Saturday, December 4, 2021

ముందస్తు ఖైదు - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - గల్పిక- హాస్యం - 03 -02 -2012 న ప్రచురితం)

 



ఈనాడు - గల్పిక- హాస్యం 


ముందస్తు ఖైదు

- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- హాస్యం - 03 -02 -2012 న ప్రచురితం)


ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు .. చూడచూడ రుచుల జాడవేరు అని మన వేమన ఎప్పుడో చెప్పేశాడు. 

.

అయితే ఉప్పు గొప్పా, కర్పూరం గొప్పా అని మాత్రం తేల్చినట్లు  లేదు. కర్పూరాన్నేం   చేసుకుంటాం? కాస్త హారతి పళ్ళెంలో పెట్టి నైవేద్యానికి ముందు దేవుడికి చూపెట్టి కళ్లకద్దుకుంటాం.  గ్యారంటీగా పుణ్యం వస్తుందో లేదో కూడా చెప్పలేని పూజా కార్యం అది. అదే ఉప్పయితేనో  ? 


పప్పులో వేసుకోవచ్చు.  కూరల్లో అది  వేయనిదే రుచే రాదు. దిష్టి తీయాలన్నా ఉప్పే గతి. ఇంకా ఎన్నో రకాలుగా ఉపయోగాలున్న ఉప్పును కర్పూరంకన్నా హీనంగా చూడటం అ న్యాయం! కదా? 


ఈ అన్యాయం ప్రభుత్వాధికారుల్లో కూడా కొనసాగుతున్నట్లున్నది  ఇప్పుడు.  పాపం ఆచార్యను చూడండి! చెడు అనవద్దు . చెడు కనవద్దు, చెడుమాటలు వినవద్దు' అని చిన్నప్పటినుంచి పెద్దలు మూడుకో తుల్ని చూపించి మరీ మనకు సుద్దులు చెబుతుంటారు గదా! మరి కొద్దిమంది బుద్ధిమంతులైన అధికారులు ఆ మాటలనే విధినిర్వహణలో తుచ తప్పకుండా పాటిస్తారు .  తప్పుపట్టడం ఎంత దారుణం! 


'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల' ని చెప్పేది పెద్దలే. అరచేతిలో దీపం ఉన్నా తడుముకుంటూ తిరిగితే కట్టుకున్న ఇల్లాలే ఛీ కొట్టే  జమానా ఇది. అష్టకష్టాలు పడి పైకొచ్చినవాడి చేతికి కాస్త వెలుగిచ్చే దీపం బుడ్డి  దొరికినప్పుడైనా ఇల్లు చక్కబె ట్టుకోవాలనుకోవడమే సర్కారు దొరలను  ఇరకాటంలో పడవేసేది! 


సర్కారు ఉద్యోగమనగానే 'జీతమెంత? '  అని కనీసం వెర్రి వెంగళప్ప కూడా అడగడంలేదు. గిట్టుబాటయ్యే గీతం ఎంత ఘనంగా ఉంటే ఆ ఉద్యోగమంత గొప్పదని గదా లోకం  ఆలోచన. నేతిబొట్టు నాలికమీదేసి చప్పరించ వద్దంటే- ముక్కు మూసుకుని కూర్చునే మునిము చ్చుల వల్ల కూడా కానిపని కదా!  ముప్పూటలా ఉప్పుకారాలు మెక్కే   మనిషి మరి తిన్న ఉప్పును దానం చేసిన వాడిమీద కాస్తంతైనా మమకారం  చూపించని పక్షంలో  మళ్ళా 'విశ్వాసంలేని కుక్క'  అని ఛీ కొట్టేదీ  జినమేగా? జైలు జీవితానికి జంకంటే ఎలా?! 


ఒక్కోసారి జైలుశాఖలో  పై అధికారే జైలు లోపలకు  వెళ్ళవలసి రావచ్చు .  దర్శకుడు రామ్ గోపాలే వర్మకయినా  తట్టని  ట్విస్టు  సదరు జైలు అధికారికి మాత్రం ఎలా తడుతుంది? కాబట్టి  ఆ దారిలో  దూసుకు వెళ్లే సాహసులే ముదస్తుAా జాగ్రత్తపడాలి.


అసలు నాలుగు రాళ్లు వెనకేసుకునేటప్పుడే ముందుచూపుతో ఇంట్లో జైలు జీవితాన్ని సాధన చేయడం మంచిది.


అంతరిక్ష ప్రయాణానికి ముందు వ్యోమగాములు నేలమీద చేస్తారే .. అలా బైట ఎంత అధికారం చలాయిస్తున్నా.... జైలు లోపల  గడపాల్సిన జీవితం అందుకు విరుద్ధం . 


పట్టు పరుపులమీద పడి దొర్లేవాడికైనా పాడుపనులు చేసి దొరికిపోతే.. కటకటాల వెనక కటికనేల పై నిద్ర తప్పడు। ఇప్పటినుంచే పడగ్గదిలో దోమతెరలు ఎత్తేసి దిండూ దుప్పటి పక్కన పారేసి పక్కమీద పొర్లడం అలవాటు చేసుకోవడం మంచిది. నాలుగు గుప్పెళ్ళు నల్లుల్ని పనివాళ్లనడిగి తెప్పించుకొని పక్కమీద చల్లుకోవడం మరిచిపోవద్దు . ఎప్పటికప్పుడు చలువ చేసిన దుప్పట్లు ఇక కుదరకపోవచ్చు. 


పడుకునే ముందు పక్క గుడ్డల్ని  మట్టిలో పొర్లించడం వంటికి  మంచిది .  బెడ్ కాఫీలు, వాకింగులు తరవాత , బోర్నవిటాలు, పొగలుకక్కే  ఇడ్లీ వడా సాంబార్లూ అల్పాహారంలో అమరకపోవచ్చు.  మధ్యాహ్నం  అయిదు నక్షత్రాల హోటల్ విందులు, రాత్రి భోజనంలో రకరకాల పానీయాలు ఇంక నిద్రలో కనిపించే కలలే  కావచ్చు. ఇప్పటినుంచే ఉప్పుడు పిండి, చప్పిడి కూర, పాసిన అన్నం, పల్చటి చారు, మజ్జిగ జావ సత్తు బొచ్చెలో..  నిలబడి గబగబ మింగడం సాధన చేయటం అవసరం.  మడత నలగని దుస్తుల్లో కొత్తయిదొందల నోటులాగా  పెళపెళలాడిపోయే రోజులు ఇంకెన్నాళుంటాయో తెలీదు. ఇప్పట్నుంచే ఇంట్లో  ఒంటిమీదకి చారల చారల  బనీను, సగం నిక్కరు తగిలించుకుని తిరిగితే అప్పటికి ఆలవాటై పోతుంది.


ఇంటి పనంటే ఆ అయ్యకు ఇప్పటిదాకా పొద్దున్నే పేపరు చదువుకోవడమూ, స్నానాల గదిదాకా నడిచిపోవడమే . పెరట్లో పిచ్చిమొక్కల్ని ఏరిపారేయడం, ఇంటికి సరిపడా నీళ్లను పనివాళ్లతో కలిసి బావిలో నుంచి చేది పోయడం సాధన చేస్తే అప్పటికి చేతులు కాయలు కాసే తిప్ప లుండవు. రోజూ  చేసుకునే గడ్డం, గంటల కొద్దీ చేసే ప్రత్యేక గది స్నానాలు ఇక మానేయాలి. సెల్ ఫోన్  వాడకం పూర్తిగా తగ్గిపోవాలి. 


ఆకలేసిందంటే అన్నంపెట్టే వరకే అమ్మ ప్రేమ . ఆ సెంటిమెంటు జైలు జీవితంనుంచి విడుదలకు పనికిరాక పోవచ్చు. దేవుడే కాపాడతాడని ఆశ అంటారా' ! సర్కారుకే కాదు.. దేవుడిక్కూ డా తెలీకుండా చేసిన పాపాలకు దేవుడు పూచీ పడతాడా? 


ఆచార్య సారు కేసును పాఠంగా  భావించడమే కాదు. . ఆయనముందస్తు  జైలు రిహార్సల్సునీ ఆదర్శంగా తీసుకొంటే పిచ్చిపనులు చేసే అధికారులందరికీ ఆనక ఇబ్బందుండదు . 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక- హాస్యం - 03 -02 -2012 న ప్రచురితం) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...