గోచిపాత సంరక్షణార్థం సంసారమనే గోదారిలో దూకి ఈదలేక ఇడుములు పడ్డ వెర్రిబాపడి కథ చెవినబడినంతనే చిన్నాపెద్దా తేడాలేకుండా అందరి పెదాల మీద ముందుగా విరిసేవి మందహాస అరవిందాలే! 'పరిహాస ప్రసంగం’లేని వాక్యా'న్ని ప్రాచీనసాహిత్యమూ నిరసించింది. సంహితలనుంచి, బ్రాహ్మణకాలు. ఆరణ్యకాలవరకు వైదిక వాఙ్మయం నిండా ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. శ్రీ లలితాదేవి సౌందర్యవర్ణన సందర్భంగా పరమేశ్వరీదేవిని 'మందస్మిత ప్రభాపూరమజ్జత్కామేశ మానస'గా అభివర్ణిస్తుంది బ్రహ్మాండపురాణం.. హయగ్రీవాగస్త్య సంవాదం. శాస్త్రాలు, పురాణాలు ప్రసక్తానుప్రసక్తంగా చేసే ధర్మప్రబొధాలకు, నీతిప్రవచనాలకు సైతం చమత్కారం పై పూతగా గల వృత్తాంతాలే ఉపరి బలం. హాసాన్ని హాస్యరసానికి స్థాయీభావంగా భావిస్తుంది ఆలంకారశాస్త్రం. అనుకూల, ప్రతికూల పరిస్థితుల్లో సైతం చెక్కుచెదరని ఆస్వాదయోగ్య స్థితి కలిగి ఉండటమే స్థాయీభావ లక్షణం. నవరసాలలో శృంగార హాస్యరసాలకే ఈ స్థాయి ఉందని ‘ధ్వన్యాలోకం’ సూత్రీకరిస్తుంది. అందులో హాసరసానికి అగ్రతాంబూలమని ఆనందవర్థనుడి నొక్కిచెప్పాడు. 'రుద్రయశోభూషణం'కర్త విద్యానాథుడు కృతక పలుకుబళ్ళకు, వేషభాషాదులకు హాసరస గౌరవం కల్పించినా.. అత్యాధునికత ఆ తరగతిని నీచహాస్యం కింద 'ఛీ'కొడుతోంది. నేటిమనిషి తన స్వారస్య అవసరాలకు అనుగుణంగా హాసరసానికి ఎన్నో సగుణాత్మకమైన మార్పులు చేసుకొంటున్నాడు. మన తరందాకా ఎందుకు? మద్యలో వచ్చిన ఆలంకారికుడు శారఙ దేవుడే నవ్వును 'ఆత్మీయం.. పరకీయం' అంటూ రెండుగా విభజించాడు! లక్ష్య లక్షణాల చర్చలకు ఏముందిగానీ.. నవ్వొచ్చినప్పుడు లక్షణంగా నవ్వేసెయ్యడమే ఉత్తమ సంస్కారుల ముఖ్య లక్షణం. లక్షలు కోట్లు వెచ్చించినా దక్కని సౌభాగ్యం, ఆరోగ్యం ఉచితంగా పంచి పెట్టే హాస్యస్ఫూర్తిని ఒడిసిపడితే చాలు.. జీవితాంతం ప్రాణానికి తెరిపి.
మన ప్రాచీన కావ్యవాజ్ఞ్మయం సర్వస్వం ఈ దివ్యస్వారస్వ రసాధిదేవతకు పట్టిన మంగళహారతి. శృంగార, హాస్యాలు ఆదిమకాలం నుంచి మానవజాతికి దగ్గరి బంధువులే. హాస్యంతో చుట్టరికమయితే మరీ గట్టిది.
ఆదికావ్యం రామాయణం నిండా ఉల్లాసభరితమైన హాస్యోపకాండలే! 'రాముడి వద్దకు మిమ్ము నేరుగా మోసుకుపోతా'నంటూ అంగుష్ఠ రూపి ఆంజనేయుడి విన్నపం అంతశోకంలోనూ అశోకవనం సీతమ్మవారి నోట నవ్వుల పువ్వులు విరబూయిస్తుంది. 'నా యొడలు సేర్చినప్పుడు/ నీ యొడలెట్లగునొ దాని నీవెరిగెదు' వంటూ తిక్కన భాగపు భారతం నర్తనశాలఘట్టంలో సైరంద్రీవేషధారి భీముడిచ్చిన హెచ్చరికలేవీ కీచకుడికి దుర్బుద్దికి ఆనవు కానీ.. ఆ కాముకుడికి ముందు ముందు పట్టబోయే పిడిగుద్దుల వడ్డింపులు ఊహకు తట్టి ఫెటేల్మంటూ చదువరుల పెదవులు విచ్చకుంటాయి!
'నవ్వవు జంతువుల్' అని జాషువావంటి కవులెంతమంది అంటే ఏమిటిట! పశుపక్ష్యాదులతో, జంతుజాలంతో హాస్యప్రసంగాలు చేయించిన సరసహృదయం మనిషిది. ఓడి పాతాళంలొ పడివున్నా తనముందు దంభం ప్రదర్శించేటందుకు దేవేంద్రుడు పడ్డ పాట్లు చూసి గాడిద రూపంలో ఉండీ బలి పడీపడీ నవ్వేస్తాడు విష్ణుపురాణంలో. ఆనందరసాస్వాదన పైన గాడిదలకూ అంత ప్రేముంటుంది మరి!
రూపకాలలో వసంతకులు, ప్రహసనాలలో వికారులు, ఆస్థానాలలో విదూషకులు, వినోదాలలో కేతిగాళ్ళు, ఆటపాటలలో వంతలు, జంతు ప్రదర్శనల్లో వింత బఫూన్లు, చలనచిత్రాలల్లో హాస్యగాళ్ళు.. పప్పులో ఉప్పులు,, పాయసాన జీడిపప్పులు. హాస్యరసం అంతర్లీనంగా ప్రవహించని పక్షంలో కరుణరసమే పరమ నీరసంగా ఈసడింపుల పాలవుతున్న అభావయుగం ప్రస్తుతం నడుస్తున్నది. విరామమెరుగని వత్తిడి బతుకులకు హాస్యమే శ్రీరామ రక్ష అయిందిప్పుడు.
వెన్నదొంగ కన్నయ్యను కన్నంలోనే పట్టేసుకుంటుంది భాగవతంలో యశోదమ్మ. 'వీరెవ్వరు శ్రీకృష్ణులు/ గారా! యెన్నడును వెన్నగానరట కదా!/చోరత్వం బించుకయును/ నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే!' అంటూ ఆ తల్లి చేత తన పట్టిని ఆటలు పట్తించి మన మానసాలకు ఉల్లాసం కలిగిస్తాడు బమ్మెర పోతన! చలనచిత్ర దర్శకులు జంధ్యాల అన్నట్లు నవ్వడం ఈనాటి వత్తిళ్ల యుగంలో నిజంగా ఓ భోగమే. ఆవైభోగాన్ని ఉదారంగా జనావళికి పంచిపెట్టే పోతన్నల వంటి అక్షరయోగులందరికీ అందుకే నిండు మనస్సుతో నమస్సుమాంజలులు అందించడం న్యాయం.
నవ్వించడం ఓ యోగమయితే నవ్వులపాలయీ నలుగురితో కలిసి నవ్విపారేయడం మరింత ఉత్తమ యాగం! 'తమ్ము ఇతరులు పరిహసించి తమలోని తప్పులని బైటపెట్టినప్పుడు తమ తలనున్న బంగారు కిరీటం కిందపడునన్న దిగులు ఆ నాటి వారికి లేదు' అంటారు తెనాలి రామకృష్ణుని హాస్యాన్ని పరామర్శించే సందర్భంలో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు. 'గ్రామము చేతనుండి, పరికల్పిత ధాన్యములింటనుండి శ్రీ /రామ కటాక్ష వీక్షణ పరంపరచె గడతేరెగాక మా/ రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చునా/స్వామి యెరుంగు దత్కబళ చాతురి తాళఫల ప్రమాణమున్'అంటూ శ్రీనాథకవి తాటికాయలంతేసి అన్నం ముద్దలు ఆరగించే తన భోజన పరాక్రమం పైన కవిత్వం వెలగబెట్టినప్పుడు కించిత్తైనా కోపం తెచ్చుకోలేదుట రామయమంత్రివర్య్లలు! అంతులేని పెత్తనాలు ప్రభుత్వ పరంగా చేతుల్లో ఉండీ నోరారా నవ్వుకొనే హాస్యస్ఫూర్తిని మాత్రమే ప్రదర్శించారా పాలకులు. ఆ సామరస్య సహనమే నేటి నేతలకూ తక్షణం నెత్తిన పెట్టుకోదగ్గ సులక్షణం. పాలనలో లోపాలు రామరాజ్యంలోనే తప్పింది కాదు. పాలితులు నేరుగా కుపాలనను వేలెత్తి చూపలేని నిస్సహాయ స్థితుల్లో.. ప్రజాహితం కోరే బుద్ధిజీవులు ఏ కొందరో హాస్యాన్ని.. వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తుంటారు. ‘మహిష శతకం’ కాలంనుంచీ నడిచివస్తున్న ఈ నిరసన సంప్రదాయం. స్వీయవ్యక్తిత్వాన్ని ప్రశ్నించడంగా పాలకులు అపార్థం చేసుకోవద్దని హితవు చెప్పడమే ఈ పాఠం ఉద్దేశమిక్కడ.
విమర్శా మల్లెపూల చెండుతో మోదినంత సున్నితంగా ఉంటేనే బావుంటుంది. శ్రీ శ్రీ సింధూరం మార్కు నవగీతం జరుక్ శాస్త్రి 'మాగాయ, కందిపచ్చడి' కిందలాగా మారినప్పుడే పకాల్మని నవ్వొచ్చేది.
'హాస్యమంటే చల్లని మంట' అంటాడు ఆస్కార్ వైల్డ్. గ్రీకుల నిర్వచనం ప్రకారమూ 'హ్యూమర్' పొడి తేమకు పర్యాయపదం. కళ్లను తడిపి.. గుండెను కుదిపి వత్తిళ్లనుంచి తెరిపిన పడవేసేదే ఉత్తమ హాస్య 'థెరపీ'. ఉత్తర రామాయణ నుంచి.. నేటి పత్రికల 'ఉత్తరాల కాలా'ల దాకా సర్వే సర్వత్రా సర్వమానవాళి ఆమోదం పొందుతున్నది నిత్య జీవిత గత్తర్ల నుంచి కనీసం ఒక్క క్షణం పాటైనా ఉపశమనమం కలిగించే ఉల్లాసరసమే!
-కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment