Saturday, October 31, 2015

ఇందిరమ్మ మరణించి ఇవాళ్టికి ఇరవయ్యారేళ్ళు!(2010 నాటి నా వ్యాసం)


రాజకీయ కుటుంబంలో పుట్టటం వరం. చిన్ననాటే తల్లితండ్రుల పూర్తి ప్రేమకు నోచుకోక పోవటం దురదృష్టం. తల్లి అంత ఆరోగ్యవంతురాలు కాదు. తండ్రి నిత్యం స్వాతంత్ర్య పోరాటంలో క్షణం తీరకలేకుండా గడిపే మనిషి.  ఇంటినిండా బంధు బలగం, నౌకర్లు చాకర్లు దండిగా ఉన్నా మానసికంగా వంటరిబాల్యాన్ని గడిపిన ఇందిరా ప్రియదర్శిని సహజంగా బిడియస్తురాలుగానే ఎదిగినా, అంతులేని ఐశ్వర్య భోగాలమధ్య పెరిగిన కారణంగా ఒక రకమయిన మంకుపట్టు మనస్తత్వంకూడా  పెంపొందిచుకుంది అంటారు. ఇందిర జీవితమంతా ఇలా వైవిధ్యాల మధ్య సాగటమే ఒక విచిత్రం.
తండ్రి అడుగుజాడలలో తీర్చిదిద్దబడిన మహిళ ఆమె. అనుకోకుండా అవకాశాలు వచ్చాయా.. వచ్చిన అవకాశాలని తెలివిగా వడిసిపట్టుకుని ముందుకు సాగిందా.. అనే ప్రశ్న వేసుకుంటే ఈ తొలి మహిళాప్రధాని విషయంలో రెండూ సరిసమానంగానే సాగుతూ వచ్చాయనిపిస్తుంది. తొలినాళ్ళలో తండ్రి ప్రభావం బాగా   పనిచేసినా, పోను పోను  తనే చొరవగా ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ ప్రపంచలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా పేరు గడించిన  మనదేశ ప్రధానిపీఠాన్నిఅధిష్ఠంచిందామె. పట్టుమని ఐదేళ్ళు గట్టిగా కుర్చోవటమే గగనమయిన ఆ అత్యున్నత సింహాసంనంమీద దాదాపు పదహారేళ్ళపాటు అంత గట్టిపట్టు బిగించటం అందరికీ పట్టుబడే విద్య కాదు.  సిగ్గరి అని తీసిపారేసిన ఆ వనిత వెనుక ఎంత చాణుక్యతనముందో తరువాత జరిగిన పరిణామాలే తెలియ చేస్తాయి.  దృఢమయిన ఆత్మవిశ్వాసం, తనమాట మాత్రమే చెల్లాలనే మనస్తత్వం, సంక్లిష్ట పరిస్థితుల్లోసైతం చెక్కు చెదరని గుండెధర్యం, సాహసాలకు వెరవని గుణం చాలాసార్లు కలిసివచ్చినా.. అన్నేసార్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా వున్నాయి. మరణించి పాతికేళ్ళు గడిచిపోయినా అంతర్జాతీయ స్థాయిలో  ఇప్పటికీ ఆమె అలీనవిధానాలు, జాతీయస్థాయిలో పేదప్రజల గుండెల్లో ఒక అమ్మగా నిలబడిపోయిన వైనం  వెనక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడినట్లు కలసివచ్చిన కాలం పాత్రకంటే, కలిసిరాని వేళా వెనుకంజ వేయని ఆమె దృఢ  మనస్తత్వమే ప్రధానకారణమని  కరాఖండిగా చెప్పుకోవచ్చు.
ఆరుగురు రాష్ట్రపతుల దగ్గర పనిచేసారమె. ప్రధానమంత్రి కాకమునుపు ఆర్ధిక, విదేశ, సమాచార శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారు. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం దరిమిలా  అప్పటి  కాంగ్రెస్ పార్టీ ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేకుండానే ప్రధానిపీఠం అధిష్ఠించారు. ఇది కలిసివచ్చిన సంఘటన. కాగా తరువాత ఏడాదికే వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో బొటాబొటి మెజారిటీతో విజయం సాధించటంతో పార్టీ ప్రక్షాళనకు పూనుకుంటేకానీ తన భవితకు భద్రత ఏర్పడదని గ్రహించారు. ముందు నుంచి తనకు వ్యతిరేకం గా ఉన్న వృద్ధనాయకులు తన ప్రధానిపదవికి ముప్పుగా పరిణమించే పరిణామాన్నిసరిగ్గా  అంచనా వేయగలిగారు.  ఇంటా బయటా తిరుగులేని నాయకురాలిలాగా ఎదగాలంటే  ముందు జనస్వామ్యానికి దగ్గరవాలని గ్రహించారు. సామ్యవాద పద్ధతులలోతప్ప ముందుకు సాగే మరోదారి లేదని సరయిన సమయంలోనే గ్రహించి తదనుగుణంగా ప్రభుత్వపథకాలను ప్రవేశపెట్టి దృఢచిత్తంతో ఆచరణలో పెట్టటంతో ఇందిరా గాంధీ ఈ దేశంలో బడుగుజీవి మొర ఆలకించే ఇందిరమ్మగా రూపాంతరం చెందటానికి తొలిఅడుగు పడినట్లయింది. జకీర్ హుస్సేన్ మరణానంతరం రాష్ట్రపతి పదవికోసం జరిగిన ఎన్నికలలో తనే ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్ధిగా నిలబడిన వి వి గిరికి అనుకూలంగా అంతరాత్మ ప్రభోధమనే కొత్తనినాదం లేవదీయటంద్వారా గెలిపించి, క్రమశిక్షణా చర్యలకింద తనపార్టీ ప్రాధమికసభ్యత్వాన్నికూడా రద్దుచేయటానికి తెగబడ్డ  వృద్ధనాయకులని అభివృద్ధి నిరోధకులని ముద్రవేయించి, చివరికి పార్లమెంటరీ పార్టీ విశ్వాసాన్ని తనవైపుకే మళ్ళించుకోవటంలో కృతకృత్యురాలవటంలోనే ఇందిర సాహసం, భవిషత్ దర్శనాచాతుర్యంఅధికారంమీద అంతులేని  వ్యామోహం బయట పడుతున్నాయి. తన ప్రధానిపదవి పటిష్టతకోసం పార్టీని చీల్చటానికికూడా వెనుదీయని ఆ మనస్తత్వమే తరువాత తన అధికార పీఠంమీది అర్హతను అలహాబాద్ న్యాయస్థానం చెల్లదని కొట్టిపారేసినప్పుడు ఆ పదవిని  కాపాడుకోనేటందుకు అత్యవసర పరిస్థితి అనే వంకతో ఎమర్జన్సీ చీకటిరోజులకు తొలిసారి తెర తీసినప్పుడు కూడా బయటపెట్టుకున్నారు.  1971 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన ఆమె ఇందిరాకాంగ్రెస్ పార్టీనే 1977 ఎన్నికలలో మట్టికరిచింది. ఆమె తన స్వంత నియోజకవర్గమయిన రాయ్ బరెల్లిలోకూడా ఓడిపోయారు. గెలుపుని నిలుపుకోవటం, ఓటమిని గెలుపుగా మలుచుకోవటంలో ఇందిరాగాంధీ కున్నప్రజ్ఞాపాటవం అంతర్జాతీయంగా చూసుకున్నా నాయకులలో అరుదుగా వుండే లక్షణం. ఇందిర హయాంలో జరిగిన భారత్- పాకిస్తాన్ యుద్ధమే ఇందుకు పెద్ద ఉదాహరణ. ఆమె నేతృత్వంలో జరిగిన ఆ యుద్ధం లో అఖండ విజయం సిద్ధించటం,  బంగ్లాదేస్ ఆవిర్భావించటం ఆమెను ప్రపంచ స్థాయిలోకూడా ఒక తిరుగులేని నేతగా నిలబెట్టాయి. యుద్ధ కారణంగా లక్షలాదిమంది తూర్పుపాకిస్తాను నుంచి తమదేశానికి శరణార్ధులుగా తరలివస్తుంటే, వారికోసం తాను యుద్దానికి దిగటం తప్పెలా అవుతుందో చెప్పాలని అప్పటి  అమెరికా అధ్యక్షుడు నిక్సన్ మహాశయుడంతటి  వాడిని  నిలదీయటంలాంటి విన్యాసాలుచేసి ప్రపంచవ్యాప్తంగా కూడా తనకో వీరమాత ఇమేజినిదేశీయంగా ఒక కాళిక అవతారాన్ని  సృస్టించుకున్న ఘనత ఆమెది.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసిందనీ, ప్రజల ప్రాధమిక హక్కులనుసైతం లెక్కచేయని అప్రజాస్వామ్యవాదనీ, పదవికోసం  విలువలనుకూడా పట్టించుకోని అనైతికనేత అనీ, రాజ్యాంగసవరణలద్వారా అంతులేని అధికారాలను సొంతంచేసుకునే నియంతమనస్తత్వంకల నాయకురాలని, వారసత్వ అర్హతతో గద్దెనెక్కిన ఆమె తన చిన్న కొడుకు సంజయ్ గాంధీకూడా  తనతదనంతరం  అధికారం చెలాయించాలని తపనపడిన తల్లి అనీ.. ఇలా తనమీద  ఎంతలా  విమర్శల జడివాన  కురిసినా  జడవని ఆ  మనస్తత్వంవల్లే   తదనంతర దేశరాజకీయాలలో తరుగుతూ వచ్చిన నైతికవిలువలకు మూలపుటమ్మగా ఆమె  నిలచిపోయిందన్న మాటా   నిజమే.
అత్యవసర పరిస్థితి అక్రమాలపై విచారించటానికి జనతాప్రభుత్వం ఏర్పాటుచేసిన సంఘంముందు నిలబడటానికి నిరాకరించిన ఆమె, అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్టుచేసిన సందర్భంలో  బెయిలు తీసుకోవటానికికూడా నిరాకరించారు. తద్వారా తనో ప్రజాసంక్షేమంకోసం ప్రాణాలనుసైతం ఫణంగాపెట్టే  వీరవనితగా అవతారమెత్తటమే లక్ష్యం. ఇవాళ ఏదయినా నేరంచేసోఅవినీతికి పాల్పడో చెరసాలకెళ్ళే నాయకులు   ఏదో ఘనకార్యం చేసినట్లు రెండువేళ్ళు గాలిలోకి ఆడించటమో, రెండుచేతులూ ఎత్తి నమస్కారం చేసుకుంటూ చిరునవ్వుతో దండలు వేయించుకుంటూ ముందుకు సాగుతూవుండే దృశ్యానికి తొలిషాట్ ఆ రోజుల్లో అమ్మగారినుంచే మొదలయిందని అనుకోవాలి.
గాంధీజీ,  నెహ్రూజీలమీదున్న జనాభిమానానికి ఒక స్వాతంత్ర్యపోరాట నేపథ్యం ఉంది. ఏ పోరాటంతో సంబధం లేకుండానే ఇంతగా జనంమెప్పు ఒకరాజకీయనేత పొందట మనేది  ఇందిరాగాంధీతోనే  భారతరాజకీయాలలో మొదలయిందనికూడా చెప్పుకోవాలి.
మంచిచెడ్డలను  అవతల పెడితే ఎవరు వద్దన్నా కావాలన్నా ఇందిరమ్మ రాజకీయాలు ఇన్ని దశాబ్దాలు  గడిచినా ఇంకా జనజీవితాలను పెద్దఎత్తున   ప్రభావితం చేస్తూనే వున్నాయన్న మాట మాత్రం  ఒప్పుకుతీరాల్సిందే. నెహ్రూగారి వారసురాలిగా తెరమీద కొచ్చి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సాధించుకోవటమేకాక తన తదనంతరంకూడా తనకుటుంబంలోని  వారికే అదికారపీఠం దక్కితీరాలని  తపించిందామె. వారసత్వ రాజకీయాలకు  ఒక మహావృక్షం మాదిరి వేళ్ళూనటానికీ ఆమే కారణం .
ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో అమృత్ సర్ బంగారు దేవాలయంమీద ఆమె జరిపించిన దాడికి నిరసనగా స్వంత అంగరక్షకులే జరిపిన తుపాకీకాల్పులలో ఆమె ప్రాణాలు పోగొట్టుకొని ఈ వ్యాసం రాసే అక్టోబర్ 31కి 26 సంవత్సరాలు నిండుతున్నాయి. మహాత్మాగాంధీజీ  గాడ్సేగోలీకి ప్రాణాలు ఒడ్డిన సంఘటనతో ఇందిరాజీ హత్యను సరిపోల్చుకున్న దేశప్రజలు సహజంగానే ఆమెకుటుంబాన్ని దేశంకోసం సర్వస్వాన్ని త్యాగంచేస్తూ వస్తున్న త్యాగమూర్తుల కుటుంబంగా గౌరవిస్తూవస్తున్నారు. ఆమెకుటుంబంలోని యువనేత అత్యున్నత ప్రధానిపీఠాన్ని  అధిరోహించేందుకు తర్ఫీదుపేరుతో దేశాటనలు  చేస్తున్నసమయంలో- రాముడు  వనవాసంనుంచి తిరిగి వచ్చినదాకా ఆయన పాదుకలతో భరతుడు పాలన సాగించిన చందంగా మన్ మోహన్ సింగ్ వంటి వీరవిధేయుడు (ఆమె కుటుంబంలోని మరో సభ్యురాలి పర్యవేక్షణలోనే)  పాలన సాగిస్తూ రావటందానికి   దేశ  ప్రజలనుంచి అనుకొనంత అభ్యంతరాలు లేకపోవటం.. మొత్తంగా చూసుకుంటే  ప్రపంచలోని అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంలోని  ప్రజలను తాను  కోరుకున్నరీతిలోనే  వారసత్వరాజకీయాలకు  అనుకూలంగా మలుచుకోవటంలో ఆమె నూటికి నూరు పాళ్ళు విజయం సాధించిందనే చెప్పితీరాలి.   ప్రజాస్వామ్యవాదులకు  ఇది బాధ కలిగించే విషయమే! అయినా  కుటుంబ పాలన కోసం పరితపించే వారందరూ ఆమె చిత్రం నట్టింట్లోపెట్టి పూజించుకోవచ్చు. అలాగే పూజించుకుంటున్నారుకూడా!  ఈ ఒక్కరోజు 'శక్తిస్థల్'లో  బారులుతీరి  నివాళులర్పించే నేతల చేతలకన్నా.. ఆమె పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్న నేతల చర్యలను గమనించే వారికి   ప్రతిరోజూ  ఆమె  గుర్తుకు రాకమానరు.

అంత తేలికగా మర్చి పోయే వ్యక్తిత్వం కూడా కాదు లేట్ ఇందిరా గాంధీజీది. 
-కర్లపాలెం హనుమంతరావు
     

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...