Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక చెట్టు పేరు చెప్పుకొని. . - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 01 - 04-2014 )

 



ఈనాడు - గల్పిక

చెట్టు పేరు చెప్పుకొని. . 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 01 - 04-2014 ) 



మోహనదాస్ భలేవాడురా!'

మోహన్ దాసా ?! 


అదేరా! " మన కరమ్ చంద్  గారి అబ్బాయి'


ఈ కరమ్  ఎనరన్నా ?  ధ్యాన్ చంద్  దాయాదా? 


ఖర్మ ! కరమ్ చందే  తెలీనోడికి మోహన్ దాసు  మాత్రం ఏం తెలిసి ఏడుస్తాడులే. పోనీ.. 'గాంధీ' అని ఒక పేరుంది... అదన్నా ఎక్కడైనా విన్నట్లు గుర్తుందిరా కన్నా?


జోకా అన్నా! జీకేలో మా గ్రూపులో నేనే టాపు


ఆపు. అసలు పేరుతో అడిగితే నొసలు చిట్లిస్తావుగానీ.. తోకపేరు అడిగితే మాత్రం తెగ వాయిస్తావు తబలా... ఇలా ! 


తప్పై పోయిందిలే అన్నా! ఇంతకీ  తాతగారి పేరు ఇంత హఠాత్తుగా తలపుకెందుకొచ్చినట్లో?  దగ్గర్లో వర్ధంతులు, జయంతులు గట్రా ఏమీలేవే!'


అదీ! తాతగారి అసలు పేరు ఆ స్థాయికి దిగిపోయిందన్నమాట! ఏంరా తోక పేరు 'గాంధీ' నామం చెబితే మాత్రం అంతలా పరవశించిపోతావేమిట్రా?'


'గాంధీ నామం ఒక్క తాతగారి గుత్తసొమ్మేంకాదన్నా! ఆ తరువాత ఎంతమంది గాంధీలు మనదేశాన్ని ఏలిపారేశారూ! ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ.. రేపు ప్రియాంక గాంధీ... ఎల్లుండి. .!


అదే కదరా నా బాధ ఇందాకట్నుంచీ!  


పెట్టి పుట్టారన్నా వాళ్ళంతా!  నువ్వు కళ్ళు కుట్టుకుంటే ఏం లాభం... చెప్పు! 


పుత్లీబాయిగారి అబ్బాయి తాలూకు గాంధీకి, నెహ్రూగారింటి అల్లుడు ఫిరోజ్ తాలూకు గాంధీకి ఉప్పుకి, ఉసిరిపప్పుకి ఉన్నంత సంబంధం కూడా లేదు. ముందది తెలుసా నీకూ? 


ఆ పురాణాలన్నీ వినే ఓపిక ఎవరికుందన్నా! రావణాసురుణ్ని రామణాసురు డిగా మార్చి ప్రచారం చేసి, భద్రాచలం ఎదురుగా మరో అసురాచలం లేపే దేశం ఇది ! 


అన్నిందాలా అయ్య లక్షణాలే పుణికి పుచ్చుకొన్న ఇందిర ఒక్క గాంధీ విష యంలోనే భర్తనెందుకు అనుసరించిందంటావూ? చెట్టుపేరు గొప్పగా ఉండనిదే కాయలు ఏమాత్రం చెల్లుబాటు కావన్న రాజకీయం గుట్టుమట్లు ఒంటపట్టించు కుంది కాబట్టి. 


 నువ్వూరికే గుడ్లనీళ్ళు కుక్కుకుంటే ఏం లాభం చెప్పూ! 


ఇదేం ప్రజాస్వామ్యంరా ? 


ఇదే ప్రజాస్వామ్యమన్నా. పేరుకే ఇక్కడ సర్వంసహాధికారం. పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది అని మరి పెద్దోళ్లు అన్నదో!


ప్రాసకోసం పడే ప్రయాసన్నా అదంతా, వాస్తవానికి పేరులోనే ఉన్నది పెన్నిధంతా !  ఉక్కుమనిషి అద్వానీ పేరు చివర్న గానీ  ఏ గాంధీనో ఉండుంటే ఇవాళిలా తుక్కుకింద మార్చి గాంధీనగర్ నుంచి  గెటవుట్ అని ఉండేవాళ్లా? 


వసుంధరా రాజే  పేరు వెనక ఆ సింధియా బ్రాండు ఉండబట్టేగా ఎంత అమభవ జశ్వంతు సింగ్ బాబానీ చెత్తబుట్టలోకి విసిరికొట్టిందీ! రాహు ల్ గాంధీ.. ఏ రాహుల్ లాలో  గనక అయివుంటే ఏళ్లబట్టి వేళ్లు తన్నుకుని ఉన్న పెద్దాళ్ల కాళ్ళనిలా తొక్కేసుకుంటూ ప్రధాని పదవికి ఎగబడగలడా!'


కండువాలు ఎన్ని పార్టీలవైనా మార్చుకో..  కండల్లో వంశం రక్తం పొంగిపొర్లుతున్నంతకాలం ఇండియాలో వారసులకు ఎన్ని తరాలకైనా ఢోకా  ఉండదంటావు. ఇది అన్యాయంగా అనిపించడం లేదూ?


పెద్దాయనవి నన్నడుగుతున్నావుగానీ... నీకు తెలీని మతలబులా ఇవన్నీ! ఎవడి నుదుటిమీదా ప్రత్యేకంగా 'ఇదే వీడి పేర' ని  అచ్చక్ష రాలలో  చెక్కి ఉంటుందా... చెప్పు!  జన్మతః వచ్చిన పేరును వాడుకోవద్దనే హక్కు ఎవరికీ లేదు కదన్నా...!


ఆ మాటా  నిజమేరా!  లక్షలకు లక్షలు లక్షణమైన పేర్లు. ఇవాళ్టి  వారసులు తాతలనుంచి తండ్రుల నుంచీ కోరుకుంటున్నది? రెండు సార్వత్రిక ఎన్నికలు వరసగా పడితే చాలు... తండ్రి ఇచ్చిన సర్వం గోవిందా! అదే లక్షణంగా ఏ మహాత్మగానో పేరు గడించి అది  ఇచ్చిపోతే ఎన్ని ఎన్నికలొచ్చి పడితే మాత్రం నష్టమేంటంట! పెద్దాయన పేరు చెప్పుకొని పిచ్చిపిచ్చిగా సంపాదించుకో వచ్చు. అదృష్టం బాగుండి అధికార దండం దక్కిందా- దేశం మొత్తాన్ని దండుకోవచ్చు.


దేవుళ్లకు మల్లే శతసహస్ర నామాలు ఉండ పన్లేదు.  గిట్టుబాటయ్యే ఒక్క పొట్టి వంశం పేరు తగిలినా చాలు... ఆ పేరు చెప్పుకొని దేశాన్ని ఎలాగైనా తగలేయచ్చంటావు! 


అందుకే ఇందాకే నేనన్నది... మోహన్‌ దాస్ కరమ్ చంద్  భలేపని చేశాడని! ఆయనగారు అంతలా కష్టపడి స్వాతంత్య్రం సంపాదించి 'గాంధీ' బ్రాండుకింత విలువ పెంచబట్టి కదూ... ఇందిరాగాంధీ 'అత్యవసరం'పేరులో  దేశాన్ని చెండుకు తిన్నది! రాజీవ్ గాంధీ సంస్కరణల వంక పెట్టి సామాన్యుణ్ని వేధించింది. ఇసుక నుంచి ఇనుము దాకా దేన్నీ వదలకుండా దండుకుతిన్న బకాసురుల బృందానికి సారథ్యం వహించీ ఈరోజిలా  దేవతలా   గుడోటి  కట్టించుకుని  రోజూ పూజులందుకోవాలని సోనియాగాంధీ మోజుపడుతున్నదీ ! అధికారం విషం అంటాడు, మళ్ళీ అందులో ఒక్క చుక్కయినా  ఎదుటోళ్లకు  దక్కద్దంటాడు  రాహుల్ గాంధీ! మనమీ ' గాంధీ' బ్రాండును పట్టుకు వేలాడుతుండబట్టి కదరా- వీళ్ళందరికీ ఎక్కడ లేనీ  ఈ అధికారాలు, సౌకర్యాలు! 


ఎదుటివాళ్ల తప్పులెంచడం జీడిపప్పు నమిలినంత మజాగానే ఉంటుందన్నా! మరి మనం స్వయంగా చేసుకునే తప్పులో!'


మనమేం చేస్తున్నాంరా తప్పులూ? ... చిత్రంగా మాట్లాడతావే ఎప్పుడూ?


పేరు చూసి వెంటపడటం మనం చేసే తప్పు కాదా? స్వతంత్రం వచ్చి ఆరున్నొక్క దశాబ్దాలు గడచే పోయాయి . అయినా సొతంత్రంగా  ఆలోచిస్తున్నామా?


నిజమేరా!  చిన్నప్పుడు బళ్లల్లో పంతుళ్లు హాజరు అడిగేటప్పుడు వరస తప్ప కుండా ' ప్రెజంట్ సార్' అంటుండేవాళ్లం.  ప్రజాస్వామ్యం బళ్లో నిజంగానే మన మంటూ ఉన్నామని చెప్పాలంటే ఓటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవాలిముందు. ఆనక్ బద్ధకించకుండా పోలింగ్ కేంద్రాల దాకా  పోయి ఈ పేరాశగాళ్ళకు బుద్ధి చెప్పాలి


అదీ మాట! చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొనే నేతను ఓటరే ఓటుతో కుమ్మేయాలి ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 01 - 04-2014 ) 


ఈనాడు - వ్యంగ్యం : ముము బ్రోవ రారా! - కర్లపాలెం హనుమంతరావు - ఈనాడు - గల్పిక - ( 08 - 04-2014 ) ప్రచురితం)

 



ఈనాడు - వ్యంగ్యం : 

ముము బ్రోవ రారా! 

- కర్లపాలెం హనుమంతరావు

- ఈనాడు - గల్పిక - ( 08 - 04-2014 ) ప్రచురితం) 


రామచంద్రా... నీతో రాజకీయాలు ముచ్చటించడం మర్యాదో కాదో తెలీదు.  కానీ, మరేం చెయ్యాలి. నా మొర ఆలకించే నాథుడే కరవయ్యాడే ! అందరూ ఎన్నికల పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అందుకే నేరుగా నీకే నా మొర చెప్పుకొంటున్నా!


అభయ ముద్ర చూపిస్తూ గర్భగుడిలో నువ్వు అలా నిశ్శ బ్దంగా  నిలబడి ఉంటే- మా ప్రధాని గుర్తుకొచ్చి దిగులవుతుంది. కాస్త ఆ భంగిమ మారుద్దూ, నీకు పుణ్యముంటుందీ!


'దండధారి నుంచి తప్పించుకోవాలంటే కోదండధారే మాకు గతి' అని మాలో ఒక నానుడి నానుతోంది. దండం ధరించిన ఆ యముడికి మించి  దండలు మెళ్లో ధరించి ఓట్ల కోసం వెంటబడుతున్నారయ్య  మా నేతలు! ఆ మాయదారి మూక నుంచి బయటపడే దారి దయామయా నీవే చూపించాలి  రామయ్యా! 


త్రేతాయుగంనాటి వాడివి కనుక నీకు ఏ కానుకలు, తాయిలాల బెడదా లేదు. వనవాసంలో నాడు  ఏ సాయంకై ఆశించక  గుహుడు నిన్నా  గండకీ నది దాటించాడు. శబరి మహాతల్లి ఎక్కడెక్కడి పండ్లో  ఏరుకొనొచ్చి  నీకు ఆహారంగా సమర్పించుకుంది. కానీ నీ నుంచి పాపం, ఏ పింఛను మంజారు ఆనించింది కాదు. ఆ జటాయువు పక్షికి  రావణాసురుడితో ఏమి కక్ష ఉందని.. నీ పక్షాన చేరి సీతమ్మను కాపాడాలనిపించింది ! ఏ సమరయోధుల పింఛనో కొట్టేయాలని  కాదుగా .. ఇప్పుడిక్కడ నడిచే రామరాజ్యంలోలాగా! అడగకనే చేతిలోన పచ్చ  నోట్లు పడిపోతున్నాయి . కోరకనే కోకల .. పంచెల  మడతల మధ్యనా  సెల్ ఫోనులు కనపడుతున్నాయి.  ఎవరి పిల్లకాయనో   వివరమైనా  అడగకుండా గుమ్మంలో ఆడుకుంటూ కనపడటం పాపం.. పాపం చీమిడి ముక్కులు  శుభ్రంగా చొక్కా అంచులలో ఇంచక్క  తుడిచి మరీ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు నేతలు!  రామరాజ్య పరిపాలన మోతాదు మితిమీరు తున్నదేమోనని మహా బెంగగా ఉందయ్య దశరథరామయ్యా !  ఈ ఉపద్రవం నుంచి నను వడ్డున పడవేసే భారం నీదే మరి సీతాపతీ!  


కిడ్నాపింగులు, మారువేషాలు, మాయవేషాలు, కప్పగెంతుళ్లు, చాటుమాటు పోట్లు, సూటిపోటి మాటలు, ఆడాళ్ల మీద అవాకులు చెవాకులు, ఆలుమగల మధ్య పొరపొచ్చాలు... ఇలాంటివి నీ కాలంలో మాత్రం లేదా? కాకపోతే, ప్రతి పని వెనకా ఒక పరమార్ధం ఉండేదిలే పరంధామా! ఇప్పుడో? అన్నీ మన్న కుర్చీకోసమే. కుర్చీల చాటునుంచి తవ్వుకున్న డబ్బు మూటలు దాచి


పెట్టుకోవడం కోసమే! ఎవడికి తెలీని రాజకీయాలివి. మెలాగో దారితోచడం లేదు స్వామీ! అయినా బయటపడట తెల్లారితే వైభవంగా పట్టాభిషేకం అయినా పినతల్లి తండ్రి




మాట పోతుందని కట్టుబట్టలతో అడవిదారి పట్టేశావే! మరి మా నేతలో అయ్య పార్ధివ దేహం పంచలో ఉండగానే, అధికారం కోసం సంతకాల ఉద్యమం నడిపించగల సమర్థులు ఇప్పుడవన్నీ అందరికీ తెలిసిన పాతక ధలే కానీ, నీతి నిజాయతీ అంటూ నీకు మాదిరిగా జనాలకు నీతులు చెప్పి అరువు చప్పట్లు కొట్టించుకుంటున్నారే అక్కడొస్తుందయ్యా తేడా! అలాంటివాళ్ల చేతుల్లో మా జీవితాలు చిక్కడిపోతే ఏమైపోతుందో- తలచుకోవడానికే దడగా ఉంది. దేవా!


'నమో నమో' అంటూ దేశం ఘోషెత్తి పోతోందని ఉబ్బి పోకయ్యా రామయ్యా ఆ స్తోత్రపాఠాలన్నీ ప్రస్తుతం ఓ ప్రముఖ నేతవి. నిజం చెప్పాలంటే, ఇవాళ ఏదో నీ జన్మ దినమని, పెళ్ళి రోజు నవమి అనీ నీ నామస్మరణ చేసు కుంటున్నాం గానీ- ఆ పుణ్యఫలం అనే తాయిలం లేకపోతే తలచుకునే తీరిక ఎవరికీ


ఒకప్పుడు కలలో కనిపించి పోతన చేత భాగవతం రాయించగలిగావు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్షమై నీతిమంతమైన జీవితాన్ని గడిపి మానవజాతికి మంచి దారి చూపించిన రామచంద్రుణ్ని నేనే అన్నా వినిపించుకునే శ్రద్ధ ఎంతమందికి ఉందన్నది సందేహమే దశరథనందనా! సీతమ్మ చరిత్ర గురించి అగ్నిదేవుణ్ని ఒప్పించావుకానీ, సామాన్య జనం నోళ్లు మాత్రం మూయించగలి గావా త్రేతాయుగంలోనే నీతినియమాల ఖర్మ అలాగుంటే, ఇక ధర్మం ఒంటికాలిమీద నడిచే కలియుగం మాట చెప్పేదేముంది స్వామి/


ఇప్పుడిక్కడ ఎన్నికల పెద్ద పండగ నడుస్తోంది. ఈ ఉత్సవాల్లో, రాషూ. నీ నామస్మరణ జరిగేది ఏదో పక్కవాడికన్నా వెనకబడకూడదన్న భక్తి ప్రద ర్శన వల్లే ఈ పప్పు బెల్లాలు, పానకాలు పంచుళ్లు, కల్యాణం పేరిట ఆర్భాటపు ఊరేగింపులు పట్టు పీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు నిండిన పక్షాలు నెత్తిమీద పెట్టుకుని కెమెరాల సాక్షిగా కనిపించడాలు- ఎన్నికల్లో ప్రత్యర్థికన్నా నాలుగు ఓట్లు ఎక్కువ రావాలన్న యావతోనే దాశరథీ!


ఏ పని చేసినా నాకు ముందు శ్రీరాముల వారి సహాయము కావలెను అని రాయడం అలవాటు. ఇప్పుడు నిజంగానే నీ సహాయం నాబోటి ఓటు మల్ల య్యలకు ఎంతో అవసరం దయామయా!


రాతిని నాతిగా మార్చిన మహిమ గల దేవుడివి, మళ్ళీ నువ్వు లీల చూపించు! మా నీతిలేని నేతలనందరినీ రాళ్లుగా మార్పు వీలుకాదంటే కనీసం రాళ్లకన్నా బండగా ఉన్న మా ఓటర్ల గుండెల్నిండా చైతన్యం రగిలించు రామయ్యా నీ దయ ఉంటేనే మళ్ళీ వచ్చే అయిదేళ్ల దాకా అయిదు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేది నిండుమనసుతో నీ జన్మదినం, కల్యాణ వేడుకా ఈ అయిదేళ్ల పండగలా జరుపుకోవాలంటే ఓ కోదండరామస్వామీ నీ అండ దండలు మా ఓటర్లకు అవసరం! 8/04/14


-కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక - ( 08 - 04-2014 ) ప్రచురితం) 

ఈనాడు - గల్పిక ప్రపంచానికి పగాకు - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - 21 - 05- 2010 న ప్రచురితం )




 ఈనాడు  - గల్పిక 

ప్రపంచానికి పగాకు 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 21 - 05- 2010 న  ప్రచురితం ) 


చుట్ట బానిసత్వం కట్టు బానిసత్వంకన్నా బలమైనది. ముక్కు పొడుంమహత్తు మీద ఓ కవి ఏకంగా ' నస్య నిషేణము' అనే కావ్యాన్నే రాసేశాడు!

' నీకయి సిగిరెట్టిస్తా- నాకయి శతకమ్ము వ్రాసి నయముగ నిమ్మూ!' అంటే చాలు... ఆ ఖాళీ పెట్టెల వెనకే పద్యం రాసిచ్చే బలహీనత కొందరు కవులది. 


పొగాకు బలహీనత మరింత బలమై నది! సీసాలకు సీస పద్యాలు రాసిపారేసినట్లే, సిగరెట్లకు, ముక్కుపొడికి ముక్త పదగ్రస్తాలూ వదిలే కవులకు ఏ భాషలోనూ కొదవలేదు. 'ఈ సిగరెట్టుతోనే ఆంజనే యుడూ లంకాదహనం చేశాడూ!' అంటూ ఏ రేలంగో పాడినా కామెడీగానే తప్ప సీరియస్ గా ఎవరూ తీసు కోవటం లేదిప్పుడు. 


పొగ తాగటానికి మించిన పెను ప్రమాదం మానవాళిముందు మరోటి లేదని చంటి పిల్లాడూ చటుక్కున చెప్పేస్తున్న రోజులివి...


సునామీవస్తే పోయేది వందలూ వేలే. భూమి విచ్చినా, ఉగ్రవాదులొచ్చి బాంబులు పేల్చినా లక్షల్లోపే గదా ప్రాణనష్టం జరిగేది! అదే ధూమపా నంవల్ల గత శతాబ్దిలోనే పదికోట్ల మంది గాలిలో కలిసిపోయారు. 


ఇదే తరహా కామెడీలు, చిత్ర కవి త్వాలు రాసుకుంటూ కూర్చునుంటే ఈ శతాబ్దం చివరికి చిత్రగుప్తుడి చిట్టాలోకెక్కే పొగ తాగుబోతుల సంఖ్య వందకోట్లకు తక్కువుండదని ప్రపంచ ఆరోగ్య సంస్థే లెక్కలు చెబుతోంది. అయినా లెక్క పెట్టేది లేదని పొగరాయుళ్ళు అంటుంటే ఊరుకుని కూర్చుంటే ఎట్లా? పోయేది ఒక్క పొగతాగేవాళ్ళ ప్రాణాలే కాదు- పక్కనుండే పసిబిడ్డలు, ఆడవారు, వృద్ధులూ, పొగంటే పడనివాళ్ళ ప్రాణాలు కూడా! 


పొగరాయుళ్ళనలా ఊరికే గాలికొదిలేస్తే ఇంకో ఇరవై ఏళ్ళకి ఏడాదికి కనీసం ఎనభైలక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని పర్యావరణ వేత్తలు మొత్తు కుంటున్నారు.


పొగలో ఉండేది ఒక్క నికొటినే కాదు. ఇంకా నాలుగు వేల విష పదార్థాలు. అందులో 60 రకాలు కేన్సర్ కారకాలు! బ్లూమ్ బరీ  బుక్ ఆఫ్ కొటేషన్సులో ఒక్క వాక్యంలోనే పొగాకు మెదడుకీ, కంటికీ, జీర్ణ శ్వాసకోశాలకీ, గుండె, కాలేయానికి, రక్తానికి, శరీరంలోని ముఖ్యంగాలన్నింటికీ, చివరికి తెలివితేటలకీ చేసే శాశ్వతమైన చేటును తేల్చి చెప్పింది. అయినా మనిషికి 'వద్దు '  అన్నదానిమీదే ముద్దు జాస్తి, ఆదాము అవ్వలకాలం నుంచీ నడుస్తున్న కథే కదా ఇది!


నిండు నూరేళ్ళూ పండులాగా బతకమని దీవించి దేవుడు భూమ్మీదకు పంపిస్తే , ఏదో గాలి పట్టినట్లు ఈ పొగాకు సేవను బారినపడి మళ్ళా తొందరగా పైకిపో తాననే మనిషిని ఏమనాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ పాడు అలవాటువల్ల రోజూ నూట యాభైమందికి దినకర్మలు జరుగుతున్నాయి.


విమాన ప్రమాదాలు, రైళ్ళు పట్టాలు తప్పటాలూ, వాహ నాలు గుద్దుకోవటాలూ వంటి వాటివల్ల పోయే ప్రాణాలకు  ఇవి రెట్టింపని డాక్టర్ డి.సి. గుప్తా అంటున్నారు. పొగాకు నియంత్రణకు ఏటా ఇచ్చే లూథర్ టెర్రీ అవార్డు అందుకున్న ఈయన భారతీయుడే. 


పొగాకు భూతం నుంచి జాతిని కాపాడాలంటే ముందుగా చేయవలసింది అన్నిరకాల పొగాకు ఉత్పత్తుల మీద నిర్బంధంగా నిషేధం, కచ్చితమైన చట్టం, నిక్కచ్చిగా అమలుచేసే ధైర్యం, పొగాకు బారిన పడి బైటపడాలనుకునేవారికి సాయం, పొగపడనివారికి రక్షణ... ఏకమొత్తంగా జాతి మొత్తానికి  పొగాకుచేసే హాని గురించి చైతన్యం' అంటున్నారు. 


మలేసియాలో లాగా మనదేశంలో మరీ రెండేళ్ళ పిల్లలూ పొగతాగటం లేదుగానీ... పొగబారిన పడుతున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, పొగపడనివారు సైతం పొగాకు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారంటే అందుకు ప్రధానకారణం- ప్రభుత్వాలు ధూమపానీయులపట్ల కనబరచే ఉదాసీనతే! 


బహిరంగ ప్రదేశాలలో  పొగతాగటం నేరమని చట్టం తెచ్చినా కఠినంగా అమలుచేసే సంకల్పం యంత్రాంగంలో లేకపోవ టమే అసలు లోపం. 


ఒక పొగరాయుడి వ్యాధికి ఏడాదికి ఖర్చయ్యేది రూ.40వేలని అనధికారిక అంచనా.  ఈ లెక్కన ఏడాది మొత్తానికి ఖర్చయ్యే  కోట్లతో దేశంలోని ప్రధాన నగరాలన్నింటా స్త్రీ, శిశు సంబంధ మైన ఆసుపత్రులను దివ్యంగా నడపవచ్చని  డాక్టర్ గుప్తా వాదన.


నూటికి 29 మందికి బహిరంగ ధూమపానం మీద నిషేధం ఉందని తెలియదు . టీవీలల్లో  వచ్చే పొగాకు వ్యతి రేక ప్రకటనలను నూటికి ఒక్కరుమించి పట్టించుకోవటం లేదు. ప్రతి పదిమందిలో ఏడుగురు పురు షులు, అయిదుగురు స్త్రీలు ఏదో ఒకరకంగా పొగాకు అలవాటుకు దాసులు. పొగాకు ఉత్పత్తులు కొనేవారి లోనే కాదు... అమ్మేవారిలోనూ మైనారిటీ తీరని బాలలే అధికం.  అన్నిరకాల బీడీ, చుట్ట, సిగరెట్లు, గుట్కాలు, పాన్ పరాగ్ లు  అన్ని వయసులవారికి అందుబాటులో ఉండే సౌకర్యం ఈ దేశంలో ఉంది. 


పొగలేని పొగాకు పేరుతో ఆకర్షణీయమైన పేకుల్లో సువాసనలు వెదజల్లే గుట్కా, ఖైరీ, జర్దా లాంటి ప్రమాదకర ఉత్పత్తులు రకరకాల పథకాల పేరుతో అందుబాటులో ఉన్నా అడ్డుకునే సామాజిక స్పృహ లేని ప్రజాసంఘాలే ఇక్కడ ఎక్కువ.


నేడు పొగాకు వ్యతిరేక దినం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈసారి స్త్రీలు- బాలల సంక్షేమం దృష్ట్యా పొగాకు ఉత్ప త్తిదారులు వ్యాపార దృక్పథం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ ఒక్కరోజే పొగాకు వద్దు- అనుకోవటం కాదు.. ఏడాదిలోని మూడొందల అయిదురోజులూ అలాగే అనుకునేలా మారాలంటే ముందుగా మార్పు రావాల్సింది పొగరాయుళ్ళ స్వీయ సంకల్పంలోనే.


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సం. పు - 21 -05 -2010 న ప్రచురితం ) 

మూడో చెయ్యి - ఈనాడు- గల్పిక - కథానిక


 ఈనాడు - గల్పిక

మూడో చెయ్యి

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- గల్పిక- 30-06-2002)  


ఒక భక్తుడు అదేపనిగా కూర్చుని తపస్సు చేసేసరికి దేవుడికి ప్రత్యక్షం కాక తప్పలేదు.


 ''ఏమి నీ కోరిక ' అనడిగాడు దేవుడు.


"స్వామీ! నీకు నాలుగు చేతులున్నాయి. నాకు రెండే ! ఒక చెయ్యి నాకియ్యి: '' అని అడిగేశాడా భక్తుడు.


భక్తుల కోర్కెలు తీర్చటం భగవంతుడి ధర్మం కదా! ఒక చెయ్యి దానం చేసి మాయమయ్యాడు దేవుడు. 


" .. అప్పట్నుంచీ ఆ భక్తవంశం వాళ్లకి మూడోచెయ్యి వరంగా వస్తూ ఉంది.. " అన్నాడు సుబ్బారావు.


సుబ్బారావు ఇలాంటి కథలు చెప్పటంలో దిట్టేగాని, ఇప్పుడు సందర్భం ఏమిటో అర్థం కాలేదు. అదే అడిగాను.


" నెల రోజుల్నుండి పెన్షనాఫీసు చుట్టూ తిరుగుతున్నాడు పాపం పురుషోత్తమరావు. నిన్న నేను కూడా వెళ్ళి ఆ మూడో చెయ్యి తడిపితేగాని ఫైలు కదల్లేదు...' అన్నాడు సుబ్బారావు. 


నేనుగా ఎప్పుడూ సుబ్బారావు చెప్పిన ఆ మూడో చెయ్యి ఎక్కడా చూడలేదు.


'' ఆఫీసుకు రాగానే బరువని బల్లకింద పెట్టుకుంటారులే వాళ్లు.  అలాంటివి నీవు చూడలేదు .  కాబట్టే  ఇల్లా  అల్లాటప్పాగాడివిగా రిటైరయిపోయావు'


' పిండంలో అవకతవకల వల్ల రెండు తలలు, మూడు కాళ్లు రెండు ముక్కులూ ఉన్నవాళ్లు పుట్టినట్లు పేపర్లో ఫొటోలు చూశాగానీ, నిజంగా మూడు చేతుల వాళ్లని నేను చూడనేలేదింతవరకు'' అన్నాడు అక్కడే పక్కన కూర్చుని అంతా వింటున్న మా బావమరిది. 


అతను వాళ్ల రెండో అమ్మాయికి  పెళ్ళిసంబంధం కోసం నిన్ననే ఊళ్ళోకొచ్చాడు. 


తెలిసిన వాళ్ళబ్బాయి ఒకతను ఇక్కడే ఏదో సాఫ్ట్ వేర్  కంపెనీలో ఇంజినీరుగా  చేస్తున్నాడని విని చూసివచ్చాడు. 


అతగానికా  సంబంధం అన్ని విధాలా నచ్చినట్లుంది కూడా. నెలకు పాతి కవేలు జీతం . ఎందుకు నచ్చదూ!


'' ఈ మూడో చెయ్యి అలాంటి అవకతవకల బాపతు కాదు లెండి . అందుకే అందరికీ కనిపించదు'' అన్నాడు సుబ్బారావు. 


" రెండు చేతులకే నిండా పనిలేని ఈ రోజుల్లో మూడో చెయ్యెందుకు మహానుభావా! వీపు గోక్కోవటానికి సులభంగా ఉంటుందనా?'' 


" వేళాకోళం వద్దు .  మూడో చెయ్యి మహత్యం గురించి తెలుసా " 


" తెలిసినవాడివి నువ్వు చెప్పరాదా... చెవిలో పువ్వులు పెట్టుక్కూర్చున్నామిక్కడ . వింటాం'' 


ఆ పువ్వులు పెట్టింది నేను కాడు. మూడో చెయ్యే!  ఎ.సి. - థియేటర్లో సినిమా చూస్తుంటే మధ్యలో హఠాత్తుగా ఉక్కపోస్తుంది, ఎందుకూ ? 


' సినిమాలోని సీన్లు చూసి.." 


" కాదు. మనం వాటికెప్పుడో అలవాటు పడిపోయాం. మనమా సినిమాలో లీనమైపోయి ఉండగా, మెల్లగా ఏసీ ఆఫ్ అయిపోతుంది. అట్లా ఆఫ్ చేసేది ఎవరు? మూడో చెయ్యే!  '' 


" నిజమే సుమా!  నేనా విషయం ఎపుడూ ఆలోచించనే


లేదు. ''


" పెద్ద మార్కెట్లో కిలో రెండురూపాయలేనని చంకలు గుద్దుకుంటూ నువ్వు తెచ్చే వంకాయలు అరకిలోనే తూగుతాయని మీ ఆవిడ వంకబెడుతుంది. ఎందుకూ? " మార్కెట్లో తక్కెటనొకవైపు మూడో చెయ్యి నొక్కేస్తుంది. దేవుడి చెయ్యి కనక అది నీకు కనపడదు." 


సుబ్బారావు లాజిక్కు బాగుంది! 


" ఆ పెన్షన్ గుమాస్తా నెలజీతం నాలుగు వేలు దాటదు. మూడు చేతులా సంపాదిస్తున్నాడు.  కాబట్టే  అంత మెహర్బానీ వెలగబెట్టేస్తున్నది . '' అన్నాడు సుబ్బారావు టాపిక్ మార్చి. 


''రెండు చేతులా సంపాదించడం చూశాంగానీ " ఈ మూడో చెయ్యి సంపాదనేమిటో... అర్థం కాలేదే...! " 


'' రెండు చేతుల్తో సంపాదించినదాన్ని ఏ ఫైనాన్స్ కంపె నీలోనో రియలెస్టేట్సులోనో పెట్టి మళ్ళీ సంపాదిస్తే అది మూడో చెయ్యి సంపాదన. '' ఏసీబీ లాంటి  వాళ్ల దగ్గరో  లిస్టుంటుంది. రోజూ పేపర్లో వస్తుంటాయిగా వాళ్ళ పుణ్య గాధలు'' 


" మూడో చెయ్యి దేవుడి చెయ్యన్నావు . మరాచెయ్యి ఒక్కమంచిపనన్నా చెయ్యకుండా ఉంటుందా? '' 


" గుప్తదానాలు చేసేదీ మూడో చేత్తోనే ! అలాంటివీ కలికా లంలో కదాచిత్ గానీ జరగవులే ! దేవుడి హుండీలో లక్ష రూపాయల కట్టలూ, బంగారపు బిస్కెట్లు వేసేదీ మూడో చెయ్యే! మూడో చేత్తో సంపాదించినందుకు, మూడో చెయ్యిచ్చిన వాడికి మూడో చేత్తోనే మూడో కంటికి తెలీకుండా ముడుపులు వేస్తారన్న మాట. " 


స్టేట్మెంట్ కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉంది. 


" అదలా ఉంచు .  ఈ మూడో చెయ్యి థియరీ ఒక్క మనుషులకే వర్తిస్తుందనుకోకు ! ప్రభుత్వాలక్కూడా ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు" 


 '' అదెలాగా? ప్రభుత్వాలు కూడా మూడు చేతులా సంపాదిస్తున్నామంటావా? " 


" కాదు .. ఖర్చు పెడుతున్నాయి." 


సుబ్బారావెప్పుడూ ఇలా తిరకాసుగానే మాట్లాడతాడు.


' ' ఖర్చుకు తగ్గ రాబడి కోసం మూడో చేత్తోనే ప్రజల మాడు పగలగొడతాయి.  చెత్తకుండీ ఒకటి లక్ష రూపాయ లకు కొన్న ప్రభుత్వం చెత్త మీద కచ్చితంగా పన్ను వేయాలనే  చూస్తుంది.  వాటర్ మీటర్ల మీద పెట్టిన ఖర్చును అదనపు టాక్సు వేయకుండా ఎలా బేలన్స్ చేస్తుంది? తుప్పుపట్టిన తుపాకుల్ని, పూడ్చిపెట్టే శవపేటికల్ని పొరపాటున అంత రేటు పెట్టి కొన్నామని నాలుక్కరచుకుని, ఇప్పుడా ఖర్చుని.. ప్రజలే  త్యాగ బుద్ధితో  పంచుకోవాలని జీవో తెస్తుంది. " 


'' ప్రభుత్వాల మూడో చెయ్యి మహత్యం వల్ల ప్రజల్లో త్యాగభావం పెరుగుతుంది. మంచిదేగా'' 


" శభాష్... ఇప్పుడు దారిలో పడుతోంది నీ మెదడు.." 


" శవపేటికల వ్యవహారం తలచుకుంటే, ఫ్యూచర్లో శవాల

మీద కూడా పన్నేస్తారేమోనని వణుకొస్తోంది.. '' 


' మరీ అంతా వణుకవాక!  ముందే పోవాల్సి వస్తుంది. మనలాంటి సామాన్యులం " మరీ అంతా ముందే ఊహించుకో వటం ఒంటికి మంచిది కాదు కూడా " 


'బాగా చెప్పారు' అన్నాడు మా బావమరిది. "రేపు మీతోపాటే నేనూ పెన్షనాపీసుకొస్తున్నాను. పనుంది" అన్నాడు సుబ్బారావుతో  


మా బావమరిది వ్యాపారస్తుడు.  పెన్షనాఫీసులో ఏం పనో కాలేదు! 


నెలకు పాతికవేలొచ్చే సాఫ్ట్ వేరే ఇంజనీర్  సంబంధం కాదను కొని, పెన్షనాఫేసు  గుమాస్తాకిచ్చి పిల్లను కట్టబెడదామనుకొని, ఖాయం చేసుకొచ్చినప్పుడుకాని అర్ధం కాలేదు. . ఆ  పనేంటో ! 


''అదేంట'' ని నేనడిగితే " నెలకు నాలుగు వేలు జీతమైతేనేం..


మూడో చేత్తో కూడా సంపాదిస్తున్నాడు మరి'' అన్నాడు మా

వ్యాపారి బావమరిది . 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- గల్పిక- 30-06-2002)  


ఈనాడు ; హాస్యం : రాకోయీ .. అనుకొని అతిథీ - కర్లపాలెంహనుమంతరావు ( ఈనాడు - సంపాదక పుట- ( 28 -08-2002 ) ప్రచురితం)

 



ఈనాడు ; హాస్యం : 

రాకోయీ .. అనుకొని అతిథీ


- కర్లపాలెంహనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట- ( 28 -08-2002 ) ప్రచురితం) 



'తలుపెంత తట్టినా తీయవేరా? పొద్దెక్కిం దాకా ఏంటా మొద్దునిద్ర....? ' 


'నిద్రా...పాడా... ప్రొద్దున్నుంచీ ఈ తలుపులు తీసీ.. వేసీ ... వేసి.. తీసీ..  అలిసిపోయాన్రా ఆళహరీ! ' 


'ఆదివారం కదా... ఆ మాత్రం విజిటర్సుండరా... విసుక్కుంటే ఎలా? ' భుజం తడుముకొన్నాడు అళహరి. 


వాడీ మధ్య మా కాలనీలో ఇల్లు కట్టిస్తున్నాడు. సలహాలకూ వాటికీ తరుచూ మా ఇంటి తలుపులు తడుతూంటాడు. 


' లింటల్సెంతుంటే  మంచిది... గోడలకే సిమెంటుంటే బాగుంటుంది... బెడ్రూం పక్కన పూజ గదుండొచ్చా.. అంటూ గంటకోసారి పరిగెత్తుకొచ్చేదీ వాడే. 


' వట్టి సలహాలకోసమే కాదులెండి. కాఫీక్కూడా ' అని మా ఆవిడ ఇక్కడ సతాయింపు . 


' మీ ఆవిడ లేదా.. ఏవిట్రా ! ' అని అడగనే అనడిగాడామె అను మానం నిజం చేస్తూ.


'గ్యాసయిపోయిందని బుక్చేసి రెండ్రోజు లయింది. తెచ్చుకోవటానికెళ్ళింది. ' 


' సిలెండర్లు డోర్ డెలివరీగానీ చెయ్య రేమో?' 


' రూలప్రకారమయితే అంతే. కానీ గోడౌన్ కెళితేగాని ఇవ్వటంలేదు. పోస్ట్ మ్యాన్  ఉత్తరాలు డోర్ డెలివరీ చేయాలని రూలు.. వీధిలో పారేసిపోవటంలా... మనమే ఏరు

కుని తెచ్చుకుంటాం... ఇదీ అంతే!' 


ఈ పూటకిక కాఫీ దొరకదని కన్ ఫాం  చేసుకొన్నట్లున్నాడు . నిరాశతో నిట్టూరుస్తూ లేచి నిలబడ్డాడు.


' ఏదో పనిమీదొచ్చిన్నట్లున్నావే?'


' అదేరా.. తలుపులు... కిటికీలు చేయిద్దా మనీ! ఏ రకం చెక్కయితే మంచిదో... ? ' అంటుండగానే తలుపు దబదబ చప్పుడవడం మొదలెట్టింది .


ఇప్పటికిది పొద్దుట్నుంచీ ఐదోసారి! ఆదివారం కదా కాస్త రెస్టు దొరుకుతుందనాశపడితే ఇంట్లో ఉండటమే పెద్ద రొష్టులాగయిపోయింది. 


 విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఖాకీ దుస్తుల్లో నిటారుగా నిలబడ్డ మనిషి 'గుడ్ మార్నింగ్' అని సెల్యూట్ కొట్టగానే .. కొద్దిక్కంగారు పడ్డ మాట నిజం .


 'ఈ మధ్న య మీ ఇంట్లో దొంగలేమన్నా పడ్డారా సార్? ' వస్తువులే మైనా పోయాయా? ఎవరన్నా న్యూసెన్సు చేస్తున్నారా? మామూళ్ల కోసం ఎవరైనా హెరాస్ చేస్తున్నారా? డీటెయిల్సే మైనా   ఉంటే చెప్పండి! కేసు రాసుకుపోతాం' అన్నాడా పోలీసాయన పరమ పొలైట్ గా . 


గన్నుకు బదులు పెన్ను పట్టుకుని పొలైట్ గా మాట్లాడే పోలీసును చూస్తే..  చెప్పొద్దూ..  కాస్త నవ్వొచ్చినమాట నిజం.


ఇంట్లో అప్పుడప్పుడూ నా జేబులు మా ఆవిడ కొట్టేస్తుంటుంది. తరచూ నేను వాడే పెన్నూ, కళ్లజోడు కనపడి చావవు. మావాడు డబ్బుల కోసం చేసే డిమాండు మామూళ్లగోలకన్నా ఎక్కువ. మా అమ్మాయి పెట్టే టీవీ సౌండే పెద్ద న్యూసెన్సు, అలాగని వీళ్లమీద కేసులెలా పెట్టగలనూ! ఏమీ లేవన్నాను. 


' అయితే మళ్ళీ రేపొస్తాను, డెయిలీ డోరెంక్వయిరీస్ కంపల్సరీగా చేయాలని ఆర్డర్స్ ! అంత దూరంనుంచి వస్తాం కదా!... ఏదో మీకు తోచింది...' 


' ఏమీ తోచలేదంటే'  నామీదే కేసు రాసుకుపోగలడు,  పాతిక రూపాయలు చేతిలో పెట్టి సాగనంపాను . పుట్టి బుద్దెరిగి ఏనాడూ పోలీస్టేషన్ గడపెక్కి న పాపాన పోలేదు .  జూలో ఉండాల్సిన పులి వరండాలో తిరుగుతున్నట్లుందా పోలీసాయనున్నంత కాసేపూ.


'ఇంకేం.... కాలనీకింక గూర్ఖా అక్కర్లేదు' అన్నాడు ఆళహరి ఆనందంగా. 


 'ఈ మాటే అనుకుని పక్కకాలనీవాళ్ళు సెక్యూరిటీని తీసేసిన మర్నాడే డేలైట్ రాబరీ జరిగిందిరా చవలాయ్. ఠాణా చుట్టూతా   తిరగలేక ప్రాణాలు హతమారి– పొతున్నాయిప్పుడు . ' 


'రాసుకోటానికి పోలీసాయనున్నాడుగా..' ఇంకా తిరుగుడెందుకురా ? 


' కేసులు రాసుకుపోవటమేట ఈయన డ్యూటీ! తిరుగుడంతా అక్కడే ఉందబ్బీ ! ' అంటూండగానే ఫోన్‌ అదే పనిగా మోగటం మొదలయింది, 


తప్పదు కాబట్టి  రిసీవరెత్తి ' హలో ' అన్నాను. 

'హమ్మయ్య... ఫోను పనిచేస్తుందన్న మాట. కంగ్రాట్యులేషన్స్ సార్.. మీకింకో ఇరవై నాలుగ్గంటల్లో రెండో కనక్షనివ్వబోతున్నాం. ఇన్స్టెలేషన్ ఛార్జెస్ ఇప్పుడు కాదులెండి, రెంటుతో కలిపి బిల్లులో బాదుతాం' అందవతల గొంతు.


' ఉన్న ఒక్క  ఫోనుకే దిక్కులేదు. ట్వంటీఫోర వర్పూ డెడ్! ఎప్పుడైనా ఏక్టివైందంటే క్రాస్ కనెక్షన్సే వస్తాయి. బ్లాంక్ కాల్స్..  బ్లైండ్ బిల్స్... అడగందే రెండోదిచ్చే హక్కు మీకెవరిచ్చారసలు? ' 


'మరి మీ పక్కింటివాళ్లు వాడుకోవాలంటే ద ఎలా సార్? ' 


' వాళ్లకు ఫోనుంది కదయ్యా!'


'అది వాళ్ల పక్కవాళ్లు వాడుకుంటారు కదా.... ! ' 

ఠక్కుమని  ఫోన్ కట్చేసాను.  గుండె దడ. దడా కొట్టుకుంటుంది . 


' ప్రాణాలు పోయేలోపల బీమా అన్నా చేయించుకుంటే కొద్దిగా ధీమాగా ఉంటుంది' అన్నాను దిగులుగా. 


' ఫోన్ కొట్టు! గంటలో ఎల్లయిసీ  ఏజెంటొచ్చి గద్దలా వాలి పోతాడు'


' ఆరోజులు పోయాయి నాయనా! అప్పా యింట్ మెంటుంటేగాని ఏజెంటాఫీసు ముందు క్యూలో కూడా నిలబడనివ్వటం లేదు. అంత డిమాండుగా  ఉంది ఏజెంట్ల పని! 


మళ్లీ తలుపు మోదుతున్న చప్పుళ్లు! 


తలుపులెంత మోగుతున్నా తీయదలుచుకోలేదు  . 


కిటికీలోనుండి కేకేస్తున్నారీ  సారి. 


 'సారీ' కిటికీలు మూయటం మర్చిపో యాను అన్నాడు అళహరి.


తలుపులూ... కిటికీలు మూసి మీరు కరెంటు బిల్లుల్నాపలేరంటూ మీటరువంక మెడెత్తి కూడా చూడకుండానే చేతిలోని మిషన్ మీట నొక్కి 'ఛక్ ' మని బిల్లు తీసి చేతిలో  పెట్టేసాడీ సాడిస్టు  కరెంటాయన. ' ఇప్పుడే కడితే ఫైనుండదు. వాటర్ బిల్, వృత్తి పన్ను.. ప్రాపర్టీ టాక్స్ గట్రా  కూడా కలక్ట్ చేసుకుంటాం. కాకపోతే  క్యూ ఎవాయిడ్ చేసినందుకు కొద్దిగా కమీపనవుద్ది.. సింగిల్ డోర్ సిస్టం  ' అన్నాడా పెద్ద మనిషిపళ్లికిలిస్తూ .  


తప్పేదేముంది అతన్నలా  పంపించి తలు పేసుకొనే లోపే గడపదగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 


దేవుడు మాట్లాడలేడు కనుక దేవుడి తరపున వచ్చిన   ఏజెంటు తగులుకున్నాడు. 


'ఈ మధ్య బొత్తిగా గుడివైపు రావటమే మానుకొన్నట్లున్నావు మానవా! తీరికలేని నీబోటి భక్తుల చేరిక కోసమే గడప గడపకీ దేవుడి గుడి' పథకం పెట్టి బండిలో భగవంతుడు బజా రులో ఊరేగుతున్నాడు. ప్రతి జీవికీ ఇంటి దగ్గరే పుణ్యం ప్రసాదించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం . ' పట్టు'  అంటూ నుదుటికి నామం .. చేతిలో పొట్లం పెట్టి..  హుండీ డబ్బా  గల గలలాడించాడు. 


పాతిక రూపాయలు మహానైవేద్యం! ...


దైవదర్శనంతో గుండె బరువెక్కినట్లుంది. అళహరి కాఫీ తాగకుండానే వైరాగ్యంతో బైలుదేరాడు . 


ఇంకా ఉంటే... ఇంకే ఇన్‌ కమ్ టేక్సు వాళ్లో , కాలనీ రౌడీలో, ఇంటి పంచలోనే పాఠాలు చెబుతామని పంతుళ్లు,  గుమ్మం ముందే సన్మానాలు చేస్తామని ఏ సాంస్కృతిక సంఘంవాళ్లో  వస్తారని బెంగట్టున్నాడు .


ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయాలని  అన్ని శాఖల మంత్రులూ... అలా పోటీలుపడి మరీ డోర్డెలివరీ స్కీములు జనం మీద రుద్దేస్తున్నారు.  ఎన్నికలయిందాకాఈ తాకిడి తప్పేట్లు లేదు . తట్టుకోవాలి మరి.


'ఈ తలనొప్పంతా ఎందుకు? మా ఇంటి కసలు తలుపులూ, కిటీకీవా  పెట్టించ కుండా ఉంటే పోలా! ...లేకపోతే నేనూ నీకు మల్లేనే ' రాకోయి.. అనుకోని అతిథీ!  అంటు నిషాదంగా పాడుకునే విషమ పరిస్థితులు తగలొచ్చు ' అంటూ అళహరి అటు వెళ్ళాడో..  లేదో ఎవరో.  తలుపులు బాదుతున్న చప్పుడు డి. జె. సాండులో! 


మళ్ళీ కిటికీగుండా చూస్తే ఎక్సైజ్ డిపార్ట్ మెంటువాళ్ల వ్యాను వాకిట్లో ఆగివుంది. తలుపు  తీశా.  గుప్పుమని మందు వాసన! 


'గడప  గడపకి బాటిల్స్ సప్లై చేసే ప్రోగ్రాము సార్...! అంటున్నాడతను చేతిలోని సీసా  చూపిస్తూ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట- ( 28 -08-2002 ) ప్రచురితం) 


ఈనాడు: హాస్యం : కొంపలు కూల్చే పని - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదక పుట - ( 16 -07 - 2004 ) - ప్రచురితం )




 ఈనాడు: హాస్యం : 

కొంపలు కూల్చే పని 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట - ( 16 -07 - 2004 ) - ప్రచురితం ) 


పాతికేళ్ల కిందట వాళ్ల తాతకట్టిన డాబా ఇల్లు చీకిపోయి ఎప్పుడెవరిమీద పడు తుందో తెలీకుండా ఉందని... దాన్ని పడ గొట్టించి.. కొత్తది కట్టుకోవాలని అదేదో కన్స్ట్రక్షన్ కంపెనీని కన్సల్ట్ చేసిన గుర్నాథం... కట్టేదానికన్నా... పడగొట్టేదా నికి ఎక్కువగా అడుగుతున్నారని నా దగ్గ రికొచ్చి వాపోయాడు. 


సుబ్బారాయుడు కొడుకు ఈమధ్య ఇలాంటి కొంపలు కూల్చే పనులే ఏవో చేస్తున్నాడని చూచాయగా తెలిసి తీసుకెళ్లా . 


అంతా విని... 'ఓస్ అంతేనా!' అన్నాడు ఆ అబ్బాయి. పేరు ఆంజనేయు లనుకుంటా . 


కంపెనీ పేరు మాత్రం వింతగా ఉంది 'శ్రీ ఆంజనేయా డిస్ట్రక్షన్  నలిమిటెడ్! 


 "ఇదేం పేరోయ్! ? కన్స్ట్రక్షన్కి వ్యతిరేక పదమా? "


'అవునంకుల్... మాది పూర్తిగా కూల్చే పని.  బెర్లిన్ గోడ కూల్చిన సిండికేట్లో

మాకూ పైసా  వాటా ఉంది. '


' కట్టినవే  దిక్కూ దివాణం లేకుండా పడున్నాయి భూతగృహాలకు మల్లే!   కూలిస్తే కూలి డబ్బులైనా రావనుకుంటున్నామే! లాభాలొస్తాయని నీకెట్లా తోచిందో! '


'చూడడంకుల్!  ఈ పోటీ ప్రపం చంలో ఏదైనా కొత్తగా ఆలోచించి, ముందుగా ఆచరణలో పెట్టేవాడే అధి కంగా లాభాలు పొందేది. అందరూ నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని కూల్చే పనిచేపడితే ఎలాగుంటుందన్న ఉల్టా ఆలోచన నుంచే మా డిస్ట్రక్షన్  కంపెనీ పుట్టుకొచ్చింది' 


' చూస్తూ చూస్తూ ఎవరైనా కొంపల్ని ఎందుకు కూల్చుకుంటారోయ్? ' 


' ఎందుక్కూలుకోరు. ఇప్పుడీ గుర్నా ధం అంకుల్ కూల్చుకోవటంలా...! వాస్తు వద్దంటే కూల్చుకొనే వాళ్ళు 'మస్తు' న్నారంకుల్! అలాంటివాళ్ళకి సలహాలిచ్చే స్టాండింగ్ పండితులను కమీషన్ బేసిస్ మీద మేమే అప్పాయింట్ చేసుకుం టుంటాం. ఇంటిని కూల్చాల్సిన ముందుగా గుర్తించి వెనకనే ఇలాంటి

పండితుల్ని పంపించటానికో ప్రత్యేక శాఖ మరోటి వుంది. కొత్త ఇంటిని కట్టుకోటానికి పాత ఇంటిని కూల్చుకొనేవారూ కొంద కుంటారు. అలాంటి ప్రొఫెషనల్ జాబ్స్‌కు మాత్రం ఉచితంగా సేవచేసి పెడతాం.' 


' ఊరికే చేస్తే మీకు గిట్టుబాటవు తుంది?' 


( కూల్చిన తరువాతొచ్చే తుక్కును తీసు కుంటాం. ఒక్కోసారి ఎంతో ఖరీదైన కలప, ఫర్నిచర్ దొరుకుతుంది. బంగార బ్బిస్కట్లు లాంటివి దొరికినా మావే.... | . '


' ఏ ఎముకలో... ఆస్తి పంజరాలో బైటపడితే?"


' మరీ మంచిది. బెదిరించి డబ్బు రాబట్టటానికిదో ఛాన్సు! ఇలాంటివన్నీ చూసుకొనేందుకింకో సపరేట్ డిపార్ట్ మెంటే ఉంది లెండి మా దగ్గర.. ' అని అతగాడంటుంటే ఇండియాను కూడా ఇలాగే ఎలాగో అమెరికాకు అమ్మేస్తా డేమో... అమ్మ సుబ్బారాయుడు కొడకా!" అనిపించింది.


' ఒక్కోసారి అధికారులకే అనధికారికంగా నిర్మాణాలు కూల్చేయాల్సి రావచ్చు. బీమా సొమ్ము కోసం ఆశపడేవాళ్లూ ఇలాంటి పనులు చేస్తుంటారు. చెప్పకూడ దుగానీ... ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్.  ఇంతకీ ఈ గుర్నాథం  అంకుల్ ఇల్లు పడగొట్టించె య్యాలి... అంతేగదా! కట్టడం కష్టంకానీ... కూల్చటం ఎంతసేపు! '  ... అంటూ 


' పేపర్లో వాతావరణ సూచన చూశారా?' అనడిగాడు.


' చూశాం... ఇరవై నాలుగ్గంటలు పొడి గాలులు వీస్తాయి | అన్నాడు గుర్నాథం .


' మంచిది... అంటే రాత్రికి రైన్‌  ఖాయమన్నమాట! అంకుల్ .. మీరు వెజ్జా... నాన్ వెజ్జా?' 


' నాన్ వెజ్జే ' 


' అయితే మధ్యాహ్నానికి మంచి మటన్ కర్రీనో .. చికెన్ బిర్యానీనో చేసుకు తినే యండి! బొమికలు... బొచ్చు గోడకవతల పారేయండి. పోండి.. రెండు రోజుల్లో కాణీ ఖర్చు లేకుండా మీ ఇల్లు పడగొట్టించే పూచీ నాది... పాతిక పర్సంట్ కమీషనిప్పిస్తానంటే ఎదురు డబ్బు కూడా వచ్చిపడే ఏర్పాటు నే చేయిస్తా' ... అని అతగాడంటుంటే అంతా అయోమయం అని పించిందా క్షణంలో.


తెల్లారకుండానే గుర్నాధం ఇంటి ముందు గుంపు పోగయింది. 


రాత్రి వర్షా నికి వాడింటి పెరటిగోడ కూలిందట. పల్లపు వీధి పుల్లయ్య మేక దాని కింద పడి నలిగిపోయిందని జనంగోల! 


నష్టప రిహారం కింద మినిమం పాతికవేలన్నా కావాలని అల్లరి! గుర్నాథం  ఏ అయిదు వేలకో బేరం కుదుర్చుకొనే హడావుడిలో ఉంటే ఎక్కడ నుంచొచ్చాడో... ఆంజనే యులు 'ఒక్క పైసా ఇచ్చేదిలేదు పొమ్మ' ని  అడ్డం పడిపోయాడు.


రాస్తారోకో - మొదలయింది. 


పోలీసు లొచ్చి లారీఛార్జీ చేశారు. 

ఆందోళన పెరిగి జనం రాళ్లేయటం మొదలు పెట్టారు. 

కలెక్టరుగారొచ్చి బాధితులకు న్యాయం చేకూరేలా చేస్తానన్నారు.  

గాయపడినవాళ్లకి తలో పదివేలు.. మేకలాయనకి ఓ పాతికవేలు అప్పటికప్పుడిచ్చి... గుర్నాథం  ఇంటిని కూలదోస్తేగాని ఆందోళన విరమించేదిలేదని పట్టుపట్టారు. 


ఇటిక ముక్క తీస్తే  కోర్టుకెళతామని గుర్నాథం తరుపున ఆంజనేయులు వీరంగం వేస్తున్నాడు. 


ఎమ్మెల్యేగారొచ్చి  నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ చేస్తామని, ఏకసభ్య కమీషనూ ఏర్పాటుచేస్తామనీ అంతవరకూ అడ్ హాక్ రిలీఫ్ కింద బాధితులకు

తలో వెయ్యి రూపాయలు, మేక అసామీకి  ఐదువేలు, ఇల్లు కూలగొట్టేందుకు ఒప్పుకున్నందుకు గుర్నాథానికి  లక్ష రూపాయలు అప్పటికప్పుడు ఇప్పించేశాడు.


సమస్య శాంతియుతంగా పరిష్కారమై పోయినందుకు అంతా సంతోషం. 

 కొంప కూల గొట్టే పని ఆంజనేయులు కంపెనీకే అప్పగించింది ప్రభుత్వం.


శాంతిభద్రతల సమస్యను సమర్ధవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తూ సబ్ ఇన్స్పెక్టర్ కు  సర్కిల్ ఇన్స్పెక్టర్ గా  ప్రమోషనూ వచ్చింది. 


ఇంటి డిజైన్లో లోపముందని నిజనిర్ధారణ కమిటీ నిర్ణయం చేస్తే, ఏకసభ్య కమీషన్ గోడ నిర్మాణంలోనే తేడా వుందని తేల్చి చెప్పింది. 


గోడ మీది పిల్లిలా ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేసేందుకు రెండు కమిటీల కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది.


గుర్నాధం కాణీ ఖర్చులేకుండా ఇల్లు పడగొట్టించుకోవటమేకాదు... కొత్తిల్లు కట్టుకోవటానికి లక్ష రూపాయలు సంపా దించాడు. 


ఆంజనేయులికి కూల్చే కాంట్రా క్టుతోపాటు... పాతిక పర్సెంట్ కమీషనూ దక్కింది. 


కూల్చివేతకూ కూల్చివేతకూ  మధ్య కూలీల చేత ఇలా గోల చేయించి పైసలు రాబట్టడం కంపెనీ టెక్నిక్ ట్ ! 


గోల చేసిన జనంచేతే కూలగొ ట్టించటం చేత కూలీ కలిసొచ్చింది. 

ప్రమోషనొచ్చిన పోలీసాయన ఆంజనే యులు బావైతే, ఏకసభ్య కమీషనుకు ఈమధ్యనే జడ్జిగా రిటైరైన ఆంజనేయులు మామగారు చైర్ పర్సనయ్యాడు. 


కొంపలు కూల్చటంలో ఇన్ని లాభాలున్నా యనుకొంటే లక్షలుపోసి మా వాడినిలా సివిలింజనీరింగ్ కోసం అమెరికా పంపిం చకపోదునే; ఆ వెధవక్కడ ఏ పెట్రోలు బంకులోనో పనిచేయకపోదునే...' అని ఉస్సూరుమంది నా ప్రాణం. 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట - ( 16 -07 - 2004 ) - ప్రచురితం ) 

ఈనాడు - వ్యంగ్యం వెర్రి వెయ్యి రకాలు ( ఈనాడు - గల్పిక- 02- 02 - 2009 - ప్రచురితం )

 


ఈనాడు - వ్యంగ్యం

వెర్రి వెయ్యి రకాలు

ఈనాడు - గల్పిక- 02- 02 - 2009 - ప్రచురితం ) 

 



ఈనాడు - వ్యంగ్యం 

వెర్రి వెయ్యి రకాలు 

( ఈనాడు - గల్పిక- 02- 02 - 2009 - ప్రచురితం ) 



వెర్రి వెయ్యిరకాలని ఏదో ప్రాస కోసం అన్నారేమో అనుకున్నాంగానీ సత్యం అసత్యమంత 'సత్యం' రా  అబ్బాయ్! కోట్లు మింగినా రామలింగ రాజునింకా పిచ్చిమారాజేనని పిచ్చిగా నమ్ముతున్నాం. అశోకచక్రం మీద 'సత్యమేవ జయతే 'అని రాసుంది మనరాజుగారి కోసమేనని బుకాయిస్తున్నాం. భూగోళం మీద మూడొంతులు నీళ్లుండబట్టి బతికిపోయాంగానీ ఆ జాగాలో కూడా మనలాంటి జనాలే ఉండుంటే వెర్రి వెయ్యికి వెయ్యిం తలయ్యుండేదని భయంగా ఉందిరా బాబూ!'


'ఎన్నింటికని భయపడతావ్ బాబాయ్ ? పిన్ని కని భయపడతావా, బాసుకని భయపడతావా, బస్టాండ్లో ఖాళీ సూటుకేసుకొని భయపడతావా? ఉల్లిపాయ పాయ పదిరూపాయలై పాయె- ధరలు నీ బీపీలాగా పెరిగినందుకు భయపడతావా? భూముల బూము పడిపోయిందని భయపడ తావా? ఏసీబీ దాడులకు, ఏసిడ్ దాడులకు దేనికని భయపడతావ్? రైళ్లు పడిపోతున్నాయి, ఆనకట్టలు తెగిపోతున్నాయి. ఆకలిచావులు కట్నం చావుల మాదిరి అదిరిపోతున్నాయి. నీళ్లు దొరకని వాడలో మందు నీళ్లలా పారుతోంది. సంక్షేమ సంబంధాలంటున్నారు. జైళ్లే క్షేమంగా లేవు. చదవ కుండానే సర్టిఫికెట్లు పుడుతున్నాయి, చదువుకున్నా ళ్లకు ఉద్యోగాలూడుతున్నాయి. మీటరు మీద ఎక్కు వ అడగని ఆటోవాడేలేడు నేడు. స్టాక్ మార్కెట్లా నువ్విట్లా మాటిమాటికీ కుప్పకూలిపోతుంటే ఎట్లా బాబాయ్? అమెరికానుంచీ అమలాపురందాకా అంతా మార్పు మార్పు' అంటూ గగ్గోలు పెడుతు న్నారే! నువ్వింకా మారకపోతే ఎట్లా బాబాయ్? '


'ఏం మార్పురా అబ్బాయ్! పంట పొలాలను పరి శ్రమల కింద మారుస్తున్నారు. పునర్విభజన అని భజనగాళ్లను మారుస్తున్నారు. దాదాగిరిని గాంధీగిరిగా పేరు మార్చేశారు. అంగీల మాదిరి పార్టీలను మారుస్తున్నారు. మ్యానిఫెస్టోలను మారుస్తున్నారు. నిమిషనిమిషానికి మాటలు మారుస్తున్నారు. ఏ మార్పూ లేనిది ఏతావాతా గీతలో చెప్పినట్టు ఒకటి ఆత్మ, రెండు ఆత్మగౌరవ నినాదం . ఈ రెండూ ఖండిం చలేనివి. కాలనివి, తేలనివి, ఎండనివీ, వండనివీ కనకనే కదా! 


మారెప్పలాగా ఊరకే నోరు పారేసుకుంటే ఎలా బాబాయ్ ?... ఎన్నికల మీద మన నమ్మకం మారిందా? ప్రభుత్వమంటే మనమింకా ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్' అనే అనుకుం టున్నామా లేదా?


' నిజమేరా నాయనా! ' బై ది పీపుల్'  అన్నారని జనాన్ని కొంటున్నాము. వట్టి చేతుల్లో వస్తే ఒబా మానైనా ఓడిస్తాం మనం. అందులో ఏ మార్పూ లేదు. పొత్తులని చెప్పి సినిమా హాలు సీట్లలో మాదిరి వరుసగా కూర్చుంటున్నారే మన అధినేతలు! అదీ మారలేదు. ఏ ఒక్క అమ్మని, అక్కనీ వచ్చే ఎన్నికలనాటికి లక్షాధికారిని చేయకుండా వది లేది లేదని సీఎం ఆనవాయితీ తప్పకుండా హామీ ఇచ్చేస్తున్నట్లుగా- వందకు చిల్లర దొరకటం లేదుగానీ, చిల్లర హామీలు, మాత్రం వందలొందలు దొరుకుతు న్నాయి. వివాహాలైపోయాయి. ఇప్పుడు సామూహికంగా సీమంతాలూ చేయాలని ఉబలాటపడుతున్నాయి పార్టీలు. చంద్రమండలం మీద ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, కప్పల పెళ్లిళ్లాయినా  చేసి వానలు కురిపిస్తామనీ గొప్పలు చెప్పేస్తున్నాయి. గబ్బర్సింగ్ షోలే  మాదిరి ఎక్కడ చూసినా రోడ్డుషోలేనాయ! తిట్టుకోటం, కొట్టుకోటం, దిష్టిబొమ్మలు తగలెట్టు కోటం. . ఆనక తీరిగ్గా దిష్టి తీయటం. ఏమీ మారలేదురా బాబూ! రాజకీయాలు రింగురోడ్డులా అలా మెలికలు తిరుగుతూనే ఉన్నాయి. పార్టీలు పిచ్చాసుపత్రులాగా మారుతున్నాయి. ఈ మాత్రం నిజం కనుక్కోటానికి ఏ నార్కో ఎనాలిసిస్ టెస్టూ  అక్కర్లేదురా అచ్చీ! ఓటర్ని ఏ తిన్నడో, తిమ్మనో, తిక్కనో అనుకుంటే పప్పులో కాలేసినట్లే! కోర్టులో అబద్ధం చెప్పేముందు గీత మీద ప్రమాణం చేస్తే చెయ్యచ్చు. తీసిన కథనే మళ్లామళ్లా తీసినా విసుగు లేకుండా వందసార్లు చూసి చప్పట్లు కొట్టేయచ్చు . నీళ్లు పెట్రోలు అయిందంటే బక్కెట్లు పట్టుకుని పరిగెట్టెయ్యచ్చు. వినాయకుడు పాలు మింగాడంటే నాయకుడు కదా మింగకుండా ఎలా ఉంటాడులే అని అమాయకంగా అనుకోవచ్చు. కానీ, ఎన్నికలప్పుడు మాత్రం వాడు చాణక్యుడి తమ్ముడురా బాబు! ఎక్కడైనా బావా అంటే ముద్దే కానీ  వంగ తోట  దగ్గర మాత్రం బావా అనద్దు' అనే బాపతు. వెన్న నుంచైనా సరే వెంట్రుకలాగేస్తాడు. వాడి నాడి కనుక్కోటం, మిడతంభొట్లు జాతకం చెప్పటం ఒకటే. ఈ ఆకలియుగంలో ఆ కడుపు మండినవాడే దేవుడి పదకొండో అవతారం. అందుకే కదా అంతటి ఒబామా కూడా ' దేవుడా... సహకరించు' అని మొత్తుకున్నాడు! మన నేలమీద బాబా విగ్రహా లైనా కళ్లు తెరుస్తాయిగానీ, మన నాయకులు మాత్రం ఎన్నటికీ తెరవరు. 


అందుకేనేమో బాబాయ్ "  అందరూ వెర్రి వెయ్యి విధాలంటున్నది  బాబాయ్!.. పిన్ని పిలుస్తూ ఉంది. పొద్దున్నే టిఫిన్ చెయ్యలేదా ఏందీ? అదీ సంగతి. తిని బీపీ మాత్ర వేసుకొని వస్తే..  మళ్లా కూర్చుందాం! లే !  పదా! ' 


- కర్లపాలెం హనుమంతరావు 

 ( ఈనాడు - గల్పిక- 02- 02 - 2009- ప్రచురితం  ) 

అవినీతికి అందలం - ఈనాడు - గల్పిక- హాస్యం- వ్యంగ్యం

 




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

అవినీతికి అందలం ! 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్టిక - 06 -08 - 2011 ' ప్రచురితం > 



పాండవుల రాజ్యం కాజేయటానికి కౌరవులు మొదట్లోనే పెద్దయుద్ధం వేశారా ఏందిరా? మాయా  పాచికలతోనే కదా    యావత్తూ మంత్రాంగం  నడిపించిందీ! 


ముక్కుసూటిగా పోతే ముక్కు పచ్చడి కావటం ఖాయం . కట్నం ఇంత కావాలని పెళ్లికి ముందే చేరానికి దిగావనుకో ఆదో పెద్ద నేరు. అదే మూడుముళ్ల పడనీ. . ముడి ఎంత బిగిస్తే లాంఛ నాలంత బిగువుగా కాళ్ల మీదకొచ్చి పడతాయి.


దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఎవరైనా  చేసే పనేరా అబ్బాయ్! దీపాలు ఆర్పి  చీకట్లో చక్కబెట్టుకోవడం తెలివైనవాళ్లు చేసే పని. ప్రభుత్వాసుపత్రిలో పెద్ద వైద్యుడివైనంత మాత్రాన ఏం లాభం? చికిత్స  కోరివచ్చిన వాడికి నీ ప్రైవేటు క్లినిక్ చిరునామా ఇస్తేనేగదా- రోగికి ఆరోగ్యం.. నీకు మహాభాగ్యం!


నేతిబీరకాయ నీతులెవడికి కావాలిరా బాబూ ! మంచివాడనే చెడ్డపేరు తప్ప సాధించేదేమన్నా ఉందా! అనొచ్చునో లేదో.. ప్రభుత్వ కార్యాలయాల్లో తలుపు దగ్గర బల్ల వేసుకుని కూర్చునే బిళ్ల బంట్రోతూ నేరుగా పదీ పరకా అడగడు. చాయ్ పానీకని చేతులు చాపుతాడు. పదో.. పాతికో పడకపోతే నీ ఫిర్యాదు చివరికి చేరేది చెత్తబుట్టలోకే ! 


నువ్వు మనసుపడిన అమ్మాయి దగ్గరకు నేరుగా పోయి ప్రేమిస్తున్నానంటే- మనసులో ఎంత ఇష్టమున్నా బెట్టుచేస్తుంది. అదే ఏ పుట్టిన రోజునో ప్రేమికుల రోజునో  ఓ వంక పెట్టుకుని మాంఛి ఖరీదైన ఉంగరం సమర్పించుకు న్నావనుకో... ఇక నీది పూలదారే!'


అలౌకిక వ్యవహారాల్లోనే మతలబులు ఇన్నుంటే ... ఇంక లౌకిక కర్మకాండల్లో ఎన్ని పరోక్ష పురాణాలుంటాయిరా బాబూ! పెద్దాళ్ల పిల్లలు ఏ మాదకద్రవ్యాల కేసుల్లోనో,  ప్రేమ గొడవల్లోనో పడి నేరాలు చేస్తే పోలీసువారేం చేస్తారు? దారినపోయే ఏ కుంటి సత్యం బాబునో లాక్కొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా? చెప్పొచ్చేదేమిటంటే- అన్ని పనులూ ప్రత్య క్షంగా చేసుకుంటూ పోవాలంటే లోకం అల్లకల్లోలం అయిపోతుంది. లోకశాంతికోసం లోపాయికారీగా ఏవో తమ పనులు తాము చేసుకునే నేతలను ఇలా ప్రత్యక్షంగా కోర్టులకు లాగడమే ఏం బావోలేదు. జైళ్లకు పంపాలనుకోవడం అంత సబబుగా లేదు.


పరీక్షగా చూడు. పరోక్షంగా సాగని వ్యవహా రాలు సృష్టి మొత్తంలో ఒకటో రెండో తప్ప ఉండవు.  నైవేద్య కైంకర్యమప్పుడే దేవుడికీ  భక్తు

లకూ మధ్య తెర కడతారు. నడి బజార్లో గుడ్డ పేర్చుకొని  అడుక్కునే వాడు నిజంగానే గుడ్డివాడా అని అనుమానించే పరిస్థితులు ఇప్పుడు దాపురించాయి. అదే... కళ్ళు పత్తికాయల్లాగా  ఉన్నవాడు గుడి మెట్లమీద పడి పొర్లి పొల్లి  దండాలు పెడుతుంటే భక్తులలో దాత్నత్వ గుణం  పొంగిపొర్లిపోతుంది. లోకం తీరే ఇంత.  డొంక తిరుగుడుగా మారినప్పుడు-  వ్యవహారాలలో లోపాయికారీతనం పెరగకుండా ఉంటుందా? తప్పు మనదా, తంటాలు పడే.. వాళ్లదా... చెప్పు! 


లంచాలు నేరం. లాంఛనాలు, చదివింపులు, చందాలు, విరాళాలు, సన్మానాలూ, సత్కారాలు అయితే ఘనం- అని జనం భావిస్తున్నారు . కనకనే వ్యాపారాలు చేసుకొనేవారు... పాపం... అలా పాపాలకు పాల్పడాల్సి వస్తోంది. 


బోడి రెండొందల కోట్ల చిల్లర నోట్లకోసం.... పాపం... కరుణానిధి కూతురు అలా టీవీ ఛానలూ, అప్పులూ అంటూ తిప్పలు పడిందా లేదా ? నాలుగు ఐదు  వందల కోట్లు వెనకేసుకోవడానికి అంత భారీయెత్తున అంతర్జాతీయ క్రీడలంటూ కల్మాడీ లాంటి కిలాడీలు ఆటలాడాలా? నవ్వుతూ తుళ్లుతూ తిరిగేవాడు. పాపం... మతిమరుపు రోగమని ఎంతకాలం నాటకాలాడగలడు... చెప్పు! 


 భక్త జనాలకు మోక్షమార్గం చూపించాలని తాపత్రయ పడే నిత్యానందులవంటి ఆధ్యాత్మికవాదులూ మిధ్యామార్గాలు ఎంచుకోవాల్సి వచ్చింది! ఎంపీలకు ఏవో లాడ్స్ అంటూ ముష్టి ఐదేసి  కోట్లు వంతున  పంచుతున్నారు. ఒక్కసారి ఎన్నికల్లో నెగ్గుకుని రావాలంటే ఎన్నేసి కోట్లు మద్యంలా పారించాలో  మనందరికీ ఎరికే! 


కోట్లు గడించిపెట్టే వ్యాపారాలను ఎంతో రిస్కు తీసుకుని వెళ్లాం బిడ్డల కప్పచెప్పి పేరస పెట్టి రాజకీయ రంగంలోకి  రావడం పార్లమెంటు హాలు బెంచీ మీద  గుర్రు కొట్టి నిద్రపోవడానికా?  ఖర్చు పెట్టినదానికి అంతకు అంతా ఏదో విధంగా వెనక్కి రాబట్టుకోలేని పక్షంలో  మళ్లీ ఎన్నికల్లో నిలబడాలన్నప్పుడు టికెట్టుకీ, జనాలు కోరే సవాలక్ష కోరికలకూ సొమ్ము ఏ గనులనుంచి తవ్వుకు  రావాలి? 


కాంట్రాక్టులు, గనులు, భూములు, సెజ్జులు , పర్మిట్లు, పథకాల నిధులూ... అన్నీ నియమ నిబంధనల ప్రకారమే పంపకాలు వేయించటానికైతే పొలిటికల్ ఎంట్రీనే ఎందుకు? చేతులు గట్రా  కాల్చుకోవడానికి స్టాక్ మార్కెట్లు చాలకా ? 


సంపాదించేదంతా వాళ్లొక్కళ్లే మూటకట్టి   వెంటేసుకు  పోవడానికి కాదుగదా! ఏ అణుఒప్పందం బిల్లులాం టిదో పీకలమీదకొచ్చి పడితే.. ఆదుకోవడానికి మళ్లీ కావాల్సింది.. నల్లదో... తెల్లదో... వాళ్ల దగ్గరున్న  ధనమే గదా! అలా ఇవ్వడానికి ఇలా ఏదో తంటాలు పడి సంపాదిస్తుంటే అదే పెద్ద నేరమా?!


పోనీ- ఓ ఇంతని.... ఖర్చుచేసినదానికైనా పన్ను రాయితీలు కల్పించమనండి! ఎన్నికల్లో వాడిన సొమ్మంతా అధికారికమైనదే అని చట్టం తెమ్మనండి! గ్యాసుకీ, బియ్యానికీ, పిల్లల ఫీజులకీ, సంక్షేమ పథకాలకీ, బ్యాంకు రుణాల్లాంటి వాటిలో రాయితీలు ఇస్తున్నట్లే - ఎన్నికల వ్యయానికి ఇంతని ప్రభుత్వాన్నే సమకూర్చి ఇమ్మనండి! నల్లధనం గోలే ఉండదు. దొంగ వ్యాపారాలన్న చెడ్డ పేరుండదు. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నదంతా చక్కగా ఇక్కడే చక్రవడ్డీకి తిప్పుకోనిస్తే.. ఎవరైనా ఆ హసన్ అలీలాంటి గుర్రాలవాళ్లను నమ్ముతారా? 


న్యాయస్థానాలతో ఈ చీవాట్లేమిటి? గిట్టనప్పుడు ప్రభుత్వాలతో సీబీఐ విచారణలేమిటి?


పరోక్ష పన్నులున్నంతకాలం పరోక్షంగా జరిగే ఇలాంటి పనులను ఏ బ్రహ్మదేవుడూ ఆపలేడు. రాజకీయపక్షాలకే పరోక్ష అజెండాలున్నాయి. పార్టీలలోని సభ్యులే దూకబోయే పార్టీకి పరోక్షంగా మద్దతిస్తున్నారు. పోలీసులకు సల్వాజుడుంలాంటి పరోక్ష వ్యవస్థలుండగా లేనిది.. వ్యాపారాల్లో పరోక్ష వ్యాపారులుంటే తప్పేంటి? పరోక్ష లావాదేవీలకు ప్రత్యక్ష బాధ్యుణ్ని చేసి యువనేతల్లాంటి నవతరాన్ని వేధించడం జాతి ప్రగతికే నష్టం. ఆనక మీ ఇష్టం . 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్టిక - 06 -08 - 2011 ' ప్రచురితం > 




ఓటేసి రావాలి! - ఈనాడు- గల్పిక- హాస్యం - వ్యంగ్యం

 




ఈనాడు - గల్టిక- వ్యంగ్యం - హాస్యం 

ఓటేసి రావాలి ! 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 22 - 04 - 2009 న ప్రచురితం ) 


ఏం వాయ్..  మైడియర్ వెంకటేశం!.. మొహం అలా వేలాడేశావ్? మొదటి దశలోనే మీ పార్టీ చీదేసిందేమిటీ? అనా! ఫర్వాలేదు లేవోయ్! మార్చి పోతే మరో అవకాశం ఉన్నట్లు... రెండో దశలో పుంజు కూతపెట్టవచ్చు లేవోయ్ ! రేపు పోలింగు డేనే గదా! బెడ్ కాఫీ గట్రా లాగించేసి పొలోమని పోలింగు బూత్  కు పదవాయ్! యాక్సిడెంటయి కూడా చిన్న ఎన్టీఆర్ బెడ్ మీద నుంచొచ్చే ఓటేసి పోయాడు. టీవీలో చూశా! దటీజ్ ది స్పిరిట్... ఓటేసి ఉద్దరిస్తావని ఆఫీసుకు సెలవిస్తే నువ్విలా ఓటుకే సెలవిచ్చేస్తానంటే ఎలా బోయ్! బేడ్... వెరీ బేడ్!


వ్వాట్? క్రికెట్ మేచుందా? అయామ్ షాక్డ్  మైబాయ్! దిసీజ్ గ్రాస్ ఇన్ గ్రాటిట్యూడ్ . వందేళ్ళు మన నేతలు ఈ ఓటు రైటు కోసమే గదోయ్ ఇంగ్లీషోళ్లని ఫట్ ఫట్లాడించేసింది! సీఈసీగా ఆ గోపాలస్వామి సారు ఆ మజ్జెన ఏమన్నాడో విన్లా? ఐపీయల్ మేచిలిక్కడ ఆడుకుంటామంటే 'ఠాఠ్‌... మామేచులు మాకున్నాయ్... కుదరుగాక కుదరు ఫోపొమ్మన్లా ?


ఏడాదేడాది వచ్చిపోయే ఉగాది గట్రాలను గ్రాండుగా చేసుకుంటావూ!... దివాలీకి టపాసులూ, టైంబాంబులూ అంటూ హడావుడి చేసేస్తావూ... జన వరి ఫస్టాస్తే ఎక్కడెక్కడి వాళ్ల వెంటబడీ 'విష్ యూ హ్యాపీ న్యూయియర్' అంటూ చెప్పేస్తుంటావు.... అయిదేళ్లకోసారొచ్చే ఈ ఎలక్షన్ పండగ మాత్రం దండగా? ఎవడొచ్చి చచ్చినా ఉద్దరించి చచ్చేదేంలేదని వాదనా? దేర్ యూవార్ రాంగ్ యంగ్ మేన్!


రాయిని రాయితో కొట్టి నిప్పుని రాబట్టిన ఘటికులం మనం. ఈక పెన్నుల కోసం ఈకలు పీకుతుంటే పిట్టలు చచ్చిపోతున్నాయని రాయటం మానేశామా మేన్? బాల్ పెన్ను  కనుక్కోలేదూ? థామసాల్వా ఎడిసన్ ఇరవై మూడు సార్లు ఫెయిలయిం తరువాతే ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కొన్నాడు! నీ యేజికి యావరేజిన రోజుకు పదమూడు సార్లు పడీపడీ నవ్వాలి న్యాయంగా . మరెం దుకిలా డీలాపడి ఉన్నావ్ పూర్ మేన్ ?


రోజూ తిరిగే రోడ్లు రొచ్చుగా ఉన్నాయంటావ్. రోజు మార్చి రోజైనా ట్యాపుల్లో వాటర్ రావటం లేదని గోల పెడుతుంటావ్! గంట గంటకీ కరెంటు కోతలు తప్పటం లేదని ఏడుస్తుంటావ్! మన దరిద్రంలాగానే ధరలూ అంతకంతకూ పెరగటమే గానీ... తరిగేది లేదని గగ్గోలు పెడుతుంటావ్! గవర్నమెంటాఫీసుల్లో పనులు నత్తలతో పోటీ పడుతున్నాయంటూ ఏ టీవీ వాడో మూతిముందు మైకు పెట్టేస్తే- మైకం కమ్మినాడికి మల్లే మాట్లాడేస్తుంటావ్! మన బతుకుల్ని నవ్వులపాలు చేసినవాడి భరతం పట్టేందుకు, ఓటేసి రారా కన్నా! అంటే, మెట్టవేదాంతం చెప్పేస్తున్నావ్! ఎన్ని కల్నీ చదువుకున్న కుర్రాళ్ళంతా ఇంతీజీగా తీసుకోబట్టే ... రాజకీయాలీ రోజు ఓ ఉల్లిపాయ వ్యాపారంలాగా మారిపోయాయ్ మైబోయ్! 


నేనొకణ్నే వెళ్ళి ఓటేసొస్తే స్వర్ణయుగం వచ్చేస్తుందా అని డౌటా! పదితలల రావణుణ్ని రాముడు అడవిలో తిరిగేటప్పుడే గదబోయ్ కొట్టిందీ ! కృష్ణుడు ఒంటి వేలుతో గోవర్ధనగిరినెత్తాడు. ధైర్యముంటే మనకు మనమే దేవుళ్ళం. మనిషి తలచుకుంటే నాలుగేంటి .. నలభై నాలుగు చేతులు మొలుచుకొస్తాయి. విశ్వరూపం చూపించేందుకు నువ్వు విష్ణుమూర్తివే కానక్కర్లేదు మై డియర్ వెంకటేశం! మనం కూడా చేయగలమన్న విశ్వాసం ఉంటే చాలు... బోయ్! డబ్బుల కట్టలు, క్రికెట్ కిట్లు, సారా పేకెట్లంటూ ఏ కనికట్టైనా సరే చేసి గెలవాలనుకొనే మాయగాళ్ళ ఆట కట్టించాలంటే ముందు ఆయుధాన్ని ఆ బద్ధకమనే జమ్మిచెట్టు మీద నుంచి  దించాలి. అందాకా ఈ గోగ్రహణాలు... భూగ్రహణాలు... నిర్విఘ్నంగా ఇలా సాగుతూనే ఉంటాయి. -ఈ పాయింట్ గుర్తుంచుకో!


ఒంట్లో బాగోకపోతే ఇంట్లో దేవుడిపటం ముందు మొక్కుకుంటూ

మాత్రమే కూర్చుంటావా? ఓ మంచి మాత్ర కూడా వేసుకుంటావా? డీలా పడిన డెమోక్రసీకి ఒక మంచి మందు మైబోయ్ 'ఓటు' ! ధాన్యం దేహానికెలా మేలుచేస్తుందో 'ఓటు' దేశానికంతలా  మేలు చేస్తుంది.


వేడిగా ఉందని 'కోడి' కూయటం మానేస్తుందా? కోడికూస్తే ఎలా మేలుకొలుపో... ఓటువేస్తే అలాగే మేలుకు గెలుపు!  పడతానని భయమున్నా చిన్నప్పుడు సైకిలు నేర్చుకోవటం మానేశావా? కాపలావాడు కొడతాడని తెలిసీ జామకాయల కోసం చెట్లెక్కటం ఆపేశావా? కిలో బంగారం ఇస్తా మంటే టీవీవాళ్ళకు ఎన్నెన్ని ఎన్సెమ్మెస్సులైనా ఓపికగా చేస్తావే! ... బంగారం లాంటి భవిష్యత్తు కోసం ఓ పది నిమిషాలు ఓపికచేసుకుని బూతుకెళ్ళటానికింత లావు  గీతోపదేశం కావాలా బోయ్!


ఓటేయటానికేమన్నా కత్తులతో కలబడాలా? కంటిచూపులతో కాల్చిపారేయాలా? తొడగొట్టి మీసాలు మెలిపెట్టాలా? నిప్పులమీద నడవమన్నట్లు, ఒంటిపూట ఉపవాసం ఉండమన్నట్లూ ఒంటిమీద కిరోసిను వంచుకోమ న్నట్లూ అలా సణగటమంతవసరమా మైపూర్ మేన్ ?


లియోనార్డో డావిన్సీ ఒకచేత్తో బొమ్మేస్తూ ఇంకోచేత్తో రాసేవాడట. మర్రి రమేష్ కళ్ళగంతలు కట్టుకుని తిరుమల ఘాటురోడ్డు మలుపులో వేగంగా బైకు నడుపుతాడట. కోడిరామ్మూర్తి గుండెల మీద ఏనుగుని ఎక్కించుకుని తొక్కించుకునేవాడట. నిన్నలాంటి చిత్రమైన ఫీట్లేమన్నా చేయమని ఎవరన్నా అడిగారా? ఊరికే వెళ్ళి ఓటేయటం ఊరికి ఉపకారమా మేన్?


రోజుకు రెండువేల కిలోల చిల్లర దుమ్మూ ధూళీ భూమ్మీదొచ్చి పడి పోతున్నదని ఓ శాస్త్రవేత్త సిద్ధాంతం. మనదగ్గర ఎన్నికలప్పుడు ఇది రెట్టిం పుంటుందేమోనని మేధావులు భయం. ఆకాశాన్ని చూసిలా భయపడటాన్ని ఆస్ట్రో ఫోబియా అన్నట్లే... రాజకీయాల్ని చూసి నీలా భయపడటాన్ని 'రాస్ట్రోఫోబియా' అంటే బాగుంటుందేమో మై డియర్ వెంకటేశం! పిల్లి అరవై అంతస్తుల మీద నుంచీ పడితే బతికే అవకాశం కన్నా ఆరంతస్తుల ఎత్తుమీంచి పడితే బతికే ఛాన్సు తక్కువట! పడిపోతున్నానన్న స్పృహ పిల్లికి ఆలస్యంగా కలగటమే అసలు కారణం. చదువుకున్న నువ్వు పిల్లివైతే కాదుగా! వెళ్ళి ఓటేసిరా! పౌరసత్వం ఉంటే సరా... పోరుతత్వం ఉండొద్దూ డియర్ వెంకటేశం?


అసలు నన్నడిగితే పోలింగ్ నాడు వేలికి చుక్కో గీలో లేనివాడిని ప్రాచీన గ్రీసుదేశంలో మాదిరి ఏదో ఒకటి చేయాలి. అక్కడ అప్పట్లో ఓటు వేయని నీబోటి వాడికి పిల్లనిచ్చేవాళ్ళు కాదటమరి... తస్మాత్ జాగ్రత్త!


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 22 - 04 - 2009 న ప్రచురితం ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...