(సెప్టెంబరు 21
మతిమరుపు వ్యాధి నిరోధోత్సవం)
మీరి చెరువులో ఈదులాడేటప్పుడు
తృటిలో ప్రమాదం తప్పించుకునుండ వచ్చు. దారే పోయే లోడు లారీ హఠాత్తుగా మీదకు
దూసుకొచ్చినప్పుడు ఆఖరి క్షణంలో మెరుపులా తప్పుకొని ప్రాణాలు కాపాడుకొని ఉండవచ్చు.
అనుకోకుండా కమ్ముకొచ్చిన చికెన్ గున్యాతో ఆఖరి క్షణం దాకా పోరాడి విజయం సాధించి
ఉండవచ్చు. ప్రాణాంతకమైన కేన్సర్ వచ్చే సూచనలు ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోడం ద్వారా
ఆ గండనుండి బైట పడి ఉండవచ్చు. అలాగే గుండెపోటు కూడా నీ ఆత్మస్థైర్యం ముందు తలొంచుకొని
ఉండవచ్చు. ఎన్ని యుద్దాలనైనా గెలువు
గాక! ఎంత అనుభవమైనా గడించుగాక. మతి మరుపు జబ్బు.. అదేనండీ
అల్జీమర్స్ భూతం కోరల్లో చిక్కుకుంటే మాత్రం ఇహ బైట పడటం కల్ల. భయపెట్టడం కాదిది.
ఆ పిశాచం మెదడు ఇంటిలో జొరబడకుండా జాగ్రత్తగా ఉండమని చేసే హెచ్చరిక ఇది.
పెద్దా చిన్నా తేడా లేదు. ఆడా మగా
భేదం చూడదు. కొండచిలువ మేకపిల్లను మింగే తీరులో మెల్లిగా మనిషి జీవితాన్ని చల్లంగా
ఆరగించే బ్రహ్మరాక్షసి మతి మరుపు జబ్బు.
పెళ్ళినాటి ఏడడుగుల పంథాలో ఏడు
దశల్లో మనిషిని పూర్తిగా మింగేసే దొంగ బుద్ధి మతిమరుపు వ్యాధిది.
ముసలితనం మొదటి సూచన అని మోసం
చేయచ్చు. కానీ.. అది.. అది కాదు అని గుర్తించే సమయానికే అంతా అయిపోతుంది. కాపుకాసి
సుఖసంతోషాలను రూపు మాపేస్తుంది. మతిమరుపు రాజ్యంలోకి ఒకసారి కాలు పెడితే తిరిగి
సొంత గూటికి చేరుకోవడం దాదాపు అసాధ్యం.
స్థితప్రజ్ఞురాలన్న పేరున్న
మేధావిని కూడా మరబొమ్మలా ఆడిస్తుంది. ఒకసారి నవ్విస్తుంది. ఒకసారి ఏడిపిస్తుంది.
అకారణంగా అయిన వాళ్లందరినీ అనుమానించే బుద్ధిని అంటగడుతుంది. ఏళ్ల తరబడి నీడలాగా
తనను అనుసరించిన జీవితభాగస్వామిని కూడా అప్పుడే ప్రయాణంలో పరిచయమైన కొత్త మనిషిలా
దూరం పెట్టిస్తుంది. ఏకసంథాగ్రాహి. వేదపాఠాలన్నీ నాలిక చివరే చివురుటాకుల్లా
చప్పుడు
చేస్తాయన్న గొప్ప పేరున్న పండితుణ్ణికూడా మతిమరుపు జబ్బు మతితప్పిన మనిషి
మాదిరిగా మార్చేసి అయిన వారందరి అంతులేని దుఃఖానికి కారణమవుతుంది.
ఏకపత్నీవ్రతుణ్ణి సైతం కాముకుడిగా మార్చేసే దుష్టశక్తి మతిమరుపు రుగ్మత.
ఒక్క మాటలో చెప్పాలంటే పుట్టుకతో
వచ్చిన విలువలు.. వయసుతో సంపాదించిన విజ్ఞానం.. అనుభవంతో సాధించిన సంస్కారం..
అన్నింటినీ రాహు.. కేతువులు చంద్రుణ్ణి మింగేసిన తీరులో మింగేసే రాకాసి మరిమరుపు
వ్యాధి. గ్రహణంలో మాదిరి ఈ రక్కసి విషయంలో ఇక విడుపన్న మాటే ఉండదు.
వైద్యపరంగా చెప్పాలంటే మెదడు నాడీ
కణాలను క్రమక్రమంగా అచేతనం చేస్తూ మొరాయించే న్యూరోట్రాన్స్ మీటర్ల సంఖ్యను
పెంచుకోంటూ పోతూ మరణానికి దగ్గరిగా తీసుకుని వెళ్లే తీవ్రాతి తీవ్రమైన వ్యాధి
అల్జీమర్స్.. అని ఆంగ్లంలో చెప్పుకొనే 'మతిమరుపు జబ్బు.
1.
జీవితమంతా కష్టించి పిల్లా పాపా అంతా ప్రయోజకులైన జీవితంలో
స్థిరపడ్డాక ఇక ప్రశాంతంగా బతికేయచ్చన్న దశలో మెదడు తలుపు తట్టడంతో మొదలవుతుంది
మతి మరుపు జబ్బు తొలి అడుగు.
2.
కొద్దిగా మతిమరుపు. తాళాల గుత్తి మర్చిపోవడం.. సెల్ ఫోన్ ఎక్కడ
పెట్టారో వెతుక్కోవడం లాంటివి రెండో దశలో పడే అడుగులు. ముసలితనం వస్తుంది కదా..
మతి మరుపు సహజమేనని నవ్వుతూ సరి పెట్టుకోవడం పరిపాటి సాధారణంగా చాలామందికి.
3.
అదక్కడితో ఆగితే అద్రిష్టమే. కానీ ఆగదు. హఠాత్తుగా మాటలకోసం
వెదుక్కోడం మొదలవుతుంది. పలుకులో తేదా వస్తుంది. చూపుల్లో కూడా ఏదో కొత్త మార్పు!
బైటవాళ్లకి తెలీక పోవచ్చుగానీ.. ఇంట్లో వాళ్ళకు ఆ వెల్తి తెలిసిపోతుంటుంది. ఇది
మూడో దశ అడుగు.
4.
రోజూ కనపడే పాలబ్బాయి.. పేపరు కుర్రాడు.. పనిమనిషులు కూడా
అపరిచితులుగా అనిపించడం మొదలు పెడితే జబ్బు ముదిరి నాలుగో దశలోకి అడుగు
పెట్టిందన్న మాటే!
5.
ఐదో దశలోకి వచ్చి పడ్డారంటే నరకానికి సగం దూరంలోకొచ్చి పడ్డట్ల్. ఈ
దశలో తేదీలు.. వారాలు.. ఫోన్ నెంబర్లు.. పరిచితుల పేర్లు.. అన్నింటిలో
గందరగోళమే.ఒకరి సాయం లేకుండా పని ముందుకు సాగే పరిస్థితి ఉండదు.
6.
పూర్వంనాటి వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధమైన స్వభాభం! రాముడు
రావణాసురుడు.. బుద్ధుడు దూర్వాసుడు.. ఇలా! ఎంతోమంది మేధావుల్ని ఈ ఆరో దశలో
చూసినప్పుడు అబ్బురం అనిపిస్తుంది. దగ్గరి వాళ్ల యాతన చూసి హృదయం క్షోభిస్తుంది.
7.
కండరాలు ఆసాంతం నియంత్రణ కోల్పోయిన దశ. దైహిక అవసరాలు కూడా స్వయంగా
నియంత్రించుకోలేని అసహాయ స్థితి. తింటూ తింటూ ముద్ద మింగడం మర్చి పోతారు. నడుస్తూ
నడుస్తూ దారి మర్చి ఆగిపోతారు. బైటి ప్రపంచానికి ఇక లేనట్లే. ఇంటి మనుషులకు గతం
తాలుకు గుర్తు మాత్రమే!
ఇహలోక యాత్ర చాలించడమొకతే తరువాయ
ఇహ.
నూట పదేళ్ల కిందట ఒక జర్మన్
వైద్యుడు ఒక మహిళలో ఈ అల్జీమర్స్ వ్యాధిని మొదటిసారి గుర్తించాడు. అతని పేరుమీదే ఈ
వ్యాధి ప్రపంచానికి పరిచయమైంది.
మెదడుమీద అంతులేని విశ్వాసంతో
ఉంటామా మనం. ఆ పెద్దరికాన్ని అది చివరి వరకు నిలబెట్టుకొంటే మంచిదే. అంతా ముగిసి
పోయింతరువాత చేతులెత్తేసే గుణం దానికి . అప్పటి వరకు ఏమీ జరగనట్లే గుంబనగా ఉండటం
వల్లే ప్రపంచంలో ఈ అల్జీమర్స్ వ్యాధి పీడితులు దిన దిన ప్రవర్ధమానమవుతున్నారు.
తొలిదశలోనే పసిగట్టే పరిజ్ఞానం
ఇంకా అభివృద్ధి చెందలేదంటున్నది వైద్య పరిశోధనా రంగం!
అల్జీమర్స్ వ్యాధికి తొలి సూచకం
మతి మరుపు అనుకుంటాం. అది పొరపాటు. వాస్తవానికి అది అంతానికి ఆరంభం. అంచనాలకు
అందని కారణాల కారణంగా మెదడులోని చైతన్య కణాలు క్రమంగా నిర్జీవమయిపోతుండటం మాత్రం ఈ
వ్యాధికి మూలం- అన్నంత వరకు మన వైద్య విజ్ఞానం అభివృద్ధి సాధించగలిగింది!
సెల్ ఫోన్ నెంబరు మర్చిపోతే అది
మతిమరుపు. అసలు తనకో సెల్ ఫోన్ ఉందన్న సంగతే మర్చిపోతే అది అల్జీమర్స్!
చురుకు దనం లోపించడం.. మౌనాన్ని
ఇష్ట పడటం.. నిర్ణయాలు తీసుకోడంలో తడబాటు.. మాటతీరులో కాస్త గందరగోళం.. లైంగిక
వాంచల్లో మార్పు..శుభ్రత మీద ఆసక్తి తగ్గడం.. దైహిక అవసరాలకి సాయం అవసరం
అనిపించడం.. ఇలా ..ఒక్కో వ్యక్తిలో.. ఒక్కో విధంగా.. కాస్త ఎక్కువగానో,.. తక్కువగానో.. కనిపించి.. కాలక్రమేణా తీవ్రత పెరుగుతూ పోతుంటే రాబోయే
అల్జీమర్స్ పెను గండానికి ముందు సూచనగా భావించాలి.
ప్రతి ఇరవై మందిలో ఒకరు ఈ వ్యధికి
ఆప్తులవుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. సంకోచించె దశను అధిగమించి
వైద్యుణ్ని సంప్రదించే దశకు రోగి చేరుకునే వేళకే వ్యాధి ముదిరి పాకాన పడుతుండటం
సాధారణంగా జరుగుతున్న పరిణామాలు. ఈ దశలో వైద్యులూ రుగ్మత తీవ్రతను తగ్గించే
ప్రయత్నం తప్ప పూర్తిగా రూపుమాపేంత చికిత్స చేయలేరు. కారణం ఇంకా అటువంటి విధానం
వెలుగులోకి రాకపోవడమే!స్వభావంలో వచ్చే మార్పులకి.. జ్ఞాపకశక్తికి.. నిద్రలేమి
సమస్యకి సంబంధించిన చికిత్సలద్వారా అల్జీమర్స్ వ్యాధి తీవ్రత వేగాన్ని తగ్గించే
పద్ధతి అవలంబిస్తున్నారు మెదడుకు సంబంధించిన స్కానింగ్.. కుటుంబ సభ్యుల స్పందాలను
ఆధారం చేసుకొని అల్జీమర్స్ ను నిర్ధారించుకుంటున్నారు వైద్యులు.
'తన్మత్ర' అనే మళయాళీ చిత్రం ఈ అల్జీమర్శ్ సమస్యచుట్టూ అల్లిన చిత్రం. పరువంలో ఉన్న ప్రియురాలి
ముద్దు పేరు.. భారతియార్ కవిత్వం కథానాయకుడు కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి
తెస్తాయి. సినిమా కాబట్టి సుఖాంతం చేయక తప్పలేదు కానీ.. ముదిరిన మతిమరుపును అంత
సులువుగా నయం చేయడం కుదిరే పని కాదు ప్రస్తుతం ఉన్న వైద్య పరిజ్ఞానం సాయంతో. 'మైనే గాంధీకో
ఇంతా చెప్పి ఈ వ్యాధితో మానవ
ప్రయత్నంగా మనం పోరాడవలసిన విధానాలు కూడా కొన్ని తెలుసుకోక పోతే అసంతృప్తిగా
ఉంటుంది కదా!
వాటిలో కొన్ని ఇవిః
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సంబందాల మధ్య బతికే వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశం
తక్కువని అమెరికన్ పరిశోధకుల భావన. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం.. చదరంగం వంటి
మేధో క్రీడల్లో ప్రావీణ్యం.. పజిల్సు పూరించడం.. గుండెనూ, మెదడునూ
సదా ఉత్సాహంగా ఉంచుకోవడం.. బుద్ధికి సంబంధించిన విద్యల్లో నిరంతరం చేసే ప్రయత్నాలు..
ఒక రకమైన జాగ్రత్తలైతే,, మధుపానం, ధూమపానం..
వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం.. అలవాట్లకు సంబంధించిన జాగ్రత్తలు.
మిగతా దేశాలతో పోలిస్తె మన దేశంలో
ఈ మతిమరుపు మహమ్మారి విరవిహారం కాస్త తక్కువే. కారణం 'పసుపు' వాడకంమీద మనకుండే ప్రత్యేక శ్రద్ధ.కరివేపాకును
కూడా ఉప్మాలో అయినా తిసి అవతల పెట్టకుండా చక్కంగా తినేయడం మంచి పద్దతి అంటున్నారు
మన వైద్యులు.
పుస్తక పఠనం.. రచనా వ్యాసంగం
అల్జీమర్స్ వ్యాధి నిరోధానికి సృజనాత్మకమైన చిట్కాలు. ప్రార్థన, ధ్యానం, తోటపని, సంగీతం కూడా
మతిమరుపుకి వ్యతిరేక శక్తులే.
గంటల తరబడి టీ. వీ చూసే అలవాటు
ఉంటే మాత్రం వెంటనే తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది- అని సలహా ఇస్తున్నారు
ఇజ్రాయిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.. కేజ్ వెస్టర్న్ విశ్వవద్యాలయాల
పరిశోధకలు.
సూచనః నేను వైద్య రంగానికి సంబధించిన వ్యక్తిని కదు. కాని
సాధారణ ఆరోగ్యంమీద గల శ్రద్ధ వల్ల ప్రసిద్ధులైన వైద్యులు రాసే వ్యాసాలు శ్రద్ధగా
చదివే ఆసక్తి ఉన్నవాడిని. ఈ వ్యాసానికి మూలం -21,సెప్టెంబరు, 2008 నాటి ఈనాడు ఆదివారం అనుబంధంలోని
వ్యాసం. ఈనాడు యాజమాన్యానికి, ఆదివారం అనుబంధం సంపాదకులకు దన్యవాదాలు)
No comments:
Post a Comment