ఇంగ్లీషువాడు మనదేశానికొచ్చి చేసిన మహోపకారమేంటో తెలుసా?' అనడిగాడు
మా బళ్లారి బాబాయ్ ఓ ఆదివారం
పరగడుపునే మా ఇంటికి ఆయాసపడుతూలేస్తూ వచ్చికూర్చుని.
'ఆంగ్లం నేర్పడం' అన్నాను శుద్ధతెలుగులో.
'ఇంకోటికూడా ఉందిరా! ఇలా టోపీలు పెట్టుకోడం' అన్నాడు నా నెత్తికో కుచ్చుటోపీ తగిలించి. 'అచ్చు చార్లీచాప్లిన్లా ముచ్చటేస్తున్నావురా రావుడూ!' అంటూ ముద్దులుకూడా కురిపించేసాడు.
బళ్ళారి బాబాయ్. ఆయన ఆ మధ్య
బ్యాంకులో వి ఆర్ ఎస్ లాంటిదేదో పుచ్చేసుకొన్నాడని విన్నాను. సర్వీసులో ఉండగా వందకు ఒక్క కాలుకైనా అందుబాటులోకి రాని బిజీశాల్తీ.
ఇప్పుడిలా ఇంటిదాకా వచ్చేసి మరీ తీరిగ్గా కూర్చొని టోపీలమీద డిస్కషన్లు
పెట్టాడేంటీ?! ఇందులో మతలబేమీ లేదుగదా? ‘అడిగితే బావుంటుందా?’ అని సతమతమయిపోతోంటే తనే టాపిక్కుని మళ్లీ టోపీలమీదకు మళ్లించేసాడు.
'టోపీ పెద్దరికానికి గుర్తు కదరా మొద్దబ్బాయ్!
పెద్దవాళ్లెవరైనా ఎదురైనప్పుడు ఇంగ్లీషువాడైతే నెత్తిమీది టోపీ తీసి మరీ విష్
చేస్తాడు. ఆ దొరల మేనర్సే వేరులే. మన ఆడంగులకైతే ఆర్నమెంటంటే ఓన్లీ బంగారమే! కానీ
లండన్ దొరసానికి టోపీనే మెయిన్ అలంకారం.
టోపీ లేకపోతే గుండుకి అసలీ నిండుతనం ఎక్కడేడ్చింది చెప్పు!' అంటూ
ఠప్పుమని నెత్తిమీది టోపీ తీసి గుండుకి
అంటుకొన్న చెమట తుడుచుకొన్నాడు.
బళ్లారి బాబాయ్ పరమ నాస్తికుడు. మరి ఈ తిరుపతి గుండూ?! నిండుగా ఉండేందుకనిగానీ
గుండుకొట్టించుకొని టోపీ పెట్టుకొన్నాడా ఏవిటీ కొంపదీసి!
‘టోపీ’
అంటే నాకు తెలిసినంత వరకూ 'మాయ'కు
సింబాలిక్! ‘టోపీ పెట్టడ’వంటే
మాయచేయడమనేగా మన వాడకంలో ఉన్నదికూడా! మాయకీ, టీపీకీ మధ్య ఏదో అవినాభావ సంబంధం
ఉండబట్టేగదా.. మెజీషియన్లంతా కుందేళ్లను టోపీలనుంచే తీసేందుకు తంటాలుపడేది! కూపీలు
తీసే పత్తేదార్లక్కూడా టోపీలే కొండగుర్తులు.
పొలిటీషియన్లందరికీ కార్టూనిస్టులు గాంధీటోపిలు గట్రా పెట్టడానికీ మాయకీ ఏదో సంబంధం
ఉండే ఉంటుందని నా డౌటు. బారిష్టరు పార్వతీశం టోపీని వదిలించుకోడానికి ఎన్నెన్ని
రొష్టులు పడతాడూ మొక్కపాటివారి నవల్లో!
'అలా అనుకోవద్దురా అబ్బాయ్! టోపీకి, మోసానికి సంబంధమేముందసలు? అలాంటివాటికి చెవిలో పువ్వులు ఎలాగూ ఉన్నాయిగదా మనదగ్గర! 'టోపీ' అంటే ఒక
పరమ పవిత్రమైన ఉదాత్త పదార్థంరా నాయనా! పౌరాణికాల్లో దీన్నే కిరీటం అంటారు.
నెత్తిమీద కిరీటం లేకపోతే దేవుణ్ణే మనం గుర్తుపట్టలేం. గుళ్ళోకి వెళ్ళినప్పుడు
పూజారిగారు మనకు పెట్టేదీ ఓ రకమైన టోపీనే
బాబూ! దాన్నే మనం భక్తిగా ‘శఠగోపం’ అని
పిల్చుకొంటాం. బైటికెళ్ళినప్పుడు గుండు ఎండకు మండకుండా ఉండాలనో, బైకెక్కితే
బొచ్చెకు దెబ్బ తగలద్దనో మనం వాడే కేపులు, హెల్మెట్లు మాత్రం?
ఓ రకమైన టోపీలేగదరా అబ్బిగా! మొన్న మార్కెట్లో సమయానికి చంకలో సంచీలేకపోతే ఉల్లిగడ్డలు ఈ టోపీలోనే
నింపుకొన్నారా బాబిగా! తలకెంత రంగు పులువుకున్నా ఎక్కడో ఒక్క
తెల్లవెంట్రుకైనా దోబూచులాడుతూ కనబడి మన
పరువు తీస్తుంది. అదే టోపీగానీ నెత్తిమీదుంటే
టోటల్గా అంతా కవరై పోతుంది. కరెంటు
గ్యారంటీ లేని ఈ రోజుల్లో చేతికింద నమ్మకంగా పంజేసే విసనకర్రకూడా ఈ టోపీనేరా
వెర్రినాగన్నా!' అంటూ బర్రుమని పక్కనున్న బ్యాగు జిప్పు లాగేసాడు బాబాయ్!
బాబోయ్! బాబాయ్ బ్యాగునిండా బోలెడన్ని టోపీలు! ఎన్నేసి రక.రకాలో! కుచ్చుటోపీలు.. ఊలుబొచ్చుటోపీలు..
గాంధీటోపీలు.. గాడ్సేకషాయం టోపీలు.. నమాజుటోపీలు.. హరేరామ హరేకృష్ణ టోపీలు..
ఆరెస్సెస్ టోపీలు.. కేజ్రీవాలు టోపీలు.. క్రేజీ ఫెదర్
టోపీలు.. పిల్లలు మోజుపడే టోపీలు..!
'అమ్మాయ్! నువ్వూ ఓటి తీసుకో! వయస్సు ఓ పదేళ్ళు వెనక్కి
పారిపోకపోతే నన్నడుగు!' అంటూ కాఫీకప్పు ఇచ్చిపోవడనికని
వచ్చిన మా ఆవిడ నెత్తిమీదా అడక్కుండా ఓ
ఈకలటోపీ తగిలించేసాడు బాబాయ్! పిల్లలిద్దరూ బ్యాగుమీద పడి తలా ఓ టోపీ నెత్తిమీద పెట్టుకొని కోతుల్లా గెంతుతోంటే
ఇల్లు కిష్కిందకాండను తలపిస్తోంది. గది ఊడ్చడానికని వచ్చిన పనిపిల్ల నెత్తిమీదా ఓ
టోపీ పెట్టేసాడు బాబాయ్ చివరికి!
'వద్దులే బాబాయ్! మరీ ఓవర్ గా ఉంటుందేమో!' అని వారించుదామనుకున్నా. వినే మూడులో ఉంటేనా ఆ మహానుభావుడు! 'ఉండనీయరా!
అందంగా ఉంది. ఎంతా! ఓ వందేగా.. టోపీ!'
అంటూ పనిపిల్లనలాగే లోపలికి తోసేసాడు.
టోపీలిలా అమ్ముకోడానికేనా బంగారంలాంటి బ్యాంకుద్యోగాన్ని
బాబాయలా కాళ్ల తన్నుకొన్నదీ!
'అన్ని టోపీలెలా సంపాదించావ్ బాబాయ్? సెల్ఫ్ ఎంప్లాయిమెంటుకిందేమన్నా కాటేజీ ఇండస్ట్రీ గానీ ప్రారంభించావా ఏంటీ
కొంపదీసి?' అని అడిగా ఇహ ఉండబట్టలేక.
'లేదురా అబ్బాయ్! అసలు కథ చెబుతా.. వింటావా!' అంటూ చెప్పడం మొదలుపెట్టాడు బాబాయ్.
***
ప్రధానమంత్రి యువశక్తి పథకంకింద అర్హులైన యువజన సంఘాల
ఎన్నికకు సంబంధించిన ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మా బ్యాంకు తరుఫున ఇంటర్వ్యూ
కమిటీలో నేనొక్కణ్నే మెంబర్ని. టక్కూ
టయ్యీ కట్టుకొన్న ఓ చాకులాంటి కుర్రాడొచ్చి
మామందు కూర్చున్నాడు.
'ఏం పెట్టాలనుకొంటున్నావూ?' అనడిగాం.
'టోపీలు' అన్నాడు
అతగాడు దర్జాగా.
అప్పటికింకా నాకీ గుండూ అదీ లేదులే. కామెడీకోసం అన్నాడేమో
అనుకొన్నాం. కాదు సీరియస్సే! నేను తలతడుముకొంటుంటే.. తెలివికలవాడుకదా.. గ్రహించేసిన్నట్లున్నాడు.. పెద్ద స్పీచే దంచేసాడు! 'మీరనుకొనే ఆ టైపు టోపీలు కాదులే
సార్ ఇవి! 'కేప్స్ అండ్ హ్యాట్స్' అన్నాడు
లండన్ యాక్సెంటులో! డంగైపోయాం అందరం.
' 'థింక్ న్యూ' అన్నాడుకదా సర్ ఐజాక్ న్యూటన్! సైన్సుకేకాదు.. సరుకులు అమ్ముకొనే
బిజినెస్సుకైనా అదే సక్సెస్ఫుల్ ఫార్ములా సార్! అందుకే నేనీ టోపీల వ్యాపారంమీద
టిక్కు పెట్టింది' అంటూ విశ్వనాథవారి వేయిపడగలంత భారీప్రాజెక్టు
రిపోర్టు మా ముందు పారేసాడు. ఎకనామిక్సు ప్రకారం ప్రోజెక్ట్ సెంట్ పర్సెంటు ఫీజుబుల్ అన్డ్ వయబుల్!
'అంతర్జాతీయ వెంట్రుకల సమాఖ్య .. ఐ మీన్.. ఇంటర్నేషనల్
హెయిర్ ఆర్గనైజేషన్ లేటెస్టు లెక్కల ప్రకారం ఒక్క తిరుమల కొండమీదే రోజుకు పాతికవేల
గుండ్లు తయారవుతున్నాయ్! మహిళాగుండ్లను మినహాయించినా .. మగ గుండుకొకటికి మినిమమ్
రెండు టోపీల చొప్పున తప్పదుకదా! ఆ లెక్కన
థర్టీఫైవ్ థౌజండ్ ఇన్స్టాంట్
టోపీలకు అక్కడే డిమాండు ఏర్పడింది! గుండుకొట్టే పుణ్యక్షేత్రాలు
కంట్రీలో స్టేటుకి తక్కువలో తక్కువగా అర్థనూటపదహార్లకు తక్కువ లేదన్నది రెండేళ్లకిందటి
ఎండోమెంట్సువారి పాత లెక్కలే చెబుతున్నాయి. ఇప్పటి భక్తి సంగతి మీకు
చెప్పేదేముంది? గజ్జెల మల్లారెడ్డా.. ఆయనెవరో.. ఓ పెద్దాయన అన్నట్లు డ్రైనేజీ
తూముల్లో పారుతోందికదా!’ అన్నాడా కుర్రాడు.
మా బోర్డుమెంబర్లలోనే ఐదుగురిలో
ముగ్గురికి బోడిగుండ్లున్నాయి ఆ రోజు! ఓ ప్రైవేటు బ్యాంకునుంచి వచ్చిన గుండుమనిషి ఊరుకోకుండా 'నా గుండు తిరుపతిది కాదులేవయ్యా! మా అమ్మ
పోయింది పోయిన్నెల్లో!' అని క్లూ ఇచ్చేసాడు. ఇంకేముంది!
రుణంకోసమని వచ్చిన ఆ చాకు దారుణంగా రెచ్చిపోయింది. 'అదే సార్
నేను నెక్స్టు చెప్పబోతోంది. గుండ్లు కొట్టించుకోవడానికి ఒక్క తిరుపతి టైపు
మొక్కులే ఉండనక్కర్లేదు. జుట్టు రాలిపోతున్నా.. బట్టతలలు బైటపడుతున్నా.. ఇలా
ఇంట్లో ఎవరైనా ఖర్మకాలి బాల్చీ తన్నేసినా.. చివరికి వైరాగ్యం ముదిరి సన్యాసం
పాకంలో పడినా ముందువచ్చేది నున్నంగా గుండు
గీకిద్దామనేఐడియానే ! ఉడుకులో కొట్టించుకొన్న
గుండ్లు.. హుషారు చల్లబడ్డాక ఎలాగూ వర్రీ
పుట్టించక మానవు! మానవమాత్రులం కదా! ఆ వర్రీ
దాచుకోడానికి టెంపర్వరీగానైనా మన
టోపేలనాశ్రయించక తప్పదు కదా! కొండమీదే.. టోపీకున్నంత డిమాండు వెంకన్న లడ్డూక్కూడా లేదు.
కానీ ఈ టోపీల్లో మన ఏపీ, తెలంగాణాల వాటా ఉమ్మడిగా చూసినా కాణీకి మించి లేకపోవడం
దారుణం. మనజనం పెట్టించుకొనేవన్నీ
పైనుంచి.. పక్కనుంచి వచ్చిపడుతున్న టోపీలేనని
మార్కెటింగు సర్వేలు మొత్తుకొంటున్నాయి
సార్! టోపీల టర్నోవరు కోట్లలో ఉంటుంది.
లాభాల వాటా లక్షలకు తగ్గదు. మా 'పాపా'కీ టోపీల లైన్లో
అపారమైన అనుభవం. సింగపూర్ ‘సింగర్ కేప్స్ కంపెనీ’ని సింగిల్ ఫింగర్ మీద గింగిరాలు తిప్పిన బిగ్ బీ
మా నాయన. నాది అయనకింద ట్రయినింగే! ఒకే
ఒక్క ఛాన్సుఇచ్చి చూడండి సార్! మన తెలుగుటోపీని ఆర్నెల్లలో అమెరికావాడి నెత్తిమీద
పెట్టకపోతే అడగండి!' అన్నాడ్రా అత్యంత ఆత్మవిశ్వాసంతో ఆ
కుర్రాడు. మన తెలుగువాడి పరువును ఎలాగైనా కాపాడాలనుకొనే ఈ టోపీవాలాని ప్రోత్సహించకపోవడం
జాతిద్రోహం కిందకు వస్తుందా రాదా.. నువ్వే చెప్పు!? ఇలాంటి యువశక్తి ప్రోత్సాహానికే కదా ఈ స్వయం ఉపాథి పథకాలు ప్రవేశపెట్టింది! శాంక్షను
చేసేందుకు సాలిడ్ కేసని .. సాక్షాత్తూ లోకల్ ఎమ్మేల్యేకూడా వత్తిడి చేసేసరికి ..
అధికారిక కాండిడేటేకదా అని అడిగిందానికి
మరో పాతిక లక్షలు అధికంగా కలిపి మరీ మా బ్యాంకులోను ఇప్పించేసాన్రా భగవాన్లూ!
ఓపెనింగు సెర్మొనీ రోజున ఆ కుర్రాడు అందరికీ తలా ఓ టోపీ కాంప్లిమెంటుగా
పెట్టినప్పుడుకూడా పసిగట్టలేక పోయాను.. పిచ్చి వెధవని'
'ఆ టోపీలేనా ఇవి?' అనడిగాను.. పరిస్థితంతా అర్థమయి.
'కావు. ఇవి వేరేవిలేరా! చివరిదాకా విను. మొదటి వాయిదాకే కేసు
మొండికేసింది. వెళ్ళి చూస్తే షెడ్డుకి గొళ్లెమేసి ఉంది. ఆర్నెల్లుకూడా ఆగలేదు ఆ
త్రాష్టుడు! లోనిచ్చిన మర్నాడే స్టేట్స్ ఫ్లైటెక్కేసాట్ట! దొరికిన టోపీలన్నీ జప్తు
చేసుకొని పాటకు పెడితే ఒక్కటీ పోలేదు. వ్యాపారం టోపీల తాలూకు అని తెలిసీ
లోనిచ్చినందుకు స్వఛ్ఛందంగా పదవీ విరమణ
చేయమని బలవంతం చేసింది మా బ్యాంకు. తప్పతుందా! చివరికి ఈ టోపీలే దక్కుదలయ్యాయిరా నాకు
రిటర్మెంటు బెనిఫిట్సుగా. ఇలా నాలుగిళ్లు తిరిగి ఎలాగో అమ్ముకోకపోతే ఇల్లుగడవని
పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నా ప్రస్తుతం
నేను.' అంటూ బ్యాగు సర్దుకొని ఇచ్చిన
డబ్బులు కళ్లకద్దుకొని కన్నీళ్ళు పెట్టుకొంటూ వెళ్ళిపోయాడు .. పాపం.. బళ్లారి బాబాయ్!
టోపీకన్నా టోపీ టాపిక్కే బరువనిపించింది.
పాలవాడికి, పేపరువాడిక్కూడా
టోపీల రూపంలోనే చెల్లింపులంటే ఎవరికి కళ్లు చెమ్మగిల్లవు చెప్పండి!
ఏమాటకు ఆ మాటే! బాబాయి టోపీ బాగానే ఉపయోగపడుతోందిప్పుడు.
బజారులో ఆయన బ్యాగుతో ఎదురైనప్పుడల్లా తలదాచుకోవడానికి వీలుగా ఉంటోంది.
మొన్నొకసారి బెజవాడనుంచి మా తమ్ముడొచ్చినప్పుడు.. ఇంటినిండా
రకరకాల టోపీలు పడుంటంచూసి 'బళ్ళారి బాబాయి వచ్చినట్లున్నాడే!' అనడిగాడు.
'నీకెలా తెలుసురా?' అని
ఆశ్చర్యపోతే 'నాదీ నీ కథేరా బ్రదరూ! కాకపోతే కొద్దిగా మార్పు. నీ కథలో మాదిరి వి ఆర్ ఎస్ కాదు. టోపీల వ్యాపారంలో వాటాలు కుదరక
గలాటా అయితే మేటర్ లీకయి బళ్లారి బాబాయి
ఉద్యోగం ఊడింది. అదే అసలు నిజం. వాలంటరీ రిటైర్మెంటని అందరికీ ఇలా సెంటిమెంటు టోపీలు పెట్టుకుంటూ
రోజులుపొట్టాపోసుకొంటున్నాడు!' అనేసాడు.
***
-కర్లపాలెం హనుమంతరావు
(అక్షర- ఆంతర్జాల మాసపత్రిక- దసరా సంచిక-అక్టోబరు 2015లో ప్రచురితం)
No comments:
Post a Comment