Saturday, December 4, 2021

మూడో చెయ్యి - ఈనాడు- గల్పిక - కథానిక


 ఈనాడు - గల్పిక

మూడో చెయ్యి

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు- గల్పిక- 30-06-2002)  


ఒక భక్తుడు అదేపనిగా కూర్చుని తపస్సు చేసేసరికి దేవుడికి ప్రత్యక్షం కాక తప్పలేదు.


 ''ఏమి నీ కోరిక ' అనడిగాడు దేవుడు.


"స్వామీ! నీకు నాలుగు చేతులున్నాయి. నాకు రెండే ! ఒక చెయ్యి నాకియ్యి: '' అని అడిగేశాడా భక్తుడు.


భక్తుల కోర్కెలు తీర్చటం భగవంతుడి ధర్మం కదా! ఒక చెయ్యి దానం చేసి మాయమయ్యాడు దేవుడు. 


" .. అప్పట్నుంచీ ఆ భక్తవంశం వాళ్లకి మూడోచెయ్యి వరంగా వస్తూ ఉంది.. " అన్నాడు సుబ్బారావు.


సుబ్బారావు ఇలాంటి కథలు చెప్పటంలో దిట్టేగాని, ఇప్పుడు సందర్భం ఏమిటో అర్థం కాలేదు. అదే అడిగాను.


" నెల రోజుల్నుండి పెన్షనాఫీసు చుట్టూ తిరుగుతున్నాడు పాపం పురుషోత్తమరావు. నిన్న నేను కూడా వెళ్ళి ఆ మూడో చెయ్యి తడిపితేగాని ఫైలు కదల్లేదు...' అన్నాడు సుబ్బారావు. 


నేనుగా ఎప్పుడూ సుబ్బారావు చెప్పిన ఆ మూడో చెయ్యి ఎక్కడా చూడలేదు.


'' ఆఫీసుకు రాగానే బరువని బల్లకింద పెట్టుకుంటారులే వాళ్లు.  అలాంటివి నీవు చూడలేదు .  కాబట్టే  ఇల్లా  అల్లాటప్పాగాడివిగా రిటైరయిపోయావు'


' పిండంలో అవకతవకల వల్ల రెండు తలలు, మూడు కాళ్లు రెండు ముక్కులూ ఉన్నవాళ్లు పుట్టినట్లు పేపర్లో ఫొటోలు చూశాగానీ, నిజంగా మూడు చేతుల వాళ్లని నేను చూడనేలేదింతవరకు'' అన్నాడు అక్కడే పక్కన కూర్చుని అంతా వింటున్న మా బావమరిది. 


అతను వాళ్ల రెండో అమ్మాయికి  పెళ్ళిసంబంధం కోసం నిన్ననే ఊళ్ళోకొచ్చాడు. 


తెలిసిన వాళ్ళబ్బాయి ఒకతను ఇక్కడే ఏదో సాఫ్ట్ వేర్  కంపెనీలో ఇంజినీరుగా  చేస్తున్నాడని విని చూసివచ్చాడు. 


అతగానికా  సంబంధం అన్ని విధాలా నచ్చినట్లుంది కూడా. నెలకు పాతి కవేలు జీతం . ఎందుకు నచ్చదూ!


'' ఈ మూడో చెయ్యి అలాంటి అవకతవకల బాపతు కాదు లెండి . అందుకే అందరికీ కనిపించదు'' అన్నాడు సుబ్బారావు. 


" రెండు చేతులకే నిండా పనిలేని ఈ రోజుల్లో మూడో చెయ్యెందుకు మహానుభావా! వీపు గోక్కోవటానికి సులభంగా ఉంటుందనా?'' 


" వేళాకోళం వద్దు .  మూడో చెయ్యి మహత్యం గురించి తెలుసా " 


" తెలిసినవాడివి నువ్వు చెప్పరాదా... చెవిలో పువ్వులు పెట్టుక్కూర్చున్నామిక్కడ . వింటాం'' 


ఆ పువ్వులు పెట్టింది నేను కాడు. మూడో చెయ్యే!  ఎ.సి. - థియేటర్లో సినిమా చూస్తుంటే మధ్యలో హఠాత్తుగా ఉక్కపోస్తుంది, ఎందుకూ ? 


' సినిమాలోని సీన్లు చూసి.." 


" కాదు. మనం వాటికెప్పుడో అలవాటు పడిపోయాం. మనమా సినిమాలో లీనమైపోయి ఉండగా, మెల్లగా ఏసీ ఆఫ్ అయిపోతుంది. అట్లా ఆఫ్ చేసేది ఎవరు? మూడో చెయ్యే!  '' 


" నిజమే సుమా!  నేనా విషయం ఎపుడూ ఆలోచించనే


లేదు. ''


" పెద్ద మార్కెట్లో కిలో రెండురూపాయలేనని చంకలు గుద్దుకుంటూ నువ్వు తెచ్చే వంకాయలు అరకిలోనే తూగుతాయని మీ ఆవిడ వంకబెడుతుంది. ఎందుకూ? " మార్కెట్లో తక్కెటనొకవైపు మూడో చెయ్యి నొక్కేస్తుంది. దేవుడి చెయ్యి కనక అది నీకు కనపడదు." 


సుబ్బారావు లాజిక్కు బాగుంది! 


" ఆ పెన్షన్ గుమాస్తా నెలజీతం నాలుగు వేలు దాటదు. మూడు చేతులా సంపాదిస్తున్నాడు.  కాబట్టే  అంత మెహర్బానీ వెలగబెట్టేస్తున్నది . '' అన్నాడు సుబ్బారావు టాపిక్ మార్చి. 


''రెండు చేతులా సంపాదించడం చూశాంగానీ " ఈ మూడో చెయ్యి సంపాదనేమిటో... అర్థం కాలేదే...! " 


'' రెండు చేతుల్తో సంపాదించినదాన్ని ఏ ఫైనాన్స్ కంపె నీలోనో రియలెస్టేట్సులోనో పెట్టి మళ్ళీ సంపాదిస్తే అది మూడో చెయ్యి సంపాదన. '' ఏసీబీ లాంటి  వాళ్ల దగ్గరో  లిస్టుంటుంది. రోజూ పేపర్లో వస్తుంటాయిగా వాళ్ళ పుణ్య గాధలు'' 


" మూడో చెయ్యి దేవుడి చెయ్యన్నావు . మరాచెయ్యి ఒక్కమంచిపనన్నా చెయ్యకుండా ఉంటుందా? '' 


" గుప్తదానాలు చేసేదీ మూడో చేత్తోనే ! అలాంటివీ కలికా లంలో కదాచిత్ గానీ జరగవులే ! దేవుడి హుండీలో లక్ష రూపాయల కట్టలూ, బంగారపు బిస్కెట్లు వేసేదీ మూడో చెయ్యే! మూడో చేత్తో సంపాదించినందుకు, మూడో చెయ్యిచ్చిన వాడికి మూడో చేత్తోనే మూడో కంటికి తెలీకుండా ముడుపులు వేస్తారన్న మాట. " 


స్టేట్మెంట్ కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉంది. 


" అదలా ఉంచు .  ఈ మూడో చెయ్యి థియరీ ఒక్క మనుషులకే వర్తిస్తుందనుకోకు ! ప్రభుత్వాలక్కూడా ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు" 


 '' అదెలాగా? ప్రభుత్వాలు కూడా మూడు చేతులా సంపాదిస్తున్నామంటావా? " 


" కాదు .. ఖర్చు పెడుతున్నాయి." 


సుబ్బారావెప్పుడూ ఇలా తిరకాసుగానే మాట్లాడతాడు.


' ' ఖర్చుకు తగ్గ రాబడి కోసం మూడో చేత్తోనే ప్రజల మాడు పగలగొడతాయి.  చెత్తకుండీ ఒకటి లక్ష రూపాయ లకు కొన్న ప్రభుత్వం చెత్త మీద కచ్చితంగా పన్ను వేయాలనే  చూస్తుంది.  వాటర్ మీటర్ల మీద పెట్టిన ఖర్చును అదనపు టాక్సు వేయకుండా ఎలా బేలన్స్ చేస్తుంది? తుప్పుపట్టిన తుపాకుల్ని, పూడ్చిపెట్టే శవపేటికల్ని పొరపాటున అంత రేటు పెట్టి కొన్నామని నాలుక్కరచుకుని, ఇప్పుడా ఖర్చుని.. ప్రజలే  త్యాగ బుద్ధితో  పంచుకోవాలని జీవో తెస్తుంది. " 


'' ప్రభుత్వాల మూడో చెయ్యి మహత్యం వల్ల ప్రజల్లో త్యాగభావం పెరుగుతుంది. మంచిదేగా'' 


" శభాష్... ఇప్పుడు దారిలో పడుతోంది నీ మెదడు.." 


" శవపేటికల వ్యవహారం తలచుకుంటే, ఫ్యూచర్లో శవాల

మీద కూడా పన్నేస్తారేమోనని వణుకొస్తోంది.. '' 


' మరీ అంతా వణుకవాక!  ముందే పోవాల్సి వస్తుంది. మనలాంటి సామాన్యులం " మరీ అంతా ముందే ఊహించుకో వటం ఒంటికి మంచిది కాదు కూడా " 


'బాగా చెప్పారు' అన్నాడు మా బావమరిది. "రేపు మీతోపాటే నేనూ పెన్షనాపీసుకొస్తున్నాను. పనుంది" అన్నాడు సుబ్బారావుతో  


మా బావమరిది వ్యాపారస్తుడు.  పెన్షనాఫీసులో ఏం పనో కాలేదు! 


నెలకు పాతికవేలొచ్చే సాఫ్ట్ వేరే ఇంజనీర్  సంబంధం కాదను కొని, పెన్షనాఫేసు  గుమాస్తాకిచ్చి పిల్లను కట్టబెడదామనుకొని, ఖాయం చేసుకొచ్చినప్పుడుకాని అర్ధం కాలేదు. . ఆ  పనేంటో ! 


''అదేంట'' ని నేనడిగితే " నెలకు నాలుగు వేలు జీతమైతేనేం..


మూడో చేత్తో కూడా సంపాదిస్తున్నాడు మరి'' అన్నాడు మా

వ్యాపారి బావమరిది . 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు- గల్పిక- 30-06-2002)  


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...