Saturday, September 17, 2016

పెళ్లానికి ప్రశంస- పెళ్లాల ప్రశంసా దినోత్సవ సందర్భంగా!

సెప్టెంబరు 18- భార్యల ప్రశంసా దినోత్సవ సందర్భంగా
ఆలయాన వెలసిన ఆ దేవుని రీతీ.. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతీ..!’
 'ఇంటి జ్యోతివి.. ఈ రాగాలేవిఁటి పరగడుపునే?!'
ఏ గోలైనా చేయచ్చు! మీ మగాళ్ల రూళ్ళు.. రూళ్లకర్రలు..  వుయ్ డోంట్ కేర్! ’ఇవాళ 'భార్యల దినం!' ‘
'దినమా? ఆ పదమే.. ఏంటోగా ఉంది. పోనీ 'ఉత్సవం' అనన్నా అనరాదా అనూరాధా! వింటానికైనా ఉత్సాహం ఉంటుందీ!
'ఉత్సాహాలు పదాల్లో ఉంటాయా బండబ్బాయ్ గారూ!.. ఐ మీన్.. బండి అబ్బాయిగారూ! భర్తలు ప్రియంగా  పాడే  'డార్లింగూ!.. ఓ మై డార్లింగూ.. ' లాంటి రొమాంటిక్ పాదాలమీద కదా ఉండేదీ!'
'ప్రియం' అంటే ముందు మా మగాళ్లకు  పెళ్లాలకన్నా ఏటేటా ముంచే  బడ్జెట్టుకి  ముందే పెరిగే సిగిరెట్ పెట్టెలు గుర్తొస్తాయ్ ప్రేయసీ!'
'ఛీఁ!.. ఛీఁ! మొగుడూ పెళ్లాలం.. ముద్దూ ముచ్చట్లు పెట్టుకొనే వేళ.. ఆ కంపు  పెట్టెల గోలేల నాయకా! ఇవాళ పెళ్లాలని ప్రశంసించాలని చెప్పినా ఈ వేళాకోళాలేల బాలకాఅంతంతలేసి కవిహృదయాలూ గట్రా వంటబట్టకపోతే.. పోనీ..  బంగారిమామ పల్లెపదాల బాటైనా  పట్టొచ్చుగా! 'ఈ నాటి మన వూసులేనాటికీ.. ఎంత దూరానున్నా వంతెనల్ కట్టాలనీ..!' ఆహాహా!  ఎంత రోమాంటిగ్గా రాసాడో కదా కొనకళ్ల!'
'హలో! ఆ కళ్లల్లో మెరుపులేమిటి భామా? ఈ బంగారి మామలెవర్తల్లీ మొగుడూ పెళ్లాల ముద్దూ ముచ్చట్ల   మధ్యలో ?'
'బంగాళా వేపుళ్ళు తప్ప తవఁరికీ బంగారాలూ.. శృంగారాలూ.. ఎలా  తలకెక్కుతాయిలే! చీఁ! బంగారంలాంటి మూడును  మూడు ముక్కలు చేసేవుగదా ప్రాణేశ్వరా! నిన్నూఁ..!'
'బాగుంది!!భహు బాగుంది! ఇవాళ  పెళ్లాలని ప్రశంసించే దినమా? మొగుళ్ళని రాచి రంపాన పెట్టి హింసించే దినామా.. భామా? ఈదీ అమీను.. సద్దాం హుసేనూ.. హిట్లరూ.. ఎట్సెట్రా.. ఎట్సెట్రా.. ఇంట్లో పెళ్లాలకన్నా డిక్టేర్లట్రా?' అనక్కడికీ మా  నక్కా వెంకట్రావొక్కటే చెవినిల్లు కట్టుకొని  మరీ పోరాడు. విననిస్తేనా  పాడు బుద్ధి! వయ్యారి నడక.. వాల్చూపు సెగ.. గుండె దడ  తట్టుకోలేకొచ్చి ఈ వగలాడి  వళ్లో కొచ్చి పడిపోయాను! ..ద్యావుడా!’
'మరే! హ్హి.. హ్హి.. హ్హి.. హ్హీ!'
'ఆ ఒక్క నవ్వే యేలు.. వజ్జెర వయిడూరాలు'
'చాల్చాలు బాబూ .. తమాషాలు! పాటల్తోనా బోల్తా పడేయాలు.. వేషాలు!'
'ఇదే విరసమంటే! ప్రశంసించాల్సిందేనని  హింసిస్తారు! మెచ్చుకుంటే మాత్రం ఇలా  ఇచ్చకాలనేస్తారు! శ్రీమతులంతా ఇలా శివకాశీ బ్రాండులైపోతే.. మా మొగుళ్లకిహ .. కాశీయాత్రలే కదా అంతిమంగా గతి!.. ..'కాశీకి పోయాను రామాహరీ! గంగ తీర్థంబు తెచ్చాను రామాహరీ!..'
'ఆపుతారా స్వాములూ ముందా ఆపసోపాలు! పెళ్ళికి ముందే తవఁరి కాశీ యాత్రలన్నీ  క్లోజు. అలవాటు లేని అవపోసనాలకి పోయి శ్రీవారిలా జావళ్లందుకుంటే  'మోటూ'గా మారేది నా వళ్లే! ఆనక సూటి పోటు మాటలు పడేదీ  మా వాళ్లే!'
' 'మోటూ'ల్తోనైనా ఎలాగో నెట్టుకు పోవచ్చు మా మొగాళ్ళు. మీ  పెళ్లాలు.. ఇల్లనే టీవీ సెట్లకు  'రీమోట్లు'గా మమ్మల్ని  మార్చాలని చూస్తేనే మాకు వళ్ళు మండేది.  ఏ మఠానికైనా   పారిపోవాలనే తట్టేది. పక్క దేశం స్వర్గానికన్నా మిన్నగా ఉందని  ఎట్లాగూ టాకొకటి ఊపందుకుంది.. తస్మాత్ జాగ్రత్త .. తరుణీమణీ!  బహుభార్యాత్వం మగాడి జీవితకాలాన్ని మరింత పొడిగిస్తుందనికూడా ఈ మధ్య బ్రిటన్ షివెల్డ్ విశ్వవిద్యాలయం పెద్దలు  పరిశోదనలు చేసి మరీ భరోసాలిచ్చేసారు.. మరి’'
' 'నాతి చరామి' అంటూ పెళ్ళినాడిచ్చిన మాట సంగతేంటీ మహారాజశ్రీ మొగుడుగారూ? మంగళ సూత్రాలు  మా మెళ్లలో మరికొంత కాలం  వేళ్లాడేందుకోసం  కుష్టు మొగుళ్లను.. భ్రష్టుమొగాళ్లని..  తట్టల్లో.. బుట్టల్లో..  మోసుకొంటూ సానివాడల చూట్టూతా చక్కర్లు  కొట్టే రోజులు కావివి..  లొట్టలేసేయకండి! ఈ కాలం ఇల్లాళ్లం! మరీ.. అంత మంచి గయ్యాళులం కాం! 'నా ఇంటి సామ్రాజ్యానికి నవ్వొక్కదానివే పట్టమహిషవ'ని అగ్ని సాక్షిగా పెళ్ళినాడు మాటిచ్చారు! కాబట్టే.. మీ మొగాళ్లెంత మొద్దురాచిప్పలైనా .. మాడు మీదెక్కించుకొని ఇష్టంగా  తొక్కించుకొంటున్నది ఆడాళ్లం! మైండిట్… మైడియర్ డార్లింగ్! పెళ్లికి ముందూ కళ్లు మూసుకొని.. పెళ్లయిన తరువాతా.. నోర్మూసుకోమంటే..నో.. వే! గృహహింస చట్టం సెక్షన్లు యాక్షన్లోకొచ్చేస్తాయ్ మరి! ఖబడ్దార్ సర్దార్!'
'వామ్మో! మరి.. తానమ్ముడు పోయైనా సరే దీనుడైన నాధుడి యావ తీర్చాలన్న   సుమతీశతకం పద్యం గతి?'
'మతిలేని పద్యాలు.. శృతిలేని సూక్తులు!  తలలాడించే పిచ్చితల్లులెవరూ లేరిక్కడెవరూ ఇప్పుడు. తెలుసుకొని మసులుకొంటే మేలు  మేల్ చవనిసిష్టుల్లారా! శివయ్య కాలం కాబట్టి మొగుడి  వంట్లో  భాగంకోసం కేదారేశ్వరీ నోము నోచిందేమో మా  శ్రీ గౌరమ్మ తల్లి!   ఈ-కాలం ఈ కాలం. మొగుడి మెళ్లోకో  డోలుగా మారింతరువాత.. మోతైనా సరే .. తిరగమోతైనా సరే.. మా  శ్రీమతుల చేతుల మీదుగానే సాగి తీరాలి.  శ్రీవార్ల ఆస్తిపస్తులు..  జీత భత్యాలు.. పింఛన్లు..  భరణాలు.. ఆభరణాలు.. అన్నింటిమీదా చట్టబద్ద్జంగా మా శ్రీమతులకే సర్వహక్కులు
'మరేఁ! మనీపర్సు చిల్లరైనా కాపాడుకోవాలిగా  మా మగాళ్లం!  మగనాళ్లతో ఇకిలింతలకైనా  పోక తప్పని  దుస్థితి తెచ్చిపెట్టారు  మీ ముద్దుగుమ్మలు! 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరూ! .. షాదీ మాటే వద్దు గురూ!' అంటూ కోట శ్రీనివాసర్రావు చెవిలో కోట కట్టుకుని  మరీ పాటేసాడు మనీ సినిమాలో. శని   విననిస్తేనా! అనుభవిస్తున్నాం అమ్మళ్లూ  అందుకే ఈ బాండెడ్ లేబర్లూ! హ్హుఁ'
'ఒయాసిస్సును చూసా.. ఎడారని బెదిరేది వయస్యా! సావిత్రి పక్కనుండబట్టే సత్యవంతుడికా ప్రాణాలు మళ్లీ దక్కింది. సీతమ్మతల్లి తోడుండబట్టే రామయ్యతండ్రి వనవాసం హనీమూన్ను మించి రక్తి కట్టింది!  పెళ్లాలంతా కళ్లాలైతే   వేలాదిమందిని వెంటేసుకొని తిరిగిన గోపాలుడో   వెర్రిబాలుడా? ముక్కు మూసుక్కూర్చునే విశ్వామిత్రుడంతటి మునిముచ్చుకే   మేనకమ్మతల్లి కంటబడగానే కళ్లు చెదిరాయి! ఆడపొడే పడని   రుష్యశృంగుడు శాంతమ్మతల్లితో సంసారమెంత ప్రశాంతంగా చేసాడో తెలిసీ..’
'షటప్పూ..  నీ అష్టాదశ పురాణాలకి! షట్కర్మచారిణి.. సహధర్మచారిణి..  అంటారు కదా..  మన పెద్దాళ్ళంతా! ఖర్మకాకపోతే అందులో  ఏ ఒక్క గుణమైనా..'
'.. మాకు లేదంటావు! మనువాడిన ఆడది మగాడికి దాసి.. మంత్రి.. లక్ష్మి.. భూమి.. తల్లి.. రంభా? ఓ కే! మీకూడిగాలు చేయడానికి రడీ! కాకపోతే ఒకే కండిషన్!  ముందు మీ మగాళ్ళూ    కనీసం ఓ  రాజో.. రాముడో.. కృష్ణుడో.. కర్ణుడో.. ఇంద్రుడో.. మన్మథుళ్ళాంటి ..  కొన్ని పాత్రల్లో అయినా   సహజంగా జీవించండీ! అవీ మీరు చెప్పిన ఆ పెద్దాళ్ళు  మగాళ్లకు  విధించిన షట్కర్మలే స్వామీ!   'వై ఫై' కాసేపు లేకపోతేనే కలియుగాంతం వచ్చేసినట్లు  కంగారు పడతారే మీరు. ఇంటి బంగారం 'వైఫ్'.. రోజంతా కంటిక్కనిపించక పోయినా.. పడగ్గది వేళదాకా ..  చీమ కుట్టినట్లైనా అనిపించదు?! మగాళ్ల లోకం కాబట్టి తవఁరేం చేసినా చెల్లిపోతుందనా బాడాయి?'
 'వివాహ సంబంధాల్నుంచీ.. విడాకులు.. పిల్లల పెంపకాలదాకా.. చట్టాలన్నీ మీ ఆడాళ్లకే కదా చుట్టాలు మహాతల్లీ! మూడోవంతు కోటా చట్టసభల్లో లేకపోతేనేమి.. ఇంటి పెత్తనానికంతా ఇంతే కదా గుత్తేదార్. భా.బాలు.. ఐ మీన్..  భార్యా బాధితుల గుండెలు బాదేసుకొంటున్నారు. . ఐ.పి.సి.సెక్షను 498(ఎ) రాజ్యాంగానికే విరుద్ధమని భోరుమంటున్నారు.. ‘
'సెక్షన్ల పెర్లేవో గడగడా వప్పచెప్పేసి  తిప్పలు పెట్టేద్దామనే తవఁరీ   ఓవర్ యాక్షన్?! సంసారం వ్యాపారం కాదు బావా.. పెళ్లాన్ని 'స్లీపింగ్ పార్ట్ నర్'గా చిన్నబుచ్చేందుకు. కాపురం కాశీకి పోయే రైలుబండా.. పడగ్గదిని 'స్లీపర్ కోచిగా మార్చేయడానికి?'
'బుద్దొచ్చిందిలేవేయ్ బాలామణీ! ఇల్లొక రొమాంటిక్ జిమ్.. శృంగార వ్యాయామశాల.. మొగుడూ పెళ్లాలం అందులో ఒహళ్లకొహళ్ళు 'కోచ్' లం. ఎవరి పట్టులు వాళ్లవి. పట్టువిడుపులుంటేనే కుస్తీ సాగేది. సరేగానీ.. ఈ అమెరికా పండగలన్నీ ఈ మధ్య   ఇండియాలో చేసుకోటమేంటి?!’
'మూడొంతుల జనం ఏడాదిలో సగం అమెరికాలో ఉంటున్నాం.  ఒక్క వంతన్నా  వాళ్ల మంచి ఆలోచనలను మనం  ఆచరిస్తే తప్పేందే చెప్పు మహాశయా! కన్నవాళ్లందర్నీ కాదనుకొని.. కట్టుకొన్నవాడే సర్వస్వమనుకొని.. గడపదాటి   కొత్త లోకంలోకి అడుగు పెడుతుంది..  పాపం ఆడది. వంటి రక్తాన్ని, ప్రాణాన్ని.. మానాన్ని.. అభిమానాన్ని ఒహడు కింద అదిమి పెట్టినా సహిస్తుంది. వాడికి   పిల్లల్ని కని పెడుతుంది. పిల్లల్ని .. వాడిని..  జీవితాంతం విశ్వాసంగా కనిపెట్టుకొని ఉంటుంది. రోజులో సగం సమయం నిద్రకనే  ఉన్నా.. ఆ మగతలో కూడా  మొగుడో..  పిల్లలోఅంటూ  కలవరించే   పిచ్చిది ఆడది. గీజరు ఓ రెండు నిమిషాలపాటు ఎక్కువగా వాడుకుందని గొడ్డులా బాది చంపేసే మొగాళ్లు మొనగాళ్లుగా బోర విరుచుకొని ఆంబోతుల్లా బైట తిరిగే వేళ వచ్చిందీ 'భార్యామణులను ప్రశంసించే ప్రత్యేక సందర్భం'. అమెరికా పండగైతే ఏంటి.. అనకాపల్లి ఆడపిల్లైనా  ..మొగుడు  మనసారా ఒక్కసారి చేరదీసి   పలకరిస్తే చాలు..  రోజంతా .. ఇంటిని.. ఇంటి మనసులని.. తాజా రోజా పరిమళాలతో ముంచెత్తి పారేస్తుంది'
'హలో! ఝాన్సీరాణిగారు కత్తి దించేసెయ్యాలి ఈ జానకీ రాముడు ప్రశంసాపూర్వకంగా ఇచ్చే  పూలగుత్తి అందుకోవాలి!

***
-కర్లపాలెం హనుమంతరావు 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...