Monday, September 12, 2016

పేరు- ప్ర తిష్ఠ- సరదా గల్పిక

వంశాంకురం మీదుండే వాత్సల్యం కన్నవాళ్ల చేత ఏ తాత పేరో.. అమ్మమ్మ పేరో పెట్టేట్లు చేస్తుంది. ఇంటి పేరు నిలబెడతాడనుకొన్న ఘనుడు ఇంటిమీదకు మనుషులొచ్చి పడే ఘనకార్యాలకు మొదలు పెడతాడు. ఏ ఎమ్ సెట్టులోనో ఫస్టొచ్చి పేపర్లనిండా ఫొటోలూ.. పేరు కనబడేట్లు ఎదుగుతాడని పొంగిపోతారా,, పేపర్లలో పేరు కనిపించే కలవరకు నిజం చేస్తాడు. కానీ.. ఆ పేరుకు అప్రతిష్ఠ తోడయేట్లు  లీకులు.. గట్రా కుంభకోణాలకు పాల్పడకుంటే కన్నవాళ్ల పుణ్యం పుచ్చినట్లే లెక్క.  ఏ ఏడుకొండలవాడి కొండదాకానో  వెళ్ళి ఎన్ని పొర్లు దండాలు పెట్టుంటారో పాపం తల్లి దండ్రులు.. ఓ నలుసు కడుపులో పడ్డానికి!  ఇప్పుడు వంట్లోని పులుసంతా కారిపోయేటట్లు నేరసామ్రాజ్యంలో ఓ చిన్న డానై కూర్చుంటాడు. 'చిన్న తనంలో వేళకు తిండి తిప్పలైనా చూసుకోకుండా మాలకాకిలా తిరుగుతుంటే  బిడ్డ 'అయ్యో!.. చిక్కి శల్యమైపోతున్నాడ'నుకొంటూ తల్లి తల్లడిల్లి పోతుందా! ఇప్పుడు అదే తల్లి బిడ్డ దిక్కుమాలిన పిచ్చి చేష్ఠలకు అలవాలంగా మారి  పోలీసు యంత్రాంగానికి  చిక్కకుండా  తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడ్చేందుకు కారణమవుతాడు. పసితనంలో వేళకి పాలు పట్టడం క్షణం ఆలస్యమైనా కక్కటిల్లిపోయే బిడ్డ .. ముడ్డికిందకు ఏళ్లొచ్చాక  కక్కలేని.. మింగలేని దుస్థితి  కన్నవారికి తేడన్న గ్యారంటీ ఏమీ లేదు ! పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకొని నవమాసాలు మోసి  కన్న సుపుత్రుడు బతికున్నన్నప్పుడే   నరకం చూపించకుంటే అక్కడికా కన్నవాళ్ళు  పూర్వజన్మలో పూలతో పూజ చేసుకున్నట్లే! పుట్టంగానే పేరు పెట్టాలి బిడ్డకు. దానితోనే వస్తున్నాయి చిక్కులన్నీ! పెరిగి పెద్దయిన తరువాత ఏం ఘనకార్యం వెలగబెడతాడో .. పాపం కన్నవాళ్ళేకు మాత్రం ఏం తెలుస్తుందిభవిష్యత్తును చూడగలిగే అంజనం డబ్బీ ఒంటి గూట్లో ఏమీ దాచిపెట్టుకొని ఉండరు గదా!
ఈ గోలంతా లేకుండా గోరావంటివారు ఓ దివ్యమైన చిట్కా కనిపెట్టారు. తన బిడ్డలకు సమయ సందర్భాలను బట్టి నామకరణం చేసారు.  ఉప్పుసత్యాగ్రహం సమయంలో పుట్టిన ఒక బిడ్డకు 'లవణం'.. రెండో ప్రపంచ యుద్దం సమయంలో పుట్టిన బిడ్డకు ' సమరం' అని నేమ్ ట్యాగులు తగిలించారు. అదృష్టం బాగుండి ఆ బిడ్డలిద్దరూ తండ్రికి తగ్గ తనయులుగా  మంచి పేరు గడించారు. అందరూ గోరా సంతానమంత భాద్యతగా మసులుకుంటే లోకం స్వర్గధామమేగా!
కరుణానిధికిలాగా లెనిన్ పేరు పెట్టుకొన్న పుత్రరత్నం వీధి పారోటాలకు కాలుదువ్వే రకమైతే   పేరు పెట్టి తన అభిమాన నాయకుణ్ణి  అవమానించినందుకు బాధను దిగుమింగుకోవాలి  తల్లిదండ్రులు.  బెజవాడ  వాడ రాజకీయాల్లో ఎప్పుడూ స్వాతంత్ర సమర వీరుల నామదేయాలే నలుగుతుంటాయి. ఒకనాడు జాతి  జాతిని స్వాతంత్ర్య పోరాటబాటలో నడిపించిన  గాంధీలు.. నెహ్రూలు.. బోసుబాబులకు ఇప్పుడు  కృష్ణాతీరం వైపుగా తేరిపార చూసే అవకాశాలు బొత్తిగా లే వు కాబట్టి  బతికిపోయారు.
ఈ గొడవలేమీ లేకుండా గోడమీది పిల్లి వాటంగా బతికే  లల్లూ ప్రసాదు యాదవు సాబు  ఎంతో ముందు చూపుతో  బిడ్డలకి 'కుర్సీ'  'లడ్డూ' అంటూ పేర్లు  పెట్టేసుకొన్నారు.

పేరుకి.. ప్రతిష్ఠకి సోనియా గాంధీకి.. మహాత్మా గాంధీజీకి మధ్య ఉన్నంత అంతరం ఉంది.

కన్నవారి కోణంనుంచి చూస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో.. పేరు పెట్టించుకున్న వారి కోణంనుంచి చూస్తే అంతకు పదింతలు ఇబ్బందులున్నాయి. రామారావు అని పెద్దాళ్లు ఏదో అమాయకంగా  పేరు పెట్టారుగదా అని.. దానికి తగ్గట్లే మంచి బాలుడుకి మల్లే  నడుచుకుంటే పక్కింటి పాపకైనా లెక్కలోకొస్తాడా కుర్రోడు! ఈల వేయడం.. గోల చేయడం.. గట్రా..  పాత కాలం టైపు అరిగిపోయిన చాదస్తం. టీనేజి ఆడపిల్లలకే ఆ టీజింగ్ అవుటాఫ్ వేధింపు. మంచి పేరుకోసం జీవితాంతం మంచి వెధవగా మసులుకోడమంటే మనిషి జన్మ ఎత్తినందువల్ల ఒనగూడిన సవాలక్ష లాభాలన్నింటికీ స్వచ్చందంగా తిలోదకాలు ఇచ్చుకొన్నట్లేగదా! 
కాలేజీ క్లాస్ మేట్సు ఒక్కళ్లనే ఏడిపిస్తే తల్లిదండ్రులు అంత కష్టపడి పెట్టుకొన్న పేరు పదిమంది దృష్టిలోకి  ఎలా విస్తరిస్తుంది? ఒకే వార్తా పత్రికలో ఓ మూలో కీచకుడు ఆడపిల్లని వేధించిన వార్తా .. మరో మూల ఆటోలో దొరికిన సొమ్మును నిజాయితీగా ఒరిజినల్  ఓనరుని వెతికి పట్టుకొని మరీ అప్పగించిన అప్పారావు  వార్తా వచ్చాయనుకోండి. ఎక్కువ మంది పాఠకులు మక్కువగా ముందు చదివేది.. మరో అట్లాంటి వార్త వచ్చిందాకా ఫేసుబుక్కుల్లో పడేసి  చర్చించుకొనేదేది ఏదీ
 'సిద్ధార్థ అని పెద్దాళ్ళేదో చాదస్తం కొద్దీ పేరు పెట్టేసినంత  మత్రాన బుద్ధభగవానుడిక మల్లే 'ధర్మం శరణం గఛ్చామిటైపు ఒక్క రూటునే పట్టుకు వేళ్ళాడితే తీవ్రంగా  నష్టపోయేది ఎవరు స్వామీఆలస్యంగా తగలడి.. ఆదరాబాదరాగా   వెళ్ళిపోయే లేత వయసుని  ఫుల్లుగా ఎంజాయ్ చేసే అవకాశం తల్లిదండ్రులకోసం నానపెడుతూ కూర్చునే  పిచ్చికుంకలెవరికీ ..  లేటు  వయసులో చాటు(chat) చేసుకునే టాపిక్కులేవీ దొరక్క చాగంటివారి సోదుపన్యాసాలు  మొహం గంటుపెట్టుకునైనా  వింటూ కూర్చోక తప్పదు.
ఈ కాఅం సజ్జు ఈ-కాలం గుజ్జు. ఆధ్యాత్మిక  నరకాలను నిద్రలో కూడా సహించరు. అందుకే  తల్లి కడుపులో ఉన్నప్పట్నుంచే బుజ్జాయి   భూమ్మీదకొచ్చి ఏం చెయ్యాలన్న రూట్ మ్యాపు సిద్ధం చేసుకొంటుంది.   ఎంతటి వెధవ పనికైనా  కొంపలు  మునక్కుండా ఉండే ఏ కండోం టైపు చిట్కాలో  పట్టపగలు చింతపండమ్మే కొట్లల్లో సైతం  చేతికందుబాటులో ఉంటున్నప్పుడు.. వీరబ్రహ్మం అని పేరు పెట్టారు కదా అని నిజంగానే బ్రహ్మచర్యం నిష్ఠగా పాటిస్తానంటే? మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల రకాల జీవాల్లోకెల్లా  బ్రహ్మాండమైన ఉత్తమ జన్మంటారు భయ్! సన్యాసులమని చెప్పుకుంటూ  తిరిగే ఆశారాం బాపులకే పాపలమీద ఆశలు  చంపుకోడం లేదు. పెద్దాళ్లేదో తమ చిన్ననాటి  చాదస్తం  కొద్దీ  ఏ శేషతల్ప సాయనో.. కల్పవల్లి తల్లనో బుద్ధిమంతుల పేర్లు తగిలించినంత మాత్రాన  వాళ్ల ముచ్చట్లు  తీరడానికని బుద్ధభగవానులకు మల్లే డైలీ సీరియల్లాంటి కాలేజీ క్లాసు పీకుళ్లకు అటెండవడాలు.. లేట్ నైటు టీ కాఫీలు తాక్కుంటూ నైటవుట్లతో చదువు సంధ్యలు నెట్టుకు రావడాలు.. అదంతా   ట్రాష్! లైఫ్ స్పేస్ బోట్ క్రాష్ అవడం కిందే లెక్క నేటి పోరగాళ్లకు.
'జీవితం ఎన్నో చిన్నద'న్నాడు ఓ సినిమా కవి.  ఏ చిన్నదో.. చిన్నాడో అనుక్షణం పక్కనుండక పోతే ఆ చిన్నది మరీ కురచదై పోతుందని భయం కుర్రకారుకి. కృష్ణ భగవానుడని పేరు పెట్టినంత మాత్రాన బిడ్డలు  నికృష్ట చేష్టలకు ఆశ పడకూడదన్న ఆంక్షలు ఎంత కన్నవారికైనా తగదు.
లోకాన్నొక వంక ప్రపంచీకరణ వంకతో పచ్చి డబ్బు సంతలా మార్చేసి జీవితం సంతోషమయంగా మార్చుకోడానికి సంత్ తుకారాం టైపు నియమ నిబంధనలక్కట్టుబడి ఉండమని  సన్నాయి నొక్కులు  నొక్కడం.. అన్యాయం !
ఎవరి కథలు వాళ్లే ఆత్మకథలుగా రాయించుకుంటే సరి.. ప్రపంచంలో పాపాత్ముడంటూ కలికానికైనా కనిపించడు. కంసుడైనా  ఖర్చుకు వెనకాడకండా స్వంత చరిత్రను రాయించుకొని ఉంటే మనకీ  రోజు కంసుళ్ళే పరమహంసలకు మల్లే ఆదర్శనీయంగా ఉండేవాళ్ళు.    అనుకుంటాం గానీ..   రావణాసురుడే నయం.  ఆడకూతుర్ని   ఎత్తుకొచ్చినా  కృష్ణుళ్ళా పెళ్ళాడ లేదు. ఆడేది జూదం. ఆడించేవాడు శకుని మామని తెలిసీ పందేనికి దిగడం..  వరస బెట్టి ఓడుతున్నప్పుడైనా ఆట వరస తెలుసుకోకుండా.. వంటిమీద స్పృహ కోల్పోయినట్లు.. సొంత తమ్ముళ్లనీ.. తాళి కట్టిన పెళ్లాన్నీ ఒడ్డడం.. ధర్మరాజు బుద్ధితక్కువతనం.  రావణాసురుడు.. సుయోధనుళ్లే.. చరిత్రలో ప్రతినాయకులగా మిగిలిపోయారు. పేరులో ఏమున్నది? పురాణాలు రాసి పెట్టేవాడిలో ఉన్నది గమ్మత్తంతా! ఆ పుక్కిట పురాణాల్ని పట్టుకొని రాముడి పేరు పెట్టి ఒక్క ఆడమనిషినే నమ్ముకోవాలని ఆశించడం.. బుద్ధుడి పేరు  తగిలించినందుకు ఒక చెంపకు మరో చెంప చూపించే సహనం అలవర్చుకోవాలనడం.. రహీమ్ పేరు రుద్దేసి 'రహం కర్' అని గద్దించడం.. ఎంత కన్నవారికైనా తగదు.. తగదు.. తగదు.. తగదు!
-కర్లపాలెం హనుమంతరావు




Friday, September 9, 2016

వస్త్రదానం- కౌముదిలోని మరీ చి.క (మరీ చిన్న కథ)


'కూడూ.. గుడ్డా.. నీడా' అన్నారు. గుడ్డే రాఘవయ్యగారిపాలిట గండమై కూర్చొంది. వంటిమీద నూలుపోగుంటే కంటిమీద కునుకుండని జబ్బు ఆయనగారిది!
బాల్యంలో ఆయన తల్లి పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా వంటిమీది బట్టలన్నీ విప్పేసి ఆరుబైలు చల్లగాలికి నిద్రపుచ్చుతుండేది. ఆ వస్త్రవిసర్జనే రాఘవయ్యగారికి ఒక నిద్రఅలవాటుగా మారిపోయింది.
ఒక్కడే కొడుకు కావటాన ఆ గుట్టు ఇంటిగుట్టుగానే మిగిలిపోయింది. పెళ్లయి కాపురానికొచ్చిన మొదటిరాత్రి సావిత్రమ్మకే మళ్ళీ తెలియడం. కొన్నాళ్ళు షాకులో ఉన్నా క్రమంగా ఆ ఇల్లాలూ భర్త నిద్రావస్థకు తననే సర్దుబాటు చేసుకొంది.. పాపం!
చేసింది బ్యాంకు ఉద్యోగం కావడాన ఆట్టే బైటడ్యూటీలు అవీ లేక రాఘవయ్యగారు ఇబ్బంది పడలేదు. కానీ శుభాశుభకార్యాలకు బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి రాత్రిళ్ళు ఉండాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇబ్బందులు తప్పేవి కాదు. సాధ్యమైనంత వరకు 'రాత్రి బసతప్పించేవాడు. తప్పనప్పుడు  ప్రత్యేకమైన గది చూసుకొనేవాడు. రెండూ కుదరని రాత్రులు కాళరాత్రులే!
తండ్రి నిర్వస్త్రావస్థ కడుపున పుట్టిన  బిడ్డక్కూడా తెలీకుండా ఎలా నెగ్గుకొచ్చిందో ఆ  మహాఇల్లాలుకే తెలియాలి.
ఎల్లకాలమూ ఒక్కలా చెల్లవుకదా! పిల్లకు పెళ్లయి అల్లుడు విదేశాల్లో స్థిరపడిన తరువాత.. అవసరార్థం కూతురు మొదటి కాన్పుకని భార్యతో కలసి ఆరునెలలకని  ఆస్ట్రేలియా వెళ్లి.. వచ్చిన తరువాత కంటిమీద కునుకు బొత్తిగా కరువయి రాఘవయ్యగారు సుస్తీ పాలయ్యారు.! 
ఎక్ప్పర్టులక్కూడా  అంతుచిక్కని  జబ్బు! రొటీన్ చికిత్సలేవీ  పనిచేయనే లేదుకూతురు సింగిల్ బెడ్రూం ఫ్లాటులో   ఆర్నెల్లపాటు ఆ ప్రత్యేక నిద్రాసౌకర్యంకుదరక ఆరోగ్యం దెబ్బతిన్నదని  సావిత్రమ్మ   బైటికెలా చెప్పుకోగలుగుతుంది!
'గత జన్మల్లో  ఎవరికో నిద్రాభంగం చేసి ఉంటాను. ఎవరివంటిమీది బట్టలో దొంగిలించి ఉంటాను. కాబట్టే నాకీ జన్మలో ఈ విచిత్రమైన శిక్ష!’ అంటూ ఒహటే సెంటిమెంటలుగా వాపోవడం ఎక్కువయిందీ మధ్య మరీ రాఘవయ్యగారికి.
ఉన్నట్లుండి ఒక మధ్యరాత్రి హఠాత్తుగా రాఘవయ్యగారి గుండె ఆగిపోయింది! ఆ సమయంలో ఆయన వంటిమీద యథాప్రకారం నూలుపోగు లేదు!
నలుగుర్నీ కేకేసే లోపల భర్త పార్థివదేహానికి కనీసం లంగోటీ అయినా తొడగాలని .. పాపం.. సావిత్రమ్మ ఆరాటం. ఆడమనిషి. వయసా మీద పడింది. సాధ్యపడుతుందా! బియ్యబ్బస్తాకన్నా బరువున్న భర్తను పడగ్గదినుంచి స్నానాలగదిలోకి ఎలా చేరవేసిందో ఆ పర్మాత్ముడికే తెలియాలి!
రాఘవయ్యగారు  బాత్రూంలో జారిపడి పోయారన్నవార్తే బైటికొచ్చింది. కూతురికి  వార్త తెలిసి బైలుదేరి వచ్చేందుకు కనీసం రెండు రోజులు పడుతుంది.  ఉదారంగా ఉండే ఫ్లాట్ ఓనర్సు అసోసియేషన్ ప్రెసిడెంటు 'ఒక్క పూటైనా 'పీనుగ' అపార్టుమెంట్ ఆవరణలో ఉండేందుకు వీల్లేదని' ఎందుకంత కఠినంగా అన్నాడో సావిత్రమ్మకే తెలియాలి. బావగారి కొడుకును బతిమాలుకొని  హడావుడిగా  భర్తచితికి కొరివి పెట్టేయించింది సావిత్రమ్మ. పుణ్యకార్యాల సమయంలో  కూతురు పురోహితులతో  దానాలను గురించి చర్చిస్తున్నప్పుడు..'  గోదానం, భూదానం, సువర్ణదానం.. వగైరాలన్నీ ఆనక. ముందు వస్త్రదానం సంగతి చూడండర్రా' అని మొత్తుకుంది  అంత దుఃఖంలోనూ పాపం సావిత్రమ్మ ముందుకు వచ్చి!
వచ్చేజన్మల్లోనైనా భర్తకు నిద్రావస్థతప్పాలని పాపం ఆ  ఇల్లాలి ఆవేదన!
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక సెప్టెంబర్, (2016- మరీ చి.క(మరీ చిన్న కథ) గా ప్రచురితం)



Sunday, September 4, 2016

భద్రం.. నాయనా! ( వినాయక చవితి సందర్భంగా ఓ సరదా గల్పిక

సెప్టెంబర్- 5. 2016  వినాయక చవితిః ఆ సందర్భానికి ఒక హాస్య గల్పిక
'వినాయకా! చవితి శుభాకాంక్షలు నాయనా!'
'ధన్యవాదాలమ్మా! మరి .. నేనో తొమ్మిది రోజుల
పాటు భూలోకం  ట్రిప్పుకు వెళ్ళి రానా? భక్తబృందాలన్నీ ఎదురు చూస్తున్నాయంటూ పొద్దుట్నుంచీ ఒహటే సందేశాలు చరవాణిలో!'
'భద్రం లంబోదరం! వెళ్ళేది జంబూ ద్వీపం.  జెంబో జెట్టులెన్నున్నా పట్టనంత భక్త బృందాలు  నీకు! ఈ పాటికే కోట్లకు కోట్లు విరాళాలు  పోగయి ఉంటాయ్నూలు పోగైనా  నోచుకోని బీదా బిక్కీ బోలెడంతమందున్నారు బాబూ నీ భక్త బృందాల్లో! వాళ్లనూ బాది మరీ వసూలు చేసే ఉంటారు  'చందా'మామలు! ధరాతలంమీద ధరలెలా మండిపడుతున్నాయో తెలుసా? నీకేమో ఇరవయ్యొక్క పత్రుల్లో ఏ ఒక్కటీ తగ్గకూడదాయ పూజా పునస్కారాలకి! తింటానికే ఆకులలమలు దొరక్క అల్లాడుతున్నారయ్యా అక్కడి బడుగు జనం. ఏం అల్లర్లకు దిగుతారో.. భద్రం గణపతయ్యా!'
'చిట్టి చట్టిమూసలో ఇంత మట్టేసి తీసినా నీ ఆకారం మహా  సుందరంగా  తయారవుతుందే! అన్నేసి అడుగుల  ఎత్తు విగ్రహాలతో అంత హడావుళ్ళు అవసరమా? కొంతమంది ఎత్తుగడలు కాకపోతే! ఆ కృత్రిమ రంగుల పులుముళ్లతో నువ్వెంత   వికారంగా ఉంటావోఓట్లే తప్ప .. కోర్ట్లు.. పర్యావరణాలేవీఁ పట్టించుకోని  భక్తుల వల్ల  నీ వంటికేమవుతుందో! బెంగగా ఉంది గణపతీ! జరంత భద్రంగా ఉండాలి నాయనా నకిలీ భక్త బృందాలతో!’
'ఉండ్రాళ్లు..వడపప్పు.. పానకాలు కనిపిస్తే చాలు నీకు వళ్ళు తెలీని  పూనకాలు వచ్చేస్తాయి! కళ్ళు మూతలు పడేవరకు  ఆరగించేసి ఆనక నడుం గుండ్రంగా తయారైందని.. ఏడుపులు!.  జీరో సైజు నీ వల్ల అయ్యే పని కాదు గాని.. ఏ ఫిజియోథెరపీ కంపెనీనో  నాలుగు ఉండ్రాళ్ళు  ఆశ చూపించి తమ తరుఫున ప్రచారం చేయమంటేనోచెప్పేసెయ్! పుసుక్కుమని ఒప్పేసుకొని రాకు. తప్పుడు ప్రకటనల్లో పాల్గొంటే ఐదేళ్ళు  జైలు శిక్ష.. అరకోటి జరిమానాట! కొత్త జామానా నడుస్తోంది  గణపతీ కింద.. కాస్తంత కింద చూసుకొని నడుస్తుండీ తొమ్మిద్దినాలు! '
'బాలాపూర్ లడ్డుండల సైజు చూసి భక్తులంతా కుబేరుడి పుత్రులనుకోవద్దు. పూర్ పబ్లిక్కే ఎక్కువ నీ భక్తుల్లో! నువ్వేదో వచ్చి వరాల వర్షాలు కురిపించేస్తావని  మోరలెత్తుకొని ఆబగా  ఎదురుచూస్తున్నారు.  అరచేతిలో కైలాసం చూపించి రావడం పచ్చి మోసం. గుర్తుంచుకో! పోయిన చవితికి ఇచ్చొచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఓ సారి పరిశీలించుకో! హక్కుల సంఘాలు ఇప్పుడక్కడ  చాలా  క్రియాశీలకంగా మారాయి బాబూ! ఏ ఫోర్ ట్వంటీ కేసుల్లోనో ఇరుక్కోకుండా తిరిగొస్తే అదె మాకు పదివేలు.'
'బలమైన ఏనుగు కనక దాని తలను నెత్తికెక్కించుకొన్నావనీ.. ఎలుక  బక్కది  కాబట్టే కాలుకింద తొక్కి పెడుతున్నావని బడుగు భక్తులు నీ మీదిప్పుడు  చాలా అసహనంగా ఉన్నారని విన్నాను. తొందర పడి వాళ్ళనేమీ తూలనాడద్దు. పరువు నష్టం కేసులక్కడ రోజుకొకటి  పడుతున్నాయి!  మా పరువు తీసే పనులేవీ చేసి రావద్దు వినాయకా. జర భధ్రం!
'రియో ఒలంపిక్సులో ఓడొచ్చిన కచ్చలో ఉందిప్పుడు ఆసేతు హిమాచలమంతా! వచ్చే ఒలంపిక్సన్నింటిలోనూ వరస బెట్టి   స్వర్ణాలు తెచ్చే చాంపియన్సు 'పికింగ్' పనిలో ఉంది కొత్తగా ఏర్పాటయిన వెతుకులాట సంఘం. నిన్నూ ఉబ్బేసి   చేతికో పోల్ జంప్గడకర్ర ఇస్తే పొంగిపోయి ఒప్పంద పత్రంమీద సంతకం గిలికి రాకు! ఆనక మీ చందమామయ్య ఎగతాళ్లకు దిగాడని ఏడవమాకు గణపతీ.. జర భధ్రం!
'అవూనూ! నీ వంటికింత సింగారం అవసరమా బంగారూ! భద్రాద్రి సీతమ్మవారి నగా నట్రకే భద్రత లేకుండా పోయిందిట కింది లోకంలో.. జర జాగ్రత్తరా వినాయకా!'
'చవితి వచ్చీ రాగానే ఛెంగు ఛెంగున  కిందకు దొర్లుకుంటూ పోతావ్! పోతే పో కానీ.. నీ  మూషికం గుంటూరు ధర్మాసుపత్రిలో   చేసిన నిర్వాకం ఇంకా  పోలీసు ఠాణాలో విచారణలోనే ఉంది! కందిపప్పుకు బదులు పసికందుల్ని మెక్కుతార్రా  ఎంత తిండిగింజలకి నకనకలాడుతున్నా!  జర భద్రం.. తిక్క పోలీసులు కేసు  నీ మీదకైనా మళ్ళించెయ్యచ్చు!'
'వెళ్లేది ఖైరతాబాదు! ఆ ఖరాబు ట్రాఫిక్కు మధ్యలో  అమెరికా మంత్రిగారే ఇరుక్కు పోయారుట! నువ్వెంతా? జర భద్రం బాబూ! హెల్మెట్ వెంటలేకపోతే  వ్యాను డ్రైవరు మీదైనా కేసులు పడుతున్నాయ్!  ఎలుకా వాహనమే..  డ్రైవింగు లైసెన్సు  తప్పని సరంటారేమో! తీసుకో! ..ఎక్స్ పైరవకుండా చూసుకో!  ఆదిదేవుడి ప్రధమ సంతానమంటే అర్థమవుతుందో లేదో.. బుద్ధి తక్కువ భటులకు? గుర్తింపు కార్డొకటి సంపాదించుకు పో!’
'బయల్దేరే ముందు  నోరు  శుభ్రం చేసుకోవడం మర్చి పోవద్దు బాబూ! మన సురని మరేదో అనుకొని డ్రంకెన్ డైవింగ్ కేసు  బుక్ చేస్తే.. ఆదిదంపతులం ఆ పాడు  కౌన్సిలింగు సెంటర్ల చూట్టూ కాళ్లరిగేటట్లు తిరగి చావలేం.. జర భద్రం!'
ఆధార్ కార్డొకటి  పుట్టించుకొని పో ! బ్యాంకు కాతాలో సున్నా  బ్యాలెన్సున్నాసరే.. ఆదాయప్పన్నువాళ్ల పాన్ కార్డు తప్పని సరిట. పన్ను ఎగవేతదారుల జాబితాలో బిడ్డ పేరుంటే.. నీ పేరెంట్స్ పరిస్థితేంటో ఆలోచించుకో!'
'విద్యలకు గురువ్వని నీ మీదో ముద్రుంది మొదట్నుంచీ.  నెట్లూ. ఎమ్సెట్లూ.. రాసీ.. రాసీ.. విసుగుమీదున్నారు పసిపిల్లలు.  కసి కొద్ది నీ మొహంమీదో రెండు సిరా బొట్లు చల్లినా బండరాయిలా మౌనంగా ఉండు! శివాఅన్నా బూతుగా ఉంది భూతలం పరిస్థితి. మౌనమే బంగారం బంగారు కొండా మన దేవుళ్లకైనా ఇప్పుడక్కడ!
 నీ పండగంటే తెలుగు హాస్యగాళ్లకీ..  కార్టూనిస్టులకు నిజంగా సంబురాలే! ఫేసుబుక్కుల్లో.. వాట్సప్పుల్లో వాళ్ళ రాతలు చూసి ఉడుక్కోవద్దు. అచ్చు పత్రికల్లో  వాళ్ళ గీతలు చూసి ఉలిక్కిపడొద్దీ తొమ్మిది రోజులు! ఏడాది పొడుగూతా ఏదో  ఏడుపులు.. పెడబొబ్బల జీవితా;లు కదా.. పాపం..  అక్కడి జీవులవి! నీ చలవ్వల్లయినా ఈ చవితి గడిచిన తొమ్మిది రోజులు చల్లంగా
నవ్వుకోనివ్వు బొజ్జ వినాయకా!'
'సరే నమ్మా! బుద్ధిగానే ఉండొస్తా! సిద్ధి..బుద్ధి కూడా వెంటుంటారుగదా! భయమొద్దు! మరి వెళ్ళి రానా?'
' బైల్దేరు! నీ రాక ముందే నీ కులంమీద ఆరాలు మొదయ్యాయట.. నారదులవారు చెపుతున్నారు. గజానన రెడ్డని ఒహడు.. వినాయక నాయుడని ఇంకొహడు..గణపతి శర్మని మరొహడు.. విఘ్నేశ్వర వర్మని.. ఇలా తలా ఒహ కులం పేరు తగిలించి హడావుళ్ళు  చేసేస్తున్నారుట. జర జాగ్రత్తగా మసులుకో రత్నం!'
దేవుళ్లకి కులమేమిటమ్మా! మనమేమన్నా ఓట్లకోసం గాలమేసే రాజకీయ నాయకులమా! నమ్మినా నమ్మకున్నా.. సకల జనావళి సుఖ సంతోషాలకు  పాటుపడే సేవ'కులం' గానీ!
' మా బాబే ఎంత మంచి మాటన్నావురా చిన్నా! అన్నట్లు ఇవాళ 'ఉపాధ్యాయ దినోత్సవం' కూడా! ఆది గురువ్వి.  అందుక్కూడా నీకు శుభాకాంకలు గు.. గ్గణపతీ!  మానవత్వానికి కులం.. మతం.. ప్రాంతం.. అనే తేడాలేవీ లేవని.. మా ఆదిదంపతుల మాటగా కూడా మన భక్తులందరికీ నచ్చ చెప్పి రా!  లాభంగా కాకపోయినా .. క్షేమంగా తిరిగి వస్తే  మళ్లీ చవితివరకూ నాకూ.. మీ నాన్నకూ  మనశ్శాంతి!
-కర్లపాలెం హనుమంతరావు
(ఈనాడు- 05-09-2016 నాటి సంపాదక పుటలో ప్రచురితం)



***

Friday, September 2, 2016

యత్ర నార్యస్తు పూజ్యంతే.. కౌముది మరీ చి.క (మరీ చిన్న కథ)


బోరబండ సెంటర్లో బస్సు దిగేసరికి సమయం రాత్రి ఎనిమిది గంటలు.
నమ్ముకొన్న బండి మొండికేసి..  షేరు ఆటో దొరక్క.. ఒంటరిగా ట్యాక్సీలో ప్రయాణమెందుకని.. కనిపించిన బస్సు ఎక్కేసింది పనిచేసే కాల్ సెంటరు జంక్షనులో స్వాతి.
వాన కురిసి వెలిసి రోడ్లంతా చిత్తడి చిత్తడి. సూదిగాడి భయమొకటి మొదలైనందువల్లనేమో దాదాపుగా దారంతా నిర్మానుష్యంగా ఉంది!
ల్లు చేరాలంటే ఇంకో రెండు కిలోమీటర్లు.. అరగంట. అడ్డదారిలోపోతే సగం సమయం.. దూరం ఆదా! కానీ తాగుబోతు వెధవలు పొద్దస్తమానం పేకాట్లాడుకొంటూ కాట్లాడుకుంటుంటారు   పోలేరమ్మ చెట్టు కింద చేరి!
రిస్కయినా అడ్డదారిలోనే తొందరగా ఇల్లు చేరిపోవాలని మలుపులోకి మళ్లింది  స్వాతి.
పోలేరమ్మ చెట్టు అల్లంత దూరంలో ఉందనగానే తగులుకొన్నాడెవరో  దొంగవెధవ!
చీకట్లో ఆకారం పోలిక పట్టడం కష్టంగానే ఉంది.
'హాయ్! స్వీటీ!'
స్వాతి బదులివ్వదలుచుకోలేదు.
'’స్వాతీ’ అంటేగాని  ‘హాయ్’  చెప్పవు కాబోలు!'
ఉలిక్కి పడింది స్వాతి. 'ఎవర్రా నువ్వు? నా పేరెలా తెలుసు?'
'పేరేనా! నువ్వు పనిచేసే కాల్ సెంటరు.. నీ ఇంటి అడ్రసుతో సహా ఇంకా చాలా వివరాలు తెలుసు  మ్యాడమ్ గారూ!’ దగ్గరికొస్తూ అన్నాడు ఆగంతకుడు.
‘గో అవే! నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది'
'ఇంకా..'
'కరాటే తెలుసు. అవసరమైతే పోలీస్టేషనుకైనా ఫోన్ చేసే తెగింపుంది మిస్టర్!’
‘గుడ్! ఫోన్ చెయ్యాలంటే.. ఫోనుండద్దా  మేడమ్ గారూ..!'
బ్యాగ్ తడుముకొంది స్వాతిఫోనేనా.. వేలెట్టూ మిస్సింగ్!  
ళ్ళెంబడి నీళ్ళొచ్చాయి స్వాతికి. కాళ్లబేరమొక్కటే ప్రస్తుతానికి దారి.
‘వంటిమీది బంగారం మొత్తం వలిచిచ్చేస్తా! ప్లీజ్! నన్నొదిలేయ్!'
'హ్హ.. హ్హ..హ్హ! వళ్లే బంగారంలాగుంది. ఈ బంగారం వదిలేస్తాడా ఏ పిచ్చాడైనా!’
'ఏం కావాలిరా స్కౌండ్రల్ నీకూ!’ భోరుమంది స్వాతి.
‘ఇదీ! .. అదీ.. రెండూనూ!’ స్వాతి హ్యాడుతో పాటు హ్యాండుబ్యాగూ బలవంతంగా పుచ్చుకొని ముందుకు నడిచాడా అగంతుకుడు.
ప్లీజ్! నీ చెల్లెల్లు లాంటిదాననుకోరాదా అన్నయ్యా!' చెయ్యి విడిపించుకొనే ప్రయత్నంలో ఆఖరి అస్త్రం ప్రయోగించింది స్వాతి.
' ఆ మాటాన్నావూ బాగుంది. అయితే అల్లరి చెయ్యద్దు. గమ్మున  నాతో రా! ఇంకో ఐదు నిమిషాల్లో మీ ఇల్లొచ్చేస్తుంది. భద్రంగా లోపలికి పో! ఇదిగో నీ బ్యాగు. సెల్లు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొన్న తరువాతే ఇంట్లోనుంచి ఓ రింగియ్యి! నీ సెల్లోనే నా నంబరు ఉంటుంది ఆచారి పేరుతో!’
ఒక్కక్షణం అవాక్కయినట్లు చూసి ఇంట్లోకి వెళ్లిపోయింది స్వాతి.
ఐదు నిమిషాల తరువాత ఆచారి నెంబరుకి కాల్ చేసి థేంక్స్.. అన్నయ్యా.. సారీ!' అంటున్నప్పుడు స్వాతి గొంతు పశ్చాత్తాపంతో  వణికింది.
'అన్నయ్యా అన్నావు కనక సలహా చెల్లమ్మా! అడ్డదారిని ఎప్పుడూ ఎంచుకోవద్దు. పోయేకాలం వచ్చిననవాళ్లను పోలేరమ్మతల్లైనా ఏం చెయ్యలేని రోజులు ప్రస్తుతం నడుస్తున్నవి. పోలేరమ్మ చెట్టుకింద తుంటరి వెధవలు నువ్వు వంటరిగా రావడం పసిగట్టారు.  వెంటాడే  ప్రోగ్రామ్ పెట్టారు. అమ్మవారి నైవేద్యం పెడుతూ సమయానికి నేనక్కడ ఉండబట్టి   సరిపోయింది. లేక పోతే! ఆడపిల్లను తోడేళ్ళకు  వదిలిపెట్టి అమ్మవారిని పూజిస్తే వచ్చే పుణ్యం ఏముంటుంది! మాటల వంకతో నీతో నడుస్తూ..  అదిలించో.. బెదిరించో.. నీ హ్యాండూ.. హ్యాండుబ్యాగూ పుచ్చుకుని నేను నీతో కలిసి నడవబట్టే   వెనకనుంచి వచ్చే తోడేళ్ళకు మగతోడుందనే బెదురు పుట్టింది’  న్నాడు ఆచారి.
***

 కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రిక సెప్టెంబరు, 2016 లోని 'మరీ చొ.క' గా ప్రచురితం)

Thursday, September 1, 2016

మాయదారి వేషాలు- సరదా గల్పిక- వాకిలి ప్రచురణ

'న్యూస్ పేపరు చూస్తూకూడా ఆ నవ్వులేంట్రా? శ్రీధర్ గారి కార్టూనా?'
'అదెలాగూ బాగుంటుందిలే బాబాయ్!  నయీం బేగం నయా చాయాచిత్రం కూడా అలాగే నవ్వు తెప్పిస్తోంది! ఆ మీసాల మధ్య ముక్కుకి బులాకీ.. చెవులకు బుట్ట కమ్మలు.. బొట్టూ.. కాటుక.. చీరె కుచ్చెళ్ళు జారి పోకండా తమలపాకు వంటి పాదాల పైకి సుతారంగా ఎత్తి పట్టుకోడం..'
' ఆపుతావా.. పిచ్చి  కపిత్వం! పులిలాంటి నయీం భాయీని.. ఇలా  నారీమణి గెటప్పులో చూస్తే ' పాపం' అనిపించాలిగాని.. ఆ గేలిచేయడం.. అదీ..  టూ బ్యాడ్!'
'బాబాయ్! 'పాపాల పుట్టం'టూ వారం బట్టీ లోకంమొత్తం కోడై కూస్తుంటే.. నీ మొహమేంటీ.. అలా.. పులి .. జాలీ.. ' అంటూ పాలిపోయుందీ! కొంపదీసి నువ్వూ..'
'నయం! ఉన్నమాటనుకోడానికి భయమెందుగ్గానీ.. నయీంలా   వేషాలు వేయడం.. ఇవాళే  ఏమన్నా  కొత్తగా పుట్టుకొచ్చిన కళా? అమృతం పంచేటప్పుడు జగన్నాథుడు వేసిందీ జగన్మోహినీ గెటప్పే గదా! గిట్టినవాళ్ళు ఏ వేషం వేసినా..ఆహాఁ.. లీలలు.. ఓహోఁ..మాహాత్మ్యాలంటూ.. ఈలలూ.. చప్పట్లా? గిట్టకపోతే ఇట్లా పిల్లికూతలూ.. పిచ్చి వాగుళ్ళూనా! ఉదర నిమిత్తం..'
'.. బహుత కృత వేషం- కడుపు నింపుకోడం కోసం కడు కృతక వేషాలు!  తెలుసులే బాబాయ్ మాకూ సామెతలు! కానీ నువ్వే ఇలా.. నయీంలాంటి నయవంచకులమీదా ఉదారవాదాలెందుకు  ప్రకటిస్తున్నది!.. విచిత్రంగా ఉంది.. తమరి తరహా!'
'కృతయుగంలోనే తప్పింది కాదురా వేషాలు వేయడం! కలియుగం కాబట్టి.. కలికి కామాక్షి వేషం వేసినా .. చిలికి చిలికి ఇలా గాలివానై పోతుంది కానీ! ధర్మ సంస్థాపనార్థం ప్రతీ యుగంలోనూ అవతారమెత్తుతానని పరమాత్ముడంతటి వాడే సెలవిచ్చాడు. అవతారం అంటే  మారువేషం కాదా?'
'ధర్మసంస్థాపనకు.. అధర్మ పీడనకు.. తేడా పాడా చూడద్దనా నీ ఉద్దేశం! హత్యలు.. అత్యాచారాలు.. కుట్రలు.. కుతంత్రాలు..  బలవంతపు..’
ఆపాపు..’
అహల్యకోసం దేవేంద్రుడు చాటుగా గుడిసెలో దూరిన కోడి వేషానికి.. సీతమ్మతల్లికోసం రహస్యంగా హనుమంతుడు వేసిన బుల్లి కోతి వేషానిక్కూడా తేడా లేదనేట్లున్నావే? రావణాసురుడేసిన సన్యాసి వేషానికి నకలు బాబాయ్ తమరి నయీం భాయీసాబ్ వేసిన నయగారి ఆడంగి వేషం'
'ప్రపంచమే ఓ నాటక రంగం' అన్నాడ్రా  పెద్దాయన  షేక్స్పియర్. ఆ రంగంమీద ఎవరే వీరంగం వేసినా అవన్నీ మారువేషాల కిందే లెక్క. డార్విన్ పరిమాణ సిద్ధాంత ప్రకారం మనమంతా సురులం కానీ..అసురులం కానీ.. నరుల మేకప్పులో ఉన్న వానరులం.. ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయితో సహా!'
'పరాయి ఆడకూతుళ్ల జోలి మనకెందుగ్గానీ..   అవతలోళ్ళ మనీ గట్రా కాజేసేందుకు వేసే 'షి' వేషానికి.. మంచి వేషానికి మధ్య తేడానే లేదంటే మాత్రం నే చస్తే ఒప్పుకోను'
 'మనిషి'లోనే రెండొంతుల మనీ  ఉంది చూసావా.. తమాషా! కాబట్టి దాని రాబట్టడంకోసం    మనిషి  వేసే 'షి' వేషాన్ని అమానుషమంటే నేనూ ఊరుకోను. పళ్ళు నూరుకోనంటే ఓ మంచి మాట చెనుతా వినుకో! ఆ తరువాత గమ్మున వెళ్ళిపో! మంచికో చెడుకో సమయ సందర్భాలను బట్టి మనిషి ఏ వేషాలైనా వేయడం తప్పని సరి! ఆ లౌక్యం వంట బట్టకే.. మానవావతారం ఎత్తినా   శ్రీరామచంద్రుడు ఏ మారువేషాల జోలికీ పోకుడా రామాయణం ఆసాంతం కన్నీళ్ల పర్యంతంగా కాలం గడిపింది. తప్పు తెలుసుకొన్నాడు కాబట్టే తరువాతి కృష్టావతారంలో  అడుగడుక్కీ న్నేసి రకాల మాయవేషాలేసి లీలామానుషుడనిపించుకొన్నాడు. దేవుడికే లేని పట్టింపులు మానవమాత్రులం మనకెందుకురాఓ నమస్కారం పారేసి ముందు నువ్విక్కణ్ణుంచి బైలుదేరు! ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోకుంటే ఎట్లారా నీతో?’
'తమరి సలహాకో పెద్ద నమస్కారం!'
'ఆ వెటకారాలే వద్దనేది. 'షాట్ గన్ సిన్హావేషమేసేస్తేగానీ పార్లమెంటు ఆవరణలోనైనా   సెక్యూర్టీ చెకప్పుల్లేకుండా  చెప్పులు విడవనీయరీ   దేశంలో! ఒక్క అయ్యప్ప గుళ్లో ధర్మదర్శనానికి  తప్ప  ఆడపిల్ల ఆహార్యం అన్ని వేళలా.. మహా సౌకర్యంగా ఉంటుందబ్బీ మన దేశంలో.  ఎర్రబుగ్గ కార్లకన్నా ఎర్రటి బుగ్గలున్న పిల్లకు ముందు లైన్ క్లియరవుతున్నప్పుడు..   ఎంత వెర్రినాగన్నకైనా ఎర్రటోపీల కన్ను కప్పేందుకు ముందు తోచే ఉపాయం ఆడపిల్ల వేషమే కదరా!
'బుర్ర తిరిగిపోతోంది బాబాయిక్కడ నీ తిరుగులేని వాదానికి'
'మరే! పరీక్షాపత్రాలు  సెట్ చేసే పెద్దతలకాయలే  పెద్ద పెద్ద  పేపర్లీకువీరులు వేషాలేసేస్తున్నారు. పొట్టకోసినా అక్షరమ్ముక్క బైటకు రాని నిరక్షరకుక్షులేమో పెద్ద పెద్ద  విశ్వవిధ్యాలయల్లోకూడా కూడబలుక్కొనైనా సరే  పట్టుభద్రులకు పాఠాలు చెబుతామని పట్టుబడుతున్నారు! పాపుల మెళ్లకు పాశాలేసి ఈడ్చుకెళ్లాల్సిన యమకింకర్లు ఎలా జొరబడ్డారో ధర్మాసుపత్రుల్లోకి.. . మెళ్లల్లో స్టెతోస్కోపులూపుకుంటూ వైద్యనారాయణుల వేషాలేసేస్తున్నారు!  గురజాడగారి  గిరీశానిక్కూడా కళ్ళు బైర్లు మారు వేషాల్తో చెదలు.. జలగలు.. గద్దలు.. రాబందులు..  కథలు నడిపించేస్తున్నపుడు పాపం ఒక్క నయీంభాయీ ఒక్క పూటేదో  ఆడవేషమేసినందుకుట్రా మీకందరికీ కుట్ర.. కుతంత్రాల్లాగా గంగవెర్రులెత్తుతోంది! వెర్రినవ్వులు తెప్పిస్తోంది!' మారువేషమనంగానే మాయలేడి మార్కు  మారీచుళ్లనేనా పెడర్థం?’
'అలాగని కాదూ! దేశస్వాతంత్ర్యం కోసం ఎన్నో వేషాలేసి దేశాలు పట్టుకు తిరిగిన మహానుభావుడు  నేతాజీ ఉన్నాడని తెలుసూ. ఎన్నికల ముందొక వేషంలో   జనం మధ్య   కనిపించి.. గెల్చినాక..  మరో వేషంలో చట్టసభలో కునుకే   నేతాశ్రీలూ ఉన్నారని  తెలుసు. ఇద్దరి వేషాల్లోనూ  తేడా బొత్తిగా లేదనేటంత  మొద్దునైతే కాన్లే బాబాయ్ నేను!  ఆశారాం బాపూలు.. నిత్యానంద స్వాములు.. కాషాయాల గెటప్పులేసుకొని ఆడపిల్లల్తో స్టెప్పులేస్తున్నారు! అగ్రిగోల్డు పెద్దలు.. సహారా సుభ్రతోలు.. వ్యాపారస్తుల ముసుగులో అమాయకుల పర్సులు దులిపేస్తున్నారు. ఫోర్ ట్వంటీగాళ్లందర్నీనువ్వే ఇలా  ట్వంటీ ఫోర్ కేరెట్ల గోల్డన్నట్లు  సర్టిఫెకేట్లిస్తున్నావని బాధ!'
'బంగి అనంతయ్య  చిందువేషాలేసినప్పుడు  ఒంగొంగి నమస్కారాలు చేసిందెవర్రా? పార్లమెంటు  సార్లు  పార్లమెంటు ముందు బుడబుక్కలోడినుంచి.. బుర్రకథ చెప్పేవోడివరకు రోజుకో పేషమేసినా విసుగేయదు? అవసరానికని ఏదో అమావాస్యకోసారి ముక్కుసూటి తిక్క పోలీసుల్నుంచి తప్పించుకోడానికని నయీంసార్  లేడీస్ కాస్మొటిక్ కిట్టు వాడితే మాత్రం కితకితలొస్తాయేం  మీకు?’
'బాబాయ్! గురజాడగారి కన్యాశుల్కంలో మహిళల్లో మాణిక్యం మధురవాణికూడా  మగవాడి వేషంమీద తెగమోజు పడింది. కాకపోతే అదంతా  ఓ అమాయకబాలను ముసలి పెళ్ళికొడుకునుంచి తప్పించేందుకు పన్నాగం. తమరి నయీం భాయో! సరే.. నాకెందుగ్గానీ నీ  నయీం భజన నువ్వు చేసుకో.. నమస్కారం,, వెళ్ళొస్తా!'
'అమ్మయ్య! ఎప్పుడెంత తొందరగా దయచేస్తావా అని ఎదురు చూపులిక్కడ!. విగ్గు వాడ్డానికి సిగ్గు పడే వర్గానికి ఈ వీధిలో చోటు లేదు.. వెంటనే వెళ్ళిపో!’
***
'అబ్బాయ్! ఇల్లు చేరావా? ఇందాక ఆ మారువేషాలమీద నేనన్నదంతా మనసులో పెట్టుకోకబ్బీ!  నీ వాగుడు కవర్ చేయడానికి నే పడ్డ తంటాలవన్నీ! నయీం పోయాడు సరే! అతగాడి అనుచరులంతా ఇంకా మా వీధి చుట్టూతానే తిరుగుతున్నార్రా! నిన్ను, నన్ను రక్షించుకొనేందుకు వేసిన మారువేషంలో భాగంరా  అబ్బీ ఈ నయా  నయీం భక్తి!'
కర్లపాలెం హనుమంతరావు
***
(వాకిలి- అంతర్జాల పత్రిక- సెప్టెంబరు 2016 సంచిక 'లాఫింగ్ గ్యాస్ ' లో ప్రచురితం) 






Tuesday, August 30, 2016

అనగనగా మరో గాడిద-( ఇల్లాలి వేదన ) సరదా గల్పిక


'ఏవిఁటండీ ఇంతాలస్యం?'
'మరేఁ! వానలు వేళకి రాక.. సాగు సరిగ్గా సాగక.. అన్నింటి ధరలూ ఆకాశాన్నంటుకుంటున్నాయ్ కదా! జనం అల్లాడి పోతున్నారు .. పిల్లికి సీమంతం చేస్తే వాతావరణం చల్లబడుతుందని.. ఢిల్లీనుంచి ఆదేశాలొస్తే.. ఆ పన్లో పడి ఆలస్యమయిందిలేవేఁ! ఆకలి దంచేస్తోంది. ముందన్నం వడ్డించు! అన్నట్లు భోజనంలోకి ఏం చేసేవేఁ?'
'పంచ భక్ష్య పరమాన్నాలు'
'అబ్బో! అంటే కూర.. పప్పు.. పచ్చడి.. చారు.. పెరుగేగా! వడ్డించొడ్డించు ఒక్కొక్కటే! అన్నట్లు చిన్నాడేడీ?'
'బడికెళ్ళాడండీ! మధ్యాహ్న భోజనమన్నా బళ్లో మింగబెడతారనీ! పొట్టలోకి   ఒక్కక్షరం ముక్కన్నా కుక్కక పోయినా.. సాంబార్లో నాలుగు ముక్కలన్నా  కడుపుకెక్కించుకుంటాడనీ! ముందు మీరు అన్నం కలుపుకోండి! కూర వడ్డించేస్తాను! అన్నట్లు మీ పిల్లి సీమంతం కన్నా వింత కథ నేనొకటి చెప్పనా! వింటూ తిందురు గానీ!'
'చెప్పు .. చెప్పు! కథలు వింటే చాలు నాకు కడుపు నిండిపోతుంది'
''వెనకటికి మీలాంటాయనే ఒకాయన రోడ్డు పక్కన తన మానాన తాను చెత్తా చెదారం తినే గాడిదనొకదాన్ని చూసి జాలి పడ్డాడంట. 'దేవుడి పాలనలో కూడా నీకీ దరిద్రమేంటే? దర్జాగా మహారాజుగారి గుర్రాలశాలకు పోరాదాకమ్మంగా గుగిళ్లూ అవీ వండిపెడుతుంటారక్కడ!' అని సలహా పారేశాట్ట!'
'సలహా బాగానే ఉందిగానీ.. ముందు నువ్వు కూర వెయ్యవే!'
'అయ్యో రాతా! అన్నం తెచ్చేలోపలే వట్టి కూరముక్కలు మెక్కేసారా!నేనిప్పుడేం చేతునురా దేవుడా! మీ తిండి యావ తెలుసుండీ ఇంకాస్త వండనన్నా వండకపోతిని.. పాపిష్టిదాన్ని!'
'సరే! .. సరే! ఏడవకు! తినాల్సినవి ఇంకా ఉన్నాయిగా! ఆ పప్పు వెయ్యి! ఏం పప్పూ? దోసకాయా.. ఆనపకాయా.. బీరకాయా.. వట్టి ముద్దపప్పా?'
'అబ్బ! ఎంత ముద్దుగా అడిగారండీ! వేస్తాగానీ ముందు కథను కాస్త ముందుకు కదలనీయండి! వింటూ కూడా తినొచ్చు! ఆ గాడిదకు గుగ్గిళ్లమీద ఆశ పుట్టింది. అనుమానమూ పుట్టింది. గుర్రాలశాల వంటవాళ్ళు చూస్తే వళ్ళు హూనమవుతుంది కదా అని దాని ధర్మసందేహం'
'వంట చేసేవాళ్లకు ఇదంతా పట్టదే పిచ్చి గాడిదా! వండి వార్చడమే వాళ్ల డ్యూటీ! 'ముందు నువు బయలుదేరు' అంటూ గార్దభాన్ని ముందుకు తోసాడా ఇందాకటి పెద్దమనిషి.. అయ్యొ ఖర్మా! పప్పుకూడా వట్టిదే మెక్కేసారా! ఏమయిందండీ మీకివాళా?'
'వటి పప్పే మెక్కేసానా?! అంతా మాయగా ఉందే! సరే.. ఆ పచ్చడన్నా ఇలా తగలడు! ముందా కథలో గాడిదేమందో చెప్పి తగలడు!'
'వంటవాళ్ళ వరకూ సరేనయ్యా! మరి వళ్ళు రుద్దేవాళ్లూ.. పళ్ళు తోమే వాళ్లూ వూరుకుంటారా? వచ్చింది గాడిదని గుర్తుపడితే చెమ్డాల్చెక్కేయరా?'అంటూ మళ్లా సందేహ పడిపోయింది గాడిద'
'వళ్ళు రుద్దేవాళ్ళకూ.. పళ్ళు తోమేవాళ్లకూ గాడిదైతే ఏంటీ? గుర్రమైతే ఏంటీ? వాళ్ళ జీతాలు వాళ్ళకు వేళకొస్తుంటే చాలు. నువ్వేంకేమీ పిచ్చి పిచ్చి అనుమానాఅలు పెట్టుకోకుండా కుడికాలు ముందు పెట్టి పదా!' అంటూ పెద్దాఅయన్ది ఒహటే తొందర. అయ్యోరామా! మీ తొందర దొంగలు తోలా! మళ్లీ వటి పచ్చడే నాకేసారేంటి బాబూ? కారమని కూడా తోచలేదా మీ నోటికి?! అందుకేనా ఆ ఎక్కిళ్లూ.. కన్నీళ్లూ?'
'ఇవి ఎక్కిళ్ళు కావే! డొక్కలో పేగుల గోల! అందుకే ఈ కన్నీళ్లు. సరే! ఆ చారు నీళ్ళన్నా పొయ్!'
'చేసింది మీకు పొయ్యటానికేగా? ముందు కథ కావాలో.. వద్దో  తేల్చుకోండి!'
నాకూ ఈ మధ్య మతిమరుపు కాస్త ఎక్కువవుతోంది. ఆనక మర్చిపోతే మాత్రం నన్ను సాధించబోకండి! ఆఁ! '
]ఎక్కడిదాకొచ్చిందా దిక్కుమాలిన కథా..?
'అదేనే! గుర్రాలకి వళ్లూ.. పళ్లూ తోమేవాళ్ళ జీత భత్యాల దగ్గరికి. అవునూ! నాకు తెలీక అడుగుతానూ! ఆ వళ్లు కడగేవాళ్ళు పట్టించుకోకపోతే మాత్రం.. వాళ్ళ పై వాళ్లు పట్టించుకోకుండా ఉంటారా.. గాడిదేదో.. ఫుర్రమేదో..?'
'ఆ గాడిదకూ మీ లాగే సందేహమొచ్చింది స్వామీ!  పై వాళ్ళకు మాత్రం వళ్ళంతా తడిమి చూసే ఓపికుండి చచ్చిందా? లెక్కకోసం ఎప్పుడో   అమావాస్యకీ ..పున్నమికీ  తడిమేది. అదీ వళ్లంతానా! ఒక్క పళ్లూ.. తోకా! పళ్ళికిలించి.. తోకాడించేస్తే సరి..గాడిదల్నూ గుర్రాలకిందే లెక్క రాసుకు పోతుంటారు. ఇంక రాజావారి ఊరిగింపు గుంపులోక్కానీ ఎన్నికయ్యావనుకో.. నీ పంట పండిందే అనుకో! ఒక్కసారిగా వి.ఐ. పి హోదా వచ్చి పడుతుంది. 'వై; కేటగిరీ వైభోగమంటే మాటలా మరి? కాళ్లకి వెండి పట్టాల దగ్గర్నుంచి.. మూపుకి పట్టు పీతాంబరాలదాకా..' అని వూరించేసాడు పెద్దమనిషి.'
' ఆ పెద్దాయనకసలు బుద్ధుందా! రాజుగారు గుర్తు పడితే గాడిద పని గోవిందో గోవిందా!'
'ఆ పోదురూ బడాయి! రాజులైనవాళ్లంతా సొంతంగా గాడిదలెవరో.. గుర్రాలెవరో గుర్తు పడుతూ కూర్చుంటారా.. విడ్డూరం కాకపోతే! మీ రాజుగారిని చూడ్డంలా! చూట్టానికి.. వింటానిక్కూడా సొంత బుర్రల్నసలు వాడరు.. అరిగి పోతాయని! ప్రద్దానికీ అందుకే అన్నేసి లక్షలు పోసి ప్రత్యేక సలహాదారుల్ని ఏర్పాటు చేసుకొనేది. ముందు మీరు పెరుగు వడ్డించుకోండి'
'అప్పుడే పెరుగేందే.. నీ మతిమరుపు మండా!  నువ్వింకా చారే పోయలేదు.. నేను తాగిందే లేదు!  ఏంటి కతా! నీ కంటికి నేనూ ఆ గాడిదలాగా కనిపిస్తున్నానా? రాజుగారు చూడకపోతే నా లాంటి కార్యకర్తలన్నా చూడరా? గుర్రానికీ.. గాడిదకీ తేడా ఆ మాత్రమన్నా చూసుకోకుండా తిరుగుతున్నామనా మా మీదా వెటకారాలు?!'
'అయ్యయ్యో! కట్టుకున్న దేవుణ్ని అంతలేసి మాటలంటె కళ్ళు పోతాయండీ మా ఆడంగులకి! మీకు తేడా తెలుస్తూనే ఉంటుంది కానీ.. బైటికి తేలరు. పైపెచ్చు మా రాజావారు వెరైటీగా గాడిదమీదెంత మోజు పెంచుకున్నారో!' అంటూ మెహర్భానీలకోసం దండకాలందుకుంటారు. మీ మీడియాలో భజనలూ మొదలు పెడతారు. అయ్యయ్యో! అలా .. తినే తినే కంచం ముందునుంచి లేచి వెళ్లి పోతారేమండీ!?'
'నీ కథతో కడుపు నిండిపోయిందే! నువ్వసలీ పూట అన్నమే వండింది లేదు. అందుకే చంటాడినా మద్యాహ్న భోజనం కోసం బడికి పంపించావు. నన్ను మాత్రం గాడిదకథల మాటున గాడిదను చేయాలని చూసావు!.. ఛీఁ!' అంటూ విసురుగా బైటికెళ్ళి పోయిన మొగుడి వంక చూసి బావురుమంది పాపం.. ఆ  ఇల్లాలు.!
'కందిపప్పు రెండొందలు దాటింది. సన బియ్యం వంద వరకూ వెళ్లింది, దుడ్డు బియ్యం మీ గొంతు దిగదు. ఏ వంట పదార్థాన్నంటుకున్నా చెయ్యి చురుక్కుమని కాలిపోతోంది. పసోడు కనక వాడిని మధ్యాహ్నం భోజనం పెడతారని బడికి పంపించానుకానీ మిమ్మల్నే ధర్మసత్రానికి తరమగలను కట్టుకున్నదాన్నయి వుండీ?! అందుకే ఈ కట్టుకథలల్లాల్సొచ్చింది. దేవుడా! తప్పు నాది కాదు. శక్తి ఉంటే ధరలు కిందికి దించు! వల్ల కాదంటే నా మొగుడి కడుపు నింపేందుకు మరిన్ని కట్టుకథలల్లే శక్తిని ప్రసాదించు' అంటూ బావురుమంది ఆ ఇంటి ఇల్లాలు!***
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం. ఈనాడు యాజమాన్యానికి.. సంపాదక బృందానికి.. కార్టూనిస్టు శ్రీధర్ సార్ కి ధన్యవాదాలతో)

Sunday, August 28, 2016

గురువులకు పాఠాలు- ఓ సరదా గల్పిక


బండెడు పుస్తకాలకు బస్సెడు గురుబ్రహ్మలు తోడయ్యే నూతన విధ్యావిధానం రాబోతుందా?ఒక ఉపాధ్యాయుడికి నలభైమంది శిష్యపరమాణువులన్న  సిద్ధాంతం ఇహ పాత పడనుందా? ఒహ విద్యార్థికి నలభైమంది గురువులనే నవీన పథకం అమలు కానుందా?

విద్యుత్ బుగ్గ, ఆకాశవాణి, చరవాణివంటి ఆవిష్కరణలకంటే పనిగట్టుకొని పనులు మానేసుకొని బుర్రలు బద్దలు కొట్టేసుకొన్నారు పెద్దలు! కేవలం అవకాశాల్రాని రాజకీయవేత్తలు, అధికారం దక్కని అధికార వర్గాలు, ఉద్యోగసంఘాల బుద్ధికుశలతవల్ల మన పిల్లకాయలకిప్పుడు కొత్త విద్యావిధానం దొరికిందోచ్!

చదువు సాములు మెరుగు పడాలని, బడిపిల్లోడి అవసరాలకు తగ్గత్లు అభ్యాస పద్ధతులు  మార్పు చెందాలన్న అభ్యుదయ భావాలతో తెలంగాణా సర్కారిప్పుడు 'హేతుబద్దీకరణ'కు కాలుదువ్వుతోంది. ప్రభుత్వపెద్దల బుద్ధికుశలతకు మించి కొత్త పద్దతులున్ బాలల విద్యారంగంలోకి చొచ్చుకొచ్చేస్త్తున్నాయ్! పాఠ్యప్రణాళికలు శుద్ధంగా అమలు కావాలంటే బండెడేం ఖర్మ.. జంబో జెట్టుకు మించిన గురుసైన్యం తయారు కావాల్సుంది.

తెలుగులో అచ్చులు నేర్పించేందుకొక ఉపాధ్యాయుడు, హల్లుల  వల్లెవేతకు ఇంకో గురుబ్రహ్మగారు,, గణితంలో ఒంట్లు వటువు వంటబట్టించేందుకు పట్టుదల తగ్గని పంతులొకరు, ఎక్కాలు పిల్లడి బుర్ర కెక్కించి తొక్కేందుకు వస్తాదుల్లాంటి ఉస్తాదులు మరో ఇద్దరు- ఒహరు పైనుంచి కిందికి తొక్కిస్తే.. మరొహరు కిందనుంచి పైకెక్కించేందుకు.. ! ఆంగ్లంలో మూడు బళ్లు ఏడ్చినప్పుడు ఒక్కో బడికి ఒక్కో గట్టిపిండం అవసరమే కదా! సాంఘిక శాస్త్రంలో పర్యావరణమనే కొత్త అంశం పుట్టుకొచ్చిందిప్పుడు.. పిల్లకాయలను తోటలెంట దొడ్లెంట  తిప్పుతూ.. ప్రకృతి తిరకాసునంతా విప్పి చూపించే విశ్లేషకుల అవసరం కొత్తగా ఏర్పడింది. మోరల్ క్లాసులు పీకేందుకైతే మోటా పరిజ్ఞానం కల మాస్టార్ల అవసరం ఎలాగూ తప్పని సరి తద్దినమై కూర్చుంది. సామాన్య శాస్త్రం మాత్రం సామాన్యులకు అలివయేట్లుందా? భౌతిక.. రసాయన శాస్త్ర సూత్రాల వివరణ .. ప్రయోగశాలల్లో వాటి సత్యనిరూపణలకు ఏక మొత్తంగా మొత్తం కనీసం  నలుగురు గురువులన్నా సదా సిద్ధంగా ఉండి తీరాల్సుండె!

చిత్రకళ, సంగీతం వంటి కళా విశేషాలను గడుగ్గాయిలచేత  కాయించి వడబోయించేందుకు  ఎంతమంది ప్రావీణ్యుల సహకారమవసరమో ఇంక చెప్పేందుకు లేదు. ఇహ గెంతడం..  పరుగెత్తడం.. ఒకే బంతిని పట్టుకొని తెగగుంజుకోడం.. గుద్దులాడుకోడం వంటి వంటికి సంబంధించిన విద్యల్ని దెబ్బలక్కాచుకొంటూ వడుపుగా నేర్పించే  ఓపికమంతులు  పంతుళ్లుగా రావడమూ తప్పని సరే! ఇన్ని చతుష్షష్టి కళలు  ముష్టి సర్కారు బళ్ల పిల్లకాయకు అంతవసరమా అన్న ధర్మసందేహం ధర్మం కాదు! జీవించడానికి అవసరమైన కీచులాటల్లో లాఘవం రావాలంటే పసితనంనుంచే కండబలం చూపించే విద్యల్లో రాటు తేలాల్సిందే! బిడ్డ అవసరాలకు తగ్గ విద్య ఉగ్గుపాలదశనుంచే  గరపాలన్నది కదా హేతు బద్ధీకరణంలోని ప్రధాన నీతి సూత్రం!

గురువులకేమీ కరువు లేదు.   తరగతి గదిలో చుక్కల్లో చందమామాలా మెరిసే ఒక్క బుడతడికి ఒకేసారి నలుగురు గురువులు ఉన్న నాలుగ్గంటల్లో విద్య గరపడమెలా?.. అన్నదే ప్రస్తుత సమస్య. సంక్షోభం వచ్చినప్పుడే సమస్యకు పరిష్కారం బైటపడేది. గతంలో నల్లబల్ల దగ్గర యమధర్మరాజు దగ్గరిచుట్టమల్లే బెత్తమాడిస్తూ నిలబడ్డ  ఉపాధ్యాయుడు ఇప్పుడు ఒకింత  అసుంటా కిందికి దిగి బెంచీలమీద తోటిగురువులతోపాటు బుద్ధిగా కూర్చుంటాడు. నిష్పత్తిలో ఒక్క శాతంగా ఉన్న విద్యార్థి ఒక్క మెట్టు  పైకెక్కి బల్లమీద బాసింపట్లేసుకుని కూర్చుంటాడు. మారిన కొత్త విద్యాభ్యాస విధానంలో ముందుగా విద్యార్థి వేసే హాజరు పిలుపులకు ఉపాధ్యాయులంతా 'జీ.. హుజూర్' అని పలకాలి. ఆ తరువాతే తరగతులు ఆరంభమయేవి.
విద్యార్థి కళ్లు మూసుకొని వేలు ఎవరి వైపు చూపిస్తే ఆ ఉపాధ్యాయుడికి ఆ పూట పాఠం చెప్పుకొనే సువర్ణావకాశం దక్కుతుంది.
శిక్షణా సమయంలో పక్క గురువులు కక్షతోనో.. కడుపుమంటతోనో అల్లరికి తెగబడితే పిల్లవాడిచ్చే శిక్షలు దారుణంగా ఉంటాయి. ఆ పూట పాఠం చెప్పే అవకాశం కోల్పోవడంతో పాటు.. గోడకుర్చీ వేయడమో.. బెంచీ ఎక్కి నిలబడ్డమో తప్పని సరి. అల్లరి మరీ మితిమీరితే బైట ఎండలో నిలబడ్డమూ తప్పదు గురువులకి.
పాఠం వినే సమయంలో సాధారణంగా ఏ విధ్యార్థి పెదవి విప్పడు. తెలివితక్కువ వెధవ ఎప్పుడైనా ఖర్మకాలి ఏదైన తిక్క సందేహం అడిగితే ఠక్కుమని సమాధానం చెప్పేట్లుండాలి పంతుళ్ళ ఇంటిదగ్గర తయారీ. ఇంటిదగ్గర పాఠం సరిగ్గా తర్ఫీదు కాని పంతుళ్ల పని గోవిందో గోవిందే! వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఎంత పంతులుకైనా గుంజీలు తప్పవు.  శిష్యుడి చేతిలో బెత్తం ఆడుతున్నంత సేపూ గురువుల గుండెళ్ళో మెట్రో రైళ్ళు పరుతెత్తుతుంటాయ్!
'ఐ నెవర్ టెల్ ఎనీ లెసన్' అని పలక మెళ్లో వేళ్ళాడదీసినా పంతుళ్లెవరూ  ఎదురు పలక్కూడదీ  కొత్త నూతన విద్యా విధానంలో. 'వ్యాపారంలో వినియోగదారుడే రాజు' అయినట్లే కొత్త విద్యాభ్యాస ప్రణాళికలో విద్యార్థే రారాజు.
సర్కారువారి సరికొత్త హేతుబద్ధ ప్రణాళికను అవహేళన చేయకుండా జంధ్యాలవారి 'జంబలకిడి పంబ' సూత్రం అమలు చేస్తే మాత్రం తప్పేముంది? కాకపోతే తయారీ రంగంలో కాస్తంత మార్పులు అవసరం. ఉపాధ్యాయులకి ముందస్తు శిక్షణ ఉన్నట్లే.. విద్యార్థికీ  ప్రాథమిక పరిజ్ఞానంలో రవ్వంత  తర్ఫీదు అవసరమవుతుంది. ఒక్క గురువు వేధింపులకే తాళలేక పసిమొగ్గలు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. ఇంతమంది యమ గురువులను ఒకేసారి ఒకే చోట ఎదుర్కొనేందుకు తగిన శక్తి సామర్థ్యాల్లో పసివాళ్ళకు శిక్షణ అవసరమవుతుంది.
పిల్ల కథానాయకులు పెద్ద పెద్ద దర్శకులనే అదుపులో పెడుతున్నారు చలనచిత్ర రంగంలో. బొడ్డూడని పసిగుడ్డులుకూడా కన్నవాళ్లని కనుసన్నల్లో ఆడిస్తున్నారు. సర్కారు కార్యాలయాల వ్యవహారాలన్నీ బిళ్లబంట్రోతుల కంట్రోల్లోనే కదులుతున్నాయి. కార్యకర్తల ఆదేశాలమీదే  బడానేతలూ పార్టీ గోడలు దూకుతున్నారు. పూజారుల లెక్కల ప్రకారమే సాక్షాత్ ఆ ఏదుకొండలవాడు నామాల పొడుగు సరిదిద్దుకొంటున్న నేపథ్యంలో పిల్లకాయల బెత్తాలముందు పాఠాలు చెప్పుకు బతికే బడిపంతుళ్ళు చేతులు కట్టుకొని నిలబడ్డంలొ తప్పేముంటుంది?!
మీడియా హోరు.. చిత్రాల బోరు.. సీరియళ్ల జోరుల ముందు బేజారు కాకుండా గట్టిగా  నిలబడుండాలంటే  చిన్నబళ్లనుంచే పెద్ద పెద్ద గురువులను అదుపు చేయడంలో తర్ఫీదు పొందుండాలు పసిగుడ్డులు. ఎన్నికల సమయంలో వందలాది నేతలు వేలాది హామీలను వడగళ్ళ వానలా గుప్పిస్తుంటారు. ఓటర్లుగా మారినప్పుడు ఆ వడగళ్ల నొప్పిని సంహించేందుకైనా విద్యార్థి దశనుంచే బిడ్డను సమాయత్తం చేయాల్సుంటుంది కదా!  హేతు బద్ధీకరణ అసలు సదుద్దేశం కూడా  అదే అవుతున్నప్పుడు మనం తప్పు పట్టడం అన్నింటికన్న పెద్ద తప్పు,
***
-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు సంపాదకీయ పుటలో ప్రచురితం. ఈనాడు యాజమాన్యానికి.. సంపాదక వర్గానికి.. కార్టూనిస్టు శ్రీ శ్రీధర్ గారికి కృతజ్ఞతలతో)

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...