Saturday, December 4, 2021

అవినీతికి అందలం - ఈనాడు - గల్పిక- హాస్యం- వ్యంగ్యం

 




ఈనాడు - గల్పిక- హాస్యం - వ్యంగ్యం 

అవినీతికి అందలం ! 

రచన- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్టిక - 06 -08 - 2011 ' ప్రచురితం > 



పాండవుల రాజ్యం కాజేయటానికి కౌరవులు మొదట్లోనే పెద్దయుద్ధం వేశారా ఏందిరా? మాయా  పాచికలతోనే కదా    యావత్తూ మంత్రాంగం  నడిపించిందీ! 


ముక్కుసూటిగా పోతే ముక్కు పచ్చడి కావటం ఖాయం . కట్నం ఇంత కావాలని పెళ్లికి ముందే చేరానికి దిగావనుకో ఆదో పెద్ద నేరు. అదే మూడుముళ్ల పడనీ. . ముడి ఎంత బిగిస్తే లాంఛ నాలంత బిగువుగా కాళ్ల మీదకొచ్చి పడతాయి.


దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఎవరైనా  చేసే పనేరా అబ్బాయ్! దీపాలు ఆర్పి  చీకట్లో చక్కబెట్టుకోవడం తెలివైనవాళ్లు చేసే పని. ప్రభుత్వాసుపత్రిలో పెద్ద వైద్యుడివైనంత మాత్రాన ఏం లాభం? చికిత్స  కోరివచ్చిన వాడికి నీ ప్రైవేటు క్లినిక్ చిరునామా ఇస్తేనేగదా- రోగికి ఆరోగ్యం.. నీకు మహాభాగ్యం!


నేతిబీరకాయ నీతులెవడికి కావాలిరా బాబూ ! మంచివాడనే చెడ్డపేరు తప్ప సాధించేదేమన్నా ఉందా! అనొచ్చునో లేదో.. ప్రభుత్వ కార్యాలయాల్లో తలుపు దగ్గర బల్ల వేసుకుని కూర్చునే బిళ్ల బంట్రోతూ నేరుగా పదీ పరకా అడగడు. చాయ్ పానీకని చేతులు చాపుతాడు. పదో.. పాతికో పడకపోతే నీ ఫిర్యాదు చివరికి చేరేది చెత్తబుట్టలోకే ! 


నువ్వు మనసుపడిన అమ్మాయి దగ్గరకు నేరుగా పోయి ప్రేమిస్తున్నానంటే- మనసులో ఎంత ఇష్టమున్నా బెట్టుచేస్తుంది. అదే ఏ పుట్టిన రోజునో ప్రేమికుల రోజునో  ఓ వంక పెట్టుకుని మాంఛి ఖరీదైన ఉంగరం సమర్పించుకు న్నావనుకో... ఇక నీది పూలదారే!'


అలౌకిక వ్యవహారాల్లోనే మతలబులు ఇన్నుంటే ... ఇంక లౌకిక కర్మకాండల్లో ఎన్ని పరోక్ష పురాణాలుంటాయిరా బాబూ! పెద్దాళ్ల పిల్లలు ఏ మాదకద్రవ్యాల కేసుల్లోనో,  ప్రేమ గొడవల్లోనో పడి నేరాలు చేస్తే పోలీసువారేం చేస్తారు? దారినపోయే ఏ కుంటి సత్యం బాబునో లాక్కొచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారా లేదా? చెప్పొచ్చేదేమిటంటే- అన్ని పనులూ ప్రత్య క్షంగా చేసుకుంటూ పోవాలంటే లోకం అల్లకల్లోలం అయిపోతుంది. లోకశాంతికోసం లోపాయికారీగా ఏవో తమ పనులు తాము చేసుకునే నేతలను ఇలా ప్రత్యక్షంగా కోర్టులకు లాగడమే ఏం బావోలేదు. జైళ్లకు పంపాలనుకోవడం అంత సబబుగా లేదు.


పరీక్షగా చూడు. పరోక్షంగా సాగని వ్యవహా రాలు సృష్టి మొత్తంలో ఒకటో రెండో తప్ప ఉండవు.  నైవేద్య కైంకర్యమప్పుడే దేవుడికీ  భక్తు

లకూ మధ్య తెర కడతారు. నడి బజార్లో గుడ్డ పేర్చుకొని  అడుక్కునే వాడు నిజంగానే గుడ్డివాడా అని అనుమానించే పరిస్థితులు ఇప్పుడు దాపురించాయి. అదే... కళ్ళు పత్తికాయల్లాగా  ఉన్నవాడు గుడి మెట్లమీద పడి పొర్లి పొల్లి  దండాలు పెడుతుంటే భక్తులలో దాత్నత్వ గుణం  పొంగిపొర్లిపోతుంది. లోకం తీరే ఇంత.  డొంక తిరుగుడుగా మారినప్పుడు-  వ్యవహారాలలో లోపాయికారీతనం పెరగకుండా ఉంటుందా? తప్పు మనదా, తంటాలు పడే.. వాళ్లదా... చెప్పు! 


లంచాలు నేరం. లాంఛనాలు, చదివింపులు, చందాలు, విరాళాలు, సన్మానాలూ, సత్కారాలు అయితే ఘనం- అని జనం భావిస్తున్నారు . కనకనే వ్యాపారాలు చేసుకొనేవారు... పాపం... అలా పాపాలకు పాల్పడాల్సి వస్తోంది. 


బోడి రెండొందల కోట్ల చిల్లర నోట్లకోసం.... పాపం... కరుణానిధి కూతురు అలా టీవీ ఛానలూ, అప్పులూ అంటూ తిప్పలు పడిందా లేదా ? నాలుగు ఐదు  వందల కోట్లు వెనకేసుకోవడానికి అంత భారీయెత్తున అంతర్జాతీయ క్రీడలంటూ కల్మాడీ లాంటి కిలాడీలు ఆటలాడాలా? నవ్వుతూ తుళ్లుతూ తిరిగేవాడు. పాపం... మతిమరుపు రోగమని ఎంతకాలం నాటకాలాడగలడు... చెప్పు! 


 భక్త జనాలకు మోక్షమార్గం చూపించాలని తాపత్రయ పడే నిత్యానందులవంటి ఆధ్యాత్మికవాదులూ మిధ్యామార్గాలు ఎంచుకోవాల్సి వచ్చింది! ఎంపీలకు ఏవో లాడ్స్ అంటూ ముష్టి ఐదేసి  కోట్లు వంతున  పంచుతున్నారు. ఒక్కసారి ఎన్నికల్లో నెగ్గుకుని రావాలంటే ఎన్నేసి కోట్లు మద్యంలా పారించాలో  మనందరికీ ఎరికే! 


కోట్లు గడించిపెట్టే వ్యాపారాలను ఎంతో రిస్కు తీసుకుని వెళ్లాం బిడ్డల కప్పచెప్పి పేరస పెట్టి రాజకీయ రంగంలోకి  రావడం పార్లమెంటు హాలు బెంచీ మీద  గుర్రు కొట్టి నిద్రపోవడానికా?  ఖర్చు పెట్టినదానికి అంతకు అంతా ఏదో విధంగా వెనక్కి రాబట్టుకోలేని పక్షంలో  మళ్లీ ఎన్నికల్లో నిలబడాలన్నప్పుడు టికెట్టుకీ, జనాలు కోరే సవాలక్ష కోరికలకూ సొమ్ము ఏ గనులనుంచి తవ్వుకు  రావాలి? 


కాంట్రాక్టులు, గనులు, భూములు, సెజ్జులు , పర్మిట్లు, పథకాల నిధులూ... అన్నీ నియమ నిబంధనల ప్రకారమే పంపకాలు వేయించటానికైతే పొలిటికల్ ఎంట్రీనే ఎందుకు? చేతులు గట్రా  కాల్చుకోవడానికి స్టాక్ మార్కెట్లు చాలకా ? 


సంపాదించేదంతా వాళ్లొక్కళ్లే మూటకట్టి   వెంటేసుకు  పోవడానికి కాదుగదా! ఏ అణుఒప్పందం బిల్లులాం టిదో పీకలమీదకొచ్చి పడితే.. ఆదుకోవడానికి మళ్లీ కావాల్సింది.. నల్లదో... తెల్లదో... వాళ్ల దగ్గరున్న  ధనమే గదా! అలా ఇవ్వడానికి ఇలా ఏదో తంటాలు పడి సంపాదిస్తుంటే అదే పెద్ద నేరమా?!


పోనీ- ఓ ఇంతని.... ఖర్చుచేసినదానికైనా పన్ను రాయితీలు కల్పించమనండి! ఎన్నికల్లో వాడిన సొమ్మంతా అధికారికమైనదే అని చట్టం తెమ్మనండి! గ్యాసుకీ, బియ్యానికీ, పిల్లల ఫీజులకీ, సంక్షేమ పథకాలకీ, బ్యాంకు రుణాల్లాంటి వాటిలో రాయితీలు ఇస్తున్నట్లే - ఎన్నికల వ్యయానికి ఇంతని ప్రభుత్వాన్నే సమకూర్చి ఇమ్మనండి! నల్లధనం గోలే ఉండదు. దొంగ వ్యాపారాలన్న చెడ్డ పేరుండదు. విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నదంతా చక్కగా ఇక్కడే చక్రవడ్డీకి తిప్పుకోనిస్తే.. ఎవరైనా ఆ హసన్ అలీలాంటి గుర్రాలవాళ్లను నమ్ముతారా? 


న్యాయస్థానాలతో ఈ చీవాట్లేమిటి? గిట్టనప్పుడు ప్రభుత్వాలతో సీబీఐ విచారణలేమిటి?


పరోక్ష పన్నులున్నంతకాలం పరోక్షంగా జరిగే ఇలాంటి పనులను ఏ బ్రహ్మదేవుడూ ఆపలేడు. రాజకీయపక్షాలకే పరోక్ష అజెండాలున్నాయి. పార్టీలలోని సభ్యులే దూకబోయే పార్టీకి పరోక్షంగా మద్దతిస్తున్నారు. పోలీసులకు సల్వాజుడుంలాంటి పరోక్ష వ్యవస్థలుండగా లేనిది.. వ్యాపారాల్లో పరోక్ష వ్యాపారులుంటే తప్పేంటి? పరోక్ష లావాదేవీలకు ప్రత్యక్ష బాధ్యుణ్ని చేసి యువనేతల్లాంటి నవతరాన్ని వేధించడం జాతి ప్రగతికే నష్టం. ఆనక మీ ఇష్టం . 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్టిక - 06 -08 - 2011 ' ప్రచురితం > 




No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...