Saturday, December 4, 2021

ఈనాడు - గల్పిక చెట్టు పేరు చెప్పుకొని. . - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- 01 - 04-2014 )

 



ఈనాడు - గల్పిక

చెట్టు పేరు చెప్పుకొని. . 

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 01 - 04-2014 ) 



మోహనదాస్ భలేవాడురా!'

మోహన్ దాసా ?! 


అదేరా! " మన కరమ్ చంద్  గారి అబ్బాయి'


ఈ కరమ్  ఎనరన్నా ?  ధ్యాన్ చంద్  దాయాదా? 


ఖర్మ ! కరమ్ చందే  తెలీనోడికి మోహన్ దాసు  మాత్రం ఏం తెలిసి ఏడుస్తాడులే. పోనీ.. 'గాంధీ' అని ఒక పేరుంది... అదన్నా ఎక్కడైనా విన్నట్లు గుర్తుందిరా కన్నా?


జోకా అన్నా! జీకేలో మా గ్రూపులో నేనే టాపు


ఆపు. అసలు పేరుతో అడిగితే నొసలు చిట్లిస్తావుగానీ.. తోకపేరు అడిగితే మాత్రం తెగ వాయిస్తావు తబలా... ఇలా ! 


తప్పై పోయిందిలే అన్నా! ఇంతకీ  తాతగారి పేరు ఇంత హఠాత్తుగా తలపుకెందుకొచ్చినట్లో?  దగ్గర్లో వర్ధంతులు, జయంతులు గట్రా ఏమీలేవే!'


అదీ! తాతగారి అసలు పేరు ఆ స్థాయికి దిగిపోయిందన్నమాట! ఏంరా తోక పేరు 'గాంధీ' నామం చెబితే మాత్రం అంతలా పరవశించిపోతావేమిట్రా?'


'గాంధీ నామం ఒక్క తాతగారి గుత్తసొమ్మేంకాదన్నా! ఆ తరువాత ఎంతమంది గాంధీలు మనదేశాన్ని ఏలిపారేశారూ! ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ.. రేపు ప్రియాంక గాంధీ... ఎల్లుండి. .!


అదే కదరా నా బాధ ఇందాకట్నుంచీ!  


పెట్టి పుట్టారన్నా వాళ్ళంతా!  నువ్వు కళ్ళు కుట్టుకుంటే ఏం లాభం... చెప్పు! 


పుత్లీబాయిగారి అబ్బాయి తాలూకు గాంధీకి, నెహ్రూగారింటి అల్లుడు ఫిరోజ్ తాలూకు గాంధీకి ఉప్పుకి, ఉసిరిపప్పుకి ఉన్నంత సంబంధం కూడా లేదు. ముందది తెలుసా నీకూ? 


ఆ పురాణాలన్నీ వినే ఓపిక ఎవరికుందన్నా! రావణాసురుణ్ని రామణాసురు డిగా మార్చి ప్రచారం చేసి, భద్రాచలం ఎదురుగా మరో అసురాచలం లేపే దేశం ఇది ! 


అన్నిందాలా అయ్య లక్షణాలే పుణికి పుచ్చుకొన్న ఇందిర ఒక్క గాంధీ విష యంలోనే భర్తనెందుకు అనుసరించిందంటావూ? చెట్టుపేరు గొప్పగా ఉండనిదే కాయలు ఏమాత్రం చెల్లుబాటు కావన్న రాజకీయం గుట్టుమట్లు ఒంటపట్టించు కుంది కాబట్టి. 


 నువ్వూరికే గుడ్లనీళ్ళు కుక్కుకుంటే ఏం లాభం చెప్పూ! 


ఇదేం ప్రజాస్వామ్యంరా ? 


ఇదే ప్రజాస్వామ్యమన్నా. పేరుకే ఇక్కడ సర్వంసహాధికారం. పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది అని మరి పెద్దోళ్లు అన్నదో!


ప్రాసకోసం పడే ప్రయాసన్నా అదంతా, వాస్తవానికి పేరులోనే ఉన్నది పెన్నిధంతా !  ఉక్కుమనిషి అద్వానీ పేరు చివర్న గానీ  ఏ గాంధీనో ఉండుంటే ఇవాళిలా తుక్కుకింద మార్చి గాంధీనగర్ నుంచి  గెటవుట్ అని ఉండేవాళ్లా? 


వసుంధరా రాజే  పేరు వెనక ఆ సింధియా బ్రాండు ఉండబట్టేగా ఎంత అమభవ జశ్వంతు సింగ్ బాబానీ చెత్తబుట్టలోకి విసిరికొట్టిందీ! రాహు ల్ గాంధీ.. ఏ రాహుల్ లాలో  గనక అయివుంటే ఏళ్లబట్టి వేళ్లు తన్నుకుని ఉన్న పెద్దాళ్ల కాళ్ళనిలా తొక్కేసుకుంటూ ప్రధాని పదవికి ఎగబడగలడా!'


కండువాలు ఎన్ని పార్టీలవైనా మార్చుకో..  కండల్లో వంశం రక్తం పొంగిపొర్లుతున్నంతకాలం ఇండియాలో వారసులకు ఎన్ని తరాలకైనా ఢోకా  ఉండదంటావు. ఇది అన్యాయంగా అనిపించడం లేదూ?


పెద్దాయనవి నన్నడుగుతున్నావుగానీ... నీకు తెలీని మతలబులా ఇవన్నీ! ఎవడి నుదుటిమీదా ప్రత్యేకంగా 'ఇదే వీడి పేర' ని  అచ్చక్ష రాలలో  చెక్కి ఉంటుందా... చెప్పు!  జన్మతః వచ్చిన పేరును వాడుకోవద్దనే హక్కు ఎవరికీ లేదు కదన్నా...!


ఆ మాటా  నిజమేరా!  లక్షలకు లక్షలు లక్షణమైన పేర్లు. ఇవాళ్టి  వారసులు తాతలనుంచి తండ్రుల నుంచీ కోరుకుంటున్నది? రెండు సార్వత్రిక ఎన్నికలు వరసగా పడితే చాలు... తండ్రి ఇచ్చిన సర్వం గోవిందా! అదే లక్షణంగా ఏ మహాత్మగానో పేరు గడించి అది  ఇచ్చిపోతే ఎన్ని ఎన్నికలొచ్చి పడితే మాత్రం నష్టమేంటంట! పెద్దాయన పేరు చెప్పుకొని పిచ్చిపిచ్చిగా సంపాదించుకో వచ్చు. అదృష్టం బాగుండి అధికార దండం దక్కిందా- దేశం మొత్తాన్ని దండుకోవచ్చు.


దేవుళ్లకు మల్లే శతసహస్ర నామాలు ఉండ పన్లేదు.  గిట్టుబాటయ్యే ఒక్క పొట్టి వంశం పేరు తగిలినా చాలు... ఆ పేరు చెప్పుకొని దేశాన్ని ఎలాగైనా తగలేయచ్చంటావు! 


అందుకే ఇందాకే నేనన్నది... మోహన్‌ దాస్ కరమ్ చంద్  భలేపని చేశాడని! ఆయనగారు అంతలా కష్టపడి స్వాతంత్య్రం సంపాదించి 'గాంధీ' బ్రాండుకింత విలువ పెంచబట్టి కదూ... ఇందిరాగాంధీ 'అత్యవసరం'పేరులో  దేశాన్ని చెండుకు తిన్నది! రాజీవ్ గాంధీ సంస్కరణల వంక పెట్టి సామాన్యుణ్ని వేధించింది. ఇసుక నుంచి ఇనుము దాకా దేన్నీ వదలకుండా దండుకుతిన్న బకాసురుల బృందానికి సారథ్యం వహించీ ఈరోజిలా  దేవతలా   గుడోటి  కట్టించుకుని  రోజూ పూజులందుకోవాలని సోనియాగాంధీ మోజుపడుతున్నదీ ! అధికారం విషం అంటాడు, మళ్ళీ అందులో ఒక్క చుక్కయినా  ఎదుటోళ్లకు  దక్కద్దంటాడు  రాహుల్ గాంధీ! మనమీ ' గాంధీ' బ్రాండును పట్టుకు వేలాడుతుండబట్టి కదరా- వీళ్ళందరికీ ఎక్కడ లేనీ  ఈ అధికారాలు, సౌకర్యాలు! 


ఎదుటివాళ్ల తప్పులెంచడం జీడిపప్పు నమిలినంత మజాగానే ఉంటుందన్నా! మరి మనం స్వయంగా చేసుకునే తప్పులో!'


మనమేం చేస్తున్నాంరా తప్పులూ? ... చిత్రంగా మాట్లాడతావే ఎప్పుడూ?


పేరు చూసి వెంటపడటం మనం చేసే తప్పు కాదా? స్వతంత్రం వచ్చి ఆరున్నొక్క దశాబ్దాలు గడచే పోయాయి . అయినా సొతంత్రంగా  ఆలోచిస్తున్నామా?


నిజమేరా!  చిన్నప్పుడు బళ్లల్లో పంతుళ్లు హాజరు అడిగేటప్పుడు వరస తప్ప కుండా ' ప్రెజంట్ సార్' అంటుండేవాళ్లం.  ప్రజాస్వామ్యం బళ్లో నిజంగానే మన మంటూ ఉన్నామని చెప్పాలంటే ఓటర్ల జాబితాలో పేరు చేర్పించుకోవాలిముందు. ఆనక్ బద్ధకించకుండా పోలింగ్ కేంద్రాల దాకా  పోయి ఈ పేరాశగాళ్ళకు బుద్ధి చెప్పాలి


అదీ మాట! చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకొనే నేతను ఓటరే ఓటుతో కుమ్మేయాలి ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- 01 - 04-2014 ) 


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...