ఈనాడు - వ్యంగ్యం
వెర్రి వెయ్యి రకాలు
( ఈనాడు - గల్పిక- 02- 02 - 2009 - ప్రచురితం )
ఈనాడు - వ్యంగ్యం
వెర్రి వెయ్యి రకాలు
( ఈనాడు - గల్పిక- 02- 02 - 2009 - ప్రచురితం )
వెర్రి వెయ్యిరకాలని ఏదో ప్రాస కోసం అన్నారేమో అనుకున్నాంగానీ సత్యం అసత్యమంత 'సత్యం' రా అబ్బాయ్! కోట్లు మింగినా రామలింగ రాజునింకా పిచ్చిమారాజేనని పిచ్చిగా నమ్ముతున్నాం. అశోకచక్రం మీద 'సత్యమేవ జయతే 'అని రాసుంది మనరాజుగారి కోసమేనని బుకాయిస్తున్నాం. భూగోళం మీద మూడొంతులు నీళ్లుండబట్టి బతికిపోయాంగానీ ఆ జాగాలో కూడా మనలాంటి జనాలే ఉండుంటే వెర్రి వెయ్యికి వెయ్యిం తలయ్యుండేదని భయంగా ఉందిరా బాబూ!'
'ఎన్నింటికని భయపడతావ్ బాబాయ్ ? పిన్ని కని భయపడతావా, బాసుకని భయపడతావా, బస్టాండ్లో ఖాళీ సూటుకేసుకొని భయపడతావా? ఉల్లిపాయ పాయ పదిరూపాయలై పాయె- ధరలు నీ బీపీలాగా పెరిగినందుకు భయపడతావా? భూముల బూము పడిపోయిందని భయపడ తావా? ఏసీబీ దాడులకు, ఏసిడ్ దాడులకు దేనికని భయపడతావ్? రైళ్లు పడిపోతున్నాయి, ఆనకట్టలు తెగిపోతున్నాయి. ఆకలిచావులు కట్నం చావుల మాదిరి అదిరిపోతున్నాయి. నీళ్లు దొరకని వాడలో మందు నీళ్లలా పారుతోంది. సంక్షేమ సంబంధాలంటున్నారు. జైళ్లే క్షేమంగా లేవు. చదవ కుండానే సర్టిఫికెట్లు పుడుతున్నాయి, చదువుకున్నా ళ్లకు ఉద్యోగాలూడుతున్నాయి. మీటరు మీద ఎక్కు వ అడగని ఆటోవాడేలేడు నేడు. స్టాక్ మార్కెట్లా నువ్విట్లా మాటిమాటికీ కుప్పకూలిపోతుంటే ఎట్లా బాబాయ్? అమెరికానుంచీ అమలాపురందాకా అంతా మార్పు మార్పు' అంటూ గగ్గోలు పెడుతు న్నారే! నువ్వింకా మారకపోతే ఎట్లా బాబాయ్? '
'ఏం మార్పురా అబ్బాయ్! పంట పొలాలను పరి శ్రమల కింద మారుస్తున్నారు. పునర్విభజన అని భజనగాళ్లను మారుస్తున్నారు. దాదాగిరిని గాంధీగిరిగా పేరు మార్చేశారు. అంగీల మాదిరి పార్టీలను మారుస్తున్నారు. మ్యానిఫెస్టోలను మారుస్తున్నారు. నిమిషనిమిషానికి మాటలు మారుస్తున్నారు. ఏ మార్పూ లేనిది ఏతావాతా గీతలో చెప్పినట్టు ఒకటి ఆత్మ, రెండు ఆత్మగౌరవ నినాదం . ఈ రెండూ ఖండిం చలేనివి. కాలనివి, తేలనివి, ఎండనివీ, వండనివీ కనకనే కదా!
మారెప్పలాగా ఊరకే నోరు పారేసుకుంటే ఎలా బాబాయ్ ?... ఎన్నికల మీద మన నమ్మకం మారిందా? ప్రభుత్వమంటే మనమింకా ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్, బై ది పీపుల్' అనే అనుకుం టున్నామా లేదా?
' నిజమేరా నాయనా! ' బై ది పీపుల్' అన్నారని జనాన్ని కొంటున్నాము. వట్టి చేతుల్లో వస్తే ఒబా మానైనా ఓడిస్తాం మనం. అందులో ఏ మార్పూ లేదు. పొత్తులని చెప్పి సినిమా హాలు సీట్లలో మాదిరి వరుసగా కూర్చుంటున్నారే మన అధినేతలు! అదీ మారలేదు. ఏ ఒక్క అమ్మని, అక్కనీ వచ్చే ఎన్నికలనాటికి లక్షాధికారిని చేయకుండా వది లేది లేదని సీఎం ఆనవాయితీ తప్పకుండా హామీ ఇచ్చేస్తున్నట్లుగా- వందకు చిల్లర దొరకటం లేదుగానీ, చిల్లర హామీలు, మాత్రం వందలొందలు దొరుకుతు న్నాయి. వివాహాలైపోయాయి. ఇప్పుడు సామూహికంగా సీమంతాలూ చేయాలని ఉబలాటపడుతున్నాయి పార్టీలు. చంద్రమండలం మీద ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని, కప్పల పెళ్లిళ్లాయినా చేసి వానలు కురిపిస్తామనీ గొప్పలు చెప్పేస్తున్నాయి. గబ్బర్సింగ్ షోలే మాదిరి ఎక్కడ చూసినా రోడ్డుషోలేనాయ! తిట్టుకోటం, కొట్టుకోటం, దిష్టిబొమ్మలు తగలెట్టు కోటం. . ఆనక తీరిగ్గా దిష్టి తీయటం. ఏమీ మారలేదురా బాబూ! రాజకీయాలు రింగురోడ్డులా అలా మెలికలు తిరుగుతూనే ఉన్నాయి. పార్టీలు పిచ్చాసుపత్రులాగా మారుతున్నాయి. ఈ మాత్రం నిజం కనుక్కోటానికి ఏ నార్కో ఎనాలిసిస్ టెస్టూ అక్కర్లేదురా అచ్చీ! ఓటర్ని ఏ తిన్నడో, తిమ్మనో, తిక్కనో అనుకుంటే పప్పులో కాలేసినట్లే! కోర్టులో అబద్ధం చెప్పేముందు గీత మీద ప్రమాణం చేస్తే చెయ్యచ్చు. తీసిన కథనే మళ్లామళ్లా తీసినా విసుగు లేకుండా వందసార్లు చూసి చప్పట్లు కొట్టేయచ్చు . నీళ్లు పెట్రోలు అయిందంటే బక్కెట్లు పట్టుకుని పరిగెట్టెయ్యచ్చు. వినాయకుడు పాలు మింగాడంటే నాయకుడు కదా మింగకుండా ఎలా ఉంటాడులే అని అమాయకంగా అనుకోవచ్చు. కానీ, ఎన్నికలప్పుడు మాత్రం వాడు చాణక్యుడి తమ్ముడురా బాబు! ఎక్కడైనా బావా అంటే ముద్దే కానీ వంగ తోట దగ్గర మాత్రం బావా అనద్దు' అనే బాపతు. వెన్న నుంచైనా సరే వెంట్రుకలాగేస్తాడు. వాడి నాడి కనుక్కోటం, మిడతంభొట్లు జాతకం చెప్పటం ఒకటే. ఈ ఆకలియుగంలో ఆ కడుపు మండినవాడే దేవుడి పదకొండో అవతారం. అందుకే కదా అంతటి ఒబామా కూడా ' దేవుడా... సహకరించు' అని మొత్తుకున్నాడు! మన నేలమీద బాబా విగ్రహా లైనా కళ్లు తెరుస్తాయిగానీ, మన నాయకులు మాత్రం ఎన్నటికీ తెరవరు.
అందుకేనేమో బాబాయ్ " అందరూ వెర్రి వెయ్యి విధాలంటున్నది బాబాయ్!.. పిన్ని పిలుస్తూ ఉంది. పొద్దున్నే టిఫిన్ చెయ్యలేదా ఏందీ? అదీ సంగతి. తిని బీపీ మాత్ర వేసుకొని వస్తే.. మళ్లా కూర్చుందాం! లే ! పదా! '
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 02- 02 - 2009- ప్రచురితం )
No comments:
Post a Comment