'ఛీ!' కొడదామా? 'చీర్' కొడదామా?
( ఈనాడు - ప్రచురితం )
*
గెలీలియో నిజంగా మహానుభావుడు. మందుబాబులకన్నా ముందే భూమి గుండ్రంగా తిరుగుతున్నదని కనుగొన్నాడు .
కథలు చెప్పేవాళ్లందరూ తాగుబోతులని చెప్పలేం.కానీ.. తాగుబోతులుమాత్రం మంచి కథకులై ఉంటారు. కొంపకు ఆలస్యంగా వచ్చినప్పుడల్లా ఇంటి ఇల్లాలుకి కొత్తకథ అల్లి చెప్పాలంటే అల్లాటప్పా వ్యవహారం కాదు! తప్పతాగితే తప్ప అంత సృజనాత్మకత సాధ్యం కాదు.
మందేమీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టిందీ కాదు. రామాయణకాలంలో- సీతమ్మవారి అన్వేషణలో ఆంజనేయుడు లంకలో ముందుగా చూసింది ఆరగా ఆరగా ద్రాక్షారసాలు సేవించే రాక్షసులనే !
భారతం మార్క్ కీచకుడుకి మగువల మీద కన్న మధ్యపానం మీద మక్కువ ఎక్కువ .
ఉజ్జయినీ కాళీమాతకు మద్యమే నైవేద్యం. శిప్రానదీ తీరాన కొలువైన భైరవుడు నాటుసారా తప్ప మరొకటి ముట్టడు. దేవదానవులు దెబ్బలాట దేనికోసం? ఆ సురేకదా నేటి సారాయి!
మందులో ఏముందనీ గాలిబ్ అంత గమ్మత్తైన గజల్సు చెప్పగలిగిందీ? అజంతా హరప్పా శిథిలాలు తవ్వినప్పుడూ ముందుగా బైటపడ్డవి అప్పటి తాగుబోతులు తప్ప తాగి పారేసిన చట్లూ పిడతలేని వినికిడి.
నిప్పు కనిపెట్టక ముందు ఆదిమానవుడు ఎండావానలకు, చలిగాడ్పులకుఎల్లా తట్టుకొని నిలబడ్డాడంటారూ? అంతా యిప్పసారా మహత్తు. యుద్దసమయాల్లో ఏనుగులకీ బాగా మద్యం పట్టించి శత్రుసైన్యం మీదకు ఉసిగొల్పేవారని 'ఇండికా'లో మెగస్తనీస్ అంతటి మహానుభావుడే రాసినప్పుడు.. 'రా' పనికిరాదంటే కుదురే పనేనా!
కామానికీ సూత్రాలు రాసిపెట్టిన మునీశ్వరులు మధుపానానికి శాస్త్రాలు రాయలేదంటే నమ్మలేం! తంజావూరు తాళపత్ర గ్రంథాలయంలో మరికాస్త మందుకొట్టి వెదికితే ఒకటో రెండో పెగ్గుకావ్యాలు బైటపడక మానవు.
మౌర్యులకాలంలోనే మనవాళ్ళు 'అంగుళం' కనిపెట్టారట! ఎందుకట ? లోటాలో మందు కొలతలు చూసుకొనేందుకుగాక మరి దేనికట !
‘చంద్రయాన్’ మిషన్ ఇంజన్లో ఇంధనానికి బదులు ఏ కల్లో సారానో కొట్టించి వదిలుంటే.. సముద్రంలో పడే బదులు ఇంచక్కా చందమామ చూట్టూ చక్కర్లు కొట్టొచ్చుండేది.
దేవుడుకూడా ఆదాము అవ్వల్ని ఆపిల్ ముట్టద్దన్నాడుగాని.. మందు జోలికి వెళ్లద్దని హద్దులు పెట్టలేదు కదా! మరెందుకు అందరూ ఈ మందును ఆడిపోసుకొందురు?
ఒత్తిడినుంచి ఉపశమనం పొందే గమ్మత్తు ఉపాయం ఈ మత్తిచ్చే మందు. శతాబ్దాల కిందట మనోళ్లు మేధస్సును మధించి మరీ సాధించిందీ మధిర. అష్టాంగమార్గాల్లో ఆఖరి మెట్టు 'సమాధి' అంటే ఫుల్లుగా ‘రా’ కొట్టి చల్లంగా పడుంటమే! మందుగుండు కనుక్కొన్నది చైనానే కావచ్చుకానీ.. 'మందు' కనుక్కొంది మాత్రం ఖచ్చితంగా మన హిందూ దేశమే!
‘సారే జహాఁసే అచ్ఛా !.. సారా భారత్ మహాన్!’
***
మనోడికి మరీ మందెక్కువైంది . పీకెల్దాకా తాగినోడు మరి.. కన్యాశుల్కం బైరాగికే క్లాసు పీకేస్తాడు చూడు ! చీపులిక్కరుకు అలవాటుపడ్డ నాలిక్కదా! అందుకే అక్కరకురాని ‘మద్యా’క్కరలు ఏకరువు పెట్టేస్తోంది . ముందు ముందు దగ్గుక్కూడా పెగ్గే మంచి మందని ఎంత స్సిగ్గుగా వాదిస్తాడో .. ఓపికుంటే ఓ చుక్కేసి వినచ్చు మరి !
‘నూటికి ఇరవై ప్రమాదాలు తాగుబోతులవల్లే’ అని లెక్కలు చెబుతుంటే 'మిగతా ఎనభయ్యీ తాక్కపోవడం వల్లే భయ్యా ! అని అడ్డంగా వాదించే తాగుబోతుని ఏమనాలి! భూమ్మీదపడ్డ బిడ్డ గుక్కపెట్టేది ఆ గుక్కెడు ‘చుక్క’కోసమే అని కూసే ఇల్లాంటి తాగుబోతుల వాగుళ్ల వల్లే ఇల్లూ వళ్లూ గుల్లయేది అని ఇల్లాళ్లు ఘొల్లుమనేది.
దేశాన్నిలాగే మందుకు వదిలేస్తే పదమూడేళ్ల పిల్లాడుకూడా 'పద! మూడు బాగా లేదు! ఏదైనా బారుకెళదాం!' అనే రోజు రేపే వస్తుంది . బారుకి ఏజ్ బారు ఎత్తేసే మంచిరోజులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేది.
మందుల షాపులకు మించి మందుషాపుల పెంచితే ఎంత ప్రమాదం ? ! ఇండియానాలో చాటుగా పొగతాగినా కఠినదండన తప్పదు. ఇండియాలో బాహాటంగా తప్ప తాగినా తప్పట్టేవాడు లేడు.
ఏడాదికి ఈ ముందు మీదయ్యే దుబారా సొమ్ముతో నలభై లక్షల మందికి సలక్షణమైన డబుల్ బెడ్ రూములు కట్టించియ్యచ్చని ఒక అంచనా!
సర్కార్లే రాష్ట్రాలను 'రా' కొట్టేవాళ్లకు రాసిచ్చేస్తుంటే మందు వ్యాపారానికి మాద్యం ఎందుకుంటుంది .. చెప్పండి!
గుడీ . . బడీ అన్న తేడా కూడా లేదు. ఎడ పెడా ఊరుకో బారు! పేటకో బెల్టు!
ఆంధ్రా.. నైడెడ్.. నిజాం.. రాజకీయాల వరకే ! 'రా' రాజకీయాలకి ప్రాంతం.. కులం.. మతం.. అడ్డంకులు కావు ! రెండు తెలుగు రాష్ట్రాలను మందుపాతర్లగా మార్చేందుకు పోటీ ఎంత రసవత్తరంగా సాగుతోందో చూస్తూ ఉంటే 'చీర్' లీడర్లకి 'చీర్' .. కాదు ... 'ఛీ!' కొట్టేద్దామనిపించదా మరి ?!
No comments:
Post a Comment