ఈనాడు - గల్పిక
ప్రపంచానికి పగాకు
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 21 - 05- 2010 న ప్రచురితం )
చుట్ట బానిసత్వం కట్టు బానిసత్వంకన్నా బలమైనది. ముక్కు పొడుంమహత్తు మీద ఓ కవి ఏకంగా ' నస్య నిషేణము' అనే కావ్యాన్నే రాసేశాడు!
' నీకయి సిగిరెట్టిస్తా- నాకయి శతకమ్ము వ్రాసి నయముగ నిమ్మూ!' అంటే చాలు... ఆ ఖాళీ పెట్టెల వెనకే పద్యం రాసిచ్చే బలహీనత కొందరు కవులది.
పొగాకు బలహీనత మరింత బలమై నది! సీసాలకు సీస పద్యాలు రాసిపారేసినట్లే, సిగరెట్లకు, ముక్కుపొడికి ముక్త పదగ్రస్తాలూ వదిలే కవులకు ఏ భాషలోనూ కొదవలేదు. 'ఈ సిగరెట్టుతోనే ఆంజనే యుడూ లంకాదహనం చేశాడూ!' అంటూ ఏ రేలంగో పాడినా కామెడీగానే తప్ప సీరియస్ గా ఎవరూ తీసు కోవటం లేదిప్పుడు.
పొగ తాగటానికి మించిన పెను ప్రమాదం మానవాళిముందు మరోటి లేదని చంటి పిల్లాడూ చటుక్కున చెప్పేస్తున్న రోజులివి...
సునామీవస్తే పోయేది వందలూ వేలే. భూమి విచ్చినా, ఉగ్రవాదులొచ్చి బాంబులు పేల్చినా లక్షల్లోపే గదా ప్రాణనష్టం జరిగేది! అదే ధూమపా నంవల్ల గత శతాబ్దిలోనే పదికోట్ల మంది గాలిలో కలిసిపోయారు.
ఇదే తరహా కామెడీలు, చిత్ర కవి త్వాలు రాసుకుంటూ కూర్చునుంటే ఈ శతాబ్దం చివరికి చిత్రగుప్తుడి చిట్టాలోకెక్కే పొగ తాగుబోతుల సంఖ్య వందకోట్లకు తక్కువుండదని ప్రపంచ ఆరోగ్య సంస్థే లెక్కలు చెబుతోంది. అయినా లెక్క పెట్టేది లేదని పొగరాయుళ్ళు అంటుంటే ఊరుకుని కూర్చుంటే ఎట్లా? పోయేది ఒక్క పొగతాగేవాళ్ళ ప్రాణాలే కాదు- పక్కనుండే పసిబిడ్డలు, ఆడవారు, వృద్ధులూ, పొగంటే పడనివాళ్ళ ప్రాణాలు కూడా!
పొగరాయుళ్ళనలా ఊరికే గాలికొదిలేస్తే ఇంకో ఇరవై ఏళ్ళకి ఏడాదికి కనీసం ఎనభైలక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని పర్యావరణ వేత్తలు మొత్తు కుంటున్నారు.
పొగలో ఉండేది ఒక్క నికొటినే కాదు. ఇంకా నాలుగు వేల విష పదార్థాలు. అందులో 60 రకాలు కేన్సర్ కారకాలు! బ్లూమ్ బరీ బుక్ ఆఫ్ కొటేషన్సులో ఒక్క వాక్యంలోనే పొగాకు మెదడుకీ, కంటికీ, జీర్ణ శ్వాసకోశాలకీ, గుండె, కాలేయానికి, రక్తానికి, శరీరంలోని ముఖ్యంగాలన్నింటికీ, చివరికి తెలివితేటలకీ చేసే శాశ్వతమైన చేటును తేల్చి చెప్పింది. అయినా మనిషికి 'వద్దు ' అన్నదానిమీదే ముద్దు జాస్తి, ఆదాము అవ్వలకాలం నుంచీ నడుస్తున్న కథే కదా ఇది!
నిండు నూరేళ్ళూ పండులాగా బతకమని దీవించి దేవుడు భూమ్మీదకు పంపిస్తే , ఏదో గాలి పట్టినట్లు ఈ పొగాకు సేవను బారినపడి మళ్ళా తొందరగా పైకిపో తాననే మనిషిని ఏమనాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ఈ పాడు అలవాటువల్ల రోజూ నూట యాభైమందికి దినకర్మలు జరుగుతున్నాయి.
విమాన ప్రమాదాలు, రైళ్ళు పట్టాలు తప్పటాలూ, వాహ నాలు గుద్దుకోవటాలూ వంటి వాటివల్ల పోయే ప్రాణాలకు ఇవి రెట్టింపని డాక్టర్ డి.సి. గుప్తా అంటున్నారు. పొగాకు నియంత్రణకు ఏటా ఇచ్చే లూథర్ టెర్రీ అవార్డు అందుకున్న ఈయన భారతీయుడే.
పొగాకు భూతం నుంచి జాతిని కాపాడాలంటే ముందుగా చేయవలసింది అన్నిరకాల పొగాకు ఉత్పత్తుల మీద నిర్బంధంగా నిషేధం, కచ్చితమైన చట్టం, నిక్కచ్చిగా అమలుచేసే ధైర్యం, పొగాకు బారిన పడి బైటపడాలనుకునేవారికి సాయం, పొగపడనివారికి రక్షణ... ఏకమొత్తంగా జాతి మొత్తానికి పొగాకుచేసే హాని గురించి చైతన్యం' అంటున్నారు.
మలేసియాలో లాగా మనదేశంలో మరీ రెండేళ్ళ పిల్లలూ పొగతాగటం లేదుగానీ... పొగబారిన పడుతున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, పొగపడనివారు సైతం పొగాకు సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారంటే అందుకు ప్రధానకారణం- ప్రభుత్వాలు ధూమపానీయులపట్ల కనబరచే ఉదాసీనతే!
బహిరంగ ప్రదేశాలలో పొగతాగటం నేరమని చట్టం తెచ్చినా కఠినంగా అమలుచేసే సంకల్పం యంత్రాంగంలో లేకపోవ టమే అసలు లోపం.
ఒక పొగరాయుడి వ్యాధికి ఏడాదికి ఖర్చయ్యేది రూ.40వేలని అనధికారిక అంచనా. ఈ లెక్కన ఏడాది మొత్తానికి ఖర్చయ్యే కోట్లతో దేశంలోని ప్రధాన నగరాలన్నింటా స్త్రీ, శిశు సంబంధ మైన ఆసుపత్రులను దివ్యంగా నడపవచ్చని డాక్టర్ గుప్తా వాదన.
నూటికి 29 మందికి బహిరంగ ధూమపానం మీద నిషేధం ఉందని తెలియదు . టీవీలల్లో వచ్చే పొగాకు వ్యతి రేక ప్రకటనలను నూటికి ఒక్కరుమించి పట్టించుకోవటం లేదు. ప్రతి పదిమందిలో ఏడుగురు పురు షులు, అయిదుగురు స్త్రీలు ఏదో ఒకరకంగా పొగాకు అలవాటుకు దాసులు. పొగాకు ఉత్పత్తులు కొనేవారి లోనే కాదు... అమ్మేవారిలోనూ మైనారిటీ తీరని బాలలే అధికం. అన్నిరకాల బీడీ, చుట్ట, సిగరెట్లు, గుట్కాలు, పాన్ పరాగ్ లు అన్ని వయసులవారికి అందుబాటులో ఉండే సౌకర్యం ఈ దేశంలో ఉంది.
పొగలేని పొగాకు పేరుతో ఆకర్షణీయమైన పేకుల్లో సువాసనలు వెదజల్లే గుట్కా, ఖైరీ, జర్దా లాంటి ప్రమాదకర ఉత్పత్తులు రకరకాల పథకాల పేరుతో అందుబాటులో ఉన్నా అడ్డుకునే సామాజిక స్పృహ లేని ప్రజాసంఘాలే ఇక్కడ ఎక్కువ.
నేడు పొగాకు వ్యతిరేక దినం. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఈసారి స్త్రీలు- బాలల సంక్షేమం దృష్ట్యా పొగాకు ఉత్ప త్తిదారులు వ్యాపార దృక్పథం మీద ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ ఒక్కరోజే పొగాకు వద్దు- అనుకోవటం కాదు.. ఏడాదిలోని మూడొందల అయిదురోజులూ అలాగే అనుకునేలా మారాలంటే ముందుగా మార్పు రావాల్సింది పొగరాయుళ్ళ స్వీయ సంకల్పంలోనే.
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - సం. పు - 21 -05 -2010 న ప్రచురితం )
No comments:
Post a Comment