Monday, October 10, 2016

వార్తా వ్యాఖ్య-1 - సి.సి. కెమేరాలు

సి సి కెమేరాలు అంటే క్లోజ్డ్ సర్క్యూట్ కెమేరాలు. నిజానికి ఇవి సర్వ సాక్షి ధర్మాన్ని నిర్వహించే ఆధునిక యంత్రాలు. 'అంతటా ఉండి.. అన్నీ గమనిస్తుంటాడు దేవుడు' అని భక్తుల విశ్వాసం. అదెంత వరకు నిజమో .. చర్చనీయాంశం.  ఆ వాస్తవ అవాస్తవాలను పక్కన పెడితే ఆ నమ్మకాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించే అమాయకులు దైవభీతితో అయినా కొన్ని దుష్ట కార్యాలను ప్రయివేటుగానైనా చేసేందుకు జంకే అవకాశం కద్దు. సమాజానికి  మేలు కలిగే వరకు సి సి కెమేరాల ఉనికికి  అభ్యంతరం పెట్టవలసిన అవసరం లేదు కూడా.
అభివృద్ధి చెందిన దేశాల్లొ సి సి కెమేరాలే నిఘా వ్యవహారాల్లో అధిక శాతం మానవ ప్రమేయాన్ని తగ్గిస్తున్నాయి. అమెరికా వీధుల్లో అడుగడుగునా ఈ నిఘా కెమేరాలు  కళ్లు విప్పార్చుకొని చూస్తుంటాయి రాత్రింబవళ్ళు. రోడ్డుమీద పోలీసుల ఉనికి ఆట్టే కనిపించక పోయినా .. ట్రాఫిక్ రూల్సు కాస్తంత ఉల్లంఘించినా ట్రాఫిక్ వ్యవస్థనుంచి తాఖీదులు రావడం.. కోరితే  వాటికి సంబంధించిన  సె. సి. కెమేరాల క్లిప్పింగులూ జత చేసుండటం వల్ల తప్పు చేసిన వారికి తప్పించుకొనే మార్గాంతరం తోచదు. అక్కడి నేర శిక్షా స్మృతులూ  సి సి క్లిప్పింగులను ముఖ్యమైన అధికారిక సాక్ష్యంగా అంగీకరిస్తాయి. కాబట్టి దోషికి జరిమానాలు చెల్లించక తప్పని పరిస్థితి. సి సి కెమేరాలకు మనుషులకు మల్లే రాగ ద్వేషాలు ఉండవు. కాబట్టి.. తప్పు పోలీసు వ్యవస్థనుంచి జరిగినా నిస్సంకోచంగా ఎత్తి చూపిస్తాయి. ఆ భయం వల్ల కూడా అమాయకులమీద అన్యాయంగా నేరారోపణలు చేసేందుకు జంకుతారు పోలీసులు. ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ సి సి కెమేరాలు క్రియాశీలకంగా తమ పనిచేసుకుంటున్నాయి.  నిత్యానందస్వామి రాసలీలలనుంచి..  'నోటుకి ఓటు వ్యవహారం' వరకు సి సి కెమేరాల పాత్ర ఎంతటిదో  వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టి యం లలో దూరి రొక్కం దొంగతనం చేసేవాళ్లు.. బంగారం దుకాణాల్లో దూరి  బెదిరించి సరుకు కొల్లగొట్టేవాళ్ల పాలిటి సింహస్వప్నం సి సి కెమేరా. ఇది నాణేనికి ఒక కోణం. రెండో కోణం నుంచి చూస్తే జరుగుతున్న అపాకారాలు ఎన్నో ఉన్నాయి. ఆడపిల్లలు దుస్తులు మార్చుకొనే  వ్యక్తిగత ప్రదేశాలలో, బసచేసే హోటళ్లలో దొంగతనంగా పెట్టిన కెమేరాల మూలకంగా అసాంఘిక శక్తులకు మరింత శక్తినిచ్చినట్లు అవుతున్నది. ఎంతో మంది అమాయకులు ఈ సి సి కెమేరాల వలల్లో చిక్కి విలవిలలాడడం.. పరువుకి భయపడి ప్రాణాలు తీసుకోవడం కూడా జరుగుతున్నది. సి సి కెమేరా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పండు కోసుకున్నట్లే.. గుండెల్నీ చీల్చవచ్చు. ఉపయోగించే వాడి మనస్తత్వంమీద అదంతా ఆధారపడి ఉంటుంది.
తెలంగాణా రాష్ట్రం భూముల రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇప్పుడు సి సి కెమేరాలు ఉపయోగించే ఆలోచన చేసున్నది ప్రభుత్వం. ఒకే సందర్భంలో ఒకే వ్యక్తి పేరుమీద ఒకటికి మించి రిజిస్ట్రేషన్లు జరపించడం, నకిలీ
 వ్యక్తుల ద్వారా పత్రాలమీద సంతకాలు చేయించడం, కార్యాలయాలకు ఆవల భూముల రిజిస్ట్రేషన్లు లోపాయికారీగా జరిగిపోవడం.. వంటి ఇంకా ఎన్నో చట్టబాహ్యమైన వ్యవహారాలకు సి సి కెమేరాల ప్రయోగంతో చెక్ పెట్టినట్లవుతుంది. కాకపోతే ఈ
సి సి కెమేరా ప్రయోగంకూడా దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత సక్రమంగా నిర్వహిస్తేనే అనుకున్న ఫలితాలు రాబట్ట గలిగేది.
ఈ దేశం అత్యున్నతంగా భావించే రాజ్యాంగ వ్యవ్యస్థల్లో ఒకటైన పార్లమెంటు సభాప్రాంగణంలోనే.. ఒక అత్యంత విశాలమైన రాష్ట్రాన్ని రెండుగా విభజించే రాజ్యాంగ నిర్వహణ  సందర్భక్రమాన్ని  దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూసేందుకు
సి సి కెమేరాల అవకాశం కల్పిస్తున్నా.. వాటి కన్ను కప్పిన క్షణాలను మనం మర్చిపోకూడదు.
-కర్లపాలెం హనుమంతరావు
10-10-2016


    

Friday, October 7, 2016

కథానికః మా తెలుగుతల్లికి మల్లెపూదండ!- రచన మాస పత్రికలో ప్రచురితం


విద్యారణ్య- 
అన్ని రకాల హైటెక్ హంగులతో నేను నడుపుతున్న విద్యాసంస్థ అది. ర్యాంకులు పండించే విద్యాక్షేత్రంలో మా సంస్థ స్థానం మొదటినుంచి మొదటి మూడింటిలో ఒకటి. శాశ్వతంగా మొదటిస్థానంలోనే స్థిరపడాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో భాగంగానే ప్రపంచస్థాయి గుర్తింపున్న 'జీనియస్' గ్రూపుతో 'టై అప్' అవ్వాలని వ్యూహం. ఆ ప్రయత్నాలన్నీ ఓ కొలిక్కి వచ్చి ఇప్పుడు చివరిదశకు చేరుకొన్నాం. ఇంకో గంటలో జరగబోయే సాంస్కృతిక ప్రదర్శనల్లోకూడా మా ప్రత్యేకత నిరూపించుకుంటే.. ఇహనుంచి నగరంలో మా విద్యారణ్యదే ప్రప్రథమ స్థానం.

కల్చరల్ ఈవెంట్ ఇన్-చార్జ్ మిసెస్ కపర్దీది ఓ ప్రసిద్ధ విద్యాసంస్థకు చెందిన  ప్రధానోపాధ్యాయురాలి హోదాలో దాదాపు ముఫ్ఫైఏళ్ల అనుభవం. అక్కడ పదవీ విరమణ అయిన వెంటనే ఇక్కడకు రప్పించాను పెద్ద జీతంతో! ఆమె గత సంబధాలమూలకంగానే 'జీనియస్' దృష్టిలో మా సంస్థ పడగలిగింది. నిలబడగలిగింది.
గ్రీన్-రూంలో మిసెస్ కపర్దీ విద్యార్థులకు చివరి హచ్చరికలు జారీ చేస్తున్నది. పదో తరగతి పిల్లలు హేమ్లెట్ ప్లేలెట్, దిగువ తరగతులవాళ్ళు బెంగాలీ రవీంద్రగీత్, పంజాబీ భాంగ్రా, ఒరియా ఒడిస్సీ.. అందరికన్నా ముందు కిండర్ గార్టెన్ పసిమొగ్గలతో వందేమాతరం! అన్నీ చక్కగా అమిరినట్లే కదంబంలో పూలవరసలా!
కార్యక్రమం పర్యవేక్షణకొచ్చిన బృందంలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో జాతీయస్థాయిలో నిష్ణాతులు. శ్యాంలీలా పర్షాద్, మాతంగి రమణ, బిజయ్ మిశ్రో, మదన్ లాల్ కథేరియా, దివిజశర్మ. దివిజశర్మకు మాత్రమే కొద్దిగా తెలుగు భాషతో పరిచయం. తెలుగు తెలిసినవారు లేకపోవడం నిజానికి ఒక అనుకూలమైన అంశం. ఒక తెలుగువాడు మరో తెలుగువాడిని ఎక్కిరానీయడన్న సామెత మనకుండనే ఉందిగదా! అదీ నా బాధ!
తెర లేచింది. 'వందేమాతరం' అద్భుతంగా పేలింది. జ్యోతి ప్రజ్వలన అనంతరం మిసెస్ కపర్దీ చేసిన ఆంగ్ల ప్రసంగమూ అంతే 'ఇంప్రెసివ్'! పావుగంట బాలే, అరగంట ఆంగ్ల నాటిక. హిందీ గీతమాలిక జరుగుతున్న సమయంలో దివిజశర్మ వచ్చింది.' మావాళ్లు మీ తెలుగు ప్రోగ్రామ్సు చూడాలనుకొంటున్నారు. ఇంటర్మిషన్ తరువాత అవే అరేంజి చేయండి! ఒక గంట చూస్తాం' అంది.
నా గుండెల్లో రాయి పడింది. కార్పొరేట్ కల్చర్ కదా! హిందీ, ఇంగ్లీష్ లాంటివాటిమీద మాత్రమే మోజుంటుందని అనుకొన్నాం!
''ఫైవ్ ఆర్ టెన్ మినిట్సు అంటే ఏదో మేనేజ్ చేయగలంగానీ.. ఇప్పటికిప్పుడు గంటపాటు తెలుగు ప్రోగ్రామంటే ఎలా సార్?!' అని నాకే ఎదురు ప్రశ్న వేసింది మిసెస్ కపర్దీ!
'ఏదో ఒకటి మేనేజ్ చేయండి మ్యాడమ్! నెక్స్ట్ ప్రోగ్రాం మాత్రం తెలుగులోనే ఉండాలి. ఏం చేస్తారో .. మీ ఇష్టం!' అని చెప్పి  నా ఛాంబరుకి వచ్చేసాను.
వచ్చానన్నమాటేగానీ.. మనసు మనసులో లేదు. పర్యవేక్షక బృందం ఏదో ఆంతరంగిక చర్చల్లో ఉంది.. లంచ్ చేస్తూనే! వాళ్ల మధ్యలో దూరడం మర్యాదకాదు గనక కాఫీ  నా చాంబరుకి కాఫీ తెప్పించుకొని తాగుతూ కూర్చున్నాను. ఆరు దశాబ్దాల కిందట బెనారస్ యూనివర్సిటీలో నేను చదువుతున్నప్పటి సంఘటన గుర్తుకొచ్చింది.
అవి నేను ఎమ్మెస్సీలో ఫిజిక్సు చేసే రోజులు. అన్ని భాషలవాళ్లకి మల్లేనే తెలుగువాళ్ళకీ ఒక ప్రత్యేకమైన మెస్సు ఉండేది. ఓ చలికాలం ఆదివారం మధ్యాహ్నం. భోజనం లాగించి ఆరుబైట బండలమీద వెచ్చదనంకోసం కూర్చొని ఏదో పిచ్చాపాటీ మాట్లాడుకొంటున్నాం తెలుగు విద్యార్థులం.
ఒక పొట్టి మనిషి. నుదుట పట్టెనామాలు. ముతక పంచె.. లాల్చీ.  చేతిసంచీ ఊపుకొంటో  మా మధ్యకొచ్చి నిలబడి 'మీరంతా తెలుగు పిల్లలే కదుటోయ్! నాకో పని చేసి పెట్టాలి. ఓ గంటపాటు నేనో ఉపస్యాసం ఇచ్చిపోతా.  తెలుగు తెలిసినవాళ్లందర్నీ  వెంటనే పోగేయాలి!' అన్నాడు!
'ఈయనెవడ్రా బాబూ! పిలవని పేరంటానికొచ్చిందికాక.. ఉపన్యాసాలిస్తానంటున్నాడు!' అని మాకు ఒకటే ఆశ్చర్యం. మా బృందనాయకుడు సుబ్బరాజుకి మొహమాటం తక్కువ. పొట్టిమనిషి మొహంమీదే 'తమరెవరు మహానుభావా?' అంటూ   వెటకారంగా వెళ్ళబోసాడు.
పొట్టాయన ఆ వెటకారాన్నేమాత్రం పట్టించుకోలేదు. 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ!' పాట ఎప్పుడన్నా విన్నారుటోయ్? ఆ గీతాన్ని రాసింది నేనే!' అనేసాడు.
ఇండియాకు స్వాతంత్ర్యంవచ్చి అప్పటికి నిండా పదేళ్ళుకూడా నిండలేదు. జనంలో ఇంకా దేశభక్తి ఇప్పట్లా పూర్తిగా ఇంకిపోని కాలం. 'మా తెలుగుతల్లి' పాట చాలా సార్లు వినివుండటంచేత మా ఎదురుగా నిలబడి ఉన్నది శంకరంబాడి సుందరాచారిగారని తెలుసుకొన్నాం. అమాంతం గౌరవం పెరిగిపోయింది. సుబ్బరాజూ అందుకు మినహాయింపు కాదు. స్వరంలోని మునుపటి దురుసుతనం తగ్గించుకొని ‘ఇప్పటికిప్పుడు జనాలని పొగేయాలంటే ఎలా సార్?' అని నసిగాడు.'సరేలేవోయ్! రేపు నాలుగ్గంటలకి పెట్టుకోండి. నేను నేరుగా మీ మీటింగుహాలుకే వచ్చేస్తా!' అంటూ చేతిసంచి ఊపుకొంటూ మాయమైపోయారు శకరంబాడి సుందరాచారిగారు.
తెలుగు సంఘం ఎన్నికలు ఎలాగూ దగ్గరపడుతున్నాయి. ఈ వంకతో ఒక కార్యక్రమం ఏర్పాటుచేస్తే ఎన్నికల్లో అది తనకు ఉపయోగపడుతుందని సుబ్బరాజు ఎత్తుగడ. వాడి పూనికతో భారీగానే పోగయ్యారు జనం.
నాలుగ్గంటలకు అనుకొన్న కార్యక్రమం ఆరుగంటలగ్గానీ మొదలవలేదు. ఆలస్యానికి కారణం సుందరాచారిగారే! ఆలస్యానికి క్షమాపణలైనా అడగలేదు. వచ్చీ రాగానే మైకు అందుకోబాయారు. 'ఇప్పుడు మొదలైతే ఎప్పటికయ్యేను? ఇంకో రెండు గంటలయితే మెస్సుకూడా మూసేస్తారు!' అంటూ సుబ్బరాజు బిగ్గరగానే గొణుకుడు.
విన్నారులాగుంది పెద్దాయన 'తిండికోసం వెంపర్లాడేవాళ్ళకోసం కాదు నా ప్రసంగం. ఇష్టం లేనివాళ్ళు నిక్షేపంగా వెళ్ళిపోవచ్చు.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా!' అంటూ మైకందుకొన్నారు.
ఆద్యంతం ఆయన ఉపన్యాసం సాగిన తీరు అత్యద్భుతం. తెలుగుభాష విశిష్టతనుగూర్చి సాగిన ఆ ప్రసంగం ఓ రసగంగాప్రవాహం. తలమునకలా ఆ గంగలో తడిసి ముద్దవని తెలుగువాడు లేడు.
తొలిఝాములో వినిపించే కోడికూతలనుంచి పొద్దుపోయిన తరువాత వీధుల్లో సంచరించే కుక్కల అరుపులదాకా.. ఆయన అనుకరించని జీవజాలం లేదు. పల్లెజీవనంలోని తెలుగుదనం కమ్మదనం సుందరాచారిగారి స్వరంలో ఆవిష్కరణ అయిన వైనం మామూలు మాటల్లో వర్ణించనలవి కానిది.
తొలిసంజె వెలుగుల్లో ఇంటిగుమ్మాలముందు  రంగవల్లులు తీరుస్తూ ఇంతులు పాడుకొనే పాటలు, కోడికూతతో లేచి పొలంబాట పట్టే రైతన్నలు ఆలమందలని అదిలించుకొంటూ తీసుకొనే కూనిరాగాలు, అత్తాకోడళ్ళు, వదినామరదళ్ళు రోటిపోటుల దగ్గర ఆడిపోసుకొనే సరదా సూటిపోటు పాటలు, పెద్దపండుగ సంబరాల్లో వీధివీధీ తిరిగే హరిదాసయ్యల చిందులు,  ఇంటిల్లిపాదిని ఆశీర్వదించిగాని పక్కగుమ్మం తొక్కని గంగిరెద్దుల ఆటలు.. శంకరాచారిగారి గొంతులోనుంచి అలా అలా జాలువారుతుంటే మెస్సు భోజనం సంగతి ఇంకేం గుర్తుకొస్తుందెవరికైనా?! 'తప్పయిపోయింది స్వామీ! క్షమించండి' అంటూ సుబ్బరాజే చివరికి చేతులు జోడించాల్సి వచ్చింది. అంతకన్నా తమాషా ఆయన అవేవీ పట్టించుకోకుండా అప్యాయంగా సుబ్బరాజును అక్కున చేర్చుకోవడం!
మెస్సువాళ్లూ సభలోనే ఉండిపోవడంతో అందరికీ ఉపవాస బాధ తప్పిందనుకోండి ఆఖరికి!
ఆ రాత్రంతా సుందరాచారిగారు మా హాస్టలుగదిలోనే బస చేసారు. ఉపన్యాసం ఎంత ఉదాత్తంగా ఉందో.. ఆ పూట ఆయన చెప్పిన మాటలు అంతకన్నా ఉత్తేజకరంగా ఉన్నాయి. 'తేనెలొలికే తెలుగుభాష సౌందర్యాన్ని వివరించి చెప్పడం నా బోటి వామనుడికి తలకుమించిన పని. అయినా కాని, చేతకాదని చేతులు ముడుచుకొని మూల వదిగే మనస్తత్వం కాదు నాది.  కాబట్టే చేతనైనంతలో అమ్మభాష కమ్మదనాన్ని నేల నాలుగుచరగులా ప్రచారం చేయడానికి పూనుకొన్నది.' అంటో చేతిసంచిలోనుంచి కొన్ని పుస్తకాలని తీసి పంచిపెట్టారు మాకందరికీ! అదృష్టంకొద్దీ నాకూ ఒక పుస్తకం దక్కింది సుందరాచారిగారు స్వహస్తాలతో  చేసిన సంతకంతో సహా! ఆ నాటి ఆ పల్లెపదాల పుస్తకం  ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది.
పండిత పామర జనరంజకంగా తెలుగుభాషా సౌందర్యాన్ని పుస్తకరూపంలో ప్రచురించాలని సుందరాచారిగారి ఆశయంట. అందుకోసం ఓ అయిదంచల ప్రణాళిక సిద్ధంచేసుకొని  ఆర్థికవ్యవహారాలను చక్కబెట్టుకొనే ఉద్దేశంతో పెద్దలందరిని కలుస్తున్నారుట. అప్పట్లో హస్తినలో పండిట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యక్షపదవిలో ఉన్నారు. 'ఆయన్ని కలసి తిరిగి వెళుతూ ‘తెలుగు పిల్లలు మీరిక్కడ ఉన్నారని తెలిసి వచ్చాను. తెలుగు ఎక్కడుంటే నేనక్కడ ఉండాలన్నది  నా ఆకాంక్ష. తెలుగును ఎవరన్నా చిన్నచూపుచూస్తే నాకు తిక్కరేగుతుంది. వేల ఏళ్ళ చరిత్రగల మన తెలుగు ఇతర భాషల ధాష్టీకంవల్ల నష్టపోరాదన్నదే నా పంతం' అని చెప్పుకొచ్చారాయన.. ఆ రాత్రంతా నిద్రమానుకొని.. మమ్మల్నీ నిద్ర పోనీయకుండా!
'ఇప్పటి నా కష్టాన్నికూడా గట్టెక్కించడానికి రాకూడదా గురువుగారూ!' అనిపించింది నాకు ఆ క్షణంలో. మరుక్షణంలోనే నా పిచ్చి ఊహకు నవ్వూ వచ్చింది. ఎక్కడో ఓ కంఠం ఖంగున మోగుతుంటే ఈ లోకంలోకొచ్చి పడ్డాను.
'అదే గొంతు! అదే వాగ్ధార! శంకరంబాడి సుందరాచారిగారిది! ఇక్కడికి ఎందుకొస్తారు? ఎలా వస్తారు? నా భ్రమ కాకపోతే!' లేచి ఛాంబర్ బైటికి వచ్చాను.
వేదికమీద మైకుముందు కార్యక్రమాలకని ఏర్పాటుచేసిన అలంకరణ విద్యుద్దీపాల వెలుగులో సుందరాచారిగారు కంచుకంఠంతో ఉపన్యాసం దంచేస్తున్నారు.. తెలుగులో! తెలుగురాని పర్యవేక్షకబృందంకూడా మంత్రముగ్ధమయినట్లు వింటోంది! కనురెప్ప కొట్టడంకూడా మర్చిపోయేటంతగా కనికట్టు చేసున్నది ఆ మాట.. పాట.. ఆట!
మధ్య మధ్యలో ఆంగ్లపదాలతో.. హిందీపదప్రయోగాలతో.. సంస్కృతశ్లోక భూయిష్టంగా తెలుగుభాష ఔన్నత్యాన్నిగూర్చి ఆయన చేసేప్రసంగం అచ్చు శంకరంబాడిగారి శైలిలోనే ఉద్వేగంగా ఉరకలేస్తోంది!
'మంచి ప్రసంగం!' అంటూ మధ్యలో దివిజశర్మ లేచొచ్చి నన్ను అభినందించడంతో ఫలితం సగం తెలిసిపోయినట్లయింది.
శంకరాచారిగారి ఉపన్యాసంలోని చాలా అంశాలు నాకే చురకలు అంటించే విధంగా ఉన్నాయి. '
నెవ్వర్ స్పీక్ ఇన్ తెలుగు' అని రాసిన పలకలు పసిపిల్లల మెడల్లో వేయడంకన్నా అమానుషం మరోటుందా? మాతృభాష ప్రాముఖ్యం తెలీని మూర్ఖులు చేసే వికృత చేష్టలవి. పసిబిడ్డల్ని తల్లిభాషనుంచి వేరుచేయాలనుకోవడం తల్లినుంచి వేరుచేయడమంత పాపం. పరిసరాలనుంచి సహజసిద్దంగా అబ్బేసంపద తల్లిభాషద్వారా అందే విజ్ఞానం. దానికి దూరమయే బిడ్డడు భాగ్యవంతుడు ఎలా అవుతాడు? బాల్యంలో అమ్మభాష సాయంతో లోకాన్ని అర్థంచేసుకొన్నవాడే ఎదిగివచ్చిన తరువాత  కొత్తభాషల సారాన్ని జుర్రుకొనేది.  భాషావేత్తలనుంచి, మానసిక శాస్త్రవేత్తలదాకా అందరూ నిర్ధారిస్తున్న సత్యం ఇదే! ఇహ తెలుగుకి వద్దాం! ఇటాలియన్ భాషకి మల్లే పదం చివర హఠాత్తుగా విరగని మంచిగుణం తెలుగుకి వరం. వేదాలు ఆదిలో తెలుగులోనే ఉన్నాయని ఊహించడానికి ఈ సంగీతగుణమే కారణం. ఏ భాషాపదాన్నయినా తల్లి బిడ్డను పొదువుకొన్నట్లు పొదువుకోగలదు తెలుగుభాష. సంగీతంలోని ఏ శబ్దానికైనా తెలుగంత సమీపంలోకి  రాగల ద్రావిడభాష మరొకటి లేదు. కంప్యూటర్లో వాడే బైట్స్(bytes) పరిజ్ఞానానికి తెలుగంత అనుకూలత ఆంగ్లానిక్కూడా లేదని ఏనాడో 'సైన్స్య్ టు డే' లాంటి వైజ్ఞానిక పత్రికలు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రచురించాయి. జనం నాలికలమీద సహజంగా పలికే భాషలో చెబితేనే ఏ విషయమైనా చొచ్చుకుపోవడం సులభమవుతుంది.  క్రైస్తవమత ప్రచారకులనుంచి, శైవమత ప్రచారకులవరకు అర్థమయిన ఈ విషయం మన తెలుగునవనాగరీకులకే ఎందుకో తలకెక్కడం లేదు! ఆంగ్లం పట్టుబడకపోతే నేటి పోటీప్రపంచం ధాటికి తట్టుకోవడం కష్టమని తల్లిదండ్రుల భయం. ఆ భయం అర్థం చేసుకోదగ్గదే! కానీ.. అందుకోసం బిడ్డ కడుపులో పడ్డనాటినుంచే ఏబిసిడిలు తప్ప మరోటి ‘అనరాదు.. వినరాదు.. కనరాదు' అని ఆంక్షలు విధించడమే విడ్డూరం! వసతో పాటు ఆంగ్లాన్ని రంగరించి పోయాలన్న తల్లిదండ్రుల ఆత్రం  చూస్తే నవ్వొస్తోంది. కోపమూ వస్తోంది. అభివృద్ధికి ఆంగ్లానికి ముడిపెట్టేవాళ్ళు చైనా, రష్యాల్లాంటి దేశాల ప్రగతికి ఏం సమాధానం చెబుతారు?! సొంతభాషంటే సొంత ఉనికిని చాటే ప్రకటన, తమిళుడికి తమిళమంటే ప్రేమ. కన్నడిగుడికి కన్నడమంటే ప్రాణం. మరాఠీవాడికి మల్లే మనమూ మనభాషను ఠీవీకి దర్పణంగా ఎందుకు భావించమో అర్థంకాదు! పిల్లల క్కాదు.. ముందు బుద్ధి రావాల్సింది పెద్దలకి, తల్లిదండ్రులకి, విద్యావేత్తలకి! ముఖ్యంగా  ఈ తెలుగుగడ్డమీద! ఆముక్క చెప్పిపోదామనే నేనిక్కడదాకా వచ్చింది' అంటుంటే హాలు హాలంతా కరతాళ ద్వనులతో మిన్నుముట్టింది.
'స్టాండింగ్ ఒవేషన్' ఇచ్చిన వాళ్ళలో పర్యవేక్షక బృందమూ ఉంది.
*                              *                      *


'జీనియస్'సంస్ఠ నగరఫ్రాంచైసీ మా 'విద్యారణ్య'కే దక్కిందని వేరే చెప్పవల్సిన పని లేదనుకొంటా.
అరవైఏళ్ళ కిందట పిలవని పేరంటానికి వచ్చి మమ్మల్నంతా మంత్రముగ్ధుల్నిచేసారు శంకరంబాడి సుందరాచారిగారు.  మళ్ళీ అదే తరహా మాయాజాలంచేసి మమ్మల్ని గట్టెక్కించి పోవడానికి రావడం ఎలా సంభవం?!
ఎవరు పిలిచారని ఇక్కడిదాకా వచ్చి తెలుగు ఔన్నత్యంతో పాటు  అవసరాన్ని గురించీ కుండబద్దలు కొట్టినట్లు!
వేదికమీద ప్రసంగంచేసిన సుందరాచారిగారు సుందరాచారిగారు కాదు. ఆయన శిష్యపరమాణువులాంటి రామాచారిగారుట! గంటపాటు తెలుగుకార్యక్రమం సమర్పించక తప్పని పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు   మిసెస్ కపర్దీకి ఠక్కుమని గుర్తుకొచ్చిన ఆపద్భాంధవుడు ఆయన. మిసెస్ కపర్దీ పూర్వం పనిచేసిన కార్పొరేట్ విద్యాసంస్థలో ఆంగ్ల ఉపాధ్యాయుడు. పిల్లలకి ఆంగ్లపాఠాలు చెబుతూనే తెలుగుభాష గొప్పతనాన్ని గురించీ కథలు, పాటలు, పద్యాలు చెబుతుండేవాడుట! ఆ విషయమై యాజమాన్యంతో గొడవలైతే  ఉద్యోగం వదులుకోవడానిక్కూడా సిద్ధపడ్డాడుట! ‘పోటీపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు  ఆంగ్ల, తెలుగు సజ్జెక్టుల్లో  తర్ఫీదు ఇచ్చే ఏదో కోచింగు సెంటర్లో అత్తెసరు జీతానికి  పొట్టపోసుకొంటున్నాడు ప్రస్తుతం’ అని మిసెస్ కపర్దీ వివరించింది.
రామాచారిగారు చేసిన ఉపకారానికి తృణమో ఫణమో ఇద్దామనుకొన్నాను. తృణంలాగే తృణీకరించాడా సాయాన్ని! ఫణంగా కోరిన కోర్కె మాత్రం విచిత్రమైనది. 'మీ ఉదయంపూట ప్రార్థనల్లో  'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' పాట పాడించండి చాలు! అలాగైనా పిల్లలకు ‘మన తెలుగుభాషం’టూ ఒకటుందని మన్నన ఉంటుంది' అనేసాడు.
ఆ పని  ఎటూ నేను చేయాలనుకొన్నదే!
పాఠ్యప్రణాళికతో నిమిత్తం లేకపోయినా  మాతృభాషను కనీసం ఐదు తరగతులవరకైనా ఐచ్చికంగా నేర్చుకోవడానికి సిద్దపడ్డ పిల్లలకే  మా విద్యారణ్యలో ప్రవేశం. ఆ నిబంధన విధించడానికి అంగీకరించిన తరువాతే జీనియస్ సంస్థ మాతో టై-అప్ అవడానికి సిద్ధపడింది. .
‘తెలుగు విభాగానికి రామాచారిగారినే బాధ్యులని చేస్తే సరి. సుందరాచారిగారే మన మధ్య మసలుతున్నట్లుంది గదా సార్!’ అని సలహా ఇచ్చింది మిసెస్ కపర్దీ.
మంచి సూచన. ‘తెలుగు ఎక్కడ ఉంటుందో తనక్కడ ఉండాలన్న గురువుగారి ఆకాంక్షా నెరవేర్చినట్లుంటుంది’ అనిపించింది నాకు.
'అది సరి కాదేమో సార్! సుందరాచారిగారిలాంటి వాళ్ళెక్కడ ఉంటే అక్కడ మాత్రమే తెలుగు వినబడే పరిస్థితి వచ్చిందేమో!' అన్నాడు రామాచారిగారు ఆ తరువాత కలిసినప్పుడు!
కాదనగలమా!
-కర్లపాలెం హనుమంతరావు
మా 'తెలుగు తల్లి' గీతం వినాలనుకొనేవారికోసం ఈ లంకెః
https://youtu.be/uNE4RJ36ONU

***

(రచన మాస పత్రిక అక్టోబర్, 2016  సంచికలో ప్రచురితం)







బుద్ధికి బుద్ధుండాలంటే..!

బుద్ధి కూడా శరీరంలో ఒక అవయవమే! చేతనాత్మకమైన మెదడుని బుద్ది అనుకోవచ్చు. వయసు.. ఆరోగ్యం.. పరిసరాలు.. సందర్భాలమీద ఈ బుద్ధిలోని చేతనాత్మకతలో హెచ్చు తగ్గులు సహజం.
కంప్యూటరుతో బుద్ధిని పోల్చలేం. బుద్ధి కంప్యూటరుకన్నా రెండాకులు ఎక్కువ తిన్న గడుసుపిండం. సూక్ష్మంలో మోక్షం అన్న సామెత మనకోటి ఉంది కదా! బుద్ధికి అతికినట్లు సరిపోతుందా సామెత. 
కంప్యూటరుకి మనం పనిగట్టుకొని ఆదేశా లివ్వాలి. రాంబంటులా  అది పని చేసుకుపోతుంది. బుద్ధి అంతకన్నా బుద్ధిమంతురాలది.  మనంగా  ఏ సమాచరమూ గట్రా ఇవ్వక పోయినా .. సొంత తెలివితేటలతో తనకై తాను  గ్రహించి..  భద్ర పరుచుకొని.. విశ్లేషించుకొని.. ఆనక  సమయ సందర్భాలనుబట్టి మన సాయానికొస్తుంది.. అచ్చంగా కట్టుకున్న ఇల్లాలిలాగా. 
మన శరీరం  ఎదగాలంటే ఆహారం, గాలి, నీరు, కాలం .. కావాలి! మేత ఆగితే కూత మందగిస్తుంది. కానీ మనం కాణీ ఖర్చుచెయ్యకుండానే  కొంతకాలం బుద్ధి తన మంచి చెడ్డలు చూసుకోగలదు. మరీ నిర్లక్ష్యం చేస్తే కనక.. పెళ్లాం అలిగి పుట్టింటికి పోయినట్లు.. సహకరించడం మానేస్తుంది. 
'మేథస్సు జీవితాంతం ఎదుగుతూనే ఉంటుంది'- అన్న  మిల్టన్ మహాకవి ఎందుకన్నారో కానీ ఆ  సూక్తి కొంత మేరకే నిజం. అలా  ఎదగాలంటే ఎదురుగాలి లేకుండా చూసుకోడం సదర మనిషి బాధ్యత.
మెదడుకూ ముదిమి తప్పదు. కానీ శ్రద్ధాసక్తుల కనపరుస్తే  దాని జవసత్వాలు  మనం   అధీనంలోనే పనిచేస్తాయి చివరి వరకూ దాదాపు.
మెదడుకు సంబంధించిన పదం మేథస్సు. మేథస్సు పరిరక్షణకోసం మెదడుకి మూడు రకాల ధర్మాలు నిర్దేశించబడ్డాయి. ధీ.. ధృతి.. స్మృతి.
'ధీ'-  విషయాలను గ్రహించుకొనే లక్షణం. ధృతి- విశ్లేషించుకొనే లక్షణం
స్మృతి- గుర్తుకు తెచ్చే లక్షణం.
ఈ మూడూ ఒకదానికొకటి అనుసందానంగా ఉండి పూర్తి స్థాయి ఆరోగ్యంగా ఉండటమే 'మేథస్సు'. 
మేథస్సంటే ఒక విధంగా  బుద్ధిబలం. వెన్నుపూసల నెత్తిమీద ముద్దలా ఉంటుందది.  చిక్కుముడుల రూపంలో కనిపించే నరాల సముదాయానికి సైంటిష్టులు  'బైన్' పేరు పెట్టుకున్నారు. వెన్నుపూసల నరాలనుంచి అందే   సంకేతాల ప్రకారం  ప్రవర్తించడం మెదడు ధర్మం.  జంతు దశలో జరిగే జీవక్రియ ఇది. జీవపరిణామంలో మనిషి మరింత వికాసం సాధించిన తరువాత కేవలం ఈ సంకేతాలకే పరిమితం కావడం కుదరలేదు. ఆలోచన.. స్వీయ రక్షణ.. జ్ఞాపక శక్తి మరింత అవసరమయ్యాయి.  మనిషి 'బుద్ధి' మరింత బలంగా .. ధృఢంగా.. తయారు కావాల్సిన  అవసరాలు పెరుగుతో వస్తున్నాయి. కాన్సెఫలాన్(consephelon) అనే మరింత శక్తివంతమైన నరాల వ్యవస్థ అందుకే ఏర్పాటయింది.
మెదడులో లేత పదార్థం (grey matter), తెల్ల పదార్థం ( White matter), రక్త నాళాలు.. కాసిన్ని మాంస ధాతువులు కలగలసి ఉంటాయి.
మెడుల్లా అబ్లాంగేటా(medulla Oblongata), వెనక తల (Hind Brain). మధ్య తల(Mid Brain), సెరిబ్రమ్ (Cerebrum) అని నాలుగు భాగాల కూడలి అని కూడా అనుకోవచ్చు మెదడుని.
'అన్నీ వేదాల్లో ఉన్నాయిష' అని విశ్వసించేవాళ్లకు   సంతోషం కలిగించే ఒక పోలిక ఇక్కడ దొరుకుతుంది. విశ్వసృష్టికర్తగా ఖ్యాతి గడించిన విధాతక్కూడా నాలుగు ముఖాలుంటాయంటారు కదా! బ్రహ్మగారికి  శక్తి వీణాధరి వాణి. ఆమె ధరించిన  వీణ తాలుకు  తంత్రులను పోలినవే మెదడు నరాలు. కేవలం జంతుమాత్రులకు సాధ్యం కాని 'ఊహ.. ఆలోచనలు' మనిషి చేయగలుగుతున్నాడంటే  ప్రేరణ  ఈ నరాల ప్రకంపనలే.
మెదడు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మేథస్సుకు తిరుగు లేదు. ఆయాచితంగా దక్కిన  మేథస్సును అపురూపంగా, పదిలంగా, ఆరోగ్యంగా చూసుకొనే సూచనలు  వివిధ ఆరోగ్య శాస్త్రాలలో పదిలంగా  ఉన్నాయి.
భారతీయుల వైద్యశాస్త్రంగా పేరొందిన  ఆయుర్వేదం మెదడును గురించి చెప్పే జాగ్రత్తల ప్రస్తావనలతో ముగిద్దాం ఈ చిన్న వ్యాసాన్ని.  నిత్య జీవితంలో తేలిగ్గా ఆచరించగల వాటిన ఏరుకొని ఇక్కడ ఇస్తున్నది.
ఆహారం, నిద్ర, జీవనశైలి మీద క్రమం తప్పని శ్రద్ద మేథస్సుని జీవిత కాలమంతా ఆరోగ్యంగా ఉంచుతున్నదన్నది ఓ నమ్మిక.
1.    తినే ఆహారానికి చేతనత్వం, ప్రాణత్వం ఉండాలని గీతలో భగవంతుడుకూడా ఉవాచిస్తున్నాడు. సాత్వికాహారంలో ఇవి సమృధ్ధిగా లభిస్తాయి కూడా. వండకుండా  ఫ్రిడ్జుల్లో  భద్రపరిచిన ఆహారం, రసాయనాలు సాయంతో పండించిన పదార్థం జీవశక్తిని బలహీన పరుస్తాయి.
2.   నెయ్యి, పాలు, తేనె.. కేవలం మధుర పదార్థాలే కాదు.. జీవరసాయనాలు కూడా.
      నెయ్యి, వాము కలిపి  తల్లి తినిపించే గోరుముద్ధలు పసిపిల్లలకు మేథోరసాయనాలే.
     ఉన్నత పాఠశాల, కళాశాలలకు వెళ్లే వయసు పిల్లలకు ఆహారంలోని మొదటి ముద్ద
     పేరిన నెయ్యి, ఉసిరికాయతో కలిపినదయితే వారి తెలివి తేటలు వృద్ధి చెందుతాయి
    ముఖ్యంగా కళాశాలలకు వెళ్లే పిల్లలలకు నెయ్యి, మినుము, బెల్లం కలిపిన ఉండలు మనసు
    శరీరాన్ని దార్ఢ్యంగా మారుస్తాయి. ఆడపిల్లల్లో అయితే హార్మీనుల సమతౌల్యాన్ని
    సాధిస్తాయి.
3.   తేలిగ్గా జీర్ణమై రసంగా మారి శరీరానికి, జీవకణాలకి శక్తిని అందించే ఆహారం ప్రాణాహారమని భావన. రాత్రి పడుకునే ముందు వేడిపాలల్లో .. పటిక బెల్లం కలిపి తీసుకుంటే ప్రాణాహార అవసరం చాలావరకు తీరినట్లే.  బాధం, జీడి పలుకులు రెండో మూడో పాలతో కలిపి తీసుకుంటే.. పెద్దవయసువారికి ఎంతో మేలు జరుగుతుంది. మంచి నిద్రా వస్తుంది. మంచి నిద్ర బుద్ధి వికాసానికి దోహదం.
4.   మెదడులోని జీవకణాలు ఎప్పుడూ చాలా వత్తిడిమీదుంటాయి. వాటికి ఎక్కువ ప్రాణాహారం అవసరం. ప్రాణాయామం ఆ అవసరాన్ని తీర్చే సాధనం.
5.   మన శరీరానికి అందించే ఆహారంలో ముప్పై శాతం ఒక్క ఒక్క తలే తినేస్తుంది. నిద్రలో అయినా  మెదడుకి బద్ధకం పనికి రాదు. జాగృత, స్వప్న, సుషుప్త అనే మూడు దశల్లో సైతం  విధి నిర్వహణ తప్పనప్పుడు అందుకు తగ్గట్లు ప్రాణాహారం అవసరమే కదా! లేదంటే కోమాలోకి జారిపోయే ప్రమాదం పొంచుంటుంది. మరణకారణాలలో కోమా ముఖ్యమైనదని గుర్తుంచుకోవాలి. మెదడుకు అవసరమైన ప్రాణాహారం  సరస్వతీ లేహ్యం, బ్రహ్మీ రసాయనం, అశ్వగంధి వంటి ఔషధాలలో దొరుకుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
6.   రాత్రి పెరుగు మానేయడం బుద్ధికి మనం చేసే మంచి మేలని వైద్యుల సలహా!

ఈ సూచనలేవీ పాటించలేనంత కష్టమైనవి కాదు కదా! సూక్ష్మ బుద్ధిశాలులుగా జీవిత పర్యంతం జీవిస్తే స్వంతానికే కాదు.. మనమీద ఆధార పడ్డ వారికి, ముదిమిలో మనం ఆధార పడ్డవారిక్కూడా తప్పించుకోదగ్గ కష్టాలనుంచి తప్పించినట్లే అవుతుంది.
***
(సూచనః ఈ వ్యాసంలోని ఆరోగ్య సూచనలు దాక్టర్ ఇవటూరి రామకృష్ణగారివి. సోర్సుః స్వాతి 31-03-2009 నాటి సంచిక. కేవలం పాఠకుల ప్రాథమిక పరిజ్ఞానం కోసం మాత్రమే ఈ టపా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
-కర్లపాలెం హనుమంతరావు







Sunday, October 2, 2016

భార్యావిధేయత- 'తెలుగు వెలుగు' మాస పత్రికలోని సరదా వ్యాసం

విధివిధేయతకన్నా గడుసుపురుషుడు భార్యావిధేయతను నమ్ముకుంటాడు.
భగవంతుడు కనిపించడు. భార్య కనిపిస్తుంది. భయం భార్యమీదా, భక్తి భగవంతుడిమీదా ఉంచుకొంటే బతికున్నంతకాలం భుక్తికి వెదుకులాట తప్పుతుంది.
పెళ్లినాడే పెళ్లాం కొంగుకి పంచఅంచు ముడివేయించి మరీ పెద్దలు భార్యామణి ఆధిక్యతను అధికారికంగా ప్రకటిస్తారు.   బరువు భాద్యతలు భర్తవంటారుగాని.. వట్టిదే! భర్త బరువుభాధ్యత భార్యదే! భార్య బరువుబాధ్యత భర్తకు పడకటింటివరకే పరిమితం,
 పెళ్ళికోసం పాపం మొగాడు కలఫుర్ ఫుల్ కలలు కంటాడుగానీ .. భర్తబతుకు ఉత్తరకుమారుడికన్నా ఉత్తమంగా ఉంటుందన్న భరోసా ఎక్కడా లేదు. పెళ్లయిన ఉత్తరక్షణంనుంచే పిల్లాడికి  లక్ష్మణకుమారుడి లక్షణాలు ఆవహిస్తాయి.
బైట పల్లకీమోత సంగతేమోగానీ.. ఇంట పెళ్లాన్ని తప్పించుకొనే రాత విధాత ఏ మగవాడి నుదుటా రాయలేదు.
పెళ్లాం చెబితే వినాల్సిందేరాముడు అదే చేసాడు. అష్టకష్టాల పాలయ్యాడు అయినా కృష్ణుడూ అదే బాటపట్టి భార్యకాళ్లు పట్టాడు. పడకటిల్లే కదా! ఏ పాట్లు పడితే మాత్రం తప్పేంటి! అనేది వట్టి బుకాయింపులకే! గడపకవతలా  తనతరుణి గీచిన గీత  మగవాడు జవదాటరాదు. దాటితే ఏమవుతుందో ఏ మొగుడూ బైటికి చెప్పడు!
ఎన్నికల్లో ఓటేసే జనాలంత అమాయకంగా ఉంటారా భార్యలెవరైనా! మగాడేదో మానసిక సంతృప్తికోసం ఆడదాని జడత్వంమీదనో.. పతివ్రతామహత్యంమీదనో కథలు కవిత్వాలల్లుకుంటే అల్లుకోవచ్చుగాక. ఆడవాళ్ళు వాటిని చదివి లోలోన నవ్వుకుంటారని పాపం మగభడవాయికి తెలీదు!
లల్లూప్రసాదు అర్థాంగి   శ్రీమతి రబ్రీదేవమ్మగారి కథల్లోనే స్త్రీశక్తి ఏంటో  తేటతెల్లమవడంలేదా! పోనీలే పాపమని మొగుణ్ణి తనమీద పెత్తనం చెలాయించేందుకు ఆడది అంగీకరిస్తుంది కానీ.. వాస్తవానికి ఇంటి పెత్తనం, మొగుడి కంటిపెత్తనం.. వంటిపెత్తనం.. చివరాఖరికి.. జైలుకెళ్ళినభర్త కుర్చీమీదకూడా దాన వినిమయ విక్రయాది సర్వహక్కుభుక్తాలు తాళికట్టించుకొన్న భార్యామణికి మాత్రమే దఖలుపడి ఉంటాయి.

కైకేయిని కాదని దశరథుడు ఏమన్నా చేయగలిగాడా? సత్యభామను రావద్దని కృష్ణస్వామి యుద్ధభూమికి వెళ్లగలిగాడా? భార్యను కాళ్లదగ్గరుంచుకున్నట్లు బైటికి వీరబిల్డప్పే  శేషప్పశయనుడిదిభృగుమహర్షి పాదాలు  పట్టాడని అలిగి భూలోకం తారుకున్న శ్రీలక్ష్మమ్మను  ప్రసన్నం చేసుకోడానికి  ఆ ఏడుకొండలవాడు పడ్డ ఇడుములు అన్నీ ఇన్నీనా! సహధర్మచారిణి సాహచర్యంలో ఏ మజా లేకపోతే  మహావిష్ణువంతటి భగవంతుడూ అన్నేసి కోట్లఖర్చుకు  వెనకాడకుండా పెళ్లిపిటలమీదకు తయారవుతాడు.. చెప్పండి! విరాగి.. బికారి.. అంటూ వీరబిరుదులు ఎన్ని తగిలించుకుంటేనేమి! ఇద్దరు భార్యలనూ  సుబ్బరంగా ముద్దు చేశాడా లేదా  ఉబ్బులింగడు! విధాతగారి కథయితే మరీ విచిత్రం. అర్థాంగి  అవసరం ముదిమితనంలో మరీ ఎక్కువ.   వావివరసలైనా చూసుకోకుండా అందుకే సరసమహాదేవి సరసన చేరిపోయాడు ముసలిబ్రహ్మ!
పూర్వాశ్రమంలో ఎంత చింకిపాతలరాయుడైనాగానీ .. తన మెళ్లో తాళి కట్టిన అదృష్టానికి  'శ్రీవారు' హోదా ప్రసాదిస్తుంది స్త్రీమూర్తి! అలాంటి ఒక ఉదారమూర్తిని మగాడు ఓ దినం ఎన్నుకొని  అభినందించేందుకు పూనుకోడమేంటి! ఫన్నీ! ఇంగ్లీషువాడికదో  చాదస్తం. మనదేశీయ మగవాడు మాత్రం అడుగడుగునా ఏడడుగులు తనతో కలిసి నడిచిన  ఇల్లాలి అడుగులకు మడుగులు వత్తుతూనే ఉంటాడు.. ఇంట్లోబైటకు చెబుతారా అన్నీ!
భార్య కొన్నవి మినహా ఏ మగవాడైనా స్వంత అభిరుచి మేరకు దుస్తులు  ధరించే సాహసం చేయగలడా! విసుగుపుట్టో, జాలి కలిగో.. రీమోటు వదిలితే తప్ప మగవాడన్నవాడు స్వంత ఇంట్లో పడకటింట్లో అయినా ఇష్టమైన ఏ 'ఎఫ్' చానల్నైనా  మనసారా చూడగలడా! 'భోజనంలోకి ఏం చేయమంటారండీ!' అంటూ భార్యలు తలుపు చాటునుంచి  బిడియపడుతూ అడిగి.. చేసి.. వడ్డించే   స్వర్ణయుగం కేవలం ప్రబంధాలలోనే!     వంటకు వంకపెట్టటం అటుంచండి మహాశయా! భార్య బజారునుంచి కొనుక్కొచ్చిన ప్రియా పచ్చడికైనా వంకపెట్టే గుండెదైర్యం ప్రపంచంలో ఏ మొగాడికైనా ఉంటుందా.. చెప్పండి! పచ్చడి పచ్చడి ఐపోదూ ఆ రోజంతా బతుకంతా!
స్త్రీ పాత్ర లేని నాటకాలంటే మగాళ్ళు ముచ్చటపడి రాసుకొనే ఉటోపియాలుస్త్రీ ప్రమేయంలేని.. ముఖ్యంగా భార్యామణి హస్తాలులేని సంసారాలను ఆ విధాతకూడా సృష్టించలేడు. సృష్టించాలని ఉన్నా కట్టుకున్న శారదమ్మ చూస్తూ ఉరుకోదు!
'కవులేల తమ కావ్యములలో భార్యలగూర్చి వర్ణించరు?' అని వెనకటికి  తర్కం లేవదిసింది ఓ  ఎల్లేపెద్ది వెంకమ్మగారు 'విద్యానంద'మనే పాత పత్రికలో!
(విద్యానంద- 4-1928) కాళిదాసు శకుంతలను వర్ణించాడుగాని..  కట్టుకున్న భార్య కట్టుబొట్టుల్నైనా గట్టిగా ఓ శ్లోకంలో వర్ణించలేదని ఫిర్యాదు.  శూలపాణీ అంతే! ముఫ్ఫైయ్యేడు నాటకాల్లో లెక్కలేనంతమందిని ఆడవాళ్లను  అణువువదలకుండా వర్ణించిన శృంగారపురుషుడు!   అణిగిమణిగి ఉందన్న చులకనభావం  కాబోలు.. అన్న వస్త్రాలు వేళకు అందించే భార్య సుగుణాలలో ఒక్కటీ సదరు శూలపాణిగారి దృష్తికి ఆనలేదు తల్లులను తలుచుకొన్నవారు కొందరున్నారు. అవ్వలమీద అవ్యాజమైన ప్రేమానురాగాలు కురిపించిన కవులూ కద్దు.  అన్ని దేశాలకవులు తమతమ  రాజులనే కాకుండా వారి వారి దేవేరులను, భార్యలను, వేశ్యలను సైతం  వర్ణించి తరించడం కనిపిస్తున్నదేగాని.. సొంతభార్యల ప్రస్తావనల దగ్గరమాత్రం  ఎందుచేతనో సర్వే సర్వత్రా పస్తాయింపులే!  ఏ కావ్యపీఠికైనా పరకాయించి చూడండి! కావ్యపోషకుడి వంశవర్ణనలే మెండు. ఒక్క రెండు మూడు మంచిపద్యాలైనా సమయం సందర్భం చూసుకొని  కంచిగరుడ చేసే ఇంటి ఇల్లాలును గురించి రాద్దామన్న బుద్దే ఏ కవిమన్యుడి మనసులో కలక్కపాయ!
భార్య లఘువుగా ఉండి మరీ భర్తను గురువు చేస్తుందని మళ్లీ షేక్ష్పియరే స్త్రీమూర్తిని మోస్తాడు! భార్యలేని మొగాడు పైకప్పులేని తాటాకుగూడని జర్మనీలు కూడా వంతపాడారు. అదృష్టం ఎన్ని భాగ్యాలైనా ప్రసాదిస్తుందిటగానీ.. అనుకూలమైన భార్యమాత్రం  ఈశ్వరేచ్చే'నని చివరికి పెళ్ళికాని ప్రసాదు  జాన్ పోప్ పాలుసైతం  అన్నారే! మరెందుకీ మగాళ్ళందరికీ తాళికట్టిన మఃహిళమీదంత మత్సరం!
'నిప్పు.. నీరు..  భార్య' అందుబాటులో ఉండే అత్యంత  అపాయకరాలని ఆ ఎద్దేవాలెందుకు! ఏ మాటకామాటే! నిప్పూ నీరుకు మల్లే ఆడదీ  వళ్ళు మండితే వేడి పుట్టిచ్చేస్తుంది. కన్నీళ్ళతో వణుకూ పుట్టిస్తుంది! మగాడిదే మాయదారి బుద్ధి. చచ్చినపెళ్లాంమీదా ఆ గాడిద దుఃఖం వాకిలి దాకానే!
అందరు మగాళ్ళూ అలాగే ఉంటారని కాదు. మంచన మహాకవి 'కేయూరుబాహు చరితం'లో మగాడి ప్రేమకు అద్దంపట్టే ఓ చిత్రమైన కథా ఉంది.భార్య వయసులో చిన్నది. భర్తకు ఆమె అంటే అంతులేని అనురాగం. ఆమె గర్భందాల్చింది. ఆ  సమయంలోనే ఊరువాళ్ళంతా  తీర్థయాత్రలకని బైలుదేరారు. 'వయసులో ఉన్నదానివి. నాలుగూళ్లు తిరిగాలన్న సరదా సహజం. నీ గర్భం నేను మోస్తాను. తీర్థయాత్రలు ముగించుకొని వచ్చి తిరిగి తీసుకో!' అంటూ భార్యగర్భం తనకు బదిలీచేయించుకొని ఆపసోపాలు పడేందుకు సిద్ధపడతాడు ఓ అద్భుతమైన మగవాడు!  చూలు మోయడమంటే పేలాలమూట మోయడమా! అన్నం సయించదు. నిద్రబాధలు. బిడ్డకుట్లకు ఓర్చి  నీళ్లాడినా.. తరువాత వాతాలు తగలుకోకుండా  పథ్యపానీయాలతో పంచకరపాట్లు పడాలి! గర్భంమోసి బిడ్డను కని.. పెంచి పోషించేందుకు ఆడది  సుకుమారయీ ఎన్ని కష్టాలను   ఇష్టంగా ఓర్చుకొంటుందో మగవాడు తెలుసుకోవాలి. నాగరీకులమని బోరవిరుచుకు తిరిగే  నేటితరాలకన్నా.. ఆనాగరికులుగా ముద్ర వేయించుకొని హీనంగా బతుకులు వెళ్లమార్చే జాతులు కొన్నింటిలో మగవాడు భార్య ప్రసవవేదనలను పలురీతుల్లో తానూ పంచుకొంటూ నిజమైన సహచరుడు అనిపించుకొంటాడు.
ఎరుకల కులంలో  భార్య ప్రసవించే సమయానికి  మగవాడు అమె కట్టు బొట్టులను  తాను అనుకరిస్తూ చీకటిగది కుక్కిమంచంమీద దుప్పటి ముసుగులో  దాక్కుంటాడు. భార్యకు సుఖంగా ప్రసవమయితేనే  మంచం దిగేది! బాలింత తినాల్సిన గొడ్డుకారం.. ఇంగువ ముద్దలు భర్తే మింగుతాడుఅండమాను దీవుల్లోని మరోతెగలో అయితే   గర్భిణీభార్య తినకూడని గొడ్డుమాంసం, తేనెవంటి పదార్థాలు తనూ ముట్టడుబిడ్డ పుట్టగానే పెనిమిటి ఉయ్యాల్లో పడుకొనే వింత ఆచారం న్యూగినియా ఆదిమజాతుల్లో నేటికీ ఉంది. పార్శీసుజాతి మగాడికి ఉయ్యాలశిక్షతో పాటు వంటికి నల్లరంగు పులుముడు అదనం. మైల తీరేదాకా గది బైటికి రాడుకూడా. బిడ్డ బొడ్డుతాడు ఊడేవరకు ఉపవాసాలుంటాడుఫిలిప్పీన్ దీవుల్లో   ప్రసవసమయంలో  భార్యగది గస్తీబాధ్యత కట్టుకొన్న భర్తదే. బిడ్డ పుటకకు తనే కారణమన్న వాస్తవం  లోకానికి చాటిచెప్పే ఇలాంటి తంతులు ఇంకెన్నో పలుదేశాల ఆదిమజాతులు ఈ నాటికీ ఆచరిస్తున్నాయిపురిటిబాధల్లో భాగం పంచుకోవాలని  ప్రసవ సమయంలో   భార్య మంచానికి తనను తాను కట్టేసుకొనే  మియాస్ తెగ మగాడికి మించి భార్యలను  ఎవరు ఎక్కువ ప్రేమించగలరు? ప్రశంసించగలరు?
బుద్ధభగవానుడు భార్యాభర్తలిద్దరూ పాటించవలసిన   సూత్రాలు చెరి ఐదేసి  బోధించాడు. 'భార్యను చీదరించుకోకుండా, సంపూర్ణ గౌరవం అందిస్తూ, ఆమె  తనివితీరా అన్నవస్త్రాలు, ఆభరణాలు  క్రమం తప్పకుండా అందించడం భర్త భాద్యత. పరస్త్రీలను కాముక దృష్టితో చూడకపోవడాన్నిమించి మగవాడు మగువకు ఇవ్వగల గొప్పప్రశంస మరేదీ లేదనికూడా బుద్ధుడు చురకలంటించాడు.

రెండు పుంజులు, రెండు పిల్లులు, ఎలుకలు, ముసలివాళ్లు, పడుచుపెళ్లాం ఉంటే  ఇంట రభస తప్పదని డచ్ దేశంలో ఓ సామెత ఉంది. ‘మగవాడి జీవితానికి రెండే శుభసందర్బాలు.. పెళ్లయిన రోజు, భార్యను పూడ్చిపెట్టిన రోజు’ అని పంచ్ పత్రిక పంచ్! ఎంత అన్యాయం! ‘నీ భార్యను నువ్వు గాడిద చేసావంటే.. ఆ గాడిద నిన్ను ఎద్దును చేస్తుంది. తస్మాత్ జాగ్రత్త!- అని మాత్రమే నేటి వనిత మగవాడిని హెచ్చరిస్తోంది.
మగవాళ్ళు తమ ఎద్దు మొద్దు స్వరూపాలు గుట్టుగా ఉండాలంటే ఆ 'గాడిద' కూతల జోలికి వెళ్ళకూడదు మరి. భార్యలను ప్రశంసించేందుకు ప్రతి ఏటా సెప్టెంబరు నెల  మూడో ఆదివారంనాడు  ‘భార్యామణిని ప్రశంసించే దినం’ (Wife Apptreciation Day) జరుపుకుంటారు పశ్చిమదేశాల్లో మగవాళ్ళు! ప్రశంసలు అనక! సర్వస్వాన్ని నిస్వార్థంగా అర్పించడానికి సిద్ధపడి మగాడి గడప తొక్కిన ఆడదాన్ని ముందు సాటి మనిషిగ్గా గుర్తించడం   నేర్చుకోవాల్సుంది పురుషప్రపంచం.

ప్రతి పురుషుని విజయం వెనకా ఒక  స్త్రీ ఉంటుందంటారు కదా! ఆ స్త్రీ కట్టుకున్నది కాకపోతే ఆ పురుషుడి బతుకు ఇక ఇస్త్రీనే! ఆ సంగతి  గుర్తుంచుకోవాలి మగమేస్త్ర్రీలు.
-గుడ్లదొన సరోజినీదేవి
ఎమ్.ఏబి.ఎడ్ విశ్రాంత తెలుగు ఉపాధ్యాయురాలు
(ఈనాడి సంస్థ 'తెలుగు వెలుగు' మాస పత్రిక, సెప్టెంబరు, 2016 సంచికలో ప్రచురితం)

Saturday, October 1, 2016

పేపర్ వర్క్- వాకిలి- లాఫింగ్ గ్యాస్

మా చిన్నతనంలో వార్తాపత్రికల ప్రయోజనాలను గురించి రాయమన్న ప్రశ్న తరచూ మార్చి మార్చి వస్తుండేది. వార్తాపత్రికలమీద పెట్టిన దృష్టి అవి తయారయే కాగితంమీద ఎందుకు పెట్టలేదనే సందేహం ఎప్పుడూ నన్ను పీడిస్తుంటుంది.
రాతకు కాగితం తప్పని సరి. కాగితాలు అందుబాటులో ఉండబట్టే కవులు.. కథకలూ..  మన జీవితాలతో చెలగాడమాడుతున్నది. అలా కాదు.. కాగితం అంటూ ఒకటి హద్దుగా  ఉండబట్టే కదా వాళ్ల ధాటికి సమాజం తట్టుకో గలుగుతున్నది?’ లేకపోతే.. వాళ్ల ఆశుధారాశక్తికి మానవ సంఘం ఎప్పుడో కొట్టుకు పోయుండేది.. అనే విరసలూ కద్దు. ఆ ఊసులు మనకిప్పుడు వద్దు.  కాగితాలతో ఒనగూడే ఇతర ప్రయోజనాలూ బోలెడున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో! వాటిని గురించి ముచ్చటించుకుందాం.. ముచ్చటగా ఉంటుంది.
మన దేశ మంత్రివర్యుడొకడు చైనా సందర్శనకు వెళ్లాడుట ఒకసారి. అక్కడి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపించే సందర్భంలో వంద కి.మీ పొడుగున్న ఒక వంతెనను చూపించి ఎంత పకడ్బందీగా అది కట్టబడిందో.. ఆ కట్టుబడికి ఎన్ని మిలియన్లు ఖర్చు అయిందో వివరించాడు చైనా మంత్రివర్యుడు. మరో సందర్భంలో అదే మహాశయుడు ఇంకేదో టూరు సందర్భంగా  ఇండియా వచ్చినప్పుడు.. ఇక్కడి అభివృద్ద్జిని అతగాడికి వివరించాల్సిన బాధ్యత ఇదివరకటి మంత్రివర్యుడికే అప్పగించబడింది.  ఆ నేపథ్యంలో ఒక ప్రాంతాన్ని చూపిస్తూ 'మీ దగ్గరున్న వంద కి.మీ  వంతెనకన్నా.. రెట్టింపుంటుందీ నిర్మాణం. కాకపోతే ఖర్చు కట్టుబకి కాస్త ఎక్కువయింది..' అనంటూ  ఏవేవో వివరాలు ఇచ్చుకుంటూ పోతున్నాడు. అసలక్కడ ఏ వంతెనా లేకపోవడంతో నోరు వెళ్ల బెట్టిన చైనా పెద్దమనిషి.. అదే విషయం అడిగితే 'అక్కడే ఉంది.. మీకూ మాకూ తేడా. మీకు కాగితాల ప్రయోజనం పరిమితంగానే తెలుసు.  మాకు అపరిమితంగా తెలుసు' అనేసాడు మన ఇండియా పెద్దాసామి.
కాగితాలనగానే సాధారణంగా మన మనసుల్లో మెదిలేవి బడిపిల్లకాయలు బస్తాల్లాంటి సంచుల్లో కుక్కుకొని మోసుకుంటూ తిరిగే బుక్కులు.. వార్తా పత్రికలుకార్యాలయాల తాలూకు దస్త్రాలు.. గట్రా!
రోడ్లమీదపార్కుల్లో.. చెల్లా చెదరుగా పడుండే పోగులు. రచయితలు, కవులు.. వాడే  వాటితో ఏ ఉపయోగమూ ఉండక పోవచ్చుగానీ.. పాతకాగితాలను రోట్లో రుబ్బి ఆ గుజ్జుతో బుట్టలు చేసేది మా అవ్వ. కాగితాలను రకరకాలుగా కత్తిరించి రంగులద్ది ఆ ముచ్చటైన బొమ్మల్ని ఇంటి గుమ్మాలకు వేలాడదీసేది మా అత్త. కాగితాలు ఉండలుగా మార్చి పురుగూ పుట్రా లోపలికి రాకుండా తూములకు అడ్డం పెడుతుండేవాడు మా తాత.  బస్తాలకి బెజ్జం పడి   ధాన్యం కారిపోకుండా కాగితాలడ్డం పెట్టి మా మామయ్య.. రాసుకునే బల్ల ఎత్తుపల్లాలు సరిచేసుకునేందుకు  ఉపయోగించి  మా నాన్న.. కాగితాలు  బహుళార్థ సాధకాలని నిరూపించారు. ఎదురింటి రెండు జడల సీతకి పొద్దస్తమానం మా బాబాయి పై డాబామీదనుంచి గురిచూసి విసిరేదీ కాగితాలతో చేసిన రాకెట్లనే. మా పెద్దతమ్ముడు కాగితాలతో గాలి పటాలు. చిన్న
తమ్ముడు కత్తి పడవలు చేసి ఆడుకునేవాళ్లు చిన్నతనంలో.
కాగితాల్తో అన్నీ ప్రయోజనాలే అనుకొంటే పప్పులో కాలేసినట్లే. ఊళ్ళో  మనుషుల్లేకుండా .. పొలం పుట్రా ఉన్నవాళ్ల తాలూకు పత్రాలకి నకిలీలు సృష్టించి అమ్ముకునే మా ఊరి పుల్లారావులాంటి నమ్మకద్రోహులకి ఈ కాగితాలే ఆసరా! కొంచెం  బాధాకరమే కదా! మా ఊరి కరణం ఆంజనేయులుగారు ఇలాంటి లాలూచీ వ్యవహారాల్లోనే బోల్డన్ని పచ్చకాగితాలు కళ్లచూసాడని చెప్పుకునే వాళ్ళు చుట్టుపక్కల ఊళ్లల్లో.
అన్నట్లు రూపాయి.. పది రూపాయల్లాంటి వాటి ముద్రణక్కూడా కాగితాలే కదా గతి! దేశ ఆర్థికస్థితంతా బంగారంమీదుందంటారుగానీ.. వట్టిదే. అదీ వట్టి కాగితాలమీదే అధారపడుంది. మన దేశంలో బంగారం నిల్వలకు తగ్గంతగా మాత్రమే కరెన్సీ చలామణిలో ఉందంటే నమ్మదగ్గ మాటేనా?
ఉత్తరాలు.. ఆత్మకథలు.. మంచి మంచి పుస్తకాల్లాంటి వాటికీ కాగితాలే ఆధారం. కాబట్టే.. ఆ పెద్దలు.. మహాత్ములెవ్వరూ మన కంటి ముందుక్కిడ   ఇప్పుడు లేకపోయినా.. వాళ్ళు బోధించిన మంచి సూక్తులు.. ఆలోచనలు మన మేథస్సుల  ఎదుగుదలకు అంతో ఇంతో  దోహదం చేస్తున్నాయి.
గత్సంలో పెద్దలమధ్య.. దేశాలమధ్య జరిగిన ఒప్పందాలు.. రాతకోతలన్నింటికీ కాగితమే వేదిక. కాబట్టే కట్టెదుట వాళ్ళు కనిపించక పోయినా 'conversation with the legends' సాధ్యమవుతోంది. గాంధీ మహాత్ముడు ఈ కాగితం విషయంలో ఎంతో పీనాసితనం చూపించేవాడంటారు. తనకొచ్చిన ఉత్తరాల వెనక ఉన్న  ఖాళీ జాగానికూడా ఆయన వృథా పోనిచ్చేవాడు కాదుట. మరీ వ్యక్తిగతానికి సంబంధించిన  విశేషాలను మినహాయించి మిగతా సంగతులేవైనా సరే  రాసుకొనేందుకు వాటిని ఉపయోగించే వాడుట. తనకొచ్చిన కవర్లను చింపి కాగితాలుగా మార్చి వాటినీ వాడిన విచిత్రమైన  పొదుపరితనం బాపూజీది. మరీ ఉపయోగం లేని చెత్తకాగితాలతో ఆశ్రమానికి అవసరమైన  బుట్టలు.. తట్టలు.. వగైరా తయారు చేయించేవాడని వినికిడి.
ఆడపిల్లల సంసారాలతో చెడుగుడు ఆడుకునే ఆకాశరామన్నలకూ ఈ కాగితాలే ఉత్తరాల రూపంలో సాయపట్టడం కొంత విచారకరమైన విషయం. ఇప్పుడంటే విద్యుత్ బుగ్గలు కానీ.. ఒకానొక కాలంలో మునిమాపటి చీకట్లు కమ్ముకోడానికి ఇంత సమయం ఉందనగానే నూనె దీపాలు శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉండేవాళ్ళు ఆడంగులు. ముందురోజు దీపం గ్లాసులకు పట్టిన మసిని తుడిచేందుకు బొగ్గు.. ఆ తరువాత ఆ బొగ్గుమరకలు పోవడానికి కాగితాలనే  వాడేవాళ్ళు. కుంపటి రాజేసుకొనేందుకు  కావాల్సిన మంటను అమ్మ కాగితాలు అంటించే సాధించేది.   అద్దాలమీద మరకలు పోవాలన్నా.. ముందు ఏ పౌడరుతోనో శుభ్రం చేసి ఆనక కాగితంతో   తుడిచేస్తే అద్దం ఆడపిల్ల చెక్కిళ్లలాగా తళ తళలాడుతుంది.
ఇన్నేసి ప్రయోజనాలున్న కాగితాన్ని ఆధునిక సాంకేతిక విజ్ఞానం పక్కన పెట్టేస్తోంది. పేపర్లెస్ ఆఫీసులమీద మోజు పెంచేస్తోంది. విదేశాలలో టాయిలెట్ అవసరాలక్కూడా టిస్యూ పేపర్ వాడుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ స్థానంలో పేపర్ బ్యాగులను ప్రోత్సహిస్తున్నారు. అయినా డిజిటల్ వర్చ్యవల్ వరల్డ్ విస్తురిస్తున్న కొద్దీ పేపరు ప్రపంచం కుచించుకుపోతోంది.
ఒక రీము పేపరు తయారవడానికి పెరట్లోని చెట్టూ చేమా ఉపయోగించాలి. పచ్చదనం  తగ్గిపోతున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందని పర్యావరణ శాస్త్రవేత్తల ఆందోళన.
కాదనలేం కానీ.. కాగితాల కత్తిపడవలతో.. గాలిపటాలతో బాల్యానికున్న అనుబంధాన్ని అంత తొందరగా మర్చిపోలేం కదా! వేళకి జీతాలు రాని బడిపంతుళ్ల  ఇళ్లల్లో పుట్టిన పిల్లలం. మావి చిన్ని బొజ్జలే అయినా వాటిని నింపేందుకూ ఆ కాలంనాటి అమ్మలను ఈ కాగితాలే ఆదుకొనేవి. పదో పన్నెండో పాత వార్తా పత్రికల పేపర్లను సీతయ్య చిల్లర  దుకాణంలో మారకానికని వేస్తే వచ్చిన పప్పూ బియ్యంతోనే బిడ్డలకొక పూటైనా కడుపు నిండేది. పొట్టకోస్తే కనిపించే అక్షరం ముక్కే కాదు.. పొట్ట హరాయించుకొన్న పులుసు ముక్కలక్కూడా కాగితాలే ఆధారంగా గడిచిన ఆ కాలాన్ని అంత తొందరగా మర్చిపోగలమా?!
అలాంటి కాగితంమీదకు జాగిలంలా  వచ్చిదూకుతోంది ఆధునిక సాంకేతిక విజ్ఞానం. అభివృద్ధికి కాలడ్డం లేం.. అలాగని మధుర స్మృతుల పేటికను కాలప్రవాహానికి వడ్డలేం! ఇదో విచిత్రమైన సంధి దశ చీలే రెండు సంస్కృతుల కూడలిమీద నిలబడ్డ మా తరానికి.
--కర్లపాలెం హనుమంతరావు

వాకిలి- ‘లాఫింగ్ గ్యాస్ ‘- అక్టోబరు, 2016 సంచిక ప్రచురణ



మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...