Showing posts with label short-story. Show all posts
Showing posts with label short-story. Show all posts

Wednesday, November 10, 2021

గిల్టీ -చిన్నకథః రచనః కర్లపాలెం హనుమంతరావు


 "సార్!"

అతను గదిలోకి వచ్చినట్లు గమనించక పొలేదు. కావాలనే చూడనట్లు నటించాను.

కారణం ఉంది.

ఇంట్లో ఇందిర రాత్రి చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది.

"మీ ఆఫీసులో సుబ్బారావనే పేరున్న వాళ్లెవరన్నా ఉన్నారా?

"ఉంటే?!"

"అతగాడి తల్లికి రేపు హార్ట్ ఎటాక్ రాబోతుంది. 'స్టార్ట్ ఇమ్మీడియట్లీటైపు ఫోన్ కాల్ వస్తుందివెంటనే మూడు రోజులు క్యాజువల్ లీవు కావాలని  మీకు లీవు లెటర్ ఇవ్వబడుతుందిమీ చేత 'సాంక్షన్డ్మార్క్ చెయించుకుని సదరు సుబ్బారావు వేంచేసేదెక్కడికో తెలుసా సార్?"

"ఎక్కడికీ?!"

"వేసవి  కదాచల్లగా ఉంటుందని.. ఊటీకి. ఈ పాటికే అతగాడి ఇంట్లో ప్రయాణానికని అన్ని ఏర్పాట్లూ ఐపోయాయి కూడా. తెల్లారంగానే తమరు సెలవు మంజూరు చెయ్యడమే కొరవడింది”. 

"ఇవన్నీ నీకెలా తెలుసోయ్!" ఆశ్చర్యంతో నోట మాట రాలేదు నాకు.

"లేడీసుమండీ బాబూ మేంమీ పురుష పుంగవులకు మల్లే  'కంటబడిందంతా కటిక సత్యం..  చెవిన బడిందంతా గడ్డు వాస్తవంఅని నమ్మే చాదస్తులం కాం. సదరు సుబ్బారావు గారి సహధర్మచారిణి నోటినుంచే రాలిపడిందీ  స్కెచ్.  నేను తన హబ్బీ బాసు తాలూకు మనిషినని తెలీక నా ముందే పాపం నోరు జారిందిమీ కొలీగు రంగనాథంగారి చెల్లెలు సీమంతంలో బైటపడింది  సుమా ఈ కుట్రంతా" అంది ఇందిర.

బాసుని నేను. నా కన్నుకప్పిఅబద్ధాలు చెప్పి తప్పించుకుని తిరగాలనేఆ క్షణంలోనే ఈ ధూర్తుడితో ఎంత మొండిగా వ్యవహరించాలో డిసైడ్ చేసుకుని ఉన్నా.

---

"సార్!ఒక చిన్న రిక్వస్టు"

"తెలుసుమీ అమ్మగారికి హార్ట్ ఎటాక్. 'స్టార్ట్  ఇమ్మీడియట్లీఅని ఇంటినుంచీ కాల్. నీకర్జంటుగా మూడు రోజులు క్యాజువల్ లీవు శాంక్షన్  చేయాలి. యామై రైట్?"

ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టేశాడు ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు "సార్! మీకెలా తెలిసిందిప్లీజ్ .. శాంక్షన్  మీ లీవ్ సార్!" 

సుబ్బారావు కళ్ళల్లో నీళ్ళు.

ముందుగా అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంటు చేసే టైమొచ్చింది. దొంగేడుపులకే  మాత్రం ఛస్తే లొంగరాదు

సాధ్యమైనంత విచారాన్ని గొంతులో రంగరించుకుని  "సారీ సుబ్బారావ్రేపు ఆడిటర్సు వస్తున్నారు ఇన్స్పెక్షనుకి. మొదట్నుంచీ నువ్వే చూస్తున్నావుగా ముఖ్యమైన ప్రాజెక్టు రిపోర్టులన్నీ! నువ్వు లేకుంటే ఎలాగాకావాలంటే వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత నువ్వూ వెళ్ళి రావచ్చు.. ఒక్క పూట. ఓకే ..నౌ ..యూ కెన్ గో అండ్ గెట్ రడీ ఫర్ ఆడిటింగ్"అని అప్పుడే గుర్తుకొచ్చినట్లు ఫోనందుకున్నా.

"సార్మా అమ్మ ఇప్పుడు గుండె నొప్పితో అల్లాడిపోతుంటే ఎప్పుడో ఆడిటింగయిన తరువాత వెళ్లాలాఅప్పటిదాకా ఆమెకేమీ కాదని మీరెవరన్నా భరోసా ఇవ్వగలరా?"

బాగానే రక్తి కట్టిస్తున్నాడూ నాటకాన్నీఈ సుబ్బారావులో ఇంత పెద్ద కళాకారుడున్నాడని ఇప్పటిదాకా తెలీదేఒక్క అతగాడికేనా నటనా కౌశలం తెలిసింది!  నేను మాత్రం తక్కువ తిన్నానా!"

పాత సినిమాల్లో రంగారావు  మార్క్ గాంభీర్యం ప్రదర్శిస్తూ "ఐ సెడ్  సుబ్బారావ్ ! నౌ యూ కెన్ గో!  లెట్ మీ డూ మై డ్యూటీ.. ప్లీజ్!" అనేసి సెల్ రిసీవర్లో తల దూర్చేశాను.

మరో మూడు నిమిషాల పాటు అలాగే  కన్నీళ్ళతో మౌనంగా నిలబడి  చివరికి వెళ్ళిపోయాడు సుబ్బారావు.

---

 "నన్నెప్పుడూ ఓ మెతక వెధవ కింద  జమ కడతావుగా నువ్వుఇకనైనా  నీ అభిప్రాయం మార్చుకుంటే బెటర్.. బెటర్ హాఫ్ గారూ" అంటో  ఆఫీసులో జరిగిందంతా  ఇంట్లో ఇందిరకు చెప్పేశాను  గొప్పగా.

సాంతం విని తాపీగా అంది ఆ మహాతల్లి "నిన్న నేను పొరపడ్డాను సుమండీ! ఊటీ చెక్కేద్దామనుకున్న సుబ్బారావుది మీ సెక్షను కాదట. మీ పక్క సెక్షన్ కొలీగ్ రంగనాథంగారి  స్టెనోగ్రాఫర్ ఆ సుబ్బారావు.  శుభ్రంగా సెలవులు పుచ్చేసుకొని  ఊటీ చెక్కేసాడు కూడా ఈ పూటమాటల సందర్భంలో రంగనాథంగారి మిసెస్ అంది ఇందాక. అతగాడి పెళ్ళాం తెచ్చే మేలు రకం ముత్యాల కోసం ఎదురు చూస్తుంటేనూ ఇక్కడ ఈవిడగారూ..!

ఇందిర ఇంకేదేదో చెబుతున్నది కానీ..

ఆ క్షణంలో మాత్రం  నాకు .. న్నీళ్ళు నిండిన కళ్లతో  ఎదురుగా నిలబడ్డ సుబ్బారావు మొహమే కనబడింది

చలా గిల్టీగా అనిపించింది.

-కర్లపాలెం హనుమంతరావు

23 -02 -2021

బోథెల్, యూఎస్ఎ

 

 

దుర్భాషా సాహిత్య ప్రయోజనం - సరదా కథ - కర్లపాలెం హనుమంతరావు




ఉండేలు సుబ్బారెడ్డికి గుండెల్లో కలుక్కుమంది. లేచెళ్ళి కాసిని మంచినీళ్ళు తాగొచ్చి మళ్లీ పనిలో పడ్డాడు. ఐదు నిమిషాలు గడిచాయి. మళ్ళీ గుండెల్లో కలుక్కు! ఈ సారి కాస్త ఎక్కువగా! నొప్పికూడా  పెరుగుతున్నట్లు అనిపిస్తోంది.   కడుపు ఖాళీగా ఉన్నా గ్యాస్ ఎగదన్ని గుండెల్లో పట్టేసినట్లుంటుందని ఎక్కడో విన్నాడు. ఫ్రిజ్ లోనుంచి ఓ అరటిపండు తీసాడు. సగం పండుకూడా తినలేదు..  వళ్లంతా ఒహటే చెమటలు! కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లనిపించి  మంచంమీద కూలబడ్డాడు.

గుండెల్లో నొప్పి  తెరలు తెరలుగా వస్తూనే ఉంది.

‘హార్ట్ ఎటాక్?!’ అనుమానంతో  గుండె కొట్టుకొనే వేగం  మరింత హెచ్చింది.

ఇప్పుడేం చేయడం?

సమయానికి ఇంటి దగ్గరా ఎవరూ లేరు. అందర్నీ తానే ఊరికి తరిమేశాడు. ఏదో  పత్రిక్కి పోటీకని నవలేదో రాస్తున్నాడు. గడువు దగ్గర పడుతోంది.. ఇంట్లో పెళ్ళాం.. చంటి పిల్లలిద్దరూ చేసే అల్లరితో.. మూడ్ స్థిరంగా ఉండటం లేదని.. బలవంతాన భార్యని పుట్టింటికి పంపించాడు.. వారం రోజుల తరువాత తిరిగి తనే   తీసుకు వస్తానని వాగ్దానం చేసి మరీ. ఇప్పుడిలా అవుతుందని కల కన్నాడా? ఇంతకు ముందెప్పుడైనా ఇలా జరిగుంటే తగిన  జాగ్రత్తల్లో ఉండేవాడే కదా!

కిం కర్తవ్యం? యమకింకరులొచ్చి పడే ముందే..  వైద్యనారాయణాస్త్రం అడ్డమేసెయ్యాలి. డాక్టర్ల నెంబర్లకోసం వెదికితే.. ముగ్గురు ఆపద్భాందవుల ఫోన్ నెంబర్లు దొరికాయి. డాక్టర్ గోవిందు. డాక్టర్ బండ కోదండం. డాక్టర్ దూర్వాసిని.

డాక్టర్ గోవిందు నెంబర్ కి రింగ్ చేసాడు ముందు.

గోవిందో  గోవింద!.. గోవిందో గోవింద!' అంటూ రింగ్ టోన్ అదే పనిగా మోగుతోంది.  అయినా   ఉలుకూ ఉప్పురాయీ లేదు అవతలి వైపునుంచి.  సెల్ కట్ చేద్దామనుకొనే లోపు ‘గుర్.. గుర్’ మంటూ గొంతు వినిపించింది.

హలో!.. ఎవరూ?'

డాక్టర్గారూ!.. అర్జంటర్జంట్సార్!.. గ్గుండెల్లో... న్నొప్పిగా..వ్వుంది.. చ్చా..ల్సే.. ప్ప..ట్నుంచీ'

అవతలి వైపునుంచి బిగ్గరగా నవ్వు! 'సారీ సార్! అందర్లాగా మీరూ నన్ను వైద్యం చేసే డాక్టరనుకున్నారా?'

'కాదా?'

కాదండీ బాబూ! మంది పంగనామం విశ్వవిద్యాలయం నుంచి వచ్చి పడ్డ డాక్టరేట్  ‘బెల్లం సాగుతో అధికాదాయం సాధించే నవీన విధానాలు’ అనే అంశంమీద   పరిశోధన చేసినందుకు..’  సుబ్బారెడ్డి ఫోన్ ఠక్కుమని కట్ చేసేసాడు. ‘ఇప్పుడా సోదంతా వినేందుకు టైమెక్కడేడ్చిందీ?’

రెండో నెంబరుకి డయల్ చేసాడీసారి. అదృష్టం.. నెంబర్ వెంటనే కలసింది.

యస్ ప్లీజ్! ఎవరూ? ఏం కావాలి?'

ఉండేలు సుబ్బారెడ్డి ఉన్న పరిస్థితినంతా గుండెలవిసి పోయేలా  వివరించాడు. ఆసాంతం  తాపీగా విని.. ఓ సుదీర్ఘ ఉఛ్ఛ్వాసం  తీసుకొని మరీ 'సారీ! మిత్రమా! వైద్యం.. వంకాయ.. మన లైను కాదు. నా డాక్టర్ పట్టా సాహిత్యానికి సంబంధించింది బ్రో! ‘ప్రాచీనకాలంలో జంతువుల జీవన  విధానాలు.. ప్రబంధ సాహిత్యంలో వాటి ప్రధాన  పాత్ర' అనే అంశంమీద కుంభకోణం విద్యాపీథం వారిచ్చిన స్నాతకొత్సవానంతర  పట్టా! ‘బండ కోదండం’ అన్న పేరు విన్న తరువాతైనా మీకు నా గురించి  అర్థం కాకపోవడం విఛారకరం..' ఉండేలు  సుబ్బారెడ్డికీ సారి పెద్ద బండరాయితో బాదేసినట్లు  గుండెలు కలుక్కుమన్నాయి.  ఫోన్ కట్ చేసేసాడు.

'మిగిలిందిక డాక్టర్ దూర్వాసిని.  సమయం చూస్తే అర్థరాత్రి దాటి అర్థ గంటయింది. న్యూసెన్సు కేసనుకొని న్యూసెన్సు చేసేస్తే!  సంకోచిస్తూనే నెంబర్ రింగ్ చేసాడు  సుబ్బారెడ్డి మార్గాంతరం లేక.

చాలాసేపు చడీ చప్పుడు  లేదు.. ఊరికే రింగవడం తప్పించి! అదే పనిగా ప్రయత్నించిన మీదట  అవతలవైపునుంచి రెస్పాన్స్ వచ్చిం దీసారి! ఎత్తుకోవడం ఎత్తుకోవడమే సూరేకాంతం గొంతులో సూరేకారం పోసినంత రౌద్రం! సుబ్బారెడ్డి గుండె దుస్థితి వివరణ నివేదిక   సమర్పించడం సగం కూడా కాలేదు అవతలి వైపు  శాల్తీ కాళికా దేవి అవతారమే ఎత్తేసింది.

'ఎవర్రా నువ్వు? నీకు అసలు బుద్ధుందిట్రా? ఇంతర్థ రాత్రి పూటా వెధవా..  కాల్  చేసేది?  కాలూ చెయ్యీ తీసేయిస్తానొరేయ్! ఇవతలున్నది ఓన్లీ లేడీసనుకోకు? ఎక్కడ్రా నీ ఇంటడ్రస్సు? ఏవిఁట్రా నీ ఒరిజినల్ ప్లాటు? నువ్వవసలు పేషెంటేవన్న గ్యారంటీ ఏంటి? నిజంగా నీది గుండె నొప్పేనని రుజువేంటి? నొప్పుంటే మాత్రం నువ్ కాల్ చేసుకోవాల్సింది ఏ ఆసుపత్రికో.. అంబులెన్సుకో!  నేరుగా ఇలా  ఇళ్ళమీదకొచ్చి పడతారట్రా స్కౌండ్రల్స్?  పెట్టేయ్ ఫోన్! మళ్లీ నా సెల్ రింగయిందా నీకు పోలీస్ స్టేషన్  సెల్లే గతి! నీ కొంపకు పోలీసుల్ని పంపిస్తా.. బీ కేర్ ఫుల్!' ఠక్కుమని ఫోన్ కట్టయి పోయింది.

సుబ్బారెడ్డిట్లా  నేరుగా డాక్టర్లనే తగులుకోడానికి కారణం లేకపోలేదు. రాతకోసం  ప్రశాంతత కావాలని వేధిస్తుంటే  ఫ్రెండువెధవ తననీ అడ్రసు తెలీని  అజ్ఞాతంలో వదిలేసి పోయాడు రాత్రి.  మళ్లీ తెల్లారి వాడొస్తేగానీ.. తానున్నది ఎక్కడో.. చిరునామా ఏంటో  తెల్సిచ్చావదు! ఈ బిల్డింగుకి పేరుకో వాచ్ మెన్ ఉన్నా.. అతగాడెక్కడో ఫుల్లుగా  మందుగొట్టి  గొడ్డులా పడున్నాడు.  తనదగ్గర సమయానికే  ఆసుపత్రుల నెంబర్లూ  ఉంచుకోలేదు. ఇప్పటిదాకా ఇట్లాంటి అవసరమేదీ  పడక.

ఉన్న  మూడు నెంబర్లూ  బెడిసి కొట్టేసాయి. ఇప్పుడేం గతి?!

పాలుపోవడం లేదు సుబ్బారెడ్డికి. అంతకంతకూ గుండెల్లో నొప్పి ఎక్కువై పోతోంది. చెమటలూ ధారగా కారి పోతున్నాయి. అక్కడికీ    నొప్పినుంచి దృష్టి మళ్ళించుకోడానికి సెల్ ఫోన్లోని   న్యూస్ చానెలేదో ఆన్ చేసాడు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడ్డ ట్రంప్.. హిల్లరీల ప్రచారానికి సంబంధించిన వార్తలేవో ధారాపాతంగా వచ్చి పడ్తున్నాయి.  ట్రంపు మహాశయుడు హిల్లరీమ్యాడమ్మీద పడి  అడ్డమైన కారు కూతలూ అడ్డూ ఆపూ లేకుండా కూసేస్తున్నాడు! అదే స్థాయిలో హిల్లరీ అమ్మగారి భాషా ప్రయోగాలు కూడా!

మామూలు సమయాల్లో అయితే మనిషన్నవాడికి రాజకీయాలమీద విరక్తి పుట్టించే దుర్భాషలవన్నీ. కానీ.. కష్టాల్లో ఉన్న సుబ్బారెడ్డికిమాత్రం హఠాత్తుగా  తారక మంత్రం దొరికినట్లయింది.  మెరుపులాంటి ఆలోచనలతో అతగాడు  సెల్ ఫోన్ అందుకున్నాడుమళ్లీ డాక్టర్ దూర్వాసిని  బెడ్ రూంలోని  సెల్ మొరుగుడు మొదలు పెట్టింది అదే పనిగా.  ఎన్ని సార్లు నోరుమూసేసినా   మళ్లీ మళ్లీ మొరుగుతుండటంతో  దూర్వాసనమ్మగారి పక్కనే పక్కలో గుర్రుకొడుతున్న  మొగుడుగారు గయ్యిమని లేచారు మేడమ్గారిమీద 'మీ ఆసుపత్రినుంచీ యమర్జెన్సీ కాలేమో! అటెండవక పోతే ఎట్లా?  ఆనక సమస్యలొచ్చి పడతే సర్ధిపెట్టలేక చచ్చేది నేనే. ముందా ఫోన్ చూడు!' అంటూ.  


భర్త హెచ్చరించరికలతో ఇహ తప్పదన్నట్లు చిరాగ్గా లేచి   సెల్  అందుకొంది డాక్టర్ దూర్వాసనమ్మ.


 …


సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రిలో ఆఖరి నిమిషంలో జరిగిన అర్జంటు చికిత్సతో ఉండేలు సుబ్బారెడ్డి యమగండంనుండి బైటపడ్డాడు  చివరికి ఎట్లాగైతేనేం!


పోలీసులు సమయానికి వచ్చి  కలగచేసుకోక పోయుంటే కాబోయే ప్రముఖ రచయిత   సుబ్బారెడ్డి  ఈ పాటికి పై లోకాల్లో కూర్చుని ప్రశాంతంగా   నవల పూర్తి చేసుకునే పనిలో ఉండేవాడు. డాక్టర్ దూర్వాసిని ఇచ్చిన అర్థరాత్రి 'న్యూసెన్ కాల్' ఫిర్యాదుని  'షి'  టీం సీరియస్ గా తీసుకోబట్టి గుండెనొప్పితో లుంగలు  చుట్టుకుపోయే  సుబ్బారెడ్డిని 'సగం  నిర్మాణంలో ఉన్న ఊరిబైటి భవంతిలో గాలించి మరీ పట్టుకొన్నారు పోలీసులు.   అత్యవసర ఆరోగ్య పరిస్థితిని గుర్తించి.. అప్పటికప్పుడు ఆగమేఘాలమీద పోలీసులే  దగ్గర్లో ఉన్న పెద్దాసుపత్రిలో చేర్పించడం వల్ల సుబ్బారెడ్డి కథ సుఖాంతమైంది.

అసలు విషయం అర్థం చేసుకున్న డాక్టర్ దూర్వాసిని సైతం న్యూసెన్సు కేసులో మరింక ముందుకు పోదల్చుకోలేదు.

వాస్తవానకి మనం మెచ్చుకోవాల్సిందిక్కడ సుబ్బారెడ్డిని.. అతగాడి సమయస్ఫూర్తినా? అతగాడు అట్లా అర్థరాత్రి ఒక ఆడకూతుర్ని వేధించేందుకు సరిపడా దుర్భాషా సాహిత్యాన్ని సృష్టిస్తోన్న నేతా గణాన్నా?

రాజకీయాల్లో నీతి.. మర్యాదలు అంతరించిపోతున్నాయని వూరికే  దురపిల్లే  ఆదర్శవాదులు.. దుర్భాషా సాహిత్య ప్రయోజనాన్నికూడా గుర్తించాల్సి అవసరం ఉందన్నదే ఈ కథ నీతి!

-కర్లపాలెం హనుమంతరావు


(తెలుగిల్లు- అంతర్జాల పత్రిక ప్రచురితం)


Friday, August 27, 2021

పెయిడ్ ఇన్ ఫుల్ -కర్లపాలెం హనుమంతరావు

 సుబ్బుకు పదేళ్లు.  ఐదో తరగతి. బుద్ధిగా చదువుతాడు. లెక్కలు బాగా చేస్తాడని టీచరు బాగా మెచ్చుకుంటారు కూడా.  కూడికలు తీసివేతలు  రెండంకెల వరకు  నోటితోనే  చేసేయగలడు. కానీ ఈ సారి నోట్ బుక్ లోని ఒక కాగితం చించి దాని మీద ఈ విధంగా లెక్క వేసాడు. వీధి చివరి శేషయ్య కొట్టు వరకు వెళ్లి  ఉప్పు, కరేపాకు లాంటి సరుకులు వెంటనే తెచ్చి ఇచ్చినందుకుః  రూ.2

అమ్మ వంట పనిలో ఉన్నప్పుడు చెల్లాయిని ఆడించినందుకుః రూ.3

ఆదివారం నా గది శుభ్రం చేసుకున్నందుకు రూ. 3

అమ్మ పూజకు ఇబ్బంది లేకుండా  మూట్ లో పెట్టి వీడియో గేమ్స్ ఆడుకున్నందుకు రూ.1

బడిలో మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు.. ప్రోగ్రెస్ రోజుకో కొత్త పద్యం చదివి చూడకుండా అప్పచెబుతున్నందుకు రూ.3

కుట్టుపని శిక్షణా కేంద్రానికి అమ్మకు  తోడుగా వెళుతున్నందుకుః రూ.2

ప్రోగ్రెస్ రిపోర్టులో ఎప్పుడూ తెచ్చుకునే  రెండో ర్యాంకు పోయినవారం కూడా  తెచ్చుకుంటున్నందుకు ఆ వారం  వాయిదాః రూ.10

చిల్లర  పనులుః రూ.10

పోయిన ఆదివారం నుంచి శనివారం వరకు  ఇంట్లో పని కోసం అమ్మకు చేసిన సహాయం బిల్లు మొత్తంః రూ 34

వీడియో గేమ్ కు  లెక్క తక్కువ పడింది. 

సమయానికి నాన్నగారు ఇంట్లో లేరు. ఆఫీసు పని మీద వేరే ఊరికి వెళ్లారు. వారం దాకా రారు. అందుకే వారం మొత్తం తాను అమ్మకు చేసిన సాయానికి బిల్లు వేసి వంట ఇంట్లో పనిలో ఉన్న అమ్మకు అందించాడు.

వంట పని కానించి చేతులు శుభ్రం చేసుకుని పొడి చేత్తో సుబ్బు ఇచ్చిన బిల్లు చదువుకుంది అమ్మ.

అదే కాగితం వెనక సుబ్బు నుంచి పెన్సిలు అడిగి తీసుకుని ఈ విధంగా రాసి ఇచ్చింది అమ్మ.

అమ్మ రాసిన లెక్కః

నిన్ను నా కడుపులో తొమ్మిది నెలలు మోసాను. మోత కూలీః రూ. 0 

రాత్రిళ్లు నీకు భయమేసినప్పుడల్లా నా పక్క వదిలి నీ పక్కనే తోడు పడుకోనేదాన్ని. చల్లగాలి తగిలి జలుబు చేయకుండా నీ మీద దుప్పటి నిండుగా ఉందో లేదో మధ్య మధ్య మంచినిద్రలో కూడా వచ్చి చూసేదానిని. నిద్రలో నీకు తెలియదు. కాపలా పనికిః రూ.0

నీకు జ్వరం వచ్చినప్పుడు వేసిన మందుల ఖర్చు ఇప్పుడు చెప్పడం కుదరదు. మళ్లా నువ్వు మనుషుల్లో పడ్డదాకా దేవుడికి నీ క్షేమం కోసం చేసుకున్న ప్రార్థనలకుః రూ.0

ఇట్లా విడివిడిగా చెప్పడం కుదరదు కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా నీ ఆటపాటలకు బొమ్మలు, పుస్తకాలు, చదువు సంధ్యలకు పుస్తకాలు,  ఉల్లాసానికి వెంట తీసుకువెళ్లిన పార్కులు, సినిమాలు, ఆఖరికి నీకు రొంప పడితే సమయానికి చేతిలో ఏ గుడ్డా లేకపోయినా నా చీర కొంగుతో చీదరించుకోకుండా తుడిచేదాన్ని. ఈ మాదిరి  చిల్లర సేవలు చాలా చేసాను. చేస్తున్నాను.  ఆ సేవలకు రూః0

సుబ్బూ! నాకు నీ మీద ఉన్న ప్రేమకు విలువ కట్టడం నాకు చేతకావడం లేదు. ఆ బిల్లూ నువ్వే వెయ్యి. నీ బిల్లుకు ఆ బిల్లు చెల్లు. ఇంకా ఏ మన్నా ఇవ్వాల్సింది  మిగులుంటే అప్పుడు మళ్లా కొత్తగా వేసుకురారా నాన్నా అమ్మకు నువ్వు చేసిన సేవలకు బిల్లు!

అమ్మ ఇచ్చిన ఆ కాగితం చదువుకున్న సుబ్బు కళ్ల వెంట నీళ్లు బొట బొటా కారాయి. పెన్సిల్ వెనక్కు తీసుకుని 

ఈ విధంగా రాసుకున్నాడు ' పైడ్ ఇన్ ఫుల్'ఎక్కడో  

( ఎక్కడో చదివిన బాలల కథానిక నా శైలిలో )  

-కర్లపాలెం హనుమంతరావు 

బోథెల్ , యా ఎస్.ఎ 

***


Monday, June 14, 2021

ధూమకేతువు చెప్పే నీతిపాఠం -కర్లపాలెం హనుమంతరావు



దేవుళ్ళు తాము చంపిన రాక్షసుల పేర్లు బిరుదులుగా తగిలించుకోడం సరదా కోసం కాదు. పూజించే భక్తులను రాక్షసత్వంతో ప్రవర్తించవద్దని హెచ్చరించడం కోసం. వినాయకుడిని 'ధూమకేతవే నమః' అని కీర్తించడంలో కూడా ఇట్లాంటి ఓ గట్టి హెచ్చరికే దాగివుంది.చెడ్డపనులు చేస్తే మళ్లీ రాక్షస ప్రవృత్తితో జన్మ ఎత్తాల్సొస్తుందనే బెదురు  గతంలో బాగా ఉండేది. కానీ అట్లా ఎత్తిన జన్మలో కూడా  కొన్నైనా మంచి పనులు  చేస్తే ఈ  దుర్జన్మ పీడా వగదిదుతుందన్న  ఊరటా పురాణేతిహాసాల తాలూకు కథలలో కనిపిస్తుంటుంది.  ఈ సందర్భంగానే ధూమాసురుడు అనే దుర్మార్గుడిని గురించి కొంత చెప్పడం.

పుట్టింది రాక్షస జాతిలోనే అయినా ధూమాసురుడు వేదాలను మొత్తం కంఠోపాఠం చేశాడు. చదివిన చదువుకు.. నడిచే తీరుకు బొత్తిగా సంబంధం ఉండదనడానికి ఈ దుర్మార్గుడి దుష్ప్రవర్తనే సరైన దృష్టాంతం. శివుడికి భక్తుడు అయివుండీ భృగువుతో సంవాదం చేసే పాటి పాండిత్యం సాధించినా రజోగుణం ప్రబలినప్పుడు మాత్రం యుద్ధాలు చేయాలని, దేవతలనే వాళ్ళు ఎక్కడున్నా వెదికి మరీ చీల్చి చెండాడాలని అణుచుకోలేనంత కుతిగా ఉండేది అతగాడికి. అట్లాంటి తీటలు తీరడం కోసం జైత్రయాత్రలు చేయడం, దేవతలను చెండుకు తినడం రాక్షస జాతికి సహజమే అయినా, దేదేవతలకు మాత్రం  పద్దాకా ఏదో ఓ రాక్షసాధముడి కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి.

ధూమాసురుడి దెబ్బకు తట్టుకోలేక ఎప్పట్లానే శివుడిని ఆశ్రయిస్తే, ఆయనా ఎప్పట్లానే ఆశ్రితులను కాపాడే పని పెద్దకొడుకు వినాయకుడికి పురమాయించాడు.

తండ్రి ఆజ్ఞ! తప్పుతుందా! ఏం చేద్దామా అని బొజ్జ గణపతయ్య బుర్ర బద్దలు చేసుకొనే సమయంలో తరుణోపాయంగా మాధవుడు అనే బ్రాహ్మడి కుటుంబం తాలూకు తంటా ఒకటి తెలియవచ్చింది. సంతానవతి కాని  కారణాన  మాదవుడు  భార్య సుముదను  వదిలేస్తానని తరచూ బెదిరిస్తుంటాడు. ఆమెకు మరో దారి లేక నారాయణుడిని ఆశ్రయించడం, ఆ సందు చూసుకుని వినాయకుడు ఆమె గర్భంలో జొరబడ్డం జరిగిపోతుంది.

యుద్ధానికని  బయలుదేరే  ధూమాసురుణ్ణి ఈసారి ఆకాశవాణి గట్టిగానే హచ్చరిస్తుంది. 'చావు మూడే రోజు దగ్గర్లోనే ఉంది. ఇట్లా  సుముదమ్మ కడుపులో జీవం పోసుకొంటోంది' ఆవటా అని. ఎంత రాక్షసుడికైతే మాత్రం ఎదుటి వాళ్లను ఏడిపించి చంపడం సరదా గానీ, స్వయంగా  చావును కావులించుకోవడానికి సరదా ఎందుకు పుడుతుంది? అందరికి మల్లేనే ఆ రాక్షసుడూ మృత్యుభయంతో యుద్ధాలు గిద్ధాలు కట్టిపెట్టి ఇంచక్కా దక్కిన రాజ్యాన్ని చక్కగా   'రామరాజ్యం' మోడల్లో 'ధూమాసుర రాజ్యం' గా సుప్రసిద్ధం చేద్దామని సిద్ధమయిపోయాడు.   అందుక్కారణం అతగాడి కొలువులో కనీసం ధర్ముడు అనే ఒక్క మంచి మంత్రైనా ఉండి రాజుకు హితబోధ చేయడం. తతిమ్మా కొలువు కూటానికి ఇది మహా కంటకంగా మారింది. ధర్ముడు లేని సందు చూసుకొని ధూమాసురుణ్ని రెచ్చగొట్టేస్తారు.

అటు ధర్ముడు ఇటు దుర్మార్గులైన తతిమ్మా మంత్రులు.. దోళాంళనల మధ్య ఊగిసలాడే ధూమాసురిడి వికారాలకు అమృతంలా అనిపించే సలహా ఎవరిస్తారో తెలీదు కానీ.. ఇస్తారు. ఆ వికృత  ఆలోచన కార్యరూపమే సుమద కడుపులో ఎదిగే వినాయకుణ్ణి సంపూర్ణాకారం తీసుకోక ముందే సఫా చేసేయడం.

ధూమకాసురుడి ప్రయత్నం వృథా అయిందని,   దుర్మార్గుడే వినాయకుడి చేతిలో చివరికి ఖతమయ్యాడని వేరే చెప్పక్కర్లేదు కానీ, ఇక్కడ చెప్పవలసిన అసలు ముఖ్యమైన మాట మరోటి ఉంది.  చరిత్ర ఎటూ మనకు పట్టదు.  కనీసం మనం నెత్తికెత్తుకొని నిత్యం పూజించే పురాణాలు, ఇతిహాసాలలో కనిపించే ఈ తరహా నీతికథలనయినా  మన సో కాల్డ్ ప్రజానేతలు  సమయ సందర్భాలను బట్టి ఖాతరు చేస్తుంటే ఎన్నుకునే సమయంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ముకాకపోను.  ఇప్పుడు జరుగుతున్న 'రఘు రామరాజు  కారాగార  కఠిన దండన' కథా కమామిషు వింటుంటే మంచి పాలకులు మనకు ఇక సంప్రాప్తించే యోగం ఉందా' అని బాధేస్తుంది. 

మనుషుల .. ముఖ్యంగా రాజకీయాలలో నలిగే పెద్దమనుషుల మతిమరుపు  రోగం బాగా ఎరిక కాబట్టేపాపం వినాయకుడు దుర్మార్గుడైన ధూమాసురుడిని మళ్లీ కనిపించకుండా శిక్షించినా..  తన పేరులో అతగాడి   పేరు దూర్చుకుని 'ధూమకేతువు'ను అని కూడా  గుర్తు చేయడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు. పాలకుల పెడబుద్ధులు సరిచేయడం భగవంతుడి తరమైనా అవుతుందా? చూద్దాం!

- కర్లపాలెం హనుమంతరావు

12 -06 -2021

Friday, March 12, 2021

స్వర్గం- నరకం- కథానిక రచనః కర్లపాలెం హనుమంతరావు -సరదాకేః

 



 

ఎన్నికలైపోయాయి. ఓట్ల కౌంటింగుకి ఇంకా వారం రోజుల గడువుంది. ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్! ఎవరినోటవిన్నా రాబోయే ఫలితాలను గూర్చి చర్చలే చర్చలు!

ఓటు వేసినవాడే ఇంత టెన్షన్లో ఉంటే.. ఓట్లు వేయించుకున్నవాడు ఇంకెంత వత్తిడిలో ఉండాలి! రాంభద్రయ్యగారు ఓట్లేయించుకుని ఫలితాల కోసం నరాలుతెగే ఉత్కంఠతో ఎదురుచూసే వేలాదిమంది అభ్యర్థుల్లో ఒకరు.

అందరి గుండెలూ ఒకేలా ఉండవు. కొందరు వత్తిళ్ళను తట్టుకుని నిలబడగలిగితే.. కొందరు ఆ వత్తిడికి లొంగి బక్కెట తన్నేస్తారు. రాంభద్రయ్యగారు ఆ సారి అదే పని చేసి సరాసరి స్వర్గ నరక మార్గాలు చీలే కూడలి దగ్గర తేలారు.

ఆ సరికే అక్కడో మంగళగిరి చేంతాండంత క్యూ!  ఆమ్ ఆద్మీలకంటే ఈ మాదిరి చేంతాళ్ళు అలవాటే గాని.. జనవరి ఒకటి, శనివారం కలిసొచ్చే రోజైనా  తిరుమల శ్రీవారి సుప్రభాతసేవ దర్శనానిక్కూడా క్యూలో నిలబడే అగత్యం లేని బడేసాబ్ రాంభద్రయ్యగారిలాంటివారికీ క్యూ వరసలు పరమ చిరాకు పుట్టించే నరకాలు.

ఇదేమీ భూలోకం కాదు. లాబీయింగుకు ఇక్కడ బొత్తిగా అవకాశం లేదు. తన వంతుకోసం ఎదురుచూడడం  రాంభద్రయ్యగారికేమో అలవాటు లేని యవ్వారం. అక్కడికీ ఎవరూ చూడకుండా స్వర్గం క్యూలో చొరబడబోయి కింకరుడి కంట్లో పడిపోయారు పాపం.

'ఇదేం మీ భూలోకం కాదు. మీ చట్టసభల్లో మాదిరి ఇష్టారాజ్యంగా గెంతడాలు కుదరవు.  ముందక్కడ ప్రవేశ పరీక్షకు హాజరవ్వాలి. ఆ ఫలితాన్నిబట్టే నీకు స్వర్గమో.. నరకమో తేలేది. నువ్వొచ్చి యేడాదికూడా కాలేదు. అప్పుడే అంత అపసోపాలా బాబయ్యా? నీ నియోజకవర్గంలో జనం పింఛను కోసం, జీతం కోసం, రేషన్ కోసం, గ్యాసుబండల కోసం, అధికారుల  దర్శనం కోసం.. ఎన్నేసి రోజులు నిలువుకాళ్ళ కొలువు చేస్తారో నీకేమైనా అవగాహన ఉందా?' అని గదమాయించాడు దే.దదూత (దేవుడు, దయ్యం కలగలసిన అంశ- దే.దదూత)

'ఆ భూలోక రాజకీయాలు ఇప్పుడంతవసరమా దూతయ్యా? వెనకెంత క్యూ ఉందో చూసావా?ముందు నా స్వర్గం సంగతి తెముల్చు!' పాయింటు లేనప్పుడు టాపిక్కుని పక్కదారి పట్టించే పాతజన్మ చిట్కా ప్రయోగించారు రాంభద్రయ్యగారు.

చిత్రగుప్తుడి దగ్గరకొచ్చింది కేసు.

సెల్లో ఆయనగారెవర్నో కాంటాక్టు చేసినట్లున్నాడు.. రాంభద్రయ్యగారిని చూసి అన్నాడు 'ఓకే పెద్దాయనా! మీరేమో రాజకీయనేతలు! కనక ప్రత్యేక పరీక్ష పెడుతున్నాం. మామూలు ఓటర్లకు మల్లే  మీకు పాత జీవితం తాలూకు  పాప పుణ్యాలతో నిమిత్తం లేదు. ప్రజాస్వామ్యయుతంగా మీకు మీరే స్వర్గమో.. నరకమో ఎన్నుకోవచ్చు..'

'నాకు స్వర్గమే కావాలయ్యా!'

'ఆ తొందరే వద్దు. ఆసాంతం వినాలి ముందు. ఎన్నుకోవడానికి ముందు ఒకరోజు నరకంలో.. ఒకరోజు స్వర్గంలో గడపాలి..'

'ఐతే ముందు నన్ను స్వర్గానికే పంపండయ్యా!'

'సారీ! రూల్సు ఒప్పుకోవు. ముందుగా నరకానికి వెళ్ళి రావాలి.. ఆనక స్వర్గం' అని దే.దదూత  వంక సాభిప్రాయంగా చూసాడు చిత్రగుప్తుడు. అర్థమైందన్నట్లు రామచంద్రయ్యగారి భుజం మీద చెయ్యేసి బలంగా కిందికి నొక్కాడు దేదదూత.

కనురెప్పపడి లేచేంతలో కంటి ముందు.. నరకం!

నరకం నరకంలా లేదు! స్వర్గంలా వెలిగిపోతోంది. మెగాస్టార్ చిత్రం ఫస్ట్ షో సందడంతా అక్కడే ఉంది. మిరిమిట్లు గొలిపే రంగురంగుల లైట్లు. మనస్సును ఆహ్లాదపరిచే బాలీవుడ్ మిక్సుడ్ టాలీవుడ్ మ్యూజిక్కు! ఎటు చూసినా పచ్చలు,  మణిమాణిక్యాలతో  నిర్మితమైన  రమ్యహార్మ్యాలు! హరితశోభతో అలరారే సుందర ఉద్యానవనాలు! మనోహరమైన పూలసౌరభాలతో వాతావరణమంతా గానాబజానా వాతావరణంతో మత్తెక్కిపోతోంది. మరింత కిక్కెంకించే రంభా ఊర్వశి మేనక తీలోత్తమాదుల  అంగాంగ  శృంగార నాట్యభంగిమలు!

పాతమిత్రులందర్నీ అక్కడే చూసి అవాక్కయిపోయారు రాంభద్రయ్యగారు. అక్రమార్జన చేసి కోట్లు వెనకేసిన  స్వార్థపరులు, వయసుతో నిమిత్తం లేకుండా ఆడది కంటపడితే చాలు వెంటాడైనా సరే  కోరిక తీర్చుకునే కీచకాధములు, అధికారంకోసం మనిషుల ప్రాణాల్ని  తృణప్రాయంగా తీసే పదవీలాలసులు, ఉద్యోగాలు.. ఉన్నతకళాశాలల్లో సీట్లకు బేరం పెట్టి కోట్లు కొట్టేసి ఆనక  బోర్డ్లు తిరగేసే ఫోర్ ట్వంటీలు, పాస్ పోర్టులు,  సర్టిఫికేట్లు, కరెన్సీ నోట్లు, మందులు, సరుకులు వేటికైనా చిటికెలో నకిలీలు తీసి మార్కెటుచేసే మాయగాళ్ళు, నీరు, గాలి, ఇసుక, భూమిలాంటి సహజ వనరులపైనా అబ్బసొత్తులాగా  దర్జాగా కర్రపెత్తనం చేసే దళారులు..  అంతా ఆ అందాలలోకంలో ఆనందంగా తింటూ, తాగుతూ, తూలుతూ, పేలుతూ  యధేచ్చగా చిందులేయడం చూసి రాంభద్రయ్యగారికి మతిపోయినంత పనయింది. సొంత ఇంటికి వచ్చినట్లుంది. అన్నిటికన్నా అబ్బురమనిపించింది.. తెలుగుచిత్రాల్లో పరమ వెకిలిగా చూపించే యమకింకరులుకూడా చాలా ఫ్రెండ్లీగా కలగలిసిపోయి వాళ్ల మధ్య కలతిరుగుతుండటం!

అతిథుల భుజాలమీద ఆప్యాయంగా  చేతులేసి,  బలవంతంగా సుర లోటాలు లోటాలు తాగించడం.. మిడ్ నైట్ మసాలా జోకులేస్తూ జనాలను అదే పనిగా నవ్వించడం.. ఎన్ని జన్మలెత్తినా మరువలేనిదా ఆతిథ్యం. కడుపు నింపుకునేందుకు అన్ని రుచికరమైన పదార్థాలు సృష్టిలో ఉంటాయని అప్పటివరకు రాంభద్రయ్యగారికి తెలియనే తెలియదు. రోజంతా ఎంతానందంగా గడిచిందో .. రోజుచివర్లో.. చీకట్లో ఏకాంతంలో అతిలోకసుందరులెందరో   బరితెగించి మరీ  ఇచ్చిన సౌందర్య ఆతిథ్యం ఎన్ని జన్మలెత్తినా మరువలేనిది.

ఆ క్షణంలోనే నిర్ణయించేసుకున్నారు రాంభద్రయ్యగారు ఏదేమైనా సరే  ఈ నరకాన్ని  చచ్చినా వదులుకోరాదని.

కానీ.. షరతు ప్రకారం మర్నాడంతా స్వర్గంలోనే గడపాల్సొచ్చింది పాపం రాంభద్రయ్యగారికి. స్వర్గం మరీ ఇంత తెలుగు ఆర్టు ఫిలింలా డల్ గా ఉంటుందని అస్సలు అనుకోలేదు. మనశ్శాంతికోసం సాంత్వనసంగీతమంటే   ఏదో ఒక ఐదారు నిమిషాలు  ఓకేగానీ..  మరీ   రోజుల తరబడి ఆకాశవాణి నిలయవిద్వాంసుల కచేరీ తరహా అంటే.. మాజీ ప్రధాని మన్మోహజ్ జీ సారుకయినా తిరగబడాలనిపించదా? ఒక వంక కడుపులో పేగులు కరకరమంటుంటే ఆ ఆకలిమంటను చల్లార్చడానికి ఏ  ప్యారడైజ్ బిర్యానీనో పడుతుంటే మజాగానీ .. అజీర్తి రోగి మాదిరి అసలాకలే లేని హఠయోగమంటే.. ఎంత స్వర్గంలో ఉన్నా నరకంతో సమానమే గదా! దప్పికతో నిమిత్తం లేకుండా ఏ   బాగ్ పైపరో.. ఆఫీసర్సు ఛాయస్సో.. స్థాయినిబట్టి ఆరగా ఆరగా ద్రవం గొంతులోకి చల్లగా జారుతుంటే కదూ.. స్వర్గం జానా  బెత్తెడు దూరంలోనే ఉన్నట్లండేది!  ఎంత అతి మధురామృతమైనా ఒక బొట్టు మొదట్లో అంటే మర్యాదకోసం’ చీర్స్’ కొట్టచ్చుగానీ.. అదే పనిగా అస్తమానం లోటాల్లో పోసి గుటకేయాల్సిందేనంటే.. ‘ఛీ!’ అంతకన్నా నరకం మరోటుంటుందా? ఆకలిదప్పులు, నిద్రానిప్పులు, మంచిచెడ్డలు, ఆరాటాలు.. పోరాటాలేవీ లేకుండా పద్దస్తమానం తెలిమబ్బులమీదలా తేలుతూ పారవశ్యం నటించాలంటే రాంభద్రయ్యలాంటి ఆసులో కండెలకు అసలు అయే పనేనా?

'ఎవర్నుద్దరించేందుకు, ఏం సాధించేందుకు స్వర్గసామ్రాజ్యంలో.. జన్మరాహిత్యం.. కోరుకోవాలి బాబూ? రమణీయ విలాసాలు, రసికజన వినోదాలు, రత్నఖచితాడంబరాలు.. యధేఛ్చావిహారాలు.. రుచికరాహారాలు, రసరమ్య పానీయాలు,. స్వర్గంలో దొరుకుతాయన్న మాట వట్టిబూటకమేనని ఒక్క రోజులోనే  తేలిపోయింది.  వాస్తవానికి ఇవన్నీ పుష్కలంగా దొరికే చోటు నరకమే అయినప్పుడు ఆ నరకంలోనే స్థిరనివాసం ఏర్పరుచుకోవడమే తెలివైన పని.

మర్నాడు   చిత్రగుప్తుడిముందు ప్రవేశపెట్టబడినప్పుడు మరో ఆలోచన  లేకుండా నరకానికే ఓటేసేసారు రాంభద్రయ్యగారు.

ఫార్మాలిటీసన్నీ పూర్తి చేసుకుని అధికారిక పత్రాలతో సహా నరకంలోకి అడుగు పెట్టిన రాంభద్రయ్యగారికి కళ్ళు బైర్లుకమ్మే దృశ్యం కంటబడిందీసారి.

నరకం మునుపటి స్వర్గంలాగా లేదు. నరకంలాగేనే ఉంది. మూసీ వడ్డునున్న  మురికివాడకు నకలుగా ఉంది.  మొన్నటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి బొత్తిగా సాపత్యమే లేదు.

మొదటి దృశ్యం- డొనాల్డ్ ట్రంప్ భారతావనికి వచ్చేముందు తీర్చిదిద్దిన అహమ్మదాబాదునగరం.

రెండో దృశ్యం- కొత్త ప్రభుత్వం గద్దె ఎక్కినర్నాటి  అమరావతినగరం.

పైనుంచీ ఆగకుండా అదే పనిగా వర్షిస్తున్నది చెత్తా చెదారం. ఆగకుండా ఆ చెత్తను  ఎతిపోస్తున్నది  వేలాదిమంది కూలీజనం. నిజానికి  వాళ్లంతా మొన్నరాంభద్రయ్యగారు  సందర్శనార్థం విచ్చేసినప్పుడు-  పిలిచి ఆతిథ్యమిచ్చిన నరక గేస్తులు! భూలోక నేస్తులు! వాళ్ల వంటిమీదిప్పుడు  వేళ్లాడుతున్నవి  అప్పటికి మల్లే  చీని చీనాంబరాలు కాదు. చివికి, చిరిగి, చీలకలైన మసి పేలికలు! చేతుల్లో పెద్ద పెద్ద చెత్తబుట్టలున్న ఆ పెద్దమనుషులంతా  భూమ్మీద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిన వి.వి.వి.వి..పి లు! పనిలో ఒక్క సెకను అలసత్వం చూపించినా చాలు వాళ్ల వీపులమీద కొరడా దెబ్బలు ఛళ్ళుమని  పడుతున్నాయి. ఆ కొరడాధరులంతా మొన్న ఇదే చోట శిబిని, అంబరీషుణ్ణి మరిపించిన ఆతిథిమర్యాదలతో రాంభద్రయ్యగారిని మురిపించిన  యమకింకరులే!

నోటమాట రాకా మాన్పడిపోయిన రాంభద్రయ్యగారి చేతిలో ఓ పెద్ద చెత్తబుట్ట పెట్టి ముందుకు తోసాడో కింకరాధముడు. ఆగ్రహం పట్టలేక నరాలు చిట్లేటంత బిగ్గరగా గావుకేక వేసారు రాంభధ్రయ్యగారు 'మోసం!.. దగా! మొన్న నరకానికి స్వర్గధామంగా విపరీతమైన కలరింగిచ్చి.. ఇవాళీ నరకంలో పారేయడం నమ్మక ద్రోహం.. కుట్ర!'

తాపీగా సమాధానమిచ్చాడా యమకింకరుడు 'ద్రోహానికి.. కుట్రకి.. ఇదేం మీ భూలోకం కాదు మానవా!  నువ్వు నరకాన్ని చూసిన రోజు  మా స్వర్గ నరకాల ఎన్నికల ప్రచారం ఆఖరి రోజు. ఎలక్షన్లు  అయిపోయాయి. నువ్వు ఎన్నుకున్న నరకానికే కదా నిన్ను తరలించిందిప్పుడు? ఇందులో మోసం.. దగా ఉంటే.. మీ భూమ్మీద జనానికి మీరు చూపించే హామీల్లోనూ మోసం.. దగా ఉన్నట్లే లెక్క! ముందే చెప్పాం గదా!  భూమ్మీద మీలాంటి నాయకులు నడిపిస్తున్న ప్రజాస్వామ్య విధానాలనే మేమూ ఇక్కడ మా లోకాల్లో అనుసరిస్తున్నామీ మధ్య' అన్నాడు కింకరుడు కొరడా రాంభద్రయ్యగారి వీపుమీద ఝళిపిస్తూ!

'అబ్బా!' అని రాంభద్రయ్యగారి పెడబొబ్బ. అది కొరడా దెబ్బో.. ప్రజాస్వామ్యం దెబ్బో ఎవరికి వారుగా  జనాలకు హామీలు గుప్పించి గద్దెనెక్కేవాళ్ళే అర్థంచేసుకోవాలబ్బా!

స్వస్తి!

కర్లపాలెం హనుమంతరావు

***

Monday, March 1, 2021

రుణానుబంధాలు - కథానిక -కర్లపాలెం హనుమంతరావు

కథానిక : 

రుణానుబంధాలు 

-కర్లపాలెం హనుమంతరావు

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)


పెరట్లో గిలక బావి దగ్గర స్నానం  చేస్తున్నాను. . శారదమ్మ తత్తరపడుతూ పరుగెత్తుకొచ్చింది 'రాధాకృష్ణయ్యగారు పోయార్టండీ!' అంటూ.


గుండె ఒక్కసారిగా గొంతులోకి వచ్చినట్లయింది. 'ఛ! ,, ఊరుకో!' అని కసిరాను. 


'నిజమేనండీ! రాత్రి పడుకునే ముందు బాగానే ఉన్నార్ట. శాస్తుర్లుగారు వాళ్ళింటి కెళ్ళి ముహూర్తాలు కూడా విచారించుకుని వెళ్లార్ట! ఇంతలోనే ఏం ముంచుకొచ్చిందో ఏమో.. ఇట్లాగయింది'


ఆ ఇంటి వైపు పరుగులు తీయబోతున్న శారదమ్మను ఆపి 'నీ కెవరు చెప్పారివన్నీ? ఏట్లా విన్నావో .. ఏమో?' 


'బజారంతా వాళ్లింట్లోనే ఉంది. ఎంత ఎతిమతం దాన్నైతే మాత్రం ఇట్లాంటి విషయాల్లో పొరపాటు పడతానా! నే పోతున్నా.. మీరు తాళం వేసుకు రండి!' అంటూ మళ్లీ మాట కందకుండా మాయమయిపోయింది మా శారదమ్మ.


స్నానం ఎట్లాగో అయిందనిపించి, బట్టలు మార్చుకుని మళ్లీ వాకిట్లోకొచ్చాను. 


చాలా మంది అటే పోతున్నారు. ఇంటికి తాళం వేస్తుంటే ఎక్కడలేని నీరసం ముంచుకొచ్చేసింది. ఇక కదల్లేక అక్కడే గుమ్మం ముందున్న అరుగు మీద కూలబడిపోయాను. వారం రోజుల కిందట జరిగిన విషయం వద్దనుకున్నా కళ్ల ముందు కదులుతోంది.


రాధాకృష్ణయ్యా నేనూ బాల్య స్నేహితులం. వాడు జడ్.పి లో టీచర్ గా చేసి రిటైరయ్యాడు. నేనో బ్యాంకులో పనిచేస్తూ రిటైరవడానికి సిద్ధంగా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య వయసులో నా కన్నా మూడేళ్లు పెద్ద. సర్వీసులో ఉండగానే ఎట్లాగో పెద్దపిల్లకు పెళ్లిచేశాడు. రెండో పిల్ల పెళ్లే వాడికి పెద్ద సమస్యయి కూర్చుంది. 


పిల్లా ఆట్టే చదువుకోలేదు. మరీ సంసారపక్షంగా పెంచింది వాళ్లమ్మ. అన్నిహంగులూ ఉన్నవాళ్ళకే పెళ్లిళ్ళు అవడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో, రెండు మూడు లక్షలన్నా పెట్టలేని వీడికి మంచి సంబంధాలు రావడం ఎంత కష్టమో నాకు తెలుసు. 


ఎట్లాగయితేనేం పెళ్లి సంబంధం ఒకటి ఖాయమయిందని వాడొచ్చి చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు ఇట్లా అయిందేమిటి?


పెన్షన్ డబ్బులు పూర్తిగా అందలేదు. పెళ్లికని దాచిన డబ్బులో కొంత తీసి కొడుక్కి పంచాయితీ బోర్డులో ఉద్యోగం వేయించాడు. ఇప్పుడు అర్జంటుగా ఓ లక్ష సర్దమని వచ్చి కూర్చున్నాడో రోజు. 


సమయానికి నా దగ్గరా అంత డబ్బు లేకపోయింది. డాబా మీద పోర్షన్ వేయడం వల్ల చేతిలో డబ్బాడటం లేదు. 


' పోనీ.. తెల్సినవాళ్లెవరి దగ్గర నుంచైనా ఇప్పించరా! పెన్షన్ డబ్బు అందగానే సర్దేద్దాం' అని బతిమాలుతుంటే బాధేసింది. 


'ఛఁ! చిన్ననాటి స్నేహితుడి అవసరానికి ఓ లక్ష రూపాయలు సర్దలేకపోతున్నానే!' అని మనసు పీకింది.


ఆ సమయంలోనే తటస్థపడ్డాడు శివయ్య. 


శివయ్య రైల్వే గార్డుగా చేసి రిటైరయ్యడు. అతనికి పెన్షన్ మా బ్యాంక్ ద్వారానే వస్తుంది. మొదట్లో కమ్యూటేషన్, గ్రాట్యుటీ అంతా వచ్చింది కరెక్టేనా కాదా అని లెక్కలు కట్టి చూపించింది నేనే. 


మూడు లక్షలు దాకా వస్తే కొంత ఫిక్సడ్ డిపాజిట్ చేయించాను మా బ్యాంకులోనే. 


నెల నెలా బ్యాంకుకు వచ్చిపోయే మనిషవడం వల్ల పరిచయం కాస్త ఎక్కువే అన్నట్లుండేది పరిస్థితి. 


ఎందుకో, అతనికి నా మీద అదో రకమైన గురి కూడా. డిపాజిట్లు రిన్యూవల్ చేయించుకోడానికి వచ్చినప్పుడెల్లా ఎక్కడెక్కడ ఎంత వడ్డీలు ఇస్తున్నారో విచారించుకుని పోతుండేవాడు. 


ఎప్పటిలా ఆ రోజూ శివయ్య నా దగ్గరికొచ్చి కూర్చున్నాడు. 


'పంతులుగారూ! డిపాజిట్లలో వడ్డీ మరీ తక్కువ వస్తున్నది సార్! ఇంకా మంచిది ఏమైనా ఉంటే చెప్పండి సార్!' అని అడిగాడతను.


అప్పుడు మెదిలింది మనసులో ఆ ఆలోచన. శివయ్య ఏమనుకుంటాడో అన్న తటాయింపు ఉన్నా స్నేహితుడికి సాయం చెయ్యాలన్న తపన నన్నట్లా అడగనిచ్చింది. 


'శివయ్యా! నా కర్జంటుగా ఒక లక్ష కావాల్సొచ్చింది. బ్యాంకు వడ్డీ కన్నా ఒక శాతం ఎక్కువ ఇస్తాలే! నెల నెలా ఇస్తాను. రెండు నెలల్లో తీర్చేస్తాను. వీలయితే ఈ లోపే ఇస్తాలే!' అన్నాను.


శివయ్య కాదనలేదు, 'బ్యాంకు వడ్డీ ఇవ్వండిలే సార్! చాలు!' అంటూ ఆ రోజే లక్ష రుపాయలూ డ్రా చేసి ఇచ్చాడు. 


'నోటు రాసిస్తాను' అన్నాను. 'మీ నోటి మాట కన్నా విలువైనదా నోటు? వద్దు' అంటూ కొట్టిపారేశాడు శివయ్య. 


ఒక కాగితం ముక్క మీద మాత్రం రాయించుకున్నాడు. 


'శివయ్య నా మీదుంచుకున్న నమ్మకాన్ని వమ్ము చెయకూడదు' అనుకున్నానా రోజు. అదే మాట రాధాకృష్ణయ్యతోనూ అన్నాను డబ్బిస్తూ. 


'పెన్షన్ రాగానే ముందు ఈ బాకీనే తీరుద్దాం. నీ పరువోటీ,, నా పరువోటీనా? అందాకా నోటు రాసిస్తాను తీసుకో!' అన్నాడు  రాధాకృష్ణయ్య. 


'మిత్రుల మధ్య పత్రాలేమిటి?' అంటూ నేనూ ఆ రోజు కొట్టిపారేశాను. 


ఇప్పుడు విధి రాధాకృష్ణయ్యను కొట్టిపారేసింది. 


ఎంత వద్దనుకున్నా లక్ష రూపాయల విషయం మర్చిపోలేకుండా ఉన్నాను. 


రాధాకృష్ణయ్య ఇంట్లో ఈ బాకీ సంగతి చెప్పాడో లేదో? చెబితే మాత్రం నోటులేని బాకీని చెల్లుబెట్టాలని రూలేముంది? తన స్నేహం రాధాకృష్ణయ్యతోనే కానీ, వాడి కొడుకుతో కాదుగా!


శాస్త్ర్రులగారబ్బాయి వచ్చి అరుగు మీద కూర్చునున్న నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. 


'ఇంకా మీరిక్కడే కూర్చుని ఉన్నారేంటంకుల్? అవతల వాళ్లంతా మీ కోసం ఎదురుచూస్తుంటేనూ? పదండి పోదాం' అంటూ నన్ను లేవదీసి వాళ్ళింటి వేపుకు తీసుకెళ్లిపోయాడు.


వరండాలో చాపేసి దాని మీద పడుకోబెట్టున్నారు రాధాకృష్ణయ్యను. ప్రశాంతంగా నిద్రపోతున్నట్లుంది వాడి ముఖం. 


'నా బాకీ సంగతేం చేశావురా?' అని ఆడగాలనిపించింది అంత దు:ఖంలోనూ. 


ఆడవాళ్ళు కొందరు ఏడుస్తున్నారు లో గొంతుకతో. 

అప్పటికే బంధువులంతా పోగయివున్నారు. 


రాధాకృష్ణయ్య కొడుకు దుఃఖాన్ని దిగమింగుకొని ఏర్పాట్లు చూస్తున్నాడు. 


నన్ను చూడగానే దగ్గరికొచ్చి కంట తడిపెట్టుకున్నాడు. ఓదార్పుగా వాడి భుజం మీద చెయ్యేసి తట్టేనే గాని నా కళ్లలో మాత్రం నీరు ఊరవా! వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అడిగాను. 


'ఎట్లా జరిగిందిరా ఈ ఘారం?' 


'రాత్రి వరకు బాగానే ఉన్నారంకుల్! మధ్య రాత్రి  నిద్రలో లేచి అమ్మతో 'గుండెలు బరువుగా ఉన్నాయ'న్నారుట. 


చెల్లెలి పెళ్లి గురించే అలోచించడం వల్లనుకున్నాం. 'అంతా సజావుగా సాగుతుందిలే నాన్నా!' అన్నా ఏదో గుండె ధైర్యం చెప్పడానికి. 


'అంతేనంటావా!' అని మళ్లీ పడుకుండిపోయారు. మళ్లీ ఇక లేవలేదు. తెల్లవారుఝామున గుండెల్లో నొప్పితే మెలికలు  తిరిగిపోతుంటే అర్థమయింది రాత్రొచ్చింది గుండె పోటు ముందు సూచన అని. 


అప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఉంటే..' మాట పూర్తవక ముందే గొంతు పూడుకుపోయింది ఆ పిల్లాడికి. 


'పోయే ముందు నీ కేమీ చెప్పలేదుట్రా?' అని అడిగాను ఆశగా. 

తల అడ్డంగా ఊపేడు. 'ఆ అవకాశమే లేకుండా పోయిందంకుల్. అదే బాధ..'


ప్రసాద్ నుంచి వచ్చిన ఆ జవాబుతో ఉన్న ఒక్క ఆశ కూడా అడుగంటిపోయింది.


ఇక్కడ చేరినవాళ్లలో కొంత మంది కూతురు పెళ్ళి అర్థాంతరంగా ఆగిపోతుందన్న విచారం వ్యక్తపరిచారు. 


విచిత్రంగా నా బాధ మాత్రం వేరేగా ఉంది. నా సొమ్ము సంగతి ఏమిటి? అనేదే నా ఆలోచన. 


వాడూ నేనూ ఇంతప్పటి నుంచి ఒకటిగా తిరిగాం. కాలేజీలు వేరు వేరు అయినా సెలవులకు ఇళ్లకు వచ్చినప్పుడు ఒక్క క్షణం ఒకళ్లను ఒకళ్లం వదలకుండా లవకుశలకు మల్లే కలిసే తిరిగాం.  ఉద్యోగాల మూలకంగా విడిపోయినా ఇద్దరి మధ్య ఎన్నడూ  ఎడం పెరగలేదు. 


రిటైరయిన వాడు సొంత ఊళ్లో ఉంటే, రిటైర్ మెంటుకు దగ్గరగా ఉన్నందున నేనూ సొంత ఊళ్లోనే పనిచేస్తున్నా. 


ఇప్పుడు విధి మాత్రం మమ్మల్నిద్దర్నీ ఈ విధంగా విడదీసింది. 


పాడె మీద పార్థివ  దేహాన్నుంచి అంత్యక్రియలు ఆరంభించారు. 


ఇంకో పది నిముషాలలో నా ప్రాణస్నేహితుడి రూపం కూడా కంటి కందనంత దూరంగా కనుమరుగయిపోతుంది. 


పచ్చనోట్ల వ్యవహారాన్ని ఎట్లాగైనా మర్చిపోవాలి. 


అందుకు ఒక్కటే మార్గం. వాడిని భుజం మీద మోసుకుంటూ అంతిమస్థలి దాకా అందరితో కలసి నడవడమే! 


వాడు చితిలో కరిగిపోయే దృశ్యం కళ్లారా  కనిపించినప్పుడు కానీ చేదు వాస్తవం మనసు పూర్తిగా జీర్ణించుకోలేదు. 


పై చొక్కా విప్పేసి, కండువా భుజం మీద వేసుకుని తయారవుతున్న నన్ను చూసి శారదమ్మ దగ్గరకొచ్చింది. 'మీ కసలే బాగుండటం లేదు. అంత దూరం మోయగలరా?'


'వాడు నా మీద మోపిన రుణభారం కన్నా ఇది గొప్పదా?' అని అందామనుకున్నా కానీ, అతికష్టం మీద తమాయించుకున్నా.


కట్టుకున్నదానికైనా చెప్పుకోలేని గడ్డు నిజం. శారదమ్మకు ఈ అప్పుగొడవలేమీ అప్పట్లో తెలియనివ్వలేదు. 


అంతిమ యాత్రలో అందరితో కలిసి నడుస్తున్నా ఆగడమే లేదీ పాడాలోచనలు. 


నేనే వృథాగా వర్రీ అవుతున్నానేమో! అంత పెద్ద మొత్తం! తన దగ్గర రుణంగా తీసుకున్న విషయ రాధాకృష్ణయ్య కొడుక్కు చెప్పకుండా ఉంటాడా? పెన్షన్ డబ్బు అందగానే ప్రసాద్ తన బాకీ తీరుస్తాడేమో! 


అట్లా తీర్చని పక్షంలో తానేం చెయ్యాలి? ఒకటా రెండా! వడ్డీతో కూడా కలుపుకుంటే పెద్ద మొత్తమే అవుతుంది. తీర్చాలని ఉన్నా అంతా తీర్చలేడేమో! వాడు అసలు నేనెందుకు తీర్చాలని  అడ్డానికి తిరిగితేనో? 


మిత్రుడి కొడుకు మీద కోర్టుకెళ్లే ఆలోచనే జుగుప్సా అనిపించింది నాకు. 


ఆస్తులు పంచుకున్నట్లే, అప్పులూ పంచుకోవడం కన్నబిడ్డల్లా కొడుకుల బాధ్యత.ప్రసాద్ కుటుంబ బాధ్యతల నుంచి తప్పించుకునే రకం కాదు.. ఇట్లా సాగుతున్నాయి దారిపొడుగూతా నా ఆలోచనలు . 


కర్మకాండల తతంగం ముగిసి బంధుమిత్రులు వెళ్లిపోయి ఇల్లంతా మెల్లిగా  ఆ విషాదానికి సర్దుకునే సమయంలొ .. అదను చూసి అడిగాను ప్రసాదును అక్కడికీ ఆశ చావక 'ప్రసాదు! నాన్న ఇంటి సంగరులెప్పుడూ నీతో చెప్పలేదా?' అని.


'మాట్లాడుతూనే ఉంటారంకుల్! ఇదిగో.. ఈ పెళ్లి తలపెట్టినప్పటి నుంచే మూడీగా మారిపోయారు. సొమ్ము సమకూరదనేమన్నా దిగులేమో! చేసిన అప్పులు తీర్చడ మెట్లాగన్న ఆలోచనా నాన్నగారిని బాగా కుంగదీసింది. సగం ఆ దిగులుతోనే కన్నుముశారేమోనని నా అనుమానం' అన్నాడు ప్రసాద్.


నాకు కొద్దిగా ఉత్సాహం వచ్చింది 'తాను చేసే అప్పుల గురించి ఎప్పుడైనా నీతో చర్చించేవాడా?' అనడిగాను ఆశగా. 


'నోటితో చెప్పలేదు కానీ.. ఇదిగో ఈ డైరీలో రాసి పెట్టుకున్నారు. కొద్ది మందికి అప్పుపత్రాలు రాసినట్లున్నారు. అంతా కలసి ఒక అయిదారు లక్షలు అయినట్లుంది' 


'మరి నువ్వేం చేద్దామనుకుంటున్నావ్?'


'ముందు చెల్లెలి పెళ్లి పూర్తి చెయ్యాలి. అప్పుడే నాన్నగారికి కన్యాదాన ఫలం దక్కేది. ఆ తరువాత కూడా పెన్షన్ డబ్బులేమన్నా మిగిలుంటే  వీలయినంత వరకు పత్రాలకు సర్దుదామనుకుంటున్నా. మీరేమంటారంకుల్?' 


'మంచి ఆలోచనరా! బాకీలు తీర్చి తండ్రిని రుణవిముక్టుణ్ణి చెయ్యడం కొడుకుగా నీ బాధ్యత కూడానూ! అందరూ  నోట్లే రాసివ్వలేదేమో! చే బదుళ్లూ..'


'మధ్యలోనే తుంచేశాడు ప్రసాద్ 'నోట్లు విడిపించుకోవడమే తలకు మించిన పని. నోటి మాట  బదుళ్లూఎలా తీర్చగలం? అందులోనూ అందమా  నిజమే చెబుతారని గ్యారంటీ ఏంటంకుల్?చనిపోయినవాళ్ల పేరు చెప్పుకుని డబ్బులు దండుకునేవాళ్ళు కోకొల్లలు ఈ కాలంలో! అవన్నీ తీర్చడమంటే నా వల్లయ్యే పనేనా?..


'ప్రసాద్ సమాధానంతో నా నవనాడులూ కుంగిపోయాయి. 


'పోనీ.. ఆ డైరీలోనే నా పేరేమైనా రాసేడేమో! డైరీ చూపించమని ఓ సారి అడిగితే!' నా ఆలోచన నాకే సిగ్గనిపించింది. కానీ, లోపలి మధనను ఆపుకోలేని బలహీనత. 


ప్రసాద్ స్నానాల గదికి వెళ్లిన సందు చూసి అక్కడే టేబుల్ మీదున్న డైరీ తీసి ఆత్రుతగా తిరగేశా. 


ఊహూఁ! ఏ పేజీలోనూ నా పేరే కనిపించ లేదు! 


నాకుగా  నేను  ఆ చేబదులు ఊసెత్తితే ప్రసాద్ నన్ను ఏ కేటగిరీలో చేరుస్తాడో తెలుసు! పరువే ప్రధానంగా గడిపే మధ్య తరగతి జీవిని నేను. 


'లక్ష రూపాయలకు నీళ్లొదులుకోక తప్పదు' అని ఆ క్షణంలోనే ఒక నిశ్చయానికి వచ్చేశాను. 


రాధాకృష్ణయ్య నన్ను తప్పింకుని పోగలిగాడు కానీ, శివయ్య నుంచి నేనెలా తప్పించుకోగలను!


అప్పటికీ సాధ్యమైనంత వరకు శివయ్య కంటబడకుండా ఉండేందుకు ప్రయత్నించాను. 


ప్రసాద్ తండ్రి పింఛన్ సొమ్ము అందుకున్నాడు.  కిందా మీదా పడి చెల్లెలి పెళ్లి అయిందనిపించాడు. పెళ్ళిలో నా భార్య బాగా పూసుకు తిరిగింది. నేనే, మనసు పెట్టి మిత్రుడి కూతురి కళ్యాణ శుభవేళంతా కలవరంతో గడిపేసింది! 


రాధాకృష్ణయ్య పేరు చెవిన పడగానే ముందు లక్ష రుపాయల రుణం కళ్ల ముందు కదలడం నా దురదృష్టం. 


ఆబ్దికాలకు హాజరయి వచ్చిన తరువాత .. వీలయినంత వరకు వాడిని ఊహల్లోకి రానీయకపోవడమే మిత్రుడిగా నేను వాడికి చేయదగ్గ న్యాయం అనిపించింది.


శివయ్య పెట్టిన గడువు రానే వచ్చింది. ఆ రోజు అతను బ్యాంకుకు వచ్చాడు కూడా. కానీ, బాకీ సంగతి హెచ్చరించలేదు! నేనూ నాకై నేను ఆ ఊసు జోలికి పొదలుచుకోలేదు. కానీ, ఎంత కాలమని ఇట్లా?!


నా మీద నమ్మకంతో ఏ నోటూ లేకుండానే  అతి తక్కువ వడ్డీతో అంత పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చిన పెద్దమనిషి నుంచి మొహం చాటేసే దౌర్భాగ్య పరిస్థితి చేజేతులా తెచ్చుకున్నానే! 


'మిత్రుడయితే ఏంటి? అంత పెద్ద మొత్తం అప్పుగా ఇస్తున్నప్పుడు రాధాకృష్ణయ్య దగ్గర నోటు రాయించుకుని ఉండాల్సింది. నా పొరపాటే నా నేటి దౌర్భాగ్య పరిస్థితికి నూటికి నూరు పాళ్లు కారణం' అని అనుకోని క్షణం ఉండటంలేదు ఈ మధ్య కాలంలో!


బ్యాంకు కొచ్చిన మూడో సారి కూడా తన బాకీ  ఊసెత్తని నన్ను అదోలా చూశాడు శివయ్య. 'సారీ శివయ్యా! అనుకున్న టైముకు డబ్బందలేదు. వడ్డీ ఇస్తాను. అసలుకు నోటు రాసిస్తాను.. కాదనకుండా తీసుకో!' అన్నాను.


వడ్డీ పైకం తీసుకుని నోటు తయారుచేయించి తెచ్చాడు. సంతకం చేసి ఇచ్చేటప్పుడు 'వచ్చేనెలలో నా బిడ్డ పెళ్లి  పెట్టుకున్నాను సార్! ఎట్లాగైనా సొమ్ము సర్దాలి' అంటున్నప్పుదు శివయ్య ముఖం చూడలేక నేను  సిగ్గుతో చచ్చిపోయిన మాట నిజం.


శివయ్య ఇప్పుడు బ్యాంకుకొచ్చినా నన్ను కలవడం లేదు. నేను పలకరించినా ముభావమే సమాధానం.


ఓ శుక్రవారం  బ్యాంకు కొచ్చి ఉన్న డబ్బంతా విత్ డ్రా చేసుకున్నాడు శివయ్య. 


నా దగ్గరికొచ్చి 'సోమవారం నోటు తీసుకువస్తాను. ఎట్లాగైనా సొమ్ము చెల్లించాలి. వడ్డీ అక్కర్లేదు. అసలు ఇస్తే అదే పదిలక్షలు!' అని తాఖీదు  ఇచ్చిపోయాడు. 


శివయ్య దృష్టిలో నేను అంతలా పడిపోవడానికి కారణమెవరు? 


రాధాకృష్ణయ్యా? రాబోయే మరణాన్ని వాడేమైనా కలగనలడా? ఆ మృత్యుదేవత రాధాను కాకుండా తననైనా ఎంచుకుని ఉండొచ్చుగా! అప్పుడీ శివయ్య ఏం చేసివుండేవాడు? 


శివయ్యను మాత్రం తప్పెలా పట్టగలను?అంత పెద్ద మొత్తాన్ని స్వల్ప వడ్డీకి ఏ ఆధారం లేకుండా తనకు ధారపోసిన గొప్పవ్యక్తిని ఎట్లా తప్పుపట్టడం? 


ఏ వత్తిడుల కారణంగానో తానిప్పుడు వైఖరి మార్చుకున్నాడో? 


సమయానికి తాను చెసిన సాయాన్ని గురించి సమాచారం లేనందువల్లనే కదా మిత్రుడి కొడుకు ప్రసాదైనా తన చే బదులును లెక్కలోకి తీసుకోనిది? ఇన్ని పాత రుణాలను చెల్లిస్తోన్న అతని మంచి గుణం కేవలం నోటు లేదనే ఒకే ఒక సాకుతో ఎగవేసేందుకు  ఒప్పుకుంటుందా? 


పరిమితికి మించిన నమ్మకాలు, సమాచార లోపాలు.. విధి ఆడించిన నాటకాల కారణంగానే  వ్యక్తిత్వాలు ఇక్కడ ప్రశ్నార్థకాలు అయ్యాయే తప్పించి.. ఆర్థిక బంధాలు మానవీయ సంబంధాలకు మించిన బలమైనవిగా భావించడం సరయిన దిశలో సాగే అవగాహన కాదేమో!  


ఏదేమైనా శివయ్య బాకీ తీరిస్తే గాని, నా మనశ్శాంతి నాకు తిరిగి రాదు. 


ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జీతభత్యాల ఎరియర్స్  తాలూకు మధ్యంతర చెల్లింపులకు ఆదేశాలు ఆ శనివారమే వెలువడ్డంతో ఆదివారం అంతా బ్యాంకులో కూర్చుని సిబ్బంది మొత్తం ఉత్సాహంగా ఆ పని చూసుకున్నాం. 


సొమవారం ఉదయానికల్లా అందరి ఖాతాలలో సొమ్ము జమ. 


ఈ సారి ఎరియర్స్ సొమ్ముతో వెన్నునొప్పికి ఆపరేషన్ చేయించుకోవాలని శారదమ్మ ఎంతో కాలంగా ఆశతో ఎదురుచూస్తోంది. 


సోమవారం శివయ్య బ్యాంకు వైపుకు వస్తాడనుకున్నాను. రాలేదు! 


మరో రెండు రోజులు చూసి నేనే సొమ్ముతో సహా శివయ్య చిరునామా వెతుక్కుంటూ వెళ్లాను. 


ఇల్లు కనుక్కోవడం చాలా కష్టమయింది. అది  ఒక మురికిపేటలో ఉంది. శివయ్య ఇల్లు చాలా అధ్వాన్నంగా ఉంది. 


తలుపు కొట్టాను. ఒక నడివయసు ఆడమనిషి గడియ తీసింది. 

నన్ను ఎగాదిగా చుసి 'ఎవురు కావాల?' అంది. 


చెప్పాను. 


నిర్లక్ష్యంగా పక్కగది చూపించి వెళ్లిపోయింది.


శివయ్య మంచం మీదున్నాడు. మంచం చాలా మురికిగా ఉంది. 


శివయ్య మొహంలో కళ లేదు. నెలరోజులు లంఖణాలు చేసిన రోగిష్టిమారిలా కనిపించాడు. 


నా పలకరింపులు అయినంత సేపూ డోర్ కర్టెన్ వెనక ఏవో కదలికలు. 


డబ్బు ఇవ్వడానికి బేగులో చెయ్యి పెట్టాను. 


అతను బలహీనమైన చేతితో ఆ పని ఆపుచేయించాడు 'మీ ఫ్రెండు గారి అబ్బాయే వచ్చి ఇచ్చి వెళ్లాడు. నోటు మీకు ఇద్దామనుకునే లోపలే అడ్దంపడ్డాను.' అంటూ పరుపు కింది  దాచుకున్న పత్రాలలో నుంచి ఒక పత్రం ఏరి తీసిచ్చి 'ఇక మీరు వెళ్లవచ్చు' దండం పెట్టేశాడు. 


 ఏదో అడగబోయేటంతలో ఇందాకటి ఆడమనిషి లోపలి కొచ్చింది అనుమానంగా చూస్తూ. 


శివయ్య అటు తిరిగి పడుకుండిపోయాడు. 


అంటే ఇక నేను 'బైటికి దయచేయచ్చు'  అని అర్హ్తమనుకుంటా. 


సవాలక్ష అనుమానాలతో నేను తిరిగివచ్చేశాను. 


ప్రసాదుకు ఈ బాకీ సంగతి తెలుసన్నమాట! 


రాధాకృష్ణయ్య చూచాయగా కూడా చెప్పినటట్లు  లేదే! 


ప్రసాదుతో మాట్లాడితే గాని విషయాలు తేలవు. 


చికాకు కారణంగా నేను ఆ దిక్కుకు పోవడమే మానేశాను. 


పాడు డబ్బు పితలాటకం మూలకంగా ప్రాణస్నేహితుడి కుటుంబానిక్కూడా దూరమయిన సంగతి అప్పుడు గుర్తుకొచ్చింది. 


వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో  నేను ఆ కుటుంబానికి రాధాకృష్ణయ్యలాంటి వాడిని. ప్రసాద్ ఎన్నో సార్లు సలహా కోసరంగాను తన దగ్గరి కొస్తుండేవాడు. 


తన ముభావం  కారణంగా రాకలు తగ్గించేశాడు. 


నేను ప్రసాద్ ను కలవడానికి బైలుదేరుతుంటే శారదమ్మ అన్నది నిష్ఠురంగా 'ఆ అబ్బాయి ఇప్పుడు ఇక్కడ లేడుగా! కొత్త బావగారు తనకు దుబాయ్ లో కొలువిప్పించాడు. ఆ సంగతి చెప్పడానికని ఎన్ని సార్లు వచ్చినా మీరు  మొహం చాటేశారు.. మహగొప్పగా!'  


నా ప్రవర్తన నాకే సిగ్గనిపించింది. 


అయిందేదో అయింది. ముందీ డబ్బు మిస్టరీ తేలాలి. 


శారదమ్మ ద్వారా ప్రసాద్ దుబాయ్ చిరునామా సేకరించి ఇంత పెద్ద ఈ మెయిల్ పంపించాను. 


ఫోనులో నేరుగా మాట్లాడవచ్చు. కానీ, అత్మాభిమానం.. అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడనీయదు: 


చే బదులు విషయంలో ముందు  నుంచి జరిగిందీ.. తరువాత నా ప్రవర్తనా..  అందుకు కారణాలు గట్రా అంతా ఓ సోదిలా వివరించి.. చివరగా శివయ్య బాకీ తీర్చినందుకు కృతజ్ఞతలు కూడా తెలియచేశా. 


తెల్లారే సరికల్లా ప్రసాద్ నుంచి తిరిగు మెయిల్! 


'ఆ శివయ్య ఎవరో నాకు తెలీదు  అంకుల్! నేను అతనికి డబ్బిచ్చిందేమీ లేదు! నాన్నగారు అలా మీ ద్వారా అతని దగ్గర్నుంచి అప్పు తీసుకున్నట్లు నాకు ఎప్పుడూ చెప్పను కూడా చెప్పలేదు. ఆ సంగతి ఇదిగో ఇప్పుడు మీ ఉత్తరం అందిన తర్వాతనే తలిసింది. అందరి అప్పులూ తీర్చేశాను. ఈ ఒక్కటి మాత్రం ఎందుకు? ఇప్పుడు నేను బాగానే సంపాదిస్తున్నాను. తండ్రిని రుణశేషుణ్ణిగా మిగల్చడం కన్నబిడ్డకు భావ్యం కాదని మీరే అంటారుగా! అమౌంట్ పంపుతున్నా! దయచేసి అతని బాకీ అణా పైసల్తో సహా తీర్చేయండి!'


ప్రసాద్ పంపిన డబ్బు అందిన తరువాత బలవంతంగానైనా శివయ్యకు ఆ డబ్బిచ్చెయ్యాల్సిందేనని వెళితే .. అంతకు మూడు రోజుల కిందటే పోయినట్లు తెలిసింది. 


కొడుకు జులాయిట. ఎక్కడి డబ్బు పేకాటకు పోస్తుంటే .. అడ్డొస్తున్నందుకు దుడ్డు కర్రతో బుర్ర రాంకీర్తన పాడించాడుట! 


అప్పటికి తిరిగొచ్చినా శివయ్య సొమ్ము నా దగ్గరుంచుకో బుద్ధేయలేదు. 

అతని కష్టార్జితాన్ని సద్వినియోగం చేయడమెట్లాగా అని మధన పడుతుంటే.. మాటల సందర్భంలో బాకీ అడిగిన రోజు శివయ్య చేసిన పెద్దల వెల్ ఫేర్ సెంటర్ల ప్రస్తావన గుర్తుకొచ్చింది.


నాకు తెలిసిన ఓల్డేజ్ హోమ్   కు శివయ్య పేరున ఆ పెద్ద మొత్తం శాశ్వత విరాళం కింద ఇచ్చిన తరువాత గాని మనసుకు శాంతి లభించింది కాదు. 

***

(ఈనాడు ఆదివారం అనుబంధం 18 ఫిబ్రవరి 2001 - ప్రచిరితం)







'








 

 

 

'

 

 

'

Wednesday, February 24, 2021

వెన్నెల-కథానిక -కర్లపాలెం హనుమంతరావు (ఈనాడు- ఆదివారం అనుబంధం ప్రచురితం)

 


నాకప్పుడు ఏ అయిదో ఆరో  ఏళ్ళుంటాయనుకుంటా. నాన్నగారి ఉద్యోగ రీత్యా నెల్లూరి ఉదయగిరి దగ్గర్లోని సీతారాంపురంలో ఉన్నాం. నాన్నగారు అడపా దడపా హైదరాబాద్ వెళ్ళాల్సొచ్చేది. ఆయన ఊళ్లో లేనప్పుడు లంకంత ఆ ఇంట్లో అమ్మా నేనూ మాత్రమే ఉండాల్సొచ్చేది. పగలంతా ఎట్లాగో ఫరవాలేదు కాని, చీకటి పడితే చాలు ప్రాణాలు  పింజం పింజం అంటుండేవి. ఊరు కొత్త కావడం వల్ల పరిచయాలు తక్కువ. ఉన్నా రాత్రిళ్లు తోడు పనుకునేటంత పరిచయస్తులు లేరు. మా ఇంటికొచ్చి వైద్యం చేసే ఆచారిగారు తోడుకీ, ఇంటి పనికీ ఒక మనిషిని పంపించారు. ఆమె పేరే 'వెన్నెల'.

వెన్నెల పేరు ఎంత అందంగా ఉంటుందో.. మనిషి అంత మొరటుగా ఉండేది. గడ్డం కింద సొట్ట, కనుబొమలు మగాళ్ల మీసాలంత ఉండేవి. మాట పెళుసు. కుడికాలు ఎత్తెత్తి వేస్తుంది. నడుస్తుంటే గతుకుల రోడ్డు మీద ఎద్దులబండి పడిలేస్తూ పోతున్నట్లుండేది.

పెళ్లి కాలేదుట. 'నా' అన్నవాళ్లెవరూ లేరని చెప్పారు ఆచారిగారు. అయినా డబ్బుల దగ్గర కాపీనం చూపించేది. ఇంట్లో ఏ పనికిరాని వస్తువు కనిపించినా మూట కట్టుకునిపోయేది. వారానికొకసారి ఎక్కడికో వెళ్లి వస్తుండేది. ఎక్కడికని అమ్మ అదిగితే మాట మార్చేది.

 నాకు వెన్నెలంటే మెల్లగా ఇష్టం ఏర్పడడం మొదలయింది. సందు దొరికినప్పుడల్లా నన్ను ఒళ్లో కూర్చోపెట్టుకుని కబుర్లు చెబుతుండేది. అన్నీ అడవి కబుర్లే. వినడానికి గమ్మత్తుగా ఉండేవి. కుబుసం విడిచిన పాములు ఎంత చురుకుగా కదులుంటాయో, గిన్నీకోడి ఎలా తమాషాగా కూతపెడుతుందో, కుందేళ్ళు మనుషులకు దొరక్కుండా ఎలా తెలివిగా తప్పించుకుంటాయో, అడవి మధ్యలో ఉన్న పాతాళం బావిలో నీళ్లు అన్నికాలాల్లో ఎలా తియ్యగా చల్లగా ఉంటాయో, తేనెపట్టును ఈగలు కుట్టకుండా ఎలా తెలివిగా కొట్టుకురావచ్చునో, కప్పలు రాత్రుళ్ళు రాళ్ల సందుల్లో చేరి ఎలా బెకబెకమంటాయో అనుకరించి నవ్వించేది. భయపెట్టేది. అయినా సరే, కమ్మంగా ఉండేవా అడవి కబుర్లు నాకారోజుల్లో.

 వెన్నెల ఇంట్లో ఉన్నంత సేపూ అమ్మను ఏ పనీ ముట్టుకోనిచ్చేది కాదు. 'దొరసానమ్మా! దొరసానమ్మా!' అంటూ బాగా మన్నన చేసేది. నన్నయితే 'చిన్నదొరా!' అంటూ చంక దించేదికాదు. నాన్నగారు ఇంట్లో ఉంటే మాత్రం చడీ చప్పుడు లేకుండా పనిచేసుకుపోయేది. వెన్నెల కలివిడితనమంతా ఆడవాళ్లతోనూ, నా లాంటి చిన్నపిల్లలతోనే!

 చెల్లాయి అమ్మ కడుపులో ఉందా రోజుల్లో. మా తాతగారి ఊరు పాండిచ్చేరి దగ్గరుండే కడలూరు. 'కాన్పుకు కాస్త ముందే పోరాదా?' అనేవారు నాన్నగారు. 'ఈ అడవిలో ఏం ఉంటారో.. ఏం తింటారో! ప్రసవం టైముకు పోతాలే!' అనేది అమ్మ. నా ఊహ తెలిసి అమ్మ నాన్నగారిని వదిలి ఉన్నది చాలా తక్కువే. 'ఎన్నో కాపురాలను చూశాను గానీ, సీతారాముల్లా మీ అంత వద్దికగా ఉండేవాళ్లని శానా తక్కువ మందిని చూశాను దొరసానీ!' అంటుండేది వెన్నెల. పాపాయికి అమ్మ స్వెట్టర్ అల్లుతుంటే దగ్గర కూర్చుని వింతగా చూసేది వెన్నెల.

 మేం కడలూరు పోవాల్సిన రోజులు దగ్గరపడ్డాయి. మర్నాడు ప్రయాణమనగా ఆ రోజు జరిగింది ఆ సంఘటన. ఇప్పటికీ నాకు నిన్నగాక మొన్న జరిగినట్లుంది. ఆ రోజు పగలంతా అమ్మ నడుం నొప్పిగా ఉందని మంచం దిగలేదు. వెన్నెలే అన్ని పనులూ చేసుకుపోతోంది. సాయంకాలం నాకు పెరట్లో స్నానం చేయించే సమయంలో నడవాలో నుంచి పెడబొబ్బలు. అమ్మ అదే పనిగా ఆగకుండా అరుస్తూనే ఉంది. గభాలున లేవబోయి కాలు మడతబడి బోర్లా పడిపోయింది వెన్నెల. తట్టుకుని లేచి ఇంట్లోకి పరుగెత్తింది. వెనకనే తడి ఒంటితో నేనూ.. !

అమ్మ మంచం మీద ఒక కోతి. పళ్ళు బైటపెట్టి కిచకిచమంటూ అమ్మని బెదిరిస్తోంది. నాకు పై ప్రాణాలు పైనే పోయాయి. పెద్దగా ఏడుస్తున్నాను. నా ఏడుపు చూసి ఆ కోతి నా మీదకు దూకపోయింది. వెన్నెల దాన్ని వెనక్కు నెట్టేసింది. తను మూలనున్న గడకర్ర అందుకునే లోగానే ఇంకో అరడజను కోతులు లోపలికి జొరబడ్డాయి. ఇల్లు కిష్కింధకాండే! ఒక గండుకోతయితే మరీ రెచ్చిపోయినట్లు  పిచ్చి పిచ్చిగా  గెంతుతూ అమ్మ మీదకు దూకి తను అల్లుతున్న స్వెట్టర్ లాక్కుని బైటకు పరుగెత్తింది. అంతే.. వెన్నెలకు శివమెత్తినట్లయిపోయి ఒక కర్ర తీసుకుని దాన్ని తరుముకుంటూ పోయింది. ఆ కంగారులో ఇంటి ముందు కరెంటువాళ్లు తీసిన గోతిలో పడిపోయింది. నలుగురూ చేరి ఆమెను బైటికి తీశారు. గోతిలోని రాళ్లు తలకు ఒకటి రెండు చోట్ల తగిలి రక్తం ధారగా కారిపోతోంది. ఆచారిగారు వచ్చే వేళకు ఆమె శ్వాస తీసుకోవడం ఆపేసింది. నాన్నగారొచ్చే సమయానికి ఇంటి ముందు శవం.. అదీ సీను!

వెన్నెల శవాన్ని ఎవరికి అప్పగించాలో తెలియలేదు. ఆమె కోసం ఎవరూ రాలేదు. ఊళ్లోవాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఆమెను మా ఇంట్లో చేర్చిన ఆచారిగారిక్కూడా ఏంచెయ్యాలో పాలుపోలేదు. నాన్నగారే ఫార్మాలిటీస్ ప్రకారం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ల అనుమతి తీసుకుని కూలీ మనుషుల చేత పాతిపెట్టించారు. ఈ హడావుడిలో మా కడలూరు ప్రయాణం వాయిదాపడింది.

 వెన్నెల లేని ఇల్లు వెలవెలాబోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆమె మా ఇంట్లో మనిషి అయిపోయింది. వెన్నెలను పదే పదే తలుచుకుంటూ అమ్మ డీలాపడిపోయింది. నా సంగతి సరేసరి. మనిషి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నట్లే ఉంది. వెన్నెల కోతి వెంట పడి గోతిలోపడిన దృశ్యం ఇప్పటికీ నిన్న గాక మొన్న జరిగినట్లే ఉంటుంది.

మర్నాడు మా కడలూరు  ప్రయాణమనగా ఆచారిగారు ఒక మనిషిని మా ఇంటికి వెంటబెట్టుకుని వచ్చారు.. వెన్నెల జీతం ఇతనికి ఇచ్చేయండంటూ. ఆ టైములో నేను అమ్మ ఒళ్లో పడుకుని నిద్రపోతున్నాను. ఆచారిగారి మాటలకు మెలుకువ వచ్చింది. ఆ మనిషికి డబ్బిచ్చి పంపిన తరువాత ఆచారిగారిని నాన్నగారు అడిగారు. 'వెన్నెల అంత మంచి మనిషి కదా! ఎవరూ లేకపోవడేమేంటి? ఆమె చనిపోయినప్పుడు కూడా ఎవరు సాయానికి రాకపోవడమేంటి? మీ క్కూడా అమెను గురించి నిజంగా ఏమీ తెలీదా? ఇప్పుడు డబ్బులు తీసుకెళ్లిన మనిషెవరు?' అంటూ.

'ఈ మధ్యకాలంలో వెన్నెలను మీ అంత బాగా చూసుకున్నవాళ్లెవరూ లేరు. నాకు తెలిసింది మీకూ చెబుతా. ఇప్పుడు చెబితే తప్పులేదు. నిజానికి చెప్పాలి కూడా.' అంటూ చెప్పడం మొదలుపెట్టారు ఆచారిగారు. ఆయన అప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి.

'సీతారాంపురం ఫారెస్టాఫిసులో ప్యూన్ గా చేసె యేసేబు కూతురు ఇది. దీని అసలు పేరు వెన్నెల కాదు. మేరీ. ఇది ఆడికి పుట్టింది కాదు. ఎక్కదో దొరికితే ఎత్తుకొచ్చి సాక్కున్నాడు. ఇది ఇప్పుడంటే ఇట్లా ఉంది గాని చిన్నతనంలో చాలా బాగుండేది. పాత సినిమాలల్లో భానుమతిలాగా పాడేది. అల్లరి చేసెది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఊళ్లో అందర్నీ ఆటపట్టిస్తుండేది. దీని చేత తిట్టించుకోడం పిల్లలకూ, పెద్దలకూ సరదాగా ఉండేది. దీన్ని కవ్వించి తిట్టించుకుని ముచ్చటపడిపోయేవాడు బాషా.

బాషా అంటే ఈ పరగాణాల్లో పెద్ద రౌడీ కింద లెక్క. వాడంటే అందరికీ హడల్. పాత డొక్కు జీపులో జనాల్ని కొండ మీదికీ కిందికీ దింపుతుండేవాడు. అట్లాంటివాడితో ఇది సరసాలాడుతుండేది. వాడే పెట్టాడు దీనికి 'వెన్నెల' అనే పేరు. వెన్నెలని బాషా పెళ్లాడుతాడనుకునేవాళ్లు ఊళ్లో అందరూ. 'నా కూతురు రాణీవాసం పిల్ల. ఈ రౌడీ నా కొడుక్కిచ్చి చేస్తానా! దాని చెయ్యి పట్టుకు పోడానికి ఏ మైసూరు మహారాజో వస్తాడు' అంటుండేవాడు యేసోబు మందు మత్తులో. ఆ మాట బాషా చెవిలో పడిందో సారి. 'ఆ తాగుబోతు సచ్చినోడిచ్చేదేంటి? నేను తీసుకునేదేంటి? వెన్నెల ఎప్పటికీ నాదే. దాని మీద చెయ్యే కాదు.. కన్ను పడినా నా చేతిలో చచ్చాడన్న మాటే!' అంటుండేవాడు బాషా.

ఆ టైములోనే అడవి బంగళాలోకి ఓ ఆఫీసరు దిగాడు. కుర్రాడు పచ్చగా, పట్టుకుంటే మాసిపోయేటట్లుండేవాడు. ఉదయగిరి కోట మీదా, సీతారాంపురం అడవి మీదా ఏవో రిపోర్టులు రాసుకోవడానికి వచ్చాట్ట. ఆయన దర్జా, హంగూ ఆర్భాటం చూసి నేనే డంగైపోయేవాడిని. ఇక చదువు సంధ్యా లేని ఊరి జనాల సంగతి చెప్పేదేముంది! వచ్చీ రాగానే బాషా జీపు రెండు నెలలకు బాడుగ మాట్లాడేసుకున్నాడు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టే ఆయన జోరు చూసి యేసోబులో ఆశ కలిగింది. వయసులో ఉన్న తన కూతురిని పనిమాలా బంగళాలో ఆయన ముందు తిప్పుతుండేవాడు. బాషా కిది మంటగా ఉండేది.

ఒకరోజు రాత్రి.. చీకట్లో వెన్నెల మా ఇంటికి వచ్చింది. రెండు రోజుల్నుంచి కడుపులో ఒకటే ఇదిగా ఉంది. ఏమీ సయించటంలా! మందియ్యి ఆచారీ!' అంటూ. దాని చెయ్యి పట్టుకుని చూస్తే నాడిలో తేడా ఉంది. నా అనుమానం నిజమైతే వెన్నెలకు నెల తప్పినట్లే. గుచ్చి గుచ్చి అడిగినా ఏమీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ టైములో దాని మొహంలో కలవరపాటు కనిపించింది.

ఆ మర్నాడు రాత్రి..  వర్షం పడుతూ ఉంది. నవంబర్ నెల చివరివారం.. చలి బాగా ఉంది. పెందరాళే పడుకోవడం నాకలవాటు. నెల్లూరు నుంచి రావాల్సిన చివరి బస్సు వచ్చినట్లుంది. ఆ సందడికి మెలుకువ వచ్చింది. మళ్ళీ నిద్ర పట్టలేదు. వెన్నెల గురించే ఆలోచిస్తూ పడుకున్నాను.మళ్లీ మాగన్నుగా నిద్ర పట్టే సమయానికి ఎవరో తలుపు టకటకమని కొడుతున్న చప్పుడు. ఊళ్లో ఎవరికైనా బాగోలేకపోతే ఎంత రాత్రి వేళలోనైనా ఇంటి కొచ్చి తడుపు తడుతుంటారు. లేచి వెళ్ళి తలుపు తీస్తే మొగం నిండా దుప్పటి కప్పుకున్న ఓ ఆకారం వాకిట్లో వణుకుతూ నిలబడి ఉంది. 'బంగళాలో ఆఫీసర్ మాదాచ్ఛోత్ పడున్నాడు. వెళ్లి చూసుకో! 'ఇంకా ఊపిరి ఉంటే ఏ మందో మాకో ఇచ్చి తెల్లారేసరికల్లా ఊళ్లో నుంచి పంపిచెయ్!' అంటూ మళ్లా  చీకట్లో కలసిపోయింది ఆ ఆకారం.

జీపు వెళ్లిన శబ్దమయింది. అంటే ఆ శాల్తీ బాషా అన్నమాట. బంగళాకు పరుగెత్తాను. మనిషి ప్రాణాలు పోలేదు కానీ.. స్పృహలో లేడు ఆఫీసరు. ఏదో కలవరిస్తున్నాడు కానీ, అర్థంకావడం లేదు. తెల్లారేసరికి తలా ఓ చెయ్యేసి ఎలాగో ఆయన్ని ఆత్మకూరు పంపించేశాం.

తెల్లారిన తరువాత యేసోబు ఘొల్లుమని ఏడుస్తూ వెన్నెలని భుజాన వేసుకుని పరుగెత్తుకొనొచ్చాడు. ఆ పిల్ల వర్షం నీళ్లల్లో తడిసిన రక్తపు ముద్దయి పుంది. స్పృహలో కూడా లేదు. బంగళా వెనక బాలిరెడ్డి తవ్విస్తున్న కొత్త బావి గుంతలో పడుంది సామీ! ఎప్పుడు పడిందో.. ఎందుకు పడిందో.. ఆ దేవుడికే తెలియాలి. వానకు తడుస్తొ.. చలికి వణుకుతో.. వంటి మీద యావ లేకుండా పడివుంది. 'నా కూతుర్ని బతికించు ఆచారీ! చచ్చి నీ కడుపున పుడతా!' అంటూ కాళ్లా వేళ్ల పడి ఏడుస్తున్నాడు యేసోబు.

ఏదో ఎత్తు మీద నుంచి పడటం వల్ల ఆ పిల్ల కుడి కాలు ఎముకలు మూడు చోట్ల విరిగాయి. మొహం మీది బొమికలు పొడుచుకొచ్చి చూడ్డానికే మహా భయంకరంగా ఉంది. నెల్లూరు ఆసుపత్రిలో మూడు నెలలుంది. మనిషి బతికింది కనీ శాశ్వతంగా అవిటిదైపోయింది. ఆ మొహం మీద సొట్టలూ, మచ్చలూ అన్నీ అప్పటివే. ఇప్పటి ఈ మనిషిని చూస్తే అప్పటి ఆ  అందమైన ఆడపిల్ల అంటే ఎవరూ నమ్మరు. అప్పటి పాటుకు గర్భసంచీ కూడా దెబ్బతింది. తీసేయాల్సొచ్చింది. ఆ ఆఫీసరు మళ్లా ఊళ్లోకి రాలేదు. పోలీసు కేసయింది. బాషా కనిపించకుండాపోయాడు. వాడి మొదటి పెళ్లానికి మతి చెలిస్తే పిచ్చాసుపత్రిలో పడేశారు. ముగ్గురు పసిబిడ్డలు బాషాకు. ఇన్నాళ్లూ వాళ్లని నెల్లూరు హాస్టల్లోనే ఉంచి వెన్నెలే సాకుతూ వస్తోంది. అందుకే అది అందరి దగ్గరా డబ్బు దగ్గర మాత్రం అంత కాపీనంగా ఉండటం!

'వారానికి ఒకసారి వెళ్లేది వాళ్ల దగ్గరికేనా?' అంది అమ్మ పశ్చాత్తాపంగా.

'అవునమ్మా! ఈ రోజుల్లో పిల్లల చదువులు.. పెళ్లిళ్లు అంటే ఎంతెంత కావాలీ! అదీ దాని యావ. బాషా పిల్లల కోసం అది తన పెళ్లి ఊసు ఎత్తనిచ్చేది కాదు. ఆ దిగులుతోనే యేసోబు తాగి తాగి చచ్చాడు. పెళ్ళికి ముందే కడుపు చేయించుకుందని ఊళ్లో అందరూ దాన్ని చులకనా చూస్తారు. అందుకే దాని చావు నాడు కూడా ఎవరు ఇటు తొంగి చూడలేదు.

యేసేబు పెంచుకున్నందుకు వెన్నెలను కిరస్తానీ అనాలా? బాషాను ప్రేమించినందుకు ముసల్మాను అనాలా? ఆ ఆఫీసరు పాడు చేసినందుకు మన మతం మనిషి అనాలా?  ఆ సందిగ్ధంలో ఉండే ఆ రోజు వెన్నెల పార్థివ దేహాన్ని ఏం చేద్దామని మీరు అడిగినప్పుడు సమాధానం ఏం చెప్పడానికీ పాలుపోలేదు. ఇందాక వచ్చి మీ దగ్గర వెన్నెల జీతం పట్టుకుపోయిన వ్యక్తి బాషా పిల్లలుండే హాస్టల్ ఉద్యోగి. ఇక ముందు ఆ పిల్లల గతేమిటో ఆ శ్రీమన్నారాయణుడికే తెలియాలి' అంటూ లేచారు ఆచారిగారు.

(ఆ పిల్లలకు ఆ ఏర్పాట్లేవో మా నాన్నగారు తరువాత చేయించారు ప్రభుత్వం వైపు నుంచి)

 ఆచారిగారు ఇంత చెప్పినా .. ఆ నవంబరు చివరివారం రాత్రి చీకట్లో.. అడవి బంగళాలో ఏం జరిగిందో మిస్టరీగానే మిగిలిపోయింది. వెన్నెల గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ విషయమే నన్ను తొలుస్తుండేది.

---

సుమారు పాతికేళ్ల తర్వాత ఆ చిక్కుముడీ తమాషాగా విడిపోయింది.

అనుకోకుండా ఒక పుస్తకాల దుకాణంలో ఆంధ్రప్రదేశ్ కోటలను గురించిన పరిశోధనా గ్రంధం ఒకటి నా కంటబడింది. అందులో ఉదయగిరి కోటను గురించి ఆంధ్రా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ డా॥ చిలువూరు సూర్యనారాయణశర్మగారు  రాసిన వ్యాసం ఉంది. ఆ వ్యాస విషయాన్ని బట్టి, సీతారాంపురం అడవులను గురించి చేసిన ప్రస్తావనలను బట్టి.. ఆయనకూ .. ఆ ప్రాంతానికి ఏదో అవినాభావ సంబంధం ఉందనిపించింది.

శర్మగారి చిరునామా సంపాదించి ఆయన్ని కలిశాను. ముందు ఆయన నోరు విప్పడానికి అంతగా సుముఖత చూపించలేదు. కానీ, వెన్నెల చనిపోయిన తీరు ఊరిలో ఆమెకు జరిగిన అవమానాలను గురించి వివరించినప్పుడు ఆయనలో కదలిక వచ్చింధి. ఆ కదలికే ఆయన నోటి నుంచి ఆ నవంబరు చలి రాత్రి ఏమి  జరిగిందో బైటపెట్టింది.

'ఆచారిగారి ద్వారా నెల తప్పినట్లు  తెలియడంతో ఆ నిర్వాకం నాదేనని పసిగట్టింది  వెన్నెల. నా రూము కొచ్చి తాళి కట్టమని గోల పెట్టింది. అప్పటికే నాకు పెళ్లయి ఇద్దరు పిల్లలు! విషయం విన్న వెంటనే షాక్ అయింది. అయినా వెంటనే తేరుకొంది. 'నా తంటాలేవో నేను పడి చస్తా ఆనక. బాషా బండ చచ్చినోడు. నన్నీ టయింలో ఇక్కడ చూసాడంటే మీకిక్కడే నూకలు చెల్లినట్లే. వాడొచ్చి పోయిందాకా నేను వెనక పక్క కింద గది కిటికీ సన్ షేడ్ మీద దాక్కునుంటా. మీరు పోయేటప్పుడు  మర్చిపోకుండా  నన్ను  పైకి లాగితే చాలు! అబ్బలు చేసిన ఛండాలప్పనికి బిడ్డలెందుకు బలవాల.. నాకుమల్లే? అందరికీ మా ఏసోబయ్యలాంటి దేవుళ్లే దొరుకుతారా? మన మూలకంగా ఎవుళ్ళూ ఉత్తిపున్నేనికే బాధపడద్దంటాడు  మా తాగుబోతయ్య!'  అనుకుంటూ .. అంత వర్షంలోనూ .. చీకట్లో..  కిటికీ చువ్వల మధ్య గుండా  దూరుకుంటూ కింది భాగం గది కిటికీ  పైని పాత బడ్డ సన్ షేడ్  మీదకు జారెళ్లి కూర్చుంది వెన్నెల.. తల్లి!' అంటున్నప్పుడు శర్మగారి గొంతులో సన్నని వణుకు. 

'బాషా తలుపు విరగ్గొట్టుకొనొచ్చి వెంట తెచ్చుకున్న జీప్ రెంచితో నా బుర్ర మీద చాలా సార్లే మోదేడు. స్పృహ తప్పడం తెలుస్తూనే ఉంది. ఆ తరువాత జరిగినవేవీ  తెలియవు. విశాఖలో చాలాకాలం ట్రీట్ మెంట్ తీసుకున్నాను' అని గతం గుర్తుచేసుకున్నారీ శర్మగారు.

తలుపు చిన్నగా కొట్టి ఒక పాతికేళ్ల అందమయిన అమ్మాయి కాఫీ కప్పులతో సహా లోపలికి వచ్చింది.

'మా అమ్మాయి' కాజ్యువల్ గా పరిచయం చేశారు శర్మగారు,

'పేరేంటి తల్లీ?' అనడిగాను అణుకువతో 'నమస్తే చెప్పే ఆ పాపను.  

'వెన్నెల'  అంది చిరునవ్వుతో. నా చిన్నతనంలోని


 వెన్నెల చిరునవ్వే మళ్లీ గుర్తుకొచ్చింది.

నాకు ఆడపిల్ల పుడితే పెట్టుకోవాలనుకున్నదీ అదే పేరు.

-కర్లపాలెం హనుమంతరావు

24 -02 -2021

***

(ఈనాడు- ఆదివారం అనుబంధం







ప్రచురణ)

 











 

 

 

 

 

 

 

 

 

 

 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...