పరమాత్ముడైనా
ఆ పరంధాముడు పథ్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అదే అతగాడి పాదుకలో! ఏ ప్రయత్నం చేయకుండానే దర్జాగా అయోథ్య
సింహాసనం అధిష్టించాయి! అదృష్టమంటే అదే!
అదృష్టం ఉంటే
ఎడారిలో పడి ఉన్నా ఏనుగు వెదుక్కంటూ వచ్చి వరమాలను మెడలో వేస్తుంది.
'తంతే బూరెల బుట్టలో పడ్డం' అంటాంగదా! అలాగని బూరెల బుట్టముందు నిలబడి తన్నించుకున్నా.. ప్రారబ్దం
బాగోలేకపోతే పక్కనున్న పేడతక్కెట్లో పడవచ్చు! ప్రారభ్దానికి ఏ
శబ్దార్థ కౌముదీ సరిగ్గా నిర్వచనం చెప్పలేదు. చెప్పలేదుకూడా!
'ఖర్మానికి ధర్మాధర్మాలుండవని గీతకూడా బోధిస్తూనే ఉందిగదా! అ'దృష్టం' అంటేనే కంటికి కనిపించనిది. దృష్టాంతాలేగాని.. సిద్ధాంతాలుండనిది. అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలంమీద
దిగేముందు సరిగ్గా ఇరవై నిమిషాలకు సరిపడ్డ ఇంధనం మాత్రమే మిగిలి ఉందట! అదీ అదృష్టమంటే!
కలసి రావాలి.. అంతే! కలసిరాకపోతే
అలంకారంకోసం వేలికి పెట్టుకున్న పచ్చలఉంగరంకూడా పఛ్చడికూటితో పాటు గొంతులోకి
జారి ప్రాణాంమీదికి రావచ్చు.
పూర్వజన్మసుకృతమని
ఏదో పేరు పెట్టుకొని సంతృప్తికోసం సమర్థించుకోడమేగాని ఏ అపూర్వ శబ్దచింతామణీ
అదృష్టానికి సంపూర్ణ న్యాయం చెయ్యనేలేదు. చెయ్యలేదుకూడా!
టైమ్ బాగోలేకపోతే
భోలక్ పూర్ నల్లానీళ్ళే కాదు.. బోలెడంత డబ్బుపోసి కొన్న మినరల్
వాటరుకూడా కాలకూట విషమౌతుంది!
జనాలని నమ్ముకోవాల్సింది
పోయి జాతకచక్రాలను నమ్ముకొన్న జయలలితమ్మ గతే
మవబోయిందో మనందరికీ తెలిసిందేగా! మన దగ్గరా ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తంపార్టీ చీట్లు తీసింది! అన్నీ తెలుసు రాజకీయవేత్తలకు. అయినా రాజకీయాలు పత్తి
మార్కెట్ల(కాటన్ మార్కెట్లు) మాదిరి సందడి
చేస్తున్నాయంటే అదే మరి రాజకీయం గడుసుతనం.
గోడదూకుడుగాళ్ళు
ఎక్కువైపోతున్నారని వాపోయే ఓ పార్టీ తనకార్యాలయం గోడలు మరింత ఎత్తుకు
పెంచింది! ఏమయిందీ? ఆ గోడలకు కన్నాలేసి
మరీ కోరుకొన్న పార్టీల్లోకి దూకేసారు జంపు జిలానీలు! నీతిమంతులుండే
అదృష్టం ప్రధానంగానీ.. ఎత్తులూ.. జిత్తులూ ఎవరి ప్రారబ్దాన్ని ఎప్పుడాపగలిగాయి!
గెలుపుకి 'గుర్తు' కలసిరావడం లేదని కుములుకుంటోందిగాని..
జనంలో గుర్తింపు తగ్గిందని గుర్తుపట్టలేకపోతుందింకో మడమ తిప్పని పార్టీ! నేతల తలరాతలను తేల్చేది నిజానికి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ..
గుర్తులూ.. తాయెత్తులూ కానేకాదని ఎన్నేళ్ళు ఓడినా
మన ప్రజాప్రతినిధులకు జ్ఞానోదయం కావడంలేదు! ప్చ్! జనం దురదృష్టం!
రోజులూ అలాగే ఉంటున్నాయిలేండి! ఎన్నికల్లో విజయఢంకా మోగించినవాడు ప్రమాణ స్వీకారం రోజునే ప్రాణాలు పోగొట్టుకొంటుంటే..
యావజ్జీవం పడ్డవాడు దర్జాగా బైటకొచ్చేసి రాజకీయ వ్యాపారాల్లో మునిగి
తేలుతున్నాడు! రాసిపెట్టుంటే చర్లపల్లి జైల్లో ఉన్నా వేడివేడి
బిర్యాని పొట్లాలు వేళకు అందుతుంటాయి! సిమ్ కార్డు సరఫరాలు క్రమం తప్పకుండా సాగుతుంటాయి!
నూకలు చెల్లితే గోకుల్ చాటుకు పోయి మరీ ప్రాణాలు పోగొట్టుకోవడం మనమీ కళ్లతో ఎన్నేసి సార్లు
చూడ లేదూ!
దేవుడు దయతలచి 'పోనీలే పాపమ'ని 'ఉఁ' అన్నా.. పూజారిగారూ తలాడిస్తేనే ప్రసాదం ప్రాప్తించేది.
పూజారిగారి మనసు ముందు మనవైపు మళ్లడటమే ప్రస్తుతం అదృష్టాలలోకెల్లా పెద్ద
అదృష్టం! రాజకీయాలనుంచి.. రాసలీలలవరకు..
అన్నింటా పూజారులే రాజ్యమేలుతున్నారు ప్రస్తుతం. అది మన దురదృష్టం.
కాలం కలసిరాకపోతే
కోట్లుపోసి పెట్టిన వోక్సువేగను కారు ఫ్యాక్టరీకూడా చక్కా రెక్కలొచ్చినట్లు ఎక్కడికో
ఎగిరిపోవడం చూడ్డంలే! చేటుకాలం తోసుకొచ్చి 'జై'
కొట్టిన చేతులే పాతచెప్పులు విసరడం చూడ్డంలే! అదృష్టానికి
దురదృష్టానికీ మధ్య అడ్డుగీత సినిమా హీరోయిన వేసుకొనే పైటకన్నా పల్చన,
అదృష్టదేవతేమన్నా
మన గర్ల్ ఫ్రెండా! పిలిచీ పిలవంగానే 'హాయ్'
అంటూ వచ్చి వళ్లోవాలి 'హాయి'నిచ్చిపోడానికి! ఆడవారి మనసులు నిజంగా ఎంత చంచలమో తెలీదుగానీ..
అదృష్టదేవతదిమాత్రం కఛ్చితంగా మహా 'ఫికిల్ మైండ్'! అమ్మగారి చపలచిత్తానికి ఎన్ని వందల ఉదాహరణలైనా
ఆపకుండా చెప్పుకోవచ్చు!
సోనియాజీ ప్రధాని పదవికి ఎన్నుకునే సమయంలో మన్మోహన్ జీ కనీసం రాజ్యసభ సభ్యుడైనా కాదు! దేశానికి అమెరికావూడిగం చెయ్యాలని
రాసిపెట్టి ఉన్నప్పుడు సోనియాజీ ముసుగులోనైనా వచ్చి అలా ఆడించేస్తుంది
మరి అడృష్టదేవత!
'రాసిపెట్టి ఉన్నప్పుడు రాళ్లగుట్టకింద పడి ఉన్నానెత్తిమీదకి
రత్నాలకీరీటం తెచ్చిపెడుతుంద'న్న సిద్ధాంతం
మొన్నీమధ్యే చంద్రబాబన్నవిషయంలో రువువవలేదా! అదృష్టానికి సిద్ధాంతాలూ.. రాద్ధాంతాలూ
జాన్తా నై! జగన్ బాబుకా
సూత్రం వంటబట్టకే పద్దస్తమానం ఇంత మంట! 'రాజధాని ఆహ్వానపత్రం' ఇవ్వనే ఇవ్వద్దని.. ఇచ్చినా తాను చచ్చినా వచ్చేది లేద’ని మొండికేసి నవ్వులపాలయింది అదృష్ట దెవతతత్త్వం బొత్తిగా వంటబట్టించుకోక పోవడంవల్లే! దేనికోసమూ దేబిరించకుండా దేవుడు మనకిచ్చిన 'పాత్ర'ను వీలయినంత అద్భుతంగా నటించుకుంటూ పోతుండడమే విజ్ఞుడైనవాడు చేయదగ్గ పని. ఆ పాఠం ఇద్దరు చంద్రులను చూసైనా ఎప్పటికీ నేర్చుకోకపోతే ఎట్లా!
జీవితంపాత్రలో అదృష్టముండేది కింది సగంలో.
పైన సగం కృషి. రాజకీయాలవరకు దాని మరోపేరు నటన!
అదృష్టలక్ష్మి చెయ్యందుకోవాలంటే కృషి(అదేనండీ..
నటన)ని నమ్ముకోడం మినహా మరో దారి లేనే
లేదు
దుర్యోధనుడు
పాచికలాటలో పాండవులను ఓడించింది కేవలం అదృష్టం వల్లేననుకుంటే
పప్పులో చప్పున కాలేసినట్లే! శకుని 'పని'తనం వల్లే పాండవులమీదున్న కడుపుమంట చల్లబడిందన్న భారతసారం
తెలుసుకోకుంటే ఎవర్నిమాత్రం ఎవరు బాగుచెయ్యడం వల్లవుతుంది చెప్పండి! గురుత్వాకర్షణశక్తిని గుర్తుపట్టిన
రోజున న్యూటన్ ఆపిల్ చెట్టుకింద కూర్చోనుండడం కాకతాలీయం అయితే కావచ్చుకానీ
కచ్చితంగా అదృష్టంమాత్రం కాదు. అసలు అదృష్టం పండు కిందపడ్డం
ఛూసినప్పుడు న్యూటన్ బుర్రలో ‘బల్బు’ వెలగడం!
రాజకీయాల్లో పాలకుల
'బల్బు'లు ఎప్పుడు వెలుగుతాయో! ఎందుకు వెలుగుతాయో! దానిమీదే పాలితుల అదృష్ట దురదృష్టాలు ఆధారపడి ఉంటాయన్నది అసలు
సారాంశం.
సముద్రంమీద
లేచిన అల్పపీడనం వాయుగుండంగా మారి
ఏ దిశకు తిరగాలో ఏ సిద్ధాంత గ్రంథంచూసి నిర్ణయించుకుంటుంది! వాటాన్నిబట్టి జరిగే చర్యలకు ఏ యాగమూ.. యజ్ఞమూ దిశానిర్దేశాలు చెయ్యలేవు. అయినా యాగాలూ.. యజ్ఞాలూ.. ధూం ధాంగా చేయడం చంద్రుళ్లమార్కు రాజకీయం!
ఎవరి తలరాతలు
వారే స్వయంగా రాసుకొనేవన్న సత్యం సత్యంరామలింగరాజుగారివంటి వారి కొన్నికథలకే పరిమితం. ప్రజాస్వామ్యంలో జనం తలరాతలు రాసేది
ప్రజానేతలేననడంలో మరో మాట లేనే లేదు! సదరు నేతల తలలు ఎంతలా
పనిచేస్తున్నాయో దాన్ని బట్టే జనానీకం అదృష్టాలు..
దురదృష్టాలూను!
ఇప్పుడు మాత్రం
మన అదృష్టాలకేం తక్కువ.. చెప్పండంటారా! స్వైన్ ఫ్లూ వచ్చే
సీజన్లో సాధారణ ఫ్లూ వచ్చిపోవడం అదృష్టమే. వానలు కురవని రోజుల్లో
బ్యాంకురుణాలు దొరక్కపోవడం రైతన్నల అదృష్టమే. మాంద్యం ముదిరిన
రోజుల్లో ఉద్యోగాలూడకుండా వేళ్లడుతూనైనా ఉండటం కొంతమంది పాలిట అదృష్టం. ఫ్లాపు పిక్చరు తీసినా ఫస్టువీకులోనే ప్రపంచంలోని అన్ని థియేటర్లలో విడుదల
చేసేసి సాధ్యమైనంత రాబట్టుకోవడం
మెగా అదృష్టం. కందిపప్పుక్కరువున్నా కనీసం పెసరపపైనా
పిసరంత దొరుకుతుంది చూడండి! అదేమన్నా మామూలు
అదృష్టమా! ఆలస్యంగానైనా ఆడపిల్ల క్షేమంగా ఇల్లుచేరడం ఎంత పెద్ద
అదృష్టమో ఈ రోజుల్లో! ఏసిడ్ దాడులు పెరిగిన రోజుల్లో ఎవరూ మన
పిల్లల్ని ప్రేమిస్తున్నామని వెంటాడకపోవడాన్ని మించిన అదృష్టం కన్నవారికి మరేదైనా ఉంటుందా!
మన చేతుల్లో
లేని అదృష్టాన్ని గురించి వగచేకన్నా స్వల్ప అదృష్టాలని తలుచుకొని మురిసిపోయే మనసుండటం కన్నా మరేమి అదృష్టం లేనే
లేదు! ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు
(
05-10-2009 నాటి ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం)
No comments:
Post a Comment