Tuesday, May 8, 2018

డబ్బు కష్టాలు- సరదావ్యాసం



గడించడం కష్టం. ఖర్చు చేయడం కష్టం.. ఎవరెవరికో లెక్కలు చెప్పాలి. అట్లాగని దాచుకున్నా కుదరదు. దారాపుత్రులు ఊరుకోరు. ఎక్కడ దాచాలో  తోచదు. ఎవర్మని నమ్మాలి? ఎంత వరకు కుమ్మాలి? డబ్బు ఉంటేనే కాదు. డబ్బు అంటేనే కష్టం బాబూ!
అగచాట్లెందుకు.. అస్సలు డబ్బే వద్దన్నా దెబ్బై పోవడం ఖాయం! పూట గడవాలన్నా.. పూటుగా మందు పడాలన్నా ముందు కావాల్సింది కరెన్సీనే కదన్నా?
పొరుగింటి మీనాక్షమ్మల్తో పోలిక పెట్టే ఆండాళ్లు ప్రతి ఇంటా ఉంటారు.  ఓ ముత్యాల బేసరయినా ముక్కుకి తగిలించలేదని అలిగి కూర్చుంటారు. రేకెట్ నుంచి పాకెట్ దాకా అన్నింటికీ మనీతో పని. డబ్బు లేందే డుబ్బు క్కొరగాడన్న సామెతేమన్నా సర్దాకు పుట్టించారా  అనుభవజ్ఞులు?
ఎన్నికల్లో టిక్కెట్ల ఇక్కట్ల సంగతట్లా ఉంచండి. చిన్నోడి ప్రీ-కాన్వెంటు సీటుకైనా పెద్ద నోట్ల కట్టలవసరమే కదప్పా! బ్లాక్ బస్టరని బోడి బిల్డప్పులిచ్చే ఓన్లీ వన్దే డే ఆడే చెత్త సినిమాకైనా బ్లాకులో తప్ప టిక్కెట్లు దొరికి చావని రోజుల్లో రొక్కాన్ని మరీ అరటి తొక్కలా తోసలవతల పారేస్తే పస్తులే!  
పైసలుంటేనే పేరొచ్చేది .. మంచిదో.. చెడ్డదో! ఫోర్బ్స్ జాబితాలో కెక్కించేదీ.. ఫోర్ ట్వంటీ కేసుల్నుంచీ తప్పించేదీ మనీనే! మనీ మేక్స్ మెనీ ట్రిక్స్!
బ్యాంకప్పుల వంకతో పైసా వసూల్. తిరిక్కట్టమంటే ఇంటి పై కప్పుల వంక చూపులు! వీల్చూసుకొని విదేశాలకు చెక్కింగ్స్!   మంచి స్కీమ్సే కావచ్చు కానీ..  విమాన టిక్కెట్లకు సరిపడా అయినా మనీ తప్పని సరే కాదా.. దటీజ్ డబ్బూస్ పవర్!
బిర్లా టాటాలకి ఏ పేరొచ్చినా, అదానీ అంబానీలకి ఏ 'కీ' రోలిచ్చినా కీలకమంతా పర్శులోని కాపర్సుదే! బిట్స్ పిలానీ టు.. బిట్ కాయిన్స్ వరకు అంతా కాసుల తిరకాసులే! కాదంటే కుదరదు సుమా!
కుదురుగా ఉండనీయదు డబ్బెవర్నీ! పెద్ద నోట్లనట్లా అర్థరాత్రి కల్లా హఠాత్తుగా రద్దు చేయిందా లేదా?  పెద్దాయన పేరనట్లా ఊరూ వాడా మారుమోగించిందా.. లేదా? బ్యాంకులంటూ కొన్ని డబ్బుండే  చోట్లు మన దేశంలో కూడా పనిచేస్తుంటాయని జనాలకు తెలిసింది. ఏటియంలంటే ఏంటోలే.. పెద్ద కొలువులు చేసుకొనే చదువుకున్నోళ్లు నోట్ల కోసం నొక్కుకునే యంత్రాలని మామూలు జనాలకు అవి ఖాళీ అయినప్పుడే తెలిసింది! అందీ డబ్బు దెబ్బ! ఉన్నా సంచలనమే.. లేకున్నా సంక్షోభమే!
డబ్బు లేందే అప్పులుండవు. అప్పులంటే వూరికే ఎగేసేందుకు తీసుకొనే సొమ్మా కాదు.. సర్కార్లు ఓట్ల కోసం  మాఫీలు చేసేందుక్కూడా. ఏమైనా అంటే ఆర్బీఐ వూరికే ఫీలయిపోతుంది కానీ.. బాకీలు  మాఫీలు లేందే ఏ రాజకీయ పార్టీ అయినా సాఫీగా హామీలిచ్చేదెట్లా? అధికారంలోకి ఎగబాకేది ఎట్లా?
ఒక్క ‘పవర్’తోనే కాదు డబ్బుకు పరువూ ప్రతిష్ఠల్తో కూడా లంకే! డాలరు డాబు చూసుకొనే అమెరికావాడి ఆ రువాబు. ప్రపంచం అమెరికా చుట్టూతా గిరిటీలు కొడుతున్నా.. అమెరికావాడు డాలరు చుట్టుతా గింగిరాలు కొడుతున్నా అంతా ఆ సొమ్ములో ఉన్న గమ్మత్తు వల్లే.  డాలరు మీద దెబ్బేద్దామనే చైనావాడిప్పుడు  సిల్కు రోడ్డుతో తయారవుతున్నాడు. సిల్క్ స్మిత నుంచి.. సిల్క్ రోడ్డు దాకా అందరికీ డబ్బుతోనే బాబు డాబు!
నాలుగు రాళ్లు వెనకేసుకోమని పెద్దలేమన్నా పన్లేక సతాయిస్తారా? ఎప్పుడు ఏ రాయికి ఎంత విలువ పెరుగుతుందో దేవుడికే తెలియాలనుకుంటాం.  ఆ సూక్ష్మం వంటబట్టకే దేవుడూ  ఓ రాయిగా మారిపోయాడు. భక్తులు హుండీల్లో వేసే రాళ్లతో లోకతంత్రం నడిపిస్తున్నాడు! రూపాయిల నోట్ల మీద కనిపించక పోయుంటే పాపం గోచీపాతరాయుడు బాపుజీని అయినా పట్టించుకొనుండేదా ఈ డబ్బు పిచ్చి లోకం?
గౌరవనీయమైన పదవుల కోసం ఘోరంగా కొట్లాడుకుంటుంటారు నిస్వార్థ ప్రజాసేవకులు. గౌరవంగా ఓ రూపాయి వచ్చినా మనీ మార్కెట్లో దాని మార్పిడి విలువ ఎన్ని కోట్లుంటుందో?
డబ్బు మీదే ప్రజానేతకీ నిజానికి బొత్తిగా  మమకారముండదు. కానీ ఎన్నికల తంతుకు  కావాల్సిందే డబ్బు మూటలు కదా! అభిమానసందోహం ఆనందంగా  కోట్లు ధారపోస్తామన్నా ఎన్నికల సంఘం నిమ్మళంగా ఉండనీయదు. అందుకే ఎన్నికలకు ముందు నెల్లాళ్లు నేతలు ఎన్నడూ ఎరగని కాయా కష్టానికి తయారయేది. పలుగూ పారా పట్టినా, మట్టి మూటలు నెత్తికెత్తినా, రోడ్దు పక్క టీ కాచినా, రొప్పొచ్చేటట్లు రిక్షా తొక్కినా.. కూలి కింద గంటకు ఓ ఐదారు లక్షలు తగ్గకుండా గడించేది.
డబ్బుంటేనే కోర్టుల్లో ఏ పిల్ అయినా వేయగలిగేది.. ఏ జింఖానా కోర్టుల్లో అయినా ఐపిఎల్ ఆడగలిగేది! డబ్బుంటేనే అబ్బా.. చర్లపల్లి జైలైనా చల్లపల్లి రాజావారి బంగళాలా చల్లంగా ఉండేది.
డబ్బున్న వాడికి నేరాలతో నిమిత్తం లేదు. బేళ్ల కొద్దీ నోట్లు మనవి కాదనుకుంటే చాలు.. బెయిళ్లైనా దానంతటవే నడుచుకొచ్చేస్తాయ్! మరో అప్పీలుక్కూడా ఆస్కారం ఉండదు.
రూకల్లేకుంటే లోకానికి లోకువ. డబ్బున్న మారాజుకే మొక్కే బుద్ధి దానిది. ఈ కలియుగ  మాహాత్మ్యం వడపోసిన మహానుభావుడు కాబట్టే అంతెత్తున ఏడుకొండల మీద కొలువై ఉన్నప్పటికీ హుండీలు నిండుగా భక్తుల నుండి డబ్బులు దండుకొంటున్నాడు వడ్దికాసులవాడు. కళ్యాణ కట్టలో ఉచిత క్షౌరం చేసే చోట కూడా.. కాస్త చెయ్యి తడపందే కత్తెర మెత్తగా పడదు. పర్సు ఖాళీగా ఉన్నవాడంటే దేవుడుక్కూడా పడదు.
నోట్ల విలువ తెలియాలంటే సర్కారు కచేరీలే సలీసైన చోట్లు. అక్కడి కార్యాలయాల్లో అన్నేసి బల్లలు ఎందుకున్నాయో ముందా సూక్ష్మం తెలుసుకోవాలి తెలివున్న వాడెవడైనా. చాయ్ పానీకని  ఎంతో కొంత  పడితే గానీ స్ప్రింగు డోరును బార్లా తెరవనివ్వడు  బిళ్ల బంట్రోతు. దఫ్తర్లో ఏ పనికయినా అంకురార్పణ జరిగేది ముందు మేజాబల్ల మీద కాదయ్యా.. బల్ల కింద! గుడ్దిగవ్వంతయినా విలువ లేకుంటే ఎందుకంతలా కిందా మీదా పడి  ప్రజాసేవకులు కక్కుర్తి పడేది? ధన మూలం ఇదం జగత్! ఏ మూల చూసినా డబ్బు గమ్మత్తులే దుమ్ము లేపేస్తున్నప్పుడు .. నిప్పులాంటి  బతుకని డప్పేసుకు తిరిగే అమాయకుడికి కూట్లోకి పప్పే కాదు ఉప్పు కూడ దొరకదు.
అన్నదాతలకు నేరుగా అంతంత సొమ్ము సర్కార్లు ధారపోస్తున్నాయ్ ఉదారంగా! ఉద్ధరించేందుకా? డబ్బు దెబ్బ తెలుసు కాబట్టే ఎన్ని డబుల్ బెడ్రూంలు కట్టించినా పోలింగు రోజు ఓటరు చేతికి చీటీకింతని ముట్ట చెపుతున్నాయ్ అన్ని పార్టీలూ!
ఆకాశమంత పందిర్లేసి.. భూలోకమంత  వేదికల మీద ఎన్నొందల సార్లు రిలే ఆమరణ దీక్షలకైనా  కుర్చమనండి.. ఆ ఎన్నికల ఆఖర్రోజున ఎవరెక్కువ పాడుకుంటారో వాడికే ఓటు పడేది! దటిజ్ నోట్ పవర్!
డబ్బు మత్తు డ్రగ్సు కన్నా చెడ్డది. డ్రగ్సు కేసుల్నైనా అది గమ్మత్తుగా గాయబ్ చేసేస్తుంది. నలుపో తెలుపో .. డబ్బున్న వాడి ముందు సర్కార్లైనా చేతులు నలుపుకుంటూ నిలబడక తప్పదు. వాడి గల్లాపెట్టె మీద దెబ్బ కొట్టాలని చూస్తే మాత్రం ఎంత ల్యాంద్ సైడు  విజేతకయినా బ్యాండ్ భజాయింపు తప్పదు.
కనక.. కేసులు సంగతి ఆనక చూసుకోవచ్చు మహాశయులారా! ముందు  సూట్ కేసుల సంగతి పట్టించుకోండి! బ్యాంకులు వట్టి పోతే ఓటుబ్యాంకుకు గట్టి ముప్పు. ఇంకూ.. పేపరూ లేదని మంకు పట్లు వద్దు. ఎమ్టీ ఏటీఎమ్ములు ఎంతలావు వస్తాదుల్నైనా పల్టీ కొట్టించేస్తాయి!
సిబిఐ సంగతి ఆనక.. ముందు ఆర్బీఐ సంగతి చూడండి బాబులూ!
-కర్లపాలెం హనుమంతరావు

Monday, May 7, 2018

మన దేశములో ముస్లిముల పరిస్థితి - ఒక పరిశీలన -



మన దేశం ముస్లిములలో మెజార్టీ కడు పేదవారు. అత్యంత అవమానితులు. దళితుల మాదిరే రెండో తరగతి పౌరులు. నిరక్షరాస్యులు. సామాజికంగా వెనకబడినవాళ్లు. జనాభాలో ముస్లిముల వాటా 12 శాతం. ఆ మేరకైనా రిజర్వేషన్లు దక్కడం లేదు. ఎక్కడో ఒకచోట ఏదో ఒక మిష మీద తాము చేయని గతకాలపు దోషాలకు అమానుషంగా శిక్షలకు గురవుతున్న అల్పసంఖ్యాక వర్గం ముస్లింలే! ఒక వ్యూహం ప్రకారం నడిచే ఈ పైశాచిక దాడుల్లో ఒక్కోసారి కుటుంబాలకు కుటుంబాలు, ఊళ్లకు ఊళ్లు కొంపా గోడూ పోగుట్టుకొని నడిరోడ్దు మీదకొచ్చి పడే పరిస్థితులు పెచ్చుమీరుతున్నాయ్! ముస్లిముల మీది దాడుల్లో అరెస్టవుతున్న వాళ్లూ ముస్లిములే అవడం మరో విచిత్రం.
ఎన్నడో జరిగిపోయిన తప్పులకి ఇప్పటి తరాలు  ద్వేష చిహ్నాలుగా మారే విచిత్ర పరిస్థితులు ముస్లిం జాతి విషయంలో విశ్వవ్యాప్తంగా ఉన్నప్పటికీ.. ఈ దేశంలో  ఆ ఆగ్రహ జ్వాలలు ఆగకుండా మండే రాజకీయ గుండంలో భాగంగా ఉంటున్నాయ్! యూరపులో  కైస్తవులకు ముసల్మానులు అనలు మనుషుల్లానే కనిపించరు! క్రీస్తుని శిలువ వేసిన అపరాథానికి  యూదులు  చిత్రహింసల రూపంలో రుసములు చెల్లిస్తూనే ఉన్నారు తరాల తరబడి సాగిన జర్మన్ నాజీల పాలనలోనే ఈ దమన కాండ పరాకాష్టకు చేరిందనుకుంటే ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్న ద్వేషచరిత్ర దానికి పోటీగా తయారయింది. ముసల్మానుని సదా అనుమానంగా, ద్వేషంగా చూసే నాజీ మనస్తత్వంతోనే మన దేశ హిందువులకు ఇప్పుడు సరయిన పోలిక!
దేశభక్తిని ప్రదర్శించమని, హిందువులను గౌరవించమని, దేశ ప్రధాన స్రవంతిలో భాగం కావాలని ఒక్క ముస్లిం మతస్తుల మీదే వత్తిడి పెరగడం వారి జాతీయతను అవమానించడమే! పది కోట్ల పైచిలుకు ముస్లిములు మాట్లాడే ఉర్దూభాషకి  ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకూ అధికార హోదా లేదు! తతిమ్మా పేదల్లాగానే పనీ పాటా, ఇల్లూ వాకిలీ, తిండీ తిప్పలూ, రోగం రొప్పులతో  సతమతమయ్యే ముస్లిములను గురించి నాలుగు మంచి ముక్కలు విచారించడం మాని.. దేశ సంస్కృతి, మతం, భాష వంటి అంశాల ఆధారంగా ప్రధాన స్రవంతిలో కలిసిపోతేనే మంచిద'ని పద్దాకా సతాయించడం ఏ మతసామరస్యానికి నిదర్శనం? ముస్లిం కుటుంబంలో పుట్టిన కారణంగా..  ఆ వ్యక్తి పరాయిగడ్డ మతం మీద మాత్రమే ప్రేమ పెంచుకుంటాడని ఏ ఆధారంతో నిర్ధరణ జరుగుతున్నట్లో? సాటి పౌరులకన్నా ఒక మెట్టు తక్కువలో ఉన్నట్లు  నిత్యం తూట్లుపొడిచేటందుకు ఒక మాతాన్ని అడ్దుపెట్టుకోవదం సర్వ సత్తాక ప్రజాస్వామిక వ్యవస్థకు చేటు తెచ్చే పిచ్చిచేష్ట.  ఒక వ్యక్తిని తన సహజ, ప్రజాస్వామిక, ప్రాధమిక హక్కుల నుంచి మతం ప్రాతిపదికగా   దూరం చేయడాన్ని మన రాజ్యాంగం ఏ సెక్షంలో సమర్థించింది?!
ముస్లిముల పట్ల అధిక సంఖ్యాక వర్గాలకు ఉండే సందేహాలు, ద్వేషభావాలు  రోజు రోజుకీ కొత్త రూపు సంతరించుకుంటున్నాయి! పాక్ లోనో, బంగ్లా లోనో జరిగే ఘోరాలకు ఇక్కడి ముస్లిములు నిలదీతకు గురవుతున్నారు! న్యూయార్క్ ట్రేడ్ సెంటర్ కూలిన రోజుల్లో భారతీయ ముస్లిములకు ఎదురైన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికీ ఆ పరిస్థితుల్లో మార్పేమీ లేదు. ప్రపంచంలో ఏ మూల ముస్లిం ఉగ్రవాదులు విధ్వంసం  సృష్టించినా దానికి ఇక్కడి ముస్లిములు బాధ్యత వహించాలనడం భావ్యమేనా? స్వేఛ్చగా వదిలేస్తే ఇక్కడి ముసల్మానులూ ముందు ముందు ఆ తరహా విధ్వంసాలకే   పాల్పడతారన్న  భయాందోళనలకు ఏ సహేతుకమైన కారణాలు కనిపించవు.  సాటి పౌరుల అకారణ భయాందోళనల కారణంగా గౌరవప్రదంగా జీవించే హక్కులు ముస్లిం జాతి కోల్పోవడం అన్యాయం! ప్రతి ముస్లిమునూ ఎల్లవేళలా ఓ కంట కనిపెట్టి ఉండటం దేశభద్రత దృష్ట్యా  ఎంతో అవసరం- అనే మిషతో ముస్లిములను నిత్యం వేధించే 'గౌరవప్రదమైన' పెద్దలకు, సంస్థలకు   మన్నింపులు పెరుగుతున్నాయ్! దేశ మతసామరస్య స్ఫూర్తికి ఇది మేలు చేయదు.
జ్ఞాపకాలూ, సంశయాలు సమస్తం ముస్లిములు అనగానే  ద్వేషం రంగునే పులుముకుంటున్నాయ్ ఈ దేశంలో! ముస్లిం మతంలో పుట్టిన పాపానికి అప్పుడే పుట్టిన పాపాయి కూడా స్థల కాలాదులతో నిమిత్తం లేకుండా దోషిగా అనుమానానికి గురి కావడం ఈ దేశ ప్రవచిత లౌకిక వ్యవస్థకు మచ్చ తెచ్చే చర్య.
నమ్మదగ్గ గణాంకాలు ఏవీ నిర్దరించకపోయినా ప్రతీ ముస్లిం పురుషుడు నాలుగుకు తగ్గకుండా పెళ్లిళ్లు చేసుకొని.. అడ్డూ ఆపూ లేకుండా పిల్లల్ని కంటూ దేశాన్ని ముస్లిం  పుట్టగా మార్చేస్తున్నాడన్న దుష్పచారం ఎప్పటినుంచో  సాగుతోంది. ఇప్పుడా ప్రచారానికి అధికారిక హోదా  తోడయింది! కానీ తాజా  జనాభా గణాంకాలు  ఈ ఊహలను సమర్థించడం లేదు. సుదూర భవిష్యత్తులో తమ మతస్తుల అత్యధిక సంఖ్యలో ఉండాలన్న లక్ష్యంతో పూట కూటికే దేవులాడుకొనే పేద ముస్లిం అడ్దూ ఆపూ లేకుండా బిడ్డల్ని కంటాడా? ఆ ఊహే హాస్యస్పదం.  
స్త్రీలను పరదాల్లో దాచి ఉండటం, వారి విద్య, వైద్యం వంటి ప్రాథమిక హక్కుల్ని కాలరాయడం, మూఢాచారాలతో పీడించడం, సంతానార్థం వత్తిడికి గురిచేయడం.. వంటి అనాగరిక చర్యలు ఒక్క ముస్లిం మతంలోనే లేవు.  సామాజికంగా,  ఆర్థికంగా, మేధోపరంగా వెనకబడ్డ హిందూ అణగారిన వర్గాలలోనూ కనిపిస్తుంది. స్త్రీలు మగ సాయం ఆశించకుండా ఇంటి పనంతా స్వయంగా చూసుకోవాలి. ఆడదంటే వంటింటి కుందేలు. బైటకు వెళ్లవలసిన అగత్యపు పరిస్థితుల్లో మగ తోడు తప్పని సరి. పరాయి మగవారి కంటబడే సందర్భంలో మొగం కొంగులో దాచుకోవాలి. పెద్దలతో వ్యవహరించే సమయంలో నెత్తి మీది ముసుగు సర్దుకోవాలి. ఇంటి మగవాళ్లంతా భోజనాలు ముగించిన తరువాతే ఆడవాళ్లు తమ తిళ్లను గురించి ఆలోచించాలి. విద్య, వైద్యం, వినోదం వంటి రంగాలలో మగవారికే ముందు అవకాశం.. ప్రాధాన్యత. ఈ తరహా సంస్కృతి నిన్న మొన్నటి వరకూ హిందూ సమాజాలలోనూ ఓ సుసంప్రదాయంగా చలామణీ అయింది! అన్నిటికన్నా విచిత్రమైన విషయం - ఇవాళ విశాల భావాలతో  మెలిగే మధ్యతరగతి హిందూ వర్గాలు ముస్లిములు పాటిస్తున్నారని ఎద్దేవా చేసే  ఆచారాలనే అటూ ఇటూగా గతంలో తమ పెద్దలూ ఆచరించారన్న సత్యం విస్మరించడం! తామే  ప్రదర్శిచని మతసామరస్యాన్ని ముస్లిములు ప్రదర్శించడం లేదని ఆక్షేపించేవారే గొప్ప 'సంస్కర్తలు'గా ప్రస్తుతం కీర్తింపబడుతున్నారు! తమకు లేని విలువలు ముస్లిములకూ లేకపోవడం తమ విషయంలోలాగా వారి విషయంలోనూ వెనుకబాటుతనమే ముఖ్య కారణం కాగా.. తమ సంస్కృతి మీద కలసి కట్టుగా ముస్లింలు  చేస్తున్న విద్రోహ చింతన ఎట్లా అవుతుందో మరి హిందూ పెద్దలే తేల్చి చెప్పాల్సుంది!
నిజం చెప్పాలంటే మతపరంగా  అల్ప  సంఖ్యాకులైన ముస్లిములు ఈ దేశంలో  సామాజికంగా ఒక మానవీయ స్పర్శకు దూరమై,  తాము చేయని నేరాలకు నిష్కారణంగా సాటి పౌరుల వివక్షకు గురవుతున్నారు. ఊహపోహలతో చెప్పుకొస్తున్నది కాదు! స్వాతంత్ర సాధన సమర సందర్భంలో దేశ విభజన నేపథ్యంగా తూర్పు పాకిస్తాన్, పంజాబుల్లో జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనలు స్మృతిపథం నుంచి చెరిగిపోని పెద్దలు ఎవరినైనా అడిగి చూడండి! క్రూరత్వం, దేశద్రోహం అనే రెచ్చగొట్టే భావోద్వేగాలకు ముస్లిములనే ఎవరు.. ఎందుకు సంకేత చిహ్నాలుగా వాడుకొనే వ్యూహానికి తెరలేపారో  వివరంగా చెప్పుకొస్తారు.
ఏడు దశాబ్దాలు దాటినా ఆ  మతసర్పాల బుసలు సద్దుమణగనే లేదు. సరికదా..  విద్వేష పూరిత విషప్రచారాలు వేయిపడగలతో  మరింత జోరుగా విషం చిమ్ముతున్నాయిప్పుడు. పాపం పుణ్యం ఎరుగని ముస్లిం పేద కుటుంబాల బిడ్డలని  పాక్ ఏజెంట్లుగా చిత్రించి చిత్రవధలు  పెడుతున్న కథలు ఎన్నో వింటున్నాం. పేదలు, పీడితులు, అవమానితులుగా దళితులని గుర్తించి సంఘటిత పరిచే ఉదార మేధావులు  ముస్లిములకు జరుగుతున్న అన్యాయాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నట్లు? నిర్లిప్తత, నిరాసక్తతల ద్వారా ఫాసిస్ట్తు శక్తులకు  మరింత ఊతం ఇవ్వదలిచారా?
ఆత్మరక్షణ కోసం గత్యంతరం లేని  పరిస్థితుల్లో  అమాయక ముస్లిములు అవకాశవాద రాజకీయాలకు, తమ మతానికే చెందిన తీవ్రవాదుల ఉచ్చులకు చిక్కుకుంటున్నారు.  మత సామరస్యాన్ని మంట కలిపే శక్తులే   జాతి నిర్మాత పాత్రలు నటిస్తున్నాయిప్పుడు. తస్మాత్ జాగ్రత్త!


కన్నడ రచయిత 'బోళువారు మహమ్మద్ కుంజి' కథల సంకలనం 'దేవర గళ రాజ్యదల్లి'(దేవుళ్ల రాజ్యంలో) ముందు మాట- ప్రేరణతో
-కర్లపాలెం హనుమంతరావు

Sunday, May 6, 2018

మాటలూ- మార్పులూ- డా॥ బూదరాజు రాధాకృష్ణ పుస్తక పరిచయం -1



తెలుగులో రెండు మూడు నిఘంటువులు ఉన్నాయి. శబ్దరత్నాకరం, సూర్యరాయాంధ్రం, ఆంధ్రవాచస్పత్యం.. వగైరా. ఇంకా ఏమైనా ఉంటే ఉండవచ్చు, వేటి దారిది వాటిదిగా సాగింది పదనిఘంటువుల నిర్మాణం. తక్కిన ద్రవిడ భాషలకు మహానిఘంటువులు నిర్మితమయ్యాయి.. కానీ తెలుగువాడికి ఆ అదృష్టం లేదు. వేదం వెంకటరాయ శాస్త్రి, గిడుగు రామ్మూర్తి పంతులుగారు వంటి ఉద్దండులు నిఘంటువల నిర్మాణానికి కొంత ప్రయత్నం చేసారు. వాటిని వేటినీ కాదని ఆంధ్రసాహిత్య పరిషత్తువారు సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణం తలపెట్టారు! ఆ నిఘంటు నిర్మాణ పోషణకు పూనుకున్న పిఠాపురం రాజావారు చివరకు బికారి దశకు చేరుకున్నారంటారు. తెలుగు అకాడమీ ప్రారంభమయిన తరువాత శబ్దసాగరం పేరుతో ఒక నిఘంటువు నిర్మించాలన్న తలంపు పెట్టుకున్నది. కానీ అఖండ భాషాభిమానులయిన పాలకులు ఆ క్రతువు పూర్తి కాకుండా ఉండేందుకు శక్తి వంచన లేకుండా పాటుపడ్డారని బూదరాజు రాధాకృష్ణగారు ఒక సందర్భంలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒక వ్యక్తి తన జీవితకాలమంతా శ్రమించినా ఒక మహానిఘంటువు నిర్మాణం సాధ్య పడదు. అలా పడదని ప్రపంచ దేశాల నానా భాషాచరిత్రలు నిరూపిస్తున్నాయి కూడా. అయినా కాలం, ఖర్మం కలసి వచ్చి భవిష్యత్తులో అలాంటి మహానిఘంటువు నిర్మాణం  తలంపు మొదలయితే.. ఉపకరణంగా ఉంటుందన్న మంచి ఉద్దేశంతో బూదరాజు  రాధాకృష్ణగారు ఈనాడు ఆదివారం అనుబంధంలో  సుమారు నాలుగేళ్ళపాటు ( 1997, జూన్ 8 - 2001, ఫిబ్రవరి 2) 'మాటలూ-మార్పులూ' శీర్షిక నిర్వహించారు.  మహానిఘంటువు నిర్మాణం కానీ చేపట్టదలిస్తే గమనించవలసిన అంశాలు బోలెడున్నాయి. వాటినన్నింటినీ ఏకరువు పెట్టడం ఆరంభంలోనే బెదరగొట్టినట్లవుతుందని  రాధాకృష్ణగారి అభిప్రాయం. అయినా కాలక్రమంలో శబ్దాల్లో, అర్థాల్లో వచ్చే స్వాభావికమైన మార్పులను కొంతలో కొంతైనా సూచిస్తే బుద్ధిమంతులకు, శక్తిమంతులకు మహానిఘంటువు లేదన్న కొరత స్వల్పంగా అయినా తీరుతుందన్న ఉద్దేశంతో బూదరాజుగారు నిర్వహించిన  మంచి ధారావాహిక శీర్షిక ఇది. దీని ద్వారా తెలుగువారిలో ఎవరికయినా మళ్ళీ భాషాభిమానం రేకెత్తి.. మహానిఘంటువు నిర్మాణ సంకల్పం మొలకెత్తితే తాను పడ్డ శ్రమ కొంత సార్థకమవుతుందని రాధాకృష్ణగారి భావన.
600 మాటలకు సంబంధించిన కొంత సమాచారం ఈ శీర్షిక ద్వారా అందిచారు. పదానికి ఉన్న అర్థాల్లో కాలక్రమంలో వచ్చిన మార్పుల వివరణ ఉంది. సందర్భాన్ని బట్టి ఆధునిక శాస్త్ర రచన అవసరాలనూ దృష్టిలో ఉంచుకొని పాతమాటలకే కొత్తపదబంధాలు కల్పించి వాటినే సాంకేతిక శబ్దాలుగా ప్రయోగిస్తున్న వైనాన్నీ పరిశీలించారు ఇందులో. ఇలాంటి ప్రయత్నం ఈ శీర్షిక ముందు.. తరువాత కూడా మళ్లీ ఎవరు తలపెట్టక పోవడం విచారించదగ్గ విషయం.
అంతర్జాల యుగంలో తెలుగు పద సంపదకు మరింత పుష్టి కలిగించాలన్న దృష్టి కల భాషాభిమానులు, భాషోద్ధరణకు కృషి చేసే సంస్థలు, సమాచార పత్రికలు ఈ తరహా కృషిని మరింత ముందుకు కొనసాగిస్తారన్న ఆశతో ఇక్కడ ఈ చిరు పరిచయాన్ని ఇవ్వడం జరిగింది!
అభినందనలతో
కర్లపాలెం హనుమంతరావు
***

ఈ వ్యాసానికి కొనసాగింపుగా ఈనాడు విశ్రాంత ఉద్యోగులు శ్రిధర మూర్తి  గారు అందించిన అదనపు అత్యంత విలువైన సమాచారాన్ని కూడా ఇక్కడ జత చేస్తున్నాను :

"జయంతి రామయ్య పంతులు గారిచే రచింపబడిన "శ్రి సూర్యరాయంధ్ర నిఘంటువు " కాకినాడ అంధ్ర  సాహిత్య పరిషత్ వారు 1936 లొ ప్రచురించారు.  దానిని అంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి వారు  1979 లొ పునర్ముద్రించారు,  6 సంపుటాలు గా వెలువడింది. దీని గొప్ప దనం ఏమిటంటే, అలుక అని ఒక మాటకు ఎన్ని అర్ధాలున్నయో తెలుపుతూ, ఆ మాట వాడబడిన పద్యం గాని, వాక్యం గాని ఉదాహరణలు ఇచ్చారు.  తరువాతి కాలం లొ వచ్చిన పుర్ముద్రణలో ఈ పద్యాలు ఉదాహరణలు లెకుండా ఒకె సంపుటం గా ముద్రించారు. ఇక తెలుగు అకాడెమీ వారు ఇంగ్లీష్ తెలుగు నిఘంటువును  A4 size లొ  3 కాలంస్ తో 1300 పేజీ ల నిఘంటువు ప్రచురించారు.  అప్పట్లో  డిప్యుటీ  డైరెక్టర్స్ గా పనిచేసిన, ముకురాల రామారెడ్డి, పొరంకి దక్షిణామూర్తి ఈ నిఘంటువు ను తయారు చేసారు. ఇప్పుడు ఇది దొరకటం లేదు. నా దగ్గర మాత్రం ఒక కొపీ వుంది.  ఇక, బూదరాజు గారు ఈనాడు జర్నలిస్ట్ ల కొసం వ్యవహార పదకొశం తయారు చేసారు.  ఈనాడు దీనిని ముద్రించింధి.  సచివాలయం లొ న్యాయ శాఖ లో అనువాద విభాగం లో మేము తయారు చేసిన నిఘంటువు ను ముద్రించటానికి మాకు నిధులు లేనందున తెలుగు అకాడెమి వారికి ఇచ్చాము.  వారు దానిని న్యాయ పద కోశము పేరుతొ ముద్రింఛారు.  నాకు తెలిసిన సమచారం ఇది."

మాల్యా! మా జైళ్లే భేషయ్యా!- సరదా వ్యాఖ్య



భారతదేశంలోని జైళ్ల పరిస్థితి బాగోలేదని.. తనను అక్కడికి పంపించవద్దని విజయ్ మాల్యాజీ లండన్ న్యాయస్థానంలో మొరపెట్టుకున్నట్లొక తాజా వార్త. భారతదేశంలో జైలు జీవితం ఎంత మజాగా ఉంటుందో  తెలీకే శ్రీవారి ఈ కొత్త మెలిక?
విజయ్ జీ  సంఘంలో మహా గొప్ప గుర్తింపుగల పెద్దమనిషి. ప్రపంచవ్యాప్తంగా మాల్యాజీ మాటకుండే విలువ అమూల్యం. భారతీయ కారాగారాల మీద శ్రీవారలా  కారాలూ మిరియాలూ నూరడం  భావ్యం కాదు.  అందుకే ఈ చిన్న విన్నపం!
మహా మహా రాజశ్రీ విజయ్ మాల్యాజీ!
ప్రస్తుతం  కర్ణాటకలో హోరాహోరీ ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు ప్రతీ ఒక్క ఓటూ అమూల్యమే. గత రెండు దఫాలుగా తమరు కర్నాటక రాష్ట్రం తరుఫు  నుంచే ‘పెద్ద’ల సభకు ఎన్నికైన ప్రతినిధులు! తమ వంటి పెద్దల కీలకమైన ఓటు ఒక్కటి తగ్గినా మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకి పెద్ద లోటు.  ఎన్నికల గడువు లోపే తమరు ఈ దేశం గడ్డ మీదకు మళ్లీ కాలు మోపి తమ అమూల్యమైన ఓటును సద్వినియోగ పరుచుకోమని  వినతి. మన దేశంలోని జైళ్లు జేబుదొంగలకు చుక్కలు చూపిస్తాయేమో గానీ.. తమ బోటి బ్యాంకు బొక్కింగులకు, లిక్కరు కింగులకు పక్కలు పరుస్తాయి!  
మన దేశీయ కారాగారాల   వైభోగం తమబోటి పెద్దలకు పెద్దగా విడమరచి చెప్పాలా! బడా  నేరస్తులకు  అత్యంత సురక్షితమైన స్థలాలు మన జైలు గోడలే! ఉన్నత వర్గాల నుంచి విచ్చేసే గౌరవనీయమైన నేరస్తులకు కారాగారాలలో కల్పించే ప్రత్యేక సౌకర్యాలను గూర్చి  మన మీడియానే వీడియోలతో సహా  ప్రపంచానికి ఎన్నోసార్లు  చాటి చెప్పింది. వాటినన్నింటినీ  వట్టి కల్పిత కథనాలుగా మేం కొట్టి పారేసిన మాట నిజమే. ఆయా ప్రకటనలను ఆట్టే పట్టించుకోవద్దని మనవి.  వట్టేసి చెబుతున్నాం! మన దేశ కారాగారాలు  తమబోటి ఘరానా వ్యక్తులకు స్వర్గధామాలు. మా బందిఖనాలలో అందించే ప్రత్యేక సౌకర్యాలన్నీ అధికారికంగా ఇక్కడ పొందుపరచడం ఇబ్బందికరం. ఒక్కసారి తమరే  విచ్చేసి  పర్యవేక్షించ ప్రార్థన. తమరి   లండన్ ఐదు నక్షత్రాల వసతి గృహాలైనా వట్టి 'డన్ జన్’ లుగా భావించకుంటే ఒట్టు.
తాజాగా తమిళనాడు బ్రాండ్ వి.వి.వి..పి మ్యాడమ్ శశికళమ్మగారికి కర్ణాటక కారాగారవాస అదృష్టం తన్నుకొచ్చింది. ఆ దేవేరికి జరుగుతున్న  రాణీమర్యాదలే మా కారాగార అధికారుల నిబద్ధతకు తిరుగులేని నిదర్శనం.
ఆ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల కారాగారాలలో ప్రముఖ   రాజకీయ నేతలు.. వారి వందిమాగదులు  మేం కల్పించిన ప్రత్యేక సౌకర్యాలన్నెంటినో తనివి తీరా  అనుభవించారు చాన్నాళ్ళు. ఛానళ్ల కళ్లబడకుండా ఎన్ని అవస్థలైనా పడి  పెద్దలను సంతోషపెట్టడమే ప్రధమ కర్తవ్యంగా మేం భావిస్తాం! మీ  మహారాజా మర్యాదలకు మాదీ గ్యారంటీ మాల్యాజీ! వారానికోసారి మా వారంట్లూ, వాటిని మళ్లీ మళ్లీ మీరు తిప్పి కొట్టడాలూ.. ప్రతిపక్షాలతో బొప్పికట్టేటట్లు మాకు తలంట్లు.. ఇవన్నీ అవసరమా? ఒక్క శనివారం  తమరు  మన చట్టానికి చిక్కి చుట్టపు చూపుగా మా కారాగారాలకి విచ్చేయండి.. చాలు.. విజయ్ జీ! మళ్లీ సోమవారానికల్లా   మీకు బెయిలు తెప్పించే పూచీ మాదీ.   మూడ్రోజులూ మేం మీకిచ్చే అతిధి మర్యాదలకు తమరే మూడ్ మార్చుకొని మళ్లీ మళ్లీ మా ఊచల వెనక్కే వచ్చేయాలని ఉవ్వీళ్లూరడం   ఖాయం.  
ఒక్క రాజకీయ నేతాశ్రీలకే మా ప్రత్యేక సౌకర్యాలన్న భయాలొద్దు! మీ బోటి బ్యాంకులూటీ బిగ్ పర్శనాల్టీలకు అంతకు మించిన రాజభోగాలు.. గ్యారంటీ! దొరలైతే చాలు .. ఎన్ని దొంగపన్లకు పట్టుబడి జైలుకొచ్చినా పొర్లుదండాలు పెట్టి మరీ సేవించుకోవడం మా అదృష్టంగా భావిస్తాం మాల్యాజీ! 'అతిధి దేవో భవ'అన్న భారతీయుల సత్సాంప్రదాయం అత్యంత నిబద్ధతతో అమలు చేసే ప్రభుత్వ శాఖలు ఏమైనా  ఇంకా మిగులుంటే.. అందులో మా కారాగారశాఖవారిదే మొదటి స్థానం. 
ముంబయి అల్లర్ల కేసులో పట్టుబడి జైలుకొచ్చిన కసబ్ కహానీ దొరవారి చెవులకు సోకినట్లు లేదు. కిలో రెండొందలు పెట్టినా దొరకని ‘శ్వాన్’ బ్రాండ్ బాసుమతితో మాత్రమే రోజూ బిర్యాని వండి పెట్టేవాళ్లం. ముక్క లేందే ముద్ద దిగదని ఆ ముష్కరుడు  మొండికేస్తే మేమే తలకింతని వేసుకొని టన్నులకొద్దీ మటన్లు, చికెన్లు వండి  వార్చాం.   చింకిచాపల మీద కునికే చిల్లరగాళ్లకే ఇంతలా సేవలు అందించగా లేంది.. బంగారు కోడి పెట్టలు.. తమరి వంటి శృంగార పురుషులకు ఏ తరహా పవ్వళింపు సేవలు కావాలో  మాకు తెలీదా? కంగారు పడకుండా ఒక్కసారి విధాయకంగా అయినా మన దేశ చట్టానికి లొంగిపోండి. మా కారాగారాలకు దయచేయండి మహాప్రభో!
మీకు అప్పులిచ్చిన ఆ బ్యాంకులోళ్లెవరూ మీ బ్యారెక్సు వైపు కన్నెత్తైనా చూడకుండా కాచి కాపాడే  పూచీ మాదీ! తమరి  క్రికెట్టాటల షెడ్యూళ్లేవీ   చెదిరి పోకుండా మీ కోర్టు కేసులన్నీ రీషెడ్యూలు చేయించే డ్యూటీ  మన సర్కారు పెద్దవకీళ్లు మహా సంబరంగా స్వికరించేందుకు సిద్ధం.. సరా సార్జీ!
అనొచ్చో లేదో.. తెలీదు కానీ..  ఇప్పుడిక్కడి న్యాయస్థానాలలోనూ నేరం తూచే  పని మరీ తమరు వణికిపోయేటంత  తిన్నగా ఏమీ సాగడం లేదు! కేసుల సాగతీతకు మీరు అక్కడ లండన్లోనే ఉండి అవస్తలు పడనక్కర్లేదు. ఆసారాం బాపూలాంటి ఆధ్యాత్మిక బాబాలకే అప్పుడెప్పుడో చీకట్లో చేసిన పెద్ద తప్పుకు ఇప్పటిగ్గానీ శిక్ష పడలేదు. అదీ మరీ అంత పెద్ద ఉరి శిక్షేమీ కాదు. నెంబర్ వన్ బాలీవుడ్ హీరోలకే  శిక్షలు పడ్డం లేదు ఇప్పుడిక్కడ మాల్యాజీ! ఆఫ్ట్రాల్ తొమ్మిది వేల కోట్లు .. అదీ జనం సొమ్మే కదా దొరగారు బొక్కిందీ! బోనులో నిలబెడతారని అంతలా భయపడ్డమెందుకు? గమ్మునుండటం మీ వంటి గుండెలు తీసిన బంట్లకు శోభనివ్వదు. తమిళ తంబి ఏ. రాజాలా తమరూ ఇక్కడి ‘లా’ పాయింట్లతోనే ఎదురు తిరగబడరూ? మన చట్టాల్ని చితక్కొట్టేందుకైనా తమరు తిన్నగా ఈ దేశంలోకొచ్చి తీరాలి! తొండి ఆట ఆడేందుకైనా తమరు  తొందరగా దయచేయండి మాల్యాజీ! మీ మీద ఈగైనా వాలకుండా  మా జైళ్ల శాఖలన్నీ వేయి కళ్లతో  కాపు కాసేందుకు రడీ!
రెండుసార్లు రాజ్యసభ సభ్యులయి ఉండీ ఎన్నికల్లో ఓటేయకుంటే  జనం ఏమనుకుంటారూ?   
మన దేశంలో కారాగారాల కండిషన్లేవీ బావో లేవని మాత్రం కోర్టుకెక్కకండి మహాప్రభో! బావోదు! వి.వి.వి.ఐ.పిలకు ఎర్రతివాచీలు పరుస్తాం మేం! మా మాట బూటకమనుకుంటే  మీరే నేరుగా ప్రముఖ నేరస్తులు.. సీజనల్ ప్రిజనర్ గౌరవనీయులు శ్రీమాన్ లాలూ ప్రసాద్ యాదవ్ గారిని సంప్రదించవచ్చు!  ఏళ్ల తరబడి జైల్లో మహారాజ వైభోగాలను నిరాటంకంగా అనుభవించిన గనుల పెద్దలతో అయినా  లైను కలుపండి!  దిగులుగా జైళ్ల కెళ్లి హుషారుగా  ఊరేగుతూ తిరిగొచ్చిన వి.వి.వి..పి ల చిరునామాలు తమరి కర్నాటక అభ్యర్థుల జాబితాలోనే తట్టల కొద్దీ దొరుకుతాయ్  మాల్యాజీ! ఏ బడా నేరస్తుడినడిగినా మన జైళ్ల మర్యాదలకు జై కొట్టడం ఖాయం.
ఓటేసేందుకు  వీల్లేకుండా పోయిందని తమరిలా  వాపోయే కన్నా ఒక్కసారి దేశంలోకి దొగబడి సరెండరై చూడండి.  జైలుకెళ్లొచ్చిన వాళ్లకే జనంలో చచ్చేటంత  డిమాండ్. హాస్యానికని అంటున్నారేమో తమరు.. మన జైళ్ల పరిస్థితులేం బావోలేవని! జైళ్లంటే పెద్దమనుషులకి అత్తారిళ్లంత సౌకర్యవంతంగా ఉంచాలన్నది మా పాలసీ మాల్యాజీ!
ఒకే ఒక్కసారి మా జైళ్లకు విచ్చేసి ఓ పూట మా ఆతిధ్యం స్వికరించమని మనవి! జన్మంతా జైళ్లల్లోనే గడిపేయాలన్నంత కమ్మంగా ఉంటాయి మా  చందన తాంబూలాది  అతిధి సత్కారాలు!   
ఇట్లు
తమరి  విదేయుడు
పేరు బైటకు చెప్పకోలేని అనధికార కారాగారాధికారి
అనధికార జైలు పర్యవేక్షకుడు
***
-కర్లపాలెం హనుమంతరావు




Tuesday, April 24, 2018

శంకరాభరణం – మాభూమి ఒక పోలిక- ఒక తేడా




శంకరాభరణం, మా భూమి చిత్రాలు
 ఒకే ఏడాది (1980) విడుదలయి రెండూ ఘనవిజయం సాధించాయి. 'శంకరాభరణం' చారిత్రక విజయం సాధించి, ఖండాంతరాలలో కీర్తిని గడించి, తమిళనాడు, కర్ణాటకలలో సైతం జైత్రయాత్ర సాగించి, డైలాగులు మలయాళంలో, పాటలు తెలుగులోనే ఉండి కేరళలోనూ ఘనవిజయం సాధించింది. 50 వారాలు ప్రదర్శితమైంది. సంగీతపరమైన చిత్రాలకు మళ్ళీ ఓ ట్రెండ్‌ను సృష్టించి, విశ్వనాథ్‌ ఈ తరహా చిత్రాలను మరికొన్ని రూపొందించడానికి ఆక్సిజన్‌ను అందించిందీ చిత్రం”(వికీపీడియా).  అవార్డు పొందిన శంకరాభరణాన్ని పోటీలు పడి ఇలా పొగడ్తలతో ముంచెత్తేసారు అప్పట్లో. నిరసన గళాలు వినిపించినవారు చాలా తక్కువ. అందులో భాగ్యనగరానికి చెందిన ఒక వామపక్ష విద్యార్థి సంఘం గొంతూ ఒకటి. వాళ్ల అభ్యంతరమల్లా చిత్రంలో ముఖ్య పాత్రధారులంతా బ్రాహ్మణ వర్గానికి చెందివుండటం. చిత్రాన్ని అర్థం చేసుకోవడంలో నిజానికి గజ దూరం దాకా వచ్చినా ఒక మూరలో దారి తప్పిపోయారా తమ్ముళ్ళు. నటీనటుల కులం సంగతి ‘రిజర్వేషన్' కోసం పోరాడే వర్గాల బాధ. వామపక్షీయులకెందుకు?! ‘శంకరాభరణం బ్రాహ్మణుల చేత, బ్రాహ్మణుల వలన, బ్రాహ్మణుల కొరకు నిర్మితమైన చిత్రం’ అన్నారు ప్రజాహకుల్ల నేత బాలగోపాల్. ఇక్కడ బాలగోపాల్ వాడిన 'బ్రాహ్మణీయం' కులానికి సంబంధించింది కాదు సుమా! భారతీయుల సంస్కృతికి తమను తాము ప్రతినిధులుగా భావించుకొనే తరహా వర్గానికి సంబంధించింది. ఆ వివరణా ఆయనే ఇచ్చుకొన్నారు. బాలగోపాల్ శంకరాభరణం విజయాన్ని విశ్లేషించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
భారతీయ సామాజిక వ్యవస్థ రంగు, రుచి, వాసన సాధారణంగా బూర్జువా, భూస్వామ్య వ్యవస్థలకు దగ్గరగా ఉంటుంది. అది బాహ్య స్వరూపం. నయావలస విధాన లక్షణాలనూ  జోడించినప్పుడే దాని సంపూర్ణ స్వభావం అర్థమయేది-అంటారు బాలగోపాల్.
భారతీయ బడా బూర్జువా వర్గం ప్రగతిశీల స్వతంత్ర వ్యవస్థ కాదు. ప్రపంచ పెట్టుబడీదారీ వ్యవస్థ కొంగు పట్టుకుని నడిచే పరాన్నజీవి. వర్తమాన భారతీయ సంస్కృతిలో కనిపించే కళారూపాలేవీ వాటికై అవి వికసించలేదు. అవీ ప్రపంచ పెట్టుబడిదారీ కళలకు అనుకరణలే. ఆ అనుకరణైనా ఉదారవాద బూర్జువా సంస్కృతి నుంచి ప్రభావితమై ఉండుంటే  కొంతలో కొంత మేలు జరిగి ఉండేది. కుళ్ళిపోయిన నిరాశావాదపు సంస్కృతిని  వెకిలిగా అనుసరించాయి ఆ కళలన్నీ. భవిష్యత్తు పట్ల విశ్వాసం లేని సంస్కృతి అస్తమానం అమూర్త వ్యక్తీకరణల వెనక నక్కే ప్రయత్నం చేస్తుంది. కానీ దానిలోని అంతర్గత ప్రజాస్వామ్య తర్కం ఆ పలాయనమంత్రానికి అడ్దొస్తుంటుంది. లాభాపేక్ష లాలస అనునిత్యం  వెంటాడే బూర్జువా కళలు ప్రజాస్వామ్యంలో సామాన్యులనుంచి పుర్తిగా మొహం తిప్పుకోలేవు. అట్లాగని నిజాయితీగా నిజాన్ని చెప్పనూ లేవు. ప్రజల విచక్షణని తట్టిలేపే బదులు .. భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తాయి. అంటే నల్లమందులా జనం ఇంగితాన్ని  మగతలోకి నెట్టే ప్రయాస. కాబట్టే వివేకంతో పనిలేని శృంగారం, భావోద్వేగాలను సులభంగా రెచ్చగొట్టే హింసాత్మక సంఘటనలు చలన చిత్రాల్లో మనకు ఎక్కువగా దర్శనమిస్తుంటాయి! లేకపోతే ప్రజల  నిజమైన సమస్యలను పట్టించుకుంటూ వాటి పరిష్కార మార్గాల కోసం నిజాయితీగా వెతికుతూ తమ గొయ్యి తామే  తీసుకుంటాయా ఏక్కడైనా బూర్జువా స్వభావముండే చిత్రాలు? ఈ తరహా చిత్రాల పలాయనవాదానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. తమకున్న పరాధీనత అనే బలహీనత కారణంగా ప్రగతిశీల బూర్జువావర్గంతో కన్నా భూస్వామ్యవర్గాలతోనే రాజీపడేందుకు ఇష్ట పడతాయి.
ఆధిపత్య సంస్కృతిలో మరో సగభాగం భూస్వామ్య సంస్కృతి. ఇదీ పతనావస్థలోనే ఉంది. అయినా కాలం చెల్లిపోతున్న బూర్జువా సంస్కృతికీ దీనికీ ఒక విషయంలో తేడా కద్దు.  భూస్వామ్య సంస్కృతికి ప్రజాస్వామ్య సంస్కృతితో సంబంధ బాంధవ్యాలు గిట్టవు. కనక అది పూర్తిగా ముడుచుకుపోయి మృతప్రాయంగా ఉన్నట్లే లెక్క. బెరడుకట్టిన భూస్వామ్య సంస్కృతి అసభ్యకరమైన నయా వలస విధానానికి తోడైతే ఏమవుతుందో అదే ఇప్పడు కళారంగాలలో కనిపిస్తున్న వికార సంస్కృతి.
సినిమా కూడా సంస్కృతిలో ఒక భాగమే. కాబట్టి భారతీయ చలనచిత్రకళలో కూడా ఈ వికార  మిశ్రమత్వం తప్పదు. వ్యాపార దృష్టితో చూస్తే అది సినిమావాళ్లకు  అవసరమే కదా?
దేశ జనాభాలో అధిక శాతం ఫ్యూడల్ వ్యవస్థ దోపిడీకి గురయినవాళ్లుంటున్నారు. వాళ్లకి భూస్వామ్య సంస్కృతిని ఉన్నతంగా చూపించే చిత్రాలు నచ్చవు. అట్లాగని పూర్తిగా  హాలివుడ్ తరహా  కల్చర్ని హైలైట్  చేసి తీసినా జనాన్ని సంతృప్తి పరచడం కష్టం. వాళ్లు తమకు పరిచయమయిన నేటివిటీనే కోరుకుంటారు. ఆ మాస్ కల్చర్ కి తగ్గట్లు తీయడం ఉదారవాదికి గిట్టదు. అశ్లీషతకు పెద్దపీట వేయడం బ్రాహ్మణిజానికి నప్పదు. అయినా అలగా సినీప్రేక్షక జనాలని ఏదో విధంగా  సంతృప్తి పరచాలి కనక  అంతో ఇంతో అశ్లీలం చలన చిత్రాల్లో చొప్పించక తప్పదు. సినిమా కూడా వ్యాపారమే!  మనకూ లాభాలు రావాలి కదా’  అని తమను తాము సమాధాన పరుచుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఆ స్పృహలోనుంచి బయటకు వచ్చే అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటి విచిత్రమే ‘శంకరాభరణం’ చిత్రం- ఇలా సాగుతుంది  బాలగోపాల్ విశ్లేషణ.  
అతను శంకరాభరణం కథను క్లుప్తంగా చెప్పిన తీరూ ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
కథానాయకుడు ఒక బ్రాహ్మణుడు. అతగాడికి సంగీతం పిచ్చి. అదీ ప్రాచ్య తరహా సంగీతమంటేనే. పాశ్చాత్య సంగీతం మీద సదభిప్రాయం లేదు. సరి కదా పిచ్చికూతలు అని తగని ఆగ్రహం. కానీ ఉదారభావాలు కలవాడా శాస్త్రిగారు.. సంగీతం మీద తనకు లాగానే పిచ్చి ఉన్న ఒక వేశ్యను చేరదీస్తాడు. ఆ అకార్యానికి శిక్షగా  కులబహిష్కరణ జరిగినా పట్టించుకోడు. వెలేసిన సంఘాన్ని ఏమనడు కానీ ఆ కోపం అంతా పాపం  దేవుడు మీద చూపిస్తాడు. తన సంగీతం రవంధాళితో ఉరుములు మెరుపులు పుట్టిస్తాడు. ఏం ప్రయోజనం ఆశించాడో ఆయనకే తెలియాలి! కూతురికి పెళ్లిచూపులప్పుడు కూడా అదే తంతు. పాడే పాటలో అపశృతి  దొర్లినందుకు పదిమంది ముందు పాపం బిడ్డ మీద  విరుచుకుపడతాడు. కాబోయే అల్లుడికి సంగీత జ్ఞానం లేనందుకు బిక్కచచ్చేట్లు కూకలేస్తాడు కూడా. సినిమా అంతా ఒకటే సంగీత ఘోష.  కళలు ఉన్నది కామోద్రేకం కలిగించడానికి కాదు.. ఆవటా అని. ఆ సందేశం అలగా జనానికి ఉద్దేశించింది. విచిత్రం ఏమిటంటే ఎవరిని ఉద్దేశించి ఆ చిత్రం నిర్మాణమయిందో వాళ్లకా చిత్రం బొత్తిగా అర్థం కాదు. ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది  శంకర శాస్త్రిని తిట్టి పోసి.. వెలేసిన  బ్రాహ్మణ సంస్కతి వర్గమే! అదీ తమాషా!
నాటి నయా వలసవాద సాంస్కృతిక బానిసత్వానికి 'శంకరాభరణం' లాంటి చిత్రాలను ప్రత్యామ్నాయంగా కోరుకోవడం హైదరాబాద్ వామపక్ష విధ్యార్థుల అమాయకత్వం. వాళ్ల వంటి ఆశావాదుల కోరికను తీర్చే  చిత్రం ఆ ఏడే  విడుదలై   ఘనవిజయం కూడా సాధించింది. ఆ ఘనత సాధించిన సినిమా గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో తయారైన 'మా భూమి'. 1930 - 1948 ప్రాంతంలో హైదరాబాదు నిజాముకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన సినిమా ఇది. కిషన్ చందర్ నవల ‘జబ్ ఖేత్ జాగే’  ఈ చిత్రానికి ఆధారం. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం-1980లో ప్రదర్శితమైంది. కార్వే వారీ చలనచిత్రోత్సవంలో, కైరో  సిడ్నీ చలనచిత్రోత్సవాల్లో భారతదేశపు అధికారిక ఎంట్రీ హోదా సాధించుకుంది. సిఎన్ఎన్-ఐబీఎన్ వారి 100 గొప్ప భారతీయ చలనచిత్రాల జాబితాలో  చోటుచేసుకుంది.
1940 దశకంలో సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ తిరుగుబాటు ఈ చిత్రం ఇతివృత్తం. సినీ సాంకేతిక నిష్ణాతుల ప్రకారం చిత్రం ఆరంభంలో కొంత తడబాటు కనబడుతుంది. ముఖ్య పాత్రధారుల నోట  గ్రామీణ తెలంగాణా యాస అంత సహజంగా  పలకలేదు. లంబాడా పాత్ర వేసిన అమ్మాయి పలికిన భాష ఏ లంబాడా జాతుల్లోనూ వినిపించేది కాదన్నారు బాలగోపాల్. కానీ ఈ ప్రాథమిక లోపాల పొరలు దాటుకుని మరికొంత   లోతుల్లోకి పోయి చూస్తే మెచ్చుకోదగ్గ అంశాలు ‘మా భూమి’లో చాలానే కనిపిస్తాయి.
కథ క్లుప్తంగాః 50 వేల ఎకరాల  భూ ఆసామీ దగ్గరి జీతగాడి కొడుకు రామయ్య, చిన్నప్పటి బట్టి తిరగబడే తత్వం ఆ బుడతడిది. పల్లెలోని దౌర్జన్యం తట్టుకోలేక పట్నం చేరి ఓ కర్మాగారంలో పనికి కుదురుకుంటాడు. కార్మికసంఘ నేతతో పరిచయం పెరుగుతుంది. రామయ్యతో పాటే సినిమా ప్రేక్షకులకూ అదనపు విలువ, అక్టోబరు విప్లవం లాంటి కొత్త విప్లవ విశేషాలు ఎరికలోకి వస్తాయి. పట్నం వదిలి గ్రామం తిరిగెళ్లిన రామయ్య అక్కడ జరిగే  తిరుగుబాటులో  కీలకపాత్ర వహిస్తాడు. అప్పటికే బలహీన పడ్డ నిజాం సైన్యం మీద విజయం సాధించినా.. భారత సైన్యం చేతిలో సర్కారు 'శాంతి భద్రతల పునరుద్ధరణ' పర్వంలో రామయ్య ప్రాణాలు విడవడం ప్రేక్షకుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తాయ్!
అన్నదాత కర్మాగారపు పనివాడుగా పరివర్తన చెందడం, శ్రామిక చైతన్యం అందిపుచ్చుకోవడంలో గ్రామీణుడు చూపించిన చొరవ, ప్రజాస్వామ్య పంథాలోనే తిరుగుబాటు బావుటా ఎగరేయాలనే సంకల్పం, ఆ క్రమంలో ఆదివాసులను సైతం కూడగలుపుకొని ఐక్య పోరాటాలు చేయవలసిన అగత్యాన్ని గుర్తించడం, జాతీయ బూర్జువాగా గుర్తింపబడ్డ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థతో రాజీపడే తీరు గ్రామీణ ప్రేక్షకులక్కూడా అర్థమయే తీరులో చిత్రీకరించారు ఈ చిత్రంలో. షేర్వాణీలో పట్నం తారుకున్న దొర పల్లెకు తిరిగొచ్చే వేళకి  నెత్తికి గాంధీ టోపీ తగిలిస్తాడు. ఇలాంటి చక్కటి ప్రతీకలతో నిండి ఉండటంతో చెప్పదలుచుకున్న విషయాలు సులభంగా సామాన్య జనానికి చేరాయి. నిజాముతో అందరితో కలసి పోరాడిన రైతాంగంలోని సంపన్న వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రం  జమీందారీ వర్గం ఆధిపత్యాన్ని అంగీకరిస్తాయి. పోరాటం నాటి, ముందు, వెనుకల పరిస్థితులన్నింటినీ వాస్తవికంగా చిత్రీకరించడంలో 'మా భూమి' సఫలమైంది. చేరవలసిన ప్రేక్షక సమూహాలకు చేర్చవలసిన సందేశం చేర్చడంలో చిత్రం విజయంతమైంది. కనకనే 'మా భూమి' విజయం 'శంకరాభరణం' విజయం కన్నా విశిష్టమైనది. వాస్తవమైనది. ప్రగతిశీలమైనది- అంటారు బాలగోపాల్.
'కళ కర్తవ్యం ఏమిటి' అన్న ప్రశ్నకు  శంకరాభరణం'విజయం కన్నా మిన్నగా 'మా భూమి' విజయం సమాధానం ఇచ్చినట్లయింది. గత విజయాలను, వైఫల్యాలను గుర్తు చేయడం, గడచిన సామాజిక ఉద్యమాలను  విశ్లేషించడం, తద్వారా ప్రజాస్వామిక విప్లవ స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్లడం కళ కర్తవ్యం. అలా అని నమ్మే వాళ్లంతా  'మా భూమి'  చిత్ర విజయాన్నే మనసారా ఆస్వాదించారు. సాయుధ పోరాటం తాలూకు  చేదు, తీపి ఫలాలు రెండింటినీ చవి చూసిన తెలంగాణా గడ్డ మీదే 'మా భూమి' ఘన విజయం సాధించడం అదో గొప్ప విశేషం. లెనిన్ ని చదువుకున్న  మేధావి వర్గమే కాకుండా సాయుధ పోరాట స్ఫూర్తి ఇంకా తమ  రక్తంలో రగిలే  మధ్యతరగతి, శ్రామిక వర్గాలూ ఎగబడి చూస్తూ 'మా భూమి'ని విజయవంతం చేయడం మహదానందమైన విశేషంగా బాలగోపాల్ చేసిన విశ్లేషణ సమంజసమైనది.
-కర్లపాలెం హనుమంతరావు
సాహిత్యం పై బాలగోపాల్’ పుస్తకంలో సినిమా సమీక్ష విభాగం కింద  ‘శంకరాభరణం, మా భూమి’ వ్యాసం ఆధారంగా చేసిన రచన (పుటలు..237 - 241)

***

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...