Friday, September 11, 2020

పుష్ప వివాదము - శ్రీ యామిజాల పద్మనాభస్వామి 'పుష్ప విలాసము' నుంచి సేకరించినది.

 












(కవులూ పువ్వులూ సమాన ధర్మము కలవారు. పరిసరాలను తమ తత్త్వముతో సుగంధభరితము చేయటమే కర్తవ్యం.  యథాశక్తి  ప్రాకృతిక దీక్షతో సామాజిక సేవాబద్ధులై పదుగురితో  'శభాష్' అనిపించు కొనవలె కాని..తమలోతాము తమ తమ ఆధిక్యతను గూర్చి వృథావాదనలకు దిగి  పలుచనగుట తగదు!

కవులతోనే లోకములు తెలవారుట లేదు. ప్రొద్దు గుంకుట లేదు. ప్రాపంచిక సుఖదుఃఖములను పానపాత్రలో కవుల పాత్ర కేవలము రుచి పెంచు మధుర ఫల రసము వంటిది మాత్రమే!  

 

 

ఇట్టి ఊహలు నాలో ప్రబలముగా  ఉన్న  వేళ   నాకు యాదృచ్ఛికముగా    యామిజాల పద్మనాభస్వామిగారి - 'పుష్ప్ప విలాసము', 1953 నాటి ఉగాది భారతి సంచికలో ప్రచురితమైన కవిత కంటబడినది. నాడూ ఈనాడు వలెనె కవులు వర్గముల   మధ్య ఒక స్పర్థ వాతావరణేమేదో ఉండి ఉండవలె. అందుచేతనే ఆనాటి కోకిల స్వరములోని మందలింపుల ఒక పరి ఆలకింపవలెనన్న లక్ష్యముతో  నేటి యువకవివర్యుల  సమక్షమునకు ఈ చక్కని కవితాఖండికను తెచ్చుటకు  అయినది. హితవైన పలుకులకు పాత-కొత్తల తారతమ్యములెందుకు?!

 

"పుష్ప వివాదము"

 

అదొక పూలతోట. పలురకాల పూల జాతులు నవయవ్వనముతో మిసమిస లాడుతున్నవి. ఒక్కొక్క తీగనె పరిశీలన చేసుకుంటో పోయి నేను ఒక తిన్నెపై కూర్చున్నాను. అంతలో మలయమారుత కుమారుని చక్కిలిగింతలతో చెలరేగింది పుప్పొడి దుమారం. చివాలున లేచింది మల్లె. వాదు మొదలైనది.

 

మల్లె

ఏమే! గులాబీ! నిన్న కాక మొన్న వచ్చి నువ్వు తోటివారినందర్నీ ఆక్షేపిస్తున్నావట? ఎందుకా మిడిసిపాటు?

 

తావుల్ జల్లుదువా సుదూరముగ? పంతాలాట సైరింతువా?

ఠీవిన్ నిల్తువ రెప్పపాటయిన? చూడ్కిన్ సైతువా గట్టిగా?

క్రేవన్ బాలసమీరుండు నిలువన్ ప్రేమించి లాలింతువా?

పోవే; నెత్తురు కోతలే కదనె నీ పుట్టింటి సౌభాగ్యముల్.

 

గులాబి మాటపడుతుందా!

సరే వారన్న మాటలు వినవు చూడు!

వలపులు గ్రుమ్మరించి సుమభామల చిక్కని కౌగలింతలం-

దలరెడు తేటిరాజునకు హాయిగ స్వాగతగీతి పాడునా?

వెలువము కర్కశంబు కద; చెల్మి యెరుంగను పాపజాతితో;

తల విలువన్ గణింపవలదా? మరి సంపంగి కన్నె; మల్లికా!

 అంటూ తన వత్తాసుకై మరో ప్రియపుష్ప సేహహస్తాన్ని అందుకున్నది.

 

కేతన

అదలా వుండనీ కానీ అక్కామల్లికా!

ఈ మందార మల్లిక నన్నేమని నిందించిందో విన్నావా?

అంటూ సందు చూసుకుని మరో కేతన తగువు మధ్యకు వచ్చి దూరింది.

 

నీకే చెల్లెనె కేతకీ; కనులలో నిండార దుమ్మోయగా;

తాకిన్ నెత్తురు చింద వ్రేళ్ళు కొరుకన్; సర్పంబుగా నిల్వగా;

ఆ కంఠంబుగ పాపజాతికి శరణ్యంబై మహారణ్య మం

దేశాంతంబుగ రాణివై మెలగ; ఏరీ సాటి నీకిలన్.

అంటూ మందరా మల్లిక ఎత్తిపోసిన తిట్లన్నిటినీ తిరిగి  గుర్తుకు తెచ్చుకుంది.

 

చేమంతిః మూతి మూడు వంకలు తిప్పి అంది

ఓహో! దాని అందానికి అది మురిసిపోవాలిః

పరువంబా! ఎదలోన మెత్తదనమా?భావోల్బణ ప్రక్రియన్ 

గరువంబా!మకరంద గంధ విలసత్ కళ్యాణ సౌందర్యమా?

బిరుసై నిప్పులముద్దమోము కద; యీ పేలాపనంబేల? సం

బరమా? వచ్చిన దాని నోర్చుకొనునా పైపెచ్చు మందారమా?

అనేసింది.

మందార వదనం మరింత ఎర్రబారింది రోషకషాయిత గళముతో

'ఔనౌను నీ శౌభాగ్యనికి నన్నాక్షేపిచ వద్దూ?'

పంతములాడబోకె పయివారలు విన్నను నవ్వుకొందురె;

ఇంతులు దండలల్లకొని యెంతయు ముచ్చటతో ధరింతురం

చెంతువు నీ విలాసము 'లిహీ' యగు మాలతికన్నె ముందు చే

మంతిరొ! ఊక రేకుల సుమంబను పేరది  నీది కాదటే;

అని తగులుకుంది.

(అంతలో చేరువలో నున్న సరోజిని ఫక్కున నవ్వి)

దానికెమిలే! మాలతిలో గర్వమున్నది.

అది రేరాణినటంచు త్రుళ్ళి పడునమ్మా! దాని లేనవ్వులో

పదముల్ పాడునటమ్మ! తుమ్మెదలు; శుబ్రజ్యోత్స్నపైపూతతో

పెదవుల్ నొక్కునటమ్మ! చందురుడు, నన్వీక్షించి బల్ టెక్కుతో

ఎదో అలాపము సేయు మాలతిని నేనిన్నాళ్ళు సైరింతునే?

అని రెచ్చగొట్టేసింది మరంత అనంద ప్రదర్శనయో సన్నివేశం రక్తి కట్టిస్తో!

 

మాలతి ముక్కు ఎగబీల్చి

సైరింపక యేమి సేయగలవే? నీ వాడిన మాటలో?

బంగరు కొండపై పసిమి వెన్నెల చిన్నెల బాలభామ రే

ఖంగనవో యటంచును  ఎగాదిగ చూచెద నన్ను; నీవు రే

లం గమనీయ హాస సువిలాస వికాసములొప్పువాని చం

ద్రుంగని మూతి మూసుకొని క్రుంగవొ? నీ బ్రతు కే రెఱుంగరో?

                      *              *                *    

చతురత మీర నిట్టి సరసా లిక చాలును కట్టిపెట్టు నీ

బ్రతుకు భవిశ్యమున్ కడిగివైచెద; నాచున బుట్టి, పీతలన్

కుతకన్ దాల్చి, నీదు కనుగొల్కుల చిమ్ముదు; నీటి పుర్వువై

అతుకులబొంతవై; కసబువాతెర విప్పకుమా సరోజినీ!

అంటూ ఏకంగా మొదటి పుష్పం మందారం మళ్లీ మాటలు అందుకోవడం౿

 

ఇల్లా ఒకరినొకరు ఆక్షేపిచుకుంటూ ఉండగా శ్రుతి మించిందని

కోకిలమ్మ

భళిరా! పువ్వ్వుల కన్నెలార మన సంబంధంబుతో లోకముల్

తెలవారున్, క్షయి సేయు, నవ్వుకొను, ప్రీతిం జెందు; మీ లోన మీ

రలయింపన్ తగవా? యటంచు పగలన్ న్యాయంబుగా తీర్చు రే

ఖిల పో పొండన గూసె 'కో' యని కుగూకారమ్బు తోరంబుగన్.

అంటూ మందలింపులకు దిగిపోయింది!

 

పూలు తమ తొందరపాటుకు సిగ్గ్గుతో తలలు వంచుకున్నవి. ఒకింత సేపు గడవనిచ్చి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నవి. తిరిగి పువ్వుల తోట నవ్వుల తోటలా మారిపోయింది.

పువ్వులకన్నా  ఘనులమని కదా మనం మన కవులను  మహా గారవించెదము. ఆ అభిమానమును  నిలుపుకొనవలెను గాని.. దురభిమానము పూనగా పూతన బంధువర్గమును మించి ఈ పరస్పర యుద్ధములేమిటికోయి కవిమిత్రులారా! మరువము దండను బోలు సుగంధ పరిమళములు జల్లు మానవతా మాలికలకు చుట్టుకొను పూవులుగా అలరించుడు! చాలించుడిక ఈ ఈశు బుట్టు విసువు మాటల  రాళ్ల బుట్ట బుగ్గిలో బోర్లించుడు!

***

సేకరణః 

కర్లపాలెం హనుమంతరావు

11 -09 -2020

బాలికల కనీస వివాహ వయస్సు ఏ మేరకు ఉండాలి? -కర్లపాలెం హనుమంతరావు - సూర్య దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం

 


 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ తన 86 నిమిషాల సుదీర్ఘ  ప్రసంగంలో భద్రత, సార్వభౌమత్వాల పైన మాత్రమే కాకుండా  దేశానికి తక్షణమే అవసరమని ప్రభుత్వం భావించే ప్రధాన ఆర్థిక, సామాజిక సంస్కరణలను కూడా ప్రస్తావించారు. సామాజిక రంగ సంస్కరణలలో భాగంగా  బాలికల వివాహ కనీస వయస్సుపై  ప్రభుత్వానికి గల పునరాలోచననూ ఆ సందర్భంలో దేశం ముందుంచారు. ఇదే ఏడాది ఆర్థిక సంవత్సర బడ్జెట్ సమర్పిణ సమయంలో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ బాలికల వివాహ కనీస వయస్సు విషయమై ఒక ప్రతిపాదన చేశారు. నాటి సభలో ఆమె చేసిన ప్రసంగం ప్రకారం తల్లీబిడ్డల ఆరోగ్యం,  వారి పోషణల వంటి ప్రధానాంశాల పైన వివాహ వయస్సు చూపించే ప్రభావాల అధ్యయనం, ఆరు నెలల్లోగా  సిఫార్సుల రూపంలో ప్రభుత్వానికి పత్ర సమర్పణ సమర్పించవలసి బాధ్యత అప్పగిస్తూ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటును గురించినదా ప్రతిపాదన. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ వంటి మేధావులతో సహా  పలు శాఖల ఉన్నతాధికారులు  కార్యాచరణ సభ్యులుగా సమతాపార్టీ మాజీ చైర్మన్ జయా జైట్లీ నేతృత్వంలో   కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ జూన్ 2న టాస్క్ ఫోర్స్  ఏర్పాటు చేయడంతో కేంద్ర మంత్రి  చేసింది ఉత్తుత్తి రాజకీయ ప్రకటన కాదని  అర్థమయింది.

 

దేశం ప్రగతిపథంలోనే సాగుతోందని, ఉన్నత విద్యతో సహా మహిళలకు ఉద్యోగ, ఉపాధి రంగాలలో మెరుగైన అవకాశాలు నిలకడగా పెరుగుతున్నాయన్న మంత్రిగారి ప్రసంగంలోని  పరిశీలన  అవాస్తమనేందుకు లేదు. మాతాశిశు మరణాలను మరింత తగ్గించడంతో సహా  వారి పోషకాహార స్థాయిలలో గణనీయమైన  మెరుగుదల సాధించడం స్త్రీ శిశు సంరక్షణ సంస్కరణలకు సంబంధించి   ప్రధానమైన అంశం. ఏ వయసులో ఆడపిల్ల ప్రసూతి దశలోకి ప్రవేశిస్తే తల్లీ బిడ్డలిద్దరికీ క్షేమమో ముందు లోతుగా అధ్యయనం చేయాలి.  టాస్క్ ఫోర్స్  ఏర్పాటు ప్రతిపాదనలోని అంతరార్థం కూడా అదే!

ఆడపిల్లల వివాహానికి సంబంధించిన కనీస వయస్సు  ఎంతో కాలంగా ప్రభుత్వాల ఆలోచనల్లో నలుగుతున్న మాట నిజమే! మాతా శిశువుల ఆరోగ్యానికి సంబంధించి పెళ్లి వయస్సు ఒక ప్రధానమైన అంశం అన్నది న్యాయ మంత్రిత్వశాఖ  అభిప్రాయం. కౌమార దశ పరిపక్వ స్థితికి చేరక ముందే వివాహబంధంలో ఇరుక్కున్న ఆడపిల్లలకు అవాంఛిత గర్భధారణ బాధ ఒక్కటే కాదు, లైంగిక వ్యాధుల పీడ అంతకు మించి ప్రాణాంతకంగా మారుతున్నదని వైద్యనిపుణుల ఆందోళన చెందుతున్నారు. వివాహ వయస్సుకు  మాతృత్వానికి మధ్యన ఉండే  సంబంధం  పరిశీలించడం, తల్లీ బిడ్డల మరణాల రేటు గణనీయంగా తగ్గించడం, మహిళలలోని పోషకాహారస్థాయిని గురించి కచ్చితమైన అంచనాకు రావడం.. టాస్క్ ఫోర్స్ కు విధించిన లక్ష్యాలలో కొన్ని!  గర్భధారణ వయస్సు, ప్రసవించే సమయం,  తదనంతరం తల్లి, నవజాత శిశువుల పోషణ స్థాయి.. తదితర ముఖ్యమైన అంశాలలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారానికై మార్గాలను సుగమంచేసే తీరుతెన్నులు సూచించడమూ టాస్క్ ఫోర్స్ కు నిర్దేశించిన లక్ష్యాలే.  మాతాశిశువుల మరణాల తగ్గుదల, మొత్తంగా దేశాభివృద్ధిని ప్రభావితం చేసే సంతానోత్పత్తి రేటు, లింగ నిష్పత్తి వంటి  పరామితులను  పరిగణనలోకి తీసుకొని వయస్సులో పెళ్ళి జరిపిస్తే అటు బాలికలకు, ఇటు సమాజానికి కూడా క్షేమకరమో ఒక విస్పష్టమైన నిర్ధారణకు రావడం  టాస్క్ ఫోర్స్ అంతిమ  లక్ష్యంగా నిర్దేశించబడింది.  మగపిల్లల ప్రస్తుత వివాహ కనీస వయస్సు  21 ఏళ్లు. దానికి  సరిసమానంగా ఆడపిల్లల పెళ్లి వయస్సూ పెంచడం ద్వారా భావితరాలకు బలమైన పునాదులు వేయడం సాధ్యమవుతుందని టాస్క్ ఫోర్స్ చివరకు  నివేదిక ఖరారు చేసింది. ఆ నివేదికే ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉన్నది.   కేంద్రం  టాస్క్ ఫోర్స్ సిఫార్సుల మేరకు మగపిల్లలతో సరిసమానంగా ఆడపిల్లల వివాహ కనీస వయస్సును 21 ఏళ్ళకు పెంచడమే సబబన్న నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం అందుతున్నది.

 భారతదేశంలో, వివాహానికి కనీస వయస్సును  చట్టబద్ధం            చెయ్యాలన్న ఆలోచన మొట్టమొదట 1880 లో ప్రారంభమయింది. శారదాచట్టం ద్వారా  బాల్య వివాహాల నిషేధం 1929 నాటికి న్యాయవ్యవస్థ చట్రానికి చిక్కింది. ఆనాటి శాసనం ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సు 16 సంవత్సరాలు; బాలులకయితే 18. 1978లో బాలికలకు మరో రెండు, బాలులకు మూడేళ్లు పెంచుతూ చట్టం సవరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం అదే.  కనీస వివాహ వయస్సును పెంచేందుకు వీలుగా అప్పట్లో శారదాచట్టాన్ని సవరించిన   తీరులోనే ఇప్పుడూ మరో  సవరణ రూపంలో  స్త్రీ శిశు సంక్షేమ రంగాలలో  కొత్త మార్పుకు చట్టబద్ధత తెచ్చి నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టాలన్నది ప్రభుత్వ సంకల్పం.

మహిళలకు  మగవారితో సరిసమానంగా హక్కులు కల్పించడాన్ని రాజ్యాంగం కూడా గట్టిగా సమర్థిస్తున్నది. అబ్బాయిలకు మల్లేనే అమ్మాయిలూ 18వ ఏట  నుంచి  ఓటు హక్కు, డ్రైవింగ్ లైసెన్స్, స్వంతంగా కంపెనీ ప్రారంభించుకునే అధికారాలు కలిగివున్నప్పుడు ఒక్క వివాహ విషయంలోనే   వివక్ష ఎందుకు? అన్న తర్కం వైజ్ఞానిక స్పృహ పెరుగుతోన్న ఈ కాలంలో సమాజాన్ని తరచూ నిలదీస్తున్న మాట నిజం. ఆడవారి పట్ల అట్లా చిన్నచూపు చూడాలని రాజ్యాంగంలో కూడా ఎక్కడా ప్రత్యేకంగా రాసిపెట్టి లేదనేదే న్యాయనిపుణులు చెబుతున్నారు. చట్టం ఆచారాలు, మత సంప్రదాయాల క్రోడీకరణగా చూడాలని వాదించే ఛాందసులు  నుంచి మాత్రమే స్త్రీల వివాహ వయస్సు పెంపుపై కొంత నసనసలు వినవస్తున్నాయి.  భార్య  భర్త కంటే వయసులో పిన్నదై ఉండాలని ప్రాచీన సంప్రదాయం స్మృతులు ప్రమాణాలుగా  చూపిస్తున్నాయన్నది వారి  వాదన. ఇటీవల ఒక లా కమిషన్ పత్రిక  కూడా అదే అంశం స్పష్టంగా పేర్కొనడం విశేషమే, కానీ అది ఒకానొక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని యధాలాపంగా   చేసిన వ్యాఖ్య మాత్రమే!

 పురాతన కాలం నుంచి ప్రపంచమంతటా వధూవరుల యుక్తవయస్సుల్లో  అంతరం కొట్టొచ్చినట్లు కనిపించడం గమనించదగ్గ విశేషం. కానీ  నాటి సామాజిక పరిస్థితులకు నేటి సామాజిక పరిస్థితులకు మధ్య హస్తిమశకాంతరం భేదం కద్దు.     లాలా లజ్ పతిరాయ్ రచించిన 'ఏ హిస్టరీ ఆఫ్ ది ఆర్య సమాజ్ ' గ్రంథంలోనూ వధూవరుల వివాహ కనీస వయస్సు 16.. 25 సంవత్సరాలుగా నిర్దేశించబడింది.  ఈ తేడా లైంగిక కోణంలో వారి వారి శారీరక నిర్మాణాల ఆధారంగా సాగిన హిందువుల ఆలోచనగా మాత్రమే భావించాలి. పురుషులతో సమానంగా ఆయుష్షు ఉన్నప్పటికీ వారి కంటే స్త్రీల శరీర నిర్మాణం మరింత పరిణతి చెందివుంటుందని మహిళా హక్కు సంఘాల ప్రగాఢ విశ్వాసం.  స్త్రీలు సాధ్యమైనంత తొందరగా పవిత్రమైన  వివాహబంధంలోకి  ప్రవేశించడాన్ని  అందుకే  ఆ హక్కుల సంఘాలు ఆట్టే తప్పుపట్టే ఆలోచన చేయనిది. కానీ, మాతా శిశువుల సంక్షేమం, సంరక్షణల విషయమై వారి ఆందోళనలో ఏ మాత్రం రాజీ లేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా స్త్రీ, పురుషుల వివాహ కనీస వయస్సు సరిసమానంగా ఉండవలసిన అవసరాన్ని ప్రశిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే జాతులు, మతాలన్నింటిలోనూ  మహిళలకు, పురుషులకు మధ్య  కనీసంగా చెల్లుబాటు అయ్యే వివాహ వయస్సు 18 సంవత్సరాలు నుంచి ప్రారంభమవుతున్న పరిస్థితి.  2018 నాటి  మన ఫ్యామిలీ యాక్ట్ (కుటుంబ చట్టం)పై సాగిన సంప్రదింపుల పత్రంలోనూ ‘లా కమిషన్’.. భార్యాభర్తల మధ్య వయసు తేడాకు  సంబంధించి ఎట్లాంటి చట్టపరమైన ప్రాతిపదికా లేద’ని విస్పష్టంగా చెప్పింది.

ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములుగా మారటం అంటేనే, ఆ  భాగస్వామ్యాలు సమాన హోదా కలిగివుండటం! రెండు భాగాలకు  సమాన స్థాయిలో గుర్తింపు లభించినప్పుడే  ఆ వివాహం అర్థవంతమైన సంసారానికి దారితీసేది!  స్త్రీల పట్ల అన్ని రకాల వివక్షలను నిర్మూలించాలనే హక్కు సదస్సులు  కూడా బాలికల వివాహ కనీస వయస్సు పెంపు పట్ల ఎక్కడా పెద్దగా పట్టింపు పెట్టుకున్నట్లుగా కనిపించదు. అంతమాత్రం చేత మహిళల శారీరక, మేధో వృద్ధి రేటు పురుషులను బట్టి మారుతుందని భావించే చట్టాల రద్దు పట్ల వాటికి   పట్టుదల  లేదని కాదు అర్థం.

 

ప్రపంచంలో  140 దేశాలలో  మహిళలతో సహా  పురుషులకూ  వివాహ కనీస వయస్సు 18 సంవత్సరాలు. మన దేశంలోనూ  లా కమిషన్  మహిళకు వివాహం చేసుకునే కనీస వయస్సు 18 సంవత్సరాలుగానే  సిఫార్సు చేసివుంది గతంలో. ప్రభుత్వమూ ఆ తరహా  ఆలోచనే చేస్తున్నప్పటికీ, ఆచరణ దగ్గరే తటపటాయింపు ధోరణి తప్పడంలేదు.  ప్రస్తుతమున్న వాస్తవ గడ్డు పరిస్థితులే అందుకు ప్రధాన కారణం. అత్యంత వేగంగా పెరిగే ‘దేశజనాభా’ చింత  ప్రధాని మునుపటి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రతిఫలించడం గమనించాలి.  వివాహ వయస్సును గురించి ప్రభుత్వ పునరాలోచన కూడా.. వాస్తవంగా చెప్పాలంటే.. అంతూపొంతూ లేకుండా పెరుగుతోన్న దేశ జనాభాను కట్టడి చెయ్యాలన్న బాధ్యతాయుత భావన నుంచి పుట్టుకొచ్చినదే!

తొలి చూలు సందర్భం  మాతాశిశువుల  ఆరోగ్య పోషణల పైన అత్యధిక ప్రభావం చూపిస్తుందని వైద్యశాస్త్రం నిర్ధారిస్తోంది.  మాతా శిశు ప్రసూతి మరణాల రేటులో పెరుగుదలకు కారణం బాలికలు కౌమార దశలోనే తల్లులుగా మారడమని నివేదికలు మొత్తుకుంటున్నాయి.  ఒక  తాజా ‘నమూనా రిజిస్ట్రేషన్ విధానం’ ప్రకారం నేడు దేశంలో ప్రసూతి మరణాల రేటు లక్షకు 122. బాగా  తగ్గాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4 (2015-16) గణాంకాలు కితాబిచ్చుకున్నప్పటికీ..  ‘బాల్యవివాహాల సమస్య’  దేశాన్నిప్పటికీ తీవ్రంగా సలుపుతోనే ఉంది.   భారతదేశంలో 18 ఏళ్ల లోపు  సుమారు ఒకటిన్నర లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు జరిగిపోతు న్నట్లు యునిసెఫ్ అంచనా వేసింది. ప్రపంచంలో మూడోవంతు బాలికలతో కొలకొలలాడే మన దేశం బాల్యవివాహాలలో మాత్రం  మొదటి స్థానంలో ఉండడం  ఆందోళనకరమే కదా! అదీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సులోనే  వందలో 16 మంది బాలికలు వివాహితలుగా మారుతున్న నేపథ్యంలో! జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత అమర్త్య సేన్ ఆవేదన  చెందినట్లు-   పేదరికం, విద్యా స్థాయిలతో ముడిపడి ఉండటమే బాల్యవివాహాల చిక్కుముడికి ముఖ్య కారణం. కోవిడ్-19 మహమ్మారి పురులు విప్పిన తాజా నేపథ్యంలో పెరుగుతున్న బాల్యవివాహాలే అందుకు తిరుగులేని ఉదాహరణ.

 

బడులు మూతబడి ఆన్ లైన్  చదువుల సదుపాయం లేని మైనర్ బాలికల మీద పెళ్లిళ్ల కోసమై తల్లిదండ్రులు వత్తిడి పెంచుతున్నట్లు వార్తలొస్తున్నాయి.  చైల్డ్ హెల్ప్ లైన్ ద్వారా సమాచారం అందుకున్న బాలల హక్కు సంఘాలు జోక్యం చేసుకున్న బాల్యవివాహ  సంఘటనలు ఈ ఆగష్టు చివరి నాటికి సుమారు 5,584. దేశవ్యాప్తంగా పాఠశాలలు మూతబడి, పేదరికం జడలు విదిల్చిన తరుణంలో   మహమ్మారి పుణ్యమా అని పెళ్లిళ్లు సాధారణ దినాలలో కన్నా చవకలో అవగొట్టేయచ్చన్న కన్నవారి కాపీనమే బాల్య వివాహాల పెరుగుదలకు ప్రధాన కారణం.

విద్యకు వివాహానికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. 18 ఏళ్ల లోపు వివాహితలలో దాదాపు సగం శాతం (44.7) బొత్తిగా పలక పట్టడమే రాని నిరక్షర కుక్షులని  గణాంకాలు లెక్కలు తేల్చాయి. ‘బేటీ బచావో బేటీ పఢావో’ లక్ష్యం  ఎంత ముఖ్యమో ‘బేటీ పఢావో.. బేటీ బచావో’ కూడా అంతే ప్రధానమైన స్త్రీ  సంస్కరణ.  బాలికల వివాహ కనీస వయస్సు మరంత పెంచడం ద్వారా మాతా శిశు సంక్షేమం  ఎంత వరకు సాధ్యమో నిర్ధరించలేని అంశం.  బాలికల 'చదువు సంధ్యల’ పై  మరింత ధ్యాస పెట్టవలసిన అగత్యానికి ప్రభుత్వాలు ముందు గుర్తించాల్సుంది.  బాలికా విద్య, మహిళా సాధికారతల ద్వారా సానుకూలపడే వాతావరణంలో పేదరికపు వత్తిళ్లు తగ్గితే, బాల్యవివాహాల బాదరబందీ దానంతటదే క్రమేపీ తగ్గుముఖం పడుతుందన్న సామాజిక శాస్త్రవేత్తల వాదనలో వాస్తవముంది. 

ఒకే తరగతి చదివే ‘అమ్మాయి-అబ్బాయి’ల మధ్య ఆమోదయోగ్యంగా మారిన  సమానత్వ సూత్రం వివాహ వయస్సుకూ వర్తింపచేయాలన్న ఆలోచనకే ఆఖరుకు  ప్రభుత్వం మొగ్గుచూపిస్తున్నట్లనిపిస్తుంది.   బాల్య వివాహాలు, మైనర్ బాలికల పైన పెరుగుతున్న  లైంగిక వేధింపుల వంటి అంశాలలో ఇప్పుడున్న  చట్టాలను గట్టిగా అమలు చేసినా చాలు.. గణనీయమైన సానుకూల దృక్పథం సమాజంలో ప్రోదిగొల్పవచ్చన్నది సామాజిక శాస్త్రవేత్తల ఆలోచన. బాలికల వివాహ కనీస వయస్సు అంతకంతకూ  పెంచుతో చట్టసవరణలు చేసినా.. చట్టాన్ని పట్టించుకోని మొరటు సమాజం ముందు అవన్నీ కోరల్లేని పాము బుసలే! ప్రభుత్వాలు ముందు దృష్టి మళ్లింఛవలసింది.. పరిధిని దాటే ముందు  సమాజం ఒకటికి రెండు సార్లు  జంకేలా ఏ విధమైన  కఠినాతి కఠిన చర్యలు సత్వరమే తీసుకోవాలా అని.  పర్యవేక్షణ యంత్రాంగాలు పరాకులు కట్టిబెట్టి కరాఖండీ  కార్యాచరణకు మనస్ఫూర్తిగా పూనుకుంటే తప్ప, ప్రభుత్వాలు ఎంతో  మధన పడి మరీ చట్ట పరధిలోకి తెచ్చే బాలికల వివాహ కనీస వయస్సు వంటి  సంక్షేమ సంస్కరణలు సత్ఫలితాలను ఇచ్చేది.

-కర్లపాలెం హనుమంతరావు

***

(సూర్య దినపత్రిక ఆదివారం దినపత్రిక సంపాదకీయ పుట వ్యాసం)



Wednesday, September 9, 2020

చిన్న కథ: కాలం 'మార్ ' తోంది మరి! 🙃😏🙃 -కర్లపాలెం హనుమంతరావు




1970.. మట్టిగుంట 

సుబ్బయ్యతాత, సుందరమ్మమామ్మ ప్రయాణిస్తోన్న ఒంటెద్దు బండి డొంక రోడ్డులో గడ్డ అడ్డమొచ్చి గుంటలోకి పల్టీకొట్టింది.

 బాగా గాయాలయి అపస్మారకంలోకి జారిపోయారిద్దరూ!  ఆచారులగారి ఒకరోజు సపర్యల అనంతరం కళ్లు తెరిచిన ఉత్తర క్షణం సుబ్బయ్యతాత ఆందోళనగా అడిగిన మొదటి ప్రశ్న 'దానికి (భార్యకు) ఎలా ఉంది?' అని. ఒక అరగంట విరామంలో కళ్లు తెరిపిడి పడ్డ సుందరమ్మ మామ్మ  'ఎలా ఉందమ్మా ఇప్పుడూ?' అని ఆచారులవారు వేసిన ప్రశ్నకు బదులుగా తనే మరో ప్రశ్న వేసింది 'ముందాయనకు ఎలా ఉందోచెప్పండి?' అని. 'బాగానే ఉంది' అనే సమాధానం విన్న వెంటనే మెడలోని పుస్తెలతాడును కళ్లకద్దుకుంది! 


1990.. విజయవాడ 

సుబ్బారావు, సుందరి కనకదుర్గమ్మను దర్శనం చేసుకుని గుడి మెట్లు దిగి వస్తూండగా వెనక నుంచి ఎవరో ఇద్దరు దెబ్బలాడుకుంటో ఆ దంపతుల మీదకు వచ్చి పడ్డారు. సుందరి పట్టు తప్పి సుబ్బారావు మీద పడడం.. అనుకోని ఆ తోపుడుకు సుబ్బారావూ తూలడం! 

సుబ్బారావు కళ్లు తెరిచి చుట్టూ  చూసి తానున్నది ఓ మధ్య తరగతి ఆసుపత్రి బెడ్డు మీదని గుర్తించాడు. 

' ఏమయింది నాకు?'అని అడిగితే జరిగింది చెప్పి  'సమయానికి రక్తం దొరికింది.కాబట్టి గండం గడిచిందీ' అని సమాధానం వచ్చింది నర్సు దగ్గర్నుంచి. తనది, సుందరిదీ ఒకే గ్రూపు రక్తం. ఆమె రక్తం ఇచ్చివుంటుందీ! 'ఠేంక్స్ సుందరీ!' అన్నాడు బెడ్  పక్కనే కూర్చుని ఉన్న భార్యను చూసి. 'మొగుడూ పెళ్లాల మధ్య ఈ మర్యాదలేంటి కొత్తగా! ఎవరైనా వింటే నవ్విపోతారు! ఆపండి! మీ కోసం 

కాకపోయినా నా పచ్చతాడుకోసమైనా ఆ మాత్రం చేసుకోకపోతే నలుగురూ నన్నే అంటారు!' అనేసింది  సుందరి! 


2018.. హైదరాబాద్ 

సుబ్బేష్ కి ,సుందీకి ఘనంగా పెళ్లి జరిగిన మూడో రోజు. నృసింహస్వామి మొక్కు  తీర్చుకున్నట్లు ఉంటుంది.  యాదగిరి గుట్ట వెళదాం' అని సుందీ ప్రపోజల్ పెడితే .. 'అవును .. ఒంటరిగా ఓ పూట గడిపే అవకాశం'  అని సుబ్బేష్ తలాడించాడు. 

పెద్దాళ్లు ఇద్దరికీ తగు జాగ్రత్తలు చెప్పి చీకటి పడే లోగా వచ్చేయండి! హెవీలోడ్ లారీలు రేష్ గా తిరుగుతుంటాయ్!' అంటూ వంద హెచ్చరికలు చేసి మరీ పంపినా తిరుగు ప్రయణంలో చీకటి మలుపులో దొంగలెవరో ఇద్దర్నీ స్పృహ తప్పేటట్లు  చితకబాది 

 సుందీ నగలు, సుబ్బేష్ స్మార్ట్ ఫోను పట్టుకు పోయారు.  దారేపోయే వాళ్లెవరో  స్పృహలేని ఆ జంటను దగ్గర్లోని ఆసుపత్రిలో జమచేశారు. 

ఆసుపత్రి బెడ్డు   మీద మూలిగే సుబ్బేష్ ని తట్టి లేపుతూ 'వాటీజ్ దిస్ బ్రదర్?' అనడిగాడు 

ఖాకీ యునీఫాంలో ఉన్న పోలీస్ అధికారి ఒకరు.  'నాకు దెబ్బలు తగిలితే తగిలాయ్ కానీ..ఆ పిశాచి పీడా విరగడయింది  మొత్తానికి ఈ క్రెడిట్ నీదే  వైశాలీ. థేంక్స్ ఫర్ ది స్మార్ట్ ఐడియా డియర్!' అని వినవస్టోంది.  ఆ గొంతు  సుబ్బేష్ దే! 

'నీ బెటర్ హాఫ్ కూడా సేమ్ టు సేమ్ డైలాగ్ మూలుగుతోందయ్యా పక్క రూం బెడ్లో!డిఫరెన్సల్లా ఒక్క చిన్న  పేరులోనే! నువ్వు 'వైశాలీ'అంటోన్నట్లుగానే ఆమ్యాడంగారు ఎవరో 'విశ్వేషూ' అని మూలుగుతోంది మిష్టర్! కాలం మారింది  మరి!' అంటూ ఓ సర్కేస్టిక్ పంచ్ విసిరాడు  స్టిక్ ఆడించే ఆ పోలీసాఫీసర్!

- కర్లపాలెం హనుమంతరావు 

10-09-2018

***

Sunday, September 6, 2020

వనభోజనాల పుణ్యం - -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు దినపత్రిక, 22 జూన్, 2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం)

 



 

'ముందస్తుగా సభను రద్దు చేస్తే ఎలాగుంటుంది?' అని అడిగాడు అధినాయకుడు.

'స్వార్థం. ఒప్పుకోం!' అంది ప్రతిపక్షం.

'వ్యర్థం. ఊరుకోం!' అంది మిత్రపక్షం.

'చూద్దాం' అంది అధికారపక్షం ప్రతినాయకపక్షం.

హఠాత్తుగా ఎవరికోచ్చిందో ఆలోచన 'కార్తీక మాసం కదా! వనభోజనాలకు పోదాం! పదండి! ఎప్పుడూ ఉండే రాజకీయాలే కదా! ప్రొటోకాల్స్ కూ ఫోన్ కాల్స్ కూ దూరంగా పెళ్లాం పిల్లల్తో గడిపొస్తే ప్రాణానికి తెరపి. నేచర్ థెరపీ!' అనుకుంటుండగానే సుందరం ఒక రౌండు చందాలు దండుకొచ్చేశాడు.

సుందరం అందరికీ కావాల్సినవాడు. కాంగ్రెస్ లో పుట్టి కమ్యూనిష్టుల మధ్య పెరిగి భాజపాలో చేరి టిడిపికి మారి టిక్కెట్టు దొరక్క తెరాసా గుర్తు మీద తూగో జిల్లాలో ముస్లిం లీగ్ మద్దతుతో తుక్కుతుక్కుగా ఓడి ప్రస్తుతం పక్క రాష్టం ఎగువసభలో నామినేటెడ్ సభ్యుడుగా ఉన్నాడు. రాజకీయం అంటే ఒక ఒరలో రెండు కత్తులో, రెండు వరల్లో ఒకే కత్తో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయాలు నడుస్తుంటే.. తలలు పండిన వాళ్లందర్నీ ఒక్క బంతిన కూర్చోబెట్టడం పూలబంతిని చుట్టడమంత తేలికా! పార్టీ ఫండనో, పెద్దింట్లో పెళ్లనో, సహాయనిధనో, సానుభూతి సభనో.. ఎప్పుడూ చందా దందా చేసేవాళ్ల మూటలు విప్పించడం మామూలు వాళ్లకు మాటలా? అందుకే సుందరమే స్వయంగా ఎవరూ అడక్కముందే ఈ వ్యవ'హారం' మెళ్లో వేసుకున్నది!

వనభోజనంలో పాల్గొనేందుకు బెయిలివ్వమని జైల్లో ఉన్న స్కాం లీడరు చేత రిట్టేయించడంతో పని ప్రారంభమయినట్లయింది. ఏదయినా సరే ఎదిరించి అడగనిదే ఊరుకోలేని ప్రతిపక్షనాయకుడు కూడా 'ఇది రాజకీయాలకు అతీతమైన భోజన కార్యక్రమం. సామూహికంగా తినాలన్న ఊహే సాహసోపేతమైన చర్య' అని ప్రశంసించాడు.

ఎలాగూ యాత్ర అర్థాంతరంగా ఆగిపోయింది కనుక బస్సులయ్యినా బాడుక్కి తిప్పుకోవచ్చని ఆయన వ్యూహం. కమిటీ ఫామ్ అయింది. విధివిధానాలు చర్చకు వచ్చాయి.

'తలకెంతకనుకుందాం..' అనడిగారెవరో.

'తలల లెక్కెందుకులే! తేలిచావదు కానీ, శాల్తీల లెక్క చొప్పున పోదాం ఈ సారికి'

'ఏ నుండి జడ్ వరకు ఒక్కోరికి ఒక్కో కేటగిరీ!'

'ఆ లెక్కైనా సులభంగా తేలదు'

'భోజనాల వ్యవహారం కాబట్టి పొట్టల సైజును iబట్టి వసూళ్లు చేస్తే పోలా' అంది ఒక అతివాదపక్షి.

'పెళ్లాం పిల్లలు కూడా ఉంటిరి. ఆ పద్ధతి కుదర్దు కానీ, మెంబరుకో వెయ్యనుకుందాం' అని తేల్చేశాడు సుందరం.

స్థలం విషయంలో మళ్లీ ప్రతిష్ఠంభన ఏర్పడింది. 'తెలంగాణా హద్దులు దాటి మేం రాం' అని మోగింది ఒక విభజన స్వరం.

'తలకోనయితే మాకు భయం' అని మరో నిరసన గళం మారాం.

గందరగోళం.. గందరగోళం. అందరినీ సుందరమే ఆపాడు. 'వార్' అంటేనే కదా మనకు దడ? వాళ్లనే హోస్టులుగా పెట్టుకుంటే పోలా! జనజీవన స్రవంతిలో కలవాలని కోరుకునే అతివాదులతో మాట్లాడతా! భోజన సదుపాయాలు.. అవీ.. ఏర్పాటుచేయమని షరతు పెడదాం!' అన్నాడు.

'ఐనా సరే! మా మిస్సెస్సులు రాలేరయ్యా! సీరియల్సు మిస్సవుతామని బెంగ. కస్సుబుస్సుమంటారు' అన్నదో సంసారపక్షి.

'ఆడవాళ్లకు టీవీ సెట్లు, మగవాళ్లకు పేక సెట్లు ఏర్పాటు చేస్తే సరి. ప్రత్యక్ష ప్రసారం బాధలెక్కడా లేకుండా చూసుకుందాం. సరా? పదిమందికి ఒక విస్తరి ఫ్రీ.. అంటే అంతా వచ్చి కలుస్తారు.'అన్నాడు సుందరం.

సుందరం మాటే నిజమయింది. నాలుగు బస్సుల జనం పోగయ్యారు. బస్సులు వేళకు మూడే దొరికాయ్! 'పోనీ .. మేం పాదయాత్ర చేస్తూ వస్తాం' అంది ప్రతిపక్షంలోని ఒక పక్షం.

'అట్లయితే మేం సైకిళ్ల మీద రావాల్సుంటుంది' ప్ర్రభుత్వపక్షం బెదిరింపు.

దారి పొడుగుతా విమర్శల దాడులే దాడులు. అందరికీ సమాధానం చెప్పగల సత్తా సుందరానికి ఉంది కనక సరిపోయింది. 

'కొండలన్నావూ! ఏవీ కొండలు? ఇంకా మేం ముందుకు రాలేం' అని ఒక వర్గం మారాం.

'అలాగే అన్నారు. పోనీ మనమే  తెప్పిందామా కొండల్ని. కంగారెందుకు?' సుందరం జవాబు.

'ఎత్తిపోతలన్నావూ! ఎత్తుభారమన్నావూ! ..ఏవీ?' మరో వర్గ ఎత్తిపొడుపు.

'ఎత్తిపోతలేగా! ఎత్తి పోయిద్దాం! అదీ ప్రాబ్లమేనా!' సుందరం చిర్నవ్వు సమాధానం.

'ఉసిరిచెట్లయినా లేకుండా ఇవేం వనభోజనాలయ్యా?' ఎవరో కసురుకున్నారు గాట్టిగా!

'పెద్దాయన పేరు చెబితే ఉసిరేం ఖర్మ సార్! ఏకంగా కల్పవృక్షమే కదిలొచ్చేస్తుంది. కాస్త కామ్ గా ఉందురు! 'అంటుండగానే బస్సులు బండల మధ్య ఆగిపోయాయ్!

రెండు గంటలవుతుంది. ఆకులు దొరకవని ఆకలి ఆగుతుందా?

ఉభయ కమ్యూనిష్టులకు ఒకే విస్తరి పరిచారు. కుడి ఎడమలు కుదరక అది కాస్తా చిరిగింది!

చీకటి పడిందాకా పేకాట మాత్రం జోరుగా సాగుతూనే ఉంది. ధర్మారావు తన నియోజకవర్గం ఓడిపోయాడు. వీడియో లైట్లలో కూడా ఆట కొనసాగేదేమో కానీ, ఆడవాళ్ల గోల పెరిగిపోయింది.

అంతలోనే మీడియోవాళ్లు ఊడిపడ్డారు హడావుడిగా. 'అవతల సభ రద్దైపోతుంటే మీరిక్కడ దాక్కొని విందు వినోదాలతో  ఎంజాయ్ చేస్తున్నారా?'అంటూ ఫటాఫటా ఫోటోలు పీక్కుంటున్నారు.

అంతటా హాహాకారాలు

మోసం.. కుట్ర.. ఘోరం.. అంటూ ఘొల్లుమంటున్నారు వనభోజనానికని వచ్చేసిన భోక్తలందరూ. చెట్టాపట్టాలేసుకుని వచ్చినవాళ్లు చెట్టుకొకళ్లు, పుట్టకొకళ్లుగా పారిపోయారు.  కడిగేద్దామంటే సుందరం కంటబడితేనా? ఇఫ్తార్ విందుకని ఎప్పుడో సిటీలోకి చెక్కేశాట్ట!

ఆటవిడుపు పేరుతో మూకుమ్మడిగా వల్లో చిక్కినట్లు తెల్లారి గాని తెలిసిరాలేదు పెద్దమనుషులెవ్వరికీ.

ఇంటికొచ్చిన రహస్య వీడియో చూసి వణికిపోయాడు అధికార ప్రతిపక్షనాయకుడు. 'వార్' వాళ్ల దగ్గర్నుంచి ముడుపులు అందుకుంటున్నట్లుంది వీడియోలో పేకాటలో తాను గెల్చుకున్న కౌంట్ కు  వాళ్ల నుండి డబ్బులు తీసుకునే దృశ్యం! అది గానీ బయటపడిందో తన పొలిటికల్ చాప్టర్ క్లోజ్!

'రాజ్యాంగం అయితే ప్రాబ్లం లేదయ్యా! పేక ముట్టనని పెళ్లాం దగ్గర ప్రమాణం చేసి మరీ వచ్చానయ్యా !'అని వాపోతున్నడు అలాంటి వీడియోనే మరోటి అందుకున్న అధికారపక్ష ప్రతినాయకుడు. 'అయితేనేం? ఆ ఆవిడ ఆయన పక్కనే ఉంది కదా.. పేకాటాడేప్పుడు?' అనడిగారెవరో!

'అదే కదా అసలు ప్రాబ్లమ్! ఆ ఆవిడ ఈవిడ ఒకరు కాదు! వీడియో బైట పడితే ఈవిడగారు మెళ్లో దిగేసిన సొమ్ము సమ్మంధాల మీద అటు ఆదాయప్పన్ను మొగుళ్లు, ఇటు ఇంట్లో పెళ్లామూ కళ్లుపడతాయని వణికిపోతున్నాడు. సభలో చెలరేగేవాళ్లూ, వార్ వాళ్లతో పేకాటాడేవాళ్లైతే మాత్రం ఆదాయ ప్పన్నువాళ్లకూ , పెళ్లాలకి వణక్కూడదా ఏం?'

 'మిత్ర పక్షాలవాళ్లకేమయింది? జరిగిందంతా  కుట్రేనని ఎప్పట్లా ఓ స్టేట్మెంటయినా పారేయచ్చుగా వాళ్లు ?'

'వనభోజనంలో విస్తట్లో పడిందంతా వన్యమృగాల ఆహరంట! లొట్టలేసుకుంటూ తిని చచ్చాం!' అన్నాడో బిక్కచచ్చిన మిత్రపక్షి.

'అర్థాంతరంగా సభను రద్దుచేయడం ఎంతో అర్థవంతమైన చర్య. ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలపరిచే ఈ చర్యను మేమంతా ముక్తకంఠంతో సమర్థిస్తున్నాం' అంటూ సభ చేసిన  ఓ ఉమ్మడి ప్రకటన జారీతో అంతా సర్దుకుంది ఆఖరుకి.

సుందరానికి ఈ సారైనా అధికార పక్షం టిక్కెట్టు ఖాయమేనా? ఎన్నికల   ఖర్చుక్కూడా ఇబ్బందీ లేదు. అంతా వనభోజనాల పుణ్యం!

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు దినపత్రిక, 22 జూన్, 2003 నాటి సంపాదకీయ పుటలో ప్రచురితం



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...