Thursday, October 22, 2015

అదృష్టానికి అవా దృష్టాంతాలు!- ఓ సరదా గల్పిక


పరమాత్ముడైనా ఆ పరంధాముడు పథ్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అదే అతగాడి పాదుకలో! ఏ ప్రయత్నం చేయకుండానే దర్జాగా అయోథ్య సింహాసనం అధిష్టించాయి! అదృష్టమంటే అదే!
అదృష్టం ఉంటే ఎడారిలో పడి ఉన్నా ఏనుగు  వెదుక్కంటూ వచ్చి వరమాలను మెడలో వేస్తుంది. 'తంతే బూరెల బుట్టలో పడ్డం' అంటాంగదా! అలాగని బూరెల బుట్టముందు నిలబడి తన్నించుకున్నా.. ప్రారబ్దం బాగోలేకపోతే పక్కనున్న పేడతక్కెట్లో పడవచ్చు! ప్రారభ్దానికి ఏ శబ్దార్థ కౌముదీ సరిగ్గా నిర్వచనం చెప్పలేదు. చెప్పలేదుకూడా!
'ఖర్మానికి ధర్మాధర్మాలుండవని గీతకూడా బోధిస్తూనే ఉందిగదా! 'దృష్టం' అంటేనే  కంటికి కనిపించనిదిదృష్టాంతాలేగాని.. సిద్ధాంతాలుండనిది. అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలంమీద దిగేముందు సరిగ్గా ఇరవై నిమిషాలకు సరిపడ్డ ఇంధనం మాత్రమే మిగిలి ఉందట! అదీ  అదృష్టమంటే! కలసి రావాలి.. అంతే! కలసిరాకపోతే అలంకారంకోసం వేలికి పెట్టుకున్న పచ్చలఉంగరంకూడా పఛ్చడికూటితో పాటు గొంతులోకి జారి ప్రాణాంమీదికి  రావచ్చు.
పూర్వజన్మసుకృతమని ఏదో పేరు పెట్టుకొని  సంతృప్తికోసం  సమర్థించుకోడమేగాని ఏ అపూర్వ శబ్దచింతామణీ అదృష్టానికి సంపూర్ణ న్యాయం చెయ్యనేలేదు. చెయ్యలేదుకూడా!
టైమ్ బాగోలేకపోతే భోలక్ పూర్ నల్లానీళ్ళే కాదు.. బోలెడంత డబ్బుపోసి కొన్న మినరల్ వాటరుకూడా కాలకూట విషమౌతుంది!
జనాలని నమ్ముకోవాల్సింది పోయి జాతకచక్రాలను నమ్ముకొన్న జయలలితమ్మ గతే
మవబోయిందో మనందరికీ తెలిసిందేగా! మన దగ్గరా ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తంపార్టీ చీట్లు తీసింది! అన్నీ తెలుసు రాజకీయవేత్తలకు. అయినా రాజకీయాలు పత్తి మార్కెట్ల(కాటన్ మార్కెట్లు) మాదిరి సందడి చేస్తున్నాయంటే అదే మరి రాజకీయం గడుసుతనం.

గోడదూకుడుగాళ్ళు ఎక్కువైపోతున్నారని  వాపోయే ఓ పార్టీ  తనకార్యాలయం గోడలు మరింత ఎత్తుకు పెంచింది!  ఏమయిందీ?   గోడలకు కన్నాలేసి మరీ కోరుకొన్న పార్టీల్లోకి దూకేసారు జంపు జిలానీలు! నీతిమంతులుండే అదృష్టం ప్రధానంగానీ..  ఎత్తులూ.. జిత్తులూ ఎవరి ప్రారబ్దాన్ని ఎప్పుడాపగలిగాయి!
గెలుపుకి 'గుర్తు' కలసిరావడం లేదని కుములుకుంటోందిగాని.. జనంలో గుర్తింపు తగ్గిందని గుర్తుపట్టలేకపోతుందింకో  మడమ తిప్పని పార్టీ! నేతల తలరాతలను తేల్చేది నిజానికి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ.. గుర్తులూ.. తాయెత్తులూ కానేకాదని ఎన్నేళ్ళు ఓడినా మన ప్రజాప్రతినిధులకు జ్ఞానోదయం కావడంలేదు! ప్చ్! జనం దురదృష్టం!
రోజులూ అలాగే  ఉంటున్నాయిలేండి! ఎన్నికల్లో విజయఢంకా మోగించినవాడు ప్రమాణ స్వీకారం రోజునే ప్రాణాలు పోగొట్టుకొంటుంటే.. యావజ్జీవం పడ్డవాడు దర్జాగా బైటకొచ్చేసి రాజకీయ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నాడు! రాసిపెట్టుంటే చర్లపల్లి జైల్లో ఉన్నా వేడివేడి బిర్యాని పొట్లాలు వేళకు అందుతుంటాయి! సిమ్ కార్డు సరఫరాలు  క్రమం తప్పకుండా సాగుతుంటాయి! నూకలు చెల్లితే గోకుల్ చాటుకు పోయి మరీ  ప్రాణాలు పోగొట్టుకోవడం  మనమీ కళ్లతో ఎన్నేసి సార్లు చూడ లేదూ!
దేవుడు దయతలచి 'పోనీలే పాపమ'ని 'ఉఁ' అన్నా.. పూజారిగారూ తలాడిస్తేనే ప్రసాదం ప్రాప్తించేది. పూజారిగారి మనసు ముందు మనవైపు మళ్లడటమే ప్రస్తుతం అదృష్టాలలోకెల్లా పెద్ద అదృష్టం! రాజకీయాలనుంచి.. రాసలీలలవరకు.. అన్నింటా పూజారులే రాజ్యమేలుతున్నారు ప్రస్తుతం. అది మన దురదృష్టం.
కాలం కలసిరాకపోతే కోట్లుపోసి పెట్టిన వోక్సువేగను కారు ఫ్యాక్టరీకూడా చక్కా రెక్కలొచ్చినట్లు ఎక్కడికో ఎగిరిపోవడం చూడ్డంలే! చేటుకాలం తోసుకొచ్చి 'జై' కొట్టిన చేతులే పాతచెప్పులు విసరడం చూడ్డంలే! అదృష్టానికి దురదృష్టానికీ మధ్య అడ్డుగీత సినిమా హీరోయిన వేసుకొనే పైటకన్నా పల్చన,  
అదృష్టదేవతేమన్నా మన గర్ల్ ఫ్రెండా! పిలిచీ పిలవంగానే 'హాయ్' అంటూ వచ్చి వళ్లోవాలి 'హాయి'నిచ్చిపోడానికి! ఆడవారి మనసులు నిజంగా ఎంత చంచలమో తెలీదుగానీ.. అదృష్టదేవతదిమాత్రం కఛ్చితంగా మహా 'ఫికిల్ మైండ్'! అమ్మగారి చపలచిత్తానికి ఎన్ని వందల ఉదాహరణలైనా  ఆపకుండా చెప్పుకోవచ్చు!
సోనియాజీ  ప్రధాని పదవికి ఎన్నుకునే సమయంలో  మన్మోహన్ జీ  కనీసం రాజ్యసభ సభ్యుడైనా కాదుదేశానికి అమెరికావూడిగం చెయ్యాలని రాసిపెట్టి ఉన్నప్పుడు సోనియాజీ ముసుగులోనైనా వచ్చి  అలా ఆడించేస్తుంది మరి అడృష్టదేవత!
'రాసిపెట్టి ఉన్నప్పుడు రాళ్లగుట్టకింద పడి ఉన్నానెత్తిమీదకి రత్నాలకీరీటం తెచ్చిపెడుతుంద'న్న సిద్ధాంతం మొన్నీమధ్యే చంద్రబాబన్నవిషయంలో రువువవలేదా!  అదృష్టానికి సిద్ధాంతాలూ.. రాద్ధాంతాలూ జాన్తా నై! జగన్ బాబుకా





సూత్రం వంటబట్టకే పద్దస్తమానం ఇంత మంట! 'రాజధాని ఆహ్వానపత్రంఇవ్వనే ఇవ్వద్దని.. ఇచ్చినా తాను చచ్చినా వచ్చేది లేద’ని మొండికేసి నవ్వులపాలయింది అదృష్ట దెవతతత్త్వం బొత్తిగా వంటబట్టించుకోక పోవడంవల్లే! దేనికోసమూ దేబిరించకుండా దేవుడు మనకిచ్చిన 'పాత్ర'ను   వీలయినంత అద్భుతంగా నటించుకుంటూ పోతుండడమే విజ్ఞుడైనవాడు చేయదగ్గ పని. ఆ పాఠం ఇద్దరు చంద్రులను చూసైనా ఎప్పటికీ నేర్చుకోకపోతే ఎట్లా!
జీవితంపాత్రలో  అదృష్టముండేది కింది సగంలో. పైన సగం కృషి. రాజకీయాలవరకు దాని మరోపేరు నటన! అదృష్టలక్ష్మి చెయ్యందుకోవాలంటే  కృషి(అదేనండీ.. నటన)ని నమ్ముకోడం మినహా మరో దారి లేనే లేదు
దుర్యోధనుడు పాచికలాటలో పాండవులను ఓడించింది కేవలం అదృష్టం వల్లేననుకుంటే పప్పులో చప్పున కాలేసినట్లే! శకుని 'పని'తనం వల్లే పాండవులమీదున్న కడుపుమంట చల్లబడిందన్న భారతసారం తెలుసుకోకుంటే ఎవర్నిమాత్రం ఎవరు బాగుచెయ్యడం వల్లవుతుంది చెప్పండి!  గురుత్వాకర్షణశక్తిని గుర్తుపట్టిన రోజున న్యూటన్ ఆపిల్ చెట్టుకింద కూర్చోనుండడం కాకతాలీయం అయితే కావచ్చుకానీ కచ్చితంగా   అదృష్టంమాత్రం కాదు.  అసలు అదృష్టం పండు కిందపడ్డం ఛూసినప్పుడు   న్యూటన్ బుర్రలో ‘బల్బువెలగడం! రాజకీయాల్లో పాలకుల  'బల్బు'లు ఎప్పుడు వెలుగుతాయో! ఎందుకు వెలుగుతాయో! దానిమీదే పాలితుల అదృష్ట దురదృష్టాలు  ఆధారపడి ఉంటాయన్నది అసలు సారాంశం.
సముద్రంమీద లేచిన అల్పపీడనం వాయుగుండంగా మారి  ఏ దిశకు తిరగాలో ఏ సిద్ధాంత గ్రంథంచూసి  నిర్ణయించుకుంటుంది! వాటాన్నిబట్టి జరిగే  చర్యలకు ఏ యాగమూ.. యజ్ఞమూ దిశానిర్దేశాలు  చెయ్యలేవు. అయినా యాగాలూ.. యజ్ఞాలూ..  ధూం ధాంగా చేయడం చంద్రుళ్లమార్కు రాజకీయం!

ఎవరి తలరాతలు వారే స్వయంగా రాసుకొనేవన్న సత్యం సత్యంరామలింగరాజుగారివంటి వారి  కొన్నికథలకే పరిమితంప్రజాస్వామ్యంలో జనం తలరాతలు రాసేది ప్రజానేతలేననడంలో మరో మాట లేనే లేదు! సదరు నేతల తలలు ఎంతలా పనిచేస్తున్నాయో దాన్ని బట్టే జనానీకం అదృష్టాలు.. దురదృష్టాలూను!

ఇప్పుడు మాత్రం మన అదృష్టాలకేం తక్కువ.. చెప్పండంటారా! స్వైన్ ఫ్లూ వచ్చే సీజన్లో సాధారణ ఫ్లూ వచ్చిపోవడం అదృష్టమే. వానలు కురవని రోజుల్లో బ్యాంకురుణాలు దొరక్కపోవడం రైతన్నల అదృష్టమే. మాంద్యం ముదిరిన రోజుల్లో ఉద్యోగాలూడకుండా వేళ్లడుతూనైనా ఉండటం కొంతమంది పాలిట అదృష్టం. ఫ్లాపు పిక్చరు తీసినా ఫస్టువీకులోనే ప్రపంచంలోని అన్ని థియేటర్లలో విడుదల చేసేసి  సాధ్యమైనంత రాబట్టుకోవడం మెగా అదృష్టం. కందిపప్పుక్కరువున్నా కనీసం పెసరపపైనా పిసరంత దొరుకుతుంది చూడండి! దేమన్నా  మామూలు అదృష్టమా! ఆలస్యంగానైనా ఆడపిల్ల క్షేమంగా ఇల్లుచేరడం ఎంత పెద్ద అదృష్టమో ఈ రోజుల్లో! ఏసిడ్ దాడులు పెరిగిన రోజుల్లో ఎవరూ మన పిల్లల్ని ప్రేమిస్తున్నాని వెంటాడకపోవడాన్ని మించిన అదృష్టం  కన్నవారికి మరేదైనా ఉంటుందా!
మన చేతుల్లో లేని అదృష్టాన్ని గురించి వగచేకన్నా స్వల్ప అదృష్టాలని తలుచుకొని మురిసిపోయే  మనసుండటం కన్నా మరేమి అదృష్టం లేనే లేదు! ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు

( 05-10-2009 నాటి ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం)  

Sunday, October 18, 2015

టోపీ బాబాయ్!- సరదా కథ


ఇంగ్లీషువాడు మనదేశానికొచ్చి చేసిన మహోపకారమేంటో తెలుసా?' అనడిగాడు  మా బళ్లారి  బాబాయ్ ఓ ఆదివారం పరగడుపునే మా ఇంటికి ఆయాసపడుతూలేస్తూ వచ్చికూర్చుని.
'ఆంగ్లం నేర్పడం' అన్నాను శుద్ధతెలుగులో.
'ఇంకోటికూడా ఉందిరా! ఇలా టోపీలు పెట్టుకోడం' అన్నాడు నా నెత్తికో కుచ్చుటోపీ తగిలించి. 'అచ్చు చార్లీచాప్లిన్లా ముచ్చటేస్తున్నావురా రావుడూ!' అంటూ ముద్దులుకూడా కురిపించేసాడు.
బళ్ళారి బాబాయ్. ఆయన  ఆ మధ్య బ్యాంకులో వి ఆర్ ఎస్ లాంటిదేదో పుచ్చేసుకొన్నాడని విన్నాను. సర్వీసులో ఉండగా వందకు  ఒక్క కాలుకైనా అందుబాటులోకి రాని బిజీశాల్తీ.  ఇప్పుడిలా ఇంటిదాకా వచ్చేసి మరీ తీరిగ్గా కూర్చొని టోపీలమీద డిస్కషన్లు పెట్టాడేంటీ?! ఇందులో మతలబేమీ  లేదుగదా? ‘అడిగితే బావుంటుందా?’ అని సతమతమయిపోతోంటే తనే టాపిక్కుని మళ్లీ టోపీలమీదకు మళ్లించేసాడు.
'టోపీ పెద్దరికానికి గుర్తు కదరా మొద్దబ్బాయ్! పెద్దవాళ్లెవరైనా ఎదురైనప్పుడు ఇంగ్లీషువాడైతే నెత్తిమీది టోపీ తీసి మరీ విష్ చేస్తాడు. ఆ దొరల మేనర్సే వేరులే. మన ఆడంగులకైతే ఆర్నమెంటంటే ఓన్లీ బంగారమే! కానీ లండన్ దొరసానికి టోపీనే మెయిన్  అలంకారం. టోపీ లేకపోతే గుండుకి అసలీ నిండుతనం ఎక్కడేడ్చింది చెప్పు!' అంటూ ఠప్పుమని నెత్తిమీది  టోపీ తీసి గుండుకి అంటుకొన్న చెమట తుడుచుకొన్నాడు.
బళ్లారి బాబాయ్ పరమ నాస్తికుడు. మరి ఈ తిరుపతి గుండూ?! నిండుగా ఉండేందుకనిగానీ గుండుకొట్టించుకొని టోపీ పెట్టుకొన్నాడా ఏవిటీ కొంపదీసి!
‘టోపీ’ అంటే నాకు తెలిసినంత వరకూ  'మాయ'కు సింబాలిక్!  ‘టోపీ పెట్టడ’వంటే మాయచేయడమనేగా మన వాడకంలో ఉన్నదికూడా! మాయకీ, టీపీకీ మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉండబట్టేగదా.. మెజీషియన్లంతా కుందేళ్లను టోపీలనుంచే తీసేందుకు తంటాలుపడేది! కూపీలు తీసే పత్తేదార్లక్కూడా  టోపీలే కొండగుర్తులు. పొలిటీషియన్లందరికీ కార్టూనిస్టులు గాంధీటోపిలు గట్రా పెట్టడానికీ మాయకీ ఏదో సంబంధం ఉండే ఉంటుందని నా డౌటు. బారిష్టరు పార్వతీశం టోపీని వదిలించుకోడానికి ఎన్నెన్ని రొష్టులు పడతాడూ మొక్కపాటివారి నవల్లో!
'అలా అనుకోవద్దురా అబ్బాయ్! టోపీకి, మోసానికి  సంబంధమేముందసలు? అలాంటివాటికి చెవిలో పువ్వులు ఎలాగూ ఉన్నాయిగదా మనదగ్గర! 'టోపీ' అంటే ఒక పరమ పవిత్రమైన ఉదాత్త పదార్థంరా నాయనా! పౌరాణికాల్లో దీన్నే కిరీటం అంటారు. నెత్తిమీద కిరీటం లేకపోతే దేవుణ్ణే మనం గుర్తుపట్టలేం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు పూజారిగారు మనకు పెట్టేదీ  ఓ రకమైన టోపీనే బాబూ! దాన్నే మనం భక్తిగా  ‘శఠగోపం’ అని పిల్చుకొంటాం. బైటికెళ్ళినప్పుడు గుండు  ఎండకు మండకుండా ఉండాలనో, బైకెక్కితే బొచ్చెకు దెబ్బ తగలద్దనో మనం వాడే కేపులు, హెల్మెట్లు మాత్రం? ఓ రకమైన టోపీలేగదరా అబ్బిగా! మొన్న మార్కెట్లో సమయానికి చంకలో  సంచీలేకపోతే ఉల్లిగడ్డలు ఈ టోపీలోనే నింపుకొన్నారా బాబిగా! తలకెంత రంగు పులువుకున్నా ఎక్కడో ఒక్క తెల్లవెంట్రుకైనా  దోబూచులాడుతూ కనబడి మన పరువు తీస్తుంది. అదే టోపీగానీ  నెత్తిమీదుంటే  టోటల్గా అంతా కవరై పోతుంది.  కరెంటు గ్యారంటీ లేని ఈ రోజుల్లో చేతికింద నమ్మకంగా పంజేసే విసనకర్రకూడా ఈ టోపీనేరా వెర్రినాగన్నా!' అంటూ బర్రుమని పక్కనున్న  బ్యాగు జిప్పు లాగేసాడు బాబాయ్!

బాబోయ్! బాబాయ్ బ్యాగునిండా బోలెడన్ని టోపీలు! ఎన్నేసి  రక.రకాలో! కుచ్చుటోపీలు.. ఊలుబొచ్చుటోపీలు.. గాంధీటోపీలు.. గాడ్సేకషాయం టోపీలు.. నమాజుటోపీలు.. హరేరామ హరేకృష్ణ టోపీలు.. ఆరెస్సెస్ టోపీలు..  కేజ్రీవాలు టోపీలు..  క్రేజీ ఫెదర్ టోపీలు.. పిల్లలు మోజుపడే టోపీలు..!
'అమ్మాయ్! నువ్వూ ఓటి తీసుకో! వయస్సు ఓ పదేళ్ళు వెనక్కి పారిపోకపోతే నన్నడుగు!' అంటూ కాఫీకప్పు ఇచ్చిపోవడనికని వచ్చిన మా ఆవిడ నెత్తిమీదా అడక్కుండా ఓ  ఈకలటోపీ తగిలించేసాడు బాబాయ్! పిల్లలిద్దరూ బ్యాగుమీద పడి తలా ఓ టోపీ  నెత్తిమీద పెట్టుకొని కోతుల్లా గెంతుతోంటే ఇల్లు కిష్కిందకాండను తలపిస్తోంది. గది ఊడ్చడానికని వచ్చిన పనిపిల్ల నెత్తిమీదా ఓ టోపీ పెట్టేసాడు బాబాయ్ చివరికి!
'వద్దులే బాబాయ్! మరీ ఓవర్ గా ఉంటుందేమో!' అని వారించుదామనుకున్నా.  వినే మూడులో ఉంటేనా  ఆ మహానుభావుడు! 'ఉండనీయరా! అందంగా ఉంది. ఎంతా!  ఓ వందేగా.. టోపీ!' అంటూ పనిపిల్లనలాగే లోపలికి తోసేసాడు.
టోపీలిలా అమ్ముకోడానికేనా బంగారంలాంటి బ్యాంకుద్యోగాన్ని బాబాయలా కాళ్ల తన్నుకొన్నదీ!
'అన్ని టోపీలెలా సంపాదించావ్ బాబాయ్? సెల్ఫ్ ఎంప్లాయిమెంటుకిందేమన్నా  కాటేజీ ఇండస్ట్రీ గానీ ప్రారంభించావా ఏంటీ కొంపదీసి?' అని అడిగా ఇహ ఉండబట్టలేక.
'లేదురా అబ్బాయ్! అసలు కథ చెబుతా.. వింటావా!' అంటూ చెప్పడం మొదలుపెట్టాడు బాబాయ్.
***
ప్రధానమంత్రి యువశక్తి పథకంకింద అర్హులైన యువజన సంఘాల ఎన్నికకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మా బ్యాంకు తరుఫున ఇంటర్వ్యూ కమిటీలో నేనొక్కణ్నే  మెంబర్ని. టక్కూ టయ్యీ కట్టుకొన్న ఓ చాకులాంటి కుర్రాడొచ్చి  మామందు కూర్చున్నాడు.
'ఏం పెట్టాలనుకొంటున్నావూ?' అనడిగాం.
'టోపీలు' అన్నాడు అతగాడు దర్జాగా.  
అప్పటికింకా నాకీ గుండూ అదీ లేదులే. కామెడీకోసం అన్నాడేమో అనుకొన్నాం. కాదు సీరియస్సే! నేను తలతడుముకొంటుంటే.. తెలివికలవాడుకదా.. గ్రహించేసిన్నట్లున్నాడు.. పెద్ద స్పీచే దంచేసాడు! 'మీరనుకొనే  ఆ టైపు టోపీలు కాదులే సార్ ఇవి! 'కేప్స్ అండ్ హ్యాట్స్' అన్నాడు లండన్  యాక్సెంటులో! డంగైపోయాం అందరం.
' 'థింక్ న్యూ' అన్నాడుకదా సర్ ఐజాక్ న్యూటన్! సైన్సుకేకాదు.. సరుకులు అమ్ముకొనే బిజినెస్సుకైనా అదే సక్సెస్ఫుల్ ఫార్ములా సార్! అందుకే నేనీ టోపీల వ్యాపారంమీద టిక్కు పెట్టింది' అంటూ విశ్వనాథవారి వేయిపడగలంత భారీప్రాజెక్టు రిపోర్టు మా ముందు పారేసాడు. ఎకనామిక్సు ప్రకారం ప్రోజెక్ట్ సెంట్ పర్సెంటు  ఫీజుబుల్ అన్డ్ వయబుల్!
'అంతర్జాతీయ వెంట్రుకల సమాఖ్య .. మీన్.. ఇంటర్నేషనల్ హెయిర్ ఆర్గనైజేషన్ లేటెస్టు లెక్కల ప్రకారం ఒక్క తిరుమల కొండమీదే రోజుకు పాతికవేల గుండ్లు తయారవుతున్నాయ్! మహిళాగుండ్లను మినహాయించినా .. మగ గుండుకొకటికి మినిమమ్ రెండు టోపీల చొప్పున తప్పదుకదా! ఆ లెక్కన  థర్టీఫైవ్ థౌజండ్ ఇన్స్టాంట్  టోపీలకు అక్కడే డిమాండు ఏర్పడింది! గుండుకొట్టే పుణ్యక్షేత్రాలు కంట్రీలో  స్టేటుకి తక్కువలో తక్కువగా అర్థనూటపదహార్లకు తక్కువ లేదన్నది రెండేళ్లకిందటి ఎండోమెంట్సువారి పాత లెక్కలే చెబుతున్నాయి. ఇప్పటి భక్తి సంగతి మీకు చెప్పేదేముంది? గజ్జెల మల్లారెడ్డా.. ఆయనెవరో.. ఓ పెద్దాయన అన్నట్లు డ్రైనేజీ తూముల్లో పారుతోందికదా!’ అన్నాడా కుర్రాడు.  మా  బోర్డుమెంబర్లలోనే ఐదుగురిలో ముగ్గురికి బోడిగుండ్లున్నాయి ఆ రోజు! ఓ ప్రైవేటు బ్యాంకునుంచి వచ్చిన గుండుమనిషి ఊరుకోకుండా  'నా గుండు తిరుపతిది కాదులేవయ్యా! మా అమ్మ పోయింది పోయిన్నెల్లో!' అని క్లూ ఇచ్చేసాడు. ఇంకేముంది! రుణంకోసమని వచ్చిన ఆ చాకు దారుణంగా రెచ్చిపోయింది. 'అదే సార్ నేను నెక్స్టు చెప్పబోతోంది. గుండ్లు కొట్టించుకోవడానికి ఒక్క తిరుపతి టైపు మొక్కులే ఉండనక్కర్లేదు. జుట్టు రాలిపోతున్నా.. బట్టతలలు బైటపడుతున్నా.. ఇలా ఇంట్లో ఎవరైనా ఖర్మకాలి బాల్చీ తన్నేసినా.. చివరికి వైరాగ్యం ముదిరి సన్యాసం పాకంలో పడినా  ముందువచ్చేది నున్నంగా గుండు గీకిద్దామనేఐడియానే ! ఉడుకులో  కొట్టించుకొన్న గుండ్లు.. హుషారు చల్లబడ్డాక  ఎలాగూ వర్రీ పుట్టించక మానవు! మానవమాత్రులం కదా! ఆ వర్రీ   దాచుకోడానికి   టెంపర్వరీగానైనా మన టోపేలనాశ్రయించక తప్పదు కదా! కొండమీదే.. టోపీకున్నంత డిమాండు వెంకన్న లడ్డూక్కూడా లేదు. కానీ  ఈ టోపీల్లో మన ఏపీ, తెలంగాణాల  వాటా ఉమ్మడిగా చూసినా కాణీకి మించి లేకపోవడం దారుణం.  మనజనం పెట్టించుకొనేవన్నీ పైనుంచి.. పక్కనుంచి వచ్చిపడుతున్న టోపీలేనని  మార్కెటింగు సర్వేలు  మొత్తుకొంటున్నాయి సార్! టోపీల టర్నోవరు కోట్లలో ఉంటుంది.  లాభాల వాటా లక్షలకు తగ్గదు.  మా 'పాపా'కీ టోపీల లైన్లో అపారమైన అనుభవం. సింగపూర్ ‘సింగర్ కేప్స్ కంపెనీ’ని  సింగిల్ ఫింగర్ మీద గింగిరాలు తిప్పిన బిగ్ బీ మా నాయన. నాది అయనకింద  ట్రయినింగే! ఒకే ఒక్క ఛాన్సుఇచ్చి చూడండి సార్! మన తెలుగుటోపీని ఆర్నెల్లలో అమెరికావాడి నెత్తిమీద పెట్టకపోతే అడగండి!' అన్నాడ్రా అత్యంత ఆత్మవిశ్వాసంతో ఆ కుర్రాడు. మన తెలుగువాడి పరువును ఎలాగైనా కాపాడాలనుకొనే ఈ టోపీవాలాని ప్రోత్సహించకపోవడం జాతిద్రోహం కిందకు వస్తుందా రాదా.. నువ్వే చెప్పు!?  ఇలాంటి యువశక్తి ప్రోత్సాహానికే కదా  ఈ స్వయం ఉపాథి పథకాలు ప్రవేశపెట్టింది! శాంక్షను చేసేందుకు సాలిడ్ కేసని .. సాక్షాత్తూ లోకల్ ఎమ్మేల్యేకూడా వత్తిడి చేసేసరికి .. అధికారిక  కాండిడేటేకదా అని అడిగిందానికి మరో పాతిక లక్షలు అధికంగా కలిపి మరీ మా బ్యాంకులోను ఇప్పించేసాన్రా భగవాన్లూ! ఓపెనింగు సెర్మొనీ రోజున ఆ కుర్రాడు అందరికీ తలా ఓ టోపీ కాంప్లిమెంటుగా పెట్టినప్పుడుకూడా పసిగట్టలేక పోయాను.. పిచ్చి వెధవని'
'ఆ టోపీలేనా ఇవి?' అనడిగాను.. పరిస్థితంతా అర్థమయి.
'కావు. ఇవి వేరేవిలేరా! చివరిదాకా విను. మొదటి వాయిదాకే కేసు మొండికేసింది. వెళ్ళి చూస్తే షెడ్డుకి గొళ్లెమేసి ఉంది. ఆర్నెల్లుకూడా ఆగలేదు ఆ త్రాష్టుడు! లోనిచ్చిన మర్నాడే స్టేట్స్ ఫ్లైటెక్కేసాట్ట! దొరికిన టోపీలన్నీ జప్తు చేసుకొని పాటకు పెడితే ఒక్కటీ పోలేదు. వ్యాపారం టోపీల తాలూకు అని తెలిసీ లోనిచ్చినందుకు  స్వఛ్ఛందంగా పదవీ విరమణ చేయమని బలవంతం చేసింది మా బ్యాంకు. తప్పతుందా! చివరికి ఈ టోపీలే దక్కుదలయ్యాయిరా నాకు రిటర్మెంటు బెనిఫిట్సుగా. ఇలా నాలుగిళ్లు తిరిగి ఎలాగో అమ్ముకోకపోతే ఇల్లుగడవని పరిస్థితుల్లో  తల్లడిల్లుతున్నా ప్రస్తుతం నేను.' అంటూ బ్యాగు సర్దుకొని ఇచ్చిన డబ్బులు కళ్లకద్దుకొని కన్నీళ్ళు పెట్టుకొంటూ వెళ్ళిపోయాడు .. పాపం.. బళ్లారి బాబాయ్!
టోపీకన్నా టోపీ టాపిక్కే  బరువనిపించింది.
పాలవాడికి, పేపరువాడిక్కూడా టోపీల రూపంలోనే  చెల్లింపులంటే  ఎవరికి కళ్లు చెమ్మగిల్లవు చెప్పండి!
ఏమాటకు ఆ మాటే! బాబాయి టోపీ బాగానే ఉపయోగపడుతోందిప్పుడు. బజారులో ఆయన బ్యాగుతో ఎదురైనప్పుడల్లా తలదాచుకోవడానికి వీలుగా ఉంటోంది.
మొన్నొకసారి బెజవాడనుంచి మా తమ్ముడొచ్చినప్పుడు.. ఇంటినిండా రకరకాల టోపీలు పడుంటంచూసి 'బళ్ళారి బాబాయి వచ్చినట్లున్నాడే!' అనడిగాడు.
'నీకెలా తెలుసురా?' అని ఆశ్చర్యపోతే 'నాదీ నీ కథేరా బ్రదరూ!  కాకపోతే కొద్దిగా మార్పు. నీ కథలో మాదిరి  వి ఆర్ ఎస్ కాదు. టోపీల వ్యాపారంలో వాటాలు కుదరక గలాటా అయితే మేటర్ లీకయి  బళ్లారి బాబాయి ఉద్యోగం ఊడింది. అదే అసలు నిజం. వాలంటరీ రిటైర్మెంటని అందరికీ ఇలా  సెంటిమెంటు టోపీలు  పెట్టుకుంటూ  రోజులుపొట్టాపోసుకొంటున్నాడు!' అనేసాడు.
***
-కర్లపాలెం హనుమంతరావు
 (అక్షర- ఆంతర్జాల మాసపత్రిక- దసరా సంచిక-అక్టోబరు 2015లో ప్రచురితం)


Saturday, October 17, 2015

ఏవండీ!.. మారండీ!- ఓ సరదా గల్పిక


  • ఏవండీ! .. మారండీ! 
  • ( ఈనాడు - ప్రచురితం ) 
  • *

  • బ్రహ్మదేవుడు ఏ చిరాకులో ఉండి సృష్టించాడోగానీ.. ఆడదాని  బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలికింది ఎండుకొమ్మే!

  • కిందే కాదు.. పై  లోకాల్లో కూడా అతివకు అడుగడుగునా అవమానాలు.. అగ్నిపరీక్షలే!

  • బ్రహ్మయ్యకు రిమ్మ తెగులు. పరమేశ్వరుడైతే భార్యకు సగం శరీరం ఇచ్చినట్లే ఇచ్చి.. నెత్తిమీదికింకో గంగానమ్మను  తెచ్చి పెట్టుకున్నాడు! నిరంజనుడుది మరీ నిరంకుశత్వం . . కట్టుకొన్నదాన్ని కాళ్లదగ్గరే కట్టిపడేశాడు!

  • 'ఆడదానికి స్వాతంత్ర్యం అనవసర'మని ఆ మనువెవడో అన్నాడుట! ఆ ఒక్క ముక్కను మాత్రం మన మగాళ్లకు మా బాగా నచ్చింది  ఈ ఇరవై ఒకటో శతాబ్దిలో ! 

  • ఒక్క మగాడనేమిటి! గ్యాసుబండలు, యాసిడ్ బాటిళ్లు, సెల్ఫో న్లు,  కెమేరాలు, బూతు సినిమా డైలాగులు , కట్నం వేధింపులు, అత్తల సాధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణ హత్యలు, పరువు హత్యలు, లైంగిక  వేధింపులు, తక్కువ జీతాలు,పనిభారాలు.. అబ్బో.. జల్లెళ్లోని చిల్లులకన్నా ఎక్కువ కదూ లోకంలో అక్క చెల్లెళ్లో కడగళ్లు! 

  • వేళకు వండి వడ్డించడానికి, పిల్లల్ని కని పెంచడానికి,  ఇంటిని కనిపెట్టి ఉండటానికి, బయట దర్జాలొలక బోయడానికి,  వేణ్ణీళ్ల సంపాదనలో చన్నీళ్ళలా తన  జీతం కలిపేసుకోడానికి , సినిమాహాలు క్యూలలో టిక్కెట్లు త్వరగా తీయించుకోడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లు అక్రమంగా ఆక్రమించేసుకోడానికి , బ్యాంకుల్లో దొంగకాతాలు తెరవడానికి, ఆదాయప్పన్ను లెక్కలు పక్కదారి పట్టించడానికి మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడని మగాడి బడాయి !

  • బల్లిని చూసి భయపడేంత సున్నితమైన మనసు ఆడదానిది. అయినా  బిడ్డకోసం నెలల తరబడి శరీరాన్ని పోషిస్తుంది. కత్తికోతలకు  వెరవకుండా ప్రసవానం అనుభవిస్తుంది. గంట పనికి వందలు డిమాండు చేసే వ్యాపారపు లోకంలో పరగడుపున  నిద్రలేచింది మొదలు.. రాత్రి పడక  ఎక్కే దాకా సహస్రాధిక హస్తమయిగ స్త్రీ శక్తి అందించు సమర్థ శుశ్రూషలకు  విలువగట్టడం మొదలుపెడితే..  
  • పదిమంది అదానీల సంపదలైనా  ఒక వారానికి సరిపోతాయా? 

  • పక్షిగాలిలో ఎగిరినట్లు, చేప నీటిలో ఈదినట్లు , పులి నేల మీద కదిలినట్లు   ఆడది ఇంటి ప్రపంచంలో కలిదిరుగుతుంది .   అబలగా  ఆమె ఇంటి నాలుగు గోడల మధ్య ఇంతి   నడిచే దూరం ముందు  ఒలంపిక్సు పరుగులైనా  బలాదూర్! ఆమె అత్యవసర గృహ వైద్యురాలు. శిక్షణ లేని  బిడ్డల ఉపాద్యాయురాలు. అనుక్షణం  కంటికి రెప్పలా కన్న బిడ్డలను  సంరక్షించే వార్డెను. కష్టంలో ఓదార్చే కౌన్సిలర్ .  పెదవి మనసులోని మాటను ఇట్టే పసిగట్టే  టెలీపతీ తన  స్పెషాలిటీ. . సంసారం విమానమైతే అమ్మ  దానికి  పైలెట్.. హోస్టెస్సూ. కలికి కామాక్షిలా ఆమె ఒదిగి ఉంటూనే  ఏ సంసారమైనా పదిలం. 

  • ఆధారు కార్డైన  ఓ పట్టాన దొరకని నేడు  ఆధారపడదగ్గ సుదతి కారు చౌకగ దొరకడం  మొగవాడు చేసుకొన్న పుణ్యం.

  • మెడలో మూడు ముళ్ళు  .. భర్తతో ఏడడుగులు.. పడిన  మరుక్షణమే  ఇంటిపేరే కాదు.. వంటి తీరూ కట్టుకున్నవాడికి  మీదు కట్టే త్యాగి  తరుణి !

  • రాముడొచ్చే వరకూ రావణాసురుడినయిన  గడ్డిపోచగ  నిలవరించిన  ధీర వనిత నెలత ! కాలి  పారాణి ఆరకనే  భర్త  భాతృ సేవకని  దూరముయితే     కడలి దుఃఖం కడుపు  హద్దులు దాటనీయని నిగ్రహానికి నిలువుటద్దం స్త్రీ .  విగత జీవి పతికి   తిరిగి బతుకు దారి దొరుకు వరకు మృత్యు దేవత నొదిలి పెట్టని పంతం పడతి సొంతం.  
  • గుడ్డి భర్తకలేని  దృశ్యభాగ్యం తనకు వద్దను  త్యాగబుద్ధి ఎంత మందికి సాధ్యం౧ 

  • మగవాడి మేధకు  నాలుగింతలు , సాహసానికి  ఎనిమిదింతలు  ఎగువ నున్న మగువ  ఒదిగి ఒదిగి ఉంది కనకే  ఇల్లు  జీవనదిలా సాగటం. యుగయుగాలుగా చిక్కుబడిన పీటముడి విడిపోవటానికి   మగవాడికి కావలసినది అహము వీడి .. మగనాలితో కలసి నడిచే సహనం.

  • ఇంతికి ఇంటి మగనితోనే కాదు  తంటా! ఆడదంటే  అంగడిన దొరికే సుఖపు  సరుకని తలచే తులవలతోనూ బెంగ!  ఓ వంక పూజలు, మరో వంక బడితె పూజలు ! 

  • ఆత్మరక్షణ కోసమై ఆడపిల్లలు వాడుకొనే  మిరియాల పొడులు పార్లమెంటుల మధ్య వరకు పాకినా,  ఆమె రక్షణకు చట్టబద్ధము   కావలసివున్న బిల్లులకు మాత్రం కాలదోషం పట్టు వరకు మగప్రపంచం చేయు బెట్టుకు  ఏమని పేరు పెట్టి కచ్చ తీరే వరకు తిట్టి పోయాలి!

  • 'ఆడపుటక'ను మగసమాజం పానకపు  పుడకగా భావించడం మానుకోవాలి! మనోవికాసానికి తిరుగుడొక్కటే తిరుగు లేని మందు అయితే  మగువకూ  మగవాడి తీరున   తిరుగు స్వేచ్ఛ దొరుకు రోజునే ఏ మహిళల దినోత్సవానికైనా తగిన న్యాయం జరిగినట్లు ! 

  • ***



Thursday, October 15, 2015

అన్నమో రామచంద్రా!- ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా వ్యాసం


వానా కాలంలో అందరి బాధలు ఒక రకంగా వుంటే ఇంటి ఇల్లాలు బాధలు ఇంకో రకంగా  వుంటాయంట! ఇల్లిల్లు తిరిగి ఎలాగో ఇంత నిప్పు కణిక తెచ్చినా అది రాజు కునేందుకు ఎండుగడ్డి , రగులుకునేందుకు ఇంటి వాసాలు కావాలి . అన్నం ఒక పట్టాన వుడికి చావదు. ఉడికినా  ఇల్లంతా అలుముకున్న పొగతో సుఖంగా   భోజనం చేయడం కుదరదు. వేళ కాని వేళ వచ్చిన అతిధి దేవుళ్ళకే తొలి బంతి బొటా  బొటిగా  సరిపోతుంది. చివరగా  తినే ఆడంగులు మళ్ళి పాపం  వండుకోవాల్సిందే ! ఆ క్షణంలో నెయ్యి గుడ్డలు, కొయ్య సమానులు కూడా వంట చెరుకు క్రిందే చెల్లి పోతుంటాయాంట! అర్ధాకలితో లేచి అంట్లు, ఎంగిలి గిన్నెలు ఎత్తు కోవటాలు! కాస్త  నడుం వాలుద్దామనుకోగానే కట్టుకున్న వాడు వచ్చి మర్నాటి అనుపాకాలను గూర్చి ఆరాలు మొదలు పెడతాడు-ఇదంతా ఈ కాలం లో ఏదో మారు మూల పల్లెలో జరిగే తిండి తంతు అనుకొనేరు. .

ఐదొందల ఏళ్ల క్రిందటే దక్షిణా పథాన్నంతా  ఏక చ్చత్రంక్రిందకి తెచ్చి రామరాజ్యం సాగించాడని మనమందరం మొన్నీ మధ్య దాకా  పట్టాభిషేకోత్సవాలు పెట్టుకుని మరీ మురిసిపోయిన రాయలు వారి కాలం నాటి భోజన విశేషాలే! రాయలు వారే  స్వయంగా కళ్ళతో చూసి ఒప్పుకుంటున్నట్లు ఇదంతా తన ఆముక్త మాల్యద మహా కావ్యంలో రాసుకున్నారు . ఉన్న స్వాతంత్ర్యం పోయి మళ్ళా  వచ్చి ఆరు దశాబ్దాలు దాటిపోతున్నా జనం భోజన కష్టాలు తీరలేదని చెప్పటానికే ఇంతలా  చెప్పుకొచ్చింది. కష్టాలు తీరలేదు కదా ..ఇబ్బందులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి పోయాయి. రెండు వేళ్ళు మూడు పూటలా  నోట్లోకి పోవాలంటే ఏదో సామెత చెప్ప్పినట్లు పెట్టి పుట్టాలి . రాను రాను పరిస్థితులు అంత  దుర్బరంగా తయారవుతున్నాయి .

రాజ్యాంగం పందొమ్మిదో అధికరణం ప్రసాదిస్తున్న స్వేచ్చ, వాక్సభా స్వాతంత్ర్యాలు  వగైరా వగైరా అనుభవించాలంటే ముందుగా పౌరుడనే జీవుడు ఇంత కడుపుకు నిండుగా  తిని బ్రతికుండాలి కదా !అందుకే పందికొక్కులు పెత్తనం చేసే ఈ రాజ్యం లో మనుషులకు కూడా ఆహార హక్కు వుండి  తీరాలని ప్రజల హక్కుల కోసం నిత్య పోరాటం చేసే ఓ ప్రజా సంఘం సర్వోన్నత న్యాయస్థానం దాక పోయి పదేళ్లుగా పోరాడింది.
ఈ పోరాట నేపథ్యం తెలిస్తే బుద్ధి వున్నవాడెవడికైనా  మైండ్ బ్లాకవడం ఖాయం.
జైపూర్ నగర శివార్లలోని  భారత ఆహార సంస్థ మూసివున్న గిడ్డంగుల బయట ఆరుబయలులో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ టార్పాలిన్ కవర్ల క్రింద మొక్క మొలిచిన కోట్లాది ధాన్యపు రాసులోక వైపు....
గోదాములకు అయిదారు  కిలో మీటర్ల దూరంలోని గ్రామాలలో తినడానికి చాలినన్ని తిండిగింజలు లేక వంతుల వారీగా తినడమనే  వింత పద్ధతిని కనిపెట్టి అమలుచేస్తున్న దరిద్ర నారాయణుల గుంపింకో వైపు!
ఉన్న తిండిగింజలు  అందరికి  అందుబాటులో ఉండాలంటే కుటుంబంలోని ప్రతి వారూ వారానికి మూడు రోజులు... రోజుకి రెండువందల గ్రాములకు మించి తినరాదన్న విషాద తీర్మానం  చేసుకున్నాయా గ్రామాలు!
జన సంక్షేమాన్ని చూడాల్సిన ప్రభుత్వ పక్షం , ప్రజల పక్షాన నిల్చి పోరాడవలసిన ప్రతిపక్షాలు పార్లమెంటులో ఇలాంటి దారుణ పరిస్థితులకి  కారణం మీరంటే మీరని జనంఅన్నం ముద్దలతో బంతులాట ఆడుకున్నాయి!
సర్వోన్నత న్యాయస్థానమే పూనుకుని విచారణ జరుగుతున్న ఈ పదేళ్లలో జన హితాన్ని దృష్టిలో ఉంచుకొని  మధ్య మధ్య ఉపాధి హామీ పథకాలనీ, ప్రజాపంపిణి వ్యవస్థ లోపాలనీ, బడిపిల్లలకు మధ్యాహ్నభోజన సదుపాయాలనీ, సమగ్ర శిశుపథకమనీ, అంగన్వాడి వ్యవస్థ పటిష్టతలంటూ తలంటుతూ ఉండకబోతే సామాన్యుడికి ఈ మాత్రమయినా కబళం దొరికే దారి వుండేదా? అనుమానమే!
 గోదాములలో ముక్కిపోతున్న బియ్యాన్ని అలా పందికొక్కుల పాలు చేసే బదులు బీదాబిక్కీకి ఉదారంగా పంచి పెట్టవచ్చు గదా! అంటూ ఆదేశంలాంటి సూచనను  అంత లావు సర్వోన్నత న్యాయస్థానం చేసినా.. ముక్కుతూ మూలుగుతూ ఏదో ముక్కి పోయిన బియ్యాన్ని చౌకధరలదుకాణంలో దిగువాదాయ వర్గాలవారికిచ్చే  ధరకి తప్ప ఇవ్వటానికీ.. ఠాట్.. లేదు పొమ్మని మొండికేసిన   మన్మోహన్ సింగు గారిసర్కారుని నమ్మేదెలా !    

"తిండిగింజలను పేదలకు పంచే బదులు కుళ్ల బెడుతున్న భారత దేశం" అంటూ తాటికాయంత అక్షరాలు పెట్టి మరీ ఓ ప్రముఖ వార్తా పత్రిక వెలుగులోకి తెచ్చిన పచ్చినిజాలను వింటే నిజంగా మన ప్రజాప్రభుత్వాలు ఎంత ఘనంగా వెలిగిపోతున్నాయో అర్ధమవుతుంది .
కొన్ని కోట్ల, లక్షల టన్నుల తిండిగింజలు ప్రభుత్వ ఆహార గిడ్డంగుల ముందు బాహాటంగా  ఏ రక్షణా లేకుండా నెలల తరబడి  ఎండా వానలకు మగ్గి పోతున్నాయి. న్న ధాన్యం కుళ్ళి, కంపు కొడుతున్నా ఆహార సంస్థ బియ్యం సేకరణ మాత్రం నిరాటంకంగా అలా కొనసాగుతూనే ఉంటుంది! ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్న ఆ కుళ్ళు ధాన్యం అప్పటి విలువ మార్కెట్ లెక్కల ప్రకారం చూసుకున్నా 17, 000 వేల కోట్ల రూపాయలకు తగ్గదని ఒక అంచనా. ఈ చెత్తను సేకరించే దానికి ఎఫ్.సి.ఐ ఏడాదికి రూ15,000 కోట్లు ఖర్చు చేస్తున్నది! విన్నవారికి తుగ్లక్ రాజ్యం తిరిగి మళ్ళా వచ్చిందా అన్న అనుమానం రాకుండా ఎలా ఉంటుంది! ప్రతి ఏటా ప్రళికాసంఘం గోదాముల నిర్మాణానికి వేలాది కోట్ల రూపాయలు నిధుల రూపంలో విడుదల చేస్తున్నా సేకరించిన బియ్యం ఇలా వీధులలో టార్పాలిన్ కవర్లకింద ముక్కిపోవటాన్ని అప్పట్లో  పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎండగట్టినా.. ఈ పిచ్చిపుల్లయ్యల  పనులకు ది ఎండ్ పడే దారి కనబడటం లేదు !
అలా గోదాములలో ముక్కిపోతున్న బియ్యంతో ఫ్రాన్స్ లాంటి ఒక పెద్ద దేశాన్ని  ఏడాది పాటు ఉచితంగా పోషించవచ్చని ... మరీ మనకంత మనసొప్పకపోతే మన దేశంలోనే 15 కోట్ల మందికి రోజుకో పూట  కడుపు నింపచ్చని ఓ పెద్దమనిషి పాపం వాపోయాడు.
చిన్నారులలో సగం మంది పౌష్టికాహార లోపాలతో బాధ పడుతున్న దేశం మనది. దుర్భర దారిద్ర్యంలో  సహారా ఎడారి దేశాలకన్నా వెనకబడి వున్న ఘనమైన
అభివృద్ధి మనది. అగ్ర రాజ్యంగా ఎదగటానికి , అణుశక్తి సామర్థ్యం లో  సూపర్ పవర్ దేశాలనన్నింటిని దడదడ దాటి ముందుకెళ్ళాలని, వేగవంతమయిన అభివృద్ధి సాధనలో అమెరికా చైనాలకే పాఠాలు చెప్పాలని వ్విళ్లూరే మనం.. ఐక్యరాజ్య సమితి భద్రతాసమితిలో సభ్యత్వం కోసం ఆరాటపడే ముందు గొప్పలకు పోయి అన్నేసి కోట్లుపోసి కామన్ వెల్త్ గేములు ఆడించేందుకు చూపించిన అత్యుత్సాహం లో ఒక్కశాతమన్నా దేశపౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఆహార హక్కును ఆచరణలో సుసాధ్యం చేసేటందుకు చూపిస్తే ఎంత బాగుణ్ణు!
అప్పుడే గదా ఏటేటా మన జరుపుకొనే ప్రపంచ ఆహార దినోత్సవాలకి ఒక పరమార్ధం సృష్టించినట్లయేది!
అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధనాసంస్థ ప్రతి ఏడూ తయారుచేసే అన్నార్తుల సూచిక ప్రకారం "అన్నమో రామచంద్రా!" అని ఒక్క ముద్దకోసం అల్లల్లాడే 88 దేశాల జాబితా లో  అన్నింటి కన్నా అట్టడుగున పడివున్నది ఘనమయిన మన 'అన్న గర్భే' నన్న సంగతి మర్చిపోకుండా ఉంటే మంచిది.
ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయనో, పత్రికలు వార్తలు రాసి ఎండగడుతున్నాయనో, సుప్రీంకోర్ట్ మొట్టికాయలు వేసిందనో,  వ్యవసాయమంత్రిగారు సెలవిచ్చారానో, పి యమ సలహా ఇచ్చారనో, మోదీ  గారు మెచ్చుకున్నరానో కాదు ... సర్కారు ఆహారహక్కు కల్పించ వలసింది. ఈ సహజ ధాన్యాగారంలో పుట్టిన పుణ్యానికి ప్రతిపౌరుడికి కనీసం రోజుకొక్క పూటయినా రెండువేళ్ళు నోటికందే విధంగా చర్యలు తీసుకోనంత కాలం ఎన్ని ప్రపంచ ఆహార దినోత్సవాలు ఎంత ఆర్భాటంగా జరుపుకున్నా మామూలు జనానికి జరిగే మేలు సున్నా !
గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి వుంటుందని హిందీ లో సామెత. మరి  ఆ ధాన్యపు గిడ్డంగుల ముంగిలిలో ముక్కిపోయి తినడానికి పనికి రాకుండా పోతున్న గింజలమీద తిండి దొరకక ప్రాణాలు పోయే ఎంతమంది  నిర్భాగ్యుల పేర్లు రాసి  వున్నాయో!  మానవత్వం  న్న వారందరూ వెంటనే స్పందించ వలసిన అవసరాన్ని  ఈ ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భమయినా  గుర్తు చేస్తే బాగుణ్ణు .
-కర్లపాలెం హనుమంత రావు
(15-10-2010నాటి ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా  ఐదేళ్ళ కిందట నేను రాసిన వ్యాసం.. కొన్ని తాజా సవరణలతో)





Wednesday, October 14, 2015

టెలుగూసా.. మజాకానా!- ఓ సరదా గల్పిక

ఆంగ్లంమీద ఆంగ్లేయుడికైనా ఇంతలావు ప్రేమ కారిపోతుందో లేదో సందేహమే!మారుమూల పల్లెల్లో కూడా పిల్లకాయలకు ఏబీసీడీలు నేర్పించందే బళ్లల్లో చేర్పించేది లేదని అప్పలమ్మల దగ్గర్నుంచి.. తిప్పలయ్యలదాకా తెగేసి చేప్పేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో!
'తెలుగోళ్లందరం తెలుగులోనే మాట్లాడుకొందాం. చచ్చిపోతున్న మన తల్లిభాషను మళ్లీ బతికించుకుందాం!' అంటూ చాదస్తంకొద్దీ ఎవరన్నా నోరుజారాడా .. చచ్చాడన్న మాటే! తెలుగ్గడ్డమీద పుట్టిన ఖర్మానికి ఎట్లాగూ 'టెలుగూస్' అని పిలిపించుకోక తప్పడం లేదు  గదా! ఇంకా నోటితో కూడా మాట్లాడుతూ చెల్లని  నోటుకింద 'చీ' కొట్ట్తించుకోవాలనేనా!' అని గయిమనేవాళ్ల నోళ్ళు  ఎవర్ మూయించగలరు .. చెప్పండి!

తెలుగులో చదువులు  వెలగబెడితే పోనీ సర్కారు నౌఖరీ అయినా దఖలుబడే సౌకర్యమేమన్నా తగలబడిందా! తెలుగు పంతుళ్ల పోస్టులకైనా తెలుగులో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటైనా  లేదు గదా! ఇహ వత్తులెక్కడ పెట్టాలో, దీర్ఘాలెక్కడ తియ్యాలో తెలుసుకొని చేసే ఘనకార్యం మాత్రం ఏముంటుంది?
గతంలో కనీసం తెలుగు సినిమా పాటలైనా వినడానికి పనికి వచ్చేది తెలుగు పరిజ్ఞానం. ఇప్పుడు వాటిలోనూ ఒక్క తెలుగక్షరం వినపించి చావనప్పుడు రొప్పుకుంటూ రోజుకుంటూ ఈ తెలుగు నేర్చుకొనే తిప్పలెందుకు చెప్పమ'ని నిలదీసే పిలగాళ్లకేమని చెప్పి ఒప్పించగలం చెప్పడీ!
పుట్టుకతో వచ్చిన కులాన్నెలాగూ మార్చుకోలేంఆంధ్రదేశంలో పుట్టిన పాపానికి టెలుగూస్ అన్న నిందెలాగూ భరించక తప్పడం లేదు. మతం మాదిరి మార్చుకొనే స్వేచ్చ రాజ్యాంగంగాని  మనకు ప్రసాదించి కనక ఉండుంటే.. ఆంధ్రప్రదేశుని ఏనాడో ఆంగ్లప్రదేశుగా, తెలంగాణాని ఆంగ్లణాగా  మార్చేసుకొనుండేవాళ్లం కదా!
ఆటగాళ్ళకిచ్చే ప్రత్యేక రాయితీల మాదిరి తెలుగు మాటగాళ్లక్కూడా ఏవైనా ప్రత్యేక కోటాలు గట్రాల్లేకపోతే.. తెలుగు మాట్లాడేవాళ్ళిక కోటికొక్కడన్నా మిగలుతాడా! సందేహమే
పిల్లకాయలు దర్జాగా దొరలభాష నేర్చేసుకొని.. దొరబాబులాగానో.. దొరసానిలాగానో.. ఒబామా లెవెల్లో డాబూ దర్పం చూపించాలనీ.. బిల్గేట్సు మోడల్లో డాలర్ల గుట్టలు కూడబెట్టాలని ఏ కన్నవారికి కలలుండవు చెప్పండి! 'ఇంగ్లీషులో తప్ప మాట్లాడటం తప్ప'ని ఆంక్షలు పెడితే అదేమనా అంత పెద్ద తప్పా!
దేశంలో మొదటగా  భాషాప్రయుక్తరాష్ట్రంగా  ఏర్పాటైన ఘనత  మొన్నటిదాకా కలిసున్న మన ఉభయ తెలుగురాష్ట్రాలదే గదా! సరే స్వామీ!,,  మరి తెలుగు అకాడమీలో ఆ తెలుగు  సగం మాత్రమే ఉందేమి?' అనెవరన్నా ఉరుమురిమి అడిగితే ఉలిక్కిపడడమే తప్ప బదులు పలికే సావకాశమేమన్నా ఉందా! ఇక్కడి మన భాషాదౌర్భాగ్యంపట్ల ఎక్కడో ఉన్న ఐకాసావాళ్ళు ఆందోళన చెందుతున్నారు!   'అతితొందర్లోనే మీ 'అత్యంత తీయని చక్కర తెలుగు ముక్కలు' కరిగి పోబోతున్నాయి మహాప్రభో!' అని కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అయినా మనకేమైనా  చీమైనా కుట్టినట్లనిపించిందా!! దటీజ్.. తెలుగోడు!
పది పదాల తెలుగు కథను పదో తరగతి పిల్లగాడైనా తడబడకుండా.. తప్పుల్లేకుండా  చదవలేని పరిస్థితి. ప్రాచీనహోదా కోసం అహోరాత్రాలు అలా అలమటిస్తే సరిపోతుందా!ఇక్కడ అధునాతన తరం 'ఓ న మా లు' దిద్దమంటే '! మై గాడ్.. నో వే' అని కొట్టిపారేస్తున్నది!
కనుమరుగైతే అవనీయండయ్యా! అన్నింటికీ అలా కన్నీళ్ళు పెట్టేసుకొంటే ఎలా? రుబ్బురోళ్ళూ, అవుదం దీపాలూ, పాంకోళ్లూ, భోషాణం పెట్టెలూ.. ఇప్పుడున్నాయా? పాతకాలంనాడు మా తాతలు తాటాకు మట్టలు వంటికి చుట్టుకొన్నారు. కనక ఇప్పుడు అవే మొలకు చుట్టుకొని షికార్లు కొట్టమన్నట్లుంది.. గోల! అణాలూ.. కానీలూ కనుమరుగై పోలా! అలాగే అణాకానీక్కూడా కొరగాని మన తెలుగు కనుమరుగయి పోతోంది. పోనీక ఈ పొలికేకలేల బాబూ పొద్దస్తమానం!
దేశంలో హిందీ తరువాత అన్నిటికన్నా ఎక్కువ మాట్లాడే భాష మందేనంటారా! మందేసుకొంటేగాని నాలిక మడతలకింద వినబడదు ఈ పాము మెలికల తికమక భాష.
'మాతృభాష చచ్చిపోతోందో!' అని పొద్దస్తమానం ఈ శోకన్నాలేమిటో.. చిరాకు! మాతృమూర్తులకే సరిగ్గా ఆదరణ దొరకని గడ్డమీద ఇహ ఈ మాతృభాషకు మాత్రం ఘనసత్కారాలు జరుగుతాయా చెప్పండి మరీ అత్యాశ కాకపోతే!
'తెలుగు రాష్ట్రంలో ఉన్నాంగదా!'  అని ఇక్కడి పశువులేమన్నా తెలుగులో కూస్తున్నాయా! ఇరవైనాలుగ్గంటలూ 'ఇరుగూ పొరుగును చూసి బుద్ధి తెచ్చుకోమని ఇలా పోరుపెట్టడమేమనా బాగుందా! 'పక్క మహారాష్ట్రలో  పక్కామరాఠీకోసం ఎలా లాఠీలు పట్టుకొని తిరుగుతున్నారో.. చూసి నేర్చుకోండి! ఢిల్లీ చట్టాసభల్లో సైతం సొంతభాషలోనే విరుచుకుపడే తమిళుల్ని చూసి తెలివి తెచ్చుకోండి!'  అంటూ ఇరవైనాలుగ్గంటలూ ఇరుగు పొరుగుతో  పోల్చి చిన్నబుచ్చడం తగదండీ! మన టెలుగూస్ ప్రత్యేకతలు మనవి! అర్థం చేసుకొని ఆదరించమని మనవి.
''ఐ  వెవ్వర్ స్పీక్ ఇన్ టెలుగు' అని రాసిన పలకలను పసిపిల్లల మెళ్లకు గంగడోళ్లకు మల్లే   వేలాడేసే  మెకాలేల నోటనైనా తెలుగు తన్నుకొచ్చే ట్రిక్కు ఒక్కటే ఒక్కటుందంటారా! గూబమీద గట్టిగా ఒకటిస్తే సరి! ఎంత పెద్ద ఆక్స్ ఫర్డు వర్డ్సువర్తు పండితుడైనా గానీ.. ' అబ్బా! అమ్మా!' అంటూ  అచ్చుతెలుగులో హల్లులన్నీ చేర్చి ఘొల్లుమంటాడంటారా!
నో..వే! తల్లిభాష గొప్పతనం తెలుగువాడి   తలకెక్కించాలంటే మీ తలమీదున్న  అన్నివెంట్రుకలూ నేల రాలాస్లిందే మాస్టారూటెలుగూసా.. మజాకానా!
-కర్లపాలెం హనుమంతరావు

(22-01-2010 నాటి ఈనాడు- సంపాదకీయం పుట లో ప్రచురితం)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...