Monday, September 12, 2016

పేరు- ప్ర తిష్ఠ- సరదా గల్పిక

వంశాంకురం మీదుండే వాత్సల్యం కన్నవాళ్ల చేత ఏ తాత పేరో.. అమ్మమ్మ పేరో పెట్టేట్లు చేస్తుంది. ఇంటి పేరు నిలబెడతాడనుకొన్న ఘనుడు ఇంటిమీదకు మనుషులొచ్చి పడే ఘనకార్యాలకు మొదలు పెడతాడు. ఏ ఎమ్ సెట్టులోనో ఫస్టొచ్చి పేపర్లనిండా ఫొటోలూ.. పేరు కనబడేట్లు ఎదుగుతాడని పొంగిపోతారా,, పేపర్లలో పేరు కనిపించే కలవరకు నిజం చేస్తాడు. కానీ.. ఆ పేరుకు అప్రతిష్ఠ తోడయేట్లు  లీకులు.. గట్రా కుంభకోణాలకు పాల్పడకుంటే కన్నవాళ్ల పుణ్యం పుచ్చినట్లే లెక్క.  ఏ ఏడుకొండలవాడి కొండదాకానో  వెళ్ళి ఎన్ని పొర్లు దండాలు పెట్టుంటారో పాపం తల్లి దండ్రులు.. ఓ నలుసు కడుపులో పడ్డానికి!  ఇప్పుడు వంట్లోని పులుసంతా కారిపోయేటట్లు నేరసామ్రాజ్యంలో ఓ చిన్న డానై కూర్చుంటాడు. 'చిన్న తనంలో వేళకు తిండి తిప్పలైనా చూసుకోకుండా మాలకాకిలా తిరుగుతుంటే  బిడ్డ 'అయ్యో!.. చిక్కి శల్యమైపోతున్నాడ'నుకొంటూ తల్లి తల్లడిల్లి పోతుందా! ఇప్పుడు అదే తల్లి బిడ్డ దిక్కుమాలిన పిచ్చి చేష్ఠలకు అలవాలంగా మారి  పోలీసు యంత్రాంగానికి  చిక్కకుండా  తల్లిదండ్రులు వెక్కి వెక్కి ఏడ్చేందుకు కారణమవుతాడు. పసితనంలో వేళకి పాలు పట్టడం క్షణం ఆలస్యమైనా కక్కటిల్లిపోయే బిడ్డ .. ముడ్డికిందకు ఏళ్లొచ్చాక  కక్కలేని.. మింగలేని దుస్థితి  కన్నవారికి తేడన్న గ్యారంటీ ఏమీ లేదు ! పున్నామ నరకం నుంచి రక్షిస్తాడనుకొని నవమాసాలు మోసి  కన్న సుపుత్రుడు బతికున్నన్నప్పుడే   నరకం చూపించకుంటే అక్కడికా కన్నవాళ్ళు  పూర్వజన్మలో పూలతో పూజ చేసుకున్నట్లే! పుట్టంగానే పేరు పెట్టాలి బిడ్డకు. దానితోనే వస్తున్నాయి చిక్కులన్నీ! పెరిగి పెద్దయిన తరువాత ఏం ఘనకార్యం వెలగబెడతాడో .. పాపం కన్నవాళ్ళేకు మాత్రం ఏం తెలుస్తుందిభవిష్యత్తును చూడగలిగే అంజనం డబ్బీ ఒంటి గూట్లో ఏమీ దాచిపెట్టుకొని ఉండరు గదా!
ఈ గోలంతా లేకుండా గోరావంటివారు ఓ దివ్యమైన చిట్కా కనిపెట్టారు. తన బిడ్డలకు సమయ సందర్భాలను బట్టి నామకరణం చేసారు.  ఉప్పుసత్యాగ్రహం సమయంలో పుట్టిన ఒక బిడ్డకు 'లవణం'.. రెండో ప్రపంచ యుద్దం సమయంలో పుట్టిన బిడ్డకు ' సమరం' అని నేమ్ ట్యాగులు తగిలించారు. అదృష్టం బాగుండి ఆ బిడ్డలిద్దరూ తండ్రికి తగ్గ తనయులుగా  మంచి పేరు గడించారు. అందరూ గోరా సంతానమంత భాద్యతగా మసులుకుంటే లోకం స్వర్గధామమేగా!
కరుణానిధికిలాగా లెనిన్ పేరు పెట్టుకొన్న పుత్రరత్నం వీధి పారోటాలకు కాలుదువ్వే రకమైతే   పేరు పెట్టి తన అభిమాన నాయకుణ్ణి  అవమానించినందుకు బాధను దిగుమింగుకోవాలి  తల్లిదండ్రులు.  బెజవాడ  వాడ రాజకీయాల్లో ఎప్పుడూ స్వాతంత్ర సమర వీరుల నామదేయాలే నలుగుతుంటాయి. ఒకనాడు జాతి  జాతిని స్వాతంత్ర్య పోరాటబాటలో నడిపించిన  గాంధీలు.. నెహ్రూలు.. బోసుబాబులకు ఇప్పుడు  కృష్ణాతీరం వైపుగా తేరిపార చూసే అవకాశాలు బొత్తిగా లే వు కాబట్టి  బతికిపోయారు.
ఈ గొడవలేమీ లేకుండా గోడమీది పిల్లి వాటంగా బతికే  లల్లూ ప్రసాదు యాదవు సాబు  ఎంతో ముందు చూపుతో  బిడ్డలకి 'కుర్సీ'  'లడ్డూ' అంటూ పేర్లు  పెట్టేసుకొన్నారు.

పేరుకి.. ప్రతిష్ఠకి సోనియా గాంధీకి.. మహాత్మా గాంధీజీకి మధ్య ఉన్నంత అంతరం ఉంది.

కన్నవారి కోణంనుంచి చూస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో.. పేరు పెట్టించుకున్న వారి కోణంనుంచి చూస్తే అంతకు పదింతలు ఇబ్బందులున్నాయి. రామారావు అని పెద్దాళ్లు ఏదో అమాయకంగా  పేరు పెట్టారుగదా అని.. దానికి తగ్గట్లే మంచి బాలుడుకి మల్లే  నడుచుకుంటే పక్కింటి పాపకైనా లెక్కలోకొస్తాడా కుర్రోడు! ఈల వేయడం.. గోల చేయడం.. గట్రా..  పాత కాలం టైపు అరిగిపోయిన చాదస్తం. టీనేజి ఆడపిల్లలకే ఆ టీజింగ్ అవుటాఫ్ వేధింపు. మంచి పేరుకోసం జీవితాంతం మంచి వెధవగా మసులుకోడమంటే మనిషి జన్మ ఎత్తినందువల్ల ఒనగూడిన సవాలక్ష లాభాలన్నింటికీ స్వచ్చందంగా తిలోదకాలు ఇచ్చుకొన్నట్లేగదా! 
కాలేజీ క్లాస్ మేట్సు ఒక్కళ్లనే ఏడిపిస్తే తల్లిదండ్రులు అంత కష్టపడి పెట్టుకొన్న పేరు పదిమంది దృష్టిలోకి  ఎలా విస్తరిస్తుంది? ఒకే వార్తా పత్రికలో ఓ మూలో కీచకుడు ఆడపిల్లని వేధించిన వార్తా .. మరో మూల ఆటోలో దొరికిన సొమ్మును నిజాయితీగా ఒరిజినల్  ఓనరుని వెతికి పట్టుకొని మరీ అప్పగించిన అప్పారావు  వార్తా వచ్చాయనుకోండి. ఎక్కువ మంది పాఠకులు మక్కువగా ముందు చదివేది.. మరో అట్లాంటి వార్త వచ్చిందాకా ఫేసుబుక్కుల్లో పడేసి  చర్చించుకొనేదేది ఏదీ
 'సిద్ధార్థ అని పెద్దాళ్ళేదో చాదస్తం కొద్దీ పేరు పెట్టేసినంత  మత్రాన బుద్ధభగవానుడిక మల్లే 'ధర్మం శరణం గఛ్చామిటైపు ఒక్క రూటునే పట్టుకు వేళ్ళాడితే తీవ్రంగా  నష్టపోయేది ఎవరు స్వామీఆలస్యంగా తగలడి.. ఆదరాబాదరాగా   వెళ్ళిపోయే లేత వయసుని  ఫుల్లుగా ఎంజాయ్ చేసే అవకాశం తల్లిదండ్రులకోసం నానపెడుతూ కూర్చునే  పిచ్చికుంకలెవరికీ ..  లేటు  వయసులో చాటు(chat) చేసుకునే టాపిక్కులేవీ దొరక్క చాగంటివారి సోదుపన్యాసాలు  మొహం గంటుపెట్టుకునైనా  వింటూ కూర్చోక తప్పదు.
ఈ కాఅం సజ్జు ఈ-కాలం గుజ్జు. ఆధ్యాత్మిక  నరకాలను నిద్రలో కూడా సహించరు. అందుకే  తల్లి కడుపులో ఉన్నప్పట్నుంచే బుజ్జాయి   భూమ్మీదకొచ్చి ఏం చెయ్యాలన్న రూట్ మ్యాపు సిద్ధం చేసుకొంటుంది.   ఎంతటి వెధవ పనికైనా  కొంపలు  మునక్కుండా ఉండే ఏ కండోం టైపు చిట్కాలో  పట్టపగలు చింతపండమ్మే కొట్లల్లో సైతం  చేతికందుబాటులో ఉంటున్నప్పుడు.. వీరబ్రహ్మం అని పేరు పెట్టారు కదా అని నిజంగానే బ్రహ్మచర్యం నిష్ఠగా పాటిస్తానంటే? మానవ జన్మ ఎనభై నాలుగు లక్షల రకాల జీవాల్లోకెల్లా  బ్రహ్మాండమైన ఉత్తమ జన్మంటారు భయ్! సన్యాసులమని చెప్పుకుంటూ  తిరిగే ఆశారాం బాపులకే పాపలమీద ఆశలు  చంపుకోడం లేదు. పెద్దాళ్లేదో తమ చిన్ననాటి  చాదస్తం  కొద్దీ  ఏ శేషతల్ప సాయనో.. కల్పవల్లి తల్లనో బుద్ధిమంతుల పేర్లు తగిలించినంత మాత్రాన  వాళ్ల ముచ్చట్లు  తీరడానికని బుద్ధభగవానులకు మల్లే డైలీ సీరియల్లాంటి కాలేజీ క్లాసు పీకుళ్లకు అటెండవడాలు.. లేట్ నైటు టీ కాఫీలు తాక్కుంటూ నైటవుట్లతో చదువు సంధ్యలు నెట్టుకు రావడాలు.. అదంతా   ట్రాష్! లైఫ్ స్పేస్ బోట్ క్రాష్ అవడం కిందే లెక్క నేటి పోరగాళ్లకు.
'జీవితం ఎన్నో చిన్నద'న్నాడు ఓ సినిమా కవి.  ఏ చిన్నదో.. చిన్నాడో అనుక్షణం పక్కనుండక పోతే ఆ చిన్నది మరీ కురచదై పోతుందని భయం కుర్రకారుకి. కృష్ణ భగవానుడని పేరు పెట్టినంత మాత్రాన బిడ్డలు  నికృష్ట చేష్టలకు ఆశ పడకూడదన్న ఆంక్షలు ఎంత కన్నవారికైనా తగదు.
లోకాన్నొక వంక ప్రపంచీకరణ వంకతో పచ్చి డబ్బు సంతలా మార్చేసి జీవితం సంతోషమయంగా మార్చుకోడానికి సంత్ తుకారాం టైపు నియమ నిబంధనలక్కట్టుబడి ఉండమని  సన్నాయి నొక్కులు  నొక్కడం.. అన్యాయం !
ఎవరి కథలు వాళ్లే ఆత్మకథలుగా రాయించుకుంటే సరి.. ప్రపంచంలో పాపాత్ముడంటూ కలికానికైనా కనిపించడు. కంసుడైనా  ఖర్చుకు వెనకాడకండా స్వంత చరిత్రను రాయించుకొని ఉంటే మనకీ  రోజు కంసుళ్ళే పరమహంసలకు మల్లే ఆదర్శనీయంగా ఉండేవాళ్ళు.    అనుకుంటాం గానీ..   రావణాసురుడే నయం.  ఆడకూతుర్ని   ఎత్తుకొచ్చినా  కృష్ణుళ్ళా పెళ్ళాడ లేదు. ఆడేది జూదం. ఆడించేవాడు శకుని మామని తెలిసీ పందేనికి దిగడం..  వరస బెట్టి ఓడుతున్నప్పుడైనా ఆట వరస తెలుసుకోకుండా.. వంటిమీద స్పృహ కోల్పోయినట్లు.. సొంత తమ్ముళ్లనీ.. తాళి కట్టిన పెళ్లాన్నీ ఒడ్డడం.. ధర్మరాజు బుద్ధితక్కువతనం.  రావణాసురుడు.. సుయోధనుళ్లే.. చరిత్రలో ప్రతినాయకులగా మిగిలిపోయారు. పేరులో ఏమున్నది? పురాణాలు రాసి పెట్టేవాడిలో ఉన్నది గమ్మత్తంతా! ఆ పుక్కిట పురాణాల్ని పట్టుకొని రాముడి పేరు పెట్టి ఒక్క ఆడమనిషినే నమ్ముకోవాలని ఆశించడం.. బుద్ధుడి పేరు  తగిలించినందుకు ఒక చెంపకు మరో చెంప చూపించే సహనం అలవర్చుకోవాలనడం.. రహీమ్ పేరు రుద్దేసి 'రహం కర్' అని గద్దించడం.. ఎంత కన్నవారికైనా తగదు.. తగదు.. తగదు.. తగదు!
-కర్లపాలెం హనుమంతరావు




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...