Saturday, December 4, 2021

ఏడుపు మంచిదే - ఈనాడు - వ్యంగ్యం - కర్లపాలెం హనుమంతరావు ( ఈనాడు - సంపాదకీయ పుట- ( 06 - 12 - 2011) ప్రచురితం)

 



ఏడుపు మంచిదే - ఈనాడు - వ్యంగ్యం 

- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - సంపాదకీయ పుట- ( 06 - 12 - 2011) ప్రచురితం)  


ఏడవడం నిజంగా ఓ గొప్పకళ . కలవరపడినప్పుడల్లా కడవల కొద్దీ కన్నీరు కార్చడం అందరికీ అంత సులభంగా అబ్బే విద్య కాదు. 


' ఆ పిల్ల ఏమిటండీ బాబూ, ఎప్పుడూ నెత్తిమీద నీళ్ళకుండ పెట్టుకునే ఉంటుందీ!' అని విసుక్కోవడం తప్పు. ఏ ఉల్లిపాయ, గ్లిజరిన్ల సాయం లేకుండా అలా వలవలా ఏడవాలంటే ఎంత గుండెబలం కావాలి! 


బాలలకు, అబలలకే కాదు- అందరికీ బలే బలం. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం- ఈమధ్య వార్తల్లో తరచుగా వినిపించే ఏడుపులే!


ఏడ్చి కైకమ్మ కొడుక్కు పట్టాభిషేకం సాధించుకోవాలనుకుంది. ముక్కు తిమ్మనగారి  సత్యభామ ఎంత ముద్దుగా ఏడ్చి ఉండకపోతే తన పంతం నెగ్గించుకుని ఉంటుంది! 


శోకం ధర్మ విరుద్ధం, అపకీర్తిదాయకం, నరకహే తువు అంటూ గీతాచార్యుడు ఎన్ని ముక్కచీ వాట్లు పెట్టి ఉన్నా, ముక్కు చీదడం రానివాడికి ఈ కలికాలంలో చెరసాల నరకం ఖాయం . 


కరుణానిధి కూతురు ఆ ఏడుపేదో  ముందు ఏడవక పోబట్టేగదా తీహార్ జైల్లో ఆర్నెల్లపాటు అలా భోరుమంటూ గడపాల్సి వచ్చిందీ! చెరగండం గడవాలంటే కలాఅడీకి మల్లే  వట్టి పిచ్చివేషాలు చాలవు. దేవుడిని అడ్డుపెట్టుకున్నా- దొరికేది తాత్కా లిక మోక్షమే! తల్లి సెంటిమెంటైనా పండనిచోట దుఃఖమంత్రమొక్కటే దిక్కు. 


యెడ్యూరప్పకు ఏడుపు పవరేంటో తెలుసు . కాబట్టే అధికారంలో ఉన్నంత కాలం ఏడుస్తూనే పాలన కొనసాగించాడు . బిక్కమొగమేయడం తప్ప బిగ్గరగా గగ్గోలు పెట్టడం రాలేదు. . కాబట్టి, రామలింగరాజు అంతకాలం జైల్లో చిప్పకూడు తిన్నాడు. 


ఇనుప గనుల గాలికి ఆ అంతులేని సంపద సాధించి పెట్టలేని బెయిలును, పాతిక వేల పూచీకత్తుతో  శ్రీ లక్ష్మి మేడమ్ సాధించుకోగలిగారంటే, ఆ ఘనత ఆమెది కాదు... ఆమె నెత్తిమీదున్న జలఘటానిది.


'నవ్వుకోవడానికి ముప్పై రెండు పళ్లున్నాయి. ఏడవడా నికి రెండే కళ్లు' అంటూ నవ్వుల సంఘం బాపతు మనుషులు ఏవేవో  వృథా కబుర్లు చెబుతుంటారు. 


నిజానికి నవ్వే నాలుగిందాల చేటు. మయసభ మధ్యలో నిలబడి పకపక్ 

కలాడినందుకు పాంచాలికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు.  కురుసభ మధ్యలో చిక్కడిపోయినప్పుడు 'హేకృష్ణా' అన్న రోదనే కదా చివరికి ఆ సాధ్వీమణి  మానాన్ని కాపాడిందీ!


కలకంఠి కంట కన్నీరు ఒలికితే ఇంట సిరి నిలవదంటారు.  వట్టిదే ! చెరసాలలో ఉసిరితొక్కు కూడు తప్పాలంటే టాప్ రేంకులు ..  తెలివితేటలు కాదు కావాల్సింది. విరామం లేకుండా కంటి కుండల  కుండ వలసిన శక్తియుక్తులు! 


ఇమ్మనుజేశ్వరాధములకు తనను అమ్మవద్దని పోతన ఇంటిగుమ్మంలో కూర్చుని కుమిలిపోయింది శారదమ్మవంటి మహాతల్లి.  మేడమ్ శ్రీలక్ష్మిగారు  తీసిందీ   అదే ఆరున్నొక్క రాగం. 


'ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి. ఏడిస్తే నీ కళ్లు నీలాలు కారు' అంటూ తల్లులు పిల్లల్ని జోలపాటలప్పటి నుంచే తప్పుదారి పట్టించడం తగదు.  ఏమో, ఎవరు చూడొచ్చారు... పెరిగి పెద్దయిన తరువాత ఏ పెనుగం డాలు జైలురూపంలో ఎదురు రాబోతున్నాయో! కీడెంచి మేలెంచడమని కదా సామెత!  కీ ఇచ్చినట్లు ఏడవడం పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పించడం మంచిది. బెయిలు మీదన్నా సరే నవ్వుతా  జైళ్ల బైట క్షేమంగా బతుకుతారు. 


వట్టి ఏడుపు గొట్టు అనేది ఇక ఎంతమాత్రం తిట్టు పదం కాదు  జైలుకు వెళ్లినా ఊటీకి వెళ్లొచ్చినంత కులాసాగా  బయటపడాలంటే  ఉపకరించే

మహా అస్త్రం నోరు బాదుకుంటో భోరు భోరు మనడమే! 


నేరం మోపినప్పుడు చట్టానికి చిక్కకుండా మాయరోగాలు కొని తెచ్చుకోవడం పాతకాలంనాటి చిట్కా.  రోజులు బాగా లేవు.  నిజంగా ఆరోగ్యం చెడిపోయినా అమర్ సింగ్ అంతటి మేధావికే ఊరట దొరకడం కష్టమైపోయింది. ముందస్తు బెయిలు ఆదేశాల పప్పులూ మునుపటంత సులభంగా ఉడకనప్పుడు, ఆపకుండా నెత్తి మీద కుళాయి తిప్పి వదిలిపెట్టి కూర్చోవడమొక్కటే ఆపదలనుంచి కాపాడే ఏకైక సాధనం.  ఏమడిగినా ఏడుపొక్కటే  బదులు  రావాలి. ఎంత గద్దిస్తే అంతగా దద్దరిల్లిపోమేలా ఏడవాలి  . మౌనం అనర్ధం. అర్ధాంగీకారం కింద అర్ధం తీసుకొనే ప్రమాదం  కద్దు. ఆరున్నొక్కరాగంలో  మనమేం చెబు తున్నామో అడిగినవాడికి అర్ధమై చావక  ఏడవాలి. ఎన్ని చేతిరుమాళ్లు తడిసిపోతే అంత ఫలం. 


' ఏడ్చేవాడి బిడ్డకే ఎవరైనా అరటిపండ్లు పెట్టేది' అని సామెత. 


ఏడుపంటే మరీ అంత దడుపెందుకు ? ఏడుస్తూనే పుడతాం. ఏడిపించి వెళ్ళి పోతాం. బతికినంతకాలం మనకు ఏడుపు . పోయిన తరువాత మనవాళ్లకు ఏడుపు. పుట్టినా గిట్టినా, ఉన్నా పోయినా తప్పని ఏడుపుల్ని తప్పించుకోవాలని చూసేకన్నా వీలైనంత వరకు ప్రయోజనాలు పిండుకోవా లని చూడటమే సిసలైన స్థిత  ప్రజ్ఞత . 


 ఏడవాల్సి వచ్చినప్పుడు ఏడవడానికి మొహమాటపడి తిప్పలు కొనితెచ్చుకోవడంకన్నా విషాదం జీవితంలో మరొకటి ఉండదు.


రోజుకో కుంభకోణం కొత్త కొత్తది బయటపడుతున్న రోజులివి. సీబీఐ ముందు జవాబులు చెప్పడానికి ఎవరె ప్పుడు వెళ్ళవలసి వస్తుందా  ఎవరికి తెలుసు! ఎందుకైనా మంచిది. ముందస్తు బెయిళ్లు మాయరోగాలు, దేవుడి పూజలు, ఫ్యామిలీ సెంటిమెంట్లు, దక్షిణాలు, ప్రదక్షిణాల చిట్కాలమీదే పూర్తిగా భరోసా పెట్టుకోవద్దండీ! రోజులో ఇరవై నాలుగ్గంటలూ ఆపకుండా ఏడవడం ఎల్లాగో  ముందు సాధన చేయటం మొదలుపెట్టండి! చేతారాదు అంటే ఇక మీ ఏడుపు మీరు ఏడవండి! తప్పేదేముంది ! 


- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - సంపాదకీయ పుట- ( 06 - 12 - 2011) ప్రచురితం)  


No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...