(మాములు) జనంనోట తరచూ వినిపించిన ఓ చౌకబారు పాట పల్లవిది.
అప్పట్లో ఒక సినిమాలో హాస్యగాడు కూడా ఈ పల్లవి తోనే ఒక పాట ఎత్తుకుని పాడాడు కూడా. దాంతో అది మరింతగా జనం నాలికల మీద నాట్యమాడింది.
సరే... ఇంతకీ ఈ పాటకి అర్థం ఏమిటి?
'అప్పన్నా' అని వుంది కనక
ఇదేమన్నా విశాఖపట్నం ప్రాంతం లోనిసింహాచలం దేవుడు అప్పన్న పేరున
కట్టిన పాటా అలాంటిదే అయివుంటే ఆ ప్రాంత ప్రసిద్ధ కవులు,మేధావులు
పురిపండా, శ్రీ శ్రీ,ఆరుద్ర లాంటి
వారన్నా ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావించివుండాలి కదా! అలా ప్రస్తావించిన దాఖలాలు ఎక్కడ కనపడవు! కానీ ఆ ప్రాంతపు సంగీత కళానిధి ద్వారం వెంకట స్వామి నాయుడుగారు తమ కర్ణాటక సంగీత కచేరీ చిట్టచివరి అంశంగా వినిపించే జానపదాల గీతాల తోరణ మాలికలలో ఈ పాట కచ్చితంగా వినిపిస్తుండేది. కాకినాడ శెమ్మా
గోష్టులలోకూడా ఈ పాట
వరసల్లోనే దశావతారాలు పాడుతుండే వారని ప్రతీతి. "జాలమూ ఏలనురా, నీల మేఘ శ్యామ.. పాలించు గుణధామ భద్రాద్రిరామ!"అని అన్ని అవతారాలు ఆ వరసల్లోనే సాగుతుండేవి.
దీని సంగీతం హిందూస్థానీ- దేశ్ రాగాలకు దగ్గరలోవుండేది.
దీనికిమూలమయిన గేయ౦ మాత్రం "అప్పన్నా తనా మనా"నే అంటారు రజనికాంతారావు గారు.
అసలు ఇంతకీ ఇంతగా ప్రాచుర్యం
పొందిన ఈ పదాలకి అర్థం ఏమిటి?
ఒక్కొక్కరు ఒక్కో రకమయిన అర్థం చెప్పటమే ఈ పదాలలోని విశేషం.
'ఇద్దరు తాగుబోతుల మధ్య సాగిన సంవాదం' అంటూ ఆయన సరదాగా ఇలా వివరణ ఇచ్చేవారట. "అప్పన్నా!
తన్ననా?.. మాననా?" అని ఒకడు మత్తులోఅడుగుతుంటే రెండో వాడు "మారోరె భైరన్నా!"(కొట్టరా కొట్టు) అని రెచ్చగొట్టేవాడుట! జ్ఞాని, తపస్వి, కలకత్తా నుంచి కేరళ వరకు దేశంలోని
అన్ని ప్రాంతాలు దర్శించిన శ్రీ
బాలాంత్రపు రజని కాంతారావు గారి
బాబాయి సూర్యనారాయణరావుగారు సంగీతంలోని జానపదబాణీలనుంచి, బజారు మట్టపు కబుర్ల దాకా
బ్రహ్మపదార్థాల్లాంటి విషయాలనుకూడా చక్కగా అర్థసహితంగా వివరించగల ఘటనా ఘటన సమర్థుడు. అయన
గారికి రజనీ కాంతారావుగారు ఈ పాట
అర్థం తత్త్వసమన్వయం చేసి ఇలా సెలవిచ్చారుట. 'ఇది తెలుగు తాగుబోతుల పాట కాదు. సూఫీ సంబంధమయిన వేదాంతగర్భితమయిన హిందూస్థానీ
ఫకీరు ఉపదేశ సారం ."అపనా తన్ న మాన్ నా(నీ శరీరం సంగతి పట్టించు
కోవద్దు. మరోరె భయ్ రహ్ నా! (చనిపోయినవాడు ఉండే స్థితిలో ఉండరా సోదరా!).అని ఉపదేశార్థంట!. చనిపోయిన మనిషి
ఎంత ప్రశాంతంగా వుంటాడో అంత ప్రశాంతంగావుండమ'ని ని రామదాసుకు
తారక మంత్రం బోధ చేసిన ఏ కబీరుదాసువంటి మహానుబావుడో మన ప్రాంతపు జానపదులకు చేసిన ఉ పదేశమని రజనీగారి 'భాష్యం'!
తెలుగు భాషలోని పదబంధాలతో ఎన్ని చమత్కారాలు చెయ్యవచ్చో! ఆ విషయం సోదహరణంగా చెప్పటానికే ఎప్పుడో చదివిన ఈ సరదా సంఘటనని ఇక్కడ ఇప్పుడు పొందుపరిచింది!
(బాలాంత్రపు రజని కాంతారావు గారి 'రజనీ భావ తరంగాలు' నుంచి సేకరించి దాచుకున్న చమత్కార గుళిక ఇది)
***
No comments:
Post a Comment