Saturday, December 4, 2021

ఈనాడు ; హాస్యం : రాకోయీ .. అనుకొని అతిథీ - కర్లపాలెంహనుమంతరావు ( ఈనాడు - సంపాదక పుట- ( 28 -08-2002 ) ప్రచురితం)

 



ఈనాడు ; హాస్యం : 

రాకోయీ .. అనుకొని అతిథీ


- కర్లపాలెంహనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట- ( 28 -08-2002 ) ప్రచురితం) 



'తలుపెంత తట్టినా తీయవేరా? పొద్దెక్కిం దాకా ఏంటా మొద్దునిద్ర....? ' 


'నిద్రా...పాడా... ప్రొద్దున్నుంచీ ఈ తలుపులు తీసీ.. వేసీ ... వేసి.. తీసీ..  అలిసిపోయాన్రా ఆళహరీ! ' 


'ఆదివారం కదా... ఆ మాత్రం విజిటర్సుండరా... విసుక్కుంటే ఎలా? ' భుజం తడుముకొన్నాడు అళహరి. 


వాడీ మధ్య మా కాలనీలో ఇల్లు కట్టిస్తున్నాడు. సలహాలకూ వాటికీ తరుచూ మా ఇంటి తలుపులు తడుతూంటాడు. 


' లింటల్సెంతుంటే  మంచిది... గోడలకే సిమెంటుంటే బాగుంటుంది... బెడ్రూం పక్కన పూజ గదుండొచ్చా.. అంటూ గంటకోసారి పరిగెత్తుకొచ్చేదీ వాడే. 


' వట్టి సలహాలకోసమే కాదులెండి. కాఫీక్కూడా ' అని మా ఆవిడ ఇక్కడ సతాయింపు . 


' మీ ఆవిడ లేదా.. ఏవిట్రా ! ' అని అడగనే అనడిగాడామె అను మానం నిజం చేస్తూ.


'గ్యాసయిపోయిందని బుక్చేసి రెండ్రోజు లయింది. తెచ్చుకోవటానికెళ్ళింది. ' 


' సిలెండర్లు డోర్ డెలివరీగానీ చెయ్య రేమో?' 


' రూలప్రకారమయితే అంతే. కానీ గోడౌన్ కెళితేగాని ఇవ్వటంలేదు. పోస్ట్ మ్యాన్  ఉత్తరాలు డోర్ డెలివరీ చేయాలని రూలు.. వీధిలో పారేసిపోవటంలా... మనమే ఏరు

కుని తెచ్చుకుంటాం... ఇదీ అంతే!' 


ఈ పూటకిక కాఫీ దొరకదని కన్ ఫాం  చేసుకొన్నట్లున్నాడు . నిరాశతో నిట్టూరుస్తూ లేచి నిలబడ్డాడు.


' ఏదో పనిమీదొచ్చిన్నట్లున్నావే?'


' అదేరా.. తలుపులు... కిటికీలు చేయిద్దా మనీ! ఏ రకం చెక్కయితే మంచిదో... ? ' అంటుండగానే తలుపు దబదబ చప్పుడవడం మొదలెట్టింది .


ఇప్పటికిది పొద్దుట్నుంచీ ఐదోసారి! ఆదివారం కదా కాస్త రెస్టు దొరుకుతుందనాశపడితే ఇంట్లో ఉండటమే పెద్ద రొష్టులాగయిపోయింది. 


 విసుక్కుంటూ వెళ్ళి తలుపు తీశాను. ఖాకీ దుస్తుల్లో నిటారుగా నిలబడ్డ మనిషి 'గుడ్ మార్నింగ్' అని సెల్యూట్ కొట్టగానే .. కొద్దిక్కంగారు పడ్డ మాట నిజం .


 'ఈ మధ్న య మీ ఇంట్లో దొంగలేమన్నా పడ్డారా సార్? ' వస్తువులే మైనా పోయాయా? ఎవరన్నా న్యూసెన్సు చేస్తున్నారా? మామూళ్ల కోసం ఎవరైనా హెరాస్ చేస్తున్నారా? డీటెయిల్సే మైనా   ఉంటే చెప్పండి! కేసు రాసుకుపోతాం' అన్నాడా పోలీసాయన పరమ పొలైట్ గా . 


గన్నుకు బదులు పెన్ను పట్టుకుని పొలైట్ గా మాట్లాడే పోలీసును చూస్తే..  చెప్పొద్దూ..  కాస్త నవ్వొచ్చినమాట నిజం.


ఇంట్లో అప్పుడప్పుడూ నా జేబులు మా ఆవిడ కొట్టేస్తుంటుంది. తరచూ నేను వాడే పెన్నూ, కళ్లజోడు కనపడి చావవు. మావాడు డబ్బుల కోసం చేసే డిమాండు మామూళ్లగోలకన్నా ఎక్కువ. మా అమ్మాయి పెట్టే టీవీ సౌండే పెద్ద న్యూసెన్సు, అలాగని వీళ్లమీద కేసులెలా పెట్టగలనూ! ఏమీ లేవన్నాను. 


' అయితే మళ్ళీ రేపొస్తాను, డెయిలీ డోరెంక్వయిరీస్ కంపల్సరీగా చేయాలని ఆర్డర్స్ ! అంత దూరంనుంచి వస్తాం కదా!... ఏదో మీకు తోచింది...' 


' ఏమీ తోచలేదంటే'  నామీదే కేసు రాసుకుపోగలడు,  పాతిక రూపాయలు చేతిలో పెట్టి సాగనంపాను . పుట్టి బుద్దెరిగి ఏనాడూ పోలీస్టేషన్ గడపెక్కి న పాపాన పోలేదు .  జూలో ఉండాల్సిన పులి వరండాలో తిరుగుతున్నట్లుందా పోలీసాయనున్నంత కాసేపూ.


'ఇంకేం.... కాలనీకింక గూర్ఖా అక్కర్లేదు' అన్నాడు ఆళహరి ఆనందంగా. 


 'ఈ మాటే అనుకుని పక్కకాలనీవాళ్ళు సెక్యూరిటీని తీసేసిన మర్నాడే డేలైట్ రాబరీ జరిగిందిరా చవలాయ్. ఠాణా చుట్టూతా   తిరగలేక ప్రాణాలు హతమారి– పొతున్నాయిప్పుడు . ' 


'రాసుకోటానికి పోలీసాయనున్నాడుగా..' ఇంకా తిరుగుడెందుకురా ? 


' కేసులు రాసుకుపోవటమేట ఈయన డ్యూటీ! తిరుగుడంతా అక్కడే ఉందబ్బీ ! ' అంటూండగానే ఫోన్‌ అదే పనిగా మోగటం మొదలయింది, 


తప్పదు కాబట్టి  రిసీవరెత్తి ' హలో ' అన్నాను. 

'హమ్మయ్య... ఫోను పనిచేస్తుందన్న మాట. కంగ్రాట్యులేషన్స్ సార్.. మీకింకో ఇరవై నాలుగ్గంటల్లో రెండో కనక్షనివ్వబోతున్నాం. ఇన్స్టెలేషన్ ఛార్జెస్ ఇప్పుడు కాదులెండి, రెంటుతో కలిపి బిల్లులో బాదుతాం' అందవతల గొంతు.


' ఉన్న ఒక్క  ఫోనుకే దిక్కులేదు. ట్వంటీఫోర వర్పూ డెడ్! ఎప్పుడైనా ఏక్టివైందంటే క్రాస్ కనెక్షన్సే వస్తాయి. బ్లాంక్ కాల్స్..  బ్లైండ్ బిల్స్... అడగందే రెండోదిచ్చే హక్కు మీకెవరిచ్చారసలు? ' 


'మరి మీ పక్కింటివాళ్లు వాడుకోవాలంటే ద ఎలా సార్? ' 


' వాళ్లకు ఫోనుంది కదయ్యా!'


'అది వాళ్ల పక్కవాళ్లు వాడుకుంటారు కదా.... ! ' 

ఠక్కుమని  ఫోన్ కట్చేసాను.  గుండె దడ. దడా కొట్టుకుంటుంది . 


' ప్రాణాలు పోయేలోపల బీమా అన్నా చేయించుకుంటే కొద్దిగా ధీమాగా ఉంటుంది' అన్నాను దిగులుగా. 


' ఫోన్ కొట్టు! గంటలో ఎల్లయిసీ  ఏజెంటొచ్చి గద్దలా వాలి పోతాడు'


' ఆరోజులు పోయాయి నాయనా! అప్పా యింట్ మెంటుంటేగాని ఏజెంటాఫీసు ముందు క్యూలో కూడా నిలబడనివ్వటం లేదు. అంత డిమాండుగా  ఉంది ఏజెంట్ల పని! 


మళ్లీ తలుపు మోదుతున్న చప్పుళ్లు! 


తలుపులెంత మోగుతున్నా తీయదలుచుకోలేదు  . 


కిటికీలోనుండి కేకేస్తున్నారీ  సారి. 


 'సారీ' కిటికీలు మూయటం మర్చిపో యాను అన్నాడు అళహరి.


తలుపులూ... కిటికీలు మూసి మీరు కరెంటు బిల్లుల్నాపలేరంటూ మీటరువంక మెడెత్తి కూడా చూడకుండానే చేతిలోని మిషన్ మీట నొక్కి 'ఛక్ ' మని బిల్లు తీసి చేతిలో  పెట్టేసాడీ సాడిస్టు  కరెంటాయన. ' ఇప్పుడే కడితే ఫైనుండదు. వాటర్ బిల్, వృత్తి పన్ను.. ప్రాపర్టీ టాక్స్ గట్రా  కూడా కలక్ట్ చేసుకుంటాం. కాకపోతే  క్యూ ఎవాయిడ్ చేసినందుకు కొద్దిగా కమీపనవుద్ది.. సింగిల్ డోర్ సిస్టం  ' అన్నాడా పెద్ద మనిషిపళ్లికిలిస్తూ .  


తప్పేదేముంది అతన్నలా  పంపించి తలు పేసుకొనే లోపే గడపదగ్గర దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 


దేవుడు మాట్లాడలేడు కనుక దేవుడి తరపున వచ్చిన   ఏజెంటు తగులుకున్నాడు. 


'ఈ మధ్య బొత్తిగా గుడివైపు రావటమే మానుకొన్నట్లున్నావు మానవా! తీరికలేని నీబోటి భక్తుల చేరిక కోసమే గడప గడపకీ దేవుడి గుడి' పథకం పెట్టి బండిలో భగవంతుడు బజా రులో ఊరేగుతున్నాడు. ప్రతి జీవికీ ఇంటి దగ్గరే పుణ్యం ప్రసాదించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం . ' పట్టు'  అంటూ నుదుటికి నామం .. చేతిలో పొట్లం పెట్టి..  హుండీ డబ్బా  గల గలలాడించాడు. 


పాతిక రూపాయలు మహానైవేద్యం! ...


దైవదర్శనంతో గుండె బరువెక్కినట్లుంది. అళహరి కాఫీ తాగకుండానే వైరాగ్యంతో బైలుదేరాడు . 


ఇంకా ఉంటే... ఇంకే ఇన్‌ కమ్ టేక్సు వాళ్లో , కాలనీ రౌడీలో, ఇంటి పంచలోనే పాఠాలు చెబుతామని పంతుళ్లు,  గుమ్మం ముందే సన్మానాలు చేస్తామని ఏ సాంస్కృతిక సంఘంవాళ్లో  వస్తారని బెంగట్టున్నాడు .


ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయాలని  అన్ని శాఖల మంత్రులూ... అలా పోటీలుపడి మరీ డోర్డెలివరీ స్కీములు జనం మీద రుద్దేస్తున్నారు.  ఎన్నికలయిందాకాఈ తాకిడి తప్పేట్లు లేదు . తట్టుకోవాలి మరి.


'ఈ తలనొప్పంతా ఎందుకు? మా ఇంటి కసలు తలుపులూ, కిటీకీవా  పెట్టించ కుండా ఉంటే పోలా! ...లేకపోతే నేనూ నీకు మల్లేనే ' రాకోయి.. అనుకోని అతిథీ!  అంటు నిషాదంగా పాడుకునే విషమ పరిస్థితులు తగలొచ్చు ' అంటూ అళహరి అటు వెళ్ళాడో..  లేదో ఎవరో.  తలుపులు బాదుతున్న చప్పుడు డి. జె. సాండులో! 


మళ్ళీ కిటికీగుండా చూస్తే ఎక్సైజ్ డిపార్ట్ మెంటువాళ్ల వ్యాను వాకిట్లో ఆగివుంది. తలుపు  తీశా.  గుప్పుమని మందు వాసన! 


'గడప  గడపకి బాటిల్స్ సప్లై చేసే ప్రోగ్రాము సార్...! అంటున్నాడతను చేతిలోని సీసా  చూపిస్తూ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట- ( 28 -08-2002 ) ప్రచురితం) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...