ఈనాడు - వ్యంగ్యం :
ముము బ్రోవ రారా!
- కర్లపాలెం హనుమంతరావు
- ఈనాడు - గల్పిక - ( 08 - 04-2014 ) ప్రచురితం)
రామచంద్రా... నీతో రాజకీయాలు ముచ్చటించడం మర్యాదో కాదో తెలీదు. కానీ, మరేం చెయ్యాలి. నా మొర ఆలకించే నాథుడే కరవయ్యాడే ! అందరూ ఎన్నికల పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. అందుకే నేరుగా నీకే నా మొర చెప్పుకొంటున్నా!
అభయ ముద్ర చూపిస్తూ గర్భగుడిలో నువ్వు అలా నిశ్శ బ్దంగా నిలబడి ఉంటే- మా ప్రధాని గుర్తుకొచ్చి దిగులవుతుంది. కాస్త ఆ భంగిమ మారుద్దూ, నీకు పుణ్యముంటుందీ!
'దండధారి నుంచి తప్పించుకోవాలంటే కోదండధారే మాకు గతి' అని మాలో ఒక నానుడి నానుతోంది. దండం ధరించిన ఆ యముడికి మించి దండలు మెళ్లో ధరించి ఓట్ల కోసం వెంటబడుతున్నారయ్య మా నేతలు! ఆ మాయదారి మూక నుంచి బయటపడే దారి దయామయా నీవే చూపించాలి రామయ్యా!
త్రేతాయుగంనాటి వాడివి కనుక నీకు ఏ కానుకలు, తాయిలాల బెడదా లేదు. వనవాసంలో నాడు ఏ సాయంకై ఆశించక గుహుడు నిన్నా గండకీ నది దాటించాడు. శబరి మహాతల్లి ఎక్కడెక్కడి పండ్లో ఏరుకొనొచ్చి నీకు ఆహారంగా సమర్పించుకుంది. కానీ నీ నుంచి పాపం, ఏ పింఛను మంజారు ఆనించింది కాదు. ఆ జటాయువు పక్షికి రావణాసురుడితో ఏమి కక్ష ఉందని.. నీ పక్షాన చేరి సీతమ్మను కాపాడాలనిపించింది ! ఏ సమరయోధుల పింఛనో కొట్టేయాలని కాదుగా .. ఇప్పుడిక్కడ నడిచే రామరాజ్యంలోలాగా! అడగకనే చేతిలోన పచ్చ నోట్లు పడిపోతున్నాయి . కోరకనే కోకల .. పంచెల మడతల మధ్యనా సెల్ ఫోనులు కనపడుతున్నాయి. ఎవరి పిల్లకాయనో వివరమైనా అడగకుండా గుమ్మంలో ఆడుకుంటూ కనపడటం పాపం.. పాపం చీమిడి ముక్కులు శుభ్రంగా చొక్కా అంచులలో ఇంచక్క తుడిచి మరీ బుగ్గలపై ముద్దుల వర్షం కురిపిస్తున్నారు నేతలు! రామరాజ్య పరిపాలన మోతాదు మితిమీరు తున్నదేమోనని మహా బెంగగా ఉందయ్య దశరథరామయ్యా ! ఈ ఉపద్రవం నుంచి నను వడ్డున పడవేసే భారం నీదే మరి సీతాపతీ!
కిడ్నాపింగులు, మారువేషాలు, మాయవేషాలు, కప్పగెంతుళ్లు, చాటుమాటు పోట్లు, సూటిపోటి మాటలు, ఆడాళ్ల మీద అవాకులు చెవాకులు, ఆలుమగల మధ్య పొరపొచ్చాలు... ఇలాంటివి నీ కాలంలో మాత్రం లేదా? కాకపోతే, ప్రతి పని వెనకా ఒక పరమార్ధం ఉండేదిలే పరంధామా! ఇప్పుడో? అన్నీ మన్న కుర్చీకోసమే. కుర్చీల చాటునుంచి తవ్వుకున్న డబ్బు మూటలు దాచి
పెట్టుకోవడం కోసమే! ఎవడికి తెలీని రాజకీయాలివి. మెలాగో దారితోచడం లేదు స్వామీ! అయినా బయటపడట తెల్లారితే వైభవంగా పట్టాభిషేకం అయినా పినతల్లి తండ్రి
మాట పోతుందని కట్టుబట్టలతో అడవిదారి పట్టేశావే! మరి మా నేతలో అయ్య పార్ధివ దేహం పంచలో ఉండగానే, అధికారం కోసం సంతకాల ఉద్యమం నడిపించగల సమర్థులు ఇప్పుడవన్నీ అందరికీ తెలిసిన పాతక ధలే కానీ, నీతి నిజాయతీ అంటూ నీకు మాదిరిగా జనాలకు నీతులు చెప్పి అరువు చప్పట్లు కొట్టించుకుంటున్నారే అక్కడొస్తుందయ్యా తేడా! అలాంటివాళ్ల చేతుల్లో మా జీవితాలు చిక్కడిపోతే ఏమైపోతుందో- తలచుకోవడానికే దడగా ఉంది. దేవా!
'నమో నమో' అంటూ దేశం ఘోషెత్తి పోతోందని ఉబ్బి పోకయ్యా రామయ్యా ఆ స్తోత్రపాఠాలన్నీ ప్రస్తుతం ఓ ప్రముఖ నేతవి. నిజం చెప్పాలంటే, ఇవాళ ఏదో నీ జన్మ దినమని, పెళ్ళి రోజు నవమి అనీ నీ నామస్మరణ చేసు కుంటున్నాం గానీ- ఆ పుణ్యఫలం అనే తాయిలం లేకపోతే తలచుకునే తీరిక ఎవరికీ
ఒకప్పుడు కలలో కనిపించి పోతన చేత భాగవతం రాయించగలిగావు. ఇప్పుడు నేరుగా ప్రత్యక్షమై నీతిమంతమైన జీవితాన్ని గడిపి మానవజాతికి మంచి దారి చూపించిన రామచంద్రుణ్ని నేనే అన్నా వినిపించుకునే శ్రద్ధ ఎంతమందికి ఉందన్నది సందేహమే దశరథనందనా! సీతమ్మ చరిత్ర గురించి అగ్నిదేవుణ్ని ఒప్పించావుకానీ, సామాన్య జనం నోళ్లు మాత్రం మూయించగలి గావా త్రేతాయుగంలోనే నీతినియమాల ఖర్మ అలాగుంటే, ఇక ధర్మం ఒంటికాలిమీద నడిచే కలియుగం మాట చెప్పేదేముంది స్వామి/
ఇప్పుడిక్కడ ఎన్నికల పెద్ద పండగ నడుస్తోంది. ఈ ఉత్సవాల్లో, రాషూ. నీ నామస్మరణ జరిగేది ఏదో పక్కవాడికన్నా వెనకబడకూడదన్న భక్తి ప్రద ర్శన వల్లే ఈ పప్పు బెల్లాలు, పానకాలు పంచుళ్లు, కల్యాణం పేరిట ఆర్భాటపు ఊరేగింపులు పట్టు పీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు నిండిన పక్షాలు నెత్తిమీద పెట్టుకుని కెమెరాల సాక్షిగా కనిపించడాలు- ఎన్నికల్లో ప్రత్యర్థికన్నా నాలుగు ఓట్లు ఎక్కువ రావాలన్న యావతోనే దాశరథీ!
ఏ పని చేసినా నాకు ముందు శ్రీరాముల వారి సహాయము కావలెను అని రాయడం అలవాటు. ఇప్పుడు నిజంగానే నీ సహాయం నాబోటి ఓటు మల్ల య్యలకు ఎంతో అవసరం దయామయా!
రాతిని నాతిగా మార్చిన మహిమ గల దేవుడివి, మళ్ళీ నువ్వు లీల చూపించు! మా నీతిలేని నేతలనందరినీ రాళ్లుగా మార్పు వీలుకాదంటే కనీసం రాళ్లకన్నా బండగా ఉన్న మా ఓటర్ల గుండెల్నిండా చైతన్యం రగిలించు రామయ్యా నీ దయ ఉంటేనే మళ్ళీ వచ్చే అయిదేళ్ల దాకా అయిదు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేది నిండుమనసుతో నీ జన్మదినం, కల్యాణ వేడుకా ఈ అయిదేళ్ల పండగలా జరుపుకోవాలంటే ఓ కోదండరామస్వామీ నీ అండ దండలు మా ఓటర్లకు అవసరం! 8/04/14
-కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక - ( 08 - 04-2014 ) ప్రచురితం)
No comments:
Post a Comment