Saturday, August 29, 2015

మనమూ-మన తెలుగూ -శ్రీ తోట భావనారాయణ

               ఆగష్టు 29- తెలుగు భాషాదినోత్సవం- సందర్భంగా 
సమాజం వాడుతున్న భాషను ప్రజామాధ్యమాలు ప్రతిబింబించాలి. కానీ ఆచరణలో అది ఎంతవరకు నిజమవుతున్నదన్నదే ప్రశ్న. గ్రాంధికం నుంచి వ్యావహారిక భాషలోకి పత్రికలను నడిపించిన వారి కృషి ఒక దశలో ఆగిపోయింది. తొలినాళ్ళలో కనిపించిన స్ఫూర్తి ఆ తరువాత సన్నగిల్లింది. వేగంగా సృష్టించే సాహిత్యం’అని అభివర్ణించుకుంటూ పత్రికా రచయితలు ఆ వేగంలో ఇంగ్లీషు యథాతథంగా  ఉపయోగించటమో, సంస్కృత పదబంధాలతో సరిపెట్టడమో కొనసాగించారు. అదే సంప్రదాయాన్ని టీవీ మరింత ముందుకు నడిపించింది. కాకపోతే సంస్కృతం స్థానంలో ఇంగ్లీషు వచ్చి పడింది. సరికొత్త యాసతో టీవీ తనవంతు సేవగా భాషను కొత్తదారి పట్టించింది.  మరో వైపు సినీ రచయితలు  చేసే  నీ యెంకమ్మా ,  బాక్సు బద్దలయింది , ఇరగదీశాడు’ లాంటి ప్రయోగాలే తెలుగు భాషను సుసంపన్నం చేస్తున్నాయని ఆనందించాల్సిన దయనీయ పరిస్థితి వచ్చిపడింది.  తెలుగు సినిమా ఒకసారి వాడిపడేస్తే వాటికి మరింత ప్రచారం చేయడానికి టీవీలు ఉబలాటపడుతున్నాయి. ఈ గందరగోళం మధ్య తెలుగుభాషాపరిరక్షకుల ఆవేదన ఎవరికీ వినపడటం లేదు.

తొలి తెలుగు భాషా దార్శనికుడు గిడుగు రామమూర్తి, ఆ తరువాత తాపీ ధర్మారావు నాయుడు వేసిన తొలి అడుగులలో నడక ఎంతో వేగంగా, అంకితభావంతో ముందుకు సాగింది.  కానీ ఆ వేగం ఎక్కువకాలం కొనసాగలేదు. సంపూర్ణవ్యావహారికం వైపు నడవకుండా ఇంగ్లీషు పదాలను అనువదించాల్సిన ప్రతిసందర్భంలోనూ సంస్కృతాన్ని ఆశ్రయించటంతో అసలు సమస్య వచ్చిపడింది. తెలుగు అందవిహీనంగానూ, సంస్కృతం అందంగానూ కనిపించేలా చేశారు. నగలు అని రాయటం నామోషీ అయింది. ఆభరణాలు అందంగా కనిపించాయి. దొంగతనం’ కంటే చౌర్యం’ బాగా ఆకట్టుకుంది. చనిపోవటం’ కంటే మృతి చెందటం’  గౌరవప్రదంగా కనిపించింది.  బడి లాంటి తెలుగు పదం  వదిలేసి స్కూలు పరిచయం చేశాక ఇప్పుడు ఇంగ్లీషు వద్దంటూ పాఠశాల వాడవలసిందిగా  ఉచిత సలహా ఇస్తున్నారు. కృతకమైన భాషను ఇంతకాలంగా జనం మీద రుద్దిన పత్రికలే ఇప్పుడు తెలుగు భాష పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాయి. తెలుగు భాషను రక్షించటమంటే సంస్కృతాన్ని బలవంతంగా నేర్పటమా ? డ్రిప్ ఇరిగేషన్ ను తెలుగు చేశామంటూ చెప్పుకుంటున్న బిందు సేద్యం లో తెలుగెంత ? పశ్చిమ గోదావరి కి ఆనాడే పడమటి గోదావరి అని పేరు పెట్టి ఉంటే ఎంత హాయిగా ఉండేది ! ఇప్పుడు పచ్చిమ గోదావరి అని ఉచ్చరించే పరిస్థితి వచ్చేది కాదు కదా ?  చీడపీడలు సోకినట్టు చెప్పాలంటే చీడపీడలు ఆశించాయి అని రాస్తాం, రేడియోల్లో చెబుతాం. వడుగు అనే తెలుగు పదం కంటే ఉపనయనం’ మనకు అందంగా, ఆకట్టుకునేలా ఉంటుంది.
నిరుడు లాంటి తెలుగు పదం ఉండగా గత సంవత్సరం అనే పదమే వాడుతున్నాం. కొంతమంది గతేడాది లాంటి తప్పుడు ప్రయోగాలు చేస్తున్నా పత్రికలు అలాగే ప్రచురిస్తున్నాయి. భాషమీద జరిగిన ఒక సదస్సులో నేను నిరుడు’ గురించి  ప్రస్తావిస్తే ఒక పెద్దమనిషి సరికొత్త వాదన లేవనెత్తారు. జర్నలిస్టులకోసం పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు వేసే ఆయనగారి వాదన ఏంటంటే, నిరుడు అనటానికి బదులు పొరపాటున నీరడి అనే ప్రమాదం ఉందనీ, తెలంగాణ ప్రాంతంలో అది ఒక కుల వృత్తిని ఎత్తి చూపినట్లవుతుందనీ అందువలన నిరుడు వాడకపోవటమే మంచిదని. సంస్కృత పదబంధాలతో సమాసభూయిష్టంగా ఉండేదే అసలైన తెలుగు అని ప్రవచించే పండితమ్మన్యులైన వైతండికులకు ఎవరైనా ఏం చెప్పగలరు ?  తామే శిష్టులమనీ, ఆర్యులమనీ చెప్పుకునే వారే శిష్ట వ్యవహారంబు దుష్టంబు గ్రాహ్యంబు, ఆర్యుల దోషంబు గ్రాహ్యంబు అని పదే పదే గుర్తుచేస్తూ భాష భూమార్గం పట్టకూడదని పనిగట్టుకుని ప్రచారం చేస్తుంటే అచ్చ తెలుగు  బతికి బట్టకట్టగలుగుతుందా ?  తెలుగు భాషాపరిరక్షణకు నడుం బిగించిన వారు ఎంతమంది ఎంత మేరకు తెలుగు వాడుతున్నారో (సమానమైన తెలుగు పదాలు ఉన్నప్పుడు) ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయమిది.
కొత్త పదాలకు… ముఖ్యంగా  ఇంగ్లీషు పదాలకు సమానమైన తెలుగు పదాలను సృష్టించటం గురించి ఎప్పుడు చర్చ జరిగినా తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని పదే పదే చెబుతుంటారు. తమిళుల భాషాభిమానాన్ని గుర్తుచేసుకుంటారు. తెలుగు భాషాదినోత్సవాలు జరుపుకునే ఇలాంటి సందర్భాలలో ఇది మరీ ఎక్కువ. అయితే వాళ్ళకున్న చిత్త శుద్ధి మనకుందా ? అంతకంటే ముఖ్యంగా, వాళ్ళకున్నంత ధైర్యం మనకుందా ? విప్ ను కొరడా అని అనువదించుకోగలిగిన చొరవ మనకుందా ?  ఇంగ్లీషు పదాలే కాదు, హిందీ, సంస్కృత పదాలు సైతం దరిజేరనివ్వకుండా  ఎప్పటికప్పుడు కొత్త పదాలకు తమిళ పదాలు తయారుచేసుకోవడం వాళ్ళ అలవాటు. మనకు భేషజాలు ఎక్కువ. స్వైన్ ఫ్లూ’  ను యథాతథంగా వాడుకోగలిగేంత విశాలహృదయం మనది. వాళ్ళు నిర్మొహమాటంగా పన్రి కాయ్‌చ్చల్ ( పంది జ్వరం ) అని మార్చుకున్నారు. బర్డ్ ఫ్లూ ను పరవై కాయ్‍చ్చల్ ( పక్షి జ్వరం ) చేసుకున్నారు. వింటేనే మనకు నవ్వొస్తుంది. మనవాళ్ళు అలాంటి అనువాదం చేస్తే ఎంతమంది ఎగతాళి (క్షమించాలి… మన పత్రికల భాషలో అపహాస్యం’ అని వాడి తీరాల్సిందే !) చేస్తారో తెలియని విషయమేమీ కాదు. మనం హంగ్ అసెంబ్లీ’ అని రాస్తూ ఒక్క క్షణమైనా తెలుగులో ఆలోచించే ప్రయత్నం చేయం. తమిళంలో తొంగు శట్టసబై’ ( వేలాడే చట్టసభ ) అని అనువదించుకున్నారు. ఎప్పుడో నార్ల వెంకటేశ్వర రావు గారు డ్రెడ్జర్ అనే పదాన్ని అక్కడి జాలర్ల భాషలో తవ్వోడ గా అనువదించారని ఇప్పటికీ వల్లె వేసుకోవటం మినహా మనం నిర్మించుకున్న పదాలు ఎన్ని ? అనువదించుకున్నవెన్ని ?

కొత్త మాటలూ, అనువాదాల ప్రస్తావన కాసేపు పక్కనబెడితే, భాష వాడుక మీద ఎలాంటి పట్టింపులూ లేకపోవటం బాగా పెరిగిపోతోంది. రాసే పద్ధతి మీదా, మాట్లాడే పద్ధతి మీదా పట్టు కోల్పోతున్నాం. పైగా,  ప్రవాహం లాంటి భాషకు కట్టుబాట్లు ఉండాలనుకోవటం మంచిది కాదనేది కొందరి వాదన. అంతమాత్రాన గతేడాది లాంటి ప్రయోగాలు యధేచ్చగా చేస్తుంటే చూసీ చూడనట్లు వదిలేయటమే మంచిదా ? మొత్తానికి తెలుగు అక్షరాలే రాస్తున్నందుకు సంతోషించటమే మంచిదంటారా ? ఆశావహం అనే పదం నుంచి ఆశావహులు అనే అపప్రయోగాన్ని పత్రికలు వాడుకలోకి తెచ్చినప్పుడు పత్రికా సంపాదకులు దిద్దవలసిన అవసరం లేదా ?  తెలుగు సంపాదకులు కొత్త పదాలమీద కలిసి చర్చించిన సందర్భాలు  దాదాపు లేనట్టె. ఫ్లై ఓవర్ ను పైదారి అనవచ్చునని సూచించటమే తప్ప ఎవరైనా వాడుతున్నారా ?
టీవీ వచ్చిన తరువాత రాసే భాషతో బాటు మాట్లాడే భాషను కూడా కాస్త జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఏర్పడింది. టీవీకోసం రాసేవాళ్ళు మనం అలాగే మాట్లాడతామా అనే విషయం ఒక్క క్షణం ఆలోచించినా చక్కటి రచన తయారవుతుంది. సుబ్బారావుపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు లాంటి వాక్యాలు చాలా సహజంగా టీవీలలో వినిపిస్తుంటాయి. నిజానికి పత్రికలవాళ్ళు ఇలాగే రాస్తారు. కానీ టీవీకోసం  సుబ్బారావు మీద ఎస్పీ కోప్పడ్డారు అని రాయవచ్చు. ఈ రెండు వాక్యాలు గమనిస్తే ఏది మాట్లాడే భాషకు దగ్గరగా ఉందో, ఏది వినడానికి సులభంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా. ఎన్ని ఎక్కువ ఇంగ్లీషు పదాలు వాడితే అంత గొప్ప. ఎంత ఇంగ్లీషు యాస వుంటే అంత బాగా ఆకట్టుకోగలమని నమ్మకం. రేటింగ్స్ ద్వారా లాభం పొందాలనుకునే టీవీలు ఇంగ్లీషు ఎక్కువగా వాడుతున్నాయి. పైగా జనం భాషలో ఎక్కువగా ఇంగ్లీషు పదాలు దొర్లుతున్నప్పుడు ఇంగ్లీషు వాడకం గురించి టీవీలను విమర్శించడం కంటే వాక్య నిర్మాణంలో లోపాలను ప్రస్తావించడం మంచిది. వాడుక భాష ఎంత సరళంగా ఉండాలో టీవీలకు నేర్పాలి. వాడుక మీద పట్టు కోల్పోతే భాషకు మనుగడ ఉండదనే వాస్తవాన్ని ముందుగా గుర్తించాలి.

ఇదంతా ఒక వంతయితే ఇప్పుడు జనం మాట్లాడే భాష అంతా పత్రికలు నేర్పిన భాషే ! జనం భాషను తీసుకొని అదే భాషలో వార్తలు అందించాల్సిన పత్రికలు అందుకు విరుద్ధంగా వాటి భాషను జనానికి నేర్పుతున్నాయి. గ్రామీణ ప్రజలు కూడా స్వచ్చమైన తెలుగు నుడికారం స్థానంలో కృతకమైన పత్రికాభాష మాట్లాడుతున్నారు. టీవీల వాళ్ళు మైకు పెడితే నాయకులు ఎలాంటి భాష మాట్లాడుతున్నారో గమనిస్తే ఈ విషయం బాగా అర్థమవుతుంది. భాష మీద ఏమాత్రం ప్రేమ లేకుండా నడుస్తున్న ప్రజామాధ్యమాలు ఆత్మ పరిశీలనతో ధోరణి మార్చుకుంటే తప్ప మంచి తెలుగు ను రక్షించుకోవటం సాధ్యం కాదు***
***
                              శ్రీ తోట భావనారాయణ 

శ్రీ తోట భావనారాయణ గారిని పరిచయం చేసేటంత ఘనుడిని కాదు గానీ విధాయకం గనుక నాకు వారితో కలిగిన చిరు పరిచయాన్ని గురించి ఒక్క ముక్క చెబుతాను.ఈ బ్లాగు ప్రపంచం లోకి నేను అడుగు పెట్టిన మొదటి రోజుల్లో అనుకోకుండా ఒకసారి నా అదృష్టం  కొద్ది  http://bhavanarayana.co.tv/ బ్లాగు చూడటం జరిగింది. అప్పటినుంచి నేను వారికి వీరాభిమానిగా మారిపోయిన నిజం నిర్మొహమాటంగా ఒప్పుకుంటున్నాను. వీరి బ్లాగ్ లోని ఒక్కక్క టపా ఒక సీమటపాకాయ...చిచ్చుబుడ్డి... మతాబు ... వెరసి తోట వారి  బ్లాగు మొత్తం ఒక నిప్పుల పొట్లం. ఈ దీపావళి సరుకు నుంచి ఒక్క తెలుగు మతాబు తీసుకుని నా బ్లాగునీ వెలిగించుకుంటానంటే వెంటనే వప్పుకున్నందుకు తోట భావనారాయణ గారికి శత కోటి వందనాలు.నేటి మన తెలుగు భాష తీరు మీద ఇంత చక్కటి వ్యాసం రాసినందుకు అభినందనలు .కృతజ్ఞతలు.మీకూ నాకు లాగా ఈ వ్యాసం నచ్చితే వారికే నేరుగా మీ స్పందన నందించినా ఆనందమే.మరొక సారి వారి బ్లాగు చిరునామా http://bhavanarayana.co.tv/
                          -శ్రీ తోట భావనారాయణగారికి 
కృతజ్ఞతలతో
-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...