Monday, October 26, 2015

అమ్మ మాట మరవద్దు ! నాన్న బాట వదలవద్దు !!- ఒక వ్యాసం


"In close-up it is pathetic though  in long-shot it is cheerful: that is life:"

ఈ చార్లీచాప్లిన్ కోట్ ని  భావం చెడకుండా చక్కటి తెలుగులో చెప్పటం సాధ్యమా?
Close-up కి తెలుగులో సమానార్ధకం ఏమిటి ? long-shot ని దీర్ఘదృశ్యం అంటే మనకే నవ్వు వస్తుందా రాదా!  కొన్ని పదాలను ఒకభాషనుంచి మరోభాషలోకి తర్జుమా చేయవలసివచ్చినప్పుడు మక్కీకి మక్కి దింపాలనుకుంటే..  ఇదిగో.. ఇలాంటి హాస్యమే పుడుతుంటుంది. కావాలని ఇలాంటి కొన్ని పదాల అనువాదాలను ఎత్తిచూపి...ఇదిగో  మన భాషలోవ్యవహారమంటే  ఇలాగే వుంటుంది- అని  మన భాషను  వెటకారం  చేసే వారు చాలామంది మనలోనే  తయారవుతున్నారు. మన అమ్మపలుకును మనం చులకన  చేసుకునేటందుకు తప్ప దీనివల్ల సిద్ధించే ప్రయోజనం వేరే ఏముంటుంది! ఓహో!.. మన భాషాపాటవం ఇంత ‘బ్రహ్మాండం ‘ గా  వుంటుందన్నమాట - అని  మన పిల్లలే తమ తల్లిభాషను  తేలిక చేసేందుకు తప్ప ఎందకూ పనికి రాదు. ఎదిగే పిల్లలకి అది ఎంత చేటు చేస్తుందో మనం పెద్దలం  తెలుసుకోలేకుండా వున్నాం!
ఎంత ప్రేమగా ఉన్నా కన్నతల్లి కన్నా ఎవరూ మనల్ని ఎక్కువగా ప్రేమించ లేనట్లే .. ఎంత గొప్పభాషయినా  మన మాతృభాష కన్నామనకు ఎక్కువ కాబోదు.  పుట్టీ  పుట్టగానే ముందుగా మన కంట బడేది మనకు తన పేగునూ.. రక్తాన్నీ పంచి ఇచ్చిన తల్లి. అట్లే వూంగాలు కొట్టేటప్పుడు మనచెవినబడిన  మొదటి పలుకులే మన అసలయిన సొంత  భాష. ఏ భాషలో ఏడిస్తే మనబాధ  అమ్మకి  అర్థమవుతుందీ., ఏ భాషలో నవ్వితే నాన్న మనల్ని చూసి  మురిసి ముక్కలవుతాడో..   ఏ భాషలో కొట్లాడితేతప్ప  తోటిపిల్లలతో మనం నెగ్గుకురాలేమో, మన అన్నతమ్ములు  అక్కచెల్లెళ్ళు మనల్ని ఏ భాషలో ఆత్మీయంగా పిలిస్తే మనకు ప్రేమ పొంగి పొరలిపోతుందో... అదే గదా మన అసలయిన జీవభాష! జీవభాష అంటే ఒక్క  జీవమున్న భాష అనే కాదు.. జీవితాన్ని రుచి చూపించేదికూడా అని అర్థం.
భాషను   గురించి జరిగే చర్చలో ఈ   సెంటిమెంట్ గోలేమిటి అనుకుంటున్నారా! అవును. భాష  అంటే  ఒక సెంటిమెంటేగదా! కనకనే భాషా విషయకంగా మనం ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కొట్లాడి మరీ సాధించుకున్నాం. భాషాప్రాతిపదికమీద  ఇన్ని ప్రత్యేక  రాష్ట్రాలు పుట్టుకొచ్చి  దశాబ్దాలు దాటిపోతున్నా దేశంలో ఇంకా మరిన్ని  ప్రత్యేక ప్రతిపత్తుల  కోసం  చిచ్చులు రేగుతున్నాయి. ఒకభాష మాట్లాడేవారంతా ఒకగొడుగు కిందకు రావాలన్న విధానం వెనుక ప్రధానంగా పనిచేసే సూత్రం సెంటిమెంటు కాక మరేమిటి! ఇక్కడంటే చుట్టూ ఉన్నది మనభాష మాట్లాడే మనుషులే కనక దాని  ప్రాధాన్యత అంతగా పట్టకపోవచ్చు కాని.. ఒక్క సారి ఏ పక్కరాష్ట్రానికో.. పరాయి దేశానికో వెళ్లి నాలుగు రోజులు వంటరిగా వుంటే తెలిసి వస్తుంది... నాలిక మన రుచులను కోరుకున్నట్లే.. చెవికూడా మనభాష  వినటానికి ఎంతగా తహతహలాడి పోతుందో!
ఈస్ట్ ఇండియా   కంపెనీ వాడు వ్యాపారం కోసమే ప్రపంచదేశాల మీదకొచ్చిపడ్డా, అది చివరికి ఒక  దేశ సార్వభౌమత్వానికి దారితీసిన పరిస్థితులకు  ప్రేరకం మాత్రం వారి మాతృభాషయిన ఇంగ్లీషుపైన వారికున్న అంతులేని ప్రేమే నంటే కాదనే వారుంటారా!  ఇంగ్లీషువాడు తన 'జాక్'జెండా సూర్యుడస్తమించనిసామ్రాజ్యంలో  నిరాటంకంగా రెపరెపలాడేందుకు ఎంచుకున్న మార్గాలలో  మాతృభాష  ఇంగ్లీషు పైనున్న ప్రేమ కూడా ఒక ప్రధానమయిన కారణమే! 
భాష అంటే ఒక్క పదాల కూర్పే కాదు. అది ఒకజాతి సంస్కృతిని చాటిచెప్పే మాధ్యమంకూడా . ఈ విషయం అంత బాగా ఆకళింపు చేసుకున్నాడు  కనకనే మెకాలే మహాశయుడు వారి  ఆంగ్ల భాష వ్యాప్తికోసం అంతగా అరాటపడింది. ఇంగ్లీషు వాడు రాజ్యంచేసే కాలంలో ఇంగ్లీషుచదువులు చదువుకుంటేనేకానీ పొట్టకూటికి కొలువు దొరకని పరిస్థితులు వుండటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎన్నో ఇడుములు పడి తెల్లవాడిని తరిమికొట్టి సొంతరాజ్యాన్ని స్థాపించుకున్నామని చంకలు గుద్దుకుంటున్న మనం ఇవాల్టికీ  రాచకొలువులకోసమే కాక భేషజం కోసం కూడా ఆ  పాతదొరల భాషచూరును  పట్టుకు వేలాడుతున్నామంటే ఏమని అర్ధంచేసుకోవాలి!  మనం దేనిలో స్వాతంత్ర్యం సాధించినట్లు! ‘సరే.. ఇదంతా గతం సుమా!ఇప్పుడనుకొని ఏమి లాభం? ఎలాగూ ఇంగ్లీష అంతర్జాతీయ భాషగా మారికూర్చుంది. ఆ భాష పట్టుబడితేతప్ప రోజు గడవని పరిస్థితులు నిజంగానే దాపురించాయి. ఏవో ఆదర్శాలకుపోయి ఒక్కతెలుగే నేర్పించి మా పిల్లకాయల భవిష్యత్తును  బుగ్గిపాలు చేయమంటారా?’ అంటూ మారుమూల పల్లెల్లోని తల్లితండ్రులుసైతం దండెత్తివచ్చే పరిస్థితులు దాపురించాయంటారా! అదే మరి మన బాధకు ఇక్కడ ప్రధాన కారణం.
నిజమే! ఎవరు మాత్రం చూస్తూచూస్తూ తమ బిడ్డలు  తోటివారికన్నా చదువు సాముల్లో వెనకబడటాన్ని సహిస్తారు!  కొలువులేరాని చదువులకు లక్షలు  లక్షలు పోసి చదివించేందుకు ఏ కన్నవారయినా  ఎందుకు ముందుకొస్తారు! ఒక వేళ ఎవరయినా  సొంతభాషమీద  మమకారమెక్కువై   'ఏదో  పిల్లవాడిని కనీసం ఓ  ఐదు తరగతుల వరకయినా తెలుగులోనే చదివిద్దాములే!' అని ఉత్సాహపడినా  ముందు పిల్లవాడే అందుకు ఎదురుతిరిగే పరిస్థితులు వచ్చిపడ్డాయి కదా!  ప్రాంతీయ భాష లోనే విద్యావిధానం కొనసాగాలని  ఏదో వుబుసుపోకకు  పుస్తకాల్లో రాసుకుంటే ఫరవాలేదు   కానీ... నిజంగానే కేవలం ఏ  తెలుగులోనో, ఉర్దూలోనో  పిల్లవాడి చదువు కొనసాగిస్తే  రేపు వాడు పెరిగి  పెద్దయిన తరువాత ‘ఎందుకయ్యా.. మమ్మల్నిలా ఎందుకూ  కొరగాని బడుద్దాయిల్లాగా తయారుచేసావ’ని  నిలదేస్తే?   సమాధానమేమని  చెప్పాలి? తల్లితండ్రులు నిలదీసి అడిగే ఈ ప్రశ్నకు నిజంగా బదులేమీ చెప్పలేని పరిస్థితుల్లోనే మనం ఉన్నాం.
అలాంటి పరిస్టితులు వచ్చిపడ్డాయనేగదా మన  ఈ బాధంతా! ఈ దుస్థితికి కారణం మనం పెద్దలం అవునా  కాదా అని ఇప్పటికయినా  మనల్ని మనం ప్రశ్నించుచుకోవా లనే ఈ తపనంతా.

మీ బిడ్డను ఇంగ్లీష్ చదువుకుని గొప్ప సాఫ్ట్ వేరో, వైద్యశిఖామణో కావద్దనికూడా  చెప్పబోవటం లేదు.  పసిపిల్లవాడిని మనమలా ఎప్పుడో చేయబోయే గొడ్డు చాకిరికి  మరీ  ముక్కుపచ్చలారని  వయసునుంచే ఆ ఇంగ్లీషుబడులనే  బందిలదొడ్లలో కట్టిపడేయాలా? మనం  అవసరానికిమించి ఈ భాషమీద వ్యామోహ    పడుతుండటం వాస్తవం కాదా!   అంతేసి  డబ్బుపోసి కేవలం ఇంగ్లీష్ మాత్రమే   బోధించే ఏ కార్పోరేట్ పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధపడ్డా  అక్కడ మనపిల్లవాడికి పాఠాలు నూరిపోసేది మన ఇంకో ఏ  తెలుగు పిల్లవాడే కదా! పొట్ట తిప్పలకోసం ఏదో నాలుగు ముక్కలు నోటకరుచుకుని  క్లాసురూంలో కక్కేవాడేకానీ... ఏ  ఇంగ్లాండు నుండో ఊడిపడ్డదొరైతే కాదుకదా!నిజంగానే వాడు ఏ ఇంగ్లాండునుండో, ఐర్లాండు నుండో , దిగొచ్చిన దొరే అయినా  మనవాడికి మరింత యాతన! దొరలయాసబాస విని వంటబట్టించుకొనే ..పాటి జ్ఞానం  పొద్దస్తమానం   ఇంటిభాషనవింటూ  ఎదిగిన బిడ్డకు అంత్య పసివయసులో సాధ్యమా! ఎప్పుడయినా ఎవరయినా  పసిబిడ్డ మనసునుంచి ఆలోచన చేసారా? చేస్తున్నారా?
తల్లిభాషలో చదివి అర్ధంచేసుకునేక్రమంలో, తిరిగి ప్రశ్నించి సమాధానం రాబట్టి జ్ఞానం వృద్ధి చేసుకునేబిడ్డ మేలా? అంతుబట్టని   పరాయిభాషలో బట్టీపడుతూ.. తెలీని విషయాలను ఎలా అడగాలో తెలియక..  గమ్మునూరుకొనుండి పోయే బిడ్డ మేలా?మనభాషలో తగినంత సమాచారం లేదు. విజ్ఞానతృష్ణగల బాలుడు తప్పని సరిగా ఆంగ్లభాష అభ్యసించక తప్పదు'  అనే   వాదన ఒకప్పుడయితే చెల్లిందేమో!   సాంకేతికంగా రోజుకో కొత్తసౌలభ్యం  ఆవిష్కృతమవుతున్న నేపథ్యంలో ఈ వాదనకు బలం లేదు.  పరిసరాలనుచూసి నేర్చుకునే పసివాడికి ఇంటి వాతావరణం.. బడివాతావరణం  వేరువేరుగా ఉంటే వాటిని సమన్వయించుకొనే శక్తిచాలక  మానసికంగా ఎంతల్పా నలిగిపోతాడో,,  పిల్లవాడి సహజపరిణామానికి  అది ఎంత   అవరోధంగా మారుతుందో   మానసికశాస్త్రవేత్తలు విశదీకరిస్తున్నారు. వాటినీ  పెడచెవిన పెడితే చివరికి చెదిరేది మన కలలపంటలే!   కంప్యూటర్ కోర్స్ లు  చేసినవాడికి   లక్షల్లో జీతాలువచ్చే ఉద్యోగాలు ఉన్నాయని మనపిల్లవాడిని పసిమొగ్గ దశలోనే  పునాదిచదువుల పేరుతో భారీరుసుములు  వసూలుచేసే పటాటోపపు పాఠశాలలలో అష్టకష్టాలుకోర్చి చేర్చినా   లాభపడేది ఎవరు?    కార్పోరేట్, కాన్సెప్టుస్కూళ్ళవ్టంటి గంభీరమయిన  పేర్లుపెట్టేసి  బళ్ళను చింతపండు కొట్లమాదిరి నడిపే విద్యావ్యాపారులే! నష్టపోయేది మాత్రం మనం, మనపిల్లలే!  పిల్లవాడు పెరిగి  పెద్దయిన తరువాత ఏ ఇంజిననీరో, డాక్టరో అయి మంచిపేరు, మస్తుడబ్బు  సంపాదించాలనుకుంటే   మనం  ముందుగా చేయవలసింది.. పిల్లవాడిని సహజవాతావరణంలో చురుకుగా  ఎదగనీయటమే! సహజ పరిసరాలలో  జ్ఞాన సంపాదనచేసే అవకాశాలు  కల్పించటమే!
కాలం మనం ఊహించలేనంత వేగంగా మారిపోతున్నది. సాంకేతికంగా మనిషి పురోభివృద్ధి   సాధిస్తున్నకొద్దీ  ప్రపంచం క్షణక్షణానికీ చిన్నదయిపోతున్నది. ఒక భాషనుంచి మరోభాషలోకి సమాచారం తర్జుమా కావటం  క్షణాలలో జరిగిపోయే  సాంకేతిక  ప్రక్రియ మెరుగవుతున్న కాలం ఇది. నాసానుంచి  గాలిలోకి ఎగిరిన ఒక అంతరిక్షనౌక మరునిమిషంలో  కూలిపోతే..   లోపమేమిటో  రెండుక్లో నిమిషాలలోపే మాస్కోలోని   అంతరిక్షకేంద్రం విశ్లేషణచేసి మరీ  ప్రపంచానికి చాటుతున్నంత సాంకేతికాభివృద్ధి శరవేగంతో సాగుతున్న   సూపర్ యుగం లో వున్నాం మనం. ఒక దేశం మరోదేశ ప్రాచీన నాగరికత సంస్కృతులనుంచి విజ్ఞానాన్ని  అందిపుచ్చుకుని ముందుకు దూసుకు పోయేందుకు పోటీలుపడుతున్న దశ ఇది. మనవేపాకు, మన యోగా, మన సామాజిక కుటుంబవ్యవస్థ పటిష్టతపైన ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నసందర్భంలో మనం మన ప్రాచీనసంస్కృతి విశిష్టతని  పట్టించుకోకుండా పరాయిదేశాలు  వాటిఅవసరాలకక్ను అనుగుణంగా ఏర్పాటుచేసుకున్న కట్టుబాట్లను, కట్టుబట్టలను, సంఘవ్యవస్థను గుడ్డివ్యామోహంతో అనుకరించటం మన వెన్నెముక లేనితనాన్ని, లేకితనాన్నిబట్టబయలుచేయటం లేదూ!   నాలుగు డాలర్లు ఎక్కువ వస్తాయన్న అశతో  పుట్టీపుట్టకముందే బిడ్డడ్ని  ఏ కాన్వెంటు గొడ్లసావిట్లోకో 
తోలేద్దామన్న తల్లిదండ్రుల తొందరపాటును మాత్రమే   ఇక్కడ తప్పు పడుతున్నది. . 'అమ్మ' అనే  పిలుపులోని కమ్మదనాన్ని కాదని పూర్తి అర్ధమైనా  తెలుసుకోకుండా మనబిడ్డనోటితోనే మనల్ని మనం 'మమ్మీ'లుగా మలిచుకొని మురుసుకొంటున్నాం.    ఆ వెర్రివ్యా మోహమే  'వద్ద'ని  మొత్తుకొనేది. మనబిడ్డ 'డాడీ!'  అని పిలిచినంత మాత్రానే  మనం  బిల్ గేట్స్ తండ్రిగా మారిపోగలమా! మన ఇంటిదీపం ఒక వివేకానందుడో, నోబెల్ గ్రహీత  రవీంద్ర కవీంద్రుడో, అగణి గణిత ప్రతిభావంతుడు   సర్ సివి రామనోఆర్ధికశాస్త్రంలో ప్రపంచానికే పాఠాలు చెపుతున్న అమర్త్య సేనో, చలన చిత్ర సంచలన దర్శకుడు సత్యజిత్ రేనో, ఇటీవలే ఆస్కార్ అవార్డ్ కొట్టుకొచ్చ్చిన ఏఆర్ రెహమానో,  చదరంగ విశ్వరాజు విశ్వనాథ్ ఆనందో,  సాఫ్టువేరు  దిగ్గజం సత్య నాదేళ్లో, గూగుల్ గురూజీ సుందర్ పిచయో, ప్రపంచ  ధనవంతుల జాబితాలో నిత్యం కనిపించే లక్ష్మీ మిట్టలో కావాలని కోరుకోవాలి. కానీ  దానికోసం చిన్నతనంనుంచే  స్వీయసంస్కృతికి దూరంగా మనబిడ్డ బంగారుబాల్యాన్ని పరాయిపంచల పాల్చేయడం పరమ కిరాతకమనే ఇక్కడ చెప్పదలుచుకున్నది.   
అమ్మమాటే వెగటుగా   భావించే  వాతావరణంలో పసిమనసు  ఎదగటం  మనకంటి దీపానికే నష్టదాయకం! బిడ్డను పరాయిగుడ్డుగా గుడ్డిగా పెంచినందుకు జీవితాంతం సొంతతనానికి దూరమై  అలమటించాల్సిందీ   చివరకి ఆ బిడ్డాను కన్నవారలే.
కనీసం ప్రాధమికదశ దాటినవరకైనా బిడ్డ అమ్మమాట వింటూ, అమ్మ ఒడిలో హాయిగా అమ్మపాట వింటూ పెరగనిద్దాం. సహజవాతావరణంలో  పెరిగిన బిడ్డ సహజంగానే కన్నవారు కోరుకునే బంగారు మాణిక్యమై  వెలిగి ఇంటికీ, ఊరుకీ, దేశానికీ 
మంచిపేరు తెస్తాడు. ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతులయిన మహానుభావులంతా చిన్న తనంలో  చిన్నబళ్ళల్లో గుంట ఓనమాలు దిద్దుకుంటూ పెరిగి పెద్దయినవారే!
ఆంగ్ల భాషను నేర్చుకోవద్దు ...అని చెప్పటం లేదు. అమ్మ భాషను 
మరిచిపోవద్దు! నాన్న నడిచిన  బాటను విడిచి  పోవద్దు -అని చెప్పటమే ఈ వ్యాసం ఉద్దేశం

-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...