ఈనాడు - హాస్యం - వ్యంగ్యం
ఈవియం మాయం
రచన - కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 06/12/2010 - ప్రచురితం )
పిల్లలు పరీక్షల్లో రాసిన సమాధాన పత్రాలు గల్లంతయ్యాయంటే ''హన్నా!' అనుకున్నాం.
దేవుడి గుళ్లల్లో విగ్రహాలు మాయం అవుతున్నాయంటే- ఇదేం కలికాలంరా అని ఈ గుండెలు బాదుకున్నాం.
అవసరమైనప్పుడే సర్కారు కార్యాలయంలో దస్త్రాలు, ఆసుపత్రుల్లో పురిటి మంచం మీదనుంచే పసికందులు మాయమైపోవటం మనకు కొత్త కాదు. వింత అంతకన్నా కాదు.
పెద్ద పెద్ద ప్రాజెక్టులే మాయమై పోతున్నాయి.
కట్టామంటూ బిల్లులు కొట్టేసిన కరకట్టలకే దిక్కు లేదు.
ఓబుళాపురం గుళ్లు, శిబూసెరన్లు , ఖత్రోచీలు, యాండర్సన్లు ఇక్కడున్నట్లే ఉండి, ఉత్తర క్షణంలో 'హాంఫట్' అయిపోవటం మనకే మన్నా కొత్తా!
అయినవాళ్ళకు అడ్డొస్తే గవర్న మెంటు జీఓలే మాయమవుతుంటాయి.
బలం, బలగం ఉన్నవాడికెదురుగా మొండిగా ఎన్ని కల్లో నిలబడితే శాల్తీలే గల్లంతవడం వింతా కాదు . . విడ్డూరం అంతకన్నా కాదు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కదా మనది! అందుకే ప్రతివాడికి ప్రతిదానికి స్వతంత్రం మరీ ఎక్కువగా ఉంటుంది.
ఆ చొరవతోనేనేమో మొన్న ఎన్నికల్లో మనం వాడుకున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా లు ఎవడో ఎత్తుకుపోయాడు! ఒకటి .. రెండూ కాదు. ఏకంగా నాలుగు వేల యంత్రాలకు లెక్క తెలియడంలేదని ఎన్నికల సంఘంవారు కంగారు పడుతున్నారు.
ఈవీయం డబ్బాలేమన్నా వెంకటేశ్వరస్వామి గుళ్ళో హుండీలా... ఎందు కంత కంగారు? ఇనప రేకు డబ్బాలేగా! ఇవి పోతే, కొత్తవి అలాంటివే మళ్లీ చేయించుకోలేమా? దుర్గ గుడిలోని అమ్మవారి నగలకే అచ్చంగా అలాంటి నకిలీలు తయారుచేసే చక్కటి కళాకారులు రాష్ట్రం నిండా ఉన్నారు.
డాక్యుమెంట్ల దగ్గర్నుంచీ విశ్వవిద్యాలయ సర్టిఫికెట్ల దాకా వేటినైనా 'రాముడు భీముడు' టైపులో డూప్లికేట్లు, ట్రిప్లికేట్లూ ఫటాఫట్ మని చేసి అవతల పారేసే కేటుగాళ్ళు పేటకొకరు దొరుకుతారు. పోయిన బోడి నాలుగు వేల డొక్కు పెట్టెలకోసం ఇంత రాద్ధాంతం అవసరమా?
పోయినవి ఇనప సామాను గనక కనీసం పాత సామాన్ల కొట్టులోనైనా కొన్ని దొరికాయి. అదే ఏ వోక్స వ్యాగన్ బాపతు ఫెళ పెళలాడే నగదు అయి వుంటే...!
బాలాజీ కానుకలకు ఏ గతి పట్టిందో మనకందరికీ తెలుసు. ఆరు యంత్రాలన్నా కనిపించాయని సంతోషపడక... మిగతావి ఏమయ్యాయని ఈసీ వారు కలెక్టరును లెక్కలడగటమేంటసలు ! ఓవర్ కాకపోతే!
లెక్కలు తేలకపోవడం మనకేమన్నా కొత్తా ? నిత్యం జరిగే కుంభకోణాలలో ఎంత పోయిందో ఎంతవరకూ లెక్క తేలింది?
జలయజ్ఞంలో, ఇందిరమ్మ ఇళ్ళ పథకాలల్లో ఎంత మునిగిందీ, మురిగింవీ లెక్కలు చెప్పేవాళ్లెవరు?
అయినా అంత పెద్ద అధికారులకు డొక్కు పెట్టెలు లెక్కపెట్టుకుంటూ కూర్చోవటం ఒక్కటేనా పని... చోద్యం కాకపోతే !
అదనపు ఈవీయంలను రాజకీయ పక్షాలు వాటి ప్రమాణ నిర్ధారణకోసం పట్టు కెళ్ళాయని అక్కడికీ అధికారులు నెత్తీ నోరూ మొత్తుకుంటిరి !
ఏ పార్టీ ఏ ప్రమాణాల కోసం పట్టుకెళ్లిందో... అధికారులు నోటితో ఎలా చెబుతారండీ పాపం! ఉద్యోగాలుండాలా, ఊడాలా?
ఏ పార్టీకి ఓటేసినా నిష్పక్షపాతంగా ఒకే పార్టీకి ఓట్లు పోలయ్యే సౌకర్యం పోయినసారి ఎన్నికల్లో ఏర్పాటైందని ప్రతిపక్షాల గోల.
మరీ ఆది అసత్యం మాత్రం కాదని ప్రజా స్వామ్యం మీద మితిమీరిన అభిమానమున్న కొద్దిమంది యువశా స్త్రవేత్తలు ప్రదర్శన చేసిమరీ నిరూపించారు. ఇప్పుడే దొంగతనాలు... స్ట్రాంగురూములో ఉన్నవి ఎలా మాయమవుతాయని ఎన్నికల సంఘం ఎగిరెగిరి పడుతోంది!
కానీ... అలా దాచడంవల్లే ఇలా చిల్లర చోరీలు జరుగుతున్నాయని గ్రహించడం లేదు।
సర్కారు కార్యాలయాల్లో ముఖ్యమైన ఫైళ్ళయినా అలా బాహాటంగా గుట్టలు గుట్టలుగా పడుంటాయి గదా, ఒక్కటైనా పోతుందా!
బ్యాంకు లాకర్లలో భద్రంగా ఉన్న డబ్బుకే కాళ్లొచ్చాయని వింటుంటాం గానీ... బైటున్న కంప్యూటర్లు పోయాయని ఎప్పుడైనా విన్నామా?
ఈవీయం పెట్టెలను భద్రంగా స్ట్రాంగ్ రూముల్లో మూసి పెట్టాలనుకోవడమే అధికారులు చేసిన తప్పు.
ఈసీ ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, ఇంతా చేసి ఓటింగ్ యంత్రాల విలువ చెత్త సామానుకున్నా ఎక్కువ కాదు. అది తెలుసుకున్న వాళ్ళ పనే కావచ్చిది.
ఏమైనా ఒక్క విషయం మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం. ఈసీ వారి దృష్టిలో ఈ ఈవీయంలకు విలువెంతో తెలీదు కానీ, మామూలు మనిషి దృష్టిలో మాత్రం ఈ డొక్కు పెట్టె కిలో వంకాయల కన్నా ఎక్కువ తూగదు.
పాత సామానుగా కిలో పదిహేను రూపాయలకు మించి పలకలేదంటే ఏమిటి అర్ధం! కంట్రోలింగ్ మిషన్ అయితే మరీ అన్యాయం. రెండు కొత్తిమీర కట్టల పాటి కూడా విలువ చేయలేదు!
కూరగాయల ధరలు అలా మండిపోతున్నాయి మరి! ధరలు ఇలాగే ఎంతకూ దిగి రాకుండా ఉంటే... ఇదిగో ఇలాగే మిగిలిన ఈవీయంలను కూడా ఏ చింతపండు కొనుక్కోవ టానికో అధికారులే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావచ్చు .
గంజినీళ్ళకోసం ఇనప్పెట్టెలను కూడా పీక్కుతినే రోజులొస్తాయని కాలజ్ఞానంబ్రహ్మంగారు చెప్పనే చెప్పారుగా మరి !
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - 06/12/2010 - ప్రచురితం )
No comments:
Post a Comment