Friday, September 16, 2016

కథ చెప్పినా 'ఊఁ' కొట్టేది లేదమ్మా! - సరదా గల్పిక


కథ చెప్పినా 'ఊఁ' కొట్టేది లేదమ్మా! ఎంతసేపని ఒకే అక్షరం? బోరు. నేను 'ఊఁ' అన్నంత మాత్రాన నీ వింటున్నట్టు లెక్కా? నీకు చెప్పాలని అనిపిస్తే చెప్పుకో! నాకు వినాలనిపిస్తే వింటాను. లేకపోతే లేదు. బలవంతంగా 'ఊఁ' కొట్టించినంత మాత్రాన నీ వళ్లోకి వచ్చె పరిగి పడేదేంది? ఇవాళ 'కథ' అంటావు. రేపు సుద్దులు మొదలు పెడతావు. ఎల్లుండి నీ కడుపులో ఉన్నదంతా పాటగా మొదలు పెడతావు! ఎన్ని పాత సినిమాల్లో శ్రీ రంజనులు.. వాణిశ్రీలు వేలెడంతైనా లేని బుడ్డి పాపాయల్ని  సొంత గొడవలతో వేధించి వేపుకు తినడం చూళ్లేదూ! కళ్లైనా పూర్తిగా తెరిచి చూడని బుజ్జి పాపాయిలం నీ సోది పాటల్లోని అర్థాలు ఎలా అర్థం చేసుకొంటామే? అర్థం చేసుకొన్నా మేం చేసేది మాత్రం ఏముంటుందే? ఆ మాత్రమైనా తెలివి లేని నీ కడుపులో పడ్డందుకు నన్ను తిట్టుకోవాలనుకుంటే నీ బోరు స్టోరీలో .. పాటలో.. మొదలు పెట్టుకో! విన్నట్లు దాఖలా కోసం నన్ను మాత్రం 'ఊఁ' కొట్టమంటే .. నో వే!

చిన్నపిల్లోడి నోట్లో ఇన్ని పెద్దమాటలేంటని బుగ్గలు నొక్కుకోవదుదు. ఇవాళ అమ్మవు నువ్వు చెప్పావు కదా అని అభిమానంతో 'ఊఁ' కొట్టానే అనుకో! అదే అలుసుగా తీసుకొని రోజూ నువ్వు పురాణం మొదలు పెడితే నేనెట్లా చచ్చేది?ఇంత పసి వెధవను. ఇప్పుడే నాకీ కథలూ.. కాకరకాయలూ.. అవసరమా.. చెప్పమ్మా? కథలు వినడానికి భయమెందుకురా? అని నువ్వంటావని తెలుసు. నువ్వు మన ఇంటి గొడవలో.. చుట్టాల గొడవలో.. పక్కింటి వాళ్లతో గొడవలో..  కథలు కథలుగా చెబితే.. అదో రకం! పురాణాలు మొదలు పెడతావు.. పుణ్యపురుషుల కథలంటావు.. త్యాగాలు చేసిన వాళ్ల కథలంటూ కాస్త అతిశయోక్తులు గట్రా జోడించి మొదలు పెడతావు. ప్రజాసేవ చేసినవాళ్ళంటూ.. వాళ్లలా పెరగాలంటావు. ఇప్పట్నుంచే బంధనాలు!  నువ్వు చెప్పమ్మా! మీ లోకం మహాత్ములు మహాత్ముల్లా బతికే తీరులో ఉందా? అమాయకంగా నువ్వేదో కథలల్లి చెప్పడం .. అంతకన్నా వెర్రి పుచ్చకాయలా నేను విని అలా తయారవాలని అనుకోడం.. అలా కుదరకా ఆనక ఏదో తప్పు చేసినవాడికి మల్లే ఇంట్లో నీ ముందూ.. నాన్నారి ముందు తప్పించుకు తిరిగడం.. ఇదంతా వద్దు! హాయిగా వెళ్లి నీ మానాన నువ్వు కళ్ళు మూసుకొని పడుకో! నా మానాన నేను నాకు నచ్చిన ట్యూనులు వినుకుంటూ కునుకు పట్టినప్పుడు.. కాస్సేపు కళ్లు మూసుకుంటా! గుడ్ నైట్ మామ్! గది తలుపేసి వెళ్లు! పోతూ పోతూ.. ఆ లైటార్పేసి.. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి పో!'
***
-కర్లపాలెం హనుమంతరావు
(మూలంః ఆదివారం ఆంధ్రజ్యోతి- 2, అక్టోబర్, 2011- ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి కృతజ్ఞతలఓ)

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...