'కూడూ.. గుడ్డా.. నీడా' అన్నారు. గుడ్డే రాఘవయ్యగారిపాలిట గండమై కూర్చొంది.
వంటిమీద నూలుపోగుంటే కంటిమీద కునుకుండని జబ్బు ఆయనగారిది!
బాల్యంలో ఆయన
తల్లి పిల్లవాడు ఏడ్చినప్పుడల్లా వంటిమీది బట్టలన్నీ విప్పేసి ఆరుబైలు చల్లగాలికి నిద్రపుచ్చుతుండేది. ఆ వస్త్రవిసర్జనే రాఘవయ్యగారికి ఒక నిద్రఅలవాటుగా మారిపోయింది.
ఒక్కడే కొడుకు
కావటాన ఆ గుట్టు ఇంటిగుట్టుగానే మిగిలిపోయింది. పెళ్లయి కాపురానికొచ్చిన
మొదటిరాత్రి సావిత్రమ్మకే మళ్ళీ తెలియడం. కొన్నాళ్ళు షాకులో ఉన్నా
క్రమంగా ఆ ఇల్లాలూ భర్త నిద్రావస్థకు తననే సర్దుబాటు చేసుకొంది.. పాపం!
చేసింది బ్యాంకు
ఉద్యోగం కావడాన ఆట్టే బైటడ్యూటీలు అవీ లేక రాఘవయ్యగారు ఇబ్బంది పడలేదు. కానీ శుభాశుభకార్యాలకు బంధుమిత్రుల ఇళ్లకు వెళ్లి రాత్రిళ్ళు ఉండాల్సి వచ్చినప్పుడు
మాత్రం ఇబ్బందులు తప్పేవి కాదు. సాధ్యమైనంత వరకు 'రాత్రి బస’ తప్పించేవాడు. తప్పనప్పుడు ప్రత్యేకమైన గది చూసుకొనేవాడు.
రెండూ కుదరని రాత్రులు కాళరాత్రులే!
తండ్రి నిర్వస్త్రావస్థ
కడుపున పుట్టిన బిడ్డక్కూడా తెలీకుండా
ఎలా నెగ్గుకొచ్చిందో ఆ మహాఇల్లాలుకే తెలియాలి.
ఎల్లకాలమూ
ఒక్కలా చెల్లవుకదా! పిల్లకు పెళ్లయి అల్లుడు విదేశాల్లో స్థిరపడిన తరువాత..
అవసరార్థం కూతురు మొదటి కాన్పుకని భార్యతో కలసి ఆరునెలలకని ఆస్ట్రేలియా వెళ్లి.. వచ్చిన తరువాత కంటిమీద కునుకు బొత్తిగా కరువయి రాఘవయ్యగారు సుస్తీ పాలయ్యారు.!
ఎక్ప్పర్టులక్కూడా
అంతుచిక్కని జబ్బు! రొటీన్ చికిత్సలేవీ
పనిచేయనే లేదు! కూతురు సింగిల్ బెడ్రూం ఫ్లాటులో ఆర్నెల్లపాటు ఆ ‘ప్రత్యేక నిద్రాసౌకర్యం’ కుదరక ఆరోగ్యం దెబ్బతిన్నద’ని సావిత్రమ్మ బైటికెలా చెప్పుకోగలుగుతుంది!
'గత జన్మల్లో ఎవరికో నిద్రాభంగం చేసి ఉంటాను. ఎవరివంటిమీది బట్టలో
దొంగిలించి ఉంటాను. కాబట్టే నాకీ జన్మలో ఈ విచిత్రమైన శిక్ష!’
అంటూ ఒహటే సెంటిమెంటలుగా వాపోవడం ఎక్కువయిందీ మధ్య మరీ రాఘవయ్యగారికి.
ఉన్నట్లుండి
ఒక మధ్యరాత్రి హఠాత్తుగా రాఘవయ్యగారి గుండె ఆగిపోయింది! ఆ సమయంలో ఆయన వంటిమీద యథాప్రకారం నూలుపోగు లేదు!
నలుగుర్నీ
కేకేసే లోపల భర్త పార్థివదేహానికి కనీసం లంగోటీ అయినా తొడగాలని .. పాపం.. సావిత్రమ్మ ఆరాటం. ఆడమనిషి.
వయసా మీద పడింది. సాధ్యపడుతుందా! బియ్యబ్బస్తాకన్నా బరువున్న భర్తను పడగ్గదినుంచి స్నానాలగదిలోకి ఎలా చేరవేసిందో
ఆ పర్మాత్ముడికే తెలియాలి!
‘రాఘవయ్యగారు బాత్రూంలో జారిపడి పోయార’న్నవార్తే బైటికొచ్చింది. కూతురికి వార్త తెలిసి బైలుదేరి వచ్చేందుకు కనీసం రెండు రోజులు
పడుతుంది. ఉదారంగా ఉండే
ఫ్లాట్ ఓనర్సు అసోసియేషన్ ప్రెసిడెంటు 'ఒక్క పూటైనా 'పీనుగ' అపార్టుమెంట్ ఆవరణలో ఉండేందుకు వీల్లేదని'
ఎందుకంత కఠినంగా అన్నాడో సావిత్రమ్మకే తెలియాలి. బావగారి కొడుకును బతిమాలుకొని హడావుడిగా
భర్తచితికి కొరివి పెట్టేయించింది సావిత్రమ్మ.
పుణ్యకార్యాల సమయంలో
కూతురు పురోహితులతో
దానాలను గురించి చర్చిస్తున్నప్పుడు..'ఆ గోదానం, భూదానం,
సువర్ణదానం.. వగైరాలన్నీ ఆనక. ముందు వస్త్రదానం సంగతి చూడండర్రా' అని మొత్తుకుంది అంత దుఃఖంలోనూ పాపం సావిత్రమ్మ ముందుకు
వచ్చి!
వచ్చేజన్మల్లోనైనా
భర్తకు ‘నిద్రావస్థ’ తప్పాలని పాపం ఆ ఇల్లాలి ఆవేదన!
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక సెప్టెంబర్, (2016- మరీ చి.క(మరీ చిన్న కథ) గా ప్రచురితం)
No comments:
Post a Comment