Tuesday, September 20, 2016

ముళ్లపూడి 'పూల'రెబ్బలు!- చిరు వ్యాసం

ముళ్ళపూడి వెంకట రమణగారు మనకున్న హాస్య రచయితల్లో 'సీరియస్' హాస్యరచయిత. ఏ  రచయితకయినా ఓ బాణీ ఉంటుంది. ఉండాలి. అలా ఉండకుండా 'అల్లాటప్పా' గా రాసే  రచయితను.. సొంతంగా ఎంత ప్రొమోట్ చేసుకున్నా .. మొహమాటానికైనా  సమాజం గుర్తించినట్లు మొహమైనా పెట్టదు. ఆ బాపతు జాబితాలో లేనందువల్లే ము.వెం.రమణను గురించి మన ముచ్చట్లిక్కడ. 
ముళ్లపూడివారు విలక్షణమైన శైలిలో సునిశితమైన హాస్యరసౌషధాన్ని వడగట్టి మరీ రోగిష్టిమారి సమాజానికి అక్షర చికిత్స చేసిన హాస్య నారాయణుడు. మణిప్రవాళ భాష ఆయన ప్రత్యేకత. 'పురాణం' సీత వచ్చే వరకు.. (వచ్చిన తరువాత కూడా).. ఆ మిక్సరు  శైలిలో అంతగా గిలిగింతలు పెట్టిన వినోద రచయితలు ఆ స్థాయిలో మనకు  దొరకరు. అతిశయోక్తికో.. అలంకారానికో అంటున్న మాట కాదిది.
ఒక భాషలోని పదాలను మరో భాషలోకి పట్టుకొచ్చినా.. 'పరాయి పదాలు' అవన్నీఅంటూ  మరెవరో  పనిగట్టుకొని వచ్చి దెప్పిపొడిచేదాకా చదువరి బుద్ధికి తోచనంత గడుసుగా రాసుకు పోవడం ముళ్లపూడివారి కలం బలం. ఒకసందర్భంలో ఆయనే  'ప్రారంభంలో   'మణి ప్రవాళ భాష'ను ప్రయోగిస్తున్నప్పుడు.. ప్రచురించేందుకు పంపించిన పత్రికాఫీసుల్లోని దిద్దుబాటు పెద్దలు (ఎడిటర్లు) ఆంగ్లపదాలను పనిగట్టుకొని మరీ దిద్దిపెడుతుండేవారు. ప్రతీ రచనకు ఒక తనదైన పరిమళం (ఎస్సెన్సు) ఉంటుది కదా! ఆ సౌరభాన్ని సమాజం గుర్తించే వరకు పాలుమాలకుండా నేను అలా రాసుకుంటూ పోవడమే  రచయితల శ్రేణిలో నా పాలుగా  నేను సాధించుకున్న విజయం.. ఏదైనా ఉంటే!'.. అంటారు. సరిగ్గా ఇలాగే అనక పోయినా ఈ అర్థం వచ్చేవిధంగా చాలా సందర్భాల్లో చెప్పుకొస్తుండేవారు.
ముళ్లపూడి వారిది మరీ విదూషక సాహిత్యం అనుకుంటే ఆయన అక్షరాన్ని  సరిగ్గా అర్థం చేసుకోనట్లే. విషయం ఎంత గంభీరమైనదయినా సరే .. చదువరుల బుద్ధికి సరళంగా.. సర్దాగా..  ఎక్కించేటందుకు ఆయన స్వయంగా కనిపెట్టుకున్న కనికట్టు విద్య ఆయన శైలి. 'సీరియస్' అంశాన్ని సీరియన్ గానే రాయలేక ఈ అగచాట్లన్నీఅని విమర్శలకు దిగేవారికి ఆయన 'కానుక' కథ   ఒక చక్కని సమాధానం.
ముళ్లపూడి వెంకట రమణ లేకపోయుంటే 'హలో! ఓ ఫైవుందా?' అంటూ వెంటబడే అప్పుల అప్పారావు పుట్టుండేవాడు కాదు. బుడుగు.. సీగాన పెసూనాంబల అల్లరితో తెలుగిళ్ళు తుళ్ళి పడుండే ఆస్కారం ఉండేది కాదు. రాధా గోపాళాల సరిగమల సరాగాలతో తెలుగు సాహిత్యపు పడకటిళ్ళు  శృంగారభరితమై ఉండేవి కావు. బాబాయి.. పొడుగు జడల సీత.. పక్కింటి లావుపాటి పిన్నిగారి మొగుడుగారు.. జట్కావాడు..ఓత్లవాడు.. పెట్టే ప్రయివేట్లు తెలుగు ప్రజలకు దక్కే లక్కుండేది కాదు. తెలుగు సాహిత్యానికి   బాపు 'బొమ్మ'ను అందిస్తే ఆ బాపూబొమ్మకు చిలక పలుకులు  నేర్పించింది ముళ్లపూడి వెంకట రమణే.
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ 'ముళ్లపూడి వెంకట రమణ సాహితీ సర్వస్యం' పేరిట  కథలు రెండు సంపుటాల్లో, బాల సాహిత్యం ఒక సంపుటం, సినిమా విశేషాలు రెండు సంపుటాల్లో, అనువాదాలతో ఒక సంపుటం.. అఖరున కదంబ సాహిత్యం గుదిగుచ్చిన రెండు సంపుటాల్లో.. (నాకు తెలిసినంత వరకు) శ్రీ ఎమ్బీఎస్ ప్రసాద్ గారి సంపాదకత్వంలో ప్రచురించారు. దాదాపుగా ఇవన్నీ నేను వివిద పత్రికల్లో చదివినవయిప్పటికీ అన్నింటినీ ఒకే చోట గుదిగుచ్చిన పూమాలలు కాబట్టి   నా చిన్ని గ్రంధాలయంలో  ఇష్టంగా అమర్చుకొని .. 'మూడ్' బావో లేనప్పుడల్లా .. ఆఘ్రాణిస్తుంటాను. హాస్యం.. వ్యంగ్యం నా విశ్రాంత సమయానికి ఇంత విలువను.. కొంత 'విలువలను' అందించే  దినుసులు.
ముళ్లపూడివారిని గురించి సమగ్రంగా.. సాధికారికంగా చర్చించే పాటి విద్వత్తు నాకు సరిపడినంతగా లేకపోవచ్చు. కానీ అభిమానం ఊరికే కూర్చోనీయదు కదా! అందుకే అప్పుడప్పుడూ నన్నిలా కాగితంబజారుకీడ్చుకొచ్చి  అల్లరి పెడుతుంటంది. అధికప్రసంగంగా అనిపించినా  సహృదయంతో అర్థం చేసుకుంటారని నమ్మకం. ఆ ధీమాతోనే  అప్పుడప్పుడు.. ఇలా.. తోచింది  తోచినట్లు పదుగురితో పంచుకునే సాహసం చేస్తున్నది.
'ఈ భూ ప్రపంచంలో ఎదుటి వాడినుంచి కృతజ్ఞత ఆశిస్తే.. నుదుటి తలబొప్పులు తప్పవ'న్నది ముళ్లపూడి వారి ఒక పాత్ర ఫిలాసఫీ. అంధ్రారాజకీయాల్లోని అనైకమత్యాన్ని ఆనాడే పసిగట్టిన మహానుభావుడు.  కాబట్టే.. ఆంధ్రుల ఆరంభ శూరత్వాన్ని అందరికి మల్లేనే ఆంధ్రుడై ఉండీ తూర్పార పట్టి మరీ పరువు తీసేసాడు. 'యథార్థవాదీ.. లోక విరోధీ' కనక .. నిజాలేమన్నా చెప్పాలనుకున్నప్పుడు తను సృష్టించిన పాత్రల ద్వారా వెంట్రిలాక్విజం చేయించే కళను నమ్ముకున్నాడు ముళ్లపూడి. తెలుగు వాడిని  నవ్వించడం కష్టం. కవ్వించడం సులభం. కవ్వించి రాళ్ళు రువ్వించే బాపతు కుళ్లుబోతురాయుళ్ళ ఆటల్నుంచి అప్పుడప్పుడైనా అమాయకమైన తెలుగు జాతికి రవ్వంత విశ్రాంతి కల్పించాలన్న  పేరాశ ఏదో ముళ్లపూడివారిని ఈ నవ్వుల ముళ్లబాట పట్టించినట్లుంది. దారి మరీ కంటక ప్రాయంగానే ఉన్నా .. నిప్పులు కురిసే  కళ్లనుంచే ఉప్పటివైనా.. తీయటి కన్నీటి బొట్లు రెండు రాల్పించాలన్న వాత్సల్యమే  ఆయన చేత  'కోతి కొమ్మచ్చులు' ఆడించింది. ఆయన విషాద విదూషక    వైదుష్యం సాహిత్య చరిత్ర పుటల్లో పదిలంగా నిలిచిపోయింది. 'రాయడం' అక్షరం వచ్చిన ప్రతీవాదూ  చేసే చేతిపనే. అదేం బ్రహ్మవిద్య కాదు.  చేతిలో ఉన్న ఆ దివ్యవిద్యకు తోడుగా మానవత్వం జోడించడమే ముళ్లపూడివారి లోకంమీది ప్రేమకు నిదర్శనం. ఆయనే ఒక సినిమాకి రాసిన సంభాషణల్లో అన్నట్లు ' నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు. ఏడుపొచ్చినప్పుడూ  నవ్వే  వాడే హీరో. ఆలాంటి హీరోలను తయారుచేసే ముళ్లపూడిని మరేమని పిలుచుకోవాలి?!
బాపుతో జత కలసిన  వేళా విశెషం. కొన్ని తరాలు తెలుగువారిని  ఆయనతో కలసి   ఊపేసారు. ఊపేస్తున్నారు.  ప్రస్తుతం మన మధ్య  లెకపోతేనేం..  తెలుగు నవ్వుల నదుల్లో..  లాహిరి ప్రయాణం చేయాలని సరదా పడే   హస్యరస ప్రియులకు ఆయన.. భావపుష్పాల.. భాషాపుష్పాల  జల్లులతో ముంచెత్తెయ్యడానికి సదా సిద్ధం!
ముళ్లపూడి వారలా  వెదజల్లిన పూలవానలనుంచి ఏరి పోగేసిన  కొన్ని మణులు.. మాణిక్యాలుః


'కరవుప్రాంతంనుంచి వచ్చిన అర్జీమీద తపాళాబిళ్ల అతికించడానిక్కూడా నాలికలు తడారిపోయున్నందువల్లా, నీటి చుక్క పుట్టనందువల్లా స్టాంపును గుండుసూదికేసి గుచ్చి పోస్టులో వేశారుట'
-రాజకీయ బేతాళ పంచ విశంతిక

'సినిమా కథలు వారఫలాల వంటివి. తారాబలాలను బట్టి మారుతుంటాయి'!
-విక్రమార్కుడి మార్కు సింహాసనం కథలు

'బుడుగుః నాకు కోపం వస్తే 'జాటర్ డమాల్' అంటాను. ఆ మాటకు అస్సలు అర్థం లేదంటాడు నాన్న. ఎందుకు లేదు? ఉంటుంది. తెలియాలి అంతే! జాటర్ డమాల్ అంటే అర్థం లేదూ అని అర్థం అన్నమాట.'
-బుడుగు నవలలో

'కోటీశ్వరి ఒకానొక్క కొడుకుని పకడ్ బందిఖానాలో పెంచింది'
-పెళ్ళికొడుకు సినిమా

'ఇంట్లో కుక్కల్నుంచుకుంటారుట్రా ఎవరైనా? మధురవాణ్ణుంచుకుంటారు. ఆవకాయనుంచుకుంటారు. ఆస్తులు పంచుకుంటారు. కానీ కుక్కపిల్లను పంచుకోడమేవిట్రా?'
-రావికొండల్రావుమీద వ్యాసం రాస్తూ

'రాక్ ఫెల్లర్ కి ఎంత డబ్బున్నా జేబులో  వేసుకు తిరగడు కదా! ఓ అర్థణా బఠాణీలు కొనబోయినప్పుడు చెక్కులిస్తే వాడు పుచ్చుకోడు కదా! అప్పు చెయ్యకేం చేస్తాడు పక్కవాడి దగ్గర?
-ఱుణానందలహరి
ఇలా చెప్పుకొంటూ పోతే.. కడుపు చెక్కలయ్యే ప్రమాదం కద్దు. అంచేత ప్రస్తుతానికి 'ది ఎండ్'.. పైనున్న పెద్దాయనికి మనసారా స్మృత్యంజలి సమర్పించుకుంటో!

-కర్లపాలెం హనుమంతరావు

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...