Wednesday, November 10, 2021

పునాదిరాళ్ల ప్రార్థన- కల్లాపాలెం హనుమంతరావు - సాహిత్య ప్రస్థానం ప్రచురితం - కథానిక - వ్యంగ్యం

 కథానిక : వ్యంగ్యం : 

పునాది రాళ్లు 

- కర్లపాలెం హనుముంతరావు 

( సాహిత్య ప్రస్థానం - మాసపత్రిక - ప్రచురితం) 


క్రీ.శ 3011 హాట్‌ జూపిటర్‌ నుండి అరగంట క్రిందట బైలుదేరిన సూపర్‌ సానిక్‌ రాంజెట్‌ ''గో ఇండా'' (గోవిందాకి గో ఇండియాకి సరిసమానమైన పదం) భూ కక్ష్యలోకి ప్రవేశించి అదే పనిగా గిరికీీలు కొడుతోంది. చిన్న పిల్లలు ఆడుకునే టామ్‌వెరోప్లేన్‌ రీమోట్‌ కంట్రోలుతో తిరుగుతున్నట్లుంది ఆ దృశ్యం.


 గోఇండా నుండి చూస్తుంటే భూమండలం మొత్తం ఒక మండే పెద్ద బంతిలాగా ఉంది.  


స్పేస్‌ సెంటర్నుంచీ గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే రాంజెట్‌లోని యువశాస్త్రవేత్త లిద్దరూ మాస్కులని మరోసారి సర్దుకొని, స్క్రామ్‌జెట్‌ సాయంతో సూటిగా భూమి వైపుకు దూసుకురావడం మొదలుపెట్టారు.  


పొట్టిగా పాత సినిమాల్లో రామచంద్రరావులా ఉన్న వాడి పేరు మొగానో. పొడుగ్గా, రమణారెడ్డి లాగా పొట్లకాయ బొమ్మను గ్రాఫిక్సులా సాగతీసినట్లున్న వాడి పేరు తనాకో. వాళ్ళిద్దరు ఇంటర్‌ యూనివర్సల్‌ స్పేస్‌ యూనివర్శిటీలో రిసెర్చి స్టూడెంట్లు.


స్కాంజెట్‌నీ, రాంజెట్‌నీ రిమోట్‌ ద్వారా కంట్రోల్‌ చేస్తూ హాట్‌ జూపిటర్‌ స్పేస్‌ సెంటర్‌లో కూర్చుని ఆపరేషన్‌ డిస్కవర్‌ ఇండియా సూపర్‌వైజ్‌ చేస్తున్నాయన పేరు కబిల్‌ అతను ఆ ప్రాజెక్టు గైడ్‌, ప్రకాష్‌ రాజ్‌లా ఉన్నాడు.


కబిల్‌ ముత్తాతలు కొన్ని వేల ఏళ్ళ క్రిందట భూమ్మీద జీవించినవారు. ఐదొందల ఏళ్ళ క్రిందట భూమ్మీద జనాభా పట్టనంతగా ఎక్కువైపోయి వనరులు హరించుకుపోయి జీవన మనుగడకే ముప్పు ముంచుకొచ్చిన వేళ గగనాంతర రోదసిలోని వేరే గ్రహాలకు వలసపోయింది మెజారిటీ మానవజాతి. కబిల్‌ ముత్తాతలు సూర్య కుటుంబంలోని గురు గ్రహానికి చేరినవారే.


ప్రకృతి వికృతిగా మారి, దారుణ దుష్పరిణామాల కారణంగా మిగిలిన జీవ జాతులన్నీ క్రమక్రమంగా నశిస్తూపోగా, ప్రస్తుతం భూమి ఒక మరుభూమిని తలపిస్తోంది. అడవులు అదృశ్యమయ్యాయి. నీరు పాతాళంలోకి ఇంకిపోయింది. ఆక్సిజన్‌ కరువై బొగ్గుపులుసు వాయువుతో పూర్తిగా నిండిపోయిన భూమి మీదకు మొగానో, తనాకో ఎందుకొస్తున్నట్లు?!


తమ సౌర వ్యవస్థను బోలిన మరెన్నో గ్రహ కుటుంబాలను వెదికి పట్టుకుని, పరిశోధించి థీసిస్‌ సబ్‌మిట్‌ చేయడం 'ఆపరేషన్‌ డిస్కవర్‌ ఇండియా 'లక్ష్యం. ప్రాజెక్టులో భాగంగా కబిల్‌ గైడెన్స్‌లో గగనాంతర రోదసీలో ప్రయాణిస్తూ ఇప్పటికే ఎన్నో పాలపుంతలను, నక్షత్రాలను, గ్రహాలను, పరిశీలిస్తూ, గెలాక్సీలను గాలిస్తూ చివరి అంచెగా భూగృహం మీదకి దిగుతున్నారు ఇప్పుడు ఆ యువశాస్త్ర వేత్తలిద్దరూ.


భూతలం మీది వాతావరణం మాత్రం భయానకంగా ఉంది. సెగలు కక్కే పెను తుఫాను గాలులు ఎడాపెడా గొడుతున్నాయి. కనుచూపు మేరంతా ఇసుక ఎడారుల్లాగా ఇసుకదిబ్బలే.


ఓజోన్‌పొర చిరిగిపోయి సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతుండటం వల్ల జీవజాతులన్నీ ఏనాడో నశించాయి.


ఇంత జీర్ణావస్థలో ఉన్న భూమి మీదకు బాసు ఎందుకు దిగమంటున్నాడో యువకులిద్దరికీ అంతుపట్టడం లేదు.         స్కామ్‌ జెట్‌ నేలమీదకు లాండయిన తరువాత విద్యార్థులిద్దరికీ గైడ్‌ కబిల్‌ కమాండ్స్‌, స్పేస్‌ విండో నుండి వినబడుతున్నాయి. ''కంగ్రాట్స్‌! వేలాది ఏళ్ళ క్రిందట రోదసీ మండలం మొత్తంలో మహా నాగరికతలు వెల్లివిరిసిన పుణ్యభూమి మీద మీరు ఇప్పుడు పాదం పెట్టారు.'' కబిల్‌ హృదయంలో మాతృ గ్రహం మీద  భక్తి ఎంతలా పొంగి పొర్లుతోందో అతని గొంతులోని ఉద్వేగాన్ని బట్టే గమనించారు శిష్యులిద్దరూ. గురుదక్షిణగా ఇక్కడి నుంచీ ఏదైనా తీసుకెళ్ళి సమర్పిస్తే డాక్టరేట్‌ ఖాయమని ఇట్టే అర్థమయిపోయింది.


కబిల్‌ గొంతు గంభీరంగా వినపడుతోంది. ''ఆ రోజుల్లో అమెరికా అగ్రరాజ్యంగా ఉండేది. అన్నింటిలో అదే ముందుండేది. వాళ్ళు గర్వంగా కట్టుకున్న స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీని ఫోటో తియ్యండి''!


కెమెరాని బాస్‌ చెప్పిన డైరక్షన్‌ వైపు ఫోకస్‌ చేసి చూసాడు తనాకో. అక్కడమట్టి దిబ్బలు తప్ప ఏమీ కనిపించలేదు. ''అల్‌ ఖైదా వాళ్ళు ఆ అమెరికా నెప్పుడో సర్వనాశనం చేసేసారు. దాని నామరూపాలు కూడా మీకు కనిపించవిప్పుడు అన్నారెవరో''. ఆ గొంతు వినిపించినవైపు చూస్తే అక్కడెవరూ కనిపించలేదు! అదే విషయం తిరిగి బాస్‌కి చేరవేశాడు తనాకో.


'పోనీ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ పేరుతో ఒక వెలుగు వెలిగి.. చివరికి రష్యాలాగా మిగిలిపోయిన దేశాల గుంపు వంక ఒకసారి మీ కెమెరా తిప్పండి! అట్టడుగు మనిషి స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు నిర్మాణ రూపం రెడ్‌ స్క్వేర్‌. షూటిట్‌!'' కబిల్‌ కమాండ్‌.


కెమెరా పొజిషన్‌ మారింది. సేమ్‌సీన్‌. మట్టి దిబ్బలే మట్టి దిబ్బలు. ''వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళే కూల్చుకున్నారు. ముక్కలు చెక్కలయినా.. చివరికి ఒక చెక్కా మిగల్లేదు'' అంది మళ్ళీ ఇందాకటి గొంతే. జీవి మాత్రం కనిపించలేదు!


శిష్యుల ద్వారా సమాచారం విన్న కబిల్‌ అన్నాడు ''లండన్‌ టెన్‌ డౌన్‌లో ఉద్దండ పిండాలుండే వాళ్ళా రోజుల్లో. వాళ్ళ పాలనలో ప్రపంచం మొత్తంలో సూర్యుడు అస్తమించడానికే చోటుండేది కాదంటారు. ఆ సామ్రాజ్యపు మహారాజులు రాణులు నివాసమున్న ఆ వీధిని కెమెరాకి ఎక్కించండి!'' తనాకో కెమెరా అటు తిరక్కముందే అందుకుంది ఇందాకటి గొంతే ''నోయూజ్‌! ఆ సూర్యుడస్తమించని మహా సామ్రాజ్యం తరువాత్తరువాత అమెరికా వారి తోక దేశంలాగా తయారైంది. ఆల్‌ఖైదా దెబ్బకీ అదీ మాడి మసైపోయింది!''


ఓన్లీ వాయిస్‌... నో జీవి !


'బొట్టు పెట్టుకొనేటంత చిన్ని దేశమైనా అమెరికాని గడగడ లాడించిన జపాను దేశం నాగరికత మహా ఘనమైనది. నాటి మానవుడు సాంకేతికంగా ఎంత అభివృద్ధి పథాన్నందుకున్నాడో ఒక్క జపాన్‌ హిస్టరీ తెలుసుకుంటే చాలు. వాళ్ళ విసనకర్ర ఈక కనపడినా చాలు. ఒక ఫొటో పట్టుకోండి'' అన్నాడు కబిల్‌ నిరాశను గొంతులో కనిపించనీయకుండా.


' అణు ధార్మికశక్తితో దానికదే మసయిపోయింది'' అంది ఆకాశవాణి ఒక్క ముక్కలో.


"ఫ్యాషన్‌ ప్రపంచానికి నేర్పించిన ఫ్రాన్స్‌'' కబిల్‌ గొంతు.


" ఎయిడ్స్‌ మహమ్మారి ఎప్పుడో ఆ శృంగార దేశాన్ని కబళించేసింది'' అశరీరవాణి గొంతు.


" క్యూబా..'' కబిల్‌ గొంతులో వణుకు


" ప్లేగు వ్యాధికి ఫినిష్‌'' అ శరీరవాణి గొంతు.  


" ఆఫ్ఘనిస్తాన్‌.. పాకిస్తాన్‌... ఉజ్‌బెకిస్తాన్‌..'' కబిల్‌ పాఠంలా దేశాల పేర్లు వప్ప చెప్పేస్తున్నాడు.


" అవన్నీ తాలిబాన్లకి స్థావరాల్లాగా మారిపోయిన పిదప చరిత్రలో స్థానం లేకుండా పోయాయి. ఆఫ్రికన్‌ జంగిల్సుని కార్చిచ్చు, ఆస్ట్రేలియా ఖండాన్ని ఎల్లోఫేవరు.. ఒక్క ముక్కలో మీకు అర్థమయేట్లు చెప్పాలంటే తుఫానూ, భూకంపాలూ, సునామీలు, కరువులూ, వరదలూ, యుద్ధాలూ, రోగాలూ.. అన్నీ అన్నింటినీ నామ రూపాల్లేకుండా సర్వనాశనం చేసి పారేసాయి. అడుగూ బొడుగూ ఏమన్నా ఎంగిలివున్నా రాజకీయాలు వాటినీ కాజేసాయి. చివరికి ఇప్పుడు మిగిలింది... ఇదిగో మీరు చూస్తున్నారే ఈ మట్టి దిబ్బలే!'' అశరీరవాణి ఆపకుండా చేసే ఆ అనవసర ప్రసంగానికి యువశాస్త్రవేత్త లిద్దరికీ తెగ వళ్ళు మండిపోయింది. గురువుగారికి దక్షిణంగా ఏదన్నా పట్టుకుని పోదామంటే.. వీడెవడు.. ప్రతిదానికీ పిలువా పెట్టకుండా కల్పించుకుని 'అంతా బూడిదయింది... మసయింది... నాశనమయింది.. మురిగిపోయింది... అంటూ అపశకునాలు తప్ప పలకడం లేదు. ''రెండు వాయిద్దామంటే వాయిస్సే గాని మనిషి ఎదురుగా కనిపించడం లేదాయ ! తమకు డాక్టరేట్‌ రాకుండా తోటి విద్యార్థులు చేస్తున్న కుట్ర కాదుగదా ఇది ! డుపులోని మంటను డుపులోనే ఉంచుకొని ఏం ప్రయోజనం! కనపడ్డా.. కనపడకపోయినా ముందు కడిగిపారేయడం ఉత్తమం. తనాకో ఇంకా తమాయించుకోలేక పెద్ద గొంతుకతో అరిచాడు'' ఇందాకట్నుంచీ చూస్తున్నాం ఏది చూద్దామన్నా లేదు పొమ్మంటున్నావు. ప్రకృతి బీభత్సానికి అంతా బూడిదయిపోతే మరి నువ్వెలా ఉన్నావు మహానుభావా!'' ''ఇంతకీ నువ్వెవరివి? మొనగాడివైతే మాముందుకురా!'' అని వంతపాటందుకున్నాడు మొగానో.


బిగ్గరగా నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు భూమి కంపించింది. ''మీరు నిలబడ్డ చోటులోనే క్రింద వున్నాను. గొయ్యి తీసి చూడండి. నా దివ్య దర్శనం అవుతుంది. అందా గొంతు వింతగా మరోసారి విరగబడి నవ్వుతూ.


మొగానో గబ గబా గొయ్యి తీయడం మొదలుపెట్టాడు. రెండడుగులు కూడా తవ్వకుండానే బైట పడిందా గొంతు తాలూకు వింత ఆకారం. నిట్ట నిలువుగా ఉంది నల్లగా నిగ నిగ మెరిసిపోతుంది. వంటి మీదంతా ఏవో గాట్లు... పై నుంచి క్రింద దాకా..! ఇలాంటి ఆకారాన్ని ఆ గ్రహాంతర వాసులు ఇంత వరకూ రోదసీ మొత్తంలో ఎక్కడా చూసి ఉండలేదు. ప్రళయమొచ్చి భూమ్మీదున్న సర్వ జీవాలు దుంప నాశనమయినా.. చెక్కు చెదరకుండా.. నిట్ట నిలువుగా... తాజాగా.. కళకళ లాడుతూ కనిపిస్తున్న ఆ ఆకారాన్ని చూడగానే.. నిజం చెప్పద్దూ..  యువ శాస్త్రవేత్తలిద్దరికి ఒకింత గౌరవం కూడా కలిగింది. సాధ్యమైనంత వినయంగా తమ మనస్సులోని సందేహాన్ని బైటపెట్టారు కూడా.


" ఇంతకీ తమరెవరో సెలవిచ్చారు కాదు సార్‌!'' అనడిగాడు తనాకో. ఆ ఆకారం చెప్పడం మొదలుపెట్టింది'' పునాదిరాయి అంటారు నన్ను. వెయ్యేళ్ళ క్రిందట ఇక్కడ ప్రజాస్వామ్యమనే పరిపాలనా విధానం ఒకటి వర్ధిల్లింది. ప్రజాస్వామ్య మంటే ప్రజలే రాజులు. ప్రజల కొరకు, ప్రజల వలన, ప్రజల చేత నడిచేపాలన. మరీ లోతుగా వెళ్ళద్దులే. మీరొచ్చిన పనికూడా మర్చిపోయి తిరిగివెళ్ళటానికి తిప్పలు పడతారు. అంత తికమకగా ఉంటుందా ఆ రాజకీయ వ్యవహారం. ప్రజాస్వామ్య మంటే ప్రజలూ.. వారెన్నుకునే నాయకులు.. వాళ్ళు పాలించే ప్రజలు.. ఈ మాత్రం అర్థం చేసుకోండి చాలు ప్రస్తుతానికి ఇంకనేనెవరో చెబుతాను. వినండి! ఎన్నికల్లో నిలబడి గెలవడానికి నాయకులు కావాలనుకునేవాళ్ళు ఎన్నికల ముందు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ప్రాజెక్టు కట్టిస్తామని, బళ్ళు పెట్టిస్తామని, ఫ్యాక్టరీలు నిర్మిస్తామని.. ఇట్లా ! వాళ్ళు వాగ్దానం చేసినంత మాత్రాన జనం నమ్మాలని ఏముంది? వాళ్ళకి నమ్మకం కలిగించడానికి నాయకులు ఇదిగో ... ఇవాళే ... ఇక్కడ ... మీకు భవిష్యత్తులో కట్టబోయే భారీ నిర్మాణానికి నాంది పునాదిలో రాయివేస్తున్నాం. అంటూ బ్రహ్మాండంగా ఊరేగింపూ గట్రా జరిపి పటా టోపంగా మమ్మల్ని పాతేస్తారన్నమాట. మమ్మల్ని చూసి నమ్మిన జనం వాళ్ళకు ఎన్నికల్లో ఓటేస్తే గెలిచి నాయకులు అయిపోయి... వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ మళ్ళీ ఎన్నికలొచ్చేలోగా సుబ్బరంగా చేసుకుంటారన్నమాట'' ''ఒక్క నిమిషం పునాది రాయీ! చిన్న సందేహం. మరి వాగ్దానం చేసినట్లు నాయకులు నిర్మాణాలు ఎన్నికలయిన తరువాత పూర్తి చేస్తారు గదా! అయినా మీరింకా ఇలాగే పునాదులో శిలా విగ్రహాల్లో అల్లాడుతున్నారే !


పకా పకా నవ్వింది పునాది రాయి ''మరదే ప్రజా స్వామ్యమంటే. సరే ఇందాకట్నుంచీ ఏది కనిపించటం లేదని అల్లాడుతున్నారు కదా ! అమెరికా, రష్యా, చైనా జపానంటూ ఎన్నడో అంతరించి పోయినవాటిని గురించి వెదుక్కుంటున్నారు కదా ! వృథాగా వాటికోసం సమయం పాడు చేసుకోకుండా... నన్నూ, నా సోదరులనూ.. ఫొటో తీసిపట్టుకుపోండి ! అంత దూరం నుండి వచ్చినందుకు ఈ మాత్రమన్న దక్కినందుకు సంతోషించండి.''


"నువ్వేకాక నీకు సోదరులు ఇంకా ఉన్నారా ! సజీవంగా నీలాగే ఉన్నారా? అనడిగాడు తనాకోనోరెళ్ళ బెట్టి


" ఎందుకు లేరు! వందలొందలు. మీ కెమేరాలు ఆన్‌చేయండి... వరసగా పరిచయం చేస్తాను. ఫ్లాష్‌ చేసుకోండి! అదిగో అది బ్రహ్మాణి సిమెంటు ఫ్యాక్టరీ తాలూకు పునాదిరాయి. ఇదిగో ఇది పోలవరం అనే నీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వేసిన పునాది రాయి. అల్లదిగో ఆ మూల వున్నది. హంద్రీ నీవా సుజల స్రవంతి పునాది రాయి. ఇల్లదిగో ఈ  మూల వున్నది. అప్పట్లో హైదరాబాదనే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్టు పునాది రాయి. ఇది సిద్ధిపేట స్టోర్స్‌ స్టేడియం పునాది రాయి. ఇది పటాన్‌ చెరువులో వెయ్యి పడక లాసుపత్రి అప్పటి ముఖ్యమంత్రి వేసిన పునాదిరాయి. ఇది బడాయి గడ్డలోకాజ్‌ వంతెన తాలూకు పునాది రాయి. ఇదిగో పుణ్యవరంలో బ్రిడ్జి నిర్మాణానికి వేసిన రాయి. ఇలా మీరు ఎక్కడ తవ్వి తీసినా చక్కని పునాది రాళ్ళు అనాదిగా అనాథల్లా పడివుండి కనిపిస్తాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రగతి లేదు. మాగతి మారలేదు. మా ఫొటోలను తీసి మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీరు కోరుకున్న పట్టా గ్యారంటీ!''


కెమేరాలో తళతళ లాడుతున్న ఆ పునాదిరాళ్ళన్నింటినీ గబగబా ఫొటోలు తీసుకుని ఆనందంగా మళ్ళీ అంతరిక్షంలోకి ఎగిరే ముందు మొగానో! తనాకో కృతజ్ఞతా పూర్వకంగా అన్నారు. ''మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం''. తీర్చుకోవచ్చు ఈ జన్మలోనే. మమ్మల్ని లా నిలువునా పాతేసి వెళ్ళిపోయిన పెద్ద మనుషులు మీరు వెళ్ళే దారిలో ఏ నరకంలోనో, పాతాళ లోకంలోనో కనిపిస్తారు. పెద్ద మనసు చేసుకొని వచ్చి కనీసం ఒక్క ప్రాజెక్టునైనా ప్రారంభించి మాకు ముక్తి కలిగించమని మా తరుపున విన్నవించండి'' అంది ఆ పునాదిరాళ్ళ సంఘం ప్రధాన కార్యదర్శి.     


- కర్లపాలెం హనుమంతరావు

( సాహిత్య ప్రస్థానం  - మాస పత్రిక - ప్రచురితం ) 



ఎవరు గొప్ప? - బాలల కథ

 


ఒక చిన్న కథ 

- సేకరణ : కర్లపాలెం హనుమంతరావు 

( పాత భారతి మాసపత్రిక నుంచి సేకరించినది. ) 


ఒక దేశంలో ఒక రాజు న్నాడు. అతని వద్దకు ఒక బీద వాడు వచ్చాడు. ఆబీదవాడు తన కూతుర్ని వివాహ మాడటానికి తన పేదరికం చే భయపడుచున్నాడని రాజు అనుకున్నాడు. . అనుకుని అ పేదవానితో "నాకూతురుతో పాటు ప్రస్తుతం సగం రాజ్యము వస్తుంది. నాతదనంతరం మిగతా రాజ్యం వస్తుంది" అని ఆపేదవాని మెడలో పూలహారం వేళాడు. 


ఆ పేదవాడు హారమును మెడలో నుండి తీసి వేసి "ఏమిటీ పిచ్చి నేను పెండ్లి చేసుకోను' అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు.


కాని రాజుగారి కూతురు మాత్రం “యీ పేదవానిని ఎటులయినా సాధించి పెళ్ళి అయినా చేసుకోవాలి, లేకపోతే ప్రాణాలైనా  విడవాలి అని” అతనిని తీసుకు రాపడానికి వెంబడించింది. 


రాజా గారు, అతని అనుచరులు వీరిద్దరిని వెంబడించారు. ఈ పేదవాడు కొన్ని మైళ్ళు నడిచి, కొన్ని మైళ్ళు పరుగెత్తి ఒక ఆడవిలో ప్రవేశించాడు. ఆ అడవి యితనికి  చిరపరిచయంలాగ కడనిపించింది. అడివిలోని మర్మాలన్నీ యితనికి  విశదమేనని  స్ఫురించింది. 


ఇట్లుండగా సాయంకాలమై చీకట్లావరింప  మొదలిడాయి. చీకట్లో  ఒక దూకు దూకి పేదవాడు మాయిమై పోయినాడు. 


రాకుమారి  వెతికి వెతికి వేసారి నిరాశ చేసుకుని ఆడివిలోనుండి బయటికి పోయేమార్గం తెలిసికోలేని దుస్థితిలో ఒక చెట్టుకింద చతికిలబడింది. 


ఇంతలో రాజును  ఆటవికులు సమీ పించి "విచారింపకు. అడివిలోనుండి బయటకు పోయే దారి  మాకు తెలుసు. అయితేయిపుడు గాడాంధ కారం అంతటా కమ్ముకుంది. యిపుడు దారి తెలుసుకోలేము. ఇదుగో యిక్కడొక పెద్ద చెట్టుంది. దాని క్రింద యీరాత్రికి విశ్రమిద్దాము . ఉదయం కాగానే లేచి పోవచ్చును" అని అన్నారు.


ఆ చెట్టు మీద  ఒక పక్షి కుటుంబం గూడు కట్టుకుని కాపురం చేస్తూంది. ఒక మగపక్షి. ఒక ఆడపక్షి మూడు చిన్న పక్షులు ఉన్నవి.  మగపక్షి క్రింద వున్న  వారిని చూచి భార్యతో యిట్లు చెప్పింది. "చలి అతి తీవ్రంగా ఉంది. ఇక్కడ చాలామంది  అతిధులు పరున్నారు. చలి కాచుకోవహానికి  ఏమీ లేదు .. అంటూ ఆంతట  యెగిరి వెళ్ళి ఎచ్చటనో ఎండినపుల్లలను ముక్కుతో కరచుకొని ఆతిధులముందు పడవేసింది. 


వారు వాటి సహాయంతో మంట చేసుకున్నారు. అయినా  మగపక్షికి మాత్రం తృప్తి కలుగ లేదు. భార్యతో మళ్ళీ యిట్లా చెప్పింది.

"ఇప్పుడేం చేద్దాం. ఆతిధులకు తింటాని కేమీ లేదు. వారు ఆకలితో  పరున్నారు . మనం సంసారులము. అతిథులను మర్యాద చేసే లక్షణం గృహస్తునిది. కనుక నా శక్తికొలది సహాయం చేయాలి.  నా శరీరాన్ని వారి కిచ్చి వేస్తాను" అని ఆమండుతూన్న మంటలో పడుతూండగా అతిధులు చూచి రక్షించటానికి ప్రయత్నించారు.  కానీ లాభం లేకపోయింది.


తన భర్త మంటలో పడిపోవటం చూచి ఆడపక్ష్మి తనలో తానిట్లనుకుంది.

“ చెట్టుకింద పెక్కు రతిథులున్నారు . వారికి తినుటకు ఒక పక్షే ఉంది. అది చాలదు. నా భర్త ప్రారంభించిన కార్యం ఆసంపూర్తిగా  విడవటం నాధర్మం కాదు. కనుక నాశరీరాన్ని కూడా వారి కర్పించుకుంటాను” అని అనుకుంటూ ఆడపక్షికూడా మంటలో పడింది. 


మూడు చిన్న పక్షులును తమ తలితండ్రులు చేసిన పనిని చూచి వారి పనిని అసంపూర్తిగా  వదలటం బిడ్డలుగా ధర్మం కాదని అనుకుని అవికూడా మంటలో వడ్డవి.


కిందనున్నవారు ఆత్యాశ్చర్యముతో చూడసాగారు. వారు తిండిలేకనే రాత్రి గడిపివేసి యిటువంటి ఉదారస్వభావం గలిగిన పక్షుల మాంసము తినడంకంటె తిండి లేక చనిపోవడమే ఉత్తమనసుకొని వుదయమున నే లేచి యింటికి వెళ్ళారు. 


మంత్రివర్యున కీపమాచారమును వినిపించగా అతడు ఈ  విధమున జవాబిచ్చాడు.

" ఓరాజా, యెవరి స్థానములో వారు గొప్ప అని నీవు దృష్టాంతపూర్వకముగా చూచావు . ప్రపంచంలో జీవించాలంటే ఆపక్షుల మాదిరిగా జీవించవలె. ఏక్షణమున కాక్షణము ఆత్మార్పణం చేసుకోటానికి సంసిద్దంగా ఉండాలి. ప్రపంచాన్ని నీవు విసర్జించాలంటే అందమైన కూతుర్ని రాజ్యాన్ని ఒక్కసారిగా తృణీకరించి వైచిన ఆ పేదవానిని అనుసరించు. నీవు గృహస్తుగా  ఉం డాలంటే  యితరుల క్షేమం కోసం నీ ప్రాణాన్ని అర్పించుకో. కనుక అందరు తమ తమ స్థానాల్లో గొప్పవారే. ఒకరికి విధికృత్యమైతే మరొకరికి విధికృత్యంగాదు. 


( భారతి - కథ ) 

తప్పనప్పుడు .. - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

తప్పనప్పుడు ..  - కథానిక

 -కర్లపాలెం హనుమంతరావు

 

'నీకు ఛెస్ ఆట్టం వచ్చా?' సగం ఖాళీ అయిన గ్లాసులో మరంత విస్కీ   వంపుకుంటూ  అడిగాడు వాసుదేవరావు.

'ఏదో సార్.. కొద్దిగా! కాలేజీ డేస్..  కాంపిటీషన్లలో..  తప్పనప్పుడు.. ‘  అంది పల్లవి బాస్ తన సోడాలో వంపిన  కోక్ లో మరంత సోడా  కలుపుకుంటూ,

కాఫీనే తాగదు పల్లవి. బాస్ పదే పదే ప్రెస్ చేస్తే ఇల్స్స్ కోక్ అయినా తాగక తప్పింది కాదు.

రాత్రి తొమ్మిదిన్నర దాటింది. గ్లాస్ విండోస్ గుండా ఫ్రాంక్ ఫర్ట్ నగరవీధులు  మిరిమిట్లుగొలుపుతున్నాయ్! బాస్ ఎర్రబారుతోన్న   కళ్ల జీరల్లో నుంచి ఓ మగాడు తనలోకి తొంగిచూస్తున్నట్లు గ్రహింపుకొచ్చింది  పల్లవికి. పెళ్లీడు తెలుగు ఆడపిల్ల పల్లవి, మధ్య తరగతిది.    తడబాటెటూ  సహజమే! కాకపోతే,  అలవాటైన    వృత్తిధర్మం మెళుకువగా దాన్నో మూల   అదిమిపెట్టి ఉంచింది   

బైట  చలి.. లోపలి రూమ్-ఫైర్  వెచ్చదనం. ఆమెకూ ఇబ్బ౦దిగానే ఉంది కానీ, అన్నీ అందరికీ ఇళ్లల్లోనే చెప్పుకోలేని   పరిస్థితులు ఇవాళ్టివి.    ఒహ చోట కొలువంటూ కుదురుకున్నా కొన్ని సహించాలి.. తప్పవు!

 వయా రూట్  జర్మన్ ఫ్రాంక్ ఫర్ట్ లో హెల్డప్పయ్యన్నాడు ప్రస్తుతం  వాసుదేవరావు. యూఎస్  సియోటల్లో బిజినెస్  సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని  బ్యాక్ టు హైదరాబేడొస్తో..   అఫ్ఘనీ స్కైస్ ఫ్లైయింగికి  అనుకూలంగా లేకపోవడం చేత! 

కాంప్లికేటెడ్ ప్రొజెక్ట్స్ వచ్చినప్పుడు పర్శనల్ అసెస్టెంట్ పల్లవిని ఏరి కోరి తన వెంట తెచ్చుకోడం వాసుదేవరావుకో   సెంటిమెంట్.. ఆమె అదృష్టం బాగుండి ఈ సారీ ఎప్పట్లానే ఈ ఒన్ మిలియన్ ప్రాజెక్టు లైన్ షేర్     కంపెనీకే సానుకూలమవడంతో బాస్ మంచి జాలీ మూడ్ లో ఉన్నాడు. అది పసిగట్టే మూడోసారి తన ప్రమోషన్ విషయం కదిపింది పల్లవి  సియోటల్లో బైలుదేరినప్పుడే. వీక్ డేస్ టెన్షన్నుండి పూర్తిగా    రిలాక్సయే దారులు వెదికే బాసుకు  హఠాత్తుగా పల్లవి రిక్వెస్ట్  గుర్తుకొచ్చింది.  

మధ్య దారిలో ఇబ్బందులేవైనా వస్తే  ఫ్లైట్ తిరిగి రిజ్యూమయ్యే దాకా ఎగ్జిక్యూటివ్ క్లాస్  కు ఆ లైఫ్ స్టైల్ కు తగ్గట్లు  సూట్స్ అలాటయ్యే రూలొకటుంది.  నిబంధనల కింద తెల్లారి ఫ్లైట్  తిరిగి బయలుదేరే దాకా విశ్రాంతి తీసుకునే నిమిత్తం వాసుదేవరావుకో ఫైవ్ స్టార్ హోటల్ టాప్ మోస్ట్ ఫ్లోర్ చివర్న ఎకామిడేషన్ ఎలాటయింది. రిక్వస్టు మీద పల్లవికీ  పక్క రూమే ఇవ్వడంతో  వాసుదేవరావు మైండ్ ను   మొదటిసారి ఈ ఆలోచన మెలిపెడుతోంది..  పల్లవిని ఎలాగైనా తన ముగ్గులోకి దింపుకొని ఈ నైట్ ఎంజాయ్ చెయ్యాలని! ఒకప్పటి గ్రాండ్ మాస్టర్  మిస్టర్ వాసుదేవరావు పనిగట్టుకుని మరీ  చదరంగం ప్రస్తావన  తన ముందుక్కు తెచ్చిన ఆంతర్యం గ్రహించలేనంత అమాయకురాలైతే కాదు మిస్ పల్లవి.

 

పాతికేళ్ల పల్లవి ఇండియన్ ఫెమినిష్  ఎథీరియల్    బ్యూటీనంతా ఒకే చోట కుప్పేనంత అందంగా ఉన్నా,  ఇప్పటి దాకా ఆమె సెఫ్టీ జోనుకేమీ పరీక్ష ఎదురయింది కాదు. అందుక్కారణం తన బాస్ లోని  జెంటిల్ మన్ షిప్పేనని ఆమెకూ తెలియకపోలేదు.  కానీ, మొగాడులోని మొగాడు  ఏ క్షణంలో తన ప్ర'తాపం' చూపిస్తాడో ఎవడికి తెలుసు!  'వేరే దగ్గర మాత్రం ఇంతకు మించి మంచి వాతావరణం ఉంటుందన్న గ్యారంటీ ఏముంటుంది? తెలీని గందరగోళం కన్నా.. తెలిసున్న ఈ మేళంతోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుంద'న్న ఫిలాసఫీలో గల  మిస్ పల్లవికిప్పుడు దేశం కాని దేశంలో కొత్త సమస్య ఎదురయింది!

ఛెస్ బోర్డ్ మీద పావులు సర్దే పల్లవితో 'పందెం ఏంటి పల్లవీ?' అనడిగాడు వాసుదేవరావ్ సాధ్యమైనంత  చిరునవ్వు మొగంతో.

'మీతో నాకు పందేలేంటి సార్.. సిల్లీగా!' అంది పల్లవి సిగ్గుపడుతూ.

'పందెం లేకుంటే ఏ ఆటా పసందుగా ఉండదు మ్యాడమ్! జస్ట్ ఫర్ ఫన్ సేక్.. ఏదో ఒకటుండాలి'

'మీ ఇష్టం సర్! అదీ మీరే చెప్పండి! నా బుర్రకు అట్లాంటి  ఐడియాలు తట్టవ్!'

'ప్రమోషన్ అడుగుతున్నావుగా చాలా కాలం బట్టి! విన్నయితే  ఆర్డర్ ఇప్పుడే నీ చేతిలో పెట్టేస్తా!'

'మరి లూజయితే సర్?'

'ఏమీ లేదు' అన్నాడు బాస్ మరో సిప్ గొంతులోకి తీసుకుంటూ.

హర్టయినట్లు చూసింది పల్లవి 'అదేం బావుంటుంది సర్! ఏదో ఒహటి చెప్పండి.. చిన్నదైనా సరే.. ప్లీజ్' అంది పల్లవి దృఢంగానే.

‘ఆ స్వాభిమానమే ఈ పిల్లలోని  స్పెషల్ అట్రాక్షన్. వేరే ఎంప్లాయీస్ కు మల్లే తను దేనికీ దేబిరించదు!’ అనుకున్నాడు వాసుదేవరావు

'సర్సరే పల్లవీ! చెక్ చెప్పిన ప్రతి సారీ వెనక్కి తీసుకోడానికి నేనైతే ఓ 'కిస్' తీసుకుంటా! నువ్ గానీ చెప్పి వెనక్కు తీసుకుంటానంటే ఓ టూ థౌజంట్ కేష్ఇచ్చుకుంటా! ఎవరికైనా త్రీ రౌండ్సే ఛాన్స్. ఓకేనా?'

పల్లవి సైలంటయిపోయింది.

'పోనీలే! నీ కంత ఇదిగా ఉంటే.. ఆట వద్దులే! హాయిగా నీ రూముకు పోయి పడుకో పల్లవీ! ఎర్లీ హవర్సులో ఓ సారి వచ్చి నన్ను లేపి పో!' అంటూ ఆవులిస్తూ లేవబోయాడు వాసుదేవరావు.

'సరే సర్! ఈ ప్రమోషనూ, మనీ రెండూ నాకూ మా ఫ్యామిలీకి అవసరమే!' అంది పల్లవి.

'డోంట్ వరీ పల్లవీ! గెలుపోటములు ఏ ఒక్కరి సొత్తూ కాదు' అంటూ  సిసీలియన్ ఓపెనింగ్ వేశాడు వాసుదేవరావు. '

ఆట నడక ఆరంభమయింది.

పల్లవి బలగాలు వడివడిగా తరుగుతున్నాయి. వాసుదేవరావులో ఉత్సాహం పెరుగుతోంది. ఎదురుచూసే  అవకాశం ఇంత సులభంగా చేతికందుతుందని అతగాడనుకోలేదు. పల్లవికి చదరంగంలో కేవలం బేసిక్స్ మాత్రమే తెలుసు! కాలేజీ కాంపిటీషన్స్ కేవలం తన దగ్గర ప్రదర్శించిన డాంబికమే!

 ఐదు నిమిషాలయినా కాకుండానే 'చెక్' అన్నాడు వాసుదేవరావు.

రెండు నిముషాలు ఆలోచించి..'ప్లీజ్ విత్ డ్రా సర్!' అని  అడిగింది పల్లవి సిగ్గుపడుతూ.

'మరి.. '

‘ప్లీజ్! మరింకేదైనా పందెం చెప్పండి.. సులువైనది. రెండూ చెంపలూ వాయించుకోమంటారా.. అందుకు బదులుగా!’

‘సంపెంగ రేకుల్లా ఉన్నాయా చెంపలు! నువ్ తప్పు చేస్తే వాటికా శిక్ష?’ బిగ్గరగా నవ్వుతూ ‘సారీ’ అన్నాడు వాసుదేవరావ్ అదోలా బేలమొహం పెట్టి. తాగే డ్రింక్ చూపించే ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

'ఫస్ట్ టైం ! ఎంబ్రేసింగ్ గా ఉంది. తప్పదంటున్నారు.  పోనీ, ప్లీజ్! హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోర్ హ్యాండ్ సర్!' అంది ప్లీజింగ్ వాయిస్ తో చేయి  ముందుకు చాపుతూ.

తామరతూడు వంటి ఆమె చేతిని అందుకొని లిప్ తో ఫోర్ హ్యాండ్స్ ను టచ్ చేస్తోంటే.. గుడెలు దడదడలాడాయి వాసుదేవరావుకు.  మనసు ఎటెటో వెళ్లిపోతోంది.. అధీనం తప్పి!

'చేతి మీదనే ఇంత రంజుగా ఉంటే ఇహ చెంపల మీదా.. ఆ పైన  లిప్స్ మీదా ..'

ఊహకే వాసుదేవరావ్ గుండెలు గుబగుబలాడాయి!

బాస్ చెక్ మూవ్ రివర్స్ చెయ్యడంతో ఆట మళ్ళీ ముందుకు సాగడం మొదలుపెట్టింది.

పల్లవి ఈ సారి అంత తొందరగా దొరకడంలేదు.  ‘తన దగ్గర ఇంత ఆట ఉందని ఇందాక అనిపించలేదే’ అనుకున్నాడు బాస్;

మరింత శ్రద్ధగా ఆట  మీద దృష్టి పెట్టినా ఈ సారి చెక్ చెక్ చెప్పడానికి పది నిమిషాలు టైం పట్టింది వాసుదేవరావుకు.

'వెనక్కి తీసుకోనా? అని అడిగాడు వాసు బాసు వాయిస్ లో కొంటెతనం పెంచి.  

'తప్పేదేముంది సర్!' అంటూ తలెత్తకుండానే చెయ్యందించింది పల్లవి.

'నో!.. నో!..నో! పునరుక్తి దోషం పనికిరాదు. 'ఈసారి' అంటూ తన చెంప చూపించాడు బాస్.

'మరి మూడో సారయితే?' భయంగా ఆడిగింది పల్లవి.

'అన్ని సార్లూ నేనే చెప్పాలనేముందమ్మాయ్? చూస్తున్నాగా! యూ ఆర్ ఆల్సో అ  స్మార్ట్ ప్లేయర్.' అన్నాడు బాసు పల్లవి మరీ బెదిరి వెనక్కివెళ్లిపోతుందెమోనని!

ఒక్క క్షణం ఆగి నిదానంగా అంది పల్లవి 'స్మాల్ రిక్వెస్ట్ సర్! ఈ సారిది.. అయితే గియితే మూడో సారిది కూడా.. ఒకేసారి తీసుకోవచ్చుగా! ప్లీజ్.. ప్లీజ్..'

'వై.. పల్లవీ.. ఎందుకలాగా?'

'సర్! నేను మీలాంటి గ్రాండ్ మాస్టర్ని కాను. రెండు,  అయామ్ జస్ట్ ఎ గర్ల్.. దట్ టూ ఎ నొవిస్!. మీ ఫస్ట్ కిస్ కే బాగా డిస్టర్బయ్యున్నాను సర్! ఇప్పుడే సెకండ్ ది కూడా అంటే ! ఈ మాత్రం కూడా ఆడలేను సర్! ప్లీజ్ కన్ సిడర్ సర్!'

అందమైన ఆడపిల్ల అలా అడిగేస్తుంటే  ఎ పురుషపుంగవుడికైనా ఎట్లా 'నో' అని బుద్ధేస్తుంది?

వాసుదేవరావ్ పల్లవిని హ్యాపీ మూడ్ లో ఉంచి ఎంజాయ్ చెయ్యాలని ముందు నుంచే ఫిక్సై ఉండె!

నొప్పించి పుచ్చుకునేవి, ఒప్పించి పుచ్చుకునేవి .. రెండింటి మధ్య ఉండే తేడా వాసుదేవరావ్ వంటి హై-క్లాస్ ఎగ్జిక్యూటివి తెలీకుండా ఉండవు! ఈ ముద్దులు వంటి శృంగార చేష్టలు బిట్లు బిట్లుగా కాకుండా ఒకె ఫ్లోలో ఇచ్చి పుచ్చుకుంటే పుట్టుకొచ్చే అనుభూతే కదా అసలైన అనుభూతి!

 నిజానికి పల్లవి కోరిక వల్ల తనకే మరంత ఉపయోగం! వెంట వెంటనే పక్కనా .. పైనా  గాఢంగా తీసుకునే ముద్దు  ఘాటుకు పల్లవి తరహా ఆడపిల్లలు మళ్లీ తేరుకోవడం అంత సులభం కాదు.  

తన పని అనుకున్న దాని కన్నా సులువయే సూచనలు కనిపించడంతో సంతోషంగా తలాడించి మంత్రిని వెనక్కు తీసుకుని బదులుగా బంటుతో ఎత్తువేసి ఆమెకు ఆడేందుకు అవకాశం కల్పించాడు బాస్ వాసుదేవ్ రావు.

మూడో సారి కూడా ‘చెక్’ చెప్పేసి ఎప్పుడెప్పుడు ఆమెను ఆక్రమించుకుందామా .. అని ఒహటే తొందరపెట్టేస్తోంది మనసు.

కానీ, ఎటు నుంచి వస్తున్నా ఆ పిల్ల మహా వడుపుగా తప్పుకుంటోందీ సారి.. కాలేజీ కాంపిటీషన్ల వరకే ఆమె అట.. అంటే.. నమ్మేందుకు లేదు!

వాసుదేవరావు ఆటలో తడబాటు ఎక్కువయింది. పొరపాట్లు చెయ్యబోయి సరిదిద్దుకున్నాడు .. భావోద్వేగం కలిగిస్తున్న వత్తిడి ఒకటైతే.. ఖాళీ అవుతున్న మూడో రౌండు గ్లాస్ మరోటి!

'ఈ పిల్ల దగ్గర ఇంత ఆటుందని ఊహించలేదు! తెలిసుంటే ఈ ప్రమోషన్ తాయిలం చూపించేవాడు కానే కాదు!

ప్రమోషన్ ఇవ్వాల్సొస్తుందని కాదు గాని, వాసుదేవరావు బాధ.. ఇక ముందు ఈ ఆశతో ఆమెనో, ఆ ప్లేస్ ను ఆశించే మధురిమనో  ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉండదేమోనని.

'ఎలాగైనా సరే.. మూడో సారి ఆమె రాజును దిగ్బధం చేసి ఆమెను తన కౌగిట్లో బంధించి తీరాల్సిందే! రాక రాక వచ్చిన అవకాశం! మిలియన్ డాలర్ బిజినెస్ ను ఈజీగా  చేజిక్కించుఉన్న వాసుదేవరావ్.. ఒక మిడిల్ క్లాస్ ఆడపిల్లను చేజిక్కించుకునే విషయంలో తలకిందులయిపోతున్నాడు!

' గ్రాండ్ మాస్టర్ వాసుదేవరావు సర్వశక్తులు వడ్డి ఆటలో పావులు కదుపడం చాలా కాలం తరువాత ఇది మొదటిసారి.  

పల్లవి తదేకంగా బోర్డు వంకే చూస్తూ పావులు కదుపుతున్నది ప్రశాంతంగా. ఆమె పక్కనున్న గ్లాసులోని కోక్ మూడో వంతు కూడా పూర్తికాలేదింకా!

మరో పావు గంట తరువాత అర్థమయిది వాసుదేవరావుకు తాను పూర్తిగా డిఫెన్సులో పడిపోయాని.

ఉక్రోషం ముంచుకొచ్చేసిందీ సారి అతనికి. పెదాల దాకా వచ్చిన ముద్దులు మిస్సయిపోతున్నాయన్న నిస్పృహ ఒక వంక. ఊరించిందేదీ అవకపోగా, ఒక  మిడిల్ క్లాస్ గర్ల్ చేతిలో  ఓటమి పాలవబోతున్నందుకు అవమానం మరో వంక!

 ఒక చోట స్థిరంగా ఉండనీయని  మానసిక  వత్తిడి  నేపథ్యంలో  వాసుదేవరావ్ తొందరపడి వేసిన తప్పుడు ఎత్తు నుంచి సత్వరమే లాభం పిండుకుంటూ 'చెక్' అనేసింది పల్లవి.

వాసుదేవరావు కళ్లు బైర్లుకమ్మాయొక్కసారి! తన రంధిలో తానుండగా పల్లవి తెలివిగా ప్రత్యర్థి రాజును గోతిలో దింపేసింది. ఆ రాజును తప్పించే దారింకే మాత్రం కనిపించలేదు వాసుదేవరావుకు శతవిధాల ప్రయత్నించినా.. పది నిమిషాల పాటు.  

రెండు వేలు పారేసి  రాజుకు అవకాశం ఇప్పించవచ్చు. అడిగితే ‘కాద’నే సాహసం ప్రయివేట్ కంపెనీల కింది ఉద్యోగుల్లో ఉండదు. కానీ, ఒక సబార్డినేట్ ముంచు చేతులు చాచి చులకన అయ్యే కన్నా .. ఆమె తపించే ఆ ప్రమోషనేదో  పారేస్తే  తన పరువు నిలబడుతుంది.. తన  దృష్టిలోని ఇమేజ్ కీ భంగం వాటిల్లకుండా కథ సుఖాంతమవుతుంది.

తరువాతయినా ఆమె  ముందు  ఇహ ఎన్నటికి ఇంతకన్నా మెరుగైన ప్రదర్శన చేయగలడన్న ఆత్మస్థయిర్యం సన్నగిల్లిన బాస్ వాసుదేవరావు  పూర్తిగా డిస్టర్బయిన మూడ్ లో పల్లవి ప్రమోషన్ ఆర్దర్ మీద అప్పటికప్పుడు సంతకం గిలికేశాడు.

---

'మన బాస్ చెస్ లో గ్రాండ్ మాస్టర్ కదే!. నువ్వేమో అసలు చెస్ ఆటంటేనే బొత్తిగా గిట్టనిదానివాయ! అయినా,, అంత ధైర్యంగా పందెం ఎలా కాశావ్! అందులోనూ ఇలాంటిది?!..' అని అడిగింది వనజ రిటనొచ్చిన తరువాత ఆఫీసు క్యాంటీన్లో కూర్చుని ఈ తమా’షా’ కథంతా విన్న తరువాత.

'నాకు ఛెస్ లు చెక్ లు.. అంతగా తెలీని మాట నిజమేనే! .. కానీ మగాడి నైజం మా బాగా తెలుసు! కాబట్టే మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా  చేతి మీద వరకు మాత్రమే ఆ దిక్కుమాలిన ముద్దు కథ నడిపించా!  అసలు ‘ముద్దు’ ప్రపోజల్ కే ఓకె అనడం తప్పంటావా? తప్పనప్పుడు.. మనకై మనం తప్పు చెయ్యనప్పుడు ఏదీ ‘తప్పు’ కాదు! ఇది మా బామ్మ నాకు నేర్పిన తన కాలం నాటి పాఠం!’ అంది పల్లవి చల్లగా నవ్వేస్తూ!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక 16 -10 -2008 లో ప్రచురితం)   

  

 

హాస్యం : కోతోపనిషత్తు - కర్లపాలెం హనుమంతరావు

 


.

హాస్యం : 

కోతోపనిషత్తు 

- కర్లపాలెం హనుమంతరావు 

| ఈనాడు - 23-10-2002 నాటి దినపత్రిక సంపాదక పుట ప్రచురితం ) 

యేమినాయ్ మైడియర్ షేక్స్పియర్ ముఖం వేలవేసినావ్? 


పరీక్ష పోయింది. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కోతలు కొయ్యడవేగాని ఒక్కమారయివా ఒక్కముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ? 

డామిట్ ఇది చేసిక్ ఇన్గ్రాటి ట్యూడ్ ! నీ తెలివితక్కువతను చూస్తుంటే నాకునవ్వొస్తుంది. నాతో మాట్లాడటనే ఒక ఎడ్యుకేషన్. మీ నాయన ములక అగ్నిహోత్రావధాన్లు రాతకోతల పని ఉచితంగా నాచేత

చేయించుకోవాలనే దుర్బుద్ధితోనే అయినా నన్ను మీ ఇంట్లో ఉండనిస్తున్నారు కాదా? రాత సంగతెలా వున్నా మన కోతలకి డోకా

లేదని ఆయనకు నమ్మకం కలగబట్టే నాకీ సదుపాయం దక్కింది. దేరీజ్  నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ ఫర్ డజ్ నాట్ సర్వ్ యూజ్ఫుల్ పర్పస్ కోతల యొక్క మజా నీకింకా బోధపడక పోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది మిలియన్ పేజెస్ ఆఫ్ బ్రాగింగ్ గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు ఉంగయిపోయినారు . గాడ్స్ క్రియేషన్లో ఆవులూ, చేగోడీలూ, విడవలూ కన్నా ' కోతలూ' అనే పదార్థం ఉందే  అది ప్రథమ స్థానంలో ఉంది. 

ప్రపంచమందుండే వస్తువులన్నింటిలోకి ముఖ్యమైనవి విధవలు అని మీరే కదా ఇంతకుముందు అన్నారు?

'ఓపినియన్ని అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే గాని  పొలిటీషియన్ కానేరడు.  గాడ్స్ వర్ లో క్ ఈ కోత అనేది ఒక ఉత్తమోత్తమమైన సృష్టి చిత్రం! నీ పేరులోనే ఒక కోత వుంది.. చూశావూ? 

అదెలాగా?! 

వెంకటేశం అనగా వెంకట్ . ఈ వెం ' కట్ ' అంటే కోత అనే కదా అర్ధం!  ఇంకా కోతలు కోయటం చేతగాకపోతే భారతంలోని ఉత్తర కుమారుడు ఉత్తకుమారుడిగా మిగిలిపోయుండేవాడు.  అవునా..

మీకేమీ ఎన్నై నా చెబుతారు. పరీక్ష పాసు కాలేదని తెలిస్తే మా తండ్రి 'ఊచకోత' కోస్తాడు. 

దట్సిట్! అనగా మీ నాయన కూడా కోస్తాడన్నమాట. కోతల పురాణం

విప్పానంటే  ఎంత మైరావణుడయ్యేది గోతిలో పడాలనే కదా బృహన్నారదీయంలోని పదునాల్గవ ఆశ్వాసం విశ్వాసం.  సావకాశంగా

కూచుంటే  కోతలు కూడా మంచివేనని  నీతోనే ఒప్పిస్తాను. కోత అంటే నువ్వేమనుకొంటున్నావో ముందు అది చెప్పు

కోతంటే ఎవరైనా అనుకొనేది ఏముంది గురూగారూ! రేషన్ కోత, డీయే కోత..  ఇలాంటివే ఇంకా ఇలాగే ఏవేవో కోతలు. . 

అట్టె.. అట్టె! అక్కడ నిలు.! కరెంటు కోతల్ని గురించి ఒక్క ముక్క చెప్పనీయ్ ! ఎన్నికల ముందే పార్టీ అయినా ఇరవైనాలుగ్గంటలూ  కరెంటిస్తామనే కదా కోతలు కొస్తుందీ! ఆ ఇచ్చేదేదో ఉచితంగానే మేమూ ఇస్తామని ఎదురు పార్టీవాళ్ళు పైకోత కోస్తారు. మా తొలి సంతకం కరెంటు ఫైలు మీదే అని ప్రకటిద్దామనంటే తొలి వేలిముద్ర- అని సవరించాలని అందులోని అంగూఠా  గ్రూపు అడ్డుకోత వేస్తుంది. ఇవన్నీ ఎన్నికల ముందు కోతలు:

ఎన్నికల తరవాత, కోతలు ఇందాక నేనన్నానే ... అవి.. అందరికీ తెలిసిందేగా! 

నీ బుద్ధి యలా వికసిస్తుందో చూశావా? ఇలా తర్పీదవుతుంటే నువ్వు కూడా పెద్ద పొలిటీషియనువవుతావు' 

అనగా పొలిటీషియనులందరూ విధిగా కోతలు కోస్తారని మీ ఆలోచనా గురూ? 

అందుకు సందేహం ఏముంది? కోయటం రానివాడు  పాలిటిక్సు దాకా ఎందుకు, పేకాటకే  పనికిరాడు. కోతకు ప్రైకోత  కోస్తూ  పోయేవాడే అంతిమ విజేత.  పొలిటికల్ పార్టీల మేనిఫెస్టోలన్నీ నథింగ్ బట్ మేనిప్యూలేషక్స్ అని  బెర్ట్రెండ్ రస్సెలనే దొరవారు ఎప్పుడో సెలవిచ్చారు. ఏటా కోటి ఉద్యోగాల ఏర్పాటు అంటే భీమునిపట్నానికి పాలసముద్రం తేవటంలాంటి ఏర్పాటన్నమాట.  సన్మాన పత్రాలు అనబడు  ఫెలిసిటేషన్‌  పత్రాలు కూడా ఈ కేటగిరీ కిందికే వస్తాయి. కానీ, వీటికి లైట్ గా లిటరరీ టచప్ ఇవ్వాలంటుంది. ఒక్క ముక్క నిజం కక్కినా  టెక్స్ట్ వెయిట్ తగ్గి వెలవెలాబోతుంది. వివిధ రంగాల్లోని కోతల్ని పరిశీలించి, పరిశోభించి  వాటి తాలూకు యస్పెన్సుని నిగ్గుతీసి నే ఒక కొత్త థియరీతయారుచేశానోయ్ ! . నోటు బుక్కు  తీసి రాసుకో  మై బోయ్!  కోత అనేది  సాంఘిక సంక్షేమం, సౌభాగ్యం, సంస్కృతీ.. గట్రా గట్రా లకు సంబంధించిన వ్యవహారమనేది నా థియరీ లోని మొదటి పాయింటు.

అదెలాగా?! 

పేషెన్స్!  కొసాకి  విను ! కోతల్లేకపోతే కుటుంబ నియంత్రణ ద్వారా సంక్షేమానికి ఆస్కారమేదీ? పంటలు కోస్తేనే గదా  ధాన్యం దిగుబడి అయ్యేదీ!  రైతెంత ఎక్కువ  కోస్తుంటే దేశంలో అంత సమృద్ధిగా  సంపద ఉన్నట్టే కదా లెక్క!  ఇహా సెన్సారువారు నెన్నారు సరిగ్గా కోతలు వేయకనే సాంస్కృతిక కాలుష్యం దినదిన ప్రవర్ధమానమవుతొందని  మీలాంటి మేధావులు మధనపడుతున్నారు. కోతల కింత కథుంది కనకనే కోడి కూడా ఘడియ ఘడియకీ  కోకోరోకో  అంటూ అరుస్తూంటుంది. అంటే ఏంటట మీనింగ్ ?  కొద్ది కొద్దిగా  రోజంతా కోస్తూనే వుంఉండోయ్ - ఆవటా అని గుర్తుచేయటమన్నమాట. ఇది బహ డిస్కవరి. 

ఆహా ఏమి డిస్కవరీ అండీ! 

 మరేమనుకున్నావ్;  నామాట వింటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతటివాడిని చెయ్యనూ? పూజా నమస్కారాల్లేక్  బూజెక్కు  న్నానుగానీ గ్లాడ్స్పన్‌  లాగా దివాన్గిరీ  చలాయించాల్సిన జాతకం కదు బోయ్  మనది! ఇహ జాతీయ అంతర్జాతీయ విషయాలకొద్దాం. కులాతీత మతాతీత ప్రజాస్వామ్యమంటారే. అది ఓహ పెద్ద జాతీయ కోతని  నా ఉద్దేశం. మూడేళ్ల పాలనయిందని మొన్న వాజపేయిగారు మీటింగు పెట్టి థణుతులెగిరి పోయేటట్లు   ఎన్ని బడాయిలు పోయారూ!  శాంతికోసం యుద్ధమంటూ అమెరికావాడూ అవే టైపులో అడపాదడపా అంతర్జాతీయ లెవల్లో అడిగినవాడికి  అడగనివాడి క్కూడా నీతులు బోధిస్తూ ఒకే ధ్యానం చేస్తుంటాడు. కోయగా కోయగా కోతలు నీతులవుతాయని గదా గోబెల్స్ మహాశయుడెప్పుడో సెలవిచ్చి

ఉన్నారు. వీటన్నింటిలో టూథౌజండ్ ట్వంటీ ట్వంటీ విజననే ప్రాంతీయ కోత కొంతలో కొంత నయం. ఇహ సామాజిక రంగానికొస్తే నూరు కోతలు కోసైనా  సరే ఒక వివాహం చేయిస్తే పుణ్యమని కదా అమరనిఘంటువు అఘోరిస్తున్నదీ! కళారంగంలో అయితే కోతల కున్న స్థానం అద్వితీయం . ఎంత పెద్ద హీరో అయినా తెరమీద పిట్టలదొరలాగా కోతలు కోయందే చప్పట్లు పడవు.  అంతెందుకు.. బొడ్డుకోతతో మొదలయిన మానవజీవితం మృత్యువాత బడేముందు వైద్యుడి కత్తికోతతో కదా అంతమవటం! ఈ రెండు కోతల నడుమనా  మనిషికింకా కడుపుకోత.. ఊచకోత .. రంపపు కోత..  జుత్తుకోత.. జేబుకోత .. ఇంకిలా సవాలక్ష కోతలు.  నిత్యజీవితంలో కోతలకింత ప్రాధాన్యత ఉంది కనకనే గీతలో కూడా  ' కోసేదీ నేనే .. కోయించేదీ  నేనే! నీవు నిమిత్తమాత్రుడివ' ని కదా జ్ఞానబోధ చేసిందీ! కోతలు కోయటయనునది ఒక గొప్ప కళ ' ఎడ్యుకేషన్ లేక , చాలక, రీజన్ తెలీక మీ మాస్టారు వంటి అభాజనులు నేను కోతలు కోస్తానని కొక్కిరిస్తారు. నన్ను మించిన కోతలరాముళ్ల ప్రభా ఇవాళ అన్ని రంగాలలోనూ వెలిగిపొతున్నదని తెలుసా? దిన్నంతటి లెవెలుకు తీసుకువెళ్లాలని తాపత్రయపడుతుంటే ధేంక్  చెయ్యక నన్ను తప్పు పడుతున్నావూ! 


తప్పయిపోయింది. క్షమించండి గురూ.


'డోంట్ సే దట్! ఒక ఉపనిషత్తులో శిష్యుడు ప్రశ్న అడుగుతూ వుంటే గురువు సమాధానం చెబుతుంటాడు. ఆ గురువు లాంటి గురువును నేను . ఆ శిష్యుల్లాంటి శిష్యు డివి నువ్వు.  మన ప్రశ్నోత్తరాలు యవరైనా  అచ్చొత్తించి పారేశాడంటే, ఒహ రెండొందల ఏళ్ల తరువాత సచికోత్తమ  ఉపనిషత్తుకు మించి నచి ' కోతల'ఉపనిషత్తయి జాతికి మార్గం చూపిస్తుంది . నాదీ గేరంటీ! 

'గురువుగారూ!  ఇంక మంచం కింద నుంచి టైటికి రావచ్చు. పూటకూళ్లమ్మీపూటకు గ్యారంటీగా రానట్టే.. ' 

ఈ చీపురు కట్టేంటీ! హమ్మ! .. ఈ ముండిక్కడే నక్కిందీ! వెంకటేశం! .. నన్నే బురిడీ కొట్టిస్తావుటోయ్! కలికాలం. డ్యామిట్ .. కథ అడ్డం తిరిగింది . 


***

కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 23-10-2002 నాటి దినపత్రిక సంపాదక పుట ప్రచురితం ) 

గిల్టీ -చిన్నకథః రచనః కర్లపాలెం హనుమంతరావు


 "సార్!"

అతను గదిలోకి వచ్చినట్లు గమనించక పొలేదు. కావాలనే చూడనట్లు నటించాను.

కారణం ఉంది.

ఇంట్లో ఇందిర రాత్రి చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది.

"మీ ఆఫీసులో సుబ్బారావనే పేరున్న వాళ్లెవరన్నా ఉన్నారా?

"ఉంటే?!"

"అతగాడి తల్లికి రేపు హార్ట్ ఎటాక్ రాబోతుంది. 'స్టార్ట్ ఇమ్మీడియట్లీటైపు ఫోన్ కాల్ వస్తుందివెంటనే మూడు రోజులు క్యాజువల్ లీవు కావాలని  మీకు లీవు లెటర్ ఇవ్వబడుతుందిమీ చేత 'సాంక్షన్డ్మార్క్ చెయించుకుని సదరు సుబ్బారావు వేంచేసేదెక్కడికో తెలుసా సార్?"

"ఎక్కడికీ?!"

"వేసవి  కదాచల్లగా ఉంటుందని.. ఊటీకి. ఈ పాటికే అతగాడి ఇంట్లో ప్రయాణానికని అన్ని ఏర్పాట్లూ ఐపోయాయి కూడా. తెల్లారంగానే తమరు సెలవు మంజూరు చెయ్యడమే కొరవడింది”. 

"ఇవన్నీ నీకెలా తెలుసోయ్!" ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నాకు.

"లేడీసుమండీ బాబూ మేంమీ పురుష పుంగవులకు మల్లే  'కంటబడిందంతా కటిక సత్యం..  చెవిన బడిందంతా గడ్డు వాస్తవంఅని నమ్మే చాదస్తులం కాం. సదరు సుబ్బారావు గారి సహధర్మచారిణి నోటినుంచే రాలిపడిందీ  స్కెచ్.  నేను తన హబ్బీ బాసు తాలూకు మనిషినని తెలీక నా ముందే పాపం నోరు జారిందిమీ కొలీగు రంగనాథంగారి చెల్లెలు సీమంతంలో బైటపడింది  సుమా ఈ కుట్రంతా" అంది ఇందిర.

బాసుని నేను. నా కన్నుకప్పిఅబద్ధాలు చెప్పి తప్పించుకుని తిరగాలనేఆ క్షణంలోనే ఈ ధూర్తుడితో ఎంత మొండిగా వ్యవహరించాలో డిసైడ్ చేసుకుని ఉన్నా.

---

"సార్!ఒక చిన్న రిక్వస్టు"

"తెలుసుమీ అమ్మగారికి హార్ట్ ఎటాక్. 'స్టార్ట్  ఇమ్మీడియట్లీఅని ఇంటినుంచీ కాల్. నీకర్జంటుగా మూడు రోజులు క్యాజువల్ లీవు శాంక్షన్  చేయాలి. యామై రైట్?"

ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేశాడు ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు "సార్! మీకెలా తెలిసిందిప్లీజ్ .. శాంక్షన్  మీ లీవ్ సార్!" 

సుబ్బారావు కళ్ళల్లో నీళ్ళు.

ముందుగా అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంటు చేసే టైమొచ్చింది. దొంగేడుపులకే  మాత్రం ఛస్తే లొంగరాదు

సాధ్యమైనంత విచారాన్ని గొంతులో రంగరించుకుని  "సారీ సుబ్బారావ్రేపు ఆడిటర్సు వస్తున్నారు ఇన్స్పెక్షనుకి. మొదట్నుంచీ నువ్వే చూస్తున్నావుగా ముఖ్యమైన ప్రాజెక్టు రిపోర్టులన్నీ! నువ్వు లేకుంటే ఎలాగాకావాలంటే వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత నువ్వూ వెళ్ళి రావచ్చు.. ఒక్క పూట. ఓకే ..నౌ ..యూ కెన్ గో అండ్ గెట్ రడీ ఫర్ ఆడిటింగ్"అని అప్పుడే గుర్తుకొచ్చినట్లు ఫోనందుకున్నా.

"సార్మా అమ్మ ఇప్పుడు గుండె నొప్పితో అల్లాడిపోతుంటే ఎప్పుడో ఆడిటింగయిన తరువాత వెళ్లాలాఅప్పటిదాకా ఆమెకేమీ కాదని మీరెవరన్నా భరోసా ఇవ్వగలరా?"

బాగానే రక్తి కట్టిస్తున్నాడూ నాటకాన్నీఈ సుబ్బారావులో ఇంత పెద్ద కళాకారుడున్నాడని ఇప్పటిదాకా తెలీదేఒక్క అతగాడికేనా నటనా కౌశలం తెలిసింది!  నేను మాత్రం తక్కువ తిన్నానా!"

పాత సినిమాల్లో రంగారావు  మార్క్ గాంభీర్యం ప్రదర్శిస్తూ "ఐ సెడ్  సుబ్బారావ్ ! నౌ యూ కెన్ గో!  లెట్ మీ డూ మై డ్యూటీ.. ప్లీజ్!" అనేసి సెల్ రిసీవర్లో తల దూర్చేశాను.

మరో మూడు నిమిషాల పాటు అలాగే  కన్నీళ్ళతో మౌనంగా నిలబడి  చివరికి వెళ్ళిపోయాడు సుబ్బారావు.

---

 "నన్నెప్పుడూ ఓ మెతక వెధవ కింద  జమ కడతావుగా నువ్వుఇకనైనా  నీ అభిప్రాయం మార్చుకుంటే బెటర్.. బెటర్ హాఫ్ గారూ" అంటో  ఆఫీసులో జరిగిందంతా  ఇంట్లో ఇందిరకు చెప్పేశాను  గొప్పగా.

సాంతం విని తాపీగా అంది ఆ మహాతల్లి "నిన్న నేను పొరపడ్డాను సుమండీ! ఊటీ చెక్కేద్దామనుకున్న సుబ్బారావుది మీ సెక్షను కాదట. మీ పక్క సెక్షన్ కొలీగ్ రంగనాథంగారి  స్టెనోగ్రాఫర్ ఆ సుబ్బారావు.  శుభ్రంగా సెలవులు పుచ్చేసుకొని  ఊటీ చెక్కేసాడు కూడా ఈ పూటమాటల సందర్భంలో రంగనాథంగారి మిసెస్ అంది ఇందాక. అతగాడి పెళ్ళాం తెచ్చే మేలు రకం ముత్యాల కోసం ఎదురు చూస్తుంటేనూ ఇక్కడ ఈవిడగారూ..!

ఇందిర ఇంకేదేదో చెబుతున్నది కానీ..

ఆ క్షణంలో మాత్రం  నాకు .. న్నీళ్ళు నిండిన కళ్లతో  ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు మొహమే కనబడింది

చలా గిల్టీగా అనిపించింది.

-కర్లపాలెం హనుమంతరావు

23 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

 

 

గల్పిక : వానా! వానా! వల్లప్పా! - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం )

 


గల్పిక : 

వానా! వానా! వల్లప్పా! 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం ) 


జోరున కురిసి వాన వెలిసిన మరుసటి నిమిషాన దారంతా గోదారై  పొంగి పోర్లే వేళ మా బడి పిల్లల చంకల్లోని సంచుల్నుంచీ ఎన్ని పడవల పుట్టేవో! పసి సందేశాలను ఏ పసిడి దేశాలకు మోసుకుపోవాలనే తుళ్లుతూ తూలుతూ సాగే తన చిట్టి పడవ ఠక్కున  ఏ చెట్టు కొమ్మకో

చుట్టుకుని  చిరిగి కంటిముందే మునిగిపోతుంటే నవ్వాడని కసికొద్దీ పక్కవాడి మీద కలబడి నేన నీల్లలో పడి  తడిసి ముద్దయి వణుకుతో  ఇంటికొస్తే అమ్మ తిట్టి చూరు కింద  గోరువెచ్చని నీళ్లతో

తలంటుపోసిన తొలిదినాల తొలకరి చినుకుల పలకరింతల పులకరింతలు... ఓహ్ .. మరపురాని ఆ మధుర క్షణాలు తిరిగి వచ్చేనా! 


ఏవీ ఆ జడివానల జాడలిప్పుడు? ఏవీ ఆ కారుమబ్బుం దారుల బారులు? ఏరీ ఆ వరుణదేవుని  కరుణ కురిసే అమృత ధారలు? 


జులై నెల జలమాసం రోజులు.  జన్మభూమి జోరుగా జరుగుతున్నది. గ్రామసభలు కిక్కిరిసిన జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఏ నోట విన్నా ఒకటే మాట..  వాసకావాలి! 

మరి మన అధికారులు ఏమనుకుంటు న్నారో విందామా ? బోలెడంతా  కామెడీ అక్కడే పుడుతుంది.

***

'రుతుపవనాలేమన్నా  రుణానికిచ్చే సొమ్మా? ఒత్తిడి పెడితే వాయుగుండాలవటానికి మేమేమన్నా సముద్రాలమా?  తొంద రపడితే ఎలా? మేమందరం వానలు కురి పించే పనిలోనే ఉన్నామయ్యా!  మీడియా .. ఏదైనా ఐడియా తడితే మీరూ చెప్పచ్చుగా.. ఆలోచిస్తాం! 


'గాడిద చెవులు నులిమితే వానలుపడతాయని గార్దభశాస్త్రం చెబుతుందండీ!

ఊరికో గవర్నమెంటు గాడిదను సరఫరా

చేస్తే వానబెడద వదిలిపోతుందిగా! గాడిదలకూ కరువేనా? ...

'గాడిదలకు కరువు లేదు. చెవులకే కరువు. ఎక్కడ చూసినా నోరున్న గాడిదలే గానీ చెవులున్నవి కనిపిస్తేనా! 

కప్పల  పెళ్ళిళ్లు చేయిస్తే కచ్చితంగా వానలు పడితీరతాయని మా ముత్తాతల కాలంనుంచీ మొత్తుకుంటున్నారండీ! కప్పులకైలే  కరవుండదేమో!


మండినట్లే వుందయిడియా! ఎండలు మండిపోతున్నాయి గదా! మండూకాలెక్కడ దొరుకుతీయండి!  అయినా మీకోసమని .. చైనా నుంచైనా సరేనని కప్పల్ని తెప్పించి ఘనంగా పెళ్ళిళ్లు చేశామా...! భారీగా కురిశాయి వానలు.. . చైనాలో! 


అందుకే పొరుగున ఉన్న వాళ్ళు అతిజాగ్రత్తగా స్థానిక గాడిదలనే  చూసి మరీ పెళ్ళిళ్లు చేస్తున్నారు సార్! 

అయినా వర్షాలు  కేరళలో కురిశాయి చూశారా! వరదలొచ్చాయని కేరళ వాళ్లి ప్పుడు తమిళనాడుతో తగవుకెళ్ళారు. 


నీటి తగాదాలు ఈనాటివా గానీ... యాగాలన్నా చేయించండి సారూ!  ఆ అభిషేకాలకన్నా మేఘాలు 'షేక్' అయి వానలు పడతాయేమో చూద్దాం'


ఆ ప్రయోగమూ అయింది బాబూ! ప్రయోజనం లేకుండా పోయింది. యోగమున్నప్పుడే చినుకులు పడతాయంటే మీరంతా ఆగం చేస్తుంటిరి! సరాసరి వర్ష పాతం .. లెక్క ప్రకారం సరిగ్గానే ఉంది మరి! 


'చుక్కలు పడాల్సింది మీ బుక్కల్లో కాదండీ! దుక్కుల్లో!  దున్నలేక బక్క రైతు 

దిక్కులు చూస్తున్నాడు. తాన్సేన్ లాంటి వాళ్లు  మళ్లీ వచ్చి ఏ మేఘమల్హారమో అమృత వర్షిణో ఆలపిస్తేగాని మాన్ సూన్ తో సంబంధం లేకుండా మనకు వర్షాధారలు కురిసిపోతాయని నమ్మకమా? 


తానే అపర ' సేన్ ' అంటూ తబలా బాదుకునే ఓ పెద్దాయన చేతా ఈ మధ్యా సంగీత కచేరీ యేదా పెట్టిస్తిమిగా! వానలు పడ్డాయా ? వడగళ్లు  పడ్డాయిగానీ! 

పడే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకోమని మన ప్రధాని పిలుపిచ్చాడు.  వినిపించదా?  ఆయనా సాయం చేసేవాడే గానీ పాపం, మోకాలు పీకుతుందని  వెనకాడు తున్నాడు. ఈ గొడవంతా ఎందుకని అయిదేళ్ల కిందట గాడిపొయ్యిలు పెట్టి బాగా పొగపెట్టాం గుర్తుందా? వేడికి మేమాలు కరిగి కురుస్తాయని మా ప్లాను. 


పొగపెట్టటం మీకు  బాగా అలవాటేగా! మరి మేఘాలు కురిశాయా సార్?

ఏమైంది?


విఫలమైంది. పడ్డ నాలుగు చినుకులకు పొయ్యిలు ఆరిపొయ్యాయి. 


అందుకేనా ఈసారి ఉప్పు , సుద్దపొడి కలిపి చల్లాలని చూస్తున్నారూ? సుద్దపొడి పాళ్లెక్కువయి సున్నంవానా  పడితే ఉన్న పొలాలు కూడా సున్నబ్బటీలయి కూర్చుంటాయి బాబో;  వానలు కురిపించటంలో మనమింకా ఓనామాల దశ కూడా దాటినట్లు లేదు. రష్యావాడిని  చూడండి!  రుష్యశృంగుళ్లా  ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ వానలు కురిపించ గలడు.. ఆపించనూగలడు.  ఆర్టిఫిషియల్ రైన్ కురిపించే ఆ అర్టంతా  మనవేదాల్నుంచి  కొట్టేసిందేనని కొండు భట్టు ఎంతగా గుండె బాదుకుంటే  ఏం లాభం? క్లౌడ్ సీడింగే మళ్లా  మనకిప్పుడు గతి అయింది.  కా మళ్ళీ గతయింది. 


క్లౌడ్ సీడింగంటే... మేఘాల్లో విత్తనాలు చల్లే స్కీమేగా! భూమ్మీద జల్లే

విత్తనాలకే అతీగతీ లేదు. మళ్ళీ మబ్బుల్లోనా ? అవ్వలాంటివి కావులేవయ్యా! 

దుమ్మెత్తి పోస్తే వానాపడుతుందని పుణే నించు నిపుణులొచ్చి చెప్పి  పోయారు! 

మనమా పనిలోనే ఉన్నామిప్పుడ

అందుకేనా మన బాబులు బహళ్ల మీ దొహళ్లు దుమ్మెత్తి పోసుకుంటోందీ! హాచ్! హా.. ఛీ! ఎంతలా అపార్థం చేసుకున్నాం. రుతుపవనాలను పాకిస్తాన్ పట్టుకెళుతుంటే చూస్తూ ఊరుకోవడం అమెరికా తప్పని ఒక రోజూ,  వాయుగుండాలను బంగ్లా వాళ్లa దారిమళ్లించుకెళుతున్నా  నోరు మూసుక్కూర్పోవటం యూఎన్వో  తప్పని ఇంకో రోజూ, పక్కనున్న కర్ణాటక మబ్బుల్నలా  తోలుకెళుతుంటే తోల్తీయడం పోయి సోనియమ్మ  తప్పని మనోళ్లు మైకట్టుకు  అరుస్తుంటే నిజంగా నీటికోసమే అంత మధనపడుతున్నారని అర్ధం చేసుకోలేక పోయాం సుమండీ!  ఒక్క ముక్క మాత్రం నాకర్ధమవటం లేదు సారూ .. విత్తనాల్నంత కృత్రిమంగా  తయారుచేసే మన మేధావులు వల్షాలనుకురిపించటానికి ఎందుకంత యాతన పడుతున్నట్లూ ! 

పుష్కరాలొచ్చి పడుతున్నాయి గదా! పుష్కలంగా నీరు కావాలంటే ఇహా ఒక్కటే  ఉపాయం. టీవీ ఛానెల్సులో  ఏడుపు సీరియళ్ల సంఖ్య ఇంకా బాగా పెంచండి!  చూసేవాళ్ల కన్నీటికి ఆనకట్టలు గాని కట్టేస్తే బంజరు కూడా బోలెడంత సాగు చేసుకోవచ్చు! 


లాభం లేదయ్యా!  వాటి మీద ఒరిజిన ప్రొడ్యూసర్స్ వాటాకొస్తారు' అని అది కారులు అంటుండగానే భోరున వాన కురవటం మొదలు పెట్టింది.

***


- కర్లపాలెం హనుమంతరావు 

(ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట - 14 -07 - 2003- ప్రచురితం ) 


వేసవి శిక్షణా శిబిరం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట- 13 -05 2003 - ప్రచురితం )



 వేసవి శిక్షణా శిబిరం 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట- 13 -05 2003 - ప్రచురితం ) 


పెద్దయిన తరువాత నువ్వేమవుతావు బాబూ?


పెద్ద సినిమా హీరో"


వద్దు. పేపర్లో చెడామడా రాసేస్తారు. ఎండలో కూర్చుని ధర్నా చేయాల్సొస్తుంది.


పోలీ పెద్ద సైంటిస్టునవుతా! ఏస్ట్రో నాట్ అవుతా! 


కల్పనా చావ్లాలా  గాల్లోనే ప్రాణాలు పోవాలా! 


ఐతే అయ్యయస్సో... ఐపీయస్సో అయిపోతానంకుల్! 


అరవయ్యేళ్లకుండానే రిటైరైపోవచ్చు. పైవాడితో పడకపోతే ముందే ఉద్యోగం ఊడొచ్చు'  ఐపీయస్ కైనా 'పీస్' ఏదీ? 'ఏ క్షణాన జైల్లో పిండి పిసుక్కోవాలో ఎవడికి తెలుసు? 


మరైతే ఎంచక్కా డాక్టరయిపోతే పోలా


బండ చదువు గొడ్డుచాకిరీ. ఇండియా దాటిపోలేవు


ఇంజినీరవుతేనో!


గంజినీరుక్కూడా గతుండదు. అమెరికా పోయినా ఎప్పుడు తరిమికొడతారో ఎవరికీ తెలీదు 


ఫైనల్గా ఏ స్పోర్ట్స్  మేనో ... ప్లీడరో అవుతా... సరేనా?


డోపింగ్ డేంజరుందిరా... బాబూ! ప్లీడరెందుగ్గానీ ..  నా మాట విని ఎంచక్కా పొలిటికల్ లీడరైపో! రిటైర్మెంటుండదు. పలుకుబడే తప్ప పనుండదు. విమానాల్లో తిరగొచ్చు.  ఖర్చులేని ప్రచారం.. బోలెడంత 'గ్లామర్' - అన్నాడు సుందరం.


సుందరం ఈ సమ్మర్లో కోచింగ్ కేంపొకటి పెట్టాడు. అందరిలాగా ఆటలూ... పాటలూ, డేన్సులూ... డ్రాయింగులూ.. కంప్యూటర్లూ... కళలూలాంటి రొటీన్ మేటర్ కాదు. రాజకీయ శిక్షణ శిబిరం. 


సుందరం దారే వేరు! 


మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం వెంటనే మా సెంటర్లోనే


చేర్పించండంటూ - మైకు పట్టుకుని సెంటర్లలో ఆరుచుకుంటూ కరపత్రాలు చల్లుకుంటూ మా ఇంటికొచ్చి పడ్డాడు! వాకిట్లో ఆడుకుంటున్న మా వాడి వాసన పసిగట్టినట్లున్నాడు.


'రాజకీయాలొకరు నేర్పిస్తే వస్తాయా  రక్తంలో ఉండాలి గానీ! అది భగవద్దత్తమైన కళ. అందరికీ అబ్బే విద్య కాదు  అన్నా భయంగా .


సాధనమున పనులు సమకూరు ధర లోన... ప్యూనుపోస్టుకైనా స్కూలు సర్టిఫి కెట్ చూపించమంటారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాంటి ముఖ్యమైన పదవులకయితే  మాత్రం ఏ ధ్రువపత్రం అక్కర్లేదా! ఎందుకూ కొరగాని వాళ్లందరూ ఎమ్మె ల్యేలూ ఎంపీలూ అయికూర్చుంటే.. దేశం... ఇదిగో ఇలాగే తగలడిపోతుంది. పాలిటిక్సు పొలిటీషియన్లు మాత్రమే చూసుకొనే వ్యవహారం కాదని చార్లెస్ డీగాలనే పెద్దాయన ఎప్పుడో చెప్పాడు. ఐదేళ్ల తర్వా త ఎప్పుడో జరిగే ఐ.ఐ.టి. పరీక్షలకు ఇప్ప ట్నుంచే కోచింగ్ ఇప్పించటంలా! పాలిటిక్స్ అంతకన్నా పవర్ఫుల్‌ సబ్జెక్టు.  ఎల్కేజీ నుంచే గ్రూమింగివ్వాల్సిన గ్రూపు గురూ!


పాలు తాగే వయస్సులో పాలిటిక్సెందుకన్నయ్యగారూ!- అని అడ్డం పడబోయింది మా ఆవిడ. 


 వాడూరుకుంటాడా?  ఉప వ్యాసం మొదలు పెట్టాడు. 


పిల్లలు గాలికి తిరిగి చెడిపోతున్నారని గదమ్మా విష్ణుశర్మ చేత పంచతంత్రం చెప్పించింది సుదర్శన మహారాజు! ఇంట్లో మీరు చెప్పుకుంటామనుకోకండి. హిరణ్యకశిపుడంతటి కర్కోటకుడే సొంతబిడ్డకు ఇంట్లో రాజకీయాలు చెప్పుకో లేక చండామార్కుడి దండనకొదిలేశాడు. మీవాడిని మా దగ్గర  పడేయండి. సురేంద్ర నాధ్ బెనర్జీ అంతటివాణ్ని చేసి పంపిస్తాం


సమ్మర్లోనేగా... ఎండకు పడి తిరక్కుండా ... వేస్తే పోలా! - అన్నా వాడి నస భరించలేక. 


మా ఆవిడ ఈ రాజకీయాలతో  రాజీపడలేకుండా ఉంది. పోయి పోయి పొలిటికల్ సెంటర్లో పడేయటమేందని ఆవిడగారి  గోల. 


ఏ కంప్యూటర్లో నేర్చుకుంటే బిల్ గేట్స్ కంపెనీలో కోట్లు సంపాదించుకోవచ్చు- అన్నదామె.


'పాలిటిక్సునలా కొట్టిపారేయకమ్మా! మీవారికి బదిలీ అయినా, మీ తమ్ముడికి ఉద్యోగమైనా పిల్లాడికి మంచి సీటైనా.. ఏ పొలిటీషియనో నోరు చేసుకోనిదే రాదు. శ్రీమహావిష్ణువు కలియుగం చివరి పాదంలో పొలిటికల్ లీడర్ గానే అవతారమెత్తుతాడని బ్రహ్మంగారి రివైజ్డ్ కాల జ్ఞానంలో రాసుంది. మీ బుడతడే ఆ రూపంలో పుట్టున్నాడేమో!... ఎవరు చూశారూ! యాగరక్షణ కోసమే బాలరాముడిని విశ్వామిత్రుడు తండ్రినుండి విడదీశాడనుకోవద్దు. సీతమ్మ వారితో పెళ్లి చేయించ లేదూ! మీ వాడు రాముడయితే... నన్ను విశ్వామిత్రుడనుకోరాదా తల్లీ!- అంటూ ఛక్ చకామని రశీదు చించి నా చేతిలో పెట్టాడు. 


షాక్ ! పదిహేను రోజులకు ఐదు వే ల రూపాయలా!!


మా రాముడి తల్లింకా మైకంలోనే ఉంది. పైకం సంగతి పట్టించుకొనేట్లు లేదు. 


మా రాముడిని రేపొచ్చేటప్పుడు ఏమేం తెచ్చుకోమంటారు విశ్వామిత్రులవారూ?- అనడిగింది తన్మయంగా.


' రెండు గంజిస్త్రీ ఖద్దరు అంగీలు . . నాలుగు టోపీలు... ఆరేడు గొడుగులూ! 


అన్ని గొడుగులెందుకూ?


ఏ ఎండకా గొడుగు పట్టాలి కదమ్మా!


మరీ లగేజి ఎక్కువైపోతుందేమోనే అమ్మా! అని గునిశాడు చిన్నాడు. సిగ్గుపడుతూ. 


'మరేం ఫరవాలేదు. సిగ్గు బిడియంలాంటివి వదిలేసి రారా నాన్నా: బరువూ... అడ్డం కూడా' అంటూ బైటకెళ్లిపోతోన్న  సుందరం వెంటబడ్డా.. సిలబస్లో అయినా ఏముందో చెప్పిచావరా' అంటూ. 


వెంటనే పొద్దున్నే ఓ గంట  యోగా.. గుద్దులాటలు.. 


గుద్దులాటలెందుకూ! సభలో రభస చెయ్యద్దూ! మధ్యాహ్న భోజనాలదాకా కుర్చీలు లాగటం, గోతులు తవ్వటం! గోడమీద కూర్చుని వీలూ చూసుకుని ఆటో.. ఇటో.. గెంతే ఆట వీలును బట్టి. ఫైనల్ గా  రోజుకో గంట అమరణ నిరాహా రదీక్ష! ఇవన్నీ మేమే ప్రాక్టీసు చేయి స్తుంటాం. మాటిమాటికీ వెల్ లోకి  దూసుకుబోయేది మాత్రం మీరింట్లోనే అలవాటు చేయించుకోవాలి. . వెల్ తవ్వించడానికి టైం పడుతుంది మా దగ్గర . బురద తెచ్చుకుంటే  మాతం  చల్లటం నేర్పిస్తాం  బూతులు బట్టీ పట్టిస్తాం . వారానికోసారి పాదయాత్రల తంతుంటుంది. ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్.. పిక్ పాకెటింగ్ గట్రా సబ్ జెక్టులు  మామూలే' అని నవ్వి వెళ్లి పోయాడు సుందరం.


మా వాడిని చూసి మా కాలనీలోనే ఇంకో నలుగురు చేరిపోయారు. వీడెక్కడ పోటీలేకుండా ప్రధానమంత్రపుతాడోనని భయం కాబోలు. 


అందరం కలిసి ప్రారంభం రోజున సుందరమిచ్చిన అడ్రసు వెతుక్కుంటూ వెళ్లాం . 


అక్కడ వేసవి శిబిరం లేదు. మొండిగోడ మీద కాగితమోటి అంటించివుంది. అదీ మా సుందరం' గాడిద  రాసిందే. 


" బాధపడకండి నమ్మినవాళ్లను నేక్ గా  ఎలా ముంచటమో, మొదటి

పాఠంలో నేర్చుకొన్నారు. రెండో పాఠం ఈసారి వేసవి శిక్షణా  శిబిరంలో! 


- కరపాలెం మమంతరావు

( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట- 13 -05 2003 - ప్రచురితం ) 


మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...