Showing posts with label Humanity. Show all posts
Showing posts with label Humanity. Show all posts

Monday, November 21, 2016

అత్తలూ కోడళ్లు- ఈనాడు ఆదివారం సంపాదకీయం


అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లంత అందమైన ద్వంద్వ సమాసం. అత్త అంటే మెట్టినింటి అమ్మ. కోడలంటే అత్తింట కాపురానికొచ్చిన కూతురు.అత్తాకోడళ్ళు కత్తులూ డాళ్లూ కాదుగదా ఇల్లు యుద్ధరంగం  చేసుకోడానికి! జానపదులనుంచి అన్నమయ్యవరకు అంతా ఆతాకోడళ్ళను గూర్చి చింతించినవారే! ఆచార్యులవారి ఓ శృంగార సంవాదంలో లక్ష్మీసరస్వతులు ఆరడి బూకటి  అత్తాకోడళ్ళు.  'రావే కోడలా! .. రట్టు కోడలా!' అంటూ అత్తలక్ష్మి రట్టు చేస్తుంటే .. కోడలు అంబశారద గమ్మునుంటుందా!  'పోవే పోవే అత్తయ్యా!.. పొందులు నీతో చాలును' అంటూ చిందులు వేస్తుంది.అత్తలందరూ ఆదిలక్ష్ములు కారు. కోడళ్లందర్లో శారదాంబలూ లేరు. అత్తాకోడళ్ల సఖ్యతను ఎంతో చక్కంగా విప్పిచెప్పే  'సీత గడియ'  అందుకు సోదాహరణం. సీతమ్మ రాక తాత్సారానికి అలిగి రామయ్య పడకగది గడియ లోపలికి బిడాయిస్తాడు. అత్తను వత్తాసు తెచ్చుకొంటుంది అవనిపుత్రి. 'దశరథుని పుత్రుడవు జనకులల్లుడవు/ భూదేవి అల్లుడవు బుద్ధిటర నీకు!/సీత చేసిన తప్పు శీఘ్రాన చెప్పు నాకు!' అంటూ ముద్దుల కొడుక్కే సుద్దులు చెబుతుంది. కొడుకుకిక తలుపు తీయక తప్పుతుందా! కథంతటితో సుఖాంతమయితే ఆ తీపిలో విశేషమేముంది! అత్త సౌజన్యానికి బదులు తీర్చద్దా కోడలుసీత! 'మా మామ దశరథులు ఒక్కరున్నారు అత్త/మీరు పోండి మా మామ కడకు!' అంటూ సగౌరవంగా అత్తగారిని శయ్యాగారానికి సాగనంపడంలోనే  కోడళ్ళు నేర్వదగిన పాఠాలు బోలెడున్నాయి. కొట్టుకొచ్చినవాడు ఒక్కడైతే.. అత్త కట్టుకొమ్మన్నది ఐదుగురు సోదరులను! కిమ్మనలేదు కోడలు ద్రుపదరాజపుత్రి! అన్నవెంటబడి అడవుల పాలయాడు  చెట్టంత కొడుకు!  దుఃఖబారంతో దీర్ఘనిద్రకు పడింది లేతకోడలు. అయినా పన్నెత్తి ఒక్కఫిర్యాదు చేయలేదు పథ్నాలుగేళ్ళు అత్త సుమిత్ర! పురాణేతిహాసాల నిండుగా  పండంటి అత్తాకోడళ్ల జతలిన్ని ఉండగా.. ఒక సక్కుబాయి కథనే అత్తాకోడళ్లకు ఆపాదించడమే లోక విచిత్రం!

అందాలు చిందేటి కొత్తకోడలంటే ఏ అత్తకైనా  మహా మురిపమే గదా!'చిలుకల్లు చిలుకల్లు అందురేగాని/చిలుకలకు రూపమేమి?పలుకులేగాని/ చిలుకల్లు మా ఇంటి చిన్నికోడళ్లు' అంటూ పదిమందికీ చెప్పి మురుసుకుంటుంది అత్త. కాలుపెట్టిన కొత్త తీరిపోగానే మరి కోడలు ఆ అత్తగారికే  బద్దశత్రువు ఎందుకవుతుందో.. బ్రహ్మయ్యకే తెలియాలి! పడకలో మగడు చేరిన సందు చూసుకొని 'చందమామకన్న చక్కని మగడా!/వేరె పోదామా!/ అత్తమామల పోరు నేను పడలేను/ వేరె పోదామా!' అంటూ జోరీగ రొదలు మొదలుపెడుతుంది. కోడళ్లందరూ అత్తలని కోఱుపెడతారని కాదూ! పుట్టినింటిని మించి మెట్టినింటిని ప్రేమించే ఆడబిడ్డలకూ లోకం గొడ్డుపోలేదు. 'పుట్టింటి దీర్ఘాయువు కావలనంచు/ పున్నమి చంద్రుడికి పూజ నే సేతు/ అత్తింటి దీర్ఘాయువు కావలెనంచు/ ఆదినారాయుడికి ఆజ్యమ్ములిత్తు' లాంటి  పాటలు ఎందుకు పుడతాయి కోడళ్ల మనసుల్లో ప్రేమాభిమానాలు లేకపోతే! ఆదరించే కోడళ్లకూ కొడుకులు కోదండాలు వేసి ఓ మూల కుదేయాలని కొందరు అత్తలు ఎందుకు కోరుకొంటారో! విధాతకే ఎరుక పడాలి! కాలం మారుతున్నది. అనుగుణంగా మగవాడి గుణగణాలూ మారుతున్నాయి. పాతకాలపు చాదస్తం అత్తగారిది. 'పాలల్లో మురిపాలు కలిపి/ కారంలో మమకారం నింపి/ అరచేతులని పాదాలకింద నిలిపి/ అపురూపంగా' పెంచుకొచ్చిన కొడుకు మరో కోమలికొంగు తాళంచెవికింద మారడం మందు మింగినట్లే ఉంటుంది. కోరి కొడుక్కని ఏరి తెచ్చుకొన్న బెల్లం  అంగిట్లో అల్లమయితే ఏ ఆత్తగారికయినా 'పచ్చిపాలమీద మీగడలు.. వేడిపాలమీద వెన్నతరకలే' గుర్తుకొస్తాయికదా కోడళ్లను రాచి రంపాన పెట్టే వంకలకు! కోడళ్లు చదువుకొంటున్నారు. సామ్ర్యాజ్యాలు ఏలుతున్నారు ఇప్పుడు. మాట పడతారా! 'వచ్చితి మే మత్తింటికి పుట్టింటిని వీడి పెక్కు యాశలతోడన్/ తెచ్చితి మేమింటి వెలుగు, మెచ్చుచు మా భర్తలు కడు డెందము మీరన్/ ముచ్చటపడి ఇంటిపనులు మురిపముగ చేయబూన ముందుకు రాగా/ రచ్చన ప్రకటించి నీవు పరిహాసము చేయబూన తగునే యత్తా!' అంటూ తగవుకు దిగడంతో అత్తాకోడళ్ల యుద్ధం ఆరంభం!



పెత్తనాలకోసం ప్రపంచయుద్ధాలే జరుగుతున్నాయి.. పంచయుద్ధాలు అబ్బురమా.. అనుకోవద్ధు! చెప్పులోని రాయి.. చెవిలోని జోరీగలా ఇంటిలోని పోరు ఇంతటితో పోయేదా! ఆత్త ఆడమని.. కోడలు కుంటమంటే మధ్యనున్న మగవాడు ఏ గోదారి ఈదాలి? 'ఏరేరు సంసార మెన్నాడు మొగుడో!.. మడికాడి సెల్కా మనపాలి కొచ్చింద/ మంచిగా దున్నించి మొక్కజొన్నేయించి/ నడీత కూసోని నా పెగ్గె సూయిత్త' అని కోడలందుకొందంటే ఇంటిపగ్గాలు అత్తనుంచి ఊడలాగాలనుకొన్నట్లే! 'అత్తమ్మ అమ్మకు మరోరూపం' అని కోడలనుకోవాలి. అందుకు  కూతురంత అపురూపంగా కోడల్ని అత్తగారూ చూసుకోవాలి. శాంతిభద్రతలు ఏ గడ్డమీదైనా ముందు ఇంటినుంచే కదా మొదలయేది! అమ్మకు చెప్పలేక, ఆలికి నచ్చచెప్పలేక.. ఇంటాయన పాటించే అలీనవిధానాలవల్లే వందకు ముప్పైమూడు ఇళ్లు వల్లకాడుల్లా కాలుతున్నాయని తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు తేల్చిచెబుతున్నాయి. పదిమందికి ఇద్దరు కోడళ్ళు అత్తారింట్లో కత్తులబోను కాపురంతో చిక్కులు పడుతుంటే.. అంతకు రెట్టింపుమంది అత్తలు అవసానదశలో కొడుకింట  పున్నామనరకంతో ముమిలిపోతున్నారని  సర్వే సారాంశం. సంసారమంటే సమస్యల తోరణం.. సరే! సమస్యలతోనే నిత్యం రణం అయితే ఎలా? శిక్షా స్మృతి  ఏవో 498 (ఏ) సెక్షనుకింద కోడళ్లకో వజ్రాయుధం అందించవచ్చు. అత్తలకోసం ఆత్మరక్షణార్థం మరేదో బ్రహ్మాస్తం తయారు చేయనూవచ్చు. అస్త్రశస్త్రాలతో సాధ్యమయేదనేనా అత్తాకొడళ్ల మధ్య సామరస్యం?  కుమారీ శతకాల వల్లెవేతలు లేకబోతే మానె.. పెళ్లిచేసి అత్తారింటికి  అప్పగించే సుకుమారీలకు కాళిదాసు కణ్వమహర్షిలా కనీస సుద్దులన్నా కన్నవారు మప్పుకోవద్దా! 'పోయేది అత్తలకాలం.. వచ్చేది కోడళ్ల కాలం' అని సామెత. అత్తలామాత్రం పెద్దరికంతో సర్దుకుపోవద్దా! అత్తాకోడళ్లంటే కలిసి 'సెల్ఫీ'లు తీసుకోవడమే కాదుగా! 'సెల్ఫ్'(స్వార్థం) పుడకలను తీసిపారేసి  సుఖశాంతులనే పానకాలని  ఇంటిల్లిపాదితో తాగించడం కూడా! 

(ఈనాడు సంపాదకీయం- ఈనాడు యాజమాన్యానికి, సంపాదక వర్గానికి ధన్యవాదాలతో)

Friday, September 2, 2016

యత్ర నార్యస్తు పూజ్యంతే.. కౌముది మరీ చి.క (మరీ చిన్న కథ)


బోరబండ సెంటర్లో బస్సు దిగేసరికి సమయం రాత్రి ఎనిమిది గంటలు.
నమ్ముకొన్న బండి మొండికేసి..  షేరు ఆటో దొరక్క.. ఒంటరిగా ట్యాక్సీలో ప్రయాణమెందుకని.. కనిపించిన బస్సు ఎక్కేసింది పనిచేసే కాల్ సెంటరు జంక్షనులో స్వాతి.
వాన కురిసి వెలిసి రోడ్లంతా చిత్తడి చిత్తడి. సూదిగాడి భయమొకటి మొదలైనందువల్లనేమో దాదాపుగా దారంతా నిర్మానుష్యంగా ఉంది!
ల్లు చేరాలంటే ఇంకో రెండు కిలోమీటర్లు.. అరగంట. అడ్డదారిలోపోతే సగం సమయం.. దూరం ఆదా! కానీ తాగుబోతు వెధవలు పొద్దస్తమానం పేకాట్లాడుకొంటూ కాట్లాడుకుంటుంటారు   పోలేరమ్మ చెట్టు కింద చేరి!
రిస్కయినా అడ్డదారిలోనే తొందరగా ఇల్లు చేరిపోవాలని మలుపులోకి మళ్లింది  స్వాతి.
పోలేరమ్మ చెట్టు అల్లంత దూరంలో ఉందనగానే తగులుకొన్నాడెవరో  దొంగవెధవ!
చీకట్లో ఆకారం పోలిక పట్టడం కష్టంగానే ఉంది.
'హాయ్! స్వీటీ!'
స్వాతి బదులివ్వదలుచుకోలేదు.
'’స్వాతీ’ అంటేగాని  ‘హాయ్’  చెప్పవు కాబోలు!'
ఉలిక్కి పడింది స్వాతి. 'ఎవర్రా నువ్వు? నా పేరెలా తెలుసు?'
'పేరేనా! నువ్వు పనిచేసే కాల్ సెంటరు.. నీ ఇంటి అడ్రసుతో సహా ఇంకా చాలా వివరాలు తెలుసు  మ్యాడమ్ గారూ!’ దగ్గరికొస్తూ అన్నాడు ఆగంతకుడు.
‘గో అవే! నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది'
'ఇంకా..'
'కరాటే తెలుసు. అవసరమైతే పోలీస్టేషనుకైనా ఫోన్ చేసే తెగింపుంది మిస్టర్!’
‘గుడ్! ఫోన్ చెయ్యాలంటే.. ఫోనుండద్దా  మేడమ్ గారూ..!'
బ్యాగ్ తడుముకొంది స్వాతిఫోనేనా.. వేలెట్టూ మిస్సింగ్!  
ళ్ళెంబడి నీళ్ళొచ్చాయి స్వాతికి. కాళ్లబేరమొక్కటే ప్రస్తుతానికి దారి.
‘వంటిమీది బంగారం మొత్తం వలిచిచ్చేస్తా! ప్లీజ్! నన్నొదిలేయ్!'
'హ్హ.. హ్హ..హ్హ! వళ్లే బంగారంలాగుంది. ఈ బంగారం వదిలేస్తాడా ఏ పిచ్చాడైనా!’
'ఏం కావాలిరా స్కౌండ్రల్ నీకూ!’ భోరుమంది స్వాతి.
‘ఇదీ! .. అదీ.. రెండూనూ!’ స్వాతి హ్యాడుతో పాటు హ్యాండుబ్యాగూ బలవంతంగా పుచ్చుకొని ముందుకు నడిచాడా అగంతుకుడు.
ప్లీజ్! నీ చెల్లెల్లు లాంటిదాననుకోరాదా అన్నయ్యా!' చెయ్యి విడిపించుకొనే ప్రయత్నంలో ఆఖరి అస్త్రం ప్రయోగించింది స్వాతి.
' ఆ మాటాన్నావూ బాగుంది. అయితే అల్లరి చెయ్యద్దు. గమ్మున  నాతో రా! ఇంకో ఐదు నిమిషాల్లో మీ ఇల్లొచ్చేస్తుంది. భద్రంగా లోపలికి పో! ఇదిగో నీ బ్యాగు. సెల్లు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొన్న తరువాతే ఇంట్లోనుంచి ఓ రింగియ్యి! నీ సెల్లోనే నా నంబరు ఉంటుంది ఆచారి పేరుతో!’
ఒక్కక్షణం అవాక్కయినట్లు చూసి ఇంట్లోకి వెళ్లిపోయింది స్వాతి.
ఐదు నిమిషాల తరువాత ఆచారి నెంబరుకి కాల్ చేసి థేంక్స్.. అన్నయ్యా.. సారీ!' అంటున్నప్పుడు స్వాతి గొంతు పశ్చాత్తాపంతో  వణికింది.
'అన్నయ్యా అన్నావు కనక సలహా చెల్లమ్మా! అడ్డదారిని ఎప్పుడూ ఎంచుకోవద్దు. పోయేకాలం వచ్చిననవాళ్లను పోలేరమ్మతల్లైనా ఏం చెయ్యలేని రోజులు ప్రస్తుతం నడుస్తున్నవి. పోలేరమ్మ చెట్టుకింద తుంటరి వెధవలు నువ్వు వంటరిగా రావడం పసిగట్టారు.  వెంటాడే  ప్రోగ్రామ్ పెట్టారు. అమ్మవారి నైవేద్యం పెడుతూ సమయానికి నేనక్కడ ఉండబట్టి   సరిపోయింది. లేక పోతే! ఆడపిల్లను తోడేళ్ళకు  వదిలిపెట్టి అమ్మవారిని పూజిస్తే వచ్చే పుణ్యం ఏముంటుంది! మాటల వంకతో నీతో నడుస్తూ..  అదిలించో.. బెదిరించో.. నీ హ్యాండూ.. హ్యాండుబ్యాగూ పుచ్చుకుని నేను నీతో కలిసి నడవబట్టే   వెనకనుంచి వచ్చే తోడేళ్ళకు మగతోడుందనే బెదురు పుట్టింది’  న్నాడు ఆచారి.
***

 కర్లపాలెం హనుమంతరావు
(కౌముది అంతర్జాల పత్రిక సెప్టెంబరు, 2016 లోని 'మరీ చొ.క' గా ప్రచురితం)

Friday, August 19, 2016

ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే- ఈనాడు సంపాదకీయం

జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం- ఇన్ని దశలు దాటి రాకముందు జంతువే మనిషి మూలరూపం. విశ్వ సంస్కృతులు జంతు తతులను విభిన్న కాలాల్లో వేర్వేరు దృక్పథాలతో చూసినా, భారతీయతది మాత్రం సృష్టి ప్రారంభంనుంచి ఒకే విధానం... దైవభావం. ఆదిదేవుడు పశుపతి. స్థితిమూర్తి శేషశయనుడు. సృష్టికర్త హంసవాహనుడు. సోమకాసురుని వాడి రెక్కలచే చీల్చి చెండాడి వేదరాశిని కాచింది మత్స్యరూపమైతే, క్షీరసాగర మథనంలో మందరగిరి కిందకు జారిపోయిన వేళ మూపు
నడ్డుపెట్టి సురాసుర కార్యానికి సాయంపట్టింది కూర్మమూర్తి. ముక్కుతిమ్మన పారిజాతాపహరణంలో వర్ణించినట్లు 'అజాండ కర్పరము బీటలు వారగ మేను పెంచి మహీ మహిళా లలామను గొమ్ము కొన దగిల్చి' నీటినుంచి యెత్తినది వరాహ మూర్తి. హరి వైరంతో అరాచకం చేసే హిరణ్యకశిపుని వధాయజ్ఞం నిర్విఘ్న నిర్వహణకు హరి ఎత్తింది అర నరావతారం. 'కుటిల నఖాగ్ర కుంచికల'తో ధర్మకార్యం పూర్తిచేసింది మిగతా సగం మృగావతారం! భగవంతుడెత్తిన ఆ నృసింహావతారమే
నరుడికీ మృగానికీ మధ్యగల బలమైన బంధానికి తిరుగులేని ఉదాహరణ. సీతాన్వేషణలో ఉన్న రాముడికి ప్రథమంగా సమాచారం అందించింది జటాయువు. స్నేహహస్తం చాచిన సుగ్రీవుడు
, బంటుభావంతో సేవించిన ఆంజనేయుడు, సేతునిర్మాణం చేయించిన నీలుడు- చివరికి అల్పజీవి అయినా అనల్ప భక్తితో సాయానికొచ్చిన ఉడుత... అంతా జంతుసంతతే. విజ్ఞత, గ్రహణ శీలత, సున్నితత్వం, దయ, ఓర్పు, ధైర్యం, దూరదృష్టి, సహానుభూతి వంటి సద్గుణ సంపదలే దైవీయ భావనలనుకుంటే- పశుపక్షి కీటక సముదాయాలను మించిన దేవతామూర్తులు నేలా నింగీ నీటా మనిషికి మరేవీ తారసపడవు.


జంతుజాలాల్లోని ఈ విశిష్టతలవల్లే భారతీయులు చెట్టుమీది పిట్టనీ, పుట్టలోని పామునీ దేవతా స్వరూపాలుగా సంభావించి కొలిచేది. ఆవును సాక్షాత్ గోమాత స్వరూపంగా కరుణశ్రీ వంటి కవులు భావించి కీర్తించింది ఈ దైవీయ భావనతోనే. జాంబ పురాణం ప్రకారం అనంత కాలాల కిందటే జన్మించిన మూలపురుషుడు జాంబవంతుడు. కన్నబిడ్డ డొక్కలను కొలిమిగా, చర్మాన్ని తిత్తిగా, హస్తాలను పట్టుతెరలుగా, బొటనవేళ్లను ఉలులుగా మలచి విశ్వకర్మకే పరికరాలను సమకూర్చిన నిపుణుడు ఆయన. భూదేవికి వరాహపురాణం వినిపించిన మేధావి ఆదివరాహమూర్తి. సామవేదాన్ని గానంగా వినిపించిన మహాముని శుకుడు. భోజరాజీయంలోని గోవు అభిజ్ఞాన శాకుంతలంలోని కణ్వమహర్షితో సమానమైన ప్రతిభా విశేషాలతో తన చిన్నిదూడకు సుద్దులు చెబుతుంది. రఘునాథ నాయకుడి 'నలచరిత్ర' హంస కథానాయకుడి చేతజిక్కినప్పుడు చెప్పే 'సంసార ధర్మాలు' పండితుల పలుకులకు తీసిపోనివి. నలదమయంతుల మధ్య రాయబారం నడిపి వారి ప్రేమను పండించిన పెళ్ళిపెద్ద అది. శృంగారం మదన శివాలు తొక్కి నాయిక పరకీయగ మారే ప్రమాదాన్ని గ్రహించి రాత్రికో మడతపేచీ కథ చొప్పున చెప్పుకొస్తూ మగడు ఇల్లు చేరినదాకా ఇంటి పరువును, ఇంతి పరువును గుట్టుగా
కాపాడిన చతుర, కదిరీపతి 'శుకసప్తతి' చిలుక. రాబర్ట్ బ్రూస్ వంటి మహారాజుకే పాఠాలు చెప్పిన సాలెపురుగులోని యంత్రరహిత నూలు నిర్మాణ కౌశలం అద్భుతం. 'ఈశ్వరశక్తి నీ కడుపులోనే లీలమై యుండునో' అంటూ జాషువా వంటి మహాకవుల మన్ననలందుకున్న జంతుజాలాల విశేషాలు ఎంత చెప్పుకొన్నా సశేషాలే!

మనిషి తన తోటి మనిషిని చిన్నబుచ్చడానికి జంతువులతో పోల్చడం ఎంతవరకు సమంజసం? 'బూడిద బుంగవై యొడలు పొడిమి దప్పి మొగంబు వెల్లనై/ వాడల వాడలం దిరిగి వచ్చెడు వారలు చొచ్చొచోయనన్/ గోడల గొందులందొదిగి కూయుచు నుండెడు' వారిని శ్రీనాథుడంతటి మహా పండితుడు గాడిదలని తూలనాడటం తగునా? పిల్లిమీద, ఎలుకమీద పెట్టి తిట్టే అన్యాపదేశాలు సాహిత్యంలో అలంకారాలు- అన్నంత వరకైతే సరిపుచ్చుకోవచ్చు. కానీ, చిన్నజీవులపట్ల పెద్దమనసు కలిగి ఉండటం బుద్ధిమంతుల లక్షణం. తీయని పదాల రామా రామా యటంచు/ తీయ తీయగా రాగాలు తీయుచున్న/ కమ్మకైతల క్రొమ్మావి కొమ్మమీది' ఆదికవి వాల్మీకిని మనం 'కోకిలస్వామి'గా కొలుచుకుంటున్నాం. కర్ణాటక రాజ్యాధిపతులు ఒకప్పుడు 'ధరణీ వరాహ'మనే బిరుదును గొప్ప గౌరవంగా ధరించేవారు. నృత్య విశేషాలను మయూర భంగిమలతోను, చురుకు వేగాన్ని అశ్వతేజంతోను, సునిశితమైన వినికిడిని పాము చెవులతోను, సూక్ష్మదృష్టిని విహంగవీక్షణంతోను సరిపోల్చుకొని సంబరపడే మనిషి సాటి జీవాన్ని అల్పదృష్టితో చూడటం సృష్టిదోషం. విష్ణుశర్మ పంచతంత్రంలో జంతుపాత్రలు అందించే నీతిచంద్రికలు మనిషి మనసులో ముసిరి ఉన్న చీకట్లను పారదోలేవి. విశ్వాసానికి
శ్వపతి(కుక్క), శుచి-శుభ్రతలకు మార్జాలం, బృందస్ఫూర్తికి పిపీలక సందోహం, ఐక్యతకు కాకిమూక, సమానత్వ భావనకు వానరజాతి... మనసు తెరచుకుని ఉండాలేగానీ క్రిమికీటకాలనుంచి పశుపక్ష్యాదులదాకా సర్వజీవావళి మనిషి పాలిట పరమ గురువులే. సాధు హృదయంతో చేరదీయడమొక్కటే మనం చేయవలసిన సత్కార్యం. మైమీ విశ్వవిద్యాలయం, సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం జంతువులను పెంచి పోషించేవారిమీద చేసిన ప్రయోగాల ఫలితం ప్రకారం- అది మానవ జాతికే ప్రయోజనకరం. పెంపుడు జంతువుల యజమానుల్లో ఆత్మవిశ్వాసం, ఆరోగ్యవంతమైన శరీరం, కలుపుగోలుతనం, సామాజిక స్పృహ, నిర్భయత్వం- జంతుజాలాలకు దూరంగా ఉండేవారిలోకన్నా ఇరవైశాతం అధికంగా ఉంటాయని పరిశోధన బృంద నాయకుడు అలెన్ ఆర్ మెక్కానిల్ చెబుతున్నారు. ఆసుపత్రులకు దూరంగా ఉండాలంటే సాటి జీవాలకు చేరువ కావడమే దగ్గరి దారి!

(ఈనాడు యాజమాన్యంవారి సౌజన్యంతో.. సంపాదక బృందానికి ధన్యవాదాలతో.. 24, ఆగష్టు. 2011 నాటి ఈనాడు సంపాదకీయం)

Monday, May 2, 2016

పెరట్లో కచేరీ- కౌముది మరీ చిన్న కథ (మరీ చి.క)

వేటపాలెం పేరు చెవిన బడంగానే చెవిలో వినిపించే మధురస్మృతుల్లో వెంకట్రాముడి గానకచేరీ  ఒకటి.
తెల్లారుఝామున మొదలయ్యేది వాడి గానకచేరీ పెరట్లో! తోడి రాగాలు.. ఉదయరాగాల్లాంటి తేడాలేమీ తెలీని లేతవయసులో వాడి నాదస్వరం మా పిల్లలకు ప్రాణాలు తోడేసినట్లుండేది. దానికి తోడు కచేరీ పూర్తయేలోపు పక్కలమీదనుంచి లేచి పనుల్లో పడకపోతే మా అమ్మ ప్రాణాలు తోడేయడం అదనం.
వానరానీ.. వరదరానీ.. ఊరుమొత్తం దొంగలొచ్చి దోచుకుపోనీ.. వెంకట్రాముడి గానకచేరీ మాత్రం తొలిసంధ్యలో కనీసం ఒక గంటపాటైనా నిరాటంకంగా సాగాల్సిందే! వాడి నేపథ్యసంగీతంలోనే మా పిల్లలంతా కాలకృత్యాలు  పూర్తిచేసుకోవడం అప్పటి అలవాటు,
పై చదువులకని వెళ్లి మధ్య మధ్యలో తిరిగివచ్చినప్పుడు తెల్లారుఝామున వెంకట్రాముడి నాదస్వరం చెవినబడంగానే ప్రాణం లేచివచ్చినట్లనిపించేది.
అంతగా 'అడిక్ట్' అయిపోయామన్న మాట వెంకట్రాముడి సంగీత కచేరీకి.
కాబట్టే జీవితంలో అన్నిరకాల పోరాటాలు పూర్తిచేసి ఆఖరిదశలో మనశ్సాంతిగా బతుకు వెళ్లదీయాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ముందుగా గుర్తుకొచ్చింది మా ఊరు వేటపాలెం..  బ్రాహణవీధిలో  వర్ధనమ్మగారి పెంకుటిల్లు. దానివెనకాలే  వెంకట్రాముడులాంటి నాయీబ్రాహ్మణులుండే మంగల్లంప.
పిల్లల్ని ఒప్పించి మకాం మా ఊరికి మార్పించడానికి కొంత సమయం పట్టినా.. మొత్తానికి వర్ధనమ్మగారి ఇంటినే కొనడానికే  నిర్ణయమయింది.
కొనేముందు చూసిపోయేందుకని ఒకటికి రెండు సార్లు వచ్చినా.. వెంకట్రాముడి గురించి విచారించే వ్యవధానం లేకపొయింది.
చిన్ననాటి స్నేహితుడు గుడిశర్మకనిపించినప్పుడే ఆ విషయాలన్నీ మళీ చర్చకు వచ్చాయి.
'వెంకట్రాముడి కొడుకు మన ఆదినారాయణగారి మూడో మనమరాలిని లేపుకుపోయాడ్రా! అప్పట్లో అదంతా పెద్ద గోల. అందరూ వెంకట్రాముణ్ణే తప్పు పట్టారు. వెలేసారు. గుళ్లో కచేరీలే కాదు..  తలపనులక్కూడా వాడు ఇప్పుడు మనవాళ్ళెవరికి పనికిరావడం లేదువెంకట్రాముడిప్పుడు  మంచంమీద తీసుకుంటున్నాడు. ఇంకేం కచేరీలు నా బొంద! ఆ కథంతా ముగిసి ఏడాది పైనే ఐందింటూ చావు కబురు చల్లంగా చెప్పేసాడు.
కచేరీలు కాకుండా క్షురకర్మ చేయడంకూడా నాయీబ్రాహ్మణుల వృత్త్తుల్లో ఒక భాగమే. నాకిప్పుడు గుర్తుకొస్తోంది. మాఇంటి ముంగిట్లో కూర్చుని  తలపని చేస్తున్నప్పుడు మా నాన్నగారు  అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడొకసారి  వెంకట్రాముడు 'మా సాంబణ్ణి పెద్ద బడే గులాం సాహెబ్ మాదిరిగా సెయ్యాలయ్యా!.. అదీ నా కోరిక' అనడం.
వెంకట్రాముణ్ణి చూద్దామని శర్మతోసహా మంగల్లంపలోకి అడుగు పెట్టాను చాలా కాలం తరువాత.
గానకచేరీ నడిచిన గుడిసె అలాగే ఉంది. కానీ.. దాని ఆకారం  మాత్రం వెంకట్రాముడు అవతారంలాగే చీకిపోయి ఉంది.
కుక్కి నులకమంచంమీద మాసిన చిరిగిన దుప్పట్లో మూలుగుతూ పడున్న ఆకారాన్ని చూపించి 'ముసలాడు మన మడుసుల్లో లేడయ్యా!' అంది ఆయన పెళ్లాం నాగమ్మ కన్నీళ్ళు పెట్టుకొంటూ. చిన్నతనంలో ఆ తల్లి సంజెవేళ  దొడ్డిగోడమీదనుంచి మా పిల్లలకోసమని అందించిన వేడి వేడి ఉలవచారు రుచి  నాలిక్కి తగిలిందిప్పుడు.
నా మనసంతా ఎలాగోఅయిపోయింది..
'వైద్యం చేయించడంలా?' అనడిగితే ఊరు వెలేసిని మడిసిని వైద్దులు మాత్రం ఏం ఉద్దరిత్తారయ్యా! ల్లు గడవాడాలిగందా  ముందు! ఎన్నడూ లేంది  మాఇంటి ఆడపిల్లలు పక్కూళ్లకెళ్ళి మంగలి పనులు  నేర్సుకొంటున్నారిప్పుడు. పొట్ట నిండాలి గందా!' అని నిష్టూరమాడుతుంటే వినడానికే కష్టంగా అనిపించింది.

ఆ క్షణంలో నిర్ణయించుకొన్నాను. మా నూతన గృహప్రవేశానికి వెంకట్రాముడి మంగళవాయిద్యాలు పెట్టించాలని. సంభావనకింద వెంకట్రాముడి తల్లి చేతిలో వెయ్యి నూటపదహార్లు పెట్టి 'ఏం చేస్తావో పెద్దమ్మా! వచ్చే శ్రావణానికి మేం కొత్తింట్లోకి దిగుతున్నాం. ఆ శుభముహూర్తానికి వెంకట్రాముణ్ణి తయారు చెయ్యాలి. ఇహనుంచీ రోజూ ఉదయాన్నే కచేరీ సాగాలి పెరట్లో ఇదివరకట్లాగానే. ఇది బయానా మాత్రమే! మిగతా సొమ్మ వెంకట్రాముడితోనే మాట్లాడి ఖాయం చేసుకొంటా!' అని చెప్పి బైటికి వచ్చేసాను.
శర్మ సంతోషంగా నా భుజం తట్టడం నాకు ఆనందం అనిపించింది.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే 2016 సంచికలో ప్రచురితం)




Sunday, May 1, 2016

నాన్నలంతే!- కౌముదిలోని మరీ చి.క(మరీ చిన్న కథ)


నాన్నతో ఆరుబయలు పడుకొని ఉన్నాడు  బుడతడు వెన్నెల రాత్రి.
'నాన్నా! మనం పేదవాళ్లమా?' అనడిగాడు హఠాత్తుగా!
'కాదు కన్నా! అందరికన్నా ధవవంతులం! ఆకాశంలో కనిపిస్తోందే.. ఆ చందమామ మనదే! అందులోని నిధినిక్షేపాలన్నీ మనవే!' అన్నాడు నాన్న. 'వాటిని తెచ్చుకోవచ్చుగా!  నాకు సైకిలు కొనివ్వచ్చుగా!  రోజూ పనికి పోవడమెందుకు?' చిన్నా ప్రశ్న.
'నువ్వింకా పెద్దాడివైన తరువాత నీకు రైలుబండి కొనివ్వాలని ఉందిరా! ఇప్పుడే తెచ్చుకొని సైకిలు కొనేస్తే రేపు రైలుబండికి తరుగు పడవా? నీకు రైలు కావాలా? సైకిలు కావాలా?' అని నాన్న ఎదురు ప్రశ్న. 'రైలే కావాలి. ఐతే రేపూ నేనూ నీతో పాటు పనికి వస్తా! డబ్బులు సంపాదిస్తా!' అన్నాడు చిన్నా.
'పనికి చదువు కావాలి. అలాగే వద్దువుగాని.. ముందు బుద్ధిగా చదువుకోవాలి మరి!' అన్నాడు నాన్న.
చిన్నా బుద్ధిగా చదువుకొని తండ్రిలాగానే ఓ ఆఫీసులో పనికి వెళుతున్నాడు ఇప్పుడు. పెళ్లయి.. ఓ బాబుకి తండ్రికూడా అయాడు.

ఓ రోజు డాబామీద ఆరుబయలు పడుకొని ఉన్నప్పుడు.. అప్పుడూ వెన్నెలే! ఆ బాబు అడిగాడు'నాన్నా! మన దగ్గర డబ్బు లేదా?'

ఆకాశంలోని చందమామలో తండ్రిముఖం కనిపించింది ఆ బాబు తండ్రికి ఇప్పుడు. కళ్ళు చెమ్మగిల్లాయి.
***
-కర్లపాలెం హనుమంతరావు
(కౌముది- అంతర్జాల పత్రిక- మే సంచికలో ప్రచురితం)

Saturday, June 27, 2015

మనలో ఒకడే- కానీ లక్షల్లో ఒకడు! -వీడియో

https://www.blogger.com/video-thumbnail.g?contentId=1e11639b20e60a99&zx=u5qw4hctm1de

తెలివి తేటలు ఒకరి సొత్తు కాదు.
అవి కులాన్ని బట్టో , మతాన్ని బట్టో వచ్చేవి  కాదు .
మనిషి పరిసరాల ప్రభావాన్నుంచి తప్పించు కోలేడు.
ఈ పసివాడి ప్రతిభ సమాజాన్ని ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తున్నదో చూడండి
పని మీద అర్జంటుగా పోతున్నప్పుడో 
తోచక అలా ఏ ట్యాంక్ బండ్ మీదో షికారుకు వెళ్లినప్పుడో,
ఆదివారం పూట సినిమా హాలు బయట బ్లాక్ లోనయినా సరే టిక్కెట్ కొని సినిమా చూసి తీరాలనో తహ తహ లాడే వేళ
తలెత్తి ఒక్కసారి చుట్టూ చూస్తే
ఇలాంటి ప్రతిభ కారు అద్దాలు తుడుచుకుంటూనో
చెప్పులు పాలిష్ చేసుకుంటూనో,
చెత్త కాగితాలు ఏరుకుంటూనో
మనల్ని
మన మానవత్వాన్ని వెక్కిరిస్తూ కనిపిస్తుంది.
ఒక్క రూపాయో,
పండో వాడి చేతిలో పెడితే మన అహం చల్లారుతుందేమో కానీ 
అది వాడి పికిలిపోతున్న బతుక్కి ఒక్క టాక లెక్కకయినా సరిపోదు.
ఎవరు చేసిన పాపానికో శిలువను మోసే ఈ  బాల ఏసులు
మన చుట్టూ మసులుతున్నంత  కాలం  
సంక్షేమాన్ని గుర్చి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అవన్ని
వట్టి పిట్టల దొరకబుర్లే!   

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...