన్నాల ముందు కుదేసి కంచం ఖాళీ చేసేదాకా కొరడాలతో దంచాలనిపించడం!
కనడం, పెంచడం, సహోదరిగా ప్రేమను పంచడం, సహచరిగా జీవితాంతం బరువు బాధ్యతలు పంచుకోవడం... మహిళ ఎంత సహనంతో చేయకుంటే మగవాడి బతుకు ఇంత మహిమాన్వితంగా తయారవుతుంది? అయినా ఆడజాతిని అట్లా ‘అమ్మ.. ఆలి’ల భాషలో ఈసడించడానికి ఎలా మనసు వస్తుందో... ఏ ధర్మసూత్రం సమ్మతిస్తుందో? దుశ్శాసనులు, కీచకులు, దుర్యోధనులు పూర్తిగా చచ్చారన్న మాట అచ్చంగా నిజమేనా? నానాటికీ పెచ్చుమీరే ఈ తుచ్ఛ నేతల పలుకులకు వేదిక కావడం... నాలుక జాతిగా మాకు తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
ప్రజానేతలారా! ఎన్నికల వేళ జనాలకు తమరిచ్చిన ‘ఇలాతలంపై రామరాజ్యం’ హామీ సుసాధ్యం కావాలంటే ముందుగా అవసరమయ్యేది మంచి గంధాన్ని మించి మంచితనాన్ని వెదజల్లే మాటా మంతీ!
తల తిరుగుడు నేతలకు తెలివిడి తెచ్చే అవకాశం అడపాదడపా మీకు వస్తోంది ఓటరు మహాశయులారా... మనో వేదనతో మేం ఇదే మీకు చేసుకునే నివేదన! మాటకు, పిచ్చి కూతకు మధ్య తేడా మరిచి మాటి మాటికీ రచ్చకెక్కే నేతలకు బోధపడేలా చెప్పడం ఒక్క హక్కే కాదు... ఓటర్లుగా మీ బాధ్యత కూడా!
No comments:
Post a Comment