Saturday, December 4, 2021

ఓటేసి రావాలి! - ఈనాడు- గల్పిక- హాస్యం - వ్యంగ్యం

 




ఈనాడు - గల్టిక- వ్యంగ్యం - హాస్యం 

ఓటేసి రావాలి ! 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 22 - 04 - 2009 న ప్రచురితం ) 


ఏం వాయ్..  మైడియర్ వెంకటేశం!.. మొహం అలా వేలాడేశావ్? మొదటి దశలోనే మీ పార్టీ చీదేసిందేమిటీ? అనా! ఫర్వాలేదు లేవోయ్! మార్చి పోతే మరో అవకాశం ఉన్నట్లు... రెండో దశలో పుంజు కూతపెట్టవచ్చు లేవోయ్ ! రేపు పోలింగు డేనే గదా! బెడ్ కాఫీ గట్రా లాగించేసి పొలోమని పోలింగు బూత్  కు పదవాయ్! యాక్సిడెంటయి కూడా చిన్న ఎన్టీఆర్ బెడ్ మీద నుంచొచ్చే ఓటేసి పోయాడు. టీవీలో చూశా! దటీజ్ ది స్పిరిట్... ఓటేసి ఉద్దరిస్తావని ఆఫీసుకు సెలవిస్తే నువ్విలా ఓటుకే సెలవిచ్చేస్తానంటే ఎలా బోయ్! బేడ్... వెరీ బేడ్!


వ్వాట్? క్రికెట్ మేచుందా? అయామ్ షాక్డ్  మైబాయ్! దిసీజ్ గ్రాస్ ఇన్ గ్రాటిట్యూడ్ . వందేళ్ళు మన నేతలు ఈ ఓటు రైటు కోసమే గదోయ్ ఇంగ్లీషోళ్లని ఫట్ ఫట్లాడించేసింది! సీఈసీగా ఆ గోపాలస్వామి సారు ఆ మజ్జెన ఏమన్నాడో విన్లా? ఐపీయల్ మేచిలిక్కడ ఆడుకుంటామంటే 'ఠాఠ్‌... మామేచులు మాకున్నాయ్... కుదరుగాక కుదరు ఫోపొమ్మన్లా ?


ఏడాదేడాది వచ్చిపోయే ఉగాది గట్రాలను గ్రాండుగా చేసుకుంటావూ!... దివాలీకి టపాసులూ, టైంబాంబులూ అంటూ హడావుడి చేసేస్తావూ... జన వరి ఫస్టాస్తే ఎక్కడెక్కడి వాళ్ల వెంటబడీ 'విష్ యూ హ్యాపీ న్యూయియర్' అంటూ చెప్పేస్తుంటావు.... అయిదేళ్లకోసారొచ్చే ఈ ఎలక్షన్ పండగ మాత్రం దండగా? ఎవడొచ్చి చచ్చినా ఉద్దరించి చచ్చేదేంలేదని వాదనా? దేర్ యూవార్ రాంగ్ యంగ్ మేన్!


రాయిని రాయితో కొట్టి నిప్పుని రాబట్టిన ఘటికులం మనం. ఈక పెన్నుల కోసం ఈకలు పీకుతుంటే పిట్టలు చచ్చిపోతున్నాయని రాయటం మానేశామా మేన్? బాల్ పెన్ను  కనుక్కోలేదూ? థామసాల్వా ఎడిసన్ ఇరవై మూడు సార్లు ఫెయిలయిం తరువాతే ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కొన్నాడు! నీ యేజికి యావరేజిన రోజుకు పదమూడు సార్లు పడీపడీ నవ్వాలి న్యాయంగా . మరెం దుకిలా డీలాపడి ఉన్నావ్ పూర్ మేన్ ?


రోజూ తిరిగే రోడ్లు రొచ్చుగా ఉన్నాయంటావ్. రోజు మార్చి రోజైనా ట్యాపుల్లో వాటర్ రావటం లేదని గోల పెడుతుంటావ్! గంట గంటకీ కరెంటు కోతలు తప్పటం లేదని ఏడుస్తుంటావ్! మన దరిద్రంలాగానే ధరలూ అంతకంతకూ పెరగటమే గానీ... తరిగేది లేదని గగ్గోలు పెడుతుంటావ్! గవర్నమెంటాఫీసుల్లో పనులు నత్తలతో పోటీ పడుతున్నాయంటూ ఏ టీవీ వాడో మూతిముందు మైకు పెట్టేస్తే- మైకం కమ్మినాడికి మల్లే మాట్లాడేస్తుంటావ్! మన బతుకుల్ని నవ్వులపాలు చేసినవాడి భరతం పట్టేందుకు, ఓటేసి రారా కన్నా! అంటే, మెట్టవేదాంతం చెప్పేస్తున్నావ్! ఎన్ని కల్నీ చదువుకున్న కుర్రాళ్ళంతా ఇంతీజీగా తీసుకోబట్టే ... రాజకీయాలీ రోజు ఓ ఉల్లిపాయ వ్యాపారంలాగా మారిపోయాయ్ మైబోయ్! 


నేనొకణ్నే వెళ్ళి ఓటేసొస్తే స్వర్ణయుగం వచ్చేస్తుందా అని డౌటా! పదితలల రావణుణ్ని రాముడు అడవిలో తిరిగేటప్పుడే గదబోయ్ కొట్టిందీ ! కృష్ణుడు ఒంటి వేలుతో గోవర్ధనగిరినెత్తాడు. ధైర్యముంటే మనకు మనమే దేవుళ్ళం. మనిషి తలచుకుంటే నాలుగేంటి .. నలభై నాలుగు చేతులు మొలుచుకొస్తాయి. విశ్వరూపం చూపించేందుకు నువ్వు విష్ణుమూర్తివే కానక్కర్లేదు మై డియర్ వెంకటేశం! మనం కూడా చేయగలమన్న విశ్వాసం ఉంటే చాలు... బోయ్! డబ్బుల కట్టలు, క్రికెట్ కిట్లు, సారా పేకెట్లంటూ ఏ కనికట్టైనా సరే చేసి గెలవాలనుకొనే మాయగాళ్ళ ఆట కట్టించాలంటే ముందు ఆయుధాన్ని ఆ బద్ధకమనే జమ్మిచెట్టు మీద నుంచి  దించాలి. అందాకా ఈ గోగ్రహణాలు... భూగ్రహణాలు... నిర్విఘ్నంగా ఇలా సాగుతూనే ఉంటాయి. -ఈ పాయింట్ గుర్తుంచుకో!


ఒంట్లో బాగోకపోతే ఇంట్లో దేవుడిపటం ముందు మొక్కుకుంటూ

మాత్రమే కూర్చుంటావా? ఓ మంచి మాత్ర కూడా వేసుకుంటావా? డీలా పడిన డెమోక్రసీకి ఒక మంచి మందు మైబోయ్ 'ఓటు' ! ధాన్యం దేహానికెలా మేలుచేస్తుందో 'ఓటు' దేశానికంతలా  మేలు చేస్తుంది.


వేడిగా ఉందని 'కోడి' కూయటం మానేస్తుందా? కోడికూస్తే ఎలా మేలుకొలుపో... ఓటువేస్తే అలాగే మేలుకు గెలుపు!  పడతానని భయమున్నా చిన్నప్పుడు సైకిలు నేర్చుకోవటం మానేశావా? కాపలావాడు కొడతాడని తెలిసీ జామకాయల కోసం చెట్లెక్కటం ఆపేశావా? కిలో బంగారం ఇస్తా మంటే టీవీవాళ్ళకు ఎన్నెన్ని ఎన్సెమ్మెస్సులైనా ఓపికగా చేస్తావే! ... బంగారం లాంటి భవిష్యత్తు కోసం ఓ పది నిమిషాలు ఓపికచేసుకుని బూతుకెళ్ళటానికింత లావు  గీతోపదేశం కావాలా బోయ్!


ఓటేయటానికేమన్నా కత్తులతో కలబడాలా? కంటిచూపులతో కాల్చిపారేయాలా? తొడగొట్టి మీసాలు మెలిపెట్టాలా? నిప్పులమీద నడవమన్నట్లు, ఒంటిపూట ఉపవాసం ఉండమన్నట్లూ ఒంటిమీద కిరోసిను వంచుకోమ న్నట్లూ అలా సణగటమంతవసరమా మైపూర్ మేన్ ?


లియోనార్డో డావిన్సీ ఒకచేత్తో బొమ్మేస్తూ ఇంకోచేత్తో రాసేవాడట. మర్రి రమేష్ కళ్ళగంతలు కట్టుకుని తిరుమల ఘాటురోడ్డు మలుపులో వేగంగా బైకు నడుపుతాడట. కోడిరామ్మూర్తి గుండెల మీద ఏనుగుని ఎక్కించుకుని తొక్కించుకునేవాడట. నిన్నలాంటి చిత్రమైన ఫీట్లేమన్నా చేయమని ఎవరన్నా అడిగారా? ఊరికే వెళ్ళి ఓటేయటం ఊరికి ఉపకారమా మేన్?


రోజుకు రెండువేల కిలోల చిల్లర దుమ్మూ ధూళీ భూమ్మీదొచ్చి పడి పోతున్నదని ఓ శాస్త్రవేత్త సిద్ధాంతం. మనదగ్గర ఎన్నికలప్పుడు ఇది రెట్టిం పుంటుందేమోనని మేధావులు భయం. ఆకాశాన్ని చూసిలా భయపడటాన్ని ఆస్ట్రో ఫోబియా అన్నట్లే... రాజకీయాల్ని చూసి నీలా భయపడటాన్ని 'రాస్ట్రోఫోబియా' అంటే బాగుంటుందేమో మై డియర్ వెంకటేశం! పిల్లి అరవై అంతస్తుల మీద నుంచీ పడితే బతికే అవకాశం కన్నా ఆరంతస్తుల ఎత్తుమీంచి పడితే బతికే ఛాన్సు తక్కువట! పడిపోతున్నానన్న స్పృహ పిల్లికి ఆలస్యంగా కలగటమే అసలు కారణం. చదువుకున్న నువ్వు పిల్లివైతే కాదుగా! వెళ్ళి ఓటేసిరా! పౌరసత్వం ఉంటే సరా... పోరుతత్వం ఉండొద్దూ డియర్ వెంకటేశం?


అసలు నన్నడిగితే పోలింగ్ నాడు వేలికి చుక్కో గీలో లేనివాడిని ప్రాచీన గ్రీసుదేశంలో మాదిరి ఏదో ఒకటి చేయాలి. అక్కడ అప్పట్లో ఓటు వేయని నీబోటి వాడికి పిల్లనిచ్చేవాళ్ళు కాదటమరి... తస్మాత్ జాగ్రత్త!


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 22 - 04 - 2009 న ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...