Friday, May 6, 2016

అచ్చ తెలుగు ముచ్చట్లు


కాళిదాసు భోజరాజు కీర్తిని కొనియాడే ఓ సందర్భంలో
నీరక్షేరే గృహీత్వా నిఖిల.  ఖగతితీర్యాతి నాళీకజన్మా
తక్రం ధృత్వాతు సర్వా నటతి జలనిధీం శ్చక్రపాణి ర్ముకుందః  సర్వాంగనుత్తుంగశైలాన్ వహతి పశుపతిః ఫాలనేత్రేణ పశ్యన్
వ్యాప్తా త్వత్కీర్తికాంతా త్రిజగతి నృపతే!  భోజరాజక్షితీంద్ర!”
అంటూ అతిశయోక్తులు పోతాడు!   ప్రభువుకీర్తి శ్వేతవర్ణంలో దశదిశలా వ్యాపించడంవల్ల పక్షులన్నీ హంసలవలె  భ్రాంతి గొలుపుతున్నాయిట!  బ్రహ్మదేవుడికి తన వాహనం ఏదో ఆనవాలు  పట్టేందుకు నీళ్లు కలిపిన పాలు పక్షులముందు పెట్టవలసి వచ్చిందని కాళిదాసు చమత్కారం! సర్వసముద్రాలూ పాలసముద్రం మాదిరి తెల్లబడటంవల్ల జగజ్జేతకు తన పడకగల పాలసముద్రం ఏదో తెలుసుకోడం వల్లగాక  మజ్జిగ  సాయం కోరవలసి వచ్చిందని మరో ముచ్చట! మజ్జిగచుక్క పడిన తరువాత  గడ్డకట్టిన సముద్రమే  తన పాలసముద్రమవుతుందని పరమాత్ముని  పరీక్ష!  పరమేశ్వరుడిదీ అదే పరిస్థితి.  తన కైలాసగిరి  విలాసమేదో తెలుసుకునేందుకు ఫాలనేత్రం తెరిచి మరీ మండించ వలసిన  పరిస్థితి! మండిన కొండే తన వెండికొండవుతుందని ఈశుని ఈ         విచిత్ర       పరీక్ష!  దీనబాంధవుల  స్థితిగతులనూ ఇంత దయనీయంగా మార్చివేసిందని భోజరాజు కీర్తికాంతులను  వర్ణించడం కొంత అతిగా అనిపించినా.. రాసింది కావ్యం.. రాసిన అక్షరసిరి  కాళిదాసు కనుక ఎంత  కల్పన అయితేనేమి.. అత్యంత రమ్యనీయంగా ఉందని ఒప్పుకోక తప్పదు కదా రసహృదయులందరికీ!

వేల్పుటేనికలయ్యె బోల్ప నేనుగు లెల్ల- గొండలన్నియు వెండి కొండలయ్యె
బలుకు చేడియ లైరి పొలతుక లందరు-జెట్టులన్నియు బెట్టు చెట్టు లయ్యె
బాల సంద్రములయ్యెనోలి నేర్లన్నియు-నలువ బాబాలయ్యె బులుగు లెల్ల
బుడమి దాలపులయ్యె బడగదార్లన్నియుమేటి సింగములయ్యె మెకము లెల్ల
బండు రేయెండ కన్నుల పండువగుచు
బిండి చల్లిన తెరగున మెండు మీరి
యొండు కడనైన నెడలేక యుండి యప్పు
డండ గొనగ జగంబెల్ల నిండుటయును”
అంటూ మన తెలుగు కవిసార్వభౌముడు కూచిమంచి తిమ్మకవి సైతం   తెలుగులో  ఓ రామాయణం రచించే సందర్భంలో   అయోధ్యకాండ మధ్యలో ఈ హృద్యమైన  పద్యం చెప్పుకొచ్చాడు.. ‘శభాష్!’ అనిపించే మెచ్చుకోళ్ళెన్నో సాధించుకొచ్చాడు.
విస్తారంగా పరుచుకొన్న  పండువెన్నెల్లో నల్లటి ఏనుగులుకూడా దెవేంద్రుని ఐరావతంలాగా భ్రమింపచేస్తున్నాయనడం.. కాలవర్ణం కుప్ప పోసినట్లుండే  కొండలకూడా మహాశివుని రజితాలయాల మాదిరి ధగధగలతో వెలిగి  పోతున్నాయనడం.. శ్యామలవర్ణంతో నిగనిగలాడే స్త్రీల సొగసులన్నీ శారదమ్మ వంటితీరుతో పోటీకి దిగుతున్నాయనడం.. హరితవృక్షాలన్నీ కల్పవృక్షాలకు మల్లే తెలుపురంగుకి తిరిగి  ప్రకాశిస్తున్నాయని కల్పనలు చేయడం.. నదులు సర్వస్వం క్షీరసాగరాలకు మల్లే మల్లెపూల మాలల మాదిరి మతులు పోగొడుతున్నాయని అనడం.. వివిధ జాతుల  పక్షులన్నీ వర్ణాలతో నిమిత్తం లేకుండా శ్వేతహంసల మాదిరి  బారులు తీరి శోభాయమానంగా అలరారుతున్నాయని అనడం..  ఆహాఁ.. తిమ్మకవి కల్పనంతా  ఎంత కమ్మంగా ఉందో కదా!
పండు వెన్నెల పిండి ఆరబోసినట్లుగా ఉంది’ అని  ఒక్క వాక్యంలో అని ఊరుకుంటే అది కావ్యం ఎలాగవుతుంది? తిమ్మనకు కవిసార్వభౌమడన్న గుర్తింపు ఎలా వస్తుంది?  కనకనే ఈ కల్పనలన్నీ! నిజమే కావచ్చు కానీ.. అసలు విశేషం అందులో ఇసుమంతే ఉంది. నిశితంగా గమనించి చూడండి ఈ పద్యమంతా అచ్చమైన తెలుగులో కవి రసవంతంగా  రాయడంలోనే నిఖార్సైన విశేషం దాగి ఉంది!

రుచిగట్టగలిగే ప్రతిభ మన మనసుకు ఉండాలేగానీ.. తెలుగు పలుకుకి మాత్రం కలకండ పలుకుకు మించిన తీపిదనం లేదా! తెలుగు భాష సాధికారతను గురించి.. ప్రాచీనతను గురించి గత కొద్దికాలంగా చర్చోపచర్చలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.  చర్చలు ప్రాచీనతను గురించి.. అధికారిక హోదాను గురించి కాక.. వ్యావహారికతను గురించి.. అధునికతను గురించి సాగితే మరింత ప్రయోజనం సాధించినట్లవుతుందేమో! 
అవసరం లేకున్నా ఆంగ్లపదం లేకుండా  తేటతెలుగులో మాటలాడుకోవడం మొరటుతనమయి మనకు ఎన్ని దశాబ్దాలాయ! ఆధునిక మాద్యమాల పుణ్యమా అని  తెలుగు పదాలు పరాయిభాషకు మల్లే.. పరాయిభాష పలుకులు తెలుగుభాషకు మల్లె  దాదాపుగా స్థిరపడిపోయిన            దుస్థితి  ప్రస్తుతానిది. భాషాదినోత్సవాలు భేషజంగా జరుపుకుని ‘శభాషం’టూ జబ్బలు చరుచుకుంటే సరిపోతుందా?   పాలక మహాశయులే  చట్టసభల సాక్షిగా ప్రజల భాషమీద చూపించే చిన్నచూపు ప్రతి మాతృభాషాభిమానికి చివ్వుమనిపించడం లేదూ! 'మన తెలుగు' అన్న  పట్టింపు మనకే ఏ కోశానా లేనప్పుడు.. తెలుగులో చదువుకున్న వారికి కనీసం ప్రభుత్వాల  తరఫునుంచైనా ఒనగూడే అదనపు ఉద్యోగ.. ఉపాధి అవకాశాలు  రవ్వంత కరవవుతున్నప్పుడు.. అమ్మభాషమీద ఎంత  అబిమానం పొంగిపొర్లుతుంటేనేమి..  ఆసాంతం  తెలుగులోనే విద్యాబోధన కొనసాగించడం  దుస్సాహసం అనిపించుకోదా!
తెలుగువాడికి మొదటినుంచి పరభాషా వ్యామోహం అధికమన్న అపప్రథ ఒకటి ఎలాగూ ఒకటి ఉండనే ఉంది!   ఆ లోపాల లోతులు తడముకొనే సందర్భం ఇది కాదు వదిలేద్దాం..  కానీ.. కనీసం తెలుగుభాష సాంకేతిక             సామర్థ్యంమీద .. వ్యావహారిక పదజాల            సమృద్ధిమీద .. అవగాహనా రాహిత్యం తొలగించుకోవాలా..  వద్దా!  ఇతరేతర అవసరాల ప్రలోభాలవల్ల ఒకవర్గం ప్రబలంగా సాగిస్తున్న తెలుగువ్యతిరేకతను అడ్డుకోవాలా.. వద్దా? కనీసం ఆ దిశగానైనా ప్రతి తెలుగు అభిమానిని  సమాయత్తం చేయవలసిన గత్తర ప్రస్తుతం గతకాలాలకన్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంది.  ఉద్యోగ.. ఉపాధులాది నిత్యజీవితావసరాలకి  అవసరమయ్యే భాషమీద ఆధారపడటం ఎలగూ తప్పదు.. సరే! అలా ఆధారపడే ఉన్నతస్థాయికి సొంతభాషను చేదుకోవడం ఎలగూ లేదు! ఉన్నస్థాయినుంచికూడా మరింత పాతాళానికి తల్లిభాష జారుతుంటే తల్లడిల్లడే లక్షణాలు తెలుగువాడిలో   కల్లలవుతున్నాయి! అదీ కలవరం!   పుట్టిన నేల నేర్పించే మట్టిజ్ఞానాన్ని సైతం  కాలదన్నే అజ్ఞానం రోజురోజుకీ అధికమయి పోతున్నది! బుడత వయసునుంచే మెదడు మడతల్లో మనదికాని మరి దేన్నో బలవంతంగానైనా చొప్పించాలని ఆరాటం!  ఇంటభాషమీద సహజంగా ఉండే అభిమానాన్ని ఇంతప్పటినుంచే బిడ్డకు దూరం చేయాలనే దురాలోచన!
ఏ జాతికైనా తనదైన ఉనికి అంటూ ఒకటి ఉంటుందికదా!  ఉండాలి కూడా కదా! నలుగురిలో తను  ఏమిటో నోరు    విప్పకుండానే  చెప్పగలిగేది ఈ సంస్కారమే కదా!  దానికీ ఓ పెద్ద  ‘నమస్కారం’ పెట్టేసెయ్యడమే 'అల్ట్రా మోడరన్' నాగరీకంగా మన్ననలు పొందటమే ఆందోళన కలిగించే అంశం.
తెలుగు భాషాపరంగా తగినంతగా ఎదగలేదని కదూ ఆంగ్లమానస పుత్రుల అస్తమానం అభియోగం!  గతంలోకి ఓ సారి తొంగి చూస్తే తెలుస్తుంది.. సమర్థతగల గురుతుల్యుల మార్గదర్శకత్వంలోనైనా సరే! తెలుగుభాష చూపించే వన్నెచిన్నెలు ఎన్నెన్నో!  విస్తుగొల్పేస్తాయి మన తల్లిభాష విన్నాణస్థాయికి!
ఒకటో శతాబ్దిలోనే హాలుడు అచ్చుతెలుగులో ముచ్చటయిన కావ్యసంపదను పోగుచేసాడు. ప్రాచ్యభాషలెన్నింటిలోలాగానే తెలుగుమీదా సంస్కృతభాష ప్రభావం కాస్త అధికంగా ఉందన్న మాట వాస్తవమే కావచ్చు  కాదనేందుకేమీ  లేదు కానీ.. సంస్కృతమూ భారతీయుల సంస్కారానికి దర్పణీయమైనదే కదా!అయితేనేం.. పాలలో నీళ్లలాగా ఏ పరాయిభాష పదాన్నైనా తనలో పొదువుకొనే సమ్మిళితశక్తి తెలుగుభాషకున్నంతగా మరే ఇతర భారతీయభాషకూ లేదన్న ప్రత్యేకత గుర్తించాలి. గర్వించాలి. అన్నం.. పచ్చడి.. బట్టలు.. గుడిసె.. కుండలు.. పలక.. బలపం.. లాంటి ఎన్నో ముచ్చటైన అచ్చుతెలుగు పదాలతో  తెలుగు సంచీ నిండి ఉంది. ఆ వాడుక పదాలనైనా అవసరానికి వాడుకొంటున్నామాఅనవసరమైన ఆంగ్లపదాలతో  తెలుగుసంభాషణల బండిని తోలుకుపోవడమే దొరలతనమనే  భ్రమలో ఉన్నాం!

పొన్నగంటి తెలుగన్న  అచ్చమైన తెలుగు పదాలతో ముచ్చటైన కావ్యరచనకు శ్రీకారం చుట్టేస్తే.. ఆ స్ఫూర్తిని అందుకొని మరింత వడుపుగా ముందడుగులు వేసిన తెలుగు కవిమూర్తులెందరో!  ఆ విశేషాలు అన్నీ కాకపోయినా కొద్దిగానే అయినా తెలుగుబుద్ధికి తోచాలన్న సద్బుద్ధితో మచ్చుక్కి కూచిమంచి  తిమ్మకవి రాసిన అచ్చుతెలుగు రామాయణంలోని  ఈ ముచ్చటైన పద్యం మచ్చుక్కి ముచ్చటించింది!
                                         ***
 -కర్లపాలెం హనుమంతరావు

Wednesday, May 4, 2016

దేవుడే రక్షించాలి!- ఎన్నికలతీరుమీద సరదా వ్యాఖ్యానం

కోటీ బస్టాండులో బస్సు దిగిపోయారు విష్ణుమూర్తి దంపతులు.
గజేంద్రమోక్షంలో ఆ ఏనుగు పాపం వెయ్యేసి ఏళ్లు ఎట్లా పడిందోగానీ పాట్లు ఆ  మడుగులో మొసలితో.. ఒక్క అరగంట మనమీ  బస్సులో ప్రయాణం చేసేసరికి గురుడు గుర్తుకొచ్చాడు దేవీ!’
శంఖుచక్రాలు, గదా కిరీటాలు వెంట తెచ్చుకొమ్మంటే వింటిరి కాదు! కమ్మంగా గరుడు వాహనం చేతికింద పెట్టుకుని.. ఈ డొక్కు గరుడాలో యాత్రలేంటంట! రామావతారంనాటి  కష్టాలు గుర్తుకొచ్చాయి స్వామీ! ఆ రావణాసురుడి పుష్పకవిమానమే  నయం
భక్తులు ఈ మధ్య ప్రద్దానికీ పెద్దగగ్గోలు పెట్టేస్తున్నారు! నిజంగానే ఇబ్బందులు అంత భయంకరంగా ఉంటున్నాయా? అసహనం అతిగా పెరిగి మన సహనాన్ని పరీక్షిస్తున్నారా?’ ఆవటా అని పరీక్షించుకోడానిక్కదా  మనమీ భూలోక పర్యటన పెట్టుకుంది! శంఖుచక్రాలుకిరీటాలు గట్రా పటాటోపాలుంటే జనం పట్టించుకుంటారా! పెద్ద పండుగ అయిపోయినా  పగటివేషగాళ్ళింకా ఊళ్ళోనే తిరుగుతున్నారని ఎగతాళి చేయరూ! జనం మధ్యలో జనం మనుషులు మాదిరి తిరిగితేనే కదా  మనకూ నిజమైన జనం కష్టనష్టాలేవిటో తెలిసొచ్చేదిరామావతారంనాటి ట్రిక్కు. పద.. పోదాం! పెళ్ళినడకలొద్దు!’  
బాగుంది సంబడంసమయమంతా  బస్సు వెయిటింగులోనే గడిచిపోయింది. నన్నంటారేం మధ్యలో! చీకటి పడేలోగా  మనలోకానికి వెళ్ళిపోవాలి బాబూ! పొద్దుగూకితే ఇక్కడ ఆడవాళ్లకి బొత్తిగా రక్షణ లేదని బెదరగొట్టాడు నారదుడు!’ 
ఆదిలక్ష్మి మొత్తుకోళ్ళు పూర్తవనే లేదుపట్టుకోండి! పట్టుకోండి! దొంగవెధవెవడో నా బంగారు గొలుసు ఎత్తుకెళుతున్నాడు! దేవుడా! దేవుడా! ఎక్కడున్నావయ్యా! కాపాడటానికింకా  రావేమయ్యాఅంటూ ఆర్తనాదాలు!
తమరిహ   కార్యరంగంలోగ్గానీ దూక్కపోతే  నా చెవులు ఇక్కడే బద్దలయేట్లున్నాయి!  ముందా భక్తురాలి మొరేంటో ఆలకించండి  మహాప్రభో!’ ‘చెవులు రెండూ  గట్టిగా మూసేసుకుంది మహాలక్ష్మి.
దొంగవెంటబడక తప్పలేదు పరంధాముడుకి!
అలనాడు మాయలేడి వెంటబడ్డం కన్నా మహా కష్టంగా ఉందీ తుంటరి వెంట తరుములాట. త్రేతాయుగంనాటి ఆ సంఘటన జరిగింది కాకులు దూరని కారడవుల్లో! చీమలు దూరని ఆ చిట్టడవులెక్కడ! చీటికి మాటికి  వాహనాలు, గోతులు, గుంతలు, మురిక్కాలవలు, హోర్డింగులు, చిన్నదుకాణాలు,  పోస్టర్లు మేసే దున్నపోతులు..  అడుగడుక్కీ అడ్డొఛ్చే ఈ  సిటీ రోడ్లెక్కడ!
ఎవరో గల్లోలీడరు తాలూకు ఎన్నికల ర్యాలీ అడ్డుతగలటంతో  దొంగ దేవుడికి దొరికిపోయాడు. ‘అన్నా.. అన్నా! నన్నొదిలేయన్నా! కావాలంటే నీ వాటా నీకు తెంపిచ్చేస్తానన్నా!‘ హఠాత్తుగా కాళ్ళు రెండూ పట్టేసుకొన్నాడు దొంగ.  బిత్తరపోయాడు భగవంతుడు!
అన్నా ఎవడ్రా నీకు! నన్నెవరనుకున్నావురా చోరాధమా!’
మన  హెడ్డు పోలీసెంకటసామివే కదన్నా!’
పోలీసును కదురా పోకిరి మానవాధమా! భగవంతుణ్ణి!’
అంటే దేవుడివా! మరీ మంచిదన్నా! ఎప్పట్లా నీ ముడుపు నీవు పుచ్చేసుకొని నన్ను విడిచి పుచ్చేయరాదే! నాకేం! జైలుకెళ్లైనా జబర్దస్తుగా బతికేయగలను! కరువు రోజులు! నా పెళ్లాం పిల్లలే నీ ఎదాన పడి ఆకలి చావులు చస్తారు! ఆలోచించుకో సామీ!’
కష్టాలు ఎవరికైనా ఒక్కటేగా! సంసార పోషణకని ఈ జీవి
 దొంగతనానికి పూనుకుంటే అది  శిక్షించదగ్గ పాపమవుతుందా!’
దేవుడు ధర్మసంకటంలో పడిపోయాడు.
సందుచూసుకొని దొంగ సగంబంగారంతో సహా సందులోకి  ఉడాయించేసాడు!
సగంబంగారమే చూసి ఆడమనిషి వీరంగాలు మొదలపెట్టింది దొంగలు.. దొరలు కుమ్మక్కవడమంటే ఇదే! సగంబంగారం నొక్కేసి పెద్ద ఆపద్భాంధవుడిలా ఆ పోజేమిటయ్యా పెద్దమనిషీ!’ అంటూ పెడబొబ్బలు! అంతకంతకూ  జనం మూగిపోతున్నారు!
 మొగుణ్ణి రక్షించుకోవాల్సిన పతివ్రతా ధర్మం  హఠాత్తుగా గుర్తుకొచ్చింది  లక్ష్మీదేవికి. వంటిమీది బంగారు గొలుసొకటి ఆడమనిషి మీదకు విసిరి  దేవుడి రెక్క పుచ్చుకొని  చక్కా ఉడాయించింది.. పక్కనే ఉన్న బస్తీలోకి.

ఈ ఆపద్భాంచవుల వేషాలు ఇప్పుడంత అవసరమా అనాథరక్షకా! దొరలెవరో.. దొంగలెవరో పోల్చుకోడమే కష్టంగా ఉంది. దొంగలూ లాపాయింట్లు లాగేస్తుంటే ఏ నేరానికని తమరు దుశ్టశిక్షణకు పూనుకోగలరు?  వచ్చిన దారినే  పోదాం పదండి! మన పాలసముద్రంమీద నేను మీ కాళ్లు వత్తుతూ కూర్చుంటాను. మీరు కమ్మంగా కళ్లు మూతలేసుకొని పడుకుందురుగాని స్వామీ!’
మనమేమీ రాజకీయ నాయకులం కాదు.. అవసరాన్ని బట్టి జెండా, ఎజెండా మార్చుకోడం కుదరదు! భూలోకస్వర్గం సృష్టిస్తామని అభయహస్తమిచ్చి   తీరా ఇప్పుడేవో చిన్న అడ్డంకులొచ్చిపడ్డాయని.. చేతులెత్తేయడం ధర్మం కాదు !  సర్వాంతర్యాములం! దుష్టశిక్షణ.. శిష్టరక్షణ మన పర్మినెంటు  మ్యానిఫెస్టో! ఇంకో రెండు మూడు కేసులన్నా చూడకుండా వెనక్కి వెళ్ళిపోతే అమరలోకంలో మన పరువేం కాను!’ మొండిగా ముందుకే కదిలాడు ముకుందుడు!
నీళ్లకుళాయిల దగ్గర ఆడంగులు జుట్టు జుట్టు పట్టుకుని సినీపరిభాషలో ముచ్చట్లాడుకోవడం దేవుడు కంటబడింది. విడదీసేందుకు అడ్డు వెళ్ళిన ఆదిలక్ష్మికీ నడ్డిమీదా వడ్డింపులు తప్పలేదు.  ‘నీళ్లింకారాకముందే  ఈ జగడాలెందుకు తల్లుల్లారా!’  జగన్నాథుడి ఆందోళన.
అవెప్పుడొచ్చి చచ్చేనయ్యా! పోయినసారిట్లాగే ఎన్నికలప్పడు ఒక్క చెంబెడు పడ్డట్లు గుర్తు. మళ్లీ ఎన్నికలొచ్చాయి కాబట్టి ఇంకో చెంబో అరచెంబో వస్తాయని ఆశ! వాటి కోసమే మా మంతనాలుఅందో మహాతల్లి చర్చల సందర్భంగా ఊడిన జుట్టుముడి సవరించుకొంటూ!
భగవానుడు చిరునవ్వుతో కుళాయి ట్యాపుమీద ఇలా తట్టాడో లేదో..  బొళ బొళా  ఇనుపగొట్టంగుండా గంగ ప్రవాహంగా కిందకురికింది. ఆడంగులెవరి మొహాల్లోనూ ఇసుమంతైనా ఆశ్చర్యం లేదు! ఒక నడివయసు సుందరి మాత్రం  అతితెలివి ప్రదర్శించింది, ‘బాగుంది బాబూ మేజిక్కు! ఏ పార్టీ తరుఫున తమ్ముడూ తమరీ గమ్మత్తు ప్రచారం?’
ఏ పార్టీ అయితేనేంలేవే అక్కా! వీళ్ల ఎత్తుభారం ట్రిక్కులు ఎవతెకు తెలీవనీ! పోయినసారిట్లాగే ఎన్నికలప్పుడే   రోజుకో పగటేషం ఏసుకొచ్చి  మాయచేసి చచ్చారు! ఏవయంది చివరికిగెలిచి గద్దెనెక్కేక దేవుళ్లల్లే  నీలుక్కుపోయారు! ప్రతీసారీ మోసపోయేందుకు మేమేమంత ఎతిమతంగా  కనపడుతున్నామా ఏందయ్యా! అందుకోయే అప్పా.. ఆ బిందెతో ఒక్కటిచ్చుకుంటే ముఖం లొత్తపడిపోవాల!’ కొంగుబిగించిన కోమలాంగికి కోరస్ అందిస్తూ మిగతా ఆడంగులూ  పూర్తిగా కార్యాచరణకు పూనుకోకముందే భర్త పరువు  కాపాడుకోవాల్సిన బాధ్యత మరోసారి మహాలక్ష్మి నెత్తిన పడింది.
స్వామిచెయ్యి పుచ్చుకొని  రైతుబజారులోకి పరుగెత్తింది.
రైతుబజారులో కూరగాయలేమీ రాశులు రాశులుగా పోసి లేవు. రకానికి ఒక్కటి.. సంక్రాంతి  బొమ్మలకొలువులో మాదిరి.. ఏ  దుకాణంలో   చూసినా ఒహటే దృశ్యం! నోరెళ్లబెట్టి చూస్తున్నారు  విష్ణుదంపతులిద్దరూ! ఓ బక్కపల్చటి జీవి భుజంమీది బస్తాలోనుంచి  కరెన్సీ కట్టొకటి తీసి దుకాణం మనిషిమీదకు విసిరేసాడు. కొత్తిమేర కట్టొకటి అందుకొని ముక్కుదగ్గర పెట్టుకొని.. ఓహో.. ఒహటే మురిసిపోవడం!
మూడు నిమిషాలైనా కాలేదు.. కట్ట  క్రూరంగా వెనక్కు లాగేసుకునిబోడి వెయ్యి రూపాయలకెంత సేపయ్యా  వాసన్లు చూసేది! ఇట్లాగయితే ఇహ మేం వ్యాపారం చేసి తట్టుకొన్నట్లే! నడు.. నడు..పక్కకు!’ అంటూ  డబ్బుకట్ట పట్టుకు నిలబడ్డ మరో ఆడమనిషితో బేరంలో పడిపోయాడు దుకాణంమనిషి.
భగవంతుడి బుర్ర గిర్రున తిరిగింది. బక్కభక్తుణ్ణి పట్టుకుని విషయం కక్కిస్తేగాని కష్టం గట్టెక్కించే తోవ తోచే అవకాశం లేదు.
కాయగూరలు పండించే భూములన్నీ కాంక్రీటు అడవుల్లా మారి యుగాలయ్యాయయ్యా అమాయక దేవుడా! కొత్తగా కూరలు పండించే అవకాశం బొత్తిగా లేదెక్కడా ఇప్పుడు!  సింథటిక్ టైప్ కాయగూరలు స్వామీ ఇవన్నీ! మీ సృష్టి కర్తలకేమీ అర్థంకావులే ఇవి!  రకానికొకటి చొప్పున చైనానుంచి బోలెడంత పోసి తెప్పస్తారీ దుకాణదారులు. నెల మొదటితారీఖుకదా ఇవాళ!  జీతాలు వచ్చే నా బోటి అదృష్టవంతులం కొందరం ఉన్నంతలో ఇట్లా డబ్బుపోసి కాస్సేపు వాసన్లు  చూసి తరించి పోతుంటాం! సుష్టుగా భోజనం చేసినట్లు అదో తుత్తి!’ బక్కజీవి వివరణ. లక్ష్మమ్మకు తిక్కరేగింది. ’నువ్వొక్కడివే వచ్చి ఇట్లా వాసన్లు చూసుకొని మురిసిపోతే సరిపోతుందా పెద్దమనిషీ! ఇంట్లో పెళ్లాం బిడ్డల సంగతేమీ ఆలోచించద్దా!’
హుఁ! పెళ్లామూ.. పిల్లలూ కూడానా తల్లీ ఈ కరువు రోజుల్లో!’నుదురు బాదుకుంటున్న బక్కజీవిని చూసి భగవంతుడి కడుపు నిజంగానే తరుక్కుపోయింది.
 నిజమైన కష్టనష్టాలు ఎలా ఉంటాయో కళ్లక్కట్టినట్లు కనపడుతున్నాయిప్పుడు.
ఇన్నేసి సొంట్లు పడుతూ ఈ భూలోకాన్నె అంటిపెట్టుకుని ఉండకపోతే..  కమ్మంగా మోక్షం ప్రసాదిస్తాను. స్వర్గం వచ్చెయ్యరాదా బక్కభక్తా!’
అదీ సంగతి! ఇప్పుడర్థమయిందయ్యా మీ ఇద్దరి కత! ఏ పార్టీ తరుఫునంకుల్ ఈ నయా ప్రచారం? ఎన్నికలదాకానేగా  ఈ అమిత ఔదార్యం?  ఎన్ని ఎన్నికల సిరాచుక్కలు చూసింది  స్వామీ ఈ చూపుడువేలు!  పదివేలు పోస్తేనన్నా  ముక్కు దగ్గరకు కొత్తిమేరకట్టొస్తోందిప్పుడు.  మీ హామీలన్నీనిజమేనని నమ్మి మా ఓట్లన్నీ  మీకేసేస్తే! ఏ  మాయదారి పార్టీనో మీది నాకు తెలియదుగానీ.. మోక్షంవంకతో మీ కాపుసారా అమృతమని చెప్పి  అమ్ముకుందామనేగా మెగా ప్రణాళిక! మీ పుణ్యముంటుంది..  బాబ్బాబూ! నన్నిలా వదిలేయండి!’ అంటూ మరో కూరగాయల దుకాణంలోకి దూరిపోయాడా బక్కమనిషి.. ఏ ఉల్లిపొరో వాసన చూసేందుకు!







పొద్దున కోఠీలో దిగింది మీరిద్దరేనా మహాశయా! దేవుళ్లకైతే మాత్రం ఎన్నికల కోడ్లు ఉండవా!  పరమ అమాయకులయ్యా మా ఓటరు ప్రజానీకం! మోక్షం సాకుతో ఎవరివైపు తిప్పాలని మీ పథకాలు?కోడ్ ఉల్లంఘన  కేసు బుక్కయితే బెయిలుకూడా దొరకదు కలియుగం గడిచినా.. తెలుసా!’ చిందులు తొక్కుతున్నాడు ఎదురుగా నిలబడ్డ పెద్దమనిషి.
 ‘ రాంగ్ టైంలో వచ్చినట్లున్నాం బాబూ మేమీ భూలోకానికి! ఎంత దుష్టశిక్షణ.. శిష్టరక్షణకయినా.. ఓ  సమయం సందర్భం ఉంటుందన్న ఇంగితం ఇప్పుడే మాకు వంటబట్టింది! ఏ కోడూ.. ఓడూ అడ్డులేనప్పుడే వచ్చి కాపాడుకొంటాంలే మా భక్తజనావళిని! మమ్మొదిలేయండి మొదటిసారి తప్పుకి!’  శ్రీవారి చెయ్యిపట్టుకొని ముందుకు కదలబోయింది శ్రీలక్ష్మీదేవి.

వచ్చినవాళ్లు ఎలాగూ వచ్చారు. మా పార్టీ అభ్యర్థికో పది ఓట్లు తరుగుపడేట్లున్నాయి. ఇద్దరూ కలిసి ఎనిమిది చేతుల్తో  ముద్దర్లు గుద్దేసి పోండి స్వాములూ! మీ కష్టం ఊరికే ఉంచుకోంలే! మీ కొండ చిరునామా ఏదో  చెబితే గెలిచినాక వచ్చే నిధుల్లో సగం మీ హుండీలోనే సమర్పించుకుంటా!’ అన్నాడు ఎన్నికల్లో నిలబడ్డ ఆ అభ్యర్థి!

దేవుళ్ళిద్దరూ శిలాప్రతిమల్లా చూస్తుండిపోయారు!
హా! ప్రజాస్వామ్యమా! దేవుడే ఇహ నిన్నురక్షించాలి సుమా!


-కర్లపాలెం హనుమంతరావు
(వాకిలి- అంతర్జాతీయ పత్రిక- మే 2016  సంచిక- లాఫింగ్ గ్యాస్-లో ప్రచురితం)



Monday, May 2, 2016

పెరట్లో కచేరీ- కౌముది మరీ చిన్న కథ (మరీ చి.క)

వేటపాలెం పేరు చెవిన బడంగానే చెవిలో వినిపించే మధురస్మృతుల్లో వెంకట్రాముడి గానకచేరీ  ఒకటి.
తెల్లారుఝామున మొదలయ్యేది వాడి గానకచేరీ పెరట్లో! తోడి రాగాలు.. ఉదయరాగాల్లాంటి తేడాలేమీ తెలీని లేతవయసులో వాడి నాదస్వరం మా పిల్లలకు ప్రాణాలు తోడేసినట్లుండేది. దానికి తోడు కచేరీ పూర్తయేలోపు పక్కలమీదనుంచి లేచి పనుల్లో పడకపోతే మా అమ్మ ప్రాణాలు తోడేయడం అదనం.
వానరానీ.. వరదరానీ.. ఊరుమొత్తం దొంగలొచ్చి దోచుకుపోనీ.. వెంకట్రాముడి గానకచేరీ మాత్రం తొలిసంధ్యలో కనీసం ఒక గంటపాటైనా నిరాటంకంగా సాగాల్సిందే! వాడి నేపథ్యసంగీతంలోనే మా పిల్లలంతా కాలకృత్యాలు  పూర్తిచేసుకోవడం అప్పటి అలవాటు,
పై చదువులకని వెళ్లి మధ్య మధ్యలో తిరిగివచ్చినప్పుడు తెల్లారుఝామున వెంకట్రాముడి నాదస్వరం చెవినబడంగానే ప్రాణం లేచివచ్చినట్లనిపించేది.
అంతగా 'అడిక్ట్' అయిపోయామన్న మాట వెంకట్రాముడి సంగీత కచేరీకి.
కాబట్టే జీవితంలో అన్నిరకాల పోరాటాలు పూర్తిచేసి ఆఖరిదశలో మనశ్సాంతిగా బతుకు వెళ్లదీయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ముందుగా గుర్తుకొచ్చింది మా ఊరు వేటపాలెం..  బ్రాహణవీధిలో  వర్ధనమ్మగారి పెంకుటిల్లు. దానివెనకాలే  వెంకట్రాముడులాంటి నాయీబ్రాహ్మణులుండే మంగల్లంప.
పిల్లల్ని ఒప్పించి మకాం మా ఊరికి మార్పించడానికి కొంత సమయం పట్టినా.. మొత్తానికి వర్ధనమ్మగారి ఇంటినే కొనడానికే  నిర్ణయమయింది.
కొనేముందు చూసిపోయేందుకని ఒకటికి రెండు సార్లు వచ్చినా.. వెంకట్రాముడి గురించి విచారించే వ్యవధానం లేకపొయింది.
చిన్ననాటి స్నేహితుడు గుడిశర్మకనిపించినప్పుడే ఆ విషయాలన్నీ మళీ చర్చకు వచ్చాయి.
'వెంకట్రాముడి కొడుకు మన ఆదినారాయణగారి మూడో మనమరాలిని లేపుకుపోయాడ్రా! అప్పట్లో అదంతా పెద్ద గోల. అందరూ వెంకట్రాముణ్ణే తప్పు పట్టారు. వెలేసారు. గుళ్లో కచేరీలే కాదు..  తలపనులక్కూడా వాడు ఇప్పుడు మనవాళ్ళెవరికి పనికిరావడం లేదువెంకట్రాముడిప్పుడు  మంచంమీద తీసుకుంటున్నాడు. ఇంకేం కచేరీలు నా బొంద! ఆ కథంతా ముగిసి ఏడాది పైనే ఐందింటూ చావు కబురు చల్లంగా చెప్పేసాడు.
కచేరీలు కాకుండా క్షురకర్మ చేయడంకూడా నాయీబ్రాహ్మణుల వృత్త్తుల్లో ఒక భాగమే. నాకిప్పుడు గుర్తుకొస్తోంది. మాఇంటి ముంగిట్లో కూర్చుని  తలపని చేస్తున్నప్పుడు మా నాన్నగారు  అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడొకసారి  వెంకట్రాముడు 'మా సాంబణ్ణి పెద్ద బడే గులాం సాహెబ్ మాదిరిగా సెయ్యాలయ్యా!.. అదీ నా కోరిక' అనడం.
వెంకట్రాముణ్ణి చూద్దామని శర్మతోసహా మంగల్లంపలోకి అడుగు పెట్టాను చాలా కాలం తరువాత.
గానకచేరీ నడిచిన గుడిసె అలాగే ఉంది. కానీ.. దాని ఆకారం  మాత్రం వెంకట్రాముడు అవతారంలాగే చీకిపోయి ఉంది.
కుక్కి నులకమంచంమీద మాసిన చిరిగిన దుప్పట్లో మూలుగుతూ పడున్న ఆకారాన్ని చూపించి 'ముసలాడు మన మడుసుల్లో లేడయ్యా!' అంది ఆయన పెళ్లాం నాగమ్మ కన్నీళ్ళు పెట్టుకొంటూ. చిన్నతనంలో ఆ తల్లి సంజెవేళ  దొడ్డిగోడమీదనుంచి మా పిల్లలకోసమని అందించిన వేడి వేడి ఉలవచారు రుచి  నాలిక్కి తగిలిందిప్పుడు.
నా మనసంతా ఎలాగోఅయిపోయింది..
'వైద్యం చేయించడంలా?' అనడిగితే ఊరు వెలేసిని మడిసిని వైద్దులు మాత్రం ఏం ఉద్దరిత్తారయ్యా! ల్లు గడవాడాలిగందా  ముందు! ఎన్నడూ లేంది  మాఇంటి ఆడపిల్లలు పక్కూళ్లకెళ్ళి మంగలి పనులు  నేర్సుకొంటున్నారిప్పుడు. పొట్ట నిండాలి గందా!' అని నిష్టూరమాడుతుంటే వినడానికే కష్టంగా అనిపించింది.

ఆ క్షణంలో నిర్ణయించుకొన్నాను. మా నూతన గృహప్రవేశానికి వెంకట్రాముడి మంగళవాయిద్యాలు పెట్టించాలని. సంభావనకింద వెంకట్రాముడి తల్లి చేతిలో వెయ్యి నూటపదహార్లు పెట్టి 'ఏం చేస్తావో పెద్దమ్మా! వచ్చే శ్రావణానికి మేం కొత్తింట్లోకి దిగుతున్నాం. ఆ శుభముహూర్తానికి వెంకట్రాముణ్ణి తయారు చెయ్యాలి. ఇహనుంచీ రోజూ ఉదయాన్నే కచేరీ సాగాలి పెరట్లో ఇదివరకట్లాగానే. ఇది బయానా మాత్రమే! మిగతా సొమ్మ వెంకట్రాముడితోనే మాట్లాడి ఖాయం చేసుకొంటా!' అని చెప్పి బైటికి వచ్చేసాను.
శర్మ సంతోషంగా నా భుజం తట్టడం నాకు ఆనందం అనిపించింది.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే 2016 సంచికలో ప్రచురితం)




Sunday, May 1, 2016

నాన్నలంతే!- కౌముదిలోని మరీ చి.క(మరీ చిన్న కథ)


నాన్నతో ఆరుబయలు పడుకొని ఉన్నాడు  బుడతడు వెన్నెల రాత్రి.
'నాన్నా! మనం పేదవాళ్లమా?' అనడిగాడు హఠాత్తుగా!
'కాదు కన్నా! అందరికన్నా ధవవంతులం! ఆకాశంలో కనిపిస్తోందే.. ఆ చందమామ మనదే! అందులోని నిధినిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు నాన్న. 'వాటిని తెచ్చుకోవచ్చుగా!  నాకు సైకిలు కొనివ్వచ్చుగా!  రోజూ పనికి పోవడమెందుకు?' చిన్నా ప్రశ్న.
'నువ్వింకా పెద్దాడివైన తరువాత నీకు రైలుబండి కొనివ్వాలని ఉందిరా! ఇప్పుడే తెచ్చుకొని సైకిలు కొనేస్తే రేపు రైలుబండికి తరుగు పడవా? నీకు రైలు కావాలా? సైకిలు కావాలా?' అని నాన్న ఎదురు ప్రశ్న. 'రైలే కావాలి. ఐతే రేపూ నేనూ నీతో పాటు పనికి వస్తా! డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు చిన్నా.
'పనికి చదువు కావాలి. అలాగే వద్దువుగాని.. ముందు బుద్ధిగా చదువుకోవాలి మరి!' అన్నాడు నాన్న.
చిన్నా బుద్ధిగా చదువుకొని తండ్రిలాగానే ఓ ఆఫీసులో పనికి వెళుతున్నాడు ఇప్పుడు. పెళ్లయి.. ఓ బాబుకి తండ్రికూడా అయాడు.

ఓ రోజు డాబామీద ఆరుబయలు పడుకొని ఉన్నప్పుడు.. అప్పుడూ వెన్నెలే! ఆ బాబు అడిగాడు'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా?'

ఆకాశంలోని చందమామలో తండ్రిముఖం కనిపించింది ఆ బాబు తండ్రికి ఇప్పుడు. కళ్ళు చెమ్మగిల్లాయి.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే సంచికలో ప్రచురితం)

Wednesday, April 27, 2016

చావడానికి ఎందుకురా తొందర?!- చావుమీద ఓ సరదా వ్యాఖ్య

చావనేది లేకుండా ఉండేందుకు పూర్వకాలంలో రాక్షసులు తపస్సులు చేస్తుండేవాళ్ళుట. అమృతంకోసమే గదా అంత ఘోరమైన వైరాన్నికూడా పక్కన పెట్టి దేవదానవులు క్షీరసాగర మధనానికి పూనుకున్నదీ! కోరుకొంటే మినహా మృత్యుదేవత మహాత్ములను ఆవహించేది కాదని మనకో నమ్మకం. మహాభారతంలోని భీష్మాచార్యులవారు స్వఛ్చంద మరణం వరంగా పొందివున్నా  తన కర్తవ్యపాలన పూర్తి అయేవరకు అంపశయ్య వదిలి  పారిపోలేదుబ్రహ్మంగారివంటి సిద్ధులు సైతం తమ పాత్రపోషణ సంపూర్ణమయిన తరువాతే  సజీవసమాధికి సిద్ధమయింది. మృత్యుపాశంనుంచి తప్పించుకునేందుకు భక్త మార్కండేయుడు పడ్డ అవస్థలు తెలిసీ నేటి యువతరం ప్రాణాలు తీసుకొనేందుకు ఎందుకంతలా ఆరాటపడుతున్నారో అంతుపట్టకుండా ఉంది! కాటికి కాలు చాచుకుని కూర్చున ముసలీ ముతకా సైతం.. మనుమలు.. మనవరాళ్ళందరికీ పెళ్ళీ పేరంటాలయి పిల్లా పాపా పుట్టుకొస్తేగాని చూసి హరీమనేది లేదని మొండికేసే రోజుల్లో.. పసిమొగ్గలు అలా ఉత్తిపుణ్యానికి ఉసురు తీసుకోడం ఉసూరుమనిపించే విషయమే గదా!
యాండీ రూనే అనే ఆంగ్లరచయిత చావును గురించి ఓ చక్కని వ్యాసం ప్రచురించాడు. 'ఫలానా రోజున పైకి పోబోతున్నావన్న సమాచారం తెలిపే  కవరుగాని వస్తే దాన్ని తెరిచి చూసేందుకుకైనా ఎవరూ సాహసం చేయలేరు'అని యాండీ థియరీ! తప్పని పరిస్థితుల్లో గనక తెరిచి చూడవలసివస్తే.. చావు ఘడియలు దగ్గర పడ్డాయన్న దుఃఖవార్త తెలిసిన ఆ అభాగ్యుడు ఆఖరిక్షణాల్లో ఎలా ప్రవర్తిస్తాడన్న అంశంమీద యాండీ రాసిన ఆ వ్యాసం చాలా అసక్తిదాయకంగా ఉంటుంది. నవ్వు పుట్టిస్తుంది. నిజమేగానీ ఎవరి  ప్రాణాలైనా  అలా ఆర్థాంతరంగా గాల్లో కలిసిపోవడం నవ్వులాట వ్యవహారం కాదు గదా!
చావు దగ్గర పడ్డవాడు- ఆలుబిడ్డల్ని గురించి.. కన్నవారిని గురించి ఆలోచించకుండా ఉండగలడా? తన తదనంతరంకూడా తనవారి  బతుకులు కుదుపులేవీ లేకుండా సాగాలని కోరుకోకుండా ఉండగలడా! డబ్బున్నవాడైతే వీలునామాలాంటిదేదో రాసి పడేసి వివాదాలకు తావులేకుండా    చూసుకుంటాడు.
ఏ ఏ ఆస్తిపాస్తులకు సంబంధించిన పత్రాలు ఏ బ్యాంకులాకర్లలో మూలుగుతున్నాయో.. అంత బాధలో కూడా ముక్కుతూ మూలుగుతూ అయినా నమ్మదగ్గవాళ్ళ దగ్గర చెప్పుకొంటాడు. పిల్లల చదువులు.. పెళ్ళి పేరంటాలు.. వాళ్ళ పిల్లలకు పెట్టవలసిన పేర్లతో సహా తాను ఏమేం కోరుకొంటున్నాడో  అంత గుబుల్లోనూ ఓ టైంటేబులు వేసి మరీ అప్పగించడం మర్చిపోడు. కుటుంబ యావ బొత్తిగా లేకపోతేనేమి.. చావు క్షణాలు దగ్గర పడ్డాయన్న విషయం తెలిసిన మరుక్షణంనుంచి పడమటి దేశాల పౌరుడైనా సరే.. ఉన్న క్రెడిట్ కార్డుల లిమిట్లన్నీ  గుట్టుగా వాడేసుకొనే గుటుక్కుమనాలని చూస్తాడని యాండీ ఆలోచన.
ఎలాగూ పోతున్నాం గదా.. అని ఇంత కాలం ఉగ్గపటుకొన్న  మందు.. పొగల్లాంటి పాడు అలవాట్లు మళ్ళీ మొదలెట్టే మహానుభావులూ లేకపోలేదని ఆయనగారి  మరో ఎద్దేవా. జుత్తు కత్తిరించుకొనే ఖర్చు మాత్రం అందరికీ ఒకే విధంగా వృథా  అనిపిస్తుందని హాస్యంకూడా ఒలకపోసాడా యాండీ తన వ్యాసంలో. ఇష్టమైన పబ్బులు..  మసాలా మూవీలు ఎంత దూరంలో ఉన్నాసరే వెళ్ళి చూసి తరించాలని ఉవ్విళ్లూరే  విలాసవంతుల లీలలయితే ఇహ వేరే చెప్పల్సిన అగత్యమే లేదుట. తిండియావ ఉన్నవాళ్లయితే ముప్పూటలా మేతమీదనుంచి ధ్యాస మళ్ళించరని  యాండీ చమత్కారం. ఏది ఏమైనా ఫ్వూనరల్ ఏర్పాట్లు స్వీయాభిరుచుల ప్రకారం  దగ్గరుండి మరీ చేసుకొనే సౌకర్యంమాత్రం ఆ దురదృష్టవంతులకు ఒక్కళ్లకే సొంతం కదా! ఆహా! ఎంత అదృష్టంహఠాత్తుగా ప్రాణాలు తీసుకొనే ఆవేశపరులకు కనీసం ఆ వెసులుబాటైన దొరకదు! ప్చఁ.. దురదృష్టం!
నిజానికి ప్రాణాలు తీసుకోవడం ప్రాణాలు పోయేటంత బాధాకరంగా ఉంటుంది. ఇంతకాలం ఎంతో శ్రద్దాసక్తులతో పెంచి పోషించుకొన్న కుక్కా,, మొక్కా వదిలి పోవడం ఎంత బాధాకరం! ఏ సంసార ఝంఝాటం వద్దనుకొని ..బైరాగిలా బతుకు వెళ్లదీసే బాపతు సన్నసైనా తెల్లారితే బతుకు తెల్లారిపోతుందని తెలిస్తే తెల్లవార్లూ కుమిలి పోకుండా ఉండగలడా! చేతిలో చిల్లిగవ్వ లేకపోతేనేమి.. అన్నీ పక్కమీదనే  జరిపించుకొనే  రోగిష్టిమారి జీవి అయితేనేమి.. ప్రాణాలు పోతున్నాయని తెలిస్తే సంతోషంతో గంతులేస్తాడంటే నమ్మలేం. అవుట్ రైట్ గా 'అసలే జన్మా వద్దు .. పొమ్మ'ని సన్యాసులు అనే మాటలన్నీ  మాట వరసకనే మాటలుగానే తీసుకోవాలి. న్నో బాధలు పడే అభాగ్యుడికైనా సరే.. వచ్చే జన్మలో ఏ బిల్గేటు కొడుగ్గానో.. మోదీలాంటి పిడుగ్గానో.. మహేష్ బాబుకి మోడలుగానో పుడితే బాగుణ్నన్న బలీయమైన వాంఛ మనసు అట్టడుగు  పొరల్లో ఎక్కడో దాగి ఉంటుంది. మరలాంటప్పుడు చేతిలో ఉన్న విలువైన మానవజన్మను చూస్తూ చూస్తూ వదులుకోవడం ఏమంత తెలివైన ఆలోచన!.. విడ్డూరం కాకపోతే!
ఈ మద్య ఏ వార్తాపత్రిక తిరగేన్తున్నా.. ఏ టీ.వీ చానెల్ తిప్పి చూస్తున్నా.. చావు వార్త కళ్లబడకుండా ఒక్క పూటైనా చల్లంగా గడుస్తున్నదా! ఓపికున్న వాళ్ళెవరైనా ఈ దిక్కుమాలిన చావువార్తలు  లెక్కలు తీసి చూడండి! భూమి పుట్టినప్పట్నుంచీ పోయినవాళ్లే ఉన్నవాళ్ళకన్నా ఎన్నో రెట్లు అధికమన్న చేదునిజం  బైటపడుతుంది. బాధ పుడుతుంది.
అంతుబట్టని రోగాలతో..  ఆహారపరమైన లోపాలతో.. గర్భస్రావాలతో.. పురిటి బాధలతో.. ఫ్యాక్షనిస్టుల కక్షలతో..  వాతావరణ కాలుష్యాలతో.. . వడదెబ్బలతో.. పరువు హత్యలతో.. మందుతో.. కల్తీ మందులతో.. హరి హరీ.. ఇదీ అదీ అనేమిటి.. చివరికి  చిటికెన వేలంత లేని దోమలతో.. దూకుడుగా తిరిగే వాహనాలతో  సైతం  'హరీ' అనే వారి సంఖ్య రోజు రోజుకూ మరీ మరీ ఎక్కువవుతున్నాయి!అగ్నిప్రాఅదాలు.. భూకంపాలు.. వరదలు..కరువులు వ్హాలకు  ఇప్పుడు అదనంగా సొంతంగా వింత వింత కారణాలతో ఎవరి గొంతులు వాళ్ళే నులుముకోవడాలు ఒకటి..  మితిమీరిపోతున్నాయి.. కలవరం కలిగిస్తున్నాయి! ప్రకృతి సమతుల్యం దీని మూలకంగా దెబ్బతింటే బతికి ఉన్నవాళ్ళకీ చచ్చే చావే!
రైతు పురుగుమందు మింగితే బీడువారిని పొలం మళ్లీ చిగురిస్తుందా? ఆకలికి తట్టుకోలేక నేతపనివాడు చెట్టుకు ఉరి వేసుకొంటే బతికి ఉన్న అతని కుటుంబానికి మేత దొరుకుతందా? ముక్కు మూసుకున్నంత మాత్రాన అప్పుల తిప్పలు ఎవరికీ తప్పిపోవు. మిగిలున్న అతగాడి వారసులను చుట్టుముటి ముప్పతిప్పలు పెడతాయి! ఉన్న ఉద్యోగం ఉద్వాసన పలికిందనో.. వైద్యానికందని రోగం వంటిమీదకొచ్చి వదలడం లేదనో.. చేస్తున్న కంచిగరుడ సేవకు పెద్దల గుర్తింపు కరువయిందనో.. వ్యాపారం ఎక్కిరాక అప్పులపాలు చేసి తిప్పలుపెడుతున్నదనో.. పరీక్షల్లో, ప్రేమలో విఫలమయ్యామనో.. సీనియర్ల ర్యాగింగుల్లో మానవీయకోణం కూడా బొత్తిగా కరువయిందనో.. ఉపాధ్యాయులో.. ఇంటిపెద్దలో విపరీతంగా  మందలించారనో.... అభిమాన తారకు/తారడుకి వేరే వారితో పెళ్లయి పోయందనో.. ఆరాధ్యనేతలు అవినీతి కేసుల్లో చిక్కి చెరసాల పాలయ్యారనో.. కోరుకొన్న రాష్ట్రం ఎంత పోరినా వచ్చి ఓళ్ళో వాలడం  లేదనో.. సెల్ టావర్లు క్కి.. టాంకుబండునుంచి దూకి.. వంటిమీద గ్యాసునూనె ఒలకబోసుకొని... పురుగులమందు మింగి.. ఫ్యానురెక్కలకు ఉరి వేసుకొని.. కన్నవారికి కడుపుకోత మిగల్చడం.. తాము కన్నవారిని అనాథులు చేయడం.. ఎంత తెలివిమాలినతనం! చావడానికిలా తొందరపడడం ఎంత చిచారకరం!
రాజుల ఆట కట్టించేందుకు బంటులు చావడం చదరంగం రూలు. నిజ జీవన రంగంలో  ఎన్ని కోట్లబంటులు ఆత్మార్పణ చేసుకొన్నా రాజుల ఆట కట్టదు. ఆగదు.. చచ్చేందుకు సవాలక్ష దారులు. చావుఘడియ ముంచుకొస్తే.. ఏ మున్సిపాలిటీ చెత్తకుప్పయినా  చాలు.. మీద పడేందుకు! నోరు మూయని బోరుబావో.. మ్యాన్ హోలో చాలు.. లోపలికి లాక్కునేందుకు! ఫలానా రోజున మరణం ఖాయమన్న వర్తమానం అందినా సరే.. ఆఖరి క్షణం వరకు మనిషిగా మెలగడమే మనిషి చేయతగిన పని. బతికేందుకున్నది ఒక్కటే దోవ. గుండె దిటవు.  బతికి తీరాల్సిందేనన్న పంతం ఉంటే చాలు.. అర్థాంతరంగా చావడం ఎంత తొందరపాటో అర్థమవుతుంది. చావడానికి ఎందుకు తొందర?   
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- 'చుట్టు పక్కల చూడరా' కాలమ్ లో ప్ర
చురితం)



Tuesday, April 26, 2016

తెలుగు వెలుగులు- ఈనాడు సంపాదకీయం

తెలుగువారికోసం తెనిగించిన ప్రమ సంపూర్ణ వైష్ణవ ప్రధాన తత్వకావ్యం నన్నయ మహాభారతం. ఆదికవిగా నన్నయను ఆదరించింది తెలుగుతల్లి. నన్నెచోడునివంటి శైవ ప్రజాకవినీ అంతే ప్రేమగా చేరదీసింది. హరిహరులకు అబేధం చాటుతూ గొప్ప నాటకీయతతో పదిహేను పర్వాల భారతాన్ని అపూర్వంగా పూరించిన తిక్కననూ అక్కున చేర్చుకుని ధర్మ నిష్పక్షపాతాన్ని నిరూపించుకుంది. ఎర్రనవంటి ప్రతిభా ప్రబంధ పరమేశ్వరులు ఎందరో తెలుగుతల్లి కడుపున  జన్మించారు. ప్రౌఢశైలి, శబ్దగుంభన, పదమాధుర్యం, చమత్కృతులతో ‘చమక్ మనిపించే మనుచరిత్ర, వసుచరిత్ర, కళాపూర్ణోదయం, విజయవిలాసం,
పారిజాతాపహరణంవంటి ఆభరణాలు తెలుగుతల్లి గళంనిండా కనులపండువుగాఎన్నెన్నో! శ్రీనాథుని కాశీఖండం, పోతనామాత్యుని మహాభాగవతం, మొల్లతల్లి రామాయణం, కదిరీపతి శుకసప్తతి, అన్నమయ్య పదకవితలు, త్యాగయ్య పంచరత్నాలు, క్షేత్రయ్య మువ్వగోపాలపదాలు, రంగాజమ్మ యక్షగానం.. వేమన ధూర్జటి కుమార కుమారి సుమతీ నీతిశతకాలూ... మన్నికైనవి ఇవీ అని- ఎన్నెన్ని ఎంచి చూపించాలి! రాయలవారి నుంచి రామదాసులవారి వరకు- ఒకరినిమించి ఒకరు అమ్మకు సమకూర్చిపెట్టిన సొమ్ము సమ్మంధాల వివరాలను.. వాటి తళుకు బెళుకులను వర్ణించుకుంటూపోయేందుకు ఒక జన్మ చాలదు. తూర్పు చాళుక్యుల పాలనంతటి పురాతనమైన తరువోజ అలంకారాలు, శతాబ్దాలకిందటి కందుకూరి శాసనమంతటి సౌందర్య 'సీస'లు, ద్విపదలు. తుమ్మెదపాటలు, గొబ్బిపదాలు, వెన్నెలపాటలు, ఊయలగీతాలు, గౌడుగేయాలు, అభినయంతో కూడిన అలతులు.. పెట్టెనిండా పట్టకుండా పొంగిపొర్లే అలంకారాలు- తెలుగుతల్లికి న్నెన్నో!

'చిక్కని పాలపై మిసిమి చెందిన మీగడ పంచదారతో/ మెక్కిన భంగి.. మక్కువ పళ్ళెరంబున స/ మాహిత దాస్యమనేటి దోయిటన్/ దక్కెనటంచు' రామదాసు జుర్రుకొన్నది రామయ్య రూపంలో ఉన్న సుధారసమా? తెలుగుభాష సౌందర్య రూప విశేషమా? ఒక్క రామదాసువంటి భక్తశిఖామణులని ఏముంది.. సాక్షాత్ ఆ భగవంతుడినే అలరించిన సుమధుర భాషాక్షరాలు ..లు. ఆంధ్ర మహావిష్ణువు.. శ్రీ కృష్ణదేవరాయలకి కలలో కనిపించి గోదాదేవి కల్యాణ గాను తెలుగులోనే రాయాలన్న పురమాయింపుకు కారణం  శ్రీవారే స్వయంగా సెలవిచ్చారు కదా! 'తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను/ తెలుగు వల్లభుండ తెలుగొకండ' నడమేనా! 'యెల్ల నృపులు గొలువ నెఱుగవే బాసాడి!' అని చురక కూడా అంటించారు. రాయలవారిది  ప్రారంభంనుంచీ పెను ఆంధ్రభాషాభిమానమేనని. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని మనస్ఫూర్తిగా నమ్మిన భాషాపోషకులని చరిత్ర చెపుతూనే ఉంది. స్వయంగా 'తుళువు' అయినా తమిళ గోదాదేవి గాను తెలుగులోనే రాయ సంకల్పించేందుకు  కారణం ఆంధ్ర భాషమీదున్న గాఢాభిమానమే. 'అక్షరం కొసను అచ్చుతో ముగించగల అజంత సౌలభ్యం ప్రపంచభాషలన్నింటిలో ఇటాలియనుకిలాగా ఉన్నందు వల్లనే  తెలుగ పలుకుకీ కలకండ పలుకు తియ్యదనం' అని ముందు గుర్తించిన మహానుభావుడు హాల్డెన్ దొర. 'వ్రాసిన- పద్య మాంధ్రమున వ్రాయవలెన్' అని దాశరథి అన్నారంటే ఆశ్చర్యపోవలసింది ఏముంది! అప్పయ్య దీక్షితులవంటి ఉద్దండ తమిళపిండమే 'తెలుగు నేలపై పుట్టుక పూర్వజన్మ సుకృతఫలం' ని పొగడ్తలకు దిగిన తరువాత- ఆంధ్రభాష ఘనతకు మరో ధ్రువపత్రం అవసరమా! మధ్యమధ్యలో స్వరం, స్వరూపం మారుతూ వచ్చినా శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంనాటి తెలుగక్షర సౌందర్యం, మాధుర్యం ఈ నాటికీ అమరావతీ స్థూపమంత స్థిరంగానే ఉంది. సరే! తెలుగువారి గుండెలమీదా అంతే స్థిరంగా ఉందా? గిడుగు, గురజాడ, కందుకూరి, విశ్వనాథ, శ్రీ శ్రీ, జాషువావంటి మహామహులు తెలుగుతల్లి గుమ్మంలో వెలిగిస్తున్నా.. ఆ గుమ్మటాల వెలుగులు వెలా తెలా తేలిపోతున్నాయే! ఆ తెగులేనయ్యా  ఇప్పటి మన దిగులు.

తిరుపతి వేంకటశాస్త్రిగారు ఒకానొక శతావధాన ప్రదర్శన సందర్భంలో 'రెండు బాసలకు మేమే కవీంద్రులమంచు'  రోషంతో మీసం మెలివేశారని వినికిడి. దేవభాషలో దిట్టయివుండీ తన మాతృభాషాభిమానాన్ని  దానికి ఈటుగా చాటుకున్న శ్రీనాథుడి వారసత్వాన్ని గూర్చి చెప్పుకోవాలి. 'అత్యంత సుకుమారి ఆంధ్రభాషా యోష/ ఆత్మీయ ముద్దుచెల్లి నాకు' అన్న అన్నప్రేమ ఎంతలా పొంగిపొర్లకుంటే శృంగారనైషధంమీది శ్రద్ధ చాటువుల్లోనూ చాటుకుంటాడు! వామనభట్టువంటి దిట్టలున్న వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడికి విద్యాశాఖాధికారి పట్టం కట్టబెట్టింది ఈ తెలుగు భాషమీది దిట్టతనమే! అచ్చుకు తగినట్లు వర్ణక్రమాన్ని సంస్కరించి, ఎన్నో విస్తృత ఉద్గ్రంథాలను పండితుల సాయంతో పరిష్కరించేందుకు బ్రౌనుదొరను పురిగొల్పిందీ తెలుగు పలుకుబడిలోని తళుకు బెళుకులే! తరిగొండ వేంగమాంబ చేత- జనం నాలికలమీద నేటికీ నాట్యమాడే సరళ తత్వాలను రాయించింది తెలుగుభాషలోని అజరామరమైన  సౌందర్య లక్షణమే! కాలంతోపాటు వేగం పెరిగింది. వినిమయ విస్తృతికున్న ఎల్లలు చెదిరిపోయి ఇల్లే వైకుంఠమనుకునే కాలం చెల్లిపోయింది. అంతర్జాతీయ సాంకేతికావసరాలకు సరితూగటంలేదన్న వంకతో తల్లిభాషను చిన్నచూపు చూసే పెడధోరణి ప్రమాదకర స్థాయికి పెరిగింది! మాతృభాష కన్ను వంటిది. పరాయిభాష ఎంత ఘనమైనదైనా కళ్లజోడుకన్నా ఎక్కువ ఉపయోగానికి రానిది. తల్లిపేగు ప్రాణధార, తల్లిభాష జ్ఞానధార. తల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే తల్లిభాషకూ ప్రత్యామ్నాయం ఉండదు.  కోట్లాదిమంది బిడ్డలుండీ తల్లికి చీకటి కొట్టే గతి కావడం జాతికి శుభం కాదు. కంప్యూటరీకరణకు అచ్చుగుద్దినట్లు అమరే ఏకైక భారతీయ భాష తెలుగు లిపే. భావవేగాన్ని అత్యంత సమర్థవంతంగా అందిపుచ్చుకునే  పరుగు పందెంలో  రోమనువంటి యూరోపియను భాషలతోనే కాదు..  మన దేవనాగరి లిపితోనూ ముందంజలో ఉంది  తేనెలొలుకే మన తీయని తెలుగుభాషే అని సైన్స్‌ టుడే’ లో  ఎన్నడో వచ్చిన  వ్యాసం ప్రస్తుతించింది. ప్రస్తుతం కొరతపడిందల్లా తెలుగు వారి గుండెల్లో కాస్తంత ఆత్మగౌరవం.. మాతృభాషమీది అభిమానం.. మన తెలుగు కదా.. ఎలాగైనా మళ్లీ  నిలబెట్టుకోవాలన్న ధృఢ సంకల్పం
-సేకరణః
కర్లపాలెంహనుమంతరావు
(ఈనాడు, సంపాదకీయం, 08-01-2012 లో ప్రచురితం) 
(ఈనాడు సంపాదకులకు .. యాజమాన్యానికి ధన్యవాదాలు.. కృతజ్ఞతలు)


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...