Wednesday, November 10, 2021

హాస్యం : కోతోపనిషత్తు - కర్లపాలెం హనుమంతరావు

 


.

హాస్యం : 

కోతోపనిషత్తు 

- కర్లపాలెం హనుమంతరావు 

| ఈనాడు - 23-10-2002 నాటి దినపత్రిక సంపాదక పుట ప్రచురితం ) 

యేమినాయ్ మైడియర్ షేక్స్పియర్ ముఖం వేలవేసినావ్? 


పరీక్ష పోయింది. పాఠం చెప్పమంటే ఎప్పుడూ కోతలు కొయ్యడవేగాని ఒక్కమారయివా ఒక్కముక్క చెప్పిన పాపాన్ని పోయినారూ? 

డామిట్ ఇది చేసిక్ ఇన్గ్రాటి ట్యూడ్ ! నీ తెలివితక్కువతను చూస్తుంటే నాకునవ్వొస్తుంది. నాతో మాట్లాడటనే ఒక ఎడ్యుకేషన్. మీ నాయన ములక అగ్నిహోత్రావధాన్లు రాతకోతల పని ఉచితంగా నాచేత

చేయించుకోవాలనే దుర్బుద్ధితోనే అయినా నన్ను మీ ఇంట్లో ఉండనిస్తున్నారు కాదా? రాత సంగతెలా వున్నా మన కోతలకి డోకా

లేదని ఆయనకు నమ్మకం కలగబట్టే నాకీ సదుపాయం దక్కింది. దేరీజ్  నాట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ ఫర్ డజ్ నాట్ సర్వ్ యూజ్ఫుల్ పర్పస్ కోతల యొక్క మజా నీకింకా బోధపడక పోవటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పూనా డక్కన్ కాలేజీలో నేను చదువుతున్నప్పుడు ది మిలియన్ పేజెస్ ఆఫ్ బ్రాగింగ్ గూర్చి మూడు ఘంటలు ఒక్క బిగిన లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు ఉంగయిపోయినారు . గాడ్స్ క్రియేషన్లో ఆవులూ, చేగోడీలూ, విడవలూ కన్నా ' కోతలూ' అనే పదార్థం ఉందే  అది ప్రథమ స్థానంలో ఉంది. 

ప్రపంచమందుండే వస్తువులన్నింటిలోకి ముఖ్యమైనవి విధవలు అని మీరే కదా ఇంతకుముందు అన్నారు?

'ఓపినియన్ని అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటే గాని  పొలిటీషియన్ కానేరడు.  గాడ్స్ వర్ లో క్ ఈ కోత అనేది ఒక ఉత్తమోత్తమమైన సృష్టి చిత్రం! నీ పేరులోనే ఒక కోత వుంది.. చూశావూ? 

అదెలాగా?! 

వెంకటేశం అనగా వెంకట్ . ఈ వెం ' కట్ ' అంటే కోత అనే కదా అర్ధం!  ఇంకా కోతలు కోయటం చేతగాకపోతే భారతంలోని ఉత్తర కుమారుడు ఉత్తకుమారుడిగా మిగిలిపోయుండేవాడు.  అవునా..

మీకేమీ ఎన్నై నా చెబుతారు. పరీక్ష పాసు కాలేదని తెలిస్తే మా తండ్రి 'ఊచకోత' కోస్తాడు. 

దట్సిట్! అనగా మీ నాయన కూడా కోస్తాడన్నమాట. కోతల పురాణం

విప్పానంటే  ఎంత మైరావణుడయ్యేది గోతిలో పడాలనే కదా బృహన్నారదీయంలోని పదునాల్గవ ఆశ్వాసం విశ్వాసం.  సావకాశంగా

కూచుంటే  కోతలు కూడా మంచివేనని  నీతోనే ఒప్పిస్తాను. కోత అంటే నువ్వేమనుకొంటున్నావో ముందు అది చెప్పు

కోతంటే ఎవరైనా అనుకొనేది ఏముంది గురూగారూ! రేషన్ కోత, డీయే కోత..  ఇలాంటివే ఇంకా ఇలాగే ఏవేవో కోతలు. . 

అట్టె.. అట్టె! అక్కడ నిలు.! కరెంటు కోతల్ని గురించి ఒక్క ముక్క చెప్పనీయ్ ! ఎన్నికల ముందే పార్టీ అయినా ఇరవైనాలుగ్గంటలూ  కరెంటిస్తామనే కదా కోతలు కొస్తుందీ! ఆ ఇచ్చేదేదో ఉచితంగానే మేమూ ఇస్తామని ఎదురు పార్టీవాళ్ళు పైకోత కోస్తారు. మా తొలి సంతకం కరెంటు ఫైలు మీదే అని ప్రకటిద్దామనంటే తొలి వేలిముద్ర- అని సవరించాలని అందులోని అంగూఠా  గ్రూపు అడ్డుకోత వేస్తుంది. ఇవన్నీ ఎన్నికల ముందు కోతలు:

ఎన్నికల తరవాత, కోతలు ఇందాక నేనన్నానే ... అవి.. అందరికీ తెలిసిందేగా! 

నీ బుద్ధి యలా వికసిస్తుందో చూశావా? ఇలా తర్పీదవుతుంటే నువ్వు కూడా పెద్ద పొలిటీషియనువవుతావు' 

అనగా పొలిటీషియనులందరూ విధిగా కోతలు కోస్తారని మీ ఆలోచనా గురూ? 

అందుకు సందేహం ఏముంది? కోయటం రానివాడు  పాలిటిక్సు దాకా ఎందుకు, పేకాటకే  పనికిరాడు. కోతకు ప్రైకోత  కోస్తూ  పోయేవాడే అంతిమ విజేత.  పొలిటికల్ పార్టీల మేనిఫెస్టోలన్నీ నథింగ్ బట్ మేనిప్యూలేషక్స్ అని  బెర్ట్రెండ్ రస్సెలనే దొరవారు ఎప్పుడో సెలవిచ్చారు. ఏటా కోటి ఉద్యోగాల ఏర్పాటు అంటే భీమునిపట్నానికి పాలసముద్రం తేవటంలాంటి ఏర్పాటన్నమాట.  సన్మాన పత్రాలు అనబడు  ఫెలిసిటేషన్‌  పత్రాలు కూడా ఈ కేటగిరీ కిందికే వస్తాయి. కానీ, వీటికి లైట్ గా లిటరరీ టచప్ ఇవ్వాలంటుంది. ఒక్క ముక్క నిజం కక్కినా  టెక్స్ట్ వెయిట్ తగ్గి వెలవెలాబోతుంది. వివిధ రంగాల్లోని కోతల్ని పరిశీలించి, పరిశోభించి  వాటి తాలూకు యస్పెన్సుని నిగ్గుతీసి నే ఒక కొత్త థియరీతయారుచేశానోయ్ ! . నోటు బుక్కు  తీసి రాసుకో  మై బోయ్!  కోత అనేది  సాంఘిక సంక్షేమం, సౌభాగ్యం, సంస్కృతీ.. గట్రా గట్రా లకు సంబంధించిన వ్యవహారమనేది నా థియరీ లోని మొదటి పాయింటు.

అదెలాగా?! 

పేషెన్స్!  కొసాకి  విను ! కోతల్లేకపోతే కుటుంబ నియంత్రణ ద్వారా సంక్షేమానికి ఆస్కారమేదీ? పంటలు కోస్తేనే గదా  ధాన్యం దిగుబడి అయ్యేదీ!  రైతెంత ఎక్కువ  కోస్తుంటే దేశంలో అంత సమృద్ధిగా  సంపద ఉన్నట్టే కదా లెక్క!  ఇహా సెన్సారువారు నెన్నారు సరిగ్గా కోతలు వేయకనే సాంస్కృతిక కాలుష్యం దినదిన ప్రవర్ధమానమవుతొందని  మీలాంటి మేధావులు మధనపడుతున్నారు. కోతల కింత కథుంది కనకనే కోడి కూడా ఘడియ ఘడియకీ  కోకోరోకో  అంటూ అరుస్తూంటుంది. అంటే ఏంటట మీనింగ్ ?  కొద్ది కొద్దిగా  రోజంతా కోస్తూనే వుంఉండోయ్ - ఆవటా అని గుర్తుచేయటమన్నమాట. ఇది బహ డిస్కవరి. 

ఆహా ఏమి డిస్కవరీ అండీ! 

 మరేమనుకున్నావ్;  నామాట వింటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతటివాడిని చెయ్యనూ? పూజా నమస్కారాల్లేక్  బూజెక్కు  న్నానుగానీ గ్లాడ్స్పన్‌  లాగా దివాన్గిరీ  చలాయించాల్సిన జాతకం కదు బోయ్  మనది! ఇహ జాతీయ అంతర్జాతీయ విషయాలకొద్దాం. కులాతీత మతాతీత ప్రజాస్వామ్యమంటారే. అది ఓహ పెద్ద జాతీయ కోతని  నా ఉద్దేశం. మూడేళ్ల పాలనయిందని మొన్న వాజపేయిగారు మీటింగు పెట్టి థణుతులెగిరి పోయేటట్లు   ఎన్ని బడాయిలు పోయారూ!  శాంతికోసం యుద్ధమంటూ అమెరికావాడూ అవే టైపులో అడపాదడపా అంతర్జాతీయ లెవల్లో అడిగినవాడికి  అడగనివాడి క్కూడా నీతులు బోధిస్తూ ఒకే ధ్యానం చేస్తుంటాడు. కోయగా కోయగా కోతలు నీతులవుతాయని గదా గోబెల్స్ మహాశయుడెప్పుడో సెలవిచ్చి

ఉన్నారు. వీటన్నింటిలో టూథౌజండ్ ట్వంటీ ట్వంటీ విజననే ప్రాంతీయ కోత కొంతలో కొంత నయం. ఇహ సామాజిక రంగానికొస్తే నూరు కోతలు కోసైనా  సరే ఒక వివాహం చేయిస్తే పుణ్యమని కదా అమరనిఘంటువు అఘోరిస్తున్నదీ! కళారంగంలో అయితే కోతల కున్న స్థానం అద్వితీయం . ఎంత పెద్ద హీరో అయినా తెరమీద పిట్టలదొరలాగా కోతలు కోయందే చప్పట్లు పడవు.  అంతెందుకు.. బొడ్డుకోతతో మొదలయిన మానవజీవితం మృత్యువాత బడేముందు వైద్యుడి కత్తికోతతో కదా అంతమవటం! ఈ రెండు కోతల నడుమనా  మనిషికింకా కడుపుకోత.. ఊచకోత .. రంపపు కోత..  జుత్తుకోత.. జేబుకోత .. ఇంకిలా సవాలక్ష కోతలు.  నిత్యజీవితంలో కోతలకింత ప్రాధాన్యత ఉంది కనకనే గీతలో కూడా  ' కోసేదీ నేనే .. కోయించేదీ  నేనే! నీవు నిమిత్తమాత్రుడివ' ని కదా జ్ఞానబోధ చేసిందీ! కోతలు కోయటయనునది ఒక గొప్ప కళ ' ఎడ్యుకేషన్ లేక , చాలక, రీజన్ తెలీక మీ మాస్టారు వంటి అభాజనులు నేను కోతలు కోస్తానని కొక్కిరిస్తారు. నన్ను మించిన కోతలరాముళ్ల ప్రభా ఇవాళ అన్ని రంగాలలోనూ వెలిగిపొతున్నదని తెలుసా? దిన్నంతటి లెవెలుకు తీసుకువెళ్లాలని తాపత్రయపడుతుంటే ధేంక్  చెయ్యక నన్ను తప్పు పడుతున్నావూ! 


తప్పయిపోయింది. క్షమించండి గురూ.


'డోంట్ సే దట్! ఒక ఉపనిషత్తులో శిష్యుడు ప్రశ్న అడుగుతూ వుంటే గురువు సమాధానం చెబుతుంటాడు. ఆ గురువు లాంటి గురువును నేను . ఆ శిష్యుల్లాంటి శిష్యు డివి నువ్వు.  మన ప్రశ్నోత్తరాలు యవరైనా  అచ్చొత్తించి పారేశాడంటే, ఒహ రెండొందల ఏళ్ల తరువాత సచికోత్తమ  ఉపనిషత్తుకు మించి నచి ' కోతల'ఉపనిషత్తయి జాతికి మార్గం చూపిస్తుంది . నాదీ గేరంటీ! 

'గురువుగారూ!  ఇంక మంచం కింద నుంచి టైటికి రావచ్చు. పూటకూళ్లమ్మీపూటకు గ్యారంటీగా రానట్టే.. ' 

ఈ చీపురు కట్టేంటీ! హమ్మ! .. ఈ ముండిక్కడే నక్కిందీ! వెంకటేశం! .. నన్నే బురిడీ కొట్టిస్తావుటోయ్! కలికాలం. డ్యామిట్ .. కథ అడ్డం తిరిగింది . 


***

కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 23-10-2002 నాటి దినపత్రిక సంపాదక పుట ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...