Wednesday, November 10, 2021

తప్పనప్పుడు .. - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

 

తప్పనప్పుడు ..  - కథానిక

 -కర్లపాలెం హనుమంతరావు

 

'నీకు ఛెస్ ఆట్టం వచ్చా?' సగం ఖాళీ అయిన గ్లాసులో మరంత విస్కీ   వంపుకుంటూ  అడిగాడు వాసుదేవరావు.

'ఏదో సార్.. కొద్దిగా! కాలేజీ డేస్..  కాంపిటీషన్లలో..  తప్పనప్పుడు.. ‘  అంది పల్లవి బాస్ తన సోడాలో వంపిన  కోక్ లో మరంత సోడా  కలుపుకుంటూ,

కాఫీనే తాగదు పల్లవి. బాస్ పదే పదే ప్రెస్ చేస్తే ఇల్స్స్ కోక్ అయినా తాగక తప్పింది కాదు.

రాత్రి తొమ్మిదిన్నర దాటింది. గ్లాస్ విండోస్ గుండా ఫ్రాంక్ ఫర్ట్ నగరవీధులు  మిరిమిట్లుగొలుపుతున్నాయ్! బాస్ ఎర్రబారుతోన్న   కళ్ల జీరల్లో నుంచి ఓ మగాడు తనలోకి తొంగిచూస్తున్నట్లు గ్రహింపుకొచ్చింది  పల్లవికి. పెళ్లీడు తెలుగు ఆడపిల్ల పల్లవి, మధ్య తరగతిది.    తడబాటెటూ  సహజమే! కాకపోతే,  అలవాటైన    వృత్తిధర్మం మెళుకువగా దాన్నో మూల   అదిమిపెట్టి ఉంచింది   

బైట  చలి.. లోపలి రూమ్-ఫైర్  వెచ్చదనం. ఆమెకూ ఇబ్బ౦దిగానే ఉంది కానీ, అన్నీ అందరికీ ఇళ్లల్లోనే చెప్పుకోలేని   పరిస్థితులు ఇవాళ్టివి.    ఒహ చోట కొలువంటూ కుదురుకున్నా కొన్ని సహించాలి.. తప్పవు!

 వయా రూట్  జర్మన్ ఫ్రాంక్ ఫర్ట్ లో హెల్డప్పయ్యన్నాడు ప్రస్తుతం  వాసుదేవరావు. యూఎస్  సియోటల్లో బిజినెస్  సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని  బ్యాక్ టు హైదరాబేడొస్తో..   అఫ్ఘనీ స్కైస్ ఫ్లైయింగికి  అనుకూలంగా లేకపోవడం చేత! 

కాంప్లికేటెడ్ ప్రొజెక్ట్స్ వచ్చినప్పుడు పర్శనల్ అసెస్టెంట్ పల్లవిని ఏరి కోరి తన వెంట తెచ్చుకోడం వాసుదేవరావుకో   సెంటిమెంట్.. ఆమె అదృష్టం బాగుండి ఈ సారీ ఎప్పట్లానే ఈ ఒన్ మిలియన్ ప్రాజెక్టు లైన్ షేర్     కంపెనీకే సానుకూలమవడంతో బాస్ మంచి జాలీ మూడ్ లో ఉన్నాడు. అది పసిగట్టే మూడోసారి తన ప్రమోషన్ విషయం కదిపింది పల్లవి  సియోటల్లో బైలుదేరినప్పుడే. వీక్ డేస్ టెన్షన్నుండి పూర్తిగా    రిలాక్సయే దారులు వెదికే బాసుకు  హఠాత్తుగా పల్లవి రిక్వెస్ట్  గుర్తుకొచ్చింది.  

మధ్య దారిలో ఇబ్బందులేవైనా వస్తే  ఫ్లైట్ తిరిగి రిజ్యూమయ్యే దాకా ఎగ్జిక్యూటివ్ క్లాస్  కు ఆ లైఫ్ స్టైల్ కు తగ్గట్లు  సూట్స్ అలాటయ్యే రూలొకటుంది.  నిబంధనల కింద తెల్లారి ఫ్లైట్  తిరిగి బయలుదేరే దాకా విశ్రాంతి తీసుకునే నిమిత్తం వాసుదేవరావుకో ఫైవ్ స్టార్ హోటల్ టాప్ మోస్ట్ ఫ్లోర్ చివర్న ఎకామిడేషన్ ఎలాటయింది. రిక్వస్టు మీద పల్లవికీ  పక్క రూమే ఇవ్వడంతో  వాసుదేవరావు మైండ్ ను   మొదటిసారి ఈ ఆలోచన మెలిపెడుతోంది..  పల్లవిని ఎలాగైనా తన ముగ్గులోకి దింపుకొని ఈ నైట్ ఎంజాయ్ చెయ్యాలని! ఒకప్పటి గ్రాండ్ మాస్టర్  మిస్టర్ వాసుదేవరావు పనిగట్టుకుని మరీ  చదరంగం ప్రస్తావన  తన ముందుక్కు తెచ్చిన ఆంతర్యం గ్రహించలేనంత అమాయకురాలైతే కాదు మిస్ పల్లవి.

 

పాతికేళ్ల పల్లవి ఇండియన్ ఫెమినిష్  ఎథీరియల్    బ్యూటీనంతా ఒకే చోట కుప్పేనంత అందంగా ఉన్నా,  ఇప్పటి దాకా ఆమె సెఫ్టీ జోనుకేమీ పరీక్ష ఎదురయింది కాదు. అందుక్కారణం తన బాస్ లోని  జెంటిల్ మన్ షిప్పేనని ఆమెకూ తెలియకపోలేదు.  కానీ, మొగాడులోని మొగాడు  ఏ క్షణంలో తన ప్ర'తాపం' చూపిస్తాడో ఎవడికి తెలుసు!  'వేరే దగ్గర మాత్రం ఇంతకు మించి మంచి వాతావరణం ఉంటుందన్న గ్యారంటీ ఏముంటుంది? తెలీని గందరగోళం కన్నా.. తెలిసున్న ఈ మేళంతోనే అప్రమత్తంగా ఉంటే సరిపోతుంద'న్న ఫిలాసఫీలో గల  మిస్ పల్లవికిప్పుడు దేశం కాని దేశంలో కొత్త సమస్య ఎదురయింది!

ఛెస్ బోర్డ్ మీద పావులు సర్దే పల్లవితో 'పందెం ఏంటి పల్లవీ?' అనడిగాడు వాసుదేవరావ్ సాధ్యమైనంత  చిరునవ్వు మొగంతో.

'మీతో నాకు పందేలేంటి సార్.. సిల్లీగా!' అంది పల్లవి సిగ్గుపడుతూ.

'పందెం లేకుంటే ఏ ఆటా పసందుగా ఉండదు మ్యాడమ్! జస్ట్ ఫర్ ఫన్ సేక్.. ఏదో ఒకటుండాలి'

'మీ ఇష్టం సర్! అదీ మీరే చెప్పండి! నా బుర్రకు అట్లాంటి  ఐడియాలు తట్టవ్!'

'ప్రమోషన్ అడుగుతున్నావుగా చాలా కాలం బట్టి! విన్నయితే  ఆర్డర్ ఇప్పుడే నీ చేతిలో పెట్టేస్తా!'

'మరి లూజయితే సర్?'

'ఏమీ లేదు' అన్నాడు బాస్ మరో సిప్ గొంతులోకి తీసుకుంటూ.

హర్టయినట్లు చూసింది పల్లవి 'అదేం బావుంటుంది సర్! ఏదో ఒహటి చెప్పండి.. చిన్నదైనా సరే.. ప్లీజ్' అంది పల్లవి దృఢంగానే.

‘ఆ స్వాభిమానమే ఈ పిల్లలోని  స్పెషల్ అట్రాక్షన్. వేరే ఎంప్లాయీస్ కు మల్లే తను దేనికీ దేబిరించదు!’ అనుకున్నాడు వాసుదేవరావు

'సర్సరే పల్లవీ! చెక్ చెప్పిన ప్రతి సారీ వెనక్కి తీసుకోడానికి నేనైతే ఓ 'కిస్' తీసుకుంటా! నువ్ గానీ చెప్పి వెనక్కు తీసుకుంటానంటే ఓ టూ థౌజంట్ కేష్ఇచ్చుకుంటా! ఎవరికైనా త్రీ రౌండ్సే ఛాన్స్. ఓకేనా?'

పల్లవి సైలంటయిపోయింది.

'పోనీలే! నీ కంత ఇదిగా ఉంటే.. ఆట వద్దులే! హాయిగా నీ రూముకు పోయి పడుకో పల్లవీ! ఎర్లీ హవర్సులో ఓ సారి వచ్చి నన్ను లేపి పో!' అంటూ ఆవులిస్తూ లేవబోయాడు వాసుదేవరావు.

'సరే సర్! ఈ ప్రమోషనూ, మనీ రెండూ నాకూ మా ఫ్యామిలీకి అవసరమే!' అంది పల్లవి.

'డోంట్ వరీ పల్లవీ! గెలుపోటములు ఏ ఒక్కరి సొత్తూ కాదు' అంటూ  సిసీలియన్ ఓపెనింగ్ వేశాడు వాసుదేవరావు. '

ఆట నడక ఆరంభమయింది.

పల్లవి బలగాలు వడివడిగా తరుగుతున్నాయి. వాసుదేవరావులో ఉత్సాహం పెరుగుతోంది. ఎదురుచూసే  అవకాశం ఇంత సులభంగా చేతికందుతుందని అతగాడనుకోలేదు. పల్లవికి చదరంగంలో కేవలం బేసిక్స్ మాత్రమే తెలుసు! కాలేజీ కాంపిటీషన్స్ కేవలం తన దగ్గర ప్రదర్శించిన డాంబికమే!

 ఐదు నిమిషాలయినా కాకుండానే 'చెక్' అన్నాడు వాసుదేవరావు.

రెండు నిముషాలు ఆలోచించి..'ప్లీజ్ విత్ డ్రా సర్!' అని  అడిగింది పల్లవి సిగ్గుపడుతూ.

'మరి.. '

‘ప్లీజ్! మరింకేదైనా పందెం చెప్పండి.. సులువైనది. రెండూ చెంపలూ వాయించుకోమంటారా.. అందుకు బదులుగా!’

‘సంపెంగ రేకుల్లా ఉన్నాయా చెంపలు! నువ్ తప్పు చేస్తే వాటికా శిక్ష?’ బిగ్గరగా నవ్వుతూ ‘సారీ’ అన్నాడు వాసుదేవరావ్ అదోలా బేలమొహం పెట్టి. తాగే డ్రింక్ చూపించే ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

'ఫస్ట్ టైం ! ఎంబ్రేసింగ్ గా ఉంది. తప్పదంటున్నారు.  పోనీ, ప్లీజ్! హ్యావ్ ఇట్ ఆన్ మై ఫోర్ హ్యాండ్ సర్!' అంది ప్లీజింగ్ వాయిస్ తో చేయి  ముందుకు చాపుతూ.

తామరతూడు వంటి ఆమె చేతిని అందుకొని లిప్ తో ఫోర్ హ్యాండ్స్ ను టచ్ చేస్తోంటే.. గుడెలు దడదడలాడాయి వాసుదేవరావుకు.  మనసు ఎటెటో వెళ్లిపోతోంది.. అధీనం తప్పి!

'చేతి మీదనే ఇంత రంజుగా ఉంటే ఇహ చెంపల మీదా.. ఆ పైన  లిప్స్ మీదా ..'

ఊహకే వాసుదేవరావ్ గుండెలు గుబగుబలాడాయి!

బాస్ చెక్ మూవ్ రివర్స్ చెయ్యడంతో ఆట మళ్ళీ ముందుకు సాగడం మొదలుపెట్టింది.

పల్లవి ఈ సారి అంత తొందరగా దొరకడంలేదు.  ‘తన దగ్గర ఇంత ఆట ఉందని ఇందాక అనిపించలేదే’ అనుకున్నాడు బాస్;

మరింత శ్రద్ధగా ఆట  మీద దృష్టి పెట్టినా ఈ సారి చెక్ చెక్ చెప్పడానికి పది నిమిషాలు టైం పట్టింది వాసుదేవరావుకు.

'వెనక్కి తీసుకోనా? అని అడిగాడు వాసు బాసు వాయిస్ లో కొంటెతనం పెంచి.  

'తప్పేదేముంది సర్!' అంటూ తలెత్తకుండానే చెయ్యందించింది పల్లవి.

'నో!.. నో!..నో! పునరుక్తి దోషం పనికిరాదు. 'ఈసారి' అంటూ తన చెంప చూపించాడు బాస్.

'మరి మూడో సారయితే?' భయంగా ఆడిగింది పల్లవి.

'అన్ని సార్లూ నేనే చెప్పాలనేముందమ్మాయ్? చూస్తున్నాగా! యూ ఆర్ ఆల్సో అ  స్మార్ట్ ప్లేయర్.' అన్నాడు బాసు పల్లవి మరీ బెదిరి వెనక్కివెళ్లిపోతుందెమోనని!

ఒక్క క్షణం ఆగి నిదానంగా అంది పల్లవి 'స్మాల్ రిక్వెస్ట్ సర్! ఈ సారిది.. అయితే గియితే మూడో సారిది కూడా.. ఒకేసారి తీసుకోవచ్చుగా! ప్లీజ్.. ప్లీజ్..'

'వై.. పల్లవీ.. ఎందుకలాగా?'

'సర్! నేను మీలాంటి గ్రాండ్ మాస్టర్ని కాను. రెండు,  అయామ్ జస్ట్ ఎ గర్ల్.. దట్ టూ ఎ నొవిస్!. మీ ఫస్ట్ కిస్ కే బాగా డిస్టర్బయ్యున్నాను సర్! ఇప్పుడే సెకండ్ ది కూడా అంటే ! ఈ మాత్రం కూడా ఆడలేను సర్! ప్లీజ్ కన్ సిడర్ సర్!'

అందమైన ఆడపిల్ల అలా అడిగేస్తుంటే  ఎ పురుషపుంగవుడికైనా ఎట్లా 'నో' అని బుద్ధేస్తుంది?

వాసుదేవరావ్ పల్లవిని హ్యాపీ మూడ్ లో ఉంచి ఎంజాయ్ చెయ్యాలని ముందు నుంచే ఫిక్సై ఉండె!

నొప్పించి పుచ్చుకునేవి, ఒప్పించి పుచ్చుకునేవి .. రెండింటి మధ్య ఉండే తేడా వాసుదేవరావ్ వంటి హై-క్లాస్ ఎగ్జిక్యూటివి తెలీకుండా ఉండవు! ఈ ముద్దులు వంటి శృంగార చేష్టలు బిట్లు బిట్లుగా కాకుండా ఒకె ఫ్లోలో ఇచ్చి పుచ్చుకుంటే పుట్టుకొచ్చే అనుభూతే కదా అసలైన అనుభూతి!

 నిజానికి పల్లవి కోరిక వల్ల తనకే మరంత ఉపయోగం! వెంట వెంటనే పక్కనా .. పైనా  గాఢంగా తీసుకునే ముద్దు  ఘాటుకు పల్లవి తరహా ఆడపిల్లలు మళ్లీ తేరుకోవడం అంత సులభం కాదు.  

తన పని అనుకున్న దాని కన్నా సులువయే సూచనలు కనిపించడంతో సంతోషంగా తలాడించి మంత్రిని వెనక్కు తీసుకుని బదులుగా బంటుతో ఎత్తువేసి ఆమెకు ఆడేందుకు అవకాశం కల్పించాడు బాస్ వాసుదేవ్ రావు.

మూడో సారి కూడా ‘చెక్’ చెప్పేసి ఎప్పుడెప్పుడు ఆమెను ఆక్రమించుకుందామా .. అని ఒహటే తొందరపెట్టేస్తోంది మనసు.

కానీ, ఎటు నుంచి వస్తున్నా ఆ పిల్ల మహా వడుపుగా తప్పుకుంటోందీ సారి.. కాలేజీ కాంపిటీషన్ల వరకే ఆమె అట.. అంటే.. నమ్మేందుకు లేదు!

వాసుదేవరావు ఆటలో తడబాటు ఎక్కువయింది. పొరపాట్లు చెయ్యబోయి సరిదిద్దుకున్నాడు .. భావోద్వేగం కలిగిస్తున్న వత్తిడి ఒకటైతే.. ఖాళీ అవుతున్న మూడో రౌండు గ్లాస్ మరోటి!

'ఈ పిల్ల దగ్గర ఇంత ఆటుందని ఊహించలేదు! తెలిసుంటే ఈ ప్రమోషన్ తాయిలం చూపించేవాడు కానే కాదు!

ప్రమోషన్ ఇవ్వాల్సొస్తుందని కాదు గాని, వాసుదేవరావు బాధ.. ఇక ముందు ఈ ఆశతో ఆమెనో, ఆ ప్లేస్ ను ఆశించే మధురిమనో  ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉండదేమోనని.

'ఎలాగైనా సరే.. మూడో సారి ఆమె రాజును దిగ్బధం చేసి ఆమెను తన కౌగిట్లో బంధించి తీరాల్సిందే! రాక రాక వచ్చిన అవకాశం! మిలియన్ డాలర్ బిజినెస్ ను ఈజీగా  చేజిక్కించుఉన్న వాసుదేవరావ్.. ఒక మిడిల్ క్లాస్ ఆడపిల్లను చేజిక్కించుకునే విషయంలో తలకిందులయిపోతున్నాడు!

' గ్రాండ్ మాస్టర్ వాసుదేవరావు సర్వశక్తులు వడ్డి ఆటలో పావులు కదుపడం చాలా కాలం తరువాత ఇది మొదటిసారి.  

పల్లవి తదేకంగా బోర్డు వంకే చూస్తూ పావులు కదుపుతున్నది ప్రశాంతంగా. ఆమె పక్కనున్న గ్లాసులోని కోక్ మూడో వంతు కూడా పూర్తికాలేదింకా!

మరో పావు గంట తరువాత అర్థమయిది వాసుదేవరావుకు తాను పూర్తిగా డిఫెన్సులో పడిపోయాని.

ఉక్రోషం ముంచుకొచ్చేసిందీ సారి అతనికి. పెదాల దాకా వచ్చిన ముద్దులు మిస్సయిపోతున్నాయన్న నిస్పృహ ఒక వంక. ఊరించిందేదీ అవకపోగా, ఒక  మిడిల్ క్లాస్ గర్ల్ చేతిలో  ఓటమి పాలవబోతున్నందుకు అవమానం మరో వంక!

 ఒక చోట స్థిరంగా ఉండనీయని  మానసిక  వత్తిడి  నేపథ్యంలో  వాసుదేవరావ్ తొందరపడి వేసిన తప్పుడు ఎత్తు నుంచి సత్వరమే లాభం పిండుకుంటూ 'చెక్' అనేసింది పల్లవి.

వాసుదేవరావు కళ్లు బైర్లుకమ్మాయొక్కసారి! తన రంధిలో తానుండగా పల్లవి తెలివిగా ప్రత్యర్థి రాజును గోతిలో దింపేసింది. ఆ రాజును తప్పించే దారింకే మాత్రం కనిపించలేదు వాసుదేవరావుకు శతవిధాల ప్రయత్నించినా.. పది నిమిషాల పాటు.  

రెండు వేలు పారేసి  రాజుకు అవకాశం ఇప్పించవచ్చు. అడిగితే ‘కాద’నే సాహసం ప్రయివేట్ కంపెనీల కింది ఉద్యోగుల్లో ఉండదు. కానీ, ఒక సబార్డినేట్ ముంచు చేతులు చాచి చులకన అయ్యే కన్నా .. ఆమె తపించే ఆ ప్రమోషనేదో  పారేస్తే  తన పరువు నిలబడుతుంది.. తన  దృష్టిలోని ఇమేజ్ కీ భంగం వాటిల్లకుండా కథ సుఖాంతమవుతుంది.

తరువాతయినా ఆమె  ముందు  ఇహ ఎన్నటికి ఇంతకన్నా మెరుగైన ప్రదర్శన చేయగలడన్న ఆత్మస్థయిర్యం సన్నగిల్లిన బాస్ వాసుదేవరావు  పూర్తిగా డిస్టర్బయిన మూడ్ లో పల్లవి ప్రమోషన్ ఆర్దర్ మీద అప్పటికప్పుడు సంతకం గిలికేశాడు.

---

'మన బాస్ చెస్ లో గ్రాండ్ మాస్టర్ కదే!. నువ్వేమో అసలు చెస్ ఆటంటేనే బొత్తిగా గిట్టనిదానివాయ! అయినా,, అంత ధైర్యంగా పందెం ఎలా కాశావ్! అందులోనూ ఇలాంటిది?!..' అని అడిగింది వనజ రిటనొచ్చిన తరువాత ఆఫీసు క్యాంటీన్లో కూర్చుని ఈ తమా’షా’ కథంతా విన్న తరువాత.

'నాకు ఛెస్ లు చెక్ లు.. అంతగా తెలీని మాట నిజమేనే! .. కానీ మగాడి నైజం మా బాగా తెలుసు! కాబట్టే మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా  చేతి మీద వరకు మాత్రమే ఆ దిక్కుమాలిన ముద్దు కథ నడిపించా!  అసలు ‘ముద్దు’ ప్రపోజల్ కే ఓకె అనడం తప్పంటావా? తప్పనప్పుడు.. మనకై మనం తప్పు చెయ్యనప్పుడు ఏదీ ‘తప్పు’ కాదు! ఇది మా బామ్మ నాకు నేర్పిన తన కాలం నాటి పాఠం!’ అంది పల్లవి చల్లగా నవ్వేస్తూ!

-కర్లపాలెం హనుమంతరావు

(ఆంధ్రభూమి వారపత్రిక 16 -10 -2008 లో ప్రచురితం)   

  

 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...