Saturday, December 4, 2021

ఈనాడు: హాస్యం : కొంపలు కూల్చే పని - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదక పుట - ( 16 -07 - 2004 ) - ప్రచురితం )




 ఈనాడు: హాస్యం : 

కొంపలు కూల్చే పని 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట - ( 16 -07 - 2004 ) - ప్రచురితం ) 


పాతికేళ్ల కిందట వాళ్ల తాతకట్టిన డాబా ఇల్లు చీకిపోయి ఎప్పుడెవరిమీద పడు తుందో తెలీకుండా ఉందని... దాన్ని పడ గొట్టించి.. కొత్తది కట్టుకోవాలని అదేదో కన్స్ట్రక్షన్ కంపెనీని కన్సల్ట్ చేసిన గుర్నాథం... కట్టేదానికన్నా... పడగొట్టేదా నికి ఎక్కువగా అడుగుతున్నారని నా దగ్గ రికొచ్చి వాపోయాడు. 


సుబ్బారాయుడు కొడుకు ఈమధ్య ఇలాంటి కొంపలు కూల్చే పనులే ఏవో చేస్తున్నాడని చూచాయగా తెలిసి తీసుకెళ్లా . 


అంతా విని... 'ఓస్ అంతేనా!' అన్నాడు ఆ అబ్బాయి. పేరు ఆంజనేయు లనుకుంటా . 


కంపెనీ పేరు మాత్రం వింతగా ఉంది 'శ్రీ ఆంజనేయా డిస్ట్రక్షన్  నలిమిటెడ్! 


 "ఇదేం పేరోయ్! ? కన్స్ట్రక్షన్కి వ్యతిరేక పదమా? "


'అవునంకుల్... మాది పూర్తిగా కూల్చే పని.  బెర్లిన్ గోడ కూల్చిన సిండికేట్లో

మాకూ పైసా  వాటా ఉంది. '


' కట్టినవే  దిక్కూ దివాణం లేకుండా పడున్నాయి భూతగృహాలకు మల్లే!   కూలిస్తే కూలి డబ్బులైనా రావనుకుంటున్నామే! లాభాలొస్తాయని నీకెట్లా తోచిందో! '


'చూడడంకుల్!  ఈ పోటీ ప్రపం చంలో ఏదైనా కొత్తగా ఆలోచించి, ముందుగా ఆచరణలో పెట్టేవాడే అధి కంగా లాభాలు పొందేది. అందరూ నిర్మాణాలు చేపడుతున్నారు. వాటిని కూల్చే పనిచేపడితే ఎలాగుంటుందన్న ఉల్టా ఆలోచన నుంచే మా డిస్ట్రక్షన్  కంపెనీ పుట్టుకొచ్చింది' 


' చూస్తూ చూస్తూ ఎవరైనా కొంపల్ని ఎందుకు కూల్చుకుంటారోయ్? ' 


' ఎందుక్కూలుకోరు. ఇప్పుడీ గుర్నా ధం అంకుల్ కూల్చుకోవటంలా...! వాస్తు వద్దంటే కూల్చుకొనే వాళ్ళు 'మస్తు' న్నారంకుల్! అలాంటివాళ్ళకి సలహాలిచ్చే స్టాండింగ్ పండితులను కమీషన్ బేసిస్ మీద మేమే అప్పాయింట్ చేసుకుం టుంటాం. ఇంటిని కూల్చాల్సిన ముందుగా గుర్తించి వెనకనే ఇలాంటి

పండితుల్ని పంపించటానికో ప్రత్యేక శాఖ మరోటి వుంది. కొత్త ఇంటిని కట్టుకోటానికి పాత ఇంటిని కూల్చుకొనేవారూ కొంద కుంటారు. అలాంటి ప్రొఫెషనల్ జాబ్స్‌కు మాత్రం ఉచితంగా సేవచేసి పెడతాం.' 


' ఊరికే చేస్తే మీకు గిట్టుబాటవు తుంది?' 


( కూల్చిన తరువాతొచ్చే తుక్కును తీసు కుంటాం. ఒక్కోసారి ఎంతో ఖరీదైన కలప, ఫర్నిచర్ దొరుకుతుంది. బంగార బ్బిస్కట్లు లాంటివి దొరికినా మావే.... | . '


' ఏ ఎముకలో... ఆస్తి పంజరాలో బైటపడితే?"


' మరీ మంచిది. బెదిరించి డబ్బు రాబట్టటానికిదో ఛాన్సు! ఇలాంటివన్నీ చూసుకొనేందుకింకో సపరేట్ డిపార్ట్ మెంటే ఉంది లెండి మా దగ్గర.. ' అని అతగాడంటుంటే ఇండియాను కూడా ఇలాగే ఎలాగో అమెరికాకు అమ్మేస్తా డేమో... అమ్మ సుబ్బారాయుడు కొడకా!" అనిపించింది.


' ఒక్కోసారి అధికారులకే అనధికారికంగా నిర్మాణాలు కూల్చేయాల్సి రావచ్చు. బీమా సొమ్ము కోసం ఆశపడేవాళ్లూ ఇలాంటి పనులు చేస్తుంటారు. చెప్పకూడ దుగానీ... ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్.  ఇంతకీ ఈ గుర్నాథం  అంకుల్ ఇల్లు పడగొట్టించె య్యాలి... అంతేగదా! కట్టడం కష్టంకానీ... కూల్చటం ఎంతసేపు! '  ... అంటూ 


' పేపర్లో వాతావరణ సూచన చూశారా?' అనడిగాడు.


' చూశాం... ఇరవై నాలుగ్గంటలు పొడి గాలులు వీస్తాయి | అన్నాడు గుర్నాథం .


' మంచిది... అంటే రాత్రికి రైన్‌  ఖాయమన్నమాట! అంకుల్ .. మీరు వెజ్జా... నాన్ వెజ్జా?' 


' నాన్ వెజ్జే ' 


' అయితే మధ్యాహ్నానికి మంచి మటన్ కర్రీనో .. చికెన్ బిర్యానీనో చేసుకు తినే యండి! బొమికలు... బొచ్చు గోడకవతల పారేయండి. పోండి.. రెండు రోజుల్లో కాణీ ఖర్చు లేకుండా మీ ఇల్లు పడగొట్టించే పూచీ నాది... పాతిక పర్సంట్ కమీషనిప్పిస్తానంటే ఎదురు డబ్బు కూడా వచ్చిపడే ఏర్పాటు నే చేయిస్తా' ... అని అతగాడంటుంటే అంతా అయోమయం అని పించిందా క్షణంలో.


తెల్లారకుండానే గుర్నాధం ఇంటి ముందు గుంపు పోగయింది. 


రాత్రి వర్షా నికి వాడింటి పెరటిగోడ కూలిందట. పల్లపు వీధి పుల్లయ్య మేక దాని కింద పడి నలిగిపోయిందని జనంగోల! 


నష్టప రిహారం కింద మినిమం పాతికవేలన్నా కావాలని అల్లరి! గుర్నాథం  ఏ అయిదు వేలకో బేరం కుదుర్చుకొనే హడావుడిలో ఉంటే ఎక్కడ నుంచొచ్చాడో... ఆంజనే యులు 'ఒక్క పైసా ఇచ్చేదిలేదు పొమ్మ' ని  అడ్డం పడిపోయాడు.


రాస్తారోకో - మొదలయింది. 


పోలీసు లొచ్చి లారీఛార్జీ చేశారు. 

ఆందోళన పెరిగి జనం రాళ్లేయటం మొదలు పెట్టారు. 

కలెక్టరుగారొచ్చి బాధితులకు న్యాయం చేకూరేలా చేస్తానన్నారు.  

గాయపడినవాళ్లకి తలో పదివేలు.. మేకలాయనకి ఓ పాతికవేలు అప్పటికప్పుడిచ్చి... గుర్నాథం  ఇంటిని కూలదోస్తేగాని ఆందోళన విరమించేదిలేదని పట్టుపట్టారు. 


ఇటిక ముక్క తీస్తే  కోర్టుకెళతామని గుర్నాథం తరుపున ఆంజనేయులు వీరంగం వేస్తున్నాడు. 


ఎమ్మెల్యేగారొచ్చి  నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ చేస్తామని, ఏకసభ్య కమీషనూ ఏర్పాటుచేస్తామనీ అంతవరకూ అడ్ హాక్ రిలీఫ్ కింద బాధితులకు

తలో వెయ్యి రూపాయలు, మేక అసామీకి  ఐదువేలు, ఇల్లు కూలగొట్టేందుకు ఒప్పుకున్నందుకు గుర్నాథానికి  లక్ష రూపాయలు అప్పటికప్పుడు ఇప్పించేశాడు.


సమస్య శాంతియుతంగా పరిష్కారమై పోయినందుకు అంతా సంతోషం. 

 కొంప కూల గొట్టే పని ఆంజనేయులు కంపెనీకే అప్పగించింది ప్రభుత్వం.


శాంతిభద్రతల సమస్యను సమర్ధవంతంగా నిర్వహించినందుకు అభినందిస్తూ సబ్ ఇన్స్పెక్టర్ కు  సర్కిల్ ఇన్స్పెక్టర్ గా  ప్రమోషనూ వచ్చింది. 


ఇంటి డిజైన్లో లోపముందని నిజనిర్ధారణ కమిటీ నిర్ణయం చేస్తే, ఏకసభ్య కమీషన్ గోడ నిర్మాణంలోనే తేడా వుందని తేల్చి చెప్పింది. 


గోడ మీది పిల్లిలా ప్రభుత్వం మరింత లోతుగా విచారణ చేసేందుకు రెండు కమిటీల కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది.


గుర్నాధం కాణీ ఖర్చులేకుండా ఇల్లు పడగొట్టించుకోవటమేకాదు... కొత్తిల్లు కట్టుకోవటానికి లక్ష రూపాయలు సంపా దించాడు. 


ఆంజనేయులికి కూల్చే కాంట్రా క్టుతోపాటు... పాతిక పర్సెంట్ కమీషనూ దక్కింది. 


కూల్చివేతకూ కూల్చివేతకూ  మధ్య కూలీల చేత ఇలా గోల చేయించి పైసలు రాబట్టడం కంపెనీ టెక్నిక్ ట్ ! 


గోల చేసిన జనంచేతే కూలగొ ట్టించటం చేత కూలీ కలిసొచ్చింది. 

ప్రమోషనొచ్చిన పోలీసాయన ఆంజనే యులు బావైతే, ఏకసభ్య కమీషనుకు ఈమధ్యనే జడ్జిగా రిటైరైన ఆంజనేయులు మామగారు చైర్ పర్సనయ్యాడు. 


కొంపలు కూల్చటంలో ఇన్ని లాభాలున్నా యనుకొంటే లక్షలుపోసి మా వాడినిలా సివిలింజనీరింగ్ కోసం అమెరికా పంపిం చకపోదునే; ఆ వెధవక్కడ ఏ పెట్రోలు బంకులోనో పనిచేయకపోదునే...' అని ఉస్సూరుమంది నా ప్రాణం. 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదక పుట - ( 16 -07 - 2004 ) - ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...