కథ చెప్పినా ఊ కొట్టనమ్మా!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ - సుత్తి మొత్తగా ( కాలమ్ ) - 24 -02 - 2018 ప్రచురితం )
కథ చెప్పినా 'ఊ' కొట్టేది లేదమ్మా! పాట పాడినా వంత పలకడం ఉండదమ్మా! ఎంతసేపని ఒకే అక్షరం? బోరు. 'ఊ' అన్నంత మాత్రాన నే వింటున్నట్టు లెక్కా? నీకు చెప్పాలని అనిపిస్తే చెప్పుకో! కానీ నాకు వినాలనిపిస్తేనే వినేది.
ఇవాళ 'కథ' అంటావు. రేపు సుద్దులు మొదలు పెడతావు. ఎల్లుండి నీ కడుపులో ఉన్నదంతా పాటగా మొదలు పెడతావు! ఎన్ని పాత సినిమాలు చూడలేదూ! శ్రీ రంజనులు.. వాణిశ్రీలు వేలెడంతైనా లేని బుడ్డి పాపాయల్ని సొంత గొడవలతో వేధించి ఎందుకు వేపుకు తింటారో?!
కళ్ళయినా ఇంకా పూర్తిగా తెరిచి చూడలేని బుజ్జి పాపాయిలం! మీ సోది పాటలు మేమెలా అర్థం చేసుకోగలమే? ఆ మాత్రమైనా
తెలివిలేని నీ కడుపులో పడ్డందుకు నన్ను నేను తిట్టుకోవాల నుకుంటేనే.. నీ బోరు మొదలు పెట్టుకో! విన్నట్లు దాఖలా కోసం నన్ను మాత్రం 'ఊ' కొట్టమంటే .. నో వే!
చిన్నపిల్లోడి నోట్లో ఇన్ని పెద్దమాటలేంటని బుగ్గలు నొక్కుకుంటావని తెలుసు. మరేం చేసేది? ఇవాళ అమ్మవు నువ్వు చెప్పావు కదా అని అభిమానంతో 'ఊ' కొట్టానే అనుకో! అదే అలుసుగా రోజూ నువ్వు పురాణాలు మొదలు పెడితే నేనెట్లా చచ్చేది? వేలెడంతైనా లేని పసి వెధవను కదా! ఇప్పుడే నాకీ వేదాలూ.. కథలూ.. అంతవసరమా.. చెప్పమ్మా?
కథలు వినడానికి భయమెందుకురా? అని నువ్వడగవచ్చు. మన ఇంటి తంటాలో.. చుట్టాలతో గొడవలో.. పక్కింటి వాళ్లతో పోట్లాటలో.. కథలుగా అల్లి చెవితే.. అదో రకం! పురాణాలు మొదలు పెడతావు. పుణ్యపురుషుల కథలంటావు.త్యాగాలు చేసినమహానుభావులంటూ అతిశయోక్తులు జోడించి మరీ సుత్తి కొడతావు. మీ లలిత్ మోదీలు మాదిరో.. నీరవ్ మోదీలు లాగానో ముదిరి పోవద్దని బెదరగొడతావు!
నీరవ్ మోదీల గాధలు చెవినొప్పులైనా సరిగ్గా విచ్చుకోని నా బుర్రలోకి ఎలా వచ్చాయన్నది కదా నీ ధర్మ సందేహం? నాన్నారు చదివే పేపరు.. నువ్వు పొద్దస్తమానం చూసే టీవీలు చాలవా అమ్మా.. నా బుర్ర తొలిచేసేందుకు ?
ముక్కుపచ్చలారని పసిగుడ్డుని. ముక్కులు పగిలిపోయే ఈ దుర్గంధాలను భరించి ఎట్లా తట్టుకోగలనా అని కదా నీ బెంగ!
అమ్మా! నేను నీ కడుపులో ఉన్న తొమ్మిది నెలలూ నువ్వు తాగింది ఏమైనా స్వచ్ఛమైన గంగాజలమా? సురభి ధేనువు ఏమయినా ధరణికి దిగి వచ్చి పితికి పోసిన క్షీరమా?!
నాన్నారు పొద్దస్తమానం ఆ పత్రికల్లోని వార్తలు బైటికి చదువు తూంటారు కదా.. వింటుంటాను. కల్లా కపటం లేకుండా నేను పెరిగి పెద్దవ్వాలని నువ్వు కలలు కంటు న్నావు కానీ పిచ్చి తల్లీ! కల్లిబొల్లి కబుర్లకు ఉండే విలువ నిజాలకు ఈ లోకంలో ఉండదని తెలుసుకు న్నాను.
అబ్బాయి అమెరికాలో, అమ్మాయి ఆస్ట్రేలియాలో నెలకో యాభై వేలొచ్చే చల్లని సర్కారుద్యోగం, నెల మొదటి తేదీనే ముద్ద కుడుముల్లా అరవై వేలు కిరాయి స్థితికిచ్చే కామధేనువ్వంటి కమర్షియల్ కాంప్లెక్సు. అయినా సర్పంచి మనోడేనని తెల్లకార్డుకు తెగబడ్డం. ఎమ్మెల్యే ఎరికెలో ఉన్నాడని ఇందిరమ్మ ఇంటికి ఎగబడ్డం! ఏ సిరప్ పంచెలెగకట్టి మోడీగాడి మార్కు గారడీనో టీవీలో వినబడంగానే మరీ దొంగగాడిదలంటూ ఓ పంచాంగం గడగడా చదివేయడం!
పక్కింటి వెంకట్రావ్ ఆర్టీవో ఆఫీసరు . వాడు వంద కోట్లు బొక్కిన వైనం వాడకంతా తెలుసు! చిన్నకొడుకు కాంట్రాక్టరు. గవర్నమెంటు సొమ్ము కోట్లు బొక్కినా సైలెన్సు! అవినీతి మన ఇంటా బైటానే పొంగి పార్లుతుంది కదమ్మా! ఎక్కడో పారే మురుగుకు మాత్రమేనా ముక్కులు మూసుకోడం?
పోనీ... నువ్వు చెప్పావుకదా! హిపోక్రసీ వద్దు. నీతిగానే బతుకంతా గడుపుదామనుకున్నా . అవినీతిలో నా వాటా అప్పుడే నూట ఎనభై
రూపాయలంట! లెక్కగట్టేశారు! ఇంటికి ఇట్లా ఓ నాలుగు నూటపదార్ల చొప్పున అక్రమార్జన గానీ లెక్క గడితే.. నూటిరవై కోట్ల మంది వాటా ఎన్ని లక్షల కోట్లుంటుందో నువ్వే చెప్పమ్మా! ఆపైనే నీ నీతి కహానీలు నేను వినేది. మనసారా 'ఊ' అనేది.
ఆపలేవా? మరింకెడుకమ్మా ఈ ఆపసోపాలు? కథలు.. కాకర కాయలు?
అందుకే..బొడ్డూడనప్పటినుంచేనాకీ బంధనాలు వద్దనేదమ్మా! ఈ లోకం మహాత్ములు మహాత్ముల మాదిరి బతికే తీరులో ఉందంటావా? అమాయకంగా నువ్వేదో కథలల్లి పాడడం.. వెర్రి పుచ్చకాయలా నేనలా నోరు వెళ్లబెట్టి వినడం!
నేను మహాత్మా గాంధీలా పెరగాలని నీ పేరాశ! అదంతా వల్లకాక, పెడసరంగాళ్లతో వీలుపడక ఆనక ఏదో తప్పు చేసినవాడిలా ఇంట్లో మీ ముందు తప్పించుకు తిరగడం.. ఇదంతా ఎందుకు1 అందుకే నా కే కథలూ... కహానీలు వద్దనే వద్దు!
పసిబిడ్డలకు జోల పాటలు పాడి వినిపిస్తే.. తల్లి మనసుకు కాస్తంత ఊరటగా ఉంటుందని హాలెండు యూనివర్శిటీ అన్నదని అంటావా? కథలూ పాటలంటే కన్నవాళ్లకి సరదానే! వినే పిల్లకాయలకే ఇబ్బంది. ఉయ్యాల దిగడం ఆలీసం .. మళ్లా ఏ విమానమో ఎక్కి అమెరికా వెళ్లే వరకూ మమ్మల్ని మీరు ప్రశాంతంగా నిద్ర పోనిస్తారా?
పాడు చదువులతో మా మూడ్ పాడు చేయకుండా వదిలే కన్నవారు ఎందరున్నారమ్మా?
ఇంతోటి భాగ్యానికి ఇప్పుడీ కథలూ, కాకర కాయలు, పాటలూ, సుమతి పద్యాలు ఎందుకు చెప్పు? నొప్పెట్టు వరకూ 'ఊ' కొట్టడాలెందుకు.. దవడలకు ముప్పు,
నీ మానాన నువ్వు కళ్ళు మూసుకు పడుకో పో అమ్మా! నా మానాన నేను నాకు నచ్చిన ర్యాపో, ర్యాకో కునుకు పట్టే దాకా కళ్లు మూసుకు వింటూ పడుకుంటా! గుడ్ నైట్ మామ్! గది తలుపేసి వెళ్లు! పోతూ పోతూ.. ఆ లైటార్పేసి.. మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి పో!
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఆంధ్ర ప్రభ - సుత్తి మొత్తగా ( కాలమ్ ) - 24 -02 - 2018 ప్రచురితం )
No comments:
Post a Comment