వేసవి శిక్షణా శిబిరం
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట- 13 -05 2003 - ప్రచురితం )
పెద్దయిన తరువాత నువ్వేమవుతావు బాబూ?
పెద్ద సినిమా హీరో"
వద్దు. పేపర్లో చెడామడా రాసేస్తారు. ఎండలో కూర్చుని ధర్నా చేయాల్సొస్తుంది.
పోలీ పెద్ద సైంటిస్టునవుతా! ఏస్ట్రో నాట్ అవుతా!
కల్పనా చావ్లాలా గాల్లోనే ప్రాణాలు పోవాలా!
ఐతే అయ్యయస్సో... ఐపీయస్సో అయిపోతానంకుల్!
అరవయ్యేళ్లకుండానే రిటైరైపోవచ్చు. పైవాడితో పడకపోతే ముందే ఉద్యోగం ఊడొచ్చు' ఐపీయస్ కైనా 'పీస్' ఏదీ? 'ఏ క్షణాన జైల్లో పిండి పిసుక్కోవాలో ఎవడికి తెలుసు?
మరైతే ఎంచక్కా డాక్టరయిపోతే పోలా
బండ చదువు గొడ్డుచాకిరీ. ఇండియా దాటిపోలేవు
ఇంజినీరవుతేనో!
గంజినీరుక్కూడా గతుండదు. అమెరికా పోయినా ఎప్పుడు తరిమికొడతారో ఎవరికీ తెలీదు
ఫైనల్గా ఏ స్పోర్ట్స్ మేనో ... ప్లీడరో అవుతా... సరేనా?
డోపింగ్ డేంజరుందిరా... బాబూ! ప్లీడరెందుగ్గానీ .. నా మాట విని ఎంచక్కా పొలిటికల్ లీడరైపో! రిటైర్మెంటుండదు. పలుకుబడే తప్ప పనుండదు. విమానాల్లో తిరగొచ్చు. ఖర్చులేని ప్రచారం.. బోలెడంత 'గ్లామర్' - అన్నాడు సుందరం.
సుందరం ఈ సమ్మర్లో కోచింగ్ కేంపొకటి పెట్టాడు. అందరిలాగా ఆటలూ... పాటలూ, డేన్సులూ... డ్రాయింగులూ.. కంప్యూటర్లూ... కళలూలాంటి రొటీన్ మేటర్ కాదు. రాజకీయ శిక్షణ శిబిరం.
సుందరం దారే వేరు!
మీ చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం వెంటనే మా సెంటర్లోనే
చేర్పించండంటూ - మైకు పట్టుకుని సెంటర్లలో ఆరుచుకుంటూ కరపత్రాలు చల్లుకుంటూ మా ఇంటికొచ్చి పడ్డాడు! వాకిట్లో ఆడుకుంటున్న మా వాడి వాసన పసిగట్టినట్లున్నాడు.
'రాజకీయాలొకరు నేర్పిస్తే వస్తాయా రక్తంలో ఉండాలి గానీ! అది భగవద్దత్తమైన కళ. అందరికీ అబ్బే విద్య కాదు అన్నా భయంగా .
సాధనమున పనులు సమకూరు ధర లోన... ప్యూనుపోస్టుకైనా స్కూలు సర్టిఫి కెట్ చూపించమంటారు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లాంటి ముఖ్యమైన పదవులకయితే మాత్రం ఏ ధ్రువపత్రం అక్కర్లేదా! ఎందుకూ కొరగాని వాళ్లందరూ ఎమ్మె ల్యేలూ ఎంపీలూ అయికూర్చుంటే.. దేశం... ఇదిగో ఇలాగే తగలడిపోతుంది. పాలిటిక్సు పొలిటీషియన్లు మాత్రమే చూసుకొనే వ్యవహారం కాదని చార్లెస్ డీగాలనే పెద్దాయన ఎప్పుడో చెప్పాడు. ఐదేళ్ల తర్వా త ఎప్పుడో జరిగే ఐ.ఐ.టి. పరీక్షలకు ఇప్ప ట్నుంచే కోచింగ్ ఇప్పించటంలా! పాలిటిక్స్ అంతకన్నా పవర్ఫుల్ సబ్జెక్టు. ఎల్కేజీ నుంచే గ్రూమింగివ్వాల్సిన గ్రూపు గురూ!
పాలు తాగే వయస్సులో పాలిటిక్సెందుకన్నయ్యగారూ!- అని అడ్డం పడబోయింది మా ఆవిడ.
వాడూరుకుంటాడా? ఉప వ్యాసం మొదలు పెట్టాడు.
పిల్లలు గాలికి తిరిగి చెడిపోతున్నారని గదమ్మా విష్ణుశర్మ చేత పంచతంత్రం చెప్పించింది సుదర్శన మహారాజు! ఇంట్లో మీరు చెప్పుకుంటామనుకోకండి. హిరణ్యకశిపుడంతటి కర్కోటకుడే సొంతబిడ్డకు ఇంట్లో రాజకీయాలు చెప్పుకో లేక చండామార్కుడి దండనకొదిలేశాడు. మీవాడిని మా దగ్గర పడేయండి. సురేంద్ర నాధ్ బెనర్జీ అంతటివాణ్ని చేసి పంపిస్తాం
సమ్మర్లోనేగా... ఎండకు పడి తిరక్కుండా ... వేస్తే పోలా! - అన్నా వాడి నస భరించలేక.
మా ఆవిడ ఈ రాజకీయాలతో రాజీపడలేకుండా ఉంది. పోయి పోయి పొలిటికల్ సెంటర్లో పడేయటమేందని ఆవిడగారి గోల.
ఏ కంప్యూటర్లో నేర్చుకుంటే బిల్ గేట్స్ కంపెనీలో కోట్లు సంపాదించుకోవచ్చు- అన్నదామె.
'పాలిటిక్సునలా కొట్టిపారేయకమ్మా! మీవారికి బదిలీ అయినా, మీ తమ్ముడికి ఉద్యోగమైనా పిల్లాడికి మంచి సీటైనా.. ఏ పొలిటీషియనో నోరు చేసుకోనిదే రాదు. శ్రీమహావిష్ణువు కలియుగం చివరి పాదంలో పొలిటికల్ లీడర్ గానే అవతారమెత్తుతాడని బ్రహ్మంగారి రివైజ్డ్ కాల జ్ఞానంలో రాసుంది. మీ బుడతడే ఆ రూపంలో పుట్టున్నాడేమో!... ఎవరు చూశారూ! యాగరక్షణ కోసమే బాలరాముడిని విశ్వామిత్రుడు తండ్రినుండి విడదీశాడనుకోవద్దు. సీతమ్మ వారితో పెళ్లి చేయించ లేదూ! మీ వాడు రాముడయితే... నన్ను విశ్వామిత్రుడనుకోరాదా తల్లీ!- అంటూ ఛక్ చకామని రశీదు చించి నా చేతిలో పెట్టాడు.
షాక్ ! పదిహేను రోజులకు ఐదు వే ల రూపాయలా!!
మా రాముడి తల్లింకా మైకంలోనే ఉంది. పైకం సంగతి పట్టించుకొనేట్లు లేదు.
మా రాముడిని రేపొచ్చేటప్పుడు ఏమేం తెచ్చుకోమంటారు విశ్వామిత్రులవారూ?- అనడిగింది తన్మయంగా.
' రెండు గంజిస్త్రీ ఖద్దరు అంగీలు . . నాలుగు టోపీలు... ఆరేడు గొడుగులూ!
అన్ని గొడుగులెందుకూ?
ఏ ఎండకా గొడుగు పట్టాలి కదమ్మా!
మరీ లగేజి ఎక్కువైపోతుందేమోనే అమ్మా! అని గునిశాడు చిన్నాడు. సిగ్గుపడుతూ.
'మరేం ఫరవాలేదు. సిగ్గు బిడియంలాంటివి వదిలేసి రారా నాన్నా: బరువూ... అడ్డం కూడా' అంటూ బైటకెళ్లిపోతోన్న సుందరం వెంటబడ్డా.. సిలబస్లో అయినా ఏముందో చెప్పిచావరా' అంటూ.
వెంటనే పొద్దున్నే ఓ గంట యోగా.. గుద్దులాటలు..
గుద్దులాటలెందుకూ! సభలో రభస చెయ్యద్దూ! మధ్యాహ్న భోజనాలదాకా కుర్చీలు లాగటం, గోతులు తవ్వటం! గోడమీద కూర్చుని వీలూ చూసుకుని ఆటో.. ఇటో.. గెంతే ఆట వీలును బట్టి. ఫైనల్ గా రోజుకో గంట అమరణ నిరాహా రదీక్ష! ఇవన్నీ మేమే ప్రాక్టీసు చేయి స్తుంటాం. మాటిమాటికీ వెల్ లోకి దూసుకుబోయేది మాత్రం మీరింట్లోనే అలవాటు చేయించుకోవాలి. . వెల్ తవ్వించడానికి టైం పడుతుంది మా దగ్గర . బురద తెచ్చుకుంటే మాతం చల్లటం నేర్పిస్తాం బూతులు బట్టీ పట్టిస్తాం . వారానికోసారి పాదయాత్రల తంతుంటుంది. ధర్నాలు, రాస్తారోకోలు, పికెటింగ్.. పిక్ పాకెటింగ్ గట్రా సబ్ జెక్టులు మామూలే' అని నవ్వి వెళ్లి పోయాడు సుందరం.
మా వాడిని చూసి మా కాలనీలోనే ఇంకో నలుగురు చేరిపోయారు. వీడెక్కడ పోటీలేకుండా ప్రధానమంత్రపుతాడోనని భయం కాబోలు.
అందరం కలిసి ప్రారంభం రోజున సుందరమిచ్చిన అడ్రసు వెతుక్కుంటూ వెళ్లాం .
అక్కడ వేసవి శిబిరం లేదు. మొండిగోడ మీద కాగితమోటి అంటించివుంది. అదీ మా సుందరం' గాడిద రాసిందే.
" బాధపడకండి నమ్మినవాళ్లను నేక్ గా ఎలా ముంచటమో, మొదటి
పాఠంలో నేర్చుకొన్నారు. రెండో పాఠం ఈసారి వేసవి శిక్షణా శిబిరంలో!
- కరపాలెం మమంతరావు
( ఈనాడు - దిన పత్రిక - సంపాదకీయ పుట- 13 -05 2003 - ప్రచురితం )
No comments:
Post a Comment