Saturday, September 12, 2015

ఆంధ్రోడు- ప్రసిద్ధ రచయిత వసుంధరగారి వ్యంగాస్త్రం

‘ఆంధ్రోడు..’ గల్పిక శాయిగారి 'రచన' ఆగష్టు 2015 సంచికలో 'సాహితీ వైద్యం' లో మందుమాట కింద ప్రచురించ బడింది. ఆలస్యంగా అందిన ఆ సంచిక పేజీలు తిరగవేస్తున్నప్పుడు 'ఆంధ్రోడు..' అన్న శీర్షికతో కనిపించగానే ఆసక్తిగా చదివాను. వసుందర ప్రసిద్ధ కథా రచయిత. ఏళ్లబట్టి విసుగూ విరామం లేకుండా తెలుగు సాహిత్యానికి.. మరీ ముఖ్యంగా కథాసాహిత్యానికి ఆ దంపతులు చేస్తున్న సేవను మామూలు మాటలలో చెప్పి కుదించలేం. సాహితీవైద్యంలో కొంతకాలంగా వర్తమాన సామాజిక అంశాలమీద రాజకీయంగా కూడా చురకైన అస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి లేఖిని నుంచి దూసుకు వచ్చిన ఈ చురకను అంతర్జాలంలో అందుబాటులోకి తేవాలనిపించింది.

'ఆంధ్రోడు..' మీద అనుకూల ప్రతికూల స్పందనలు రావడం సహజమే. స్పందన ఎలా ఉన్నా సభ్యతపాలు తగ్గకుండా జాగ్రత్త వహించమని విజ్ఞులైన 'మనోళ్ల'కి ప్రత్యేక విన్నపం.

ఆంధ్రోడు..
నాది విశాఖ. రవిది వరంగల్.ఇద్దరం హైదరాబాదులో వేళ్ళూనిన సాఫ్టువేరులం. రవిద్వారా నాకు తనమిత్రుడు గిరీష్ తో పరిచయం అయింది. గిరీష్ రాజకీయాలలో వేళ్లూనడానికి ప్రయత్నిస్తున్న యువ నాయకుడు. ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు.
తనకి ఉద్యోగం లేకున్నా ఉద్యోగులకన్నా గొప్పవాణ్ణనిపించుకోవాలని గిరీష్ తాపత్రయం. 'మనోళ్లకి ఏదో ఒకటి చేయకపోతే నా రాజకీయం వృథా. ఏడాది తిరక్కుండా మిమ్మల్ని అమెరికా పంపిస్తాను' అని తరచు మాతో అనేవాడు.
అతని పాత్ర ఎంతో తెలియదుకానీ.. ఆర్నెల్లలో మా ఇద్దరికీ న్యూయార్కులో పోస్టింగయింది. 'మనోడు శ్యామ్ ఉన్నాడు. న్యూయార్కెళ్ళి పదేళ్లయింది. సిటిజన్ కూడా ఐపోయాడు. వాడి సాయం తీసుకోండి' అన్నాడు గిరీష్.
న్యూయార్కులో శ్యామ్ మాకు ఇల్లు చూశాడు. ఊరు చూపించాడు. ఇంకా ఎంతో సాయం చేశాడు. అక్కడ మేం ఏణ్నర్థం ఉన్నాం. తర్వాత లాస్ ఏంజిల్సు వెళ్ళాల్సివచ్చింది.
'నువ్వు ఉండటం వల్ల మీ న్యూయార్కులో చాలా ఎంజాయ్ చేశాం.'అంటున్న నన్ను మధ్యలో ఆపి 'మీ న్యూయార్కు అంటావేంటీ! ఇది మన న్యూయార్కు!' అని సవరించాడు. లాస్ ఏంజిల్సులో స్థిరపడ్డ మరో మనోడు భీమ్ కి మమ్మల్ని అప్పగించాడు.
అక్కడున్న పదినెలల్లోనూ స్నేహభావంలో శ్యామ్ కి ఏమాత్రం తీసిపోలేదనిపించాడు భీమ్. మేము ఫిలడెల్ఫియాకు మారుతుంటే 'మన లాస్ ఏంజిల్సుకి మళ్ళీ రావాలి సుమా!' అన్నాడు.
ఫిలడెల్ఫియాలో మనోడు మనోహర్ స్నేహం లభించింది. 'అమెరికాలో అన్ని ఊళ్ళకంటే ఫిలడెల్ఫియానే గొప్పది. ఊరుపేరులోనే ప్రేముంది' అనేశాడతడు గొప్పగా. అతడొక యాత్రాస్పెషలిస్టు. అక్కడున్న మూడేళ్ళలో మేమిద్దరం సకుటుంబంగా ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాలు సందర్శించాం. ప్రతిచోటా స్థిరపడ్డ మనోళ్ళున్నారు. అందుకని మేం చూసిన ప్రాంతాలన్నీ మన లండన్, మన పారిస్, మన బెర్లిన్, మన టోక్యో, మన మెల్ బోర్న్ అనిపించాయి.
అన్నేళ్ళున్నాక మాకు అమెరికాలో స్థిరపడాలనిపించింది. అందుకక్కడ అవకాశాలూ బాగున్నాయి. కానీ ఒక్కసారి ఇండియావెళ్ళి వీసా ఎక్సెటెండు చేసుకోవాలన్నారు.
హైదరాబాదు రాగానే ఎందుకో తనువంతా పులకించింది. ఏడో తరగతినుంచి ఇంజనీరింగుదాకా చదువక్కడే. ఆ తరువాత నాలుగేళ్ళూ ఉద్యోగమూ అక్కడే. ఆ అనుబంధం అలాంటిది మరి.
ఇద్దరం గిరీష్ ని కలుసుకున్నాం. అప్పటికతడు రాజకీయాల్లో బాగా ఎదిగాడు.
మూడేళ్ల కిందట ఒక పార్టీలో చేరి, ఆర్నెల్ల క్రితమే పార్టీ మారాడు.
'నీ పేరు చెప్పి దేశాలెన్నో తిరిగి పట్నాలెన్నో చూశాం. మన హైదరాబాదుని మించిన పట్నం లేదన్నా!' అన్నాను.
గిరీష్ నా వంక చురుగ్గా చూశాడు.
ఆ చూపు నాకు కొత్తగా ఉంది.
గిరీష్ నాతో ఏమనకుండా రవివైపు తిరిగి 'నీ ఫ్రెండు ఆంధ్రోడు కదా! మన హైదరాబాద్ అంటాడేంటీ?' అన్నాడు.
రవి ఏమంటాడోనని అటువైపు తిరిగబోయి ఆగిపోయాను.
అప్పుడు నాకు రవి చూపులు ఎలా ఉంటాయోనని భయంవేసింది…

-వసుంధర

Friday, September 11, 2015

కరుడుగట్టిన మంచితనం- ఓ సరదా గల్పిక

'ఇదేమి చిత్రం చిత్రగుప్తా! ఇన్ని యుగాలుగా ఈ యమధర్మం ఇంత నిర్విఘ్నింగా నిర్వహించుకొస్తున్నామే! సమవర్తి అనే మా కీర్తికి మచ్చవచ్చే  పెనుప్రమాధం ఇప్పుడిలా ఏర్పడిందేమి? ఈ అగ్నిపరీక్షనుంచి నిష్కళంకంగా బైటపడే మార్గమేదైనా ఉందేమో వెదకవయ్యా!'
'నిజమేకానీ మహాప్రభో! జీవితంలో కనీసం ఒక్కసారైనా ఏ పాపానికీ ఒడిగట్టని ఈ సచ్చరిత్రుణ్ణి శిక్షించే నిబంధన ఏదీ నా పరిజ్ఞానమునకు అందడం లేదు స్వామీ!'
'అసంభవం. నాలుగు పదులైనా నిండని ఈ నగరజీవి జీవితకాలంలో ఒక్క నేరమైనా చేయకుండా ఇలా నేరుగా మన ముందు బొందితో నిలబడడం ఎలా సంభవం? సరిగ్గా చిట్టా చూడవయ్యా! ఏ దోమనో చీమనో అయినా చంపకుండా ఉండుటాడా?'
'ఎర్రబస్సులమీద ఏ కారణం లేకుండానే రాళ్లు వేసే దుండగులముందు ఈ జీవి చేసిన చిరుపాపాలు ఏ మూలకు మహాప్రభూ! చీమలను, దోమలను, నల్లులను, వ్యాథికారకాలైన ఏ క్రిమికీటకాదులని చంపినా  ఏ దోషమూ అంటరాదని ఈ మధ్యనే మన యమధర్మాంగంలో మహేశ్వరుడు సవరణలు చేయించాడుగదా మహాప్రభూ! మర్చిపోయారా!'
''పోనీ మానవజన్మలో మరేదైనా ఇతర పాపకార్యాలకు ఒడిగట్టాడేమో .. ఒక్కసారి తరచి చూడవయ్యా.. నన్ను చంపక!'
'రేషను కార్డుల్లో గాంధీ, గాడ్సేలనుకూడా దూర్చి పేదలకు చవకగా పంచవలసిన పంచదార, బియ్యం, రేషనుసరుకులు పక్కదారి పట్టించే అక్రమార్కులకన్నా ఈ బక్కయ్య చేసే చిన్ననేరం ఏమంత పెద్దది మహాప్రభూ! చిన్నచిన్న నేరాలకూ శిక్షలు అమలుచేయాలంటే మన దగ్గర తగిన సిబ్బంది ఎక్కడుంది యమధర్మరాజా! కొత్తనియామకాలకు నిధులు లేవని నిన్ననేగదా కుబేరయ్య మొండిచెయ్యి చూపించింది!'
'అబద్ధాలడం మహాపాపం. ఈ మనిషి వాలకం చూస్తే సత్యహరిశ్చంద్రుడి  చిన్నాన్నలాగున్నాడా?! గట్టిగా చూడు! చిట్టాలో చిట్టిదో.. పొట్టిదో ఓ పొల్లుమాటన్నట్లున్నా ఏదో చిరుశిక్ష వేసేసి దస్త్రం మూసేద్దాం'
'లాభంలేదు యమధర్మరాజా! మనం అబద్ధాన్ని ఓ కాగ్నిజబుల్ అఫెన్సుగా భావించడం మానేసి ఓ మన్వంతరం దాటిపోయింద మహాప్రభో! క్లింటన్ వంటి పెద్ద పెద్ద అగ్రదేశాధినేతలే అబద్ధాలాడి తప్పించుకొంటున్నారు. కడుపున పుట్టిన బిడ్డల్నే చెల్లెళ్ళుగా చెప్పి చెలామణి చేయించే భామామణులు భూలోకంలో పుట్టుకొస్తున్నారు! ఎన్నికలముందు నేతలు ఇచ్చే హామీలముందు ఈ బక్కయ్యలాంటి కోన్కిస్కాలు ఆడే అబద్ధాలు చీమంత! యమధర్మంప్రకారం అవసలు నేరాలుగానే పరిగణించరాదు'
'ఇహ చాలు చిత్రగుప్తా! చాలు.. చాలు!'
'అదేమి స్వామీ! ఎన్నడూ లేనిది తమరి కన్నుల్లో నీరు!'
'కరుడుగట్టిన మంచితనంతో ఈ బక్కయ్య నా గుండెల్ని పిండేసాడయ్యా!ఇంతటి మహాత్ముణ్ణి మన  నరకలోకం తెచ్చిన యమకింకరులను తక్షణమే విధులనుంచి బహిష్కరిస్తున్నాం'
'మాట మధ్యలో అడ్డొస్తున్నందుకు మన్నించండి మహా ప్రభో! ఇందులో తమకింకరులు చేసిన తప్పిదమేమీ లేదు స్వామీ!' అంటూ నోరు తెరిచాడు బక్కయ్య.
'మరెవరిది తప్పు?' యమధర్మరాజుల హూంకరింపు.
'నా కథ ఆసాంతం వింటే తమరికే అవగతమవుతుంది యమధర్మరాజా!నేనొక సగటు నగరజీవిని. బతుకుతెరువుకోసం  పనివెదుక్కొనే రోజువారీ కూలీని. మొన్న కరువు. అటుమొన్న పేరు తెలియని ప్రాణాంతక రోగం. నిన్న వరద. పెరిగిన ధరలతో రోజుగడవడమే కటకటగావుంటే గోరుచుట్టుమీద రోకటిపోటులా బందులు. పనిదొరక్క బతుకుమీద రోతపుట్టి ప్రాణం తీసుకొందామని పురుగుమందు తాగితే  సగం ప్రాణమే పోయి చచ్చింది మహాప్రభూ! వైద్యంకోసం ధర్మాసుపత్రికని వెళితే 'పెద్ద మనుషులకే పడకలు లేక ఇబ్బందులు పడుతుంటే.. మధ్యలో వచ్చిన బక్కోడివి నీకు వైద్యమేంటి.. చోద్యం కాకపోతే!' అంటూ బైటకు గిరాటేసేసారు సారూ! బతుకుమీద మళ్లీ తీపిపుట్టి బైటి దవాఖానాలో రాసిచ్చిన మందు పుచ్చుకొన్నాసామీ! మందులదుకాణం అమ్మిన గోలీల్లో ఏం గోలుమాలుందోగానీ యమధర్మరాజా! మింగీ మింగకముందే.. ఇదిగో మిగిలిన ఆ సగం ప్రాణాన్నీ మీ కింకరులు ఇలా ఈడుచుకొచ్చి మీముందు పెట్టారు!'
'అరె! ఎందుకు ప్రభూ! అలా.. గుక్కతిరక్కుండా నవ్వుతున్నారూ!' బక్కయ్య విచిత్రంగా చూసాడు.
'ఉసురు తీయాల్సిన పురుగులమందు ఉసురు తీయలేదా! ఊపిరి నిలపాల్సిన మందు ఊపిరి తీసేసిందా! భళా బక్కయ్యా భళా! నీ బతుకుభారతం బహుచిత్రముగానున్నది! నీ చరితము కడు కామెడీగానున్నది. కానీ నాకు మరొకందులకు పరమానందంగా ఉంది. ఆత్మాహత్యా ప్రయత్నం శిక్షార్హమనిగదా శిక్షాస్మృతులన్నియూ నొక్కి చెప్పుచున్నవి! నీ కోరిక ప్రకారమే ఇప్పుడు నీకు నరకలోక నివాసమును ప్రసాదిస్తున్నందుకు సంతోషంగా ఉంది.'
'ధన్యుణ్ణి యమధర్మరాజా! నా కోరికకు మరో చిన్న కొనసాగింపుకూడా ఉంది. పాపుల ప్రాణాలుతీసి విధించిన దండనలను అమలుచేసే యమకింకర ఉద్యోగంకూడా దయవుంచి ప్రసాదించమని ప్రార్థన.'
'హాఁ!..హాఁ.. హాఁ!! అర్థమైనది.. నీ ఆవేదన! అటులనే ప్రసాదించితిని ..పొమ్ము! మనసుతీరా నీ కసి నిన్నీ స్థితికి తెచ్చిన పాపాత్ములమీద తీర్చుకొమ్ము!'అని లేచారు యమధర్మరాజు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(25-12-2009 నాటి ఈనాడు- సంపాదకపుటలో 'పద్దులకందని పాపాలు' పేరుతో  ప్రచురితం)



Tuesday, September 8, 2015

సర్కారు ఉద్యోగ భేషజం- వ్యాసం

సర్కారు ఉద్యోగం చేజిక్కించుకొంటే జీవితం ఇహ చక్కబడినట్లేనని ఓ లెక్క. పిల్లనిచ్చేవాళ్లూ 'అబ్బాయిది గవర్నమెంటు ఉద్యోగమయివుంటే చాలు.. ఆ పైన ఏదన్నా ముట్టే సీట్లో ఉంటే మరీ మంచిది..' అనే ధోరణిలో బేరసారాలు జరుపుతుంటారు. తెల్లవాడు పోతూ పోతూ మనకూ అంటించిపోయిన మకిలి ఈ 'సర్కారు ఉద్యోగ భేషజం'. గురజాడవారి కన్యాశుల్కంలో వెంకటేశం తల్లి పిల్లాడికి కలెక్టరీ అయితే చాలు.. పరగణాల భూవులన్నీక్షణాల్లో  కొనేస్తాడ'ని కలలు గంటుంది!  శతాబ్దకాలం గడిచిపోయినా సగటు భారతీయుడి ఈ మానసిక భావనలో ఇసుమంతైనా  మార్పులేదు. సరికదా.. ప్రభుత్వోద్యోగాలమీద మోజు పదింతలు పెరిగింది! గతంలో రాజస్తాన్ లో గుజ్జర్లు, జాట్ లు.. ప్రస్తుతం గుజరాత్ లో పటేళ్లుకూడా ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషాలకోసం ఆందోళనలు చేసే దశకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనం.
ప్రభుత్వోద్యోగంమీద మోజుకు చాలా కారణాలే కనిపిస్తున్నాయి. పరిమితమైన పనిగంటలు, ప్రత్యక్షంగా  జవాబుదారీతనం లేకపోవడం, గుర్రమే రౌతును అదుపుచేసే విచిత్ర పరిస్థితులు సర్కారుద్యోగరంగంలో వేళ్ళూనుకొని ఉన్నాయి. ప్రభుత్వరంగ ఉద్యోగుల జీతభత్యాలుకూడా ప్రయివేట్ సెక్టర్  ఉద్యోగుల వేతనాలతో చూసుకొంటే దాదాపు 11% అధికం! న్యూడిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇన్డస్ట్రియల్ డెవలప్మెంట్ వారి అధ్యయనంలో తేలిన నిజం ఇది. వేతనాలతోపాటు 'ఆమ్యామ్యా'లూ సర్కారు ఉద్యోగాలకు పెద్ద ఆకర్షణగా ఉంది. ప్రజలకు సేవచేస్తామని ప్రమాణపత్రంమీద హామీసంతంకం చేసి మరీ విధుల్లో చేరిన ఉద్యోగులు.. ప్రజలే తమకు సేవచేసేందుకు పుట్టినట్లు ప్రవర్తించడం సర్వసాధారణమై పోయింది. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు సైతం నిమ్మకునీరెత్తినట్ట్లో, తూతూ మంత్రంగానో కథ నడిపించడానికి కారణం ప్రభుత్వోద్యోగుల్లోని సుసంఘటిత ప్రతిఘటనా శక్తిసామర్థ్యాలు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పసివాడిని ఎలుకలు కొరికి చంపేసిన దుర్ఘటనే తాజా ఉదాహరణ. తెగించి ప్రభుత్వం చిన్నపాటి చక్కదిద్దే చర్యలకు సాహసించినా.. ప్రభుత్వోద్యోగులనుంచి పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కోవాల్సిన సంకటం! పేరుకి పెత్తనం ప్రభుత్వానిదే అయినా.. వాస్తవంలో  దాన్ని నడిపించే పార్టీల మనుగడ తాత్కాలికం. సమగ్ర అవగాహనకు, శాఖల నిర్వహణకు పాలకులు ప్రభుత్వోద్యోగులమీదనే ఆధార పడక తప్పదు. గతజ్ఞానం, వర్తమాన వ్యవహారాలమీద పూర్తి పట్టున్న ఉద్యోగులతో  పెట్టుకొంటే భవిష్యత్తులో ఎంత కష్టమో తెలీనంత అమాయకులు కాదుగదా రాజకీయనాయకులు! ఉద్యోగులపైన బహిరంగంగా విరుచుకుపడటాలు.. హెచ్చరికలు జారీ చేయడాలు వగైరాలన్నీ అధికశాతం లాలుచీ కోపతాపాలు! జనంముందు కంటితుడుపు  నాటకాలు! గతంలొ సర్కారుద్యోగులతో సున్నం పెట్టుకొన్న చంద్రబాబులో ప్రస్తుతం పొడసూపుతున్న ప్రాప్తకాలజ్ఞత చాలు సర్కారు ఉద్యోగుల హవాకు ఏ పాలనలోనైనా ఎదురుండదని తేలడానికి. దివంగత వైయస్సార్ సరిగ్గా ఈ కారణం చేతనే ముందు సర్కారు ఉద్యోగులను మచ్చిక చేసుకొన్నది. అడిగిన  42%  ఫిట్మెంటుకు  చంద్రబాబు వెంటనే ఓకే అన్నా,   మరో 1% జోడించి మరీ కెసిఆర్ మెహర్బానీ చేసినా.. అదంతా సర్కారుద్యోగులను మంచిచేసుకొనే పాలకుల ఎత్తుగడలో భాగమే!
సర్కారు ఉద్యోగస్తులు మనుగుడుపు అల్లుళ్ళు మాదిరి చలాయిస్తుంటే అందుకు పూర్తిగా విరుధ్దమైన పనివాతావరణం ప్రయివేటు సెక్టరులో నెలకొని ఉందని పలు అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. పరిమితిలేని పనిగంటలు, శక్తికిమించిన పనిభారం, కనీససౌకర్యాల లేమి, అనారోగ్య పరిస్థితులు, మితిమీరిన అజమాయిషీ..  మరీ ముఖ్యంగా  అరకొర జీతభత్యాలు.. అనేకమైన ప్రతికూలతలలో కొన్ని మాత్రమే! లాస్ ఏంజల్సు రీజన్ ఫౌండేషన్ వారి గణాంకాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల.. ప్రయివేట్ రంగ ఉద్యోగుల జీతభత్యాలలోని అంతరం 11.4% .

భారతదేశంలో ఇంతకన్నా ఎక్కువ!  చదువుకొన్న యువత ప్రభుత్వోద్యోగాలమీద మోజుపడుతున్నది ఇందుకే. గవర్నమెంటు బంట్రోతు ఉద్యోగాలకు పోటీప్రకటన వచ్చినా చాలు..   పట్టభద్రులుసైతం వేలలో దరఖాస్తు చేసుకోవడం సర్వసాధారణమై పోయింది! ఈ నేపథ్యంలోనే  ప్రస్తుతం సాగుతున్న రిజర్వేషను ఆందోళనలను అర్థం చేసుకొవాల్సుంది.
కులాల ప్రాతిపదికన ఉద్యోగాలలో రిజర్వేషనులకోసం మొదట డిమాండు చేసినవాడు మహాత్మాజ్యోతిరావు పూలే.. 1882లో.. హంటర్ కమీషను ఎదుట! సరిగ్గా మరో రెండు దశాబ్దాల అనంతరం 1902లో కొల్హాపూరు సంస్థానంలో 50% రిజర్వేషన్లు అమలు జరిగాయి. తదాది  ప్రభుత్వోద్యోగాలలో కులాల దామాషా ప్రకారం రిజర్వేషన్లకోసం
పలువర్గాలవారినుంచి వత్తిళ్ళు కొనసాగుతున్నాయి. మండల్ కమీషన్ మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాలయాలలో వెనకబడిన కులాలవారికి రిజర్వేషన్ల దిశగా కృషిచేస్తే..  అధిక జీతాభత్యాలు రాబడుతున్న ప్రయివేట్ సాంకేతిక రంగాలలోసైతం రిజర్వేషన్లకోసం డిమాండ్లు తలెత్తడం కొత్త పరిణామం. కులాలకు బదులుగా ఆర్థికస్థాయి మాత్రమే రిజర్వేషన్లకు ప్రాతిపదిక కావాలని అగ్రవర్ణాలలోని ఆర్థిక బలహీనులు ఆందోళన చేయడం మరో పార్శ్వం.

కులాలా?.. ఆర్థిక స్తోమతా?.. రిజర్వేషన్లకు  ఏది ప్రాతిపదికగా ఉండాలన్న చర్చ ఇక్కడ చేయడం లేదు. ప్రభుత్వోద్యోగుల, ప్రయివేట్ రంగ ఉద్యోగుల జీతభత్యాలు, పనిపరిస్థితుల్లోని  పెనుఅంతరాయమే  రిజర్వేషను అంశం ప్రారంభంనుంచి ఆందోళనరూపం  తీసుకోవడానికి మూలకారణమని చెప్పడమే ప్రస్తుత వ్యాస ఉద్దేశం.
ప్రయివేటు ఉద్యోగుల వేతనాలను, పని పరిస్థితులను మెరుగుపరిచే   ఆవకాశం ప్రభుత్వాల చేతుల్లో ఉండవుకదా!  కనీసం తన అధీనంలోని   ఉద్యోగాలమీదున్న అధికాకర్షణ అయినా క్రమేపీ తగ్గించగలిగితే రిజర్వేషనులకొక పరిష్కారమార్గం లభించవచ్చు. అగ్రగామి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రభుత్వోద్యోగులకు ప్రయివేటు ఉద్యోగులకన్నా  పది శాతం తక్కువగా వేతనాలు లభిస్తున్నాయి.
ప్రజలు కట్టే పన్నులలో సింహంపాలు ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్న మనదేశంలో ప్రజాసంక్షేమ సూత్రం సక్రమంగా అమలుకావాలంటే  సర్కారు ఉద్యోగులను మనుగుడుపు అల్లుళ్ళ మాదిరి ఆదరించే ప్రభుత్వవిధానంలో మార్పు రావాలి. 'అవినీతి అంతానికి జీతభత్యాలను పెంచడం' అనేది తప్పుడు సూత్రం అని ఇప్పుడు జరుగుతున్న తంతును చూసైనా గ్రహింపుకి రావాలి.  
అంగీకరించిన పని పరిస్థితులకు లోబడి సర్కారు ఉద్యోగులు సక్రమంగా, నాణ్యమైన ప్రజాసేవలు అందించేలా అజమాయిషీ చేయడం ప్రభుత్వాల  కర్తవ్యం. విధినిర్వహణలో ఐచ్చిక  నిర్లక్ష్యకారణంగా జరిగే తప్పిదాలకు నిష్పక్షపాతంగా సత్వరమే విచారణ సాగించి సత్ఫలితాలను రాబట్టే క్రమశిక్షణా చర్యలు చిత్తశుద్ధితో తీసుకుంటే సర్కారు నౌఖరీలంటే ఉన్న అక్కర్లేని మోజు కొంతైనా తగ్గించవచ్చు. 'బాధ్యతారాహిత్యమే ప్రధాన ఆకర్షణగా మారిన ప్రభుతోద్యోగాలను ప్రక్షాళించే  ప్రణాళికల అమలు ఎలా?' అన్నదే ఏడవ ప్రణాళికా సంఘం ప్రధాన లక్ష్యంగా సాగాలి. లేనిపక్షంలో ముందు ముందు మరిన్ని 'పటేలు' వర్గాలు   సర్కారు మనుగుడుపు అల్లుడి హోదాలు కోరుకోవచ్చు! తస్మాత్ జాగ్రత్త!

-కర్లపాలెం హనుమంతరావు 

Monday, September 7, 2015

నాదానుసంధానం- సాహిత్య వ్యాసం

శబ్దానికి అభిధ, లక్షణ, వ్యంజన అనే మూడు అర్థశక్తులు ఉన్నాయని ద్వన్యాలంకారశాస్త్రం  చెబుతోంది. శక్తులవల్ల విషయాలను, భావాలను బట్వాడా చేయవచ్చు. శ్రోతల మనసుల్లో తదనుగుణమైన వికారాలను(feelings)కలిగించవచ్చు. ఇది అందరికీ తెలిసిన విషయమే. చాలామందికి తెలియని విషయం ఇంకోటుంది. శబ్దంలో  మరో ముఖ్యమైన శక్తీ దాగుంది. నాదశక్తి. మిగతా అర్థశక్తులతో కలగలిపేసి దీన్ని అర్థం చేసుకునే పొరపాటు చేస్తున్నాం. కనకనే మన అవగాహనలో కావాల్సినంత అయోమయం.

యాబర్ క్రోంబీ అనే ఆంగ్ల విమర్శకుడు 'బేర్' అన్న పదం ఉచ్చారణలోనే ఒక రకమైన భీతి ఉందన్నాడు. తన వాదనకు వత్తాసుగా ఒక కట్టు కథా చెప్పాడు. ఆదాము,అవ్వ సృష్టి మొదట్లో కంటికి కనిపించే జంతుజాలాన్నింటినీ విడివిడిగా గుర్తు పెట్టుకోవటానికి వీలుగా  రకానికి ఒక పేరు పెట్టుకోవాలనుకున్నార్ట. ఆదాము  జంతువులనన్నింటినీ ఒక దొడ్లోకి తోలి ఒక్కొక్క దాన్నే బయటికి పంపిస్తుంటే అవ్వ వాటికి తోచిన పేర్లు పెట్టే కార్యక్రమం నడిపిస్తోంది. ఆవు, మేక, గేదె... ఇలా అన్నింటికీ నామకరణాలు జరిగిపోతున్నాయి. ఎలుగుబంటి వంతొచ్చింది. 'బేర్'మందిట అవ్వ్వ. 'ఎందుకలా అరిచేసావ'ని ఆదాము అడిగితే..'ఏమో..దాని మొహం చూడగానే భయం పుట్టింది. అలా అరవాలనిపించింది' అందట అవ్వ. అలా ఎలుగుబంటికి 'బేర్' అన్న పేరే స్థిరపడిపోయిందిట.

క్రిస్టఫర్ కాడ్వెల్ చెప్పేదీ అదే. శబ్దానికి ఉండే ముఖ్యగుణాల్లో మొదటిది అర్థం ఐతే.. రెండోది ఆ శబ్దోచ్చారణ వల్ల శ్రోతలో కలిగే స్పందన. ఆయన సిద్ధాంతం ప్రకారం అయ్య, నాన్న, తండ్రి, అప్ప, అబ్బ, బాబు, అమ్మమొగుడు.. అన్నీ సమానార్థకాలే ఐనా అవి పలుకుతున్నప్పుడు  మన మనసుల్లో పుట్టించే స్పందనలు మాత్రం వేరు వేరు. నాదశక్తిలోని  తారతమ్యాన్నిసరిగ్గా  అర్థం చేసుకోగలిగినవాడే షెల్లీ లాగా మంచి కవి కాగలిగేది. ఇంగ్లీషు ఒక్క ముక్కా రాని ఒక పల్లెటూరు బైతు దగ్గరికెళ్ళి
"Water water everywhere
Not a drop to drink"
 అన్న పద్యాన్నిగడగడ చదివి వినిపించి 'ఏమనిపించింద'ని అడిగాట్ట కాడ్వెల్ ఒక సారి. "దేనికో తెలీదు కానీ మొత్తానికి నువ్వు ఎందుకో బాగా ఇబ్బంది పడుతున్నావనిపిస్తోంది సామీ!"  అని బదులిచ్చాట్ట ఆ బైతు.  నాదమాహాత్మం అంటే అదే మరి. జయదేవుడి గీతగోవిందంలోని ప్రధాన ఆకర్షణ ఈ నాదశక్తే. 'సావిరహే తవ దీనా రాధా... ప్రియే! చారుశీలే! ...ధీర సమీరే యమునాతీరే' .. ఇలా అష్టపదుల్లోని పదాలన్నింటికీ మనకు అర్థం తెలీకపోయినా ఆ పాదాల్లోని  ఏదో అనిర్వచనీయ శక్తి మన మనసుల్నిఅలా అలా నీలిమేఘాల్లో తేలిపోయేటట్లు చేస్తుందా  లేదాఅదే నాదాకర్షణ. కవి అన్నవాడు ముందు చేయాల్సింది ఈ నాదోపాసనే.

అంటే జయభేరి చిత్రంలో ఎన్ టీ ఆర్ లాగా ఘంటసాల వారి కంఠంతో 'శివశంకరీ' అని జపించడం కాదు. ముందు తరాల నాద ప్రముఖుల సృజనల్లో శబ్దం ఏఏ సందర్భాల్లో ఎలా పలుకుతూ రసోద్భవానికి దోహదం చేసిందో పరిశీలన దృష్టితో అధ్యయనం చేయడం. కుండలు చేసే కుమ్మరికి మన్నులోని తేడాలు అర్థమైతేనే కదా శ్రేష్టమైన కళాఖండాలని సృష్టించటమెలాగో తెలిసేది!
తెలుగు సాహిత్యంలో  ఇలాంటి నాదోపాసన చేసి సంపూర్ణంగా విజయం సాధించిన ప్రముఖుడు  కవిబ్రహ్మ తిక్కన. నన్నయగారి  శబ్దానికి నాదశక్తి పరిమితమే అంటే ఆయన  అభిమానుల   నొచ్చుకుంటారేమో. 'అదేంటీ.. నన్నయగారి  పద్యం  నల్లేరుమీద బండిలాగా హాయిగానే నడుస్తుందికదా!' అని ఎవరైనా కన్నెర్ర చేయవచ్చు. 'సంగీతజ్ఞానంతో సంబంధం లేని నడకది'.. అనేదే సమాదానం.
అర్థాన్ని అర్ద్వాన్నపు అడవిలో వదిలేసి .. కేవలం లయ కోసమే పాకులాడాలా? అని నిలదీసేవాళ్ళకు…అలా చేస్తే కవిత్వానికి ఎలాంటి వికారపు రూపు రేఖలొస్తాయో … 'ప్రతీకవాద కవులు' 'సర్రియలిస్టు కవులు'  మనకు ప్రయోగాలు చేసి మరీ చూపించారు కదా ఇటీవలి శతాబ్దాల్లోనే!  -అని సమాధానం. నాదం ద్వారా మాత్రమే రససిద్ధిని సాధించడానికి నానారకాల శబ్దాలను సందర్భశుద్ధికి అతీతంగా పోగేస్తే.. జామ్సు జాయిస్  'యులిసిస్' కి అప్పచెల్లెళ్ళను పుట్టించవచ్చేమో తప్ప  అసలైన గొప్ప కవిత్వాన్ని సృష్టించలేం.
కవిబ్రహ్మ అర్థవంతమైన శబ్దాల నాదశక్తిని అత్యద్భుతంగా వాడతాడని చెప్పుకున్నాం గదా! ఉదాహరణగా ఇది చూడండిః
'దుర్వారోద్యమ బాహు విక్రమరసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధప్రతివీరనిర్మచనవి- ద్యాపారగుల్ మత్పుతుల్
గీర్వాణాకృతు లేవు రిప్డు నిను దో -ర్లీలన్ వెసంగిట్టి….'
నిండుసభామధ్యంలో పెద్దలందరి సమక్షంలో అమానుషంగా వంటిమీద బట్టల్ని వలిచేసిన  ఘాతుకానికి ఒక మానవతి తన నిరసనను అత్యంత బలంగా తెలియచేయాలంటే ఎలాంటి భాష వాడితే    వాడికి న్యాయం చేకూరుతుందీ! తిక్కన వాడిన పైపద్యంలోని పదజాలంలోని నాదశక్తిని మించిన శక్తి మనకింక్కడైనా దొరుకుతుందా! అర్థం తెలియనక్కర్లేదు. పద్యం చదువుకుని పోతుంటే చాలు ఒక సాథ్వి ఆక్రోషం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది.

విరాటపర్వంలొ గోగ్రహణం సందర్భంలో ముందుగా ప్రగల్భాలు పలికిన ఉత్తర కుమారుడు తీరా యుద్ధరంగంలో మహావాహినిని చూసి కాళ్ళు చల్లబడి బృహన్నలతో తన బేలతనాన్ని ప్రకటించుకుంటూ
'భీష్మ ద్రోణ కృపాణ ధన్వి నికరా -భీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్యపటుప్రతాప విసరా- కీర్ణంబు శస్త్రాస్త్రజా
లోష్మస్ఫారచతుర్విధోజ్జ్వలబలా- త్యుగ్రం బుదగ్రధ్వజా
ర్చిష్మత్వాకలితంబు సైన్యమిది నే- జేరంగ శక్తుండనే" అంటూ ఒక పద్యం  విసురుతాడు. పద్యంలో కవి వాడిన సామాగ్రిని చదివిన ఎవరికైనా ఉత్తర కుమారుడు ఉత్తిపుణ్యానికే జావగారి పోలేదని అర్థమవుతుంది. నాదోపాసనలో సఫలీకృతుడైన రుషికి మాత్రమే ఏ సదర్భానికి అనువుగా శబ్దం వాడితే భావం రక్తి కడుతుందో అర్థమయేది. స్తిమితంగా.. యుక్తియుక్తంగా మాట్లాడవలసిన సందర్భంలో తిక్కనగారు ఏ గడబిడలూ లేకుండా చిన్నచిన్న మాటల్తో పద్యాన్ని ఎలా నడిపిస్తారో చూడండిః
' వంశంబున కెల్ల నీవ కురు రిందెవ్వారి చందంబు లె
ట్లైవర్తిల్లిన కీడు మేలు తుది నీయం దొందెడుం గాన
ద్భావం బారసి లోనిసొత్తు వెలి వృత్తంబున్ జనస్తుత్యముల్
గావింపందగు నీక యెవ్విధమునన్ గొరవ్య వంశాగ్రణీ!'

నన్నయగారి పద్యాల్లో  వురవడి ఇలా సమయానికి అనుగుణంగా సాగదనే ఒక   అభిప్రాయం ఉంది. నిండుసభలో పాంచాలిని భంగపర్చినప్పుడు భీముడు చేసిన ప్రతిజ్ఞ సందర్భంలోని  పద్యాలనే ఉదాహరణగా తీసుకుందాం.
'ధారుణి రాజ్యసంపదమ- దంబున గోమలి గృష్ణ జూచి రం
భోరు నిజోరుదేశమున- నుండగ బిల్చిన యిద్దురాత్ము దు
ర్వార మదీయ బాహుపరి- వర్తిత దండగదాభిఘాత భ
గ్నోరుతరోరు జేయుదు సు- యోదను నుగ్ర రణాంతరంబునన్' అని భీముని శపథం.
'రంభోరు.. గదాభిఘాత భగ్నోరు' అనే పదాల్లో మినహాయించి  భీముని మాటల్లో ఉండాల్సిన  క్రౌర్యం, పదును ఏవీ!

భావానికి అనుగుణంగా పదాలని కదం తొక్కించే కవాతువిద్య  మళ్ళీ మనం మహాకవి
శ్రీశ్రీలో సంపూర్ణంగా చూడవచ్చు. మహాప్రస్థానం నిండా దీనికి ఉదాహరణలు కోకొల్లలు. కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హృదంత రాళంగర్జిస్తూ మరో ప్రపంచపు జలపాతాలను,దారి పొడుగునా తర్పణ చేసే గుండె నెత్తురులను, బాటలు  పేటలు   కోటలునదీనదాలు,  అడవులు, కొండదారులు, ఎడారుల్లాంటి అడ్డంకుల్నితోసిరాజనుకుంటూ  ముందుకు ముందుకు .. పైకి.. పై పైకి.. దూసుకుపోవాలంటే ఎముకలు కుళ్ళిన, వయస్సు మళ్ళిన సోమరుల వల్ల కాని పని  కనక.. వాళ్ళు చావాలనీ.. నెత్తురుమండే.. శక్తులు నిండే సైనికుల్లాంటి యువత మాత్రమే 'హరోం! హరోం హర!హర!హర!హర!హర!హరోం హరా!' అని నినాదాలిచ్చుకుంటూ ప్రభంజనంలా హోరెత్తిస్తూ వర్షుకాభ్రముల ప్రళయఘోషలా ఫెళ ఫెళా ఫెళ ఫెళా విరుచుకు పడగలరు కనక వాళ్ళే కావాలనీ.. మరోప్రపంచపు కణకణమండే త్రేతాగ్ని.. ఎగెరెగిరి పడే ఎనభై లక్షల మేరువులు, ప్రళయనాట్యం చేసే సప్త సముద్ర జలాలు, సలసల క్రాగే చమురు లాంటి ఉష్ణరక్త కాసారాలూ కనబట్టం లేదా!..  మరో ప్రపంచపు అంచుల్నుంచీ   విరామ మెరుక్కుండా  మ్రోగే  కంచు నగారా మ్రోతలు  వినిపట్టం లేదా!.. అంటూ శివసముద్రంలాగానో నయాగరాలాగానో ఉరకండురకండంటూ     ఆ మహాకవి చేసే అక్షరజ్వాలాక్రందనాలు.. ఈనాటికీ చదువరుల గుండెల్ని  త్రాచుల్లాగా, రేచుల్లాగా తట్టి లేపగలుగుతున్నాయంటే ఆ శక్తి మనం ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిన నాదానిదే! శంకరభగవత్పాదులూ ఈ నాదశక్తి ప్రయోగంలో పరమ నిష్ణాతులు. దేవీస్తుతే అందుకు ప్రబలమైన సాక్ష్యం.
మనుచరిత్రలో అల్లసాని పెద్దనగారూ రెండో ఆశ్వాసంలో ప్రవరాఖ్యుడి కళ్ళతో మనకు హిమవనుల కమనీయమైన అందచందాలను.. చూపించడానికి  ఈ నాదశక్తినే తోడు తెచ్చుకునే ప్రయత్నం చేశారు.

"……………………………..-అంబరచుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ -భంగతరంగ మృదంగ నిస్వన
స్ఫుటనట నానురూప సరి-ఫుల్లకలాప కలాపి జాలమున్-
కటకచరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్"
ఎత్తుమీదనుండి పడి రాళ్ళమీదుగా.. మధ్యగా హొయలు పోతూ ప్రవహించే సెలయేటి సోయగాలను  అల్లసానివారు అర్థశక్తితో కాకుండా నాదశక్తితో అభివ్యక్తీకరించటం ఇక్కడ చేసిన ప్రయత్నమే చెబుతుంది. శబ్దంలోని  అంతర్లీనంగా  ఒదిగున్న నాదశక్తి సామర్థ్యం ఎంత
ఎవరు ఎన్నైనా చెప్పండి.. ఎంత అద్భుతమైన భావమైనా చదువరి హృదయపీఠంమీద    పదికాలాలపాటు తిష్ఠవేసుకోవాలంటే ఆ భావానికి ఒక్క కుసుమకోమలమైన అర్థమొక్కటే సరిపోదు.. పదే పదే స్మరించుకుంటో పరవశం పొందేందుకు పరిమళ సమానమైన నాదానుభూతీ తప్పనిసరి.   భావానికుండాల్సిన  ఆ పరిమళానుభూతి  పేరే 'నాదశక్తి'.

ప్రసిద్దిపొందిన ఏ కవి కృతిని శ్రద్ధగా పరిశీలించినా .. భావానికి తగిన అర్థంతో పాటు.. హృదయానికి హత్తుకునే ఒక నాదశక్తీ అంతర్గతంగా ఏదో ఒక మోతాదులో ఉండి తీరుతుందని అర్థమవుతుంది. అలా లేని పక్షంలో ఆ పదజాలం కేవలం వచనం అవుతుందేమో కాని.. ఎన్నటికీ కవనం  మాత్రం  కానేరదు.   

ఉత్తమకవిత్వానికి  భావార్థాలే  ప్రధానమన్న వాదనకి ఎదురులేదు కానీ.. ఎంత కాదనుకున్నా భావాల వ్యక్తీకరణకి పదాలే అనివార్యమైన వాహకాలైన కారణంగా ఆ పదాల పొహళింపులోని నైపుణ్యాన్ని ఆకళింపు చేసుకొంటేనేగానీ  సందర్భోచిత శబ్దప్రయోగం అనే రసవిద్య పట్టుపడదు. నాదశక్తిని మిగతా అర్థశక్తులతో కలగలిపేసి అర్థం చేసుకునే పొరపాటును ఇప్పటికైనా గ్రహిద్దాం.  సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. కనీసం  కొత్తతరం కవులన్నాఈ నాదోపాసన వైపు దృష్టి మళ్ళించకపోతే కవిత్వంలోని ఈ అయోమయం ఇంకా ఇలాగే కొనసాగటం ఖాయం.
-కర్లపాలెం హనుమంత రావు
***




మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...