Saturday, December 4, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - చిన్న కథానిక అసలైన మూర్ఖులు రచన- కర్లపాలెం హనుమంతరావు

 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - చిన్న కథానిక 

అసలైన మూర్ఖులు 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక - 20 -08 -2002 న ప్రచురితం ) 


ఇదివరకు ఆదివారం రోజుల్లోనే వచ్చేవాడు. సోమరాజు మా ఇంటికి.

ఇప్పుడు ఎప్పుడుపడితే అప్పుడు మూడొచ్చిందంటూ వచ్చి కూర్చుంటున్నాడు ..


వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుంచీ ఇదే వరస.


వి.ఆర్.ఎస్. ఎందుకు తీసుకున్నావ సలు అని అడిగాను ఒక రోజు.  అందరూ తీసుకుంటున్నారు. నేనూ తీసుకున్నా' అనేశాడు సోమరాజు. 


అందరూ చేస్తున్నారని అదే పనిని గుడ్డిగా చేసే వాళ్లనేమంటారు?


' గొర్రెలు ' అన్నాడు తాపీగా కొద్దిసే సాగి , 


గొర్రెలు అలా చేస్తాయని నిర్ధారణగా నీకు తెలుసా?


ఏమో... అందరూ అంటారుగా! 


అందరూ అంటే విని నిర్ధారణ చేసుకో కుండా నిజమని నమ్మే నీబోటి వాళ్ళనేమనాలి మరి?


'చాయ్' వచ్చి నన్ను రక్షించింది. 


నాకూ, మా ఆవిడకూ మధ్య ఒక ఒప్పందం ఉంది. నా కోసం వచ్చేవాళ్లు ఒక పది నిముషాలు మించి ఉండకూడదను కుంటే మంచినీళ్ళు పంపిస్తుంది. అరగంటయితే చాయ్... గంటవరకూ కాఫీ... అదీ ఆవిడ కోడ్ . 


వాళ్ల పనిమీదే వచ్చేవాళ్లకు మంచినీళ్ళు, అందులో మాకూ లాభముందనుకుంటే చాయ్, అచ్చంగా మాకే లాభమయితే కాఫీ పంపటం మా ఆవిడ మరో పాలసీ కూడా .


సోమరాజు మా ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగకుండా పోయిన రోజులు బోలెడన్ని  వి.ఆర్.ఎస్. తరవాత పరిస్థితి మారి పోయింది. అతణ్ని ఒక పాతికవేలు అప్పు అడగమని మా  శ్రీమతి పోరుపెడుతోంది. 

ఆవిడ పంపిన చాయ్ తాగే హుషారులో 'మంచి కాన్సెప్ట్ ఉంది. కథ రాసుకుంటావా గురూ !' అనడిగాడు. 


కాదంటే ఎలా? పాతికవేలు లోను అడ గాలి కదా! తలూపి చెవులప్పగించి

కూర్చున్నాను.


సోమరాజు చెప్పడం మొదలు పెట్టాడు. 


అనగనగా ఒక రాజు. ఆ రాజుకు అన్నీ కొత్త ఐడియాలే వస్తుంటాయి. 


ప్రేమికుల దినం, తండ్రుల దినం, తల్లుల దినం లాగా మూర్ఖులక్కూడా ఒక దినం చేయాలనుకు న్నాడాయన. మంత్రిని పిలిచి, మన రాజ్యంలో మూర్ఖులొక ఐదుగుర్ని చూడు. మూర్ఖుల దినం జరిపి సన్మానం చేద్దాం అన్నాడు. 


మంత్రిగారు మూర్ఖుల వేటకు బయలు దేరారు. 


ముందుగా నీలాంటి ఒక కవిని కలిశాడు.


'నేను కవిని కాదు. రచయితను ' అన్నాను ఉక్రోషంగా.


'ఎవరైతే ఏంలే... రాసుకొనే వాడు: కవి రాసింది కొద్దిగా చూశాడు. ఒక్క  ముక్కా బుర్రకెక్కింది కాదు . 


' సామాజిక స్పృహ' అంటే అట్లాగే ఉంటుంది. ఒక్కో సారి నాకే అర్ధమయిచావదు నా కవిత్వం' అనేశాడాకవి. మంత్రిగారికి మొదటి క్యాండిడేట్ దొరికాడు. 


 మూర్ఖుల దినం రోజున రాజుగారిని కలవమని ఆహ్వాన 

పత్రమిచ్చి ముందుకు కదిలాడు.


టక్కు, టయ్యీ కట్టుకున్న జెంటిల్మన్ ఒకాయన నేలమీద ఏవో గీతలు గీస్తూ కనిపిస్తే ఠక్కున ఆగి 'ఏం చేస్తున్నావూ?' అనడి గారు మంత్రిగారు. 


'కృష్ణాగోదావరి జలాలను ఈ దారినే మళ్లిస్తారుట . ఇక్కడ బ్రిడ్జి కట్టేందుకు 

టెండరు పిలిస్తే బిడ్డింగెంతకు  వేయాలో ఎస్టిమేషనేస్తున్నా' 


జలాలనెవరు తరలిస్తున్నారు? ఎప్పుడు తరలిస్తున్నారు?


' ఏమో... రాజుగారే అన్నారటగా! '  అని భుజాలెగరేశాడా పెద్ద మనిషి.  మంత్రిగారికి రెండో మనిషి కూడా తేలిగ్గానే దొరికాడు.


సంతోషంలో మరికాస్త ముందుకుపోతే... ఒక ఆడమనిషి చేతిలో పాలచెంబుతో హడావుడిగా పరిగెడుతూ కనిపించింది. 

అతికష్టం మీద ఆవిడను ఆపి  విషయమడిగితే ' వినాయకుడి విగ్రహం పాలు తాగుతోందిగా! అప్పుడే మా పక్కింటి వాళ్లు పావుశేరు పాలు తాగించారు .  నేను కనీసం అరశేరన్నా తాగించొద్దా! ' అంది ఆవేశంగా రాజుగారి మూడో సన్మానగ్రహీత ఆ ఆడమనిషి. 


అనుకున్నదానికన్నా తేలిగ్గానే దొరుకుతున్నారు మనుషులు. 


'ఐదు బహుమతులు చాలవు. వచ్చేసారి కనీసం యాభయ్యన్నా పెట్టించాలని అనుకొన్నారు మంత్రిగారు. 


పుట్టంగానే పిల్లల్ని ఫౌండేషన్ కోర్సుల్లో వేసేవాళ్లు, మాఫియా డబ్బుల్తో తీసిన భక్తి సినిమాలు చూసి మతిపోగొట్టుకొనే వాళ్లు, ఆడుక్కొనేందుకు గాంధీ వేషం వేస్తే గానీ ఆదరించని ఉదారులు, దేవుడి పేరు చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నా చెంపలేసుకొనే భక్త శిఖామణులు... టీవీ సీరియల్సు చూసి కళ్ల నీళ్ళు పెట్టుకునే ఆడవాళ్ళు.. ఇలా గజానికో నిజమైన మూర్ఖశిఖామణి ఉన్న పుణ్య భూమిలో యాభై బహుమతులు మాత్రం

ఏమూలకొస్తాయి! 


పెద్దగుంటలో డాలర్లు పోస్తూ కనిపిం చాడో పెద్దాయన ఈసారి.  


విషయమేమిటనడిగితే ' తెల్లారేసరికల్లా డాలర్లు డబ్బులవుతాయి. మా బంధువొకాయన ఈ గుంటలోనే పోశాడు. మా అబ్బాయి అమెరికాలో సంపాదిస్తున్నాడు. నేనిలా వాటిని పెంచుతా' అన్నాడు గుంట పూడ్చుకుంటూ . ఆ గుంట పేరు ' ఖుషీ '  అవి బ్యాంకుట. 


 మంత్రిగారికి జాలేసింది. రాజ గారి సభకు రమ్మని పిలిచాడు.. కనీసం ఆ బహుమతైనా మిగుల్చుకుంటాడో లేదో అనుకొంటూ' 

... 


డబ్బనగానే గుర్తుకొచ్చింది. పాతిక వేలు లోను విషయం. 


కదిపాను సోమరాజుని .


 'ఎందుకూ? నువ్యూ  ఆ గుంటలో పోస్తావా?' అని నవ్వి లేచి నిలబడ్డాడు. 


సోమరాజు ఐదో కాండిడేటెవరో కూడా చెప్పమని అడుగుదామనుకొనే లోపలే బైట కాలింగ్ బెల్ మోగింది. 


లేచి వెళ్ళి తలుపు తీశాను. 


నవ్వుతూ ఒకాయన లోపలకొచ్చి నా చేతులు ఊపాడు. 'కంగ్రాట్యులేషన్స్' అంటూ. 


నా చేతిలో ఒక కవరుంచాడు. అది 'రాజుగారి మూర్ఖుల సభకు ఆహ్వానం' ! ' మీరు తప్పకుండా రావాలి . మంచి బహుమానం ఉంటుంది' అని అన్నాడాయన. 


మా ఆవిడ కాఫీ పంపించింది. 


ఆ వచ్చి నాయన మంత్రి అని పసిగట్టింది కాబోలు. ఆ రాత్రి నేనూరికే మధనపడుతుంటే ' పని వదిలేసిన పనిలేని సోమరాజు చెప్పే పని కిమాలిన కబుర్లు పనిమానుకుని వినే మీరే ఆ అయిదో కేండిడేటుగా అర్హులు'  అనుకొని వుంటారు మంత్రిగారు. ఏదైతేనేం.. బహుమతి వచ్చిందిగా' అని ఊరడించింది మా ఆవిడ. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 20 -08 -2002  న ప్రచురితం ) 

గల్పిక కథ చెప్పినా ఊ కొట్టనమ్మా! రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఆంధ్ర ప్రభ - సుత్తి మొత్తగా ( కాలమ్ ) - 24 -02 - 2018 ప్రచురితం

 





గల్పిక  

కథ చెప్పినా ఊ కొట్టనమ్మా! 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్ర ప్రభ - సుత్తి మొత్తగా  ( కాలమ్ ) - 24 -02 - 2018 ప్రచురితం


కథ చెప్పినా 'ఊ' కొట్టేది లేదమ్మా! పాట పాడినా వంత పలకడం ఉండదమ్మా! ఎంతసేపని ఒకే అక్షరం? బోరు. 'ఊ' అన్నంత మాత్రాన నే వింటున్నట్టు లెక్కా? నీకు చెప్పాలని అనిపిస్తే చెప్పుకో! కానీ నాకు వినాలనిపిస్తేనే వినేది.


ఇవాళ 'కథ' అంటావు. రేపు సుద్దులు మొదలు పెడతావు. ఎల్లుండి నీ కడుపులో ఉన్నదంతా పాటగా మొదలు పెడతావు! ఎన్ని పాత సినిమాలు చూడలేదూ! శ్రీ రంజనులు.. వాణిశ్రీలు వేలెడంతైనా లేని బుడ్డి పాపాయల్ని సొంత గొడవలతో వేధించి ఎందుకు వేపుకు తింటారో?!


కళ్ళయినా ఇంకా పూర్తిగా తెరిచి చూడలేని బుజ్జి పాపాయిలం! మీ సోది పాటలు మేమెలా అర్థం చేసుకోగలమే? ఆ మాత్రమైనా

తెలివిలేని నీ కడుపులో పడ్డందుకు నన్ను నేను తిట్టుకోవాల నుకుంటేనే.. నీ బోరు మొదలు పెట్టుకో! విన్నట్లు దాఖలా కోసం నన్ను మాత్రం 'ఊ' కొట్టమంటే .. నో వే! 


చిన్నపిల్లోడి నోట్లో ఇన్ని పెద్దమాటలేంటని బుగ్గలు నొక్కుకుంటావని తెలుసు. మరేం చేసేది? ఇవాళ అమ్మవు నువ్వు చెప్పావు కదా అని అభిమానంతో 'ఊ' కొట్టానే అనుకో! అదే అలుసుగా రోజూ నువ్వు పురాణాలు మొదలు పెడితే నేనెట్లా చచ్చేది? వేలెడంతైనా లేని పసి వెధవను కదా! ఇప్పుడే నాకీ వేదాలూ.. కథలూ.. అంతవసరమా.. చెప్పమ్మా? 


కథలు వినడానికి భయమెందుకురా? అని నువ్వడగవచ్చు. మన ఇంటి తంటాలో.. చుట్టాలతో గొడవలో.. పక్కింటి వాళ్లతో పోట్లాటలో.. కథలుగా అల్లి చెవితే.. అదో రకం! పురాణాలు మొదలు పెడతావు. పుణ్యపురుషుల కథలంటావు.త్యాగాలు చేసినమహానుభావులంటూ అతిశయోక్తులు జోడించి మరీ సుత్తి కొడతావు. మీ లలిత్ మోదీలు మాదిరో.. నీరవ్ మోదీలు లాగానో ముదిరి పోవద్దని బెదరగొడతావు!


నీరవ్ మోదీల గాధలు చెవినొప్పులైనా సరిగ్గా విచ్చుకోని నా బుర్రలోకి ఎలా వచ్చాయన్నది కదా నీ ధర్మ సందేహం? నాన్నారు చదివే పేపరు.. నువ్వు పొద్దస్తమానం చూసే టీవీలు చాలవా అమ్మా.. నా బుర్ర తొలిచేసేందుకు ?


ముక్కుపచ్చలారని పసిగుడ్డుని. ముక్కులు పగిలిపోయే ఈ దుర్గంధాలను భరించి ఎట్లా తట్టుకోగలనా అని కదా నీ బెంగ! 


అమ్మా! నేను నీ కడుపులో ఉన్న తొమ్మిది నెలలూ నువ్వు తాగింది ఏమైనా స్వచ్ఛమైన గంగాజలమా? సురభి ధేనువు ఏమయినా ధరణికి దిగి వచ్చి పితికి  పోసిన క్షీరమా?!


నాన్నారు పొద్దస్తమానం ఆ పత్రికల్లోని వార్తలు బైటికి చదువు తూంటారు కదా.. వింటుంటాను. కల్లా కపటం లేకుండా నేను పెరిగి పెద్దవ్వాలని నువ్వు కలలు కంటు న్నావు కానీ పిచ్చి తల్లీ! కల్లిబొల్లి కబుర్లకు ఉండే విలువ నిజాలకు ఈ లోకంలో ఉండదని తెలుసుకు న్నాను. 


అబ్బాయి అమెరికాలో, అమ్మాయి ఆస్ట్రేలియాలో నెలకో యాభై వేలొచ్చే చల్లని సర్కారుద్యోగం, నెల మొదటి తేదీనే ముద్ద కుడుముల్లా అరవై వేలు కిరాయి స్థితికిచ్చే కామధేనువ్వంటి కమర్షియల్ కాంప్లెక్సు. అయినా సర్పంచి మనోడేనని  తెల్లకార్డుకు తెగబడ్డం. ఎమ్మెల్యే ఎరికెలో ఉన్నాడని ఇందిరమ్మ ఇంటికి ఎగబడ్డం! ఏ సిరప్ పంచెలెగకట్టి మోడీగాడి మార్కు గారడీనో టీవీలో వినబడంగానే మరీ దొంగగాడిదలంటూ ఓ పంచాంగం గడగడా చదివేయడం!


పక్కింటి వెంకట్రావ్ ఆర్టీవో ఆఫీసరు . వాడు వంద కోట్లు బొక్కిన వైనం వాడకంతా తెలుసు! చిన్నకొడుకు కాంట్రాక్టరు. గవర్నమెంటు సొమ్ము కోట్లు బొక్కినా సైలెన్సు! అవినీతి మన ఇంటా బైటానే పొంగి పార్లుతుంది కదమ్మా! ఎక్కడో పారే మురుగుకు  మాత్రమేనా ముక్కులు మూసుకోడం?


పోనీ... నువ్వు చెప్పావుకదా! హిపోక్రసీ వద్దు. నీతిగానే బతుకంతా గడుపుదామనుకున్నా . అవినీతిలో నా వాటా అప్పుడే నూట ఎనభై

రూపాయలంట! లెక్కగట్టేశారు! ఇంటికి ఇట్లా ఓ నాలుగు నూటపదార్ల చొప్పున అక్రమార్జన గానీ లెక్క గడితే.. నూటిరవై కోట్ల మంది వాటా ఎన్ని లక్షల కోట్లుంటుందో నువ్వే చెప్పమ్మా! ఆపైనే నీ నీతి కహానీలు నేను వినేది. మనసారా 'ఊ' అనేది.


ఆపలేవా? మరింకెడుకమ్మా ఈ ఆపసోపాలు? కథలు.. కాకర కాయలు?


అందుకే..బొడ్డూడనప్పటినుంచేనాకీ బంధనాలు వద్దనేదమ్మా! ఈ లోకం మహాత్ములు మహాత్ముల మాదిరి బతికే తీరులో ఉందంటావా? అమాయకంగా నువ్వేదో కథలల్లి పాడడం.. వెర్రి పుచ్చకాయలా నేనలా నోరు వెళ్లబెట్టి వినడం!


నేను మహాత్మా గాంధీలా పెరగాలని నీ పేరాశ! అదంతా వల్లకాక, పెడసరంగాళ్లతో వీలుపడక ఆనక ఏదో తప్పు చేసినవాడిలా ఇంట్లో మీ ముందు తప్పించుకు తిరగడం.. ఇదంతా ఎందుకు1 అందుకే నా కే కథలూ... కహానీలు వద్దనే వద్దు!


పసిబిడ్డలకు జోల పాటలు పాడి వినిపిస్తే.. తల్లి మనసుకు కాస్తంత ఊరటగా ఉంటుందని హాలెండు యూనివర్శిటీ అన్నదని అంటావా? కథలూ పాటలంటే కన్నవాళ్లకి సరదానే! వినే పిల్లకాయలకే ఇబ్బంది. ఉయ్యాల దిగడం ఆలీసం .. మళ్లా ఏ విమానమో ఎక్కి అమెరికా వెళ్లే వరకూ మమ్మల్ని మీరు ప్రశాంతంగా నిద్ర పోనిస్తారా? 


పాడు చదువులతో మా మూడ్ పాడు చేయకుండా వదిలే కన్నవారు ఎందరున్నారమ్మా?


ఇంతోటి భాగ్యానికి ఇప్పుడీ కథలూ, కాకర కాయలు, పాటలూ, సుమతి పద్యాలు ఎందుకు చెప్పు? నొప్పెట్టు వరకూ 'ఊ' కొట్టడాలెందుకు.. దవడలకు ముప్పు,


నీ మానాన నువ్వు కళ్ళు మూసుకు పడుకో పో అమ్మా! నా మానాన నేను నాకు నచ్చిన ర్యాపో, ర్యాకో కునుకు పట్టే దాకా కళ్లు మూసుకు వింటూ పడుకుంటా! గుడ్ నైట్ మామ్! గది తలుపేసి వెళ్లు! పోతూ పోతూ.. ఆ లైటార్పేసి.. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి పో! 


రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఆంధ్ర ప్రభ - సుత్తి మొత్తగా  ( కాలమ్ ) - 24 -02 - 2018 ప్రచురితం ) 

తెలుగ్గోడు - రచన - కర్లపాలెం హనుమంతరావు ( ఈ నాడు - 22 -01 - 2010 న ప్రచురితం )

 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 


తెలుగ్గోడు

- రచన - కార్లపాలెం హనుమంతరావు 

( ఈ నాడు - 22 -01 - 2010 న ప్రచురితం )  


ఆంగ్ల భాష మీద ఆంగ్లేయుడికైనా ఇంత ప్రేమ కారిపోతుందో లేదో సందేహమే! ఇప్పుడు మారుమూల పల్లెటూళ్లలోనూ ఏబీసీడీలు చెప్పకపోతే పిల్లల్ని బడికి పంపించేదిలేదని తల్లిదండ్రులు తెగేసి చెప్పేస్తున్నారు. అదీ ఇంగ్లిషోడి బిస! 


తెలుగువాళ్లందరు తెలుగులోనే మాట్లాడుకుందాం. చచ్చిపోతున్న మన భాషను బతికించుకుందాం- అని ఎవడైనా చాదస్తం కొద్దీ బైటకు అన్నాడో..  వచ్చాడే!  తెలుగు గడ్డమీద పుట్టిన పాపానికి ఎట్లాగూ ' 'టెలుగూస్ ' అని పిలిపించుకునే ఖర్మ తప్పటంలేదు. ఇంకా మా నోటితో కూడా  మాట్లాడుతూ చెల్లని నోటులాగా చలామణీ కాకుండా పోవాలనే  ఈ తెలుగు మాట్లాడాలని రొదపెట్టే వాళ్ల గోల! ' అని గయ్యిమని లేచేవాళ్లకు సమాధానం చెప్పగలిగే స్థితిలో  మాతృభాషపై మమకారం మిగిలిన వాళ్లం చేతి వేళ్లంత మందైనా ఉన్నామా! 


తెలుగులో చదువుకుంటే..నామోషి . ప్రభుత్వోద్యోగాలున్నా తెలుగు మాత్రమే చదివిన అభాగ్యులకు వచ్చే అవకాశాలున్నాయా ? 


తెలుగు ఉపా ధ్యాయుల ఉద్యోగాల దరఖాస్తులైనా తెలుగులో నింపే అవ కాశం ఉందా? వత్తులెక్కడ పెట్టాలో దీర్ఘాలెక్కడ తీయాలో కష్టపడి నేర్చుకుని సాధించేదేముంవింక్! ? 


గతంలో కనీసం తెలుగు సినిమాలు, పాటలు చూడటానికి, వినటానికైనా పనికివచ్చేది. ఇప్పుడు వాటిలోనూ ఒక్క తెలుగు ముక్క వినబడటంలేదు.  ఇన్ని అప్పలు పడుతూ ఈ భాష నేర్చుకునే అగత్యం ఎవరికి ?


పుట్టుకతో వచ్చిన కులాన్ని మనం మార్చుకోలేం. అట్లాగే ఈ ' తెలుగోళ్లు' అనే పేరునూ ఏమీ చేయలేం. అదే 'మతం ' లా  మార్చుకునే సౌకర్యం రాజ్యాంగం కల్పించుంటే? ఆంధ్రప్రదేశ్ ఆంగ్ల ప్రదేశ్ గా ఎప్పుడో మారుండేది . 


ఆటగాళ్ళకు ఇచ్చే ప్రత్యేకమైన కోటాలాగా తెలుగు చదువుకునేవాళ్ళకూ  ప్రత్యేకమైన ఆవకాశాలు ఇవ్వాలి . లేని పక్షంలో తెలుగులో రాసేవాళ్లు చదువుకునేవాళ్లు ఆనవాలుకైనా దొరకరు.  


తమ పిల్లలు దొరల భాష నేర్చు కుని దొరబాబుల్లాగానో, దొరసానుల్లాగానో  ఫోజులివ్వాలని, ఏ ఒబామాకు మల్లెనో డాబుగా ఉండాలని, బిల్ గేట్సుకు మించి  డాలర్లు సంపావించాలని  ఏ కన్నవారికుండదు కానీ, అందుకు  వేలెడంత వయసు లేని బిడ్డను వేలుపోసి గొడ్ల చావిడి బడుల్లో బందీ చేయాలా! 


ఆంగ్లం లో తప్ప నోటి నుంచి మరో మాడి వినకూడదు అనడమే తప్పు! 


దేశంలో  మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం మనదే

నని మహా గొప్పగా చెప్పుకుంటాం.  మహా బాగుంది .. మరెందుకు " చక్కలి భాషా పదమేమీ అంతుచిక్క కనా.. తెలుగు భాష ఉద్ధరణకని స్థాపించుకున్న విద్యాపీఠానికి తెలుగు ' అకాడమి' అవి నామకరణం ?   'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'  తొందరలో వెస్ట్ దిక్కు నుంచి కనుమరుగవబోతుందని కలవరమైనా లేదు.. కనుకనే .. మనం తెలుగు వారం!  తెలుగును ఒక వారకు తోసేసిన ఘనులం! 


పది పదాల తెలుగు పలుకులను తొట్రుపాటు లేకుండా పదో తరగతి విద్యార్థి  కూడా  పలుకలేని దౌర్భాగ్య స్థితి మ్వ భాషా మతల్లిది.  . అధికార హోదా దేవుడెరుగు ..అసలుకే మోసమొచ్చే  అమ్మ భాష బాధ చూడు! 

రుబ్బురోలూ , చమురు దీపం, , పాంకోళ్ళూ, బొంగు , భోషాణం .. తరహా అచ్చు తెలుగు పదాలు అచ్చంగా కనుమరుగయ్యాయి. గ్యాసుస్టవ్వు ,  ఆయిల్ లేంపు, ఫేషన్ షూసూ,  బేంబూ  స్టిక్కూ,  ఐరన్ లాకర్ తరపు సగం పుచ్చు ఆంగ్ల పదాలతో తెలుగు పలుకులు సంకరమయాయి! 


అణాలు, బేడలూ కాలం చెల్లినట్లా అఆలు.. కఖాలు . . కనుమరుగయి పోవడాలు!   హిందీలా తరువాత అందరం  మాట్లాడే అతిపెద్ద భాష  మందే నంటే సరిపోతుందా ?  అమ్మలే  అమ్మ భాషను నామోషీ అనుకుంటే ని టముకులు కొట్టీ ప్రయోజన మేంటి? 


పశువులూ పక్షులైనా సొంతభాషలోనే గొంతు చించుకునేది. తెలుగులమై ఉండీ తెలుగంటే తెగ నీలుగుతున్నాము!  


ఇరుగూపొరుగుల నుంచి రవ్వంత అభిమానం అరువైనా తెద్దామా! ఢిల్లీ సభలో కూడా సిల్లీ అనుకోరు తల్లి భాషలో అభిభాషించేందుకు!   అదే మన నేతాశ్రీలో! చెబితే చేదే గానీ, పలికేవన్నీ పరాయి భాషా పదాలు. 


మరీ మరాఠీలకు మల్లే  పరాయి భాషలతో వ్యవహారం చేసే వారిని  పిడిగుద్దులతో శుద్ధిచేయడం సరికాదు కానీ.. ఎవరెవరో మవ బుద్ధిలేని తనాన్ని వేలెత్తి హేళన చేయకముందే ఇంచక్కా ఇకనైనా కూ అమ్మ పలుకు మాత్రమే పలికే శుభాకార్యానికి శ్రీకారం చుడదావగా ? నలుగురిలో మన తెలుగుకు సరికొత్తగా వెలుగులు మళ్లీ తెద్దామా తెలుగోడా!     


ఐ నెవర్ స్పీక్  ఇన్ తెలుగు' అనడానికి బదులుగా ' అన్ని వేళలా నేను నా తల్లి భాషనే పలికేను ' అని.. . ఏదీ.. అను!  తెలుగు అన్నదమ్ములు , అక్క చెల్లెళ్ళందరి నోటా అనిపించు! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక - 20 -01 - 2010 - ప్రచురితం ) 

తొండము స్వామికి దండాలు - కర్లపాలెం హనుమంతరావు

 వ్యాసం: 

తొండము స్వామికి దండాలు

- కర్లపాలెం హనుమంతరావు


ఎలుకతోకను ఏనుగు తొండాన్ని అనుసంధానించే బొజ్జగణపయ్య స్థూలసూక్ష్మస్వరూపానికి నిలువెత్తు సాక్షి. 


గుప్పెడంత మట్టితో మన నట్టింటి పాలవెల్లికింద భాద్రపద శుద్ధ చవితినాడు కొలవయ్యే కుడుములయ్యది యుగాది నుంచి దిగంతాలదాకా విస్తరించిన వింత కథ. 


లింగ పురాణం ప్రకారం సురుల మొరవిని అసురులను అణచేందుకు హరుడు సృష్టించిన వీరుడు వినాయకుడు. శివపురాణం ప్రకారం భర్తభృత్యులు నంది, భృంగ్యాదులకు పోటీగా పార్వతమ్మ ప్రాణం పోసిన వంటినలుగుపిండి బొమ్మ. శాంకరీజంట కరిజంటగా హేమవనంలో జరిపిన ప్రేమవిహార ఫలమీ గజాననుడని సుప్రభేదాగమం కథ. నన్నెచోడుని 'కుమారసంభవం'లో బ్రహ్మేంద్రాది దేవతల, ఋషిగణాల ప్రార్థనల మీదట శివగణ సురగణాలకు ఆధిపతీ, అఖిల క్రియారంభాదికార్యాలకి అధినాయకుడయిందీ ఈ వినాయకుడే. 


శైవవైష్ణవులతో సరిసమానంగా పూజలందుకునే ఒకేఒక్క సామ్యస్వామి ఈ విఘ్ననాయకుడు. అమరకోశం ప్రకారం బుద్ధుడికి వినాయకుడని మరోపేరు. ఒకటో శతాబ్దినాటి హాలుని గాథా సప్తశతిలో గజాననుడి చేష్టను వర్ణించే కథ వుంది (5-3). గృహ్యసూత్రాలలో నలుగురు వినాయకులు. యాజ్ఞవల్క్యుని కాలంనాటికి వినాయకుడు ఒకడే కాని పేర్లు ఆరు. 


పురాణకాలంనాటి వామాచారం, తాంత్రిక పద్ధతులు అష్ట గణపతులను సృష్టించాయి. భరతఖండ సంస్కృతితోపాటు చైనా, ఇండోనీషియాలవంటి విదేశాలకు విస్తరించిన దేవుడు వినాయకుడు. మెక్సికోలో గణపతి ధాన్యదేవత. గోగాదీవుల్లో ఆలో ఆలో. గ్రీకుదేశంలో డెమెటర్. రోమనులకు కెరెస్. జపాన్ వినాయకుడి పేరు 'బినాయికియా', 'హిందూయిజం' అనే ఆంగ్ల గ్రంథంలో గోవిందదాసు- 'ఆర్యుల పూజాదికాలలోకి చొచ్చుక్కొచ్చిన అనార్యదైవంగా వినాయకుడిని అభివర్ణించారు.


బొజ్జగణపయ్యని తెలుగువాళ్ళు పెంచి పోషించిన తీరు కపిలవాయి లింగమూర్తి ఒక క్రమంలో చక్కగా వివరించారు. తెలుగు పడతుల కపోలాలు, కుచాలు, ఊరువులు ఏనుగు దంతాలు, కుంభాలు, కరాలవలె శోభిల్లుతుంటాయి కనక ఆ అమ్మను ముమ్మూర్తులా పోలినట్లుండే గజాననుడు సంచిత భాగ్యవంతుదవుతాడని సిద్ధసతులద్వారా శుభాశ్శీసులు పలుకుతాడు కన్నప్పచరిత్ర కావ్యకర్త. 


అది బాలగణపతి తొట్టిఉయ్యాలలూగేనాటి ముచ్చట. తల్లిపాలు తాగే వయసులో గణపతి చేసిన అల్లరి అల్లసానివారు మనుచరిత్రలో 'అంకము జేరి' పద్యంలో పొంకంగా వివరించనే వివరించారు. తొట్టెలో  పెట్టే తండ్రి పైబట్ట గుంజి అప్పచ్చికోసం అల్లరి పెట్టే బుజ్జిగణపయ్య రఘునాథ నాయకుడి పార్వతీ పరిణయంలో అలరిస్తాడు. పాలు తగ్గించి అప్పాలకోసం పిల్లలు మారాం చేసే పసిదశ దాటి తల్లిదండ్రులకు ముద్దులిచ్చే వయసునాటి ముచ్చట్లను అప్పకవి పద్యం చేసారు. 'జనక భుజద్వయాగ్రమున చక్కగ నిల్చి తదుత్తమాంగమం/దునగల వాహినీ విమలతోయములందున నీడ గాంచి నా యనుజుని మీద బెట్టుకొనె నప్పయటంచును తల్లితోడ జె/ప్పిన' అమాయక బాలగణపతి 'అలమేలుమంగా పరిణయం'లో కనిపిస్తాడు. వెండికొండను బొంగరంగా.. భుజంగేంద్రుణ్ని తాడుగా చేసి బొంగరాలు  ఆడే బిడ్డకు గిరిపుత్రి నచ్చచెప్పే ముచ్చట విక్రమార్క చరిత్రంలోది. తల్లిదండ్రుల మాటలు ఆలకించి ఆచరించే వినయశీలత వుట్టిపడే ఆ కౌమార్యం గడిస్తే ఇక వసుచరిత్రలోని 'దంతాఘట్ట' ఘట్టమే. ఇక్కడ ఎదిగిన కుమారాగ్రేసురుడుగా గజాననుడు కనిపిస్తాడు. సరస భూపాలీయంలోని పద్యం పితృస్వాంతాలు అలరింపచేసే గణపతి ప్రౌఢత్వాన్ని ప్రస్తుతిస్తుంది. 'అరుదుగ వామభాగ లలనా కలనా చలనాత్ముడైన యా/హరుగురు గాంచి తానును తదాకృతి యేకదంతుడై/కరి కరణీగుణంబులు మొగంబున దాల్చి జగంబులేలే' కరుణాసనాథుడిగ రూపాంతరం చెందేదాకా తెలుగువాళ్ళు గణపయ్యను తమవాడిగా పెంచి పోషించుకొని సేవించుకున్నారు.


గజరూపం, ఏకదంతం, మూషికవాహనం, బ్రహ్మచర్యం, లంబోదరం-ఐనా యుగయుగాలుగా అశేష భక్తజనావళి నివాళి ! క్షేత్రతస్కరుడైన ముషికాసురుణ్ని మర్దించే పంటల దేవుడిగా గజాననుడిని రావుబహుదూర్ బి ఏ గుప్తా సిద్ధాంతరీకరించారు. ధాన్యాన్ని తూర్పారపట్టే చేటల్లాంటి చెవులు, నాగలిని పోలిన ఏకదంతం, గాదె మాదిరి వినాయకుడు పంటల దేవుడనడానికి గుప్తాజీ చూపిస్తున్న నిదర్శనాలు. ధర్మసింధువో, నిర్ణయసింధువో నిర్ణయించిందని కాదు. వర్షర్తువు. ఉత్తరార్థం. ప్రకృతి ప్రౌఢత్వం సంతరించుకుని పరిపాక రమణీయకంగా ప్రదర్శితమయ్యే ఆహ్లాదకర వాతావరణం. తొలికారు సస్యలక్ష్మి ఫలోన్ముఖంగా కళకళలు పోతూ అభ్యుదయపథాన నిర్విఘ్నంగా కొనసాగాలనే కాంక్షకు ప్రతిరూపంగా ఈ చవితి సంబరాన్ని భావించడం సబబు. 


విస్సా అప్పారావుగారి ఉపపత్తి ప్రకారం చూసుకున్నా ఈనాటి అంబర దృశ్యరహస్యమే ఈ సంబరం వెనకున్న ప్రేరణ. చిన్న ఎలుకలాంటి నక్షత్రాల గుంపుమీద విఘ్నేశ్వరాకారంలో మరో నక్షత్రాల గుంపు.. ఉషోదయానికి పూర్వమే పూర్వాకాశాన మెరిసే భాద్రపద శుద్ధ చవితికి మించిన మంచి ముహూర్తం మరేముంటుంది! 


భవిష్యపురాణం ప్రకారం విఘ్న నియంతే కాదు.. విద్యాధిదేవత కూడా వినాయకుడు. వ్యాసమహర్షి భారతేతిహాసానికి రాయసగాడు. ప్రాచీనాచార్యుల  భావనలో బ్రహ్మణస్పతి. రుగ్వేదం స్తుతించిన బృహస్పతి. యాస్కరాచార్యుడి నిరుక్తం లెక్కన వాక్కుకీ అధిపతి. అక్షరాభ్యాసాది ఏ ఉత్సవానికైనా తొలి దైవతం వినాయకుడే. 


ఎన్నెన్నో పురాణగాథలు సహస్రాబ్దాలుగా కలగాపులగమై ఇవాళ మనం జరుపుకునే పండుగ రూపం సంతరించుకున్నదన్న తిరుమలవారి మతమే సత్యం. రావూరివారు అన్నట్లు మనసుకి ఆనందరసానుభూతి అందే క్షణాలన్నీ పండుగలే. పెదాలమీద చిరుదరహాసాలు మెరవడమే ఏ పూజకైనా ఫలశ్రుతి. నిత్యజీవన యాత్రలో పొట్టకూటికి సతమతమయ్యే సగటు జీవికి ఇహాన్నుంచి ఈ రోజు ఉపశమనం. పరాన్ని గూర్చి యోచించే సదవకాశం. వినాయక చవితి శుభాకాంక్షలు.


- కర్లపాలెం హనుమంతరావు

ఏడుపు మంచిదే - ఈనాడు - వ్యంగ్యం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయ పుట- ( 06 - 12 - 2011) ప్రచురితం)

 



ఏడుపు మంచిదే - ఈనాడు - వ్యంగ్యం 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయ పుట- ( 06 - 12 - 2011) ప్రచురితం)  


ఏడవడం నిజంగా ఓ గొప్పకళ . కలవరపడినప్పుడల్లా కడవల కొద్దీ కన్నీరు కార్చడం అందరికీ అంత సులభంగా అబ్బే విద్య కాదు. 


' ఆ పిల్ల ఏమిటండీ బాబూ, ఎప్పుడూ నెత్తిమీద నీళ్ళకుండ పెట్టుకునే ఉంటుందీ!' అని విసుక్కోవడం తప్పు. ఏ ఉల్లిపాయ, గ్లిజరిన్ల సాయం లేకుండా అలా వలవలా ఏడవాలంటే ఎంత గుండెబలం కావాలి! 


బాలలకు, అబలలకే కాదు- అందరికీ బలే బలం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం- ఈమధ్య వార్తల్లో తరచుగా వినిపించే ఏడుపులే!


ఏడ్చి కైకమ్మ కొడుక్కు పట్టాభిషేకం సాధించుకోవాలనుకుంది. ముక్కు తిమ్మనగారి  సత్యభామ ఎంత ముద్దుగా ఏడ్చి ఉండకపోతే తన పంతం నెగ్గించుకుని ఉంటుంది! 


శోకం ధర్మ విరుద్ధం, అపకీర్తిదాయకం, నరకహే తువు అంటూ గీతాచార్యుడు ఎన్ని ముక్కచీ వాట్లు పెట్టి ఉన్నా, ముక్కు చీదడం రానివాడికి ఈ కలికాలంలో చెరసాల నరకం ఖాయం . 


కరుణానిధి కూతురు ఆ ఏడుపేదో  ముందు ఏడవక పోబట్టేగదా తీహార్ జైల్లో ఆర్నెల్లపాటు అలా భోరుమంటూ గడపాల్సి వచ్చిందీ! చెరగండం గడవాలంటే కలాఅడీకి మల్లే  వట్టి పిచ్చివేషాలు చాలవు. దేవుడిని అడ్డుపెట్టుకున్నా- దొరికేది తాత్కా లిక మోక్షమే! తల్లి సెంటిమెంటైనా పండనిచోట దుఃఖమంత్రమొక్కటే దిక్కు. 


యెడ్యూరప్పకు ఏడుపు పవరేంటో తెలుసు . కాబట్టే అధికారంలో ఉన్నంత కాలం ఏడుస్తూనే పాలన కొనసాగించాడు . బిక్కమొగమేయడం తప్ప బిగ్గరగా గగ్గోలు పెట్టడం రాలేదు. . కాబట్టి, రామలింగరాజు అంతకాలం జైల్లో చిప్పకూడు తిన్నాడు. 


ఇనుప గనుల గాలికి ఆ అంతులేని సంపద సాధించి పెట్టలేని బెయిలును, పాతిక వేల పూచీకత్తుతో  శ్రీ లక్ష్మి మేడమ్ సాధించుకోగలిగారంటే, ఆ ఘనత ఆమెది కాదు... ఆమె నెత్తిమీదున్న జలఘటానిది.


'నవ్వుకోవడానికి ముప్పై రెండు పళ్లున్నాయి. ఏడవడా నికి రెండే కళ్లు' అంటూ నవ్వుల సంఘం బాపతు మనుషులు ఏవేవో  వృథా కబుర్లు చెబుతుంటారు. 


నిజానికి నవ్వే నాలుగిందాల చేటు. మయసభ మధ్యలో నిలబడి పకపక్ 

కలాడినందుకు పాంచాలికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు.  కురుసభ మధ్యలో చిక్కడిపోయినప్పుడు 'హేకృష్ణా' అన్న రోదనే కదా చివరికి ఆ సాధ్వీమణి  మానాన్ని కాపాడిందీ!


కలకంఠి కంట కన్నీరు ఒలికితే ఇంట సిరి నిలవదంటారు.  వట్టిదే ! చెరసాలలో ఉసిరితొక్కు కూడు తప్పాలంటే టాప్ రేంకులు ..  తెలివితేటలు కాదు కావాల్సింది. విరామం లేకుండా కంటి కుండల  కుండ వలసిన శక్తియుక్తులు! 


ఇమ్మనుజేశ్వరాధములకు తనను అమ్మవద్దని పోతన ఇంటిగుమ్మంలో కూర్చుని కుమిలిపోయింది శారదమ్మవంటి మహాతల్లి.  మేడమ్ శ్రీలక్ష్మిగారు  తీసిందీ   అదే ఆరున్నొక్క రాగం. 


'ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి. ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు' అంటూ తల్లులు పిల్లల్ని జోలపాటలప్పటి నుంచే తప్పుదారి పట్టించడం తగదు.  ఏమో, ఎవరు చూడొచ్చారు... పెరిగి పెద్దయిన తరువాత ఏ పెనుగం డాలు జైలురూపంలో ఎదురు రాబోతున్నాయో! కీడెంచి మేలెంచడమని కదా సామెత!  కీ ఇచ్చినట్లు ఏడవడం పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పించడం మంచిది. బెయిలు మీదన్నా సరే నవ్వుతా  జైళ్ల బైట క్షేమంగా బతుకుతారు. 


వట్టి ఏడుపు గొట్టు అనేది ఇక ఎంతమాత్రం తిట్టు పదం కాదు  జైలుకు వెళ్లినా ఊటీకి వెళ్లొచ్చినంత కులాసాగా  బయటపడాలంటే  ఉపకరించే

మహా అస్త్రం నోరు బాదుకుంటో భోరు భోరు మనడమే! 


నేరం మోపినప్పుడు చట్టానికి చిక్కకుండా మాయరోగాలు కొని తెచ్చుకోవడం పాతకాలంనాటి చిట్కా.  రోజులు బాగా లేవు.  నిజంగా ఆరోగ్యం చెడిపోయినా అమర్ సింగ్ అంతటి మేధావికే ఊరట దొరకడం కష్టమైపోయింది. ముందస్తు బెయిలు ఆదేశాల పప్పులూ మునుపటంత సులభంగా ఉడకనప్పుడు, ఆపకుండా నెత్తి మీద కుళాయి తిప్పి వదిలిపెట్టి కూర్చోవడమొక్కటే ఆపదలనుంచి కాపాడే ఏకైక సాధనం.  ఏమడిగినా ఏడుపొక్కటే  బదులు  రావాలి. ఎంత గద్దిస్తే అంతగా దద్దరిల్లిపోమేలా ఏడవాలి  . మౌనం అనర్ధం. అర్ధాంగీకారం కింద అర్ధం తీసుకొనే ప్రమాదం  కద్దు. ఆరున్నొక్కరాగంలో  మనమేం చెబు తున్నామో అడిగినవాడికి అర్ధమై చావక  ఏడవాలి. ఎన్ని చేతిరుమాళ్లు తడిసిపోతే అంత ఫలం. 


' ఏడ్చేవాడి బిడ్డకే ఎవరైనా అరటిపండ్లు పెట్టేది' అని సామెత. 


ఏడుపంటే మరీ అంత దడుపెందుకు ? ఏడుస్తూనే పుడతాం. ఏడిపించి వెళ్ళి పోతాం. బతికినంతకాలం మనకు ఏడుపు . పోయిన తరువాత మనవాళ్లకు ఏడుపు. పుట్టినా గిట్టినా, ఉన్నా పోయినా తప్పని ఏడుపుల్ని తప్పించుకోవాలని చూసేకన్నా వీలైనంత వరకు ప్రయోజనాలు పిండుకోవా లని చూడటమే సిసలైన స్థిత  ప్రజ్ఞత . 


 ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడవడానికి మొహమాటపడి తిప్పలు కొనితెచ్చుకోవడంకన్నా విషాదం జీవితంలో మరొకటి ఉండదు.


రోజుకో కుంభకోణం కొత్త కొత్తది బయటపడుతున్న రోజులివి. సీబీఐ ముందు జవాబులు చెప్పడానికి ఎవరె ప్పుడు వెళ్ళవలసి వస్తుందా  ఎవరికి తెలుసు! ఎందుకైనా మంచిది. ముందస్తు బెయిళ్లు మాయరోగాలు, దేవుడి పూజలు, ఫ్యామిలీ సెంటిమెంట్లు, దక్షిణాలు, ప్రదక్షిణాల చిట్కాలమీదే పూర్తిగా భరోసా పెట్టుకోవద్దండీ! రోజులో ఇరవై నాలుగ్గంటలూ ఆపకుండా ఏడవడం ఎల్లాగో  ముందు సాధన చేయటం మొదలుపెట్టండి! చేతారాదు అంటే ఇక మీ ఏడుపు మీరు ఏడవండి! తప్పేదేముంది ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదకీయ పుట- ( 06 - 12 - 2011) ప్రచురితం)  


ముందస్తు ఖైదు - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- హాస్యం - 03 -02 -2012 న ప్రచురితం)

 



ఈనాడు - గల్పిక- హాస్యం 


ముందస్తు ఖైదు

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- హాస్యం - 03 -02 -2012 న ప్రచురితం)


ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు .. చూడచూడ రుచుల జాడవేరు అని మన వేమన ఎప్పుడో చెప్పేశాడు. 

.

అయితే ఉప్పు గొప్పా, కర్పూరం గొప్పా అని మాత్రం తేల్చినట్లు  లేదు. కర్పూరాన్నేం   చేసుకుంటాం? కాస్త హారతి పళ్ళెంలో పెట్టి నైవేద్యానికి ముందు దేవుడికి చూపెట్టి కళ్లకద్దుకుంటాం.  గ్యారంటీగా పుణ్యం వస్తుందో లేదో కూడా చెప్పలేని పూజా కార్యం అది. అదే ఉప్పయితేనో  ? 


పప్పులో వేసుకోవచ్చు.  కూరల్లో అది  వేయనిదే రుచే రాదు. దిష్టి తీయాలన్నా ఉప్పే గతి. ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగాలున్న ఉప్పును కర్పూరంకన్నా హీనంగా చూడటం అ న్యాయం! కదా? 


ఈ అన్యాయం ప్రభుత్వాధికారుల్లో కూడా కొనసాగుతున్నట్లున్నది  ఇప్పుడు.  పాపం ఆచార్యను చూడండి! చెడు అనవద్దు . చెడు కనవద్దు, చెడుమాటలు వినవద్దు' అని చిన్నప్పటినుంచి పెద్దలు మూడుకో తుల్ని చూపించి మరీ మనకు సుద్దులు చెబుతుంటారు గదా! మరి కొద్దిమంది బుద్ధిమంతులైన అధికారులు ఆ మాటలనే విధినిర్వహణలో తుచ తప్పకుండా పాటిస్తారు .  తప్పుపట్టడం ఎంత దారుణం! 


'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల' ని చెప్పేది పెద్దలే. అరచేతిలో దీపం ఉన్నా తడుముకుంటూ తిరిగితే కట్టుకున్న ఇల్లాలే ఛీ కొట్టే  జమానా ఇది. అష్టకష్టాలు పడి పైకొచ్చినవాడి చేతికి కాస్త వెలుగిచ్చే దీపం బుడ్డి  దొరికినప్పుడైనా ఇల్లు చక్కబె ట్టుకోవాలనుకోవడమే సర్కారు దొరలను  ఇరకాటంలో పడవేసేది! 


సర్కారు ఉద్యోగమనగానే 'జీతమెంత? '  అని కనీసం వెర్రి వెంగళప్ప కూడా అడగడంలేదు. గిట్టుబాటయ్యే గీతం ఎంత ఘనంగా ఉంటే ఆ ఉద్యోగమంత గొప్పదని గదా లోకం  ఆలోచన. నేతిబొట్టు నాలికమీదేసి చప్పరించ వద్దంటే- ముక్కు మూసుకుని కూర్చునే మునిము చ్చుల వల్ల కూడా కానిపని కదా!  ముప్పూటలా ఉప్పుకారాలు మెక్కే   మనిషి మరి తిన్న ఉప్పును దానం చేసిన వాడిమీద కాస్తంతైనా మమకారం  చూపించని పక్షంలో  మళ్ళా 'విశ్వాసంలేని కుక్క'  అని ఛీ కొట్టేదీ  జినమేగా? జైలు జీవితానికి జంకంటే ఎలా?! 


ఒక్కోసారి జైలుశాఖలో  పై అధికారే జైలు లోపలకు  వెళ్ళవలసి రావచ్చు .  దర్శకుడు రామ్ గోపాలే వర్మకయినా  తట్టని  ట్విస్టు  సదరు జైలు అధికారికి మాత్రం ఎలా తడుతుంది? కాబట్టి  ఆ దారిలో  దూసుకు వెళ్లే సాహసులే ముదస్తుAా జాగ్రత్తపడాలి.


అసలు నాలుగు రాళ్లు వెనకేసుకునేటప్పుడే ముందుచూపుతో ఇంట్లో జైలు జీవితాన్ని సాధన చేయడం మంచిది.


అంతరిక్ష ప్రయాణానికి ముందు వ్యోమగాములు నేలమీద చేస్తారే .. అలా బైట ఎంత అధికారం చలాయిస్తున్నా.... జైలు లోపల  గడపాల్సిన జీవితం అందుకు విరుద్ధం . 


పట్టు పరుపులమీద పడి దొర్లేవాడికైనా పాడుపనులు చేసి దొరికిపోతే.. కటకటాల వెనక కటికనేల పై నిద్ర తప్పడు। ఇప్పటినుంచే పడగ్గదిలో దోమతెరలు ఎత్తేసి దిండూ దుప్పటి పక్కన పారేసి పక్కమీద పొర్లడం అలవాటు చేసుకోవడం మంచిది. నాలుగు గుప్పెళ్ళు నల్లుల్ని పనివాళ్లనడిగి తెప్పించుకొని పక్కమీద చల్లుకోవడం మరిచిపోవద్దు . ఎప్పటికప్పుడు చలువ చేసిన దుప్పట్లు ఇక కుదరకపోవచ్చు. 


పడుకునే ముందు పక్క గుడ్డల్ని  మట్టిలో పొర్లించడం వంటికి  మంచిది .  బెడ్ కాఫీలు, వాకింగులు తరవాత , బోర్నవిటాలు, పొగలుకక్కే  ఇడ్లీ వడా సాంబార్లూ అల్పాహారంలో అమరకపోవచ్చు.  మధ్యాహ్నం  అయిదు నక్షత్రాల హోటల్ విందులు, రాత్రి భోజనంలో రకరకాల పానీయాలు ఇంక నిద్రలో కనిపించే కలలే  కావచ్చు. ఇప్పటినుంచే ఉప్పుడు పిండి, చప్పిడి కూర, పాసిన అన్నం, పల్చటి చారు, మజ్జిగ జావ సత్తు బొచ్చెలో..  నిలబడి గబగబ మింగడం సాధన చేయటం అవసరం.  మడత నలగని దుస్తుల్లో కొత్తయిదొందల నోటులాగా  పెళపెళలాడిపోయే రోజులు ఇంకెన్నాళుంటాయో తెలీదు. ఇప్పట్నుంచే ఇంట్లో  ఒంటిమీదకి చారల చారల  బనీను, సగం నిక్కరు తగిలించుకుని తిరిగితే అప్పటికి ఆలవాటై పోతుంది.


ఇంటి పనంటే ఆ అయ్యకు ఇప్పటిదాకా పొద్దున్నే పేపరు చదువుకోవడమూ, స్నానాల గదిదాకా నడిచిపోవడమే . పెరట్లో పిచ్చిమొక్కల్ని ఏరిపారేయడం, ఇంటికి సరిపడా నీళ్లను పనివాళ్లతో కలిసి బావిలో నుంచి చేది పోయడం సాధన చేస్తే అప్పటికి చేతులు కాయలు కాసే తిప్ప లుండవు. రోజూ  చేసుకునే గడ్డం, గంటల కొద్దీ చేసే ప్రత్యేక గది స్నానాలు ఇక మానేయాలి. సెల్ ఫోన్  వాడకం పూర్తిగా తగ్గిపోవాలి. 


ఆకలేసిందంటే అన్నంపెట్టే వరకే అమ్మ ప్రేమ . ఆ సెంటిమెంటు జైలు జీవితంనుంచి విడుదలకు పనికిరాక పోవచ్చు. దేవుడే కాపాడతాడని ఆశ అంటారా' ! సర్కారుకే కాదు.. దేవుడిక్కూ డా తెలీకుండా చేసిన పాపాలకు దేవుడు పూచీ పడతాడా? 


ఆచార్య సారు కేసును పాఠంగా  భావించడమే కాదు. . ఆయనముందస్తు  జైలు రిహార్సల్సునీ ఆదర్శంగా తీసుకొంటే పిచ్చిపనులు చేసే అధికారులందరికీ ఆనక ఇబ్బందుండదు . 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- హాస్యం - 03 -02 -2012 న ప్రచురితం) 

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం ఈవియం మాయం రచన - కర్లపాలెం హనుమంతరావు

 


ఈనాడు - హాస్యం - వ్యంగ్యం 

ఈవియం మాయం 

రచన - కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - 06/12/2010 - ప్రచురితం ) 



పిల్లలు పరీక్షల్లో రాసిన సమాధాన పత్రాలు గల్లంతయ్యాయంటే ''హన్నా!' అనుకున్నాం. 


దేవుడి గుళ్లల్లో విగ్రహాలు మాయం అవుతున్నాయంటే- ఇదేం కలికాలంరా  అని ఈ గుండెలు బాదుకున్నాం. 


అవసరమైనప్పుడే సర్కారు కార్యాలయంలో దస్త్రాలు, ఆసుపత్రుల్లో పురిటి మంచం మీదనుంచే పసికందులు మాయమైపోవటం మనకు కొత్త కాదు. వింత అంతకన్నా కాదు.


పెద్ద పెద్ద ప్రాజెక్టులే మాయమై పోతున్నాయి. 


కట్టామంటూ బిల్లులు కొట్టేసిన కరకట్టలకే దిక్కు లేదు. 


ఓబుళాపురం గుళ్లు, శిబూసెరన్లు , ఖత్రోచీలు, యాండర్సన్లు ఇక్కడున్నట్లే ఉండి, ఉత్తర క్షణంలో 'హాంఫట్' అయిపోవటం మనకే మన్నా కొత్తా! 


అయినవాళ్ళకు అడ్డొస్తే  గవర్న మెంటు జీఓలే మాయమవుతుంటాయి. 


బలం, బలగం ఉన్నవాడికెదురుగా మొండిగా ఎన్ని కల్లో నిలబడితే శాల్తీలే గల్లంతవడం  వింతా కాదు  . . విడ్డూరం అంతకన్నా  కాదు. 


ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కదా మనది! అందుకే ప్రతివాడికి ప్రతిదానికి స్వతంత్రం మరీ ఎక్కువగా ఉంటుంది.


ఆ చొరవతోనేనేమో మొన్న ఎన్నికల్లో మనం వాడుకున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా లు ఎవడో ఎత్తుకుపోయాడు! ఒకటి .. రెండూ కాదు. ఏకంగా నాలుగు వేల యంత్రాలకు లెక్క తెలియడంలేదని ఎన్నికల సంఘంవారు కంగారు పడుతున్నారు. 


ఈవీయం డబ్బాలేమన్నా వెంకటేశ్వరస్వామి గుళ్ళో హుండీలా... ఎందు కంత కంగారు? ఇనప రేకు డబ్బాలేగా! ఇవి పోతే, కొత్తవి అలాంటివే మళ్లీ చేయించుకోలేమా? దుర్గ గుడిలోని అమ్మవారి నగలకే అచ్చంగా అలాంటి నకిలీలు తయారుచేసే చక్కటి కళాకారులు రాష్ట్రం నిండా ఉన్నారు. 


డాక్యుమెంట్ల దగ్గర్నుంచీ విశ్వవిద్యాలయ సర్టిఫికెట్ల దాకా వేటినైనా 'రాముడు భీముడు' టైపులో డూప్లికేట్లు, ట్రిప్లికేట్లూ ఫటాఫట్ మని చేసి అవతల పారేసే కేటుగాళ్ళు పేటకొకరు దొరుకుతారు. పోయిన బోడి నాలుగు వేల డొక్కు పెట్టెలకోసం ఇంత రాద్ధాంతం అవసరమా? 


పోయినవి ఇనప సామాను గనక కనీసం పాత సామాన్ల కొట్టులోనైనా కొన్ని దొరికాయి. అదే ఏ వోక్స వ్యాగన్ బాపతు ఫెళ పెళలాడే నగదు అయి వుంటే...! 


బాలాజీ కానుకలకు ఏ గతి పట్టిందో మనకందరికీ  తెలుసు. ఆరు యంత్రాలన్నా కనిపించాయని సంతోషపడక... మిగతావి ఏమయ్యాయని ఈసీ వారు కలెక్టరును లెక్కలడగటమేంటసలు ! ఓవర్ కాకపోతే! 


లెక్కలు తేలకపోవడం మనకేమన్నా కొత్తా  ? నిత్యం జరిగే  కుంభకోణాలలో ఎంత పోయిందో ఎంతవరకూ లెక్క తేలింది? 


జలయజ్ఞంలో, ఇందిరమ్మ ఇళ్ళ పథకాలల్లో  ఎంత మునిగిందీ, మురిగింవీ లెక్కలు చెప్పేవాళ్లెవరు? 


అయినా అంత పెద్ద అధికారులకు డొక్కు పెట్టెలు లెక్కపెట్టుకుంటూ కూర్చోవటం ఒక్కటేనా పని... చోద్యం కాకపోతే ! 


అదనపు ఈవీయంలను రాజకీయ పక్షాలు వాటి ప్రమాణ నిర్ధారణకోసం పట్టు కెళ్ళాయని  అక్కడికీ  అధికారులు నెత్తీ నోరూ మొత్తుకుంటిరి ! 


ఏ పార్టీ ఏ ప్రమాణాల కోసం పట్టుకెళ్లిందో... అధికారులు నోటితో ఎలా చెబుతారండీ పాపం! ఉద్యోగాలుండాలా, ఊడాలా? 


ఏ పార్టీకి ఓటేసినా నిష్పక్షపాతంగా ఒకే పార్టీకి ఓట్లు పోలయ్యే సౌకర్యం పోయినసారి ఎన్నికల్లో ఏర్పాటైందని ప్రతిపక్షాల గోల.  


మరీ ఆది అసత్యం మాత్రం కాదని ప్రజా స్వామ్యం మీద మితిమీరిన అభిమానమున్న కొద్దిమంది యువశా స్త్రవేత్తలు ప్రదర్శన చేసిమరీ నిరూపించారు. ఇప్పుడే దొంగతనాలు... స్ట్రాంగురూములో ఉన్నవి ఎలా మాయమవుతాయని ఎన్నికల సంఘం ఎగిరెగిరి పడుతోంది!  


కానీ... అలా దాచడంవల్లే ఇలా చిల్లర చోరీలు జరుగుతున్నాయని గ్రహించడం లేదు। 


సర్కారు కార్యాలయాల్లో ముఖ్యమైన ఫైళ్ళయినా అలా బాహాటంగా గుట్టలు గుట్టలుగా పడుంటాయి గదా, ఒక్కటైనా పోతుందా! 


బ్యాంకు లాకర్లలో భద్రంగా ఉన్న డబ్బుకే కాళ్లొచ్చాయని  వింటుంటాం గానీ... బైటున్న కంప్యూటర్లు పోయాయని ఎప్పుడైనా విన్నామా? 


ఈవీయం పెట్టెలను భద్రంగా స్ట్రాంగ్ రూముల్లో మూసి పెట్టాలనుకోవడమే అధికారులు చేసిన తప్పు. 


ఈసీ ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, ఇంతా చేసి ఓటింగ్ యంత్రాల విలువ చెత్త సామానుకున్నా ఎక్కువ కాదు. అది  తెలుసుకున్న వాళ్ళ పనే కావచ్చిది.  


ఏమైనా ఒక్క విషయం మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం. ఈసీ వారి దృష్టిలో ఈ ఈవీయంలకు విలువెంతో తెలీదు కానీ, మామూలు మనిషి దృష్టిలో మాత్రం ఈ డొక్కు పెట్టె కిలో వంకాయల కన్నా ఎక్కువ తూగదు. 



పాత సామానుగా కిలో పదిహేను రూపాయలకు మించి పలకలేదంటే ఏమిటి అర్ధం! కంట్రోలింగ్ మిషన్ అయితే మరీ అన్యాయం. రెండు కొత్తిమీర కట్టల పాటి కూడా విలువ చేయలేదు! 


కూరగాయల ధరలు అలా మండిపోతున్నాయి మరి! ధరలు ఇలాగే ఎంతకూ దిగి రాకుండా ఉంటే... ఇదిగో ఇలాగే మిగిలిన ఈవీయంలను కూడా ఏ చింతపండు కొనుక్కోవ టానికో అధికారులే   అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు . 


గంజినీళ్ళకోసం ఇనప్పెట్టెలను కూడా పీక్కుతినే రోజులొస్తాయని కాలజ్ఞానంబ్రహ్మంగారు చెప్పనే చెప్పారుగా మరి ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - 06/12/2010 - ప్రచురితం ) 

ఈనాడు - గల్పిక- హాస్యం ' వ్యంగ్యం పెళ్లి రాజకీయాలు రచన - కర్లపాలెం హనుమంతరావు ఈనాడు - సం.పు- 20-04-2014 న ప్రచురితం )

 



ఈనాడు - గల్పిక- హాస్యం ' వ్యంగ్యం 

పెళ్లి రాజకీయాలు 


రచన - కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సం.పు- 20-04-2014 న ప్రచురితం ) 


ఎదిగిన మగబిడ్డలు గుండెలమీద గాడిపొయ్యి లాంటివాళ్లు.  


భ్రూణహత్యలవల్ల ఆడపిల్లలు తగ్గిపోతుంటే, రేపు మగవంక అనేవాడికి జోడీ దొరుకుతుందా? 


గెలిచే పార్టీ టికెట్ దొరక డంకన్నా, చట్టసభలకు నీతిమంతుడైన నాయకుడు ఎన్నిక కావడం కన్నా, మగవాడికి పిల్ల దొరకడం కష్టమైపోతోంది. 


అలాంటి కష్టమే ఇప్పుడు మా ప్రసాదుకు వచ్చిపడింది.


పార్టీ టికెట్ కోసం నాయకులు ఎన్నిపాట్లు పడుతున్నారో అంతకన్నా ఎక్కువగా  శ్రమ పడ్డాక, ఎలాగైతేనేం చివరికి మా ప్రసాదు ముక్కుకూ ఓ 'దొండ పండు' దొరికేలా అనిపించింది. 


పార్టీ అధిష్ఠానం  టికెట్ ఇస్తాననగానే పనైపోదుగా!  


'బి' ఫారం చేతిలో పడాలి..  గడువు లోగా నామినేషన్ వేయాలి. . దానికి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి తకరారూ రాకుండా ఉండాలి.  . ఉపసంహరణ ఒత్తిళ్లు కాచుకోవాలి. 


అసలు టికెట్ తెచ్చుకుని బరిలో నిలబడటమన్నది ఎన్నికల్లో గెలవడంకన్నా కష్టంగా ఉంది  కదా!


దొండపండు ఖాయమనుకున్న మా ప్రసాదుకు పెళ్లికి ముందు అంతకన్నా పెద్దకష్టం వచ్చి పడింది. . ముందు ఆడపిల్లవాళ్లను పెళ్లికి ఒప్పించడం! 


గుణగణాలు, వంశం, ఆర్థిక స్తోమతు, చదువు గట్రాగట్రా  ప్రజాప్రతినిధికైతే అక్క రేదేమోగాని- పెళ్లికొడుక్కి ఉండి తీరాలి  మరి. సరిగ్గా ఇక్కడే మా ప్రసా దుకు గొప్ప చిక్కొచ్చిపడింది. 


తాను అవునని తల ఊపడానికి ముందు కొన్ని పరీక్షలు అవసరమని షరతు పెట్టింది కాబోయే పెళ్లికూతురు.  ఓటర్లంటే నేత ఎన్నికకు వెనకాడటంలేదు గాని, ఈతరం అమ్మాయిలుమాత్రం   పెల్లికి ముందే అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


రాముడంతటి దేవుడికే తప్పలేదు- ' శివధనుర్భంగం' లాంటి వర పరీక్షలు! ఇహ మా ప్రసాదు ఎంతా? 


పెళ్లికూతురు ముందుగా ప్రసాదును నేత్రవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది. 


' బోర్డుమీద కనిపించే వాటిని బిగ్గరగా బయటకు చదువుతూపోండి . . చాలు' అన్నాడు నేత్రవైద్యుడు . 


అయిదు నిమిషాల్లో పరీక్ష ముగిసింది. తరువాత మరో వైద్యుడి దగ్గర చెవి పరీక్షలు. 


తెరమీద రాజకీయ నాయకుల ప్రసంగాలు విని, సారాంశాన్ని గుర్తున్నంత వరకు కాగితంపై రాయడమే ఈ పరీక్ష' అన్నాడు వైద్యుడు. 


ఆడుతూపాడుతూ ఆ పరీక్షా పూర్తి చేశాడు మా  ప్రసాదు.


ఇక చివరి పరీక్ష. కొన్ని వార్తాపత్రికలు చదవడం! 


అయితే, రాజకీయ నేతల ప్రసంగ సరళి గురించి ఓ పది మాటలు రాస్తే చాలు' అంది పెళ్లి కూతురు. 


సివిల్ సర్వీసు ప్రాథమిక స్థాయి పరీక్షలు రెండుసార్లు గట్టెక్కిన గట్టిపిడం మా ప్రసాదు. ఇలాంటి చిల్లర పరీక్షలు అతడికి బెల్లం ఉండతో సమానం.


ఫలితాలు మర్నాడు విడుదలవుతాయనగా ఆ రాత్రంతా నిద్రలేదు మా ఇంట్లో ఎవరికీ.  ఎన్నికల ఫలితాలప్పుడైనా అభ్యర్థికి అంత ఉత్కంఠ ఉండదేమో! 


మర్నాడు- ' కళ్లులేని కబోదిని, ఏదీ సరిగా వినపడని బధిరుణ్ని పెళ్లాడటం కుదరదు' అంది వైద్యుల నివేదికలు మా ముందు పారేసి పెళ్లికూతురు. 


ప్రసాదకు రాజకీయ పరిజ్ఞానం శూన్యమని తేల్చేసింది. 


' ఆదర్శ కుంభకోణం అని తాటికాయంత అక్షరాలుంటే ఒక్క 'ఏ' అనే అక్షరంతో సరిపెట్టేస్తాడా! 'బోఫోర్సు కుంభకోణం అని బొప్పాయి కాయంత అక్షరాలున్నా పూర్తిగా చద వడానికి అంత బద్దకమా? 'బి' అన్న ఒక్క అక్షరం చదివితే సరిపోతుందా?

కోల్గేటు కుంభకోణం, ఖాళీ ' సి ' గా , డయల్ కుంభకోణం కేవలం 'డి' అక్షరంగా పొడిగా చెబుతాడా? ఎమ్మార్ స్కాము అంతలా కుదిపేసింది గదా... దాన్ని ముక్తసరిగా 'ఇ' అనేసి ఊరుకుంటే ఏమిటర్ధం! 


కంటిముందు కనబడే అన్యాయాలను  గుర్తుపట్టని గుడ్డిమనిషిని కట్టుకోమనడం న్యాయమేనా? అని కడిగిపారేసింది పెళ్లికూతురు.  


మా ప్రసాదు నోరు మెదిపితే ఒట్టు! !


అయిదో తరగతి పిల్లాడు దేశభక్తి మీద రాసుకొచ్చిన చూసిరాతకన్నా అన్యా యంగా రాసుకొచ్చాడు నేతల ప్రసంగాల గురించి . నేతల దుర్భాషల్లో ఈ అబ్బాయి ఏనుగు చెవులకు ఒక్క అభ్యంతర పదమైనా వినిపించనే లేదే ? బధిరత్వంలో బ్రహ్మదేవుడికి గురువు అనుకోవాలా? ఈ చెవిటి మాలోకాన్ని

చేసుకుంటే సుఖపడేది సున్నా' అని తేల్చేసింది  ఆ పిల్ల. 


 'ఇక రాజకీయ పరిజ్ఞానంలోనూ   అంతే లచ్చనంగా ఉంది.

ఇతగాడి స్థాయి. ఈ మధ్యనే పుట్టి అనేక సంచలనాలు నమోదు చేసుకొన్న  కొత్తపార్టీ పేరు చెప్పమంటే కేజ్రీవాలో .. ఆమ్ ఆద్మీ పార్టీనో  అని అంటడనుకున్నా! రాఖీ సావంత్ ' పచ్చిమిర్చి'  పార్టీ అన్నాడు. రామకోటి లాగా రాసేశాడండీ  ఆ మహా తల్లి పేరు. వెరీ శాడ్ ! 


 ఈ తరహా  గుడ్డి, చెవిటి, మూగ మొద్దును జీవితాంతం  భాగ స్వామిగా భారించాలంటే.. సారీ .. మనస్ససలు యస్ .. ఓకే అనడం లేదు' అని కుండబద్దలు కొట్టి మరీ ఎగ్జిటయిపోయింది.  ఆ పిల్ల చివరాఖరికి . 


 "హలో మేడం! గుడ్డి, చెవుడు అంటే సరే ! మూగతనం అనే  అభాండం నిజంగా చాలా అన్యాయం' అని ఇంతెత్తున లేవబోయా నేను . 


' సార్! కొద్దిగా తగ్గండి ! మీరట్లా మిరపకాయ కొరికినట్లు ఎగురుతున్నారు..  గానీ, ఈ అబ్బాయి ఏమన్నా నోరు తెరిచాడా ఇప్పటిదాకా! కంటిముందు జరిగే అన్యాయాలనీ , చెవుల్లో రోజూ రొదపెట్టే చీదర పదాలనీ చూస్తూ వింటూ కూడా నోరెత్తలేనివాణ్ని మూగి అనికాక ఇంకేమనాలి మాష్టారూ? నా 'వీక్యూ' టెస్టు లో ఈ అబ్బాయి  అట్టర్ ఫైల్ ' అనేసిందా అమ్మాయి: '


' వీక్యూ' అంటే ఓటింగు సామర్థ్యం సూచించే సమాచారంట 

ఐక్యూ మోడల్లో ; 


ఏ మాటకు ఆ మాటే! మాటల మధ్యలో  ఆణి  ముత్యాల్లాంటి రెండు ముక్కలు చాలా చక్కగా చెప్పిందా అమ్మాయి. 


అవిటితనం మన లోపం కాదు. అన్నీ ఉండీ  సరిగ్గా వాడుకోకపోవడమే మన లోపం.  కులం కొరుక్కు తినే పదార్థం కాదు,  కూడూ పెట్టదు. మతం వ్యక్తిగతం. జాతకం అంధుల ఆధారంలేని విశ్వాసం. ధనం సంపాదిస్తే వస్తుంది. ఖర్చుపెడితే పోతుంది . కలకాలం చెక్కుచెదరకుండా ఉండేది  సంస్కారం . చుట్టూ జరిగే మోసాలను పట్టించుకోకపోవడం ఒక ఎత్తు. ఆ మోసా లకు కారకులైనవాళ్లను పనిగట్టుకొని మోసెయ్యడం  మరో ఎత్తు.  అన్నీ ఉండి, ఏవీ సక్రమంగా వాడని మందబుద్ధిని  చేసుకుంటే రేపు పుట్టబోయే బిడ్డలూ అంతే మొద్దురాచిప్పలు కారని గ్యారంటీ ఏమిటి? అందుకే ఈ సంబంధం నాకు వద్దు" అనేసింది ఆ గడుగ్గాయి. 


ఇన్ని మాటలు విన్న మా ప్రసాదు ఏమవుతాడోనని భయపడ్డాం మేం. 


మేం భయపడ్డట్లు ఏమీ కాలేదు. పైపెచ్చు మెరుగుపడ్డాడు కూడా! 


జరుగుతున్న రాజకీయాలను  విమర్శనా దృష్టితో  పరిశీలిస్తున్నాడిప్పుడు . 


ఈ మధ్య ఎన్నికల ప్రచారానికని ఇంటికొచ్చిన అభ్యర్థుల్ని నిలదీస్తున్నాడుకూడానూ . 


పోయినసారిలా బద్ధకించకుండా ఈసారి పోలింగు కేంద్రం దాకా వెళ్లి సరైన అభ్యర్థినిఎన్నుకోవడంలో తనవంతు పాత్ర చక్కగా పోషిస్తాడనే అనుకుంటా! 


మళ్ళీగాని కంటబడితే, ఆ దొండపండుకు మా కాకి నచ్చవచ్చేమో ! 


ఏమో! రాజకీయాల  మాదిరిగా  పెళ్లి వ్యవహారాలలో  కూడా ఏదీ అసంభవం కాదు. చూద్దాం!


రచన - కర్లపాలెం హనుమంతరావు

ఈనాడు - సం.పు- 20-04-2014 న ప్రచురితం ) 

ఈనాడు - గల్పిక: మగాళ్లూ .. మారండి - కర్లపాలెం హనుమంతరామ ( ఈనాడు - గల్పిక- 08 -03 - 2014




ఈనాడు - గల్పిక: 
మగాళ్లూ .. మారండి! 
- కర్లపాలెం హనుమంతరావు  
( ఈనాడు - గల్పిక- 08 -03 - 2014 

బ్రహ్మదేవుడు ఏ చిరాకులో ఉండి సృష్టించాడోగాని  ఆడదాని బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలి కింద ఎండుకొమ్మే కదా! ప్రపంచంలోనూ ఆడదానికి అన్ని విధాలా అవమానాలే!  బ్రహ్మకు రిమ్మ తెగులు . పర మ మేశ్వరుడు భార్యకు సగం శరీరం ఇచ్చినట్లే ఇచ్చి మరో గంగానమ్మను నెత్తికెత్తుకున్నాడు. విష్ణుమూర్తిది మరీ అన్యాయం .. కట్టుకున్నదాన్ని కాళ్ల దగ్గర కట్టిపడేశాడు.

' ఆడదానికిచ్చే స్వాతంత్య్రం ప్రమాదకరం' అని మనువెవరో అన్నారట. ఆ మహానుభావుడి మిగతా సూక్తులన్నిటినీ  గాలికొదిలేసిన మన మగమహారాజులు, ఈ ఒక్క ముక్కను మాత్రం పట్టుకుని ఇరవై ఒకటో శతాబ్దంలోనూ వేదంలా పాటిస్తున్నారు! 

ఒక మగాడనే ఏమిటి- గ్యాసు బండలు, యాసిడ్ సీసాలు, సెల్ఫోన్లు కెమెరాలు, సినిమా బొమ్మల్లో బూతర్థాలు, కట్నం వేధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు, లైంగిక వేధింపులు, తక్కువ జీతాలు ఆబ్బో.. జుల్లెడ  చిల్లులకన్నా చాలా ఎక్కువ ఆడదాని సమస్యలు. 

వేళకు వంటచేసి వడ్డించడానికి, బిడ్డల్ని కనిపెంచడానికి, ఇల్లును కనిపెట్టుకుని ఉండటానికి, బయట ప్రదర్శించుకుని దర్పాలు  ఒలకపోయడానికి, తమ వేణ్నీళ్ల సంపాదనలో చన్నీళ్లలా జీతం రాళ్లు కలుపుకోవడానికి, సినిమా హాలు క్యూలో నిలబడి టికెట్లు త్వరగా తీయడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లు అక్రమంగా ఆక్రమించుకోవడానికి, బ్యాంకుల్లో దొంగ ఖాతాలు తెరవడానికి, ఆదాయం పన్ను లెక్కలు పక్కదారి పట్టించడానికి మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడనుకుంటున్నాడు మగవాడు!

బల్లిని చూసి భయపడేంత సున్నితమైన మనసు ఆడదానిది.  అయినా ఒక బిడ్డకోసం నెలల తరబడి శరీరాన్ని పోషిస్తుంది. చివరకు కత్తికోతలకూ వెరవకుండా ప్రసవానందాన్ని అనుభవిస్తుంది. గంట పనిచేస్తే వందలు డిమాండు చేసే వ్యాపారపు లోకంలో ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు సహస్రావతారాలతో సమర్థంగా శ్రమించే ఆడదాని శుశ్రూషకు పైసల్లో విలువ కడితే పదిమంది బిల్ గేట్బు సంపదలు కూడా ఒక వారానికి సరిపోతాయా?

పక్షి గాలిలో ఎగిరినంత ఒడుపుగా, చేప నీటిలో ఈది నంత సులభంగా, పులి భూమ్మీద కదిలినంత ఉత్తేజంగా ఇంటి ప్రపంచంలో కలియదిరుగుతుంది ఆడది. ఇంటి నాలుగోడల నడుమ ఆమె నడిచే దూరం ముందు ఏ ఒలిం పిక్స్ మారథాన్ పరుగైనా... బలాదూర్. ఇంటి బరువు బాధ్యతలను మోసే ఆమె శక్తిసామర్ధ్యాల ముందు ఎంత మంది నిలబడగలరు? 

ఇంటికి అత్యవసర వైద్యురాలు ఆమె. ఏ శిక్షణా లేని బిడ్డల ఉపాధ్యాయురాలు.  అనుక్షణం పిల్లల్ని కంటికిరెప్పలా సంరక్షించే వార్డెన్ . కుటుంబ సభ్యు లెవరికైనా కష్టం కలిగినప్పుడు ఓర్పుగా ఓదార్చే కౌన్సిలర్.   ఇంట్లో ఎవరి ఇష్టాయిష్టాలేమిటో పెదవి విప్పకుండానే తెలుసుకుని అందరి కష్టాలు పోగొట్టగల సమర్ధురాలు.

సంసారమనే విమానానికి పైలెట్ ఆమే . ఎయిర్ హో స్టెస్యూ  ఆమే . రచ్చలో కూర్చున్న భర్త పెత్తనం చలాయిస్తున్నా కలికి కామాక్షి మాదిరి ఆమె ఒదిగి నడుచుకుంటున్నందు వల్లనే  ఇల్లు భూలోక కైలాసంలా వర్ధిల్లుతోంది. ఆధార్ కార్డు కూడా ఓ పట్టాన దొరకని కాలంలో ఆడ దాని ఆధారం అత్యంత ఉదారంగా దొరకడం ఈ గడ్డమీద మగవాడు చేసుకున్న అదృష్టం. 

మెడలో మూడు ముళ్లు పడి ఏడడుగులు నడిచిన ముహూర్తం నుంచే తన
ఒంటితీరును, ఇంటిపేరును భర్త వంశానికి మీదుకట్టే త్యాగమయి స్త్రీ.  రాముడు వచ్చి పోరాడేవరకు రావణాసురుడినయినా  గడ్డిపోచతో నిలువరించగల ధీరోదాత్త ఆమె. పెళ్ళినాటి కాళ్ల పారాణి ఆరక మునుపే కట్టుకున్న భర్త సోదర సేవంటూ  అడ వులు పట్టిపోతున్నా దుఃఖం పెదవులు దాటి రానీయనంత సంయమనశీలి ఆ లలన.  పతిదేవుడి ప్రాణం కోసం మృత్యుదేవుడితోనైనా తలపడేందుకు ఆమె సిద్ధం. ప్రేమిం చినవాణ్ని తనవాడిని  చేసుకునేందుకు చాటుమాటు రాయబేరాలకూ   జడవని సాహసీ ఆమే. పుట్టుగుడ్డి భర్తకు దక్కని దృశ్య భాగ్యం తనకూ అక్కర్లేదని కళ్లకు గంతలతో చీకటి జీవితం గడపడం- ఆమెకుగాక ఎవరికి సాధ్యం?

మగవాడికన్నా బుద్ధిలో నాలుగు రెట్లు, సాహసంలో ఎనిమిది రెట్లు అధికురాలైనా ఆమె ఒదిగి ఒదిగి ఉన్నది కాబట్టి- లోకం జీవనదిలా సారవంతంగా సాగుతోంది. యుగయుగాలుగా తెగ చిక్కుబడ్డ పీటముడిని విడదీయా లంటే మగవాడికి కావాల్సింది ఒక నేర్పే కాదు, మగ నాలితో కలిసిసాగే ఓర్పు కూడా!

సునీత విలియమ్స్, ఇందిర, సూకీ... ఎన్ని వందల కోట్ల మందిలో ఒక్కరు? నిన్నటి నిర్భయ, నేటి 'అనూహ్య'ల విషాదగాథల సంగతేమిటి? ఇప్పటిదాకా ఇంటివరకే తంటా. పెరిగే ఆధునిక అవసరాల కోసమై వీధుల్లోకొస్తున్న అంగనలను అంగడి బొమ్మల్లా చూసి చొంగ కారుస్తున్నారు పురుష పుంగవులు. 'అమ్మా అమ్మా' అంటూ ఒక వంక పూజలూ, పురస్కారాలు. మరో వంక అమ్మ .. ఆలి .. చెల్లి పేర దూషణలతో బడితె పూజలూ, తిరస్కారాలు! 

ఆత్మరక్షణకోసం ఆడది వాడే 'మిరియప్పొడి' పార్లమెంటు దాకా పాకింది కానీ, ఆమె బతుక్కు 'రక్షణ' కల్పించే మహిళా బిల్లుకు మాత్రం మోక్షం దక్కలేదు... ఇన్ని దశాబ్దాలు గడిచినా!  'ఆమ్ ఆద్మీ పార్టీ 'చీపురు' కు  పెరుగుతున్న ఆదరణ మాత్రమైనా చీపురు కట్టనువాడే ఆడమనిషికి దక్కడం లేదంటే, పురుషుల రువాబుకు   ఏమని పేరు పెడితే సబబు  ? !

'ఆడపుటక  మగసమాజం పానకంలో ' పుడక | అనుకోవటం మానుకోవాలి. తిరగక మగాడు తిరిగి ఆడది చెడటం ఏమిటి? తిరుగుళ్లు మనోవికాసం కోసమే అయినప్పుడు ఆడ దాని 'మనోవికాసం' మగ సమాజానికి  అంత చేటా? అంత ర్జాతీయ మహిళా దినోత్సవాలు ఆర్భాటంగా జరుపుకొంటే చాలదు. మగవాడి అంతరంగం ముందు మారాలి. ఆనాడు ప్రతిదినమూ మహిళా దినోత్సవమే!

- కర్లపాలెం హనుమంతరావు  
( ఈనాడు - గల్పిక- 08 -03 - 2014)  


గురు సాక్షాత్ .. పరబ్రహ్మమ్ ! - ఈనాడు- గల్పిక- హాస్యం - వ్యంగ్యం

 


గురు సాక్షాత్ .. పరబ్రహ్మమ్ ! - ఈనాడుగల్పికహాస్యం - వ్యంగ్యం

 ఈనాడు - గల్పిక -హాస్యం - వ్యంగ్యం 

గురువుల కథ 


కర్లపాలెం హనుమంతరావు 

( గురు సాక్షాత్.. పరబ్రహ్మమ్ ! పేరుతో ఈనాడు - గల్పిక - 07- 08 -2002 ప్రచురితం ) 


'రావణాసురుడి ఇంటి పేరేంటో తెలుసా నీకు


'ఆ రోజుల్లో ఇంటి పేర్లూ... అవీ లేవనుకుంటా గురూ!' 


'అది నీ అజ్ఞానం శిష్యా... రావణా సురుడి గారింటి పేరు 'గాదె' వారని సోదా హరణంగా సెలవిచ్చారో సారువారు'  గర్వించి చెడిపోయెగాదె రావణాసురుడు' అనే పద్యం పాదంలోని పదాన్ని పీకిన ఆ ప్రావీణ్యాన్ని చూశావా! ఆహా! ఏమాజ్ఞానం!' 


' నిజమే సుమా! పంతుళ్లు పండితులు  కనక పాత మాటలకలా కొత్తర్థాలు పీకగల ప్రావీణ్యం ఉండి ఉంటుంది. పామరులం. మాబోటి వారలకలా తోచి చస్తాయా'


'అయ్యవార్ల ఉద్యోగాలకంత బృహత్తర బాధ్యత వుంది కనకనే, ప్రభుత్వం వారు కూడా పూర్వంలాగా ఉపాధ్యాయ ఉద్యో గాలను ఊరకే ఊరుసంతర్పణ చేయకుండా వృత్తి పరీక్షలూ అవీ పెట్టి మరీ దక్షతను పరీక్షించి గాని నియామకాలు చేయరాదని నియమం పెట్టుకున్నారు కదా! '


'అవునవును ఏటేటా జరిగే ఈ పంతుళ్ల పరీక్షల తంతు ఏటపోతుల జాతర్జాగా ఎంతో సందడిగా సాగుతుంటుంది. లక్షల్లో ఉంటారయ్యా అభ్యర్థులు!  భావిభారత పౌరుల్ని తీర్చిదిద్దేందుకింతమంది కంకణ బుద్ధులై ఉన్నారన్న సంగత్తలుచుకుంటేనే ఒళ్లు పులకించిపోతుంది.' 


' పరీక్ష పత్రాల్లో ఆ భావి ఉపాధ్యాయ అభ్యర్థులు వ్రాసే సమాధానాలు వింటే ఒళ్లు జలదరిస్తుంది కూడా! మహాత్మాగాంధీ గారి భార్య పేరేంటని అడిగితే రోహిణీ హట్టంగ ని మొహమాటం లేకుండా రాసేసాడో మేధావి టీచరు . సైకిల్ తయారుచేసిందెవరని అడిగితే.. నటరత్న, విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారకరామారావని  జవాబు! పంచపాండవులకా పేరెందుకొచ్చిం దయ్యా అంటే... పంచెలు కట్టుకు తిరుగుతారు కనక వాళ్లను పంచపాండవులంటారని  ఆన్సర్  రాశాడొకానొక భావి పంతులు .  ఎంత సెన్సాఫ్ హ్యూమర్!'


' గ్రామర్ లేకపోతేనేం..  హ్యూమరుందని సంతోషించొచ్చు కదా! కొశ్చన్సంత  కష్టంగా ఉంటే వాళ్లు మాత్రమేం చేస్తారు.. పాపం! అసలే ఎండాకాలం చదువులు... నీటికొ రత.... కరెంట్ కోత.. ఉక్కపోత.... వందల మంది  పంతుళ్లు మందలుగా కావాలనుకొన్నప్పుడు వాళ్లే చూసీచూడనట్లు సర్దుకుపోవాల్సింది.' 


' పేపరు దిద్దేవాళ్లకదే ఐడియా వచ్చినట్లుంది . మార్కులు వేసేటప్పుడు కొంచెం లిబరల్ గానే  ఉన్నారని విన్నాను. మంచానికెన్ని కోళ్లన్న కొశ్చనికి నాలుగు మార్కుల యితే, మూడని రాసిన వాడికి మూడు, రెండని రాసిన వాడికి రెండూ, ఒకటని రాసిన వాడికి ఒకటీ... వేశారుట:' '


' అసలు కోళ్లేవీ  లేవనీ రాస్తేనో? '


'అన్ ట్రయిన్డుకయితే  గ్రేసు మార్కులేసి పాసుచేయాల్సిందేనని రూల్సు పాసయ్యా యని విన్నాను. ఇంత తేలిగ్గా దిద్దినా అనుకున్నంత మంది పంతుళ్లు తేలనేలేదని తెగ బాధపడిపోతోంది ప్రభుత్వం . పరీక్ష పోయినవాళ్లు మాత్రం ప్రశ్నలో 'కోళ్లు' అని ఉండకూడదు ' కాళ్లు'  అంటే కనప్యూజనుండేది కాదని కోర్టుకెళ్లారు.  అది వేరేకథ' 


' పోనీలే... పాసయినవాళ్లన్నా ఆ చిలకమర్తి వారి గణపతి బాపతు కాకుండా సక్రమంగా చదువులు చెబితే అదే పదివేలు' 


' రావణాసురుడి గారికి 'గాదె' అని ఇంటి పేరు ఫిక్స్ చేసింది గిరీశాన్ని మరిపించే అలాంటి గురువుగారే బాబూ'


' ఈ గొడవంతా ఎందుకని కొద్దిమంది బుద్ధిమంతులు సద్దుచేయకుండా క్లాసుల్లోనే నిద్రపోతున్నారని గ్రామ కమిటీ పెద్దలు వాపోతున్నారు.' 


' గురక కూడా గురువు చెప్పే ఒకరకమైన పాఠమే కదా గురూ!' 


' ఈ మాటే ఇన్స్పెక్షనుకెవరైనా వచ్చి ఇదేమని అడిగితే, బి.ఇడి, బెడ్ మా డిగ్రీ

లోనే ఉందని బుకాయించే  గురువులకు కరవులేదు. అలాంటి ప్రబుద్ధుడే ఒకాయన మొన్నామధ్య పదోతరగతి పేపర్లు దిద్దుతూ నిద్రలో తూలి తొంభైకి బదులు ఇరవైయ్యని వేసేసి చెయ్యి దులిపేసుకున్నాట్ట. పెద్ద గోలయింతరువాత పేపరు తెప్పించి చూస్తే పొరపాటు బైటపడి నాలుక్కర్చుకున్నాట్ట. ఇంగ్లీషు తొమ్మిదికి, తెలుగు రెండుకీ తేడా తెలుసుకోలేకపోయానని తెగ పశ్చాత్తాప పడిపోయాడట, పాపం! ' 


' పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని నమ్మే జాతిలో పుట్టాడు గనక బ్రతి కిపోయాడులే'


'ఇలాంటి గొడవలవుతాయనే కొంత మంది గురువులు తక్కెట్లో పేపరేసి బరువునుబట్టి మార్కులేసే సులువు సూత్రం కనిపెట్టేరు. ఈ ' వెయిటేజీ' సిస్టంవల్ల వర్కెంతో ఈజీ అయిందని అధికారులు కూడా తెగ ఇదయిపోతున్నారని విన్నాను. ఎంతయినా పంతుళ్ల బుర్రలు పాదరసాలు!'


'అలాంటి పాదరసం బుర్ర తాలూకు పంతుళ్లు కొంతమంది మొన్న జరిగిన టెన్త్ సప్లిమెంటరీలో ఫస్టుక్లాసుకు వెయ్యి... పాసుకు అయిదొందలని పాట పెట్టినట్లు వినికిడి' 


' పేపరుకు రూపాయిన్నర చొప్పున ఎన్ని పేపర్లు రుద్దుకుంటే పదిరూపాయలొచ్చేను స్వామీ! బడికన్నా ఈ రాబడే బాగుంది. అందరూ వంతులేసుకుని పాపం, పంతుళ్లనాడిపోసుకొనే వాళ్లేగానీ, వాళ్ల బాధలు పట్టించుకునే నాథుడేడీ? గొంతు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని వాళ్లు గోల పెడుతున్నారు. బాధ్యతలే తప్ప బొత్తిగా  హక్కు ల్లేని  కంచి గరుడ సేవకదరా గురుడా ఈ కొలువని వాపోవని గురువే లేడు. నెలనెలా ఠంచనుగా  వస్తాయన్న గ్యారంటీ లేని చాలీ చాలని జీతాలు... నేలమీద కూర్చుని, గురుకులాల్లో లాగా చెప్పాలి పాఠాలు... '


' ఊళ్లోకి ఏ పెద్ద తలకాయ దిగినా ఊరే గేందుకు పిల్లల్ని పోగేసుకుని ముందుండాల్సిన పేమెంటు లేని గవర్న మెంటు సర్వెంట్లు... సర్వేలంటే చాలు సర్వదా సర్కారుకు చటుక్కుమని గుర్తొచ్చే బంట్లు... జనాభా లెక్కల సేకరణ మొదలు ఎన్నికల క్రతువు నిర్వహణ వరకూ, దోమ కాటు నివారణోత్సవాల జాతర నుంచీ, ధూమపాన వ్యతిరేక ప్రచార పరుగుల దాకా... కూరలో కరివేపాకులాగా పంతుళ్ల పాత్ర తప్పనిసరి కదా ! '


'తప్పదు. అది బ్రహ్మ నొసట రాసిన తలరాత.  సందర్భమొచ్చింది కనక ఒక చిన్న కథ చెబుతా విను. రకరకాల జీవుల్ని తయారు చేయటం విధాతగారి విధి కదా! కవుల్నీ. గాయకుల్నీ, నటుల్నీ, నాయకుల్నీ, పండి తుల్నీ, పామరుల్నీ... ఇలా వివిధ రకాల ఆకారాల్ని చెక్కేసింతరవాత... అక్కడ రాలి పడిన ముక్కలన్నింటినీ ఏరిపారేసే ముందు... సరదాగా ఒక ముద్దచేసి ఇంత ప్రాణంపోసి భూమ్మీదికి విసిరేస్తే... ఆ శాల్తీ పైకప్పులేని బళ్లో డబ్బుమని పడిందట. అలా బళ్లో పడ్డ పంతులుగారు 'నీకు గుడే లేకుండా పోవుగాక ! ' అని కోపంతో, పాపం ఆ బ్రహ్మగారికే శాపం పెట్టాడట! భూమ్మీద నీ గతి కూడా అంతేలే... ఫో అని తిరిగి బ్రహ్మ కూడా శాపం పెట్టాడని... కథ.


'బాగుంది. అందుకే కదా మనం గురువును సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని గౌర వించుకుంటూ ప్రతియేడూ గురుపూజలూ అవీ చేసుకుంటూ, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులూ, రివార్డులూ ఇచ్చుకుంటుంటాం. భూమ్మీద త్రిమూర్తులను గుర్తుకు తెచ్చేది గురువేనని మన సంప్రదాయం చెబుతోంది. సమాజం నమ్ముతోంది.' 


'పట్నాల్లో తిష్ట వేసినా పంతుళ్లని పల్లెజనం 'మావూరికిరండని' మర్యాదగా పిలుస్తున్నదీ  అందుకే' .


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక - 07- 08 -2002 ప్రచురితం ) 

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...