Thursday, November 5, 2015

కాలం- కవిత



కాలం
ఎన్ని ఎక్స్  గాలాల ఎరో!
లైఫ్ మానిటర్ మీద
లైవ్ పిక్చర్సన్నీ

మన ఫింగర్ టిప్ కమాండ్స్ కే
కదులుతాయని ఇల్యూజన్
ప్రీప్రోగ్రామ్డ్ జీవితంలో
హెచ్ టి టి పీ 404 నాట్ ఫౌండ్’ ఎర్రర్!
సర్వర్లు డౌనైతే
సర్వమూ డౌనయే డింగరీలం
సృష్టి మొత్తంలో
సర్వోత్కృష్టమైన  స్పీసీసుమని
చంకలు బాదుకోటమెందుకో!
మేకతోకకుమేకా?
తోకమేకకుమేకా?
క్యా..క్యా..
క్వాంటమ్ థీరీనా
క్షీరనీరపు రాయంచా
ఏది తీర్చేదీ
కార్యకారణ శంక?
సైకోట్రానిక్స్ స్టాటి స్టిక్స్
ప్యరామీటర్స్ మాస్ ఫ్యాక్టర్స్
ఎట్సెట్రా ఎట్సెట్రా
కాలం పరమాత్మముందు
సర్వం సాష్టాంగప్రణామములాచరించు
రుషికోటి సముదాయములు మాత్రమేనా!
ఎనిమిదంకెను పడదోసి
ఇన్ ఫినిటీ అనుకోమంటం
వాల్యూ తెలీకుండా దాచేసి
ఆన్సర్ ఆప్షన్సులో
వెతుక్కోమంటం!
ఏ ఇన్విజిబుల్ మెజీషియన్ చేసే
లెక్కల ట్రిక్కో ఈ జీవితం!
బిల్లియన్ల ఫార్ములాలప్లై చేసినా
ఎవరూ  నాటౌట్ గా  మిగిలటం లేదిక్కడ!
వాటెబౌట్  మరి
ఎంపిరికల్ ఎటర్నీటీ?!
వట్టి తాపత్రయం మాత్రమేనా
సెంటెడ్ బాడీ లోపల్దంతా
మలమూత్రశ్వాదాదులేనా?
వాడూ..అదీ
మిన్నూ..  మట్టీ
అంతా
నిమిత్తమాత్రులమేనా?
విధి, దైవం,
నసీబ్, కిస్మత్,
ఫేట్, డెస్టిట్యూట్
వుయారాల్ లైక్ డైసెస్
త్రోన్ ఇన్ ది గేమాఫ్
వర్చ్యూస్ & వైసెస్?
గుడ్  హోపు
కూరలో పోపు
గ్యారీబాల్డు
గారెముక్క హోలు
హాయ్ బాయ్’ లు
హలో’ బోలోలు
అసతోమా సద్గమయా
ఆ సమయం వస్తే
అయ్యో.. అంతా
యా మా సా మాయా’  యేనా?
బిగ్ బ్యాంగ్  చిద్రం
పికాసో గిలికిన  చిత్రం
అయ్యో..ఇదా జీవితం!
అంతర్ వ్య క్తికి
అంతరాంతర శక్తికి
అనునిత్యం జరిగే
అంతులేని పోరాటం
మనిషికోర్సుకి ఔటాఫ్ సిలబస్సా?
ది ఎలెవన్ కాజస్
ఫర్ ది డీజెనరేషన్ ఆఫ్
డివినిటీ’ని గూర్చి
లెక్చర్లు దంచే లార్డ్లూ గాడ్లూ
మరి గప్పా గిరీశాల గురువుల తంతేనా!
మనకు మనమే ప్రశ్నలం
ఎదుటి శాల్తీకెప్పుడూ ఎక్స్లమేషన్లం
ఫుల్ స్టాపా.. కామానా
ఏది ఎక్కడ పెట్టాలో
ఎప్పటికీ తేలని
కర్తెవరో తెలియని
క్రియాకర్మపదాల సముదాయాలమా?
ప్రశ్నాశ్చ్రర్యార్థకాల మధ్య
నిత్యం నలిగే అర్థానుస్వరాల
అంతరార్థాల అంతర్మథన
సాగరాలం మాత్రమేనా మనం?

కర్లపాలెం హనుమంతరావు
(సమయం:2, మార్చి, 2013 -రాత్రి-రెండగంటలు

Sunday, November 1, 2015

'కోడిపలావు కహానీ'- వాకిలి -లాఫింగ్ గ్యాస్- సరదా కథ



'గిన్నీసు రికార్డుకాదు.. ఇంట్లో గిన్నెలూ చెంబులూ బద్దలైపోతున్నాయేందే నీ దెబ్బకీ!'
'నా దెబ్బ కాదయ్యా మగడా! ధరల దెబ్బ! బోడి బీరకాయ కిలో యాభయ్యా! బీన్సు ఎనభయ్యాబీటురూటు ముప్పై.. బెండ ముప్పై రెండా! దొండ..'
'అబ్బబ్బ! ఆపవే బాబూ! ఆ ధరల దండకం!'
'లేకపోతే ఏందయ్యా! నువ్వేడనో కోడిని కొట్టుకొచ్చి పలావు చెయ్యమని నా పీకలమీద కూకున్నావు ! పుంజునంటే కొట్టుకొచ్చావుగానీ.. పలావులోకి దినుసులు నేనే కొట్టుకాడ కొట్టుకురావాలి మావా!'
'కొట్టుకు రావడమేంటే.. కొత్తగా మాట్లాడుతుండావ్నెలమొదట్లో జీతం మొత్తం కుడుముల్లా నీ చేతిల్లోనే పోసాను గందే! అదంతా మార్నింగుషోలకే మటా!'
'ఆ తమాషా ఒక్కటే తక్కువ నా బతుక్కి! నా బతుకే ఓ టీవీ సీరియల్లు మాదిరిగా అయిపాయినాది! అసలు పలావు కావాలంటే ఏమేం కావాలో తెలుసా మావా నీకూ!'
'ఆ మాత్రం తెలీకపోవడానికి నేనేమన్నా అదేందో.. సివిల్ ఎజ్జామిషనా.. ఏందో.. దానిక్కూకునే కుర్రాడినా! నూనె.. పసుపు.. కారం.. ఉప్పు.. కొబ్బరి.. మసాలా దినుసులు.. టమాటోలో, బీన్నీసులో, ఆలుగడ్డలో నాలుగు తగలనిస్తే ఆ మజానే వేరే మరదలా!'
'వంటనూనె బొట్టు ఎట్టా మండిపోతా వుందో తెలుసా మావా నీకు! పండక్కి గడపకి పసుపు రాయడమట్టా ఉంచు! మెళ్లో తాడుకింత పులుముకుందామనుకున్నా చిటికడంతకూడా   కొనే సతువలేక చేతులు ముడుచుక్కూకున్నానిక్కడ! నువ్విప్పుడొచ్చి కోడిపలావు సెయ్యమని మారాం సేస్తా ఉండావు!'
'పసుపు లేకపోతే మానె.. పోనీ ఉప్పూ కారమన్నా పోసి వండరాదే!'
'సడిపాయ! ఉప్పు సంగతే సెప్పు ఇంగ! కల్లు, సారా అంటే ఏరులై పారతా ఉందిగానీ.. కల్లుప్పు.. తాగేనీళ్లల్లో తప్ప కలికానిక్కూడా కనిపించడం లేదయ్యా మగడా! రాతి ఉప్పుకూడా  పాతిక పెడితేగానీ కిలో చేటలో పడ్డం లేదు. పలావుకు సరిపడా కొనాలంటే నీ జగన్ బాబులాగానో..  ఆ కెటీఆరుకు బాబులాగానో పుట్టాల మళ్ళీ!'
'ఈ మధ్య మరీ నీకు ఎటకారాలు ఎక్కువైపోయాయే! పోనీ వట్టి గొడ్డుకారమన్నా కూరి వండవే! నాలిక జివ్వ చచ్చిపోయుండది!'
'కారం.. కారం.. అంటూ పదిమార్లు ఊరికే అట్టా పలవరించమాక మావా! నా కళ్లంట నీళ్ళు గిర్రున తిరుగుతా ఉండాయి! కొట్లో కారం పొట్లాల రేట్లెట్లా  మండిపోతున్నాయో తెలిస్తే నివ్విట్లా కారంజపానికి తగులుకోవు! కూరగాయలెట్లాగూ కొనే సౌభాగ్గెం లేదు. కొరివికారమన్నా కలుపుకు తిందామంటే మళ్లా అది కొంటానికి   బ్యాంకుకాడికి లోనుకు పరిగెత్తాల!'
'ఆపూ! ఇంటున్నాను గందా అని.. .. వూరికే దంచేస్తన్నావు ఊకదంపుడు ఉపన్నేసాలు! పలావు ఎట్టా సేయాలో.. అందులోకి ఏమేం కావాలో.. ఆ సోదంతా నాకెందుకంట? కట్టుకున్నదానివి.. అడిగింది టక్కుమని చేసి పెట్టేయడం నీ డూటీ! ముందా పొయ్యి ఎలిగించూ!'
'ఏం పెట్టి ఎలిగించమంటావయ్యా పొయ్యీ? గేసు అయిపొయ్యి పదిరోజుల పైనయ్యింది. పోనులో పలకడు. పోయడిగినా ఉలకడు.. ఆ గేసుబండ బండమడిసి. రేపో ఎల్లుండో రేట్లు పెంచుతారంటగా! అప్పటిదాకా .. నో స్టాకు.. నాటకాలంట!'
'ఆహాఁ! గేసు లేకపోతే పొయ్యే ఎలగదా ఏంటే సోద్దెం! కట్టెపేళ్లతో కుస్తీ పట్టిన రోజులు అప్పుడే మర్చిపోతే ఎట్లానే బాలాసుకుమారీ! గేసుమాటలు మానేసి ముందా పలావు సంగతి సూస్తావా లేదా!'
'సరేనయ్యా! పొయ్యిలోకి నా కాళ్లో చేతులో పెట్టి వండుతా గానీ.. ముందు నువ్వా పలావు దినుసుల సంగతి సూడరాదా! నిజం చెబితే నీకేదో.. గిట్టని పత్రికల్లో రాసే కట్టుకతల్లాగుంటాయిగానీ.. ఇదిగో సంచీ! నువ్వే అట్టా బజారుమీద్దాగా పోయి నాలుగు రకాల కూరగాయలు కొనుక్కురా! ఒక్క కోడిపలావేం కర్మ.. కోడికూర.. గరమా గరమ్  కోడి పులుసు.. కోడిగారెలుకూడా కోరినన్ని చేసిపెట్టడానికి నేను రడీ!'
'ఎట్టాగైనా మాటల్లో నువ్వు మన సర్కారోళ్లను మించిపొయ్యావే ఈ మద్ద మరీనూ! నీ కబుర్లతో కడుపు నింపేసినావు! తెల్లారిపోయినట్లుంది. అదిగో! అప్పుడే కోడికూడా కూస్తావుంది!'
'అది కోడికూతేగానీ.. కోడి కూసింది కాదు మావా! మన సిన్నోడిని గోడవతల కూకోని అట్టా కుయ్యమని నేనే సెప్పినా! నువ్వు కోడిపలావో అని కలవరిస్తుండావు గందా పాపం పండగ వచ్చినకాణ్ణుంచీ! ఇదిగో.. ఆ కోడికూతలు ఇనుకుంటా ఆ జావనీళ్ళు తాగతా ఉండు! కోడిపలావేం కర్మ! పేద్దవొటేల్లో చికెన్ బిర్యానీ మింగేకన్నా మజాగా ఉంటాది!'
'మరి నేను కొట్టుకొచ్చిన కోడిపుంజే భామా!'
'వదిలేసినాను మావా! మన సర్కారోళ్ల పున్నెమా అని దాన్నైనా నాలుగునాళ్లు పేనాలతో  హాయిగా బతకనీయరాదా! మనబతుకులు ఎట్టాగూ ఇట్టా ఏడుస్తానే ఉంటాయి పద్దస్తమానం'


http://vaakili.com/patrika/?p=9321

ఈ నెల(నవంబరు 2015) వాకిలి అంతర్జాల పత్రికలోని 'లాఫింగ్ గ్యాస్' కాలమ్ కథ 
'కోడిపలావు కహానీ'
-కర్లపాలెం హనుమంతరావు


Saturday, October 31, 2015

ఇందిరమ్మ మరణించి ఇవాళ్టికి ఇరవయ్యారేళ్ళు!(2010 నాటి నా వ్యాసం)


రాజకీయ కుటుంబంలో పుట్టటం వరం. చిన్ననాటే తల్లితండ్రుల పూర్తి ప్రేమకు నోచుకోక పోవటం దురదృష్టం. తల్లి అంత ఆరోగ్యవంతురాలు కాదు. తండ్రి నిత్యం స్వాతంత్ర్య పోరాటంలో క్షణం తీరకలేకుండా గడిపే మనిషి.  ఇంటినిండా బంధు బలగం, నౌకర్లు చాకర్లు దండిగా ఉన్నా మానసికంగా వంటరిబాల్యాన్ని గడిపిన ఇందిరా ప్రియదర్శిని సహజంగా బిడియస్తురాలుగానే ఎదిగినా, అంతులేని ఐశ్వర్య భోగాలమధ్య పెరిగిన కారణంగా ఒక రకమయిన మంకుపట్టు మనస్తత్వంకూడా  పెంపొందిచుకుంది అంటారు. ఇందిర జీవితమంతా ఇలా వైవిధ్యాల మధ్య సాగటమే ఒక విచిత్రం.
తండ్రి అడుగుజాడలలో తీర్చిదిద్దబడిన మహిళ ఆమె. అనుకోకుండా అవకాశాలు వచ్చాయా.. వచ్చిన అవకాశాలని తెలివిగా వడిసిపట్టుకుని ముందుకు సాగిందా.. అనే ప్రశ్న వేసుకుంటే ఈ తొలి మహిళాప్రధాని విషయంలో రెండూ సరిసమానంగానే సాగుతూ వచ్చాయనిపిస్తుంది. తొలినాళ్ళలో తండ్రి ప్రభావం బాగా   పనిచేసినా, పోను పోను  తనే చొరవగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ప్రపంచలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా పేరు గడించిన  మనదేశ ప్రధానిపీఠాన్నిఅధిష్ఠంచిందామె. పట్టుమని ఐదేళ్ళు గట్టిగా కుర్చోవటమే గగనమయిన ఆ అత్యున్నత సింహాసంనంమీద దాదాపు పదహారేళ్ళపాటు అంత గట్టిపట్టు బిగించటం అందరికీ పట్టుబడే విద్య కాదు.  సిగ్గరి అని తీసిపారేసిన ఆ వనిత వెనుక ఎంత చాణుక్యతనముందో తరువాత జరిగిన పరిణామాలే తెలియ చేస్తాయి.  దృఢమయిన ఆత్మవిశ్వాసం, తనమాట మాత్రమే చెల్లాలనే మనస్తత్వం, సంక్లిష్ట పరిస్థితుల్లోసైతం చెక్కు చెదరని గుండెధర్యం, సాహసాలకు వెరవని గుణం చాలాసార్లు కలిసివచ్చినా.. అన్నేసార్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. మరణించి పాతికేళ్ళు గడిచిపోయినా అంతర్జాతీయ స్థాయిలో  ఇప్పటికీ ఆమె అలీనవిధానాలు, జాతీయస్థాయిలో పేదప్రజల గుండెల్లో ఒక అమ్మగా నిలబడిపోయిన వైనం  వెనక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడినట్లు కలసివచ్చిన కాలం పాత్రకంటే, కలిసిరాని వేళా వెనుకంజ వేయని ఆమె దృఢ  మనస్తత్వమే ప్రధానకారణమని  కరాఖండిగా చెప్పుకోవచ్చు.
ఆరుగురు రాష్ట్రపతుల దగ్గర పనిచేసారమె. ప్రధానమంత్రి కాకమునుపు ఆర్ధిక, విదేశ, సమాచార శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారు. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం దరిమిలా  అప్పటి  కాంగ్రెస్ పార్టీ ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండానే ప్రధానిపీఠం అధిష్ఠించారు. ఇది కలిసివచ్చిన సంఘటన. కాగా తరువాత ఏడాదికే వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో బొటాబొటి మెజారిటీతో విజయం సాధించటంతో పార్టీ ప్రక్షాళనకు పూనుకుంటేకానీ తన భవితకు భద్రత ఏర్పడదని గ్రహించారు. ముందు నుంచి తనకు వ్యతిరేకం గా ఉన్న వృద్ధనాయకులు తన ప్రధానిపదవికి ముప్పుగా పరిణమించే పరిణామాన్నిసరిగ్గా  అంచనా వేయగలిగారు.  ఇంటా బయటా తిరుగులేని నాయకురాలిలాగా ఎదగాలంటే  ముందు జనస్వామ్యానికి దగ్గరవాలని గ్రహించారు. సామ్యవాద పద్ధతులలోతప్ప ముందుకు సాగే మరోదారి లేదని సరయిన సమయంలోనే గ్రహించి తదనుగుణంగా ప్రభుత్వపథకాలను ప్రవేశపెట్టి దృఢచిత్తంతో ఆచరణలో పెట్టటంతో ఇందిరా గాంధీ ఈ దేశంలో బడుగుజీవి మొర ఆలకించే ఇందిరమ్మగా రూపాంతరం చెందటానికి తొలిఅడుగు పడినట్లయింది. జకీర్ హుస్సేన్ మరణానంతరం రాష్ట్రపతి పదవికోసం జరిగిన ఎన్నికలలో తనే ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడిన వి వి గిరికి అనుకూలంగా అంతరాత్మ ప్రభోధమనే కొత్తనినాదం లేవదీయటంద్వారా గెలిపించి, క్రమశిక్షణా చర్యలకింద తనపార్టీ ప్రాధమికసభ్యత్వాన్నికూడా రద్దుచేయటానికి తెగబడ్డ  వృద్ధనాయకులని అభివృద్ధి నిరోధకులని ముద్రవేయించి, చివరికి పార్లమెంటరీ పార్టీ విశ్వాసాన్ని తనవైపుకే మళ్ళించుకోవటంలో కృతకృత్యురాలవటంలోనే ఇందిర సాహసం, భవిషత్ దర్శనాచాతుర్యంఅధికారంమీద అంతులేని  వ్యామోహం బయట పడుతున్నాయి. తన ప్రధానిపదవి పటిష్టతకోసం పార్టీని చీల్చటానికికూడా వెనుదీయని ఆ మనస్తత్వమే తరువాత తన అధికార పీఠంమీది అర్హతను అలహాబాద్ న్యాయస్థానం చెల్లదని కొట్టిపారేసినప్పుడు ఆ పదవిని  కాపాడుకోనేటందుకు అత్యవసర పరిస్థితి అనే వంకతో ఎమర్జన్సీ చీకటిరోజులకు తొలిసారి తెర తీసినప్పుడు కూడా బయటపెట్టుకున్నారు.  1971 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన ఆమె ఇందిరాకాంగ్రెస్ పార్టీనే 1977 ఎన్నికలలో మట్టికరిచింది. ఆమె తన స్వంత నియోజకవర్గమయిన రాయ్ బరెల్లిలోకూడా ఓడిపోయారు. గెలుపుని నిలుపుకోవటం, ఓటమిని గెలుపుగా మలుచుకోవటంలో ఇందిరాగాంధీ కున్నప్రజ్ఞాపాటవం అంతర్జాతీయంగా చూసుకున్నా నాయకులలో అరుదుగా వుండే లక్షణం. ఇందిర హయాంలో జరిగిన భారత్- పాకిస్తాన్ యుద్ధమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఆమె నేతృత్వంలో జరిగిన ఆ యుద్ధం లో అఖండ విజయం సిద్ధించటం,  బంగ్లాదేస్ ఆవిర్భావించటం ఆమెను ప్రపంచ స్థాయిలోకూడా ఒక తిరుగులేని నేతగా నిలబెట్టాయి. యుద్ధ కారణంగా లక్షలాదిమంది తూర్పుపాకిస్తాను నుంచి తమదేశానికి శరణార్ధులుగా తరలివస్తుంటే, వారికోసం తాను యుద్దానికి దిగటం తప్పెలా అవుతుందో చెప్పాలని అప్పటి  అమెరికా అధ్యక్షుడు నిక్సన్ మహాశయుడంతటి  వాడిని  నిలదీయటంలాంటి విన్యాసాలుచేసి ప్రపంచవ్యాప్తంగా కూడా తనకో వీరమాత ఇమేజినిదేశీయంగా ఒక కాళిక అవతారాన్ని  సృస్టించుకున్న ఘనత ఆమెది.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిందనీ, ప్రజల ప్రాధమిక హక్కులనుసైతం లెక్కచేయని అప్రజాస్వామ్యవాదనీ, పదవికోసం  విలువలనుకూడా పట్టించుకోని అనైతికనేత అనీ, రాజ్యాంగసవరణలద్వారా అంతులేని అధికారాలను సొంతంచేసుకునే నియంతమనస్తత్వంకల నాయకురాలని, వారసత్వ అర్హతతో గద్దెనెక్కిన ఆమె తన చిన్న కొడుకు సంజయ్ గాంధీకూడా  తనతదనంతరం  అధికారం చెలాయించాలని తపనపడిన తల్లి అనీ.. ఇలా తనమీద  ఎంతలా  విమర్శల జడివాన  కురిసినా  జడవని ఆ  మనస్తత్వంవల్లే   తదనంతర దేశరాజకీయాలలో తరుగుతూ వచ్చిన నైతికవిలువలకు మూలపుటమ్మగా ఆమె  నిలచిపోయిందన్న మాటా   నిజమే.
అత్యవసర పరిస్థితి అక్రమాలపై విచారించటానికి జనతాప్రభుత్వం ఏర్పాటుచేసిన సంఘంముందు నిలబడటానికి నిరాకరించిన ఆమె, అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్టుచేసిన సందర్భంలో  బెయిలు తీసుకోవటానికికూడా నిరాకరించారు. తద్వారా తనో ప్రజాసంక్షేమంకోసం ప్రాణాలనుసైతం ఫణంగాపెట్టే  వీరవనితగా అవతారమెత్తటమే లక్ష్యం. ఇవాళ ఏదయినా నేరంచేసోఅవినీతికి పాల్పడో చెరసాలకెళ్ళే నాయకులు   ఏదో ఘనకార్యం చేసినట్లు రెండువేళ్ళు గాలిలోకి ఆడించటమో, రెండుచేతులూ ఎత్తి నమస్కారం చేసుకుంటూ చిరునవ్వుతో దండలు వేయించుకుంటూ ముందుకు సాగుతూవుండే దృశ్యానికి తొలిషాట్ ఆ రోజుల్లో అమ్మగారినుంచే మొదలయిందని అనుకోవాలి.
గాంధీజీ,  నెహ్రూజీలమీదున్న జనాభిమానానికి ఒక స్వాతంత్ర్యపోరాట నేపథ్యం ఉంది. ఏ పోరాటంతో సంబధం లేకుండానే ఇంతగా జనంమెప్పు ఒకరాజకీయనేత పొందట మనేది  ఇందిరాగాంధీతోనే  భారతరాజకీయాలలో మొదలయిందనికూడా చెప్పుకోవాలి.
మంచిచెడ్డలను  అవతల పెడితే ఎవరు వద్దన్నా కావాలన్నా ఇందిరమ్మ రాజకీయాలు ఇన్ని దశాబ్దాలు  గడిచినా ఇంకా జనజీవితాలను పెద్దఎత్తున   ప్రభావితం చేస్తూనే వున్నాయన్న మాట మాత్రం  ఒప్పుకుతీరాల్సిందే. నెహ్రూగారి వారసురాలిగా తెరమీద కొచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సాధించుకోవటమేకాక తన తదనంతరంకూడా తనకుటుంబంలోని  వారికే అదికారపీఠం దక్కితీరాలని  తపించిందామె. వారసత్వ రాజకీయాలకు  ఒక మహావృక్షం మాదిరి వేళ్ళూనటానికీ ఆమే కారణం .
ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అమృత్ సర్ బంగారు దేవాలయంమీద ఆమె జరిపించిన దాడికి నిరసనగా స్వంత అంగరక్షకులే జరిపిన తుపాకీకాల్పులలో ఆమె ప్రాణాలు పోగొట్టుకొని ఈ వ్యాసం రాసే అక్టోబర్ 31కి 26 సంవత్సరాలు నిండుతున్నాయి. మహాత్మాగాంధీజీ  గాడ్సేగోలీకి ప్రాణాలు ఒడ్డిన సంఘటనతో ఇందిరాజీ హత్యను సరిపోల్చుకున్న దేశప్రజలు సహజంగానే ఆమెకుటుంబాన్ని దేశంకోసం సర్వస్వాన్ని త్యాగంచేస్తూ వస్తున్న త్యాగమూర్తుల కుటుంబంగా గౌరవిస్తూవస్తున్నారు. ఆమెకుటుంబంలోని యువనేత అత్యున్నత ప్రధానిపీఠాన్ని  అధిరోహించేందుకు తర్ఫీదుపేరుతో దేశాటనలు  చేస్తున్నసమయంలో- రాముడు  వనవాసంనుంచి తిరిగి వచ్చినదాకా ఆయన పాదుకలతో భరతుడు పాలన సాగించిన చందంగా మన్ మోహన్ సింగ్ వంటి వీరవిధేయుడు (ఆమె కుటుంబంలోని మరో సభ్యురాలి పర్యవేక్షణలోనే)  పాలన సాగిస్తూ రావటందానికి   దేశ  ప్రజలనుంచి అనుకొనంత అభ్యంతరాలు లేకపోవటం.. మొత్తంగా చూసుకుంటే  ప్రపంచలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంలోని  ప్రజలను తాను  కోరుకున్నరీతిలోనే  వారసత్వరాజకీయాలకు  అనుకూలంగా మలుచుకోవటంలో ఆమె నూటికి నూరు పాళ్ళు విజయం సాధించిందనే చెప్పితీరాలి.   ప్రజాస్వామ్యవాదులకు  ఇది బాధ కలిగించే విషయమే! అయినా  కుటుంబ పాలన కోసం పరితపించే వారందరూ ఆమె చిత్రం నట్టింట్లోపెట్టి పూజించుకోవచ్చు. అలాగే పూజించుకుంటున్నారుకూడా!  ఈ ఒక్కరోజు 'శక్తిస్థల్'లో  బారులుతీరి  నివాళులర్పించే నేతల చేతలకన్నా.. ఆమె పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్న నేతల చర్యలను గమనించే వారికి   ప్రతిరోజూ  ఆమె  గుర్తుకు రాకమానరు.

అంత తేలికగా మర్చి పోయే వ్యక్తిత్వం కూడా కాదు లేట్ ఇందిరా గాంధీజీది. 
-కర్లపాలెం హనుమంతరావు
     

Monday, October 26, 2015

అమ్మ మాట మరవద్దు ! నాన్న బాట వదలవద్దు !!- ఒక వ్యాసం


"In close-up it is pathetic though  in long-shot it is cheerful: that is life:"

ఈ చార్లీచాప్లిన్ కోట్ ని  భావం చెడకుండా చక్కటి తెలుగులో చెప్పటం సాధ్యమా?
Close-up కి తెలుగులో సమానార్ధకం ఏమిటి ? long-shot ని దీర్ఘదృశ్యం అంటే మనకే నవ్వు వస్తుందా రాదా!  కొన్ని పదాలను ఒకభాషనుంచి మరోభాషలోకి తర్జుమా చేయవలసివచ్చినప్పుడు మక్కీకి మక్కి దింపాలనుకుంటే..  ఇదిగో.. ఇలాంటి హాస్యమే పుడుతుంటుంది. కావాలని ఇలాంటి కొన్ని పదాల అనువాదాలను ఎత్తిచూపి...ఇదిగో  మన భాషలోవ్యవహారమంటే  ఇలాగే వుంటుంది- అని  మన భాషను  వెటకారం  చేసే వారు చాలామంది మనలోనే  తయారవుతున్నారు. మన అమ్మపలుకును మనం చులకన  చేసుకునేటందుకు తప్ప దీనివల్ల సిద్ధించే ప్రయోజనం వేరే ఏముంటుంది! ఓహో!.. మన భాషాపాటవం ఇంత ‘బ్రహ్మాండం ‘ గా  వుంటుందన్నమాట - అని  మన పిల్లలే తమ తల్లిభాషను  తేలిక చేసేందుకు తప్ప ఎందకూ పనికి రాదు. ఎదిగే పిల్లలకి అది ఎంత చేటు చేస్తుందో మనం పెద్దలం  తెలుసుకోలేకుండా వున్నాం!
ఎంత ప్రేమగా ఉన్నా కన్నతల్లి కన్నా ఎవరూ మనల్ని ఎక్కువగా ప్రేమించ లేనట్లే .. ఎంత గొప్పభాషయినా  మన మాతృభాష కన్నామనకు ఎక్కువ కాబోదు.  పుట్టీ  పుట్టగానే ముందుగా మన కంట బడేది మనకు తన పేగునూ.. రక్తాన్నీ పంచి ఇచ్చిన తల్లి. అట్లే వూంగాలు కొట్టేటప్పుడు మనచెవినబడిన  మొదటి పలుకులే మన అసలయిన సొంత  భాష. ఏ భాషలో ఏడిస్తే మనబాధ  అమ్మకి  అర్థమవుతుందీ., ఏ భాషలో నవ్వితే నాన్న మనల్ని చూసి  మురిసి ముక్కలవుతాడో..   ఏ భాషలో కొట్లాడితేతప్ప  తోటిపిల్లలతో మనం నెగ్గుకురాలేమో, మన అన్నతమ్ములు  అక్కచెల్లెళ్ళు మనల్ని ఏ భాషలో ఆత్మీయంగా పిలిస్తే మనకు ప్రేమ పొంగి పొరలిపోతుందో... అదే గదా మన అసలయిన జీవభాష! జీవభాష అంటే ఒక్క  జీవమున్న భాష అనే కాదు.. జీవితాన్ని రుచి చూపించేదికూడా అని అర్థం.
భాషను   గురించి జరిగే చర్చలో ఈ   సెంటిమెంట్ గోలేమిటి అనుకుంటున్నారా! అవును. భాష  అంటే  ఒక సెంటిమెంటేగదా! కనకనే భాషా విషయకంగా మనం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి మరీ సాధించుకున్నాం. భాషాప్రాతిపదికమీద  ఇన్ని ప్రత్యేక  రాష్ట్రాలు పుట్టుకొచ్చి  దశాబ్దాలు దాటిపోతున్నా దేశంలో ఇంకా మరిన్ని  ప్రత్యేక ప్రతిపత్తుల  కోసం  చిచ్చులు రేగుతున్నాయి. ఒకభాష మాట్లాడేవారంతా ఒకగొడుగు కిందకు రావాలన్న విధానం వెనుక ప్రధానంగా పనిచేసే సూత్రం సెంటిమెంటు కాక మరేమిటి! ఇక్కడంటే చుట్టూ ఉన్నది మనభాష మాట్లాడే మనుషులే కనక దాని  ప్రాధాన్యత అంతగా పట్టకపోవచ్చు కాని.. ఒక్క సారి ఏ పక్కరాష్ట్రానికో.. పరాయి దేశానికో వెళ్లి నాలుగు రోజులు వంటరిగా వుంటే తెలిసి వస్తుంది... నాలిక మన రుచులను కోరుకున్నట్లే.. చెవికూడా మనభాష  వినటానికి ఎంతగా తహతహలాడి పోతుందో!
ఈస్ట్ ఇండియా   కంపెనీ వాడు వ్యాపారం కోసమే ప్రపంచదేశాల మీదకొచ్చిపడ్డా, అది చివరికి ఒక  దేశ సార్వభౌమత్వానికి దారితీసిన పరిస్థితులకు  ప్రేరకం మాత్రం వారి మాతృభాషయిన ఇంగ్లీషుపైన వారికున్న అంతులేని ప్రేమే నంటే కాదనే వారుంటారా!  ఇంగ్లీషువాడు తన 'జాక్'జెండా సూర్యుడస్తమించనిసామ్రాజ్యంలో  నిరాటంకంగా రెపరెపలాడేందుకు ఎంచుకున్న మార్గాలలో  మాతృభాష  ఇంగ్లీషు పైనున్న ప్రేమ కూడా ఒక ప్రధానమయిన కారణమే! 
భాష అంటే ఒక్క పదాల కూర్పే కాదు. అది ఒకజాతి సంస్కృతిని చాటిచెప్పే మాధ్యమంకూడా . ఈ విషయం అంత బాగా ఆకళింపు చేసుకున్నాడు  కనకనే మెకాలే మహాశయుడు వారి  ఆంగ్ల భాష వ్యాప్తికోసం అంతగా అరాటపడింది. ఇంగ్లీషు వాడు రాజ్యంచేసే కాలంలో ఇంగ్లీషుచదువులు చదువుకుంటేనేకానీ పొట్టకూటికి కొలువు దొరకని పరిస్థితులు వుండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో ఇడుములు పడి తెల్లవాడిని తరిమికొట్టి సొంతరాజ్యాన్ని స్థాపించుకున్నామని చంకలు గుద్దుకుంటున్న మనం ఇవాల్టికీ  రాచకొలువులకోసమే కాక భేషజం కోసం కూడా ఆ  పాతదొరల భాషచూరును  పట్టుకు వేలాడుతున్నామంటే ఏమని అర్ధంచేసుకోవాలి!  మనం దేనిలో స్వాతంత్ర్యం సాధించినట్లు! ‘సరే.. ఇదంతా గతం సుమా!ఇప్పుడనుకొని ఏమి లాభం? ఎలాగూ ఇంగ్లీష అంతర్జాతీయ భాషగా మారికూర్చుంది. ఆ భాష పట్టుబడితేతప్ప రోజు గడవని పరిస్థితులు నిజంగానే దాపురించాయి. ఏవో ఆదర్శాలకుపోయి ఒక్కతెలుగే నేర్పించి మా పిల్లకాయల భవిష్యత్తును  బుగ్గిపాలు చేయమంటారా?’ అంటూ మారుమూల పల్లెల్లోని తల్లితండ్రులుసైతం దండెత్తివచ్చే పరిస్థితులు దాపురించాయంటారా! అదే మరి మన బాధకు ఇక్కడ ప్రధాన కారణం.
నిజమే! ఎవరు మాత్రం చూస్తూచూస్తూ తమ బిడ్డలు  తోటివారికన్నా చదువు సాముల్లో వెనకబడటాన్ని సహిస్తారు!  కొలువులేరాని చదువులకు లక్షలు  లక్షలు పోసి చదివించేందుకు ఏ కన్నవారయినా  ఎందుకు ముందుకొస్తారు! ఒక వేళ ఎవరయినా  సొంతభాషమీద  మమకారమెక్కువై   'ఏదో  పిల్లవాడిని కనీసం ఓ  ఐదు తరగతుల వరకయినా తెలుగులోనే చదివిద్దాములే!' అని ఉత్సాహపడినా  ముందు పిల్లవాడే అందుకు ఎదురుతిరిగే పరిస్థితులు వచ్చిపడ్డాయి కదా!  ప్రాంతీయ భాష లోనే విద్యావిధానం కొనసాగాలని  ఏదో వుబుసుపోకకు  పుస్తకాల్లో రాసుకుంటే ఫరవాలేదు   కానీ... నిజంగానే కేవలం ఏ  తెలుగులోనో, ఉర్దూలోనో  పిల్లవాడి చదువు కొనసాగిస్తే  రేపు వాడు పెరిగి  పెద్దయిన తరువాత ‘ఎందుకయ్యా.. మమ్మల్నిలా ఎందుకూ  కొరగాని బడుద్దాయిల్లాగా తయారుచేసావ’ని  నిలదేస్తే?   సమాధానమేమని  చెప్పాలి? తల్లితండ్రులు నిలదీసి అడిగే ఈ ప్రశ్నకు నిజంగా బదులేమీ చెప్పలేని పరిస్థితుల్లోనే మనం ఉన్నాం.
అలాంటి పరిస్టితులు వచ్చిపడ్డాయనేగదా మన  ఈ బాధంతా! ఈ దుస్థితికి కారణం మనం పెద్దలం అవునా  కాదా అని ఇప్పటికయినా  మనల్ని మనం ప్రశ్నించుచుకోవా లనే ఈ తపనంతా.

మీ బిడ్డను ఇంగ్లీష్ చదువుకుని గొప్ప సాఫ్ట్ వేరో, వైద్యశిఖామణో కావద్దనికూడా  చెప్పబోవటం లేదు.  పసిపిల్లవాడిని మనమలా ఎప్పుడో చేయబోయే గొడ్డు చాకిరికి  మరీ  ముక్కుపచ్చలారని  వయసునుంచే ఆ ఇంగ్లీషుబడులనే  బందిలదొడ్లలో కట్టిపడేయాలా? మనం  అవసరానికిమించి ఈ భాషమీద వ్యామోహ    పడుతుండటం వాస్తవం కాదా!   అంతేసి  డబ్బుపోసి కేవలం ఇంగ్లీష్ మాత్రమే   బోధించే ఏ కార్పోరేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధపడ్డా  అక్కడ మనపిల్లవాడికి పాఠాలు నూరిపోసేది మన ఇంకో ఏ  తెలుగు పిల్లవాడే కదా! పొట్ట తిప్పలకోసం ఏదో నాలుగు ముక్కలు నోటకరుచుకుని  క్లాసురూంలో కక్కేవాడేకానీ... ఏ  ఇంగ్లాండు నుండో ఊడిపడ్డదొరైతే కాదుకదా!నిజంగానే వాడు ఏ ఇంగ్లాండునుండో, ఐర్లాండు నుండో , దిగొచ్చిన దొరే అయినా  మనవాడికి మరింత యాతన! దొరలయాసబాస విని వంటబట్టించుకొనే ..పాటి జ్ఞానం  పొద్దస్తమానం   ఇంటిభాషనవింటూ  ఎదిగిన బిడ్డకు అంత్య పసివయసులో సాధ్యమా! ఎప్పుడయినా ఎవరయినా  పసిబిడ్డ మనసునుంచి ఆలోచన చేసారా? చేస్తున్నారా?
తల్లిభాషలో చదివి అర్ధంచేసుకునేక్రమంలో, తిరిగి ప్రశ్నించి సమాధానం రాబట్టి జ్ఞానం వృద్ధి చేసుకునేబిడ్డ మేలా? అంతుబట్టని   పరాయిభాషలో బట్టీపడుతూ.. తెలీని విషయాలను ఎలా అడగాలో తెలియక..  గమ్మునూరుకొనుండి పోయే బిడ్డ మేలా?మనభాషలో తగినంత సమాచారం లేదు. విజ్ఞానతృష్ణగల బాలుడు తప్పని సరిగా ఆంగ్లభాష అభ్యసించక తప్పదు'  అనే   వాదన ఒకప్పుడయితే చెల్లిందేమో!   సాంకేతికంగా రోజుకో కొత్తసౌలభ్యం  ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో ఈ వాదనకు బలం లేదు.  పరిసరాలనుచూసి నేర్చుకునే పసివాడికి ఇంటి వాతావరణం.. బడివాతావరణం  వేరువేరుగా ఉంటే వాటిని సమన్వయించుకొనే శక్తిచాలక  మానసికంగా ఎంతల్పా నలిగిపోతాడో,,  పిల్లవాడి సహజపరిణామానికి  అది ఎంత   అవరోధంగా మారుతుందో   మానసికశాస్త్రవేత్తలు విశదీకరిస్తున్నారు. వాటినీ  పెడచెవిన పెడితే చివరికి చెదిరేది మన కలలపంటలే!   కంప్యూటర్ కోర్స్ లు  చేసినవాడికి   లక్షల్లో జీతాలువచ్చే ఉద్యోగాలు ఉన్నాయని మనపిల్లవాడిని పసిమొగ్గ దశలోనే  పునాదిచదువుల పేరుతో భారీరుసుములు  వసూలుచేసే పటాటోపపు పాఠశాలలలో అష్టకష్టాలుకోర్చి చేర్చినా   లాభపడేది ఎవరు?    కార్పోరేట్, కాన్సెప్టుస్కూళ్ళవ్టంటి గంభీరమయిన  పేర్లుపెట్టేసి  బళ్ళను చింతపండు కొట్లమాదిరి నడిపే విద్యావ్యాపారులే! నష్టపోయేది మాత్రం మనం, మనపిల్లలే!  పిల్లవాడు పెరిగి  పెద్దయిన తరువాత ఏ ఇంజిననీరో, డాక్టరో అయి మంచిపేరు, మస్తుడబ్బు  సంపాదించాలనుకుంటే   మనం  ముందుగా చేయవలసింది.. పిల్లవాడిని సహజవాతావరణంలో చురుకుగా  ఎదగనీయటమే! సహజ పరిసరాలలో  జ్ఞాన సంపాదనచేసే అవకాశాలు  కల్పించటమే!
కాలం మనం ఊహించలేనంత వేగంగా మారిపోతున్నది. సాంకేతికంగా మనిషి పురోభివృద్ధి   సాధిస్తున్నకొద్దీ  ప్రపంచం క్షణక్షణానికీ చిన్నదయిపోతున్నది. ఒక భాషనుంచి మరోభాషలోకి సమాచారం తర్జుమా కావటం  క్షణాలలో జరిగిపోయే  సాంకేతిక  ప్రక్రియ మెరుగవుతున్న కాలం ఇది. నాసానుంచి  గాలిలోకి ఎగిరిన ఒక అంతరిక్షనౌక మరునిమిషంలో  కూలిపోతే..   లోపమేమిటో  రెండుక్లో నిమిషాలలోపే మాస్కోలోని   అంతరిక్షకేంద్రం విశ్లేషణచేసి మరీ  ప్రపంచానికి చాటుతున్నంత సాంకేతికాభివృద్ధి శరవేగంతో సాగుతున్న   సూపర్ యుగం లో వున్నాం మనం. ఒక దేశం మరోదేశ ప్రాచీన నాగరికత సంస్కృతులనుంచి విజ్ఞానాన్ని  అందిపుచ్చుకుని ముందుకు దూసుకు పోయేందుకు పోటీలుపడుతున్న దశ ఇది. మనవేపాకు, మన యోగా, మన సామాజిక కుటుంబవ్యవస్థ పటిష్టతపైన ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నసందర్భంలో మనం మన ప్రాచీనసంస్కృతి విశిష్టతని  పట్టించుకోకుండా పరాయిదేశాలు  వాటిఅవసరాలకక్ను అనుగుణంగా ఏర్పాటుచేసుకున్న కట్టుబాట్లను, కట్టుబట్టలను, సంఘవ్యవస్థను గుడ్డివ్యామోహంతో అనుకరించటం మన వెన్నెముక లేనితనాన్ని, లేకితనాన్నిబట్టబయలుచేయటం లేదూ!   నాలుగు డాలర్లు ఎక్కువ వస్తాయన్న అశతో  పుట్టీపుట్టకముందే బిడ్డడ్ని  ఏ కాన్వెంటు గొడ్లసావిట్లోకో 
తోలేద్దామన్న తల్లిదండ్రుల తొందరపాటును మాత్రమే   ఇక్కడ తప్పు పడుతున్నది. . 'అమ్మ' అనే  పిలుపులోని కమ్మదనాన్ని కాదని పూర్తి అర్ధమైనా  తెలుసుకోకుండా మనబిడ్డనోటితోనే మనల్ని మనం 'మమ్మీ'లుగా మలిచుకొని మురుసుకొంటున్నాం.    ఆ వెర్రివ్యా మోహమే  'వద్ద'ని  మొత్తుకొనేది. మనబిడ్డ 'డాడీ!'  అని పిలిచినంత మాత్రానే  మనం  బిల్ గేట్స్ తండ్రిగా మారిపోగలమా! మన ఇంటిదీపం ఒక వివేకానందుడో, నోబెల్ గ్రహీత  రవీంద్ర కవీంద్రుడో, అగణి గణిత ప్రతిభావంతుడు   సర్ సివి రామనోఆర్ధికశాస్త్రంలో ప్రపంచానికే పాఠాలు చెపుతున్న అమర్త్య సేనో, చలన చిత్ర సంచలన దర్శకుడు సత్యజిత్ రేనో, ఇటీవలే ఆస్కార్ అవార్డ్ కొట్టుకొచ్చ్చిన ఏఆర్ రెహమానో,  చదరంగ విశ్వరాజు విశ్వనాథ్ ఆనందో,  సాఫ్టువేరు  దిగ్గజం సత్య నాదేళ్లో, గూగుల్ గురూజీ సుందర్ పిచయో, ప్రపంచ  ధనవంతుల జాబితాలో నిత్యం కనిపించే లక్ష్మీ మిట్టలో కావాలని కోరుకోవాలి. కానీ  దానికోసం చిన్నతనంనుంచే  స్వీయసంస్కృతికి దూరంగా మనబిడ్డ బంగారుబాల్యాన్ని పరాయిపంచల పాల్చేయడం పరమ కిరాతకమనే ఇక్కడ చెప్పదలుచుకున్నది.   
అమ్మమాటే వెగటుగా   భావించే  వాతావరణంలో పసిమనసు  ఎదగటం  మనకంటి దీపానికే నష్టదాయకం! బిడ్డను పరాయిగుడ్డుగా గుడ్డిగా పెంచినందుకు జీవితాంతం సొంతతనానికి దూరమై  అలమటించాల్సిందీ   చివరకి ఆ బిడ్డాను కన్నవారలే.
కనీసం ప్రాధమికదశ దాటినవరకైనా బిడ్డ అమ్మమాట వింటూ, అమ్మ ఒడిలో హాయిగా అమ్మపాట వింటూ పెరగనిద్దాం. సహజవాతావరణంలో  పెరిగిన బిడ్డ సహజంగానే కన్నవారు కోరుకునే బంగారు మాణిక్యమై  వెలిగి ఇంటికీ, ఊరుకీ, దేశానికీ 
మంచిపేరు తెస్తాడు. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతులయిన మహానుభావులంతా చిన్న తనంలో  చిన్నబళ్ళల్లో గుంట ఓనమాలు దిద్దుకుంటూ పెరిగి పెద్దయినవారే!
ఆంగ్ల భాషను నేర్చుకోవద్దు ...అని చెప్పటం లేదు. అమ్మ భాషను 
మరిచిపోవద్దు! నాన్న నడిచిన  బాటను విడిచి  పోవద్దు -అని చెప్పటమే ఈ వ్యాసం ఉద్దేశం

-కర్లపాలెం హనుమంతరావు

Thursday, October 22, 2015

అదృష్టానికి అవా దృష్టాంతాలు!- ఓ సరదా గల్పిక


పరమాత్ముడైనా ఆ పరంధాముడు పథ్నాలుగేళ్లు వనవాసం చేసేవరకు పట్టాభిషేకానికి నోచుకోలేదు. అదే అతగాడి పాదుకలో! ఏ ప్రయత్నం చేయకుండానే దర్జాగా అయోథ్య సింహాసనం అధిష్టించాయి! అదృష్టమంటే అదే!
అదృష్టం ఉంటే ఎడారిలో పడి ఉన్నా ఏనుగు  వెదుక్కంటూ వచ్చి వరమాలను మెడలో వేస్తుంది. 'తంతే బూరెల బుట్టలో పడ్డం' అంటాంగదా! అలాగని బూరెల బుట్టముందు నిలబడి తన్నించుకున్నా.. ప్రారబ్దం బాగోలేకపోతే పక్కనున్న పేడతక్కెట్లో పడవచ్చు! ప్రారభ్దానికి ఏ శబ్దార్థ కౌముదీ సరిగ్గా నిర్వచనం చెప్పలేదు. చెప్పలేదుకూడా!
'ఖర్మానికి ధర్మాధర్మాలుండవని గీతకూడా బోధిస్తూనే ఉందిగదా! 'దృష్టం' అంటేనే  కంటికి కనిపించనిదిదృష్టాంతాలేగాని.. సిద్ధాంతాలుండనిది. అపోలో రెండోదశ అంతరిక్ష నౌక చంద్రమండలంమీద దిగేముందు సరిగ్గా ఇరవై నిమిషాలకు సరిపడ్డ ఇంధనం మాత్రమే మిగిలి ఉందట! అదీ  అదృష్టమంటే! కలసి రావాలి.. అంతే! కలసిరాకపోతే అలంకారంకోసం వేలికి పెట్టుకున్న పచ్చలఉంగరంకూడా పఛ్చడికూటితో పాటు గొంతులోకి జారి ప్రాణాంమీదికి  రావచ్చు.
పూర్వజన్మసుకృతమని ఏదో పేరు పెట్టుకొని  సంతృప్తికోసం  సమర్థించుకోడమేగాని ఏ అపూర్వ శబ్దచింతామణీ అదృష్టానికి సంపూర్ణ న్యాయం చెయ్యనేలేదు. చెయ్యలేదుకూడా!
టైమ్ బాగోలేకపోతే భోలక్ పూర్ నల్లానీళ్ళే కాదు.. బోలెడంత డబ్బుపోసి కొన్న మినరల్ వాటరుకూడా కాలకూట విషమౌతుంది!
జనాలని నమ్ముకోవాల్సింది పోయి జాతకచక్రాలను నమ్ముకొన్న జయలలితమ్మ గతే
మవబోయిందో మనందరికీ తెలిసిందేగా! మన దగ్గరా ఎమ్మెల్సీ సీట్లకోసం హస్తంపార్టీ చీట్లు తీసింది! అన్నీ తెలుసు రాజకీయవేత్తలకు. అయినా రాజకీయాలు పత్తి మార్కెట్ల(కాటన్ మార్కెట్లు) మాదిరి సందడి చేస్తున్నాయంటే అదే మరి రాజకీయం గడుసుతనం.

గోడదూకుడుగాళ్ళు ఎక్కువైపోతున్నారని  వాపోయే ఓ పార్టీ  తనకార్యాలయం గోడలు మరింత ఎత్తుకు పెంచింది!  ఏమయిందీ?   గోడలకు కన్నాలేసి మరీ కోరుకొన్న పార్టీల్లోకి దూకేసారు జంపు జిలానీలు! నీతిమంతులుండే అదృష్టం ప్రధానంగానీ..  ఎత్తులూ.. జిత్తులూ ఎవరి ప్రారబ్దాన్ని ఎప్పుడాపగలిగాయి!
గెలుపుకి 'గుర్తు' కలసిరావడం లేదని కుములుకుంటోందిగాని.. జనంలో గుర్తింపు తగ్గిందని గుర్తుపట్టలేకపోతుందింకో  మడమ తిప్పని పార్టీ! నేతల తలరాతలను తేల్చేది నిజానికి ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల జాతరేగానీ.. గుర్తులూ.. తాయెత్తులూ కానేకాదని ఎన్నేళ్ళు ఓడినా మన ప్రజాప్రతినిధులకు జ్ఞానోదయం కావడంలేదు! ప్చ్! జనం దురదృష్టం!
రోజులూ అలాగే  ఉంటున్నాయిలేండి! ఎన్నికల్లో విజయఢంకా మోగించినవాడు ప్రమాణ స్వీకారం రోజునే ప్రాణాలు పోగొట్టుకొంటుంటే.. యావజ్జీవం పడ్డవాడు దర్జాగా బైటకొచ్చేసి రాజకీయ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నాడు! రాసిపెట్టుంటే చర్లపల్లి జైల్లో ఉన్నా వేడివేడి బిర్యాని పొట్లాలు వేళకు అందుతుంటాయి! సిమ్ కార్డు సరఫరాలు  క్రమం తప్పకుండా సాగుతుంటాయి! నూకలు చెల్లితే గోకుల్ చాటుకు పోయి మరీ  ప్రాణాలు పోగొట్టుకోవడం  మనమీ కళ్లతో ఎన్నేసి సార్లు చూడ లేదూ!
దేవుడు దయతలచి 'పోనీలే పాపమ'ని 'ఉఁ' అన్నా.. పూజారిగారూ తలాడిస్తేనే ప్రసాదం ప్రాప్తించేది. పూజారిగారి మనసు ముందు మనవైపు మళ్లడటమే ప్రస్తుతం అదృష్టాలలోకెల్లా పెద్ద అదృష్టం! రాజకీయాలనుంచి.. రాసలీలలవరకు.. అన్నింటా పూజారులే రాజ్యమేలుతున్నారు ప్రస్తుతం. అది మన దురదృష్టం.
కాలం కలసిరాకపోతే కోట్లుపోసి పెట్టిన వోక్సువేగను కారు ఫ్యాక్టరీకూడా చక్కా రెక్కలొచ్చినట్లు ఎక్కడికో ఎగిరిపోవడం చూడ్డంలే! చేటుకాలం తోసుకొచ్చి 'జై' కొట్టిన చేతులే పాతచెప్పులు విసరడం చూడ్డంలే! అదృష్టానికి దురదృష్టానికీ మధ్య అడ్డుగీత సినిమా హీరోయిన వేసుకొనే పైటకన్నా పల్చన,  
అదృష్టదేవతేమన్నా మన గర్ల్ ఫ్రెండా! పిలిచీ పిలవంగానే 'హాయ్' అంటూ వచ్చి వళ్లోవాలి 'హాయి'నిచ్చిపోడానికి! ఆడవారి మనసులు నిజంగా ఎంత చంచలమో తెలీదుగానీ.. అదృష్టదేవతదిమాత్రం కఛ్చితంగా మహా 'ఫికిల్ మైండ్'! అమ్మగారి చపలచిత్తానికి ఎన్ని వందల ఉదాహరణలైనా  ఆపకుండా చెప్పుకోవచ్చు!
సోనియాజీ  ప్రధాని పదవికి ఎన్నుకునే సమయంలో  మన్మోహన్ జీ  కనీసం రాజ్యసభ సభ్యుడైనా కాదుదేశానికి అమెరికావూడిగం చెయ్యాలని రాసిపెట్టి ఉన్నప్పుడు సోనియాజీ ముసుగులోనైనా వచ్చి  అలా ఆడించేస్తుంది మరి అడృష్టదేవత!
'రాసిపెట్టి ఉన్నప్పుడు రాళ్లగుట్టకింద పడి ఉన్నానెత్తిమీదకి రత్నాలకీరీటం తెచ్చిపెడుతుంద'న్న సిద్ధాంతం మొన్నీమధ్యే చంద్రబాబన్నవిషయంలో రువువవలేదా!  అదృష్టానికి సిద్ధాంతాలూ.. రాద్ధాంతాలూ జాన్తా నై! జగన్ బాబుకా





సూత్రం వంటబట్టకే పద్దస్తమానం ఇంత మంట! 'రాజధాని ఆహ్వానపత్రంఇవ్వనే ఇవ్వద్దని.. ఇచ్చినా తాను చచ్చినా వచ్చేది లేద’ని మొండికేసి నవ్వులపాలయింది అదృష్ట దెవతతత్త్వం బొత్తిగా వంటబట్టించుకోక పోవడంవల్లే! దేనికోసమూ దేబిరించకుండా దేవుడు మనకిచ్చిన 'పాత్ర'ను   వీలయినంత అద్భుతంగా నటించుకుంటూ పోతుండడమే విజ్ఞుడైనవాడు చేయదగ్గ పని. ఆ పాఠం ఇద్దరు చంద్రులను చూసైనా ఎప్పటికీ నేర్చుకోకపోతే ఎట్లా!
జీవితంపాత్రలో  అదృష్టముండేది కింది సగంలో. పైన సగం కృషి. రాజకీయాలవరకు దాని మరోపేరు నటన! అదృష్టలక్ష్మి చెయ్యందుకోవాలంటే  కృషి(అదేనండీ.. నటన)ని నమ్ముకోడం మినహా మరో దారి లేనే లేదు
దుర్యోధనుడు పాచికలాటలో పాండవులను ఓడించింది కేవలం అదృష్టం వల్లేననుకుంటే పప్పులో చప్పున కాలేసినట్లే! శకుని 'పని'తనం వల్లే పాండవులమీదున్న కడుపుమంట చల్లబడిందన్న భారతసారం తెలుసుకోకుంటే ఎవర్నిమాత్రం ఎవరు బాగుచెయ్యడం వల్లవుతుంది చెప్పండి!  గురుత్వాకర్షణశక్తిని గుర్తుపట్టిన రోజున న్యూటన్ ఆపిల్ చెట్టుకింద కూర్చోనుండడం కాకతాలీయం అయితే కావచ్చుకానీ కచ్చితంగా   అదృష్టంమాత్రం కాదు.  అసలు అదృష్టం పండు కిందపడ్డం ఛూసినప్పుడు   న్యూటన్ బుర్రలో ‘బల్బువెలగడం! రాజకీయాల్లో పాలకుల  'బల్బు'లు ఎప్పుడు వెలుగుతాయో! ఎందుకు వెలుగుతాయో! దానిమీదే పాలితుల అదృష్ట దురదృష్టాలు  ఆధారపడి ఉంటాయన్నది అసలు సారాంశం.
సముద్రంమీద లేచిన అల్పపీడనం వాయుగుండంగా మారి  ఏ దిశకు తిరగాలో ఏ సిద్ధాంత గ్రంథంచూసి  నిర్ణయించుకుంటుంది! వాటాన్నిబట్టి జరిగే  చర్యలకు ఏ యాగమూ.. యజ్ఞమూ దిశానిర్దేశాలు  చెయ్యలేవు. అయినా యాగాలూ.. యజ్ఞాలూ..  ధూం ధాంగా చేయడం చంద్రుళ్లమార్కు రాజకీయం!

ఎవరి తలరాతలు వారే స్వయంగా రాసుకొనేవన్న సత్యం సత్యంరామలింగరాజుగారివంటి వారి  కొన్నికథలకే పరిమితంప్రజాస్వామ్యంలో జనం తలరాతలు రాసేది ప్రజానేతలేననడంలో మరో మాట లేనే లేదు! సదరు నేతల తలలు ఎంతలా పనిచేస్తున్నాయో దాన్ని బట్టే జనానీకం అదృష్టాలు.. దురదృష్టాలూను!

ఇప్పుడు మాత్రం మన అదృష్టాలకేం తక్కువ.. చెప్పండంటారా! స్వైన్ ఫ్లూ వచ్చే సీజన్లో సాధారణ ఫ్లూ వచ్చిపోవడం అదృష్టమే. వానలు కురవని రోజుల్లో బ్యాంకురుణాలు దొరక్కపోవడం రైతన్నల అదృష్టమే. మాంద్యం ముదిరిన రోజుల్లో ఉద్యోగాలూడకుండా వేళ్లడుతూనైనా ఉండటం కొంతమంది పాలిట అదృష్టం. ఫ్లాపు పిక్చరు తీసినా ఫస్టువీకులోనే ప్రపంచంలోని అన్ని థియేటర్లలో విడుదల చేసేసి  సాధ్యమైనంత రాబట్టుకోవడం మెగా అదృష్టం. కందిపప్పుక్కరువున్నా కనీసం పెసరపపైనా పిసరంత దొరుకుతుంది చూడండి! దేమన్నా  మామూలు అదృష్టమా! ఆలస్యంగానైనా ఆడపిల్ల క్షేమంగా ఇల్లుచేరడం ఎంత పెద్ద అదృష్టమో ఈ రోజుల్లో! ఏసిడ్ దాడులు పెరిగిన రోజుల్లో ఎవరూ మన పిల్లల్ని ప్రేమిస్తున్నాని వెంటాడకపోవడాన్ని మించిన అదృష్టం  కన్నవారికి మరేదైనా ఉంటుందా!
మన చేతుల్లో లేని అదృష్టాన్ని గురించి వగచేకన్నా స్వల్ప అదృష్టాలని తలుచుకొని మురిసిపోయే  మనసుండటం కన్నా మరేమి అదృష్టం లేనే లేదు! ఏమంటారు?
-కర్లపాలెం హనుమంతరావు

( 05-10-2009 నాటి ఈనాడు సంపాదకీయం పుటలో ప్రచురితం)  

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...