Sunday, December 12, 2021

స్వర్గం నాకొద్దు!- కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 


యమలోకం.

మృతజీవుల పాపపుణ్యాల విచారణ సాగుతోంది. చిత్రగుప్తుడు చిట్టా నుంచి ఒక్కో జీవినే పిలిచి యమధర్మరాజుగారి ముందు నిలబెడుతున్నాడు. గుప్తాజీ చదివే పాప పుణ్యాలను విచారించి  అర్హులైన జీవులను స్వర్గానికి పంపించెయ్యడం, పాపులైన జీవులను యమకింకరులకు అప్పగించి శిక్షలు విధి యధావిధిగా యమధర్మరాజుగారు ఆ రోజూ నిర్వహిస్తున్నారు.

'ప్రభూ! ఈ జీవులంతా తిరుమలస్వామి దర్శనార్థమని వెళుతూ ఘాట్ రోడ్ మీది బస్  ప్రమాదంతో నేరుగా తమ సమ్ముఖానికి వచ్చినవారు'

'భక్తుల మహాప్రస్థానాన్ని ఆపే అధికారం మనకీ లేదు. అందరినీ సరాసరి స్వర్గధామానికి సాగనంపండి!' యమధర్మరాజుగారి ఆజ్ఞ.

‘మరి వాహన చోదకుడిని కూడానా మహాప్రభో?'

'తప్పదయ్యా! ఆ చోదకుడు ఆ ఘాతుకమునకు ఒడిగట్టినందు వల్లనే కదా అంత మంది భక్తులు ఆఖరి క్షణములలో దైవనామస్మరణము నిరాటంకముగా సాగించినారు! సమూహం మొత్తంలో ఒకే దఫా పుణ్యకార్యమునకు ప్రేరేపించిన కారణమున ఈ వాహన చోదకునికి స్వర్గములో  ప్రత్యేక సౌకర్యములు సైతము అనివార్యం'

'చిత్తం స్వామీ!' అని  నసుగుతున్న చిత్రగుప్తుని వంక విచిత్రముగా చూసినారు యమధర్మరాజుగారు.

చిత్రగుప్తుడు సమీపముగా వచ్చి చెవిలో సాగించిన గుసగుసలకు స్పందనగా 'సరి!  అర్థమయినది! మృతుల విచారణ  ప్రారంచమని మా ఆజ్ఞ!' అని హూంకరించారు యమధర్మరాజుగారు కైకాల సత్యనారాయణగారి స్టైల్లో.

తన ముందుకొచ్చి నిలబడిన ఒక యువ మృతజీవి వంక గుర్రుమని చూచి అడిగారీ సారి 'ఈ జీవి నిర్యాణమునకు కారణమేమి? కరువులా? కాటకములా? వరదలా? ప్రమాదములా? కరోనా వైరస్సులా? వాటి నిరోధమునకు వాడు టీకా చికిత్సలా?'

‘అవి ఏవియును కాదు మహాప్రభో! తాను అభిమానించి చలనచిత్ర కథానాయకుని చిత్రరాజము మొదటి రోజునే బర్రుమని చేదేసిందన్న దుగ్ధతో పురుగుల మందు తాగినందువలన..’

‘అర్థమయినది. ఆ  పురుగుల మందు వలననా?’ తల పంకించి  ‘ఓ మృతజీవీ! నీకు చలనచిత్రములన్నచో అంత ప్రీతిపాత్రమా? అని గుడ్లురిమారు' యమధర్మరాజుగారు.

'ప్రాణం చిన్నమాట సామీ! పిచ్చి.. మదపిచ్చి!' గర్వంగా చెప్పింది మృతజీవి.

'అయినచో.. ఆ చిత్రరంగమునకు సంబంధించినదే ఒక చిన్న ప్రశ్న సంధించెదను. ఉచిత సమాధానమిచ్చినచో  సముచిత రీతిన స్వర్గప్రాప్రి ప్రసాదించెదను. సిద్ధమా?'

'డబుల్ సిద్ధమ్. అడుక్కో సామీ!'

‘షారుఖ్ ఖాన్ అను బాలీవుడ్ నటుడు ఇంత వరకు ఎన్ని చుంబన సన్నివేశములందు తన నటనాకౌశలము ప్రదర్శించెను?'

'ఇదేం పిచ్చి ప్రశ్నయ్యా మహానుభావా? ప్రతి చిత్రంలోనూ కిస్సింగ్ సీన్సు ఒకటో రెండో ఉంటయ్ కదా! అవి లెక్కెట్టుకుంటూ కూర్చుంటే రెక్కలు పడిపోతయ్ నాయనా! షారుఖ్ పెద్ద రొమాంటిక్ హీరో. అతగాడు నటించిన  చిత్రాలన్నిటిలో ఓటో .. అరో కిస్ సీన్లుండకపోతే ముందు  హీరోయిన్లే డిజప్పాయింటయిపోతారు. కిస్సుల్లేకపోతే ముందు ఫ్యాన్సే ఆయన్ని మర్డర్ చేసేస్తారు'

'నో! ఒక్క చిత్రములోనైనను ఆ నటుడు ఏ కథానాయిక చెక్కిలిని చుంబించనే లేదింతవరకు.  అది అతని ప్రతిజ్ఞ. నిత్యమూ చిత్ర ప్రపంచములో మునిగి తేలు నీకు ఇంతటి స్వల్ప విషయము తెలియకుండుట విచిత్రమే! సరి. మరియొక అవకాశం ఇచ్చుచుంటిని. జీవించి ఉన్నకాలములో భవిష్యత్తులో నీవు ఏమి కావలయునని వాంఛించెడివాడివో సెలవిమ్ము మృతజీవీ! యాక్టరా.. డాక్టరా.. లాయరా.. టీచరా..రాజకీయ నేతయా.. లేక మీ ఆంధ్రదేశమందు అందరూ అభిలషించు ఆ కంప్యూటర్ ఇంజను పనియా?’

'ఆఁ..ఏదీ.. ఇదీ.. అని ఇతమిత్థంగా అనుకోలేదయ్యా సామీ ఇంకా! మనకంత టైమెక్కడుందసలు మహానుభావా? అఁ! ఏ ప్రొఫెషన్లో సెటిలయినా డబ్బు మాత్రం  బిల్ గేట్స్ కు మించి  సంపాదించాలనే ఆత్రం మా  గట్టిగా ఉందయ్యా మా రాజా!'

'అటులనా? అయినచో.. ఆ బిల్ గేట్స్ ఫోర్బ్స్  కుబేరుల జాబితాలో ఏ స్థానములో ఉండెనో ఏమైనా అంచనా కలదా జీవా నీకు?'

'ఫోర్బ్సా?! ఫోర్డ్ కారు పేరు విన్నానే కానీ.. ఈ ఫోర్బ్సులూ, గీర్బ్సులూ ఎప్పుడూ జాన్తానై! ఇదేంటయ్యా సామీ? జి.కె అంటే ఏవో ఎబ్రివేషన్సూ, యుద్ధాలూ, డేట్సూ అవార్డుల్లాంటి వాటిని గురించి గీకుతారని విన్నాగానీ, మరీ ఇంత అన్యాయ మైన బిట్ పేపరా ..!'

'మంచిది జీవా!  జి.కె మోడల్ బిట్ క్వశ్చన్లే కదా మరి నువ్ కోరేది?  నోబెల్ బహుమానము స్వీకరించిన మీ దేశీయుల పేర్లేవో ఓ అయిదు చెప్పగలవా టక టకా? వాటిలో అందరికీ తెలిసిన రబీంద్రనాథ్ ఠాగోరు, రామానుజం, అమర్త్యసేన్ వంటి ప్రసిద్ధుల పేర్లు నిషిద్ధం సుమా?'

'మహాత్మా గాంధీ!;

'మీ మహాత్మునుకి ఆ పురస్కారం దక్కనేలేదయ్యా మహాశయా! సరి! సాధారణ జ్ఞానము కూడా తమరికి శూన్యమని తేటతెల్లమయిపోయినది. సాధారణముగా మీ యువతకు 'ప్రేమ' అన్న మహా ప్రీతికరమైన అంశము కదా!  పోనీ ఆ క్షేత్రమునకు సంబంధించిన ప్రశ్న సంధించమందువా?'

'సంధిస్తే సంధించండి గానూ మహాప్రభో! ఎక్కడో అడుగు బొడుగువి ఏరి మరీ సంధించి నా ప్రాణం తీయకండి.. ప్లీజ్.. ప్లీజ్!'

'పిచ్చిజీవీ! నీ ప్రాణములు తీయు కార్యక్రమం ఏనాడో అయిపోయిందయ్యా!  ఇప్పటి ఈ ప్రయాస సర్వమూ నీ స్వర్గము నీకు తిరిగి ప్రాప్తింపచేయుడకు! అందాల పోటీలో గెలుపొందిన సుందరాంగుల పేర్లు రెండు చెప్పుము.. చూతము.. అయిశ్వర్యా రాయి, సుస్మితా సేన్ తక్క’

'ఈ తక్కలతోనే నాకు తిక్క రేగేది. నాకు తెల్సిన రెందు పేర్లూ నువ్వే చెప్పేసి.. ఇంకా చెప్పమంటే నేనెట్లానయ్యా సామీ చావడం? ఇంత తొండయితే నేనస్సలు ఇక్కడ ఉండనే ఉండను .. ఫోండి!'

చిత్రగుప్తుడు యమకంగారుగా యమధర్మరాజుగారిని  సమీపించి  ప్రభువుల రెండు చెవులు బరబరా కొరికేశారో రెండు నిమిషాలు.  సమవర్తీ సాభిప్రాయంగా తలాడించి మృతజీవి వంక చూస్తూ 'మాజీ మానవా! ఎన్న సరళ ప్రశ్నలు సంధించిననూ సముచితమయిన సమాధానము ఒక్కటీ రాక సంధి ప్రేలాపనలు చేయుచున్నావు. నీ వంటి వ్యర్థజీవి మా నరకమునకు కూడా పెనుభారమే. నీ పక్షము నుంచి సహకారమందనిచో  స్వర్గప్రాప్తియు నీకు దుస్సాధ్యము. కనుక ఈ ఒక్క సారికి నీకు తెలిసిన అంశముల నుంచి మాత్రమే ప్రశ్నలు సంధింపబడును. సహనముతో నీవు సమాధానాములు ఇచ్చితీరవలయును. మీ లోకములో  నీకు ఇష్టమైన వారు ఓ నలుగురు ఎవరో  చెప్పుము!'

'అమ్మయ్య! ఇదీ క్వశ్చన్ పేపరంటే! మా అమ, చెల్లాయి, తమ్ముడు, దోస్తు దాసు నా కిష్టమయిన ఆ నలుగురు'

'ఇందులో మీ నాయనగారి పేరు లేదేమీ?'

'ఆయనంటే నాకు చచ్చే కోపమయ్యా'

'ఎందుచేతనో?'

'నా చిన్నతనంలోనే వళ్లు కాల్చుకుని చచ్చిపోయాడు పొలంలో పంట సరిగ్గా పండలేదని. ఇల్లంతా, పాపం, మా అమ్మ ఒక్కతే నడిపింది ఇంతకాలం.. నానా అగచాట్లు పడి! అయినా ఇంట్లో నిష్టదరిద్రమే. రెండు పూటలా మింగే ఒక ముద్దకే రోజంతా ఎద్దులా చాకిరి చేయాల్సొచ్చేది, పాపం.. అమ్మ. ఇహ నేను మాత్రం చదువు సక్రమంగా వెలగబెట్టేదెట్లా? గొప్పవాణ్ణవడం కల్లో కూడా ఉహించలేని మాట. అందుకే, మమ్మిల్నిట్లా నట్టేట్లో ముంచిపోయిన మా అయ్యంటే నాకు మహా మంట.  ఆయనే కనక బతికుండుంటే ఎంత బాగుండేది!  పెద్దయ్యాక నేనో పేద్ద సినీ స్టారునై కోట్లు కోట్లు గడుంచేవాణ్ణి గదా!’

'సరే నిర్జీవీ! నీ కన్ని కోట్లు నిజంగానే వస్తే ముందుగా సంబరపడేదెవరు?’

'ఇంకెవరూ.. మా అమ్మ! ఆనక చెల్లెలు, తమ్ముడూ! అయిపోయాయా బాబయ్యా నీ తలా తోకా లేని ప్రశ్నలు?'

మృతజీవి చిరాకు చూసి చిరునవ్వుతో ఆడిగాడు యమధర్మరాజుగారు 'చివరి ప్రశ్న ఒకటి ! మీ చెల్లాయి ఏ మహేష్ బాబో, జూనియర్ ఎంటీఅరో, దేవరకొండోలాంటి కథానాయకుణ్ణి ప్రేమించి అతగాడితోనో పెళ్లి జరిపించాలని ఇంట్లో పట్టుబడితే!, లేకుంటే చచ్చిపోతానని  బెదిరిస్తే. ఏం చేస్తావ్ నువ్వు?'

'చంపి ఉప్పుపాతరేసేస్తాను!' అంటూ ఊగిపోయింది కుర్ర మృతజీవి. అంతటితో ఆగితే అదో రకం. యమధర్మరాజుగారి మీదనే ఇంతెత్తున లేచింది ఇహ సహనం కోల్పోయి 'ఇదేం యమలోకం? నువ్వేం యమధర్మరాజువయ్యా? ఇట్లా ఉంటుందా  విచారణంటే? మా లోకంలో టీవీ సిరియల్సు కన్నా సిల్లీగా ఉంది. ఇదేదో 'బిగ్ బాస్' తరహాలో ముందే మేనేజ్ చేసిన ఫార్శుడ్  ప్రోగ్రాం లాగుంది. నిజమా .. కాదా? కమాన్.. టెల్ మీ ది ట్రూత్! అబ్సొల్యూట్ ట్రూత్!’

ఉద్రేకంతో ఊగిపోయే మృతజీవి వంక చూస్తూ 'శహ్ భాష్!' అంటూ ప్రశంశాపూర్వకంగా చప్పట్లు చరిచారు యమధర్మరాజుగారు. 'ఇప్పటికయ్యా నీకు వంటి మీదకు స్పృహ వచ్చింది! నువ్వు తెలివిలో కొచ్చావు  కాబట్టే తెలివైన ప్రశ్న సంధించావు! నాకు నచ్చావు. కాకపోతే నాదో చిన్న సందేహం. నీ అబిమాన కథానాయకుడి చలనచిత్రం ఆడకపోతేనే పురుగుమంది తాగి ఇక్కడికి  పరుగెత్తుకొచ్చావే! మరి ఆ చలనచిత్ర రంగ పరిజ్ఞానం కూడా ఎందుకంత శూన్యం నీకు? బిల్ గేట్సుకు మించి  బోలెడంత సంపాదించాలన్న  యావే కానీ,  మనీ ప్రపంచానికి చెందిన ఫోర్బ్స్  కుబేరుల జాబితా సైతం తెలీనంత అజ్ఞానంలో పడికొట్టుకుంటున్నావ్ నువ్వు! కోడెవయసులో ఉండీ అందాల ప్రపంచానికి చెందిన రాణుల పేర్లు కనీసం రెండుకు మించి తెలీని తెలిబితక్కువతనం నీది! చదివేది కళాశాల చదువులే అయినా, కనీసం మహాత్మునికి నోబెల్ పురస్కారం దక్కలేదన్న  జ్ఞానం కూడా లేకపోయె నీకు! పంటలు పండకపోవదానికి వెరే కారణాల మాటెట్లా ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలదే ప్రథమ బాధ్యత అని  తెలిసీ వళ్లు కాల్చుకున్నాడు మీ నాయన. ఆ అన్నదాతకూ.. చిత్రాల విజయాపజయాలకు, నిజజీవితాల గెలుపు ఓటములకు  మధ్య  సంబంధం లేదని తెలిసీ పురుగుల మందు తాగిన నీకూ తేడా ఏముంది? అమ్మ, చెల్లి, తమ్ముడంటే ప్రాణమని నువ్వే అంటివి! మళ్లీ వాళ్లందర్నీ నట్టేట ముంచి నువ్వొక్కడివే పైకొచ్చి స్వర్గ సుఖాలు చవిచూద్దామని చొంగలు కారుస్తుంటివి! సరే! ఫో! అనుమతి ఇస్తున్నాను. స్వర్గానికే పో! అదిగో! అక్కడ.. పుష్పకవిమానం సిద్ధంగా ఉంది నీ కోసం.. ఫో!'

'నాకే స్వర్గమూ వద్దు మహాప్రభో!' అని బిగ్గరగా అరిచింది మృతజీవి. 'తప్పు తెలిసింది యమధర్మరాజా! తిరిగి నన్ను మా భూలోకానికి పంపించెయ్యండి.. ప్లీజ్! బుద్ధిగా చదువుకొని మా నాన్న లేని లోటును పూరిస్తా! మా ఇంటినే నేను  స్వర్గధామంగా మార్చుకుంటా!'

కుమిలిపోయే మృతజీవి భుజం తట్టి 'తథాస్తు!' అని లేచి నిలబడ్డారు యమధర్మరాజుగారు.

అక్కడ భూలోకంలో మృతుని శరీరం మళ్లీ జీవం పోసుకుని లేచికూర్చుంది. ఇంటిల్లిపాదికీ అంతులేని సంతోషం!

***

ఇక్కడ యమలోకంలో చిత్రగుప్తుడు అన్నాడు 'మృతుడు తాగిన పురుగుల మందు పరమ కల్తీది మహాప్రభో! ఆ సత్యం తెలియక మన కింకర కుంకలు మృతుడి ప్రాణాలు పట్టుకొచ్చేశారు. కింది లోకంలో  విచారణ జరుగున్నది. ఆ విషయమే నేను  మొదట్లో మీ చెవిలో వేసేందుకు ప్రయత్నించింది.  కింద విచారణలో  మృత జీవి తాగింది కల్తీ పురుగుల మందేనని నిర్ధారణ అయిన దాకా తమరు.. మహాతెలివిగా మన యమలోక విచారణ 'షో' నడిపించారు. అటు మృత జీవికి తాను చేసిన తప్పేమిటో తెలిసివచ్చేలా చేశారు.ఇటు  మన  కింకరుల పొరపాటు త్రిలోకాధిపతుల దాకా పోయి నరకలోకం  పరువు పోకుండా  కాపాడారు! మీ సాగదీత విచారణా ప్రతిభకు ఇవే నా జోహార్లు' అంటూ చిత్రగుప్తుడు వంగి వంగి  ప్రణమిల్లితే గుబురు మీసాలు దువ్వుకుంటూ  కైకాలవారి స్టయిల్లో 'యముండ' అని చిద్విలాసం చిందించారు యమధర్మరాజుగారు.

-కర్లపాలెం హనుమంతరావు

10 -03 -2010

బోథెల్, యూఎస్ఎ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...