వ్యాసం:
తొండము స్వామికి దండాలు
- కర్లపాలెం హనుమంతరావు
ఎలుకతోకను ఏనుగు తొండాన్ని అనుసంధానించే బొజ్జగణపయ్య స్థూలసూక్ష్మస్వరూపానికి నిలువెత్తు సాక్షి.
గుప్పెడంత మట్టితో మన నట్టింటి పాలవెల్లికింద భాద్రపద శుద్ధ చవితినాడు కొలవయ్యే కుడుములయ్యది యుగాది నుంచి దిగంతాలదాకా విస్తరించిన వింత కథ.
లింగ పురాణం ప్రకారం సురుల మొరవిని అసురులను అణచేందుకు హరుడు సృష్టించిన వీరుడు వినాయకుడు. శివపురాణం ప్రకారం భర్తభృత్యులు నంది, భృంగ్యాదులకు పోటీగా పార్వతమ్మ ప్రాణం పోసిన వంటినలుగుపిండి బొమ్మ. శాంకరీజంట కరిజంటగా హేమవనంలో జరిపిన ప్రేమవిహార ఫలమీ గజాననుడని సుప్రభేదాగమం కథ. నన్నెచోడుని 'కుమారసంభవం'లో బ్రహ్మేంద్రాది దేవతల, ఋషిగణాల ప్రార్థనల మీదట శివగణ సురగణాలకు ఆధిపతీ, అఖిల క్రియారంభాదికార్యాలకి అధినాయకుడయిందీ ఈ వినాయకుడే.
శైవవైష్ణవులతో సరిసమానంగా పూజలందుకునే ఒకేఒక్క సామ్యస్వామి ఈ విఘ్ననాయకుడు. అమరకోశం ప్రకారం బుద్ధుడికి వినాయకుడని మరోపేరు. ఒకటో శతాబ్దినాటి హాలుని గాథా సప్తశతిలో గజాననుడి చేష్టను వర్ణించే కథ వుంది (5-3). గృహ్యసూత్రాలలో నలుగురు వినాయకులు. యాజ్ఞవల్క్యుని కాలంనాటికి వినాయకుడు ఒకడే కాని పేర్లు ఆరు.
పురాణకాలంనాటి వామాచారం, తాంత్రిక పద్ధతులు అష్ట గణపతులను సృష్టించాయి. భరతఖండ సంస్కృతితోపాటు చైనా, ఇండోనీషియాలవంటి విదేశాలకు విస్తరించిన దేవుడు వినాయకుడు. మెక్సికోలో గణపతి ధాన్యదేవత. గోగాదీవుల్లో ఆలో ఆలో. గ్రీకుదేశంలో డెమెటర్. రోమనులకు కెరెస్. జపాన్ వినాయకుడి పేరు 'బినాయికియా', 'హిందూయిజం' అనే ఆంగ్ల గ్రంథంలో గోవిందదాసు- 'ఆర్యుల పూజాదికాలలోకి చొచ్చుక్కొచ్చిన అనార్యదైవంగా వినాయకుడిని అభివర్ణించారు.
బొజ్జగణపయ్యని తెలుగువాళ్ళు పెంచి పోషించిన తీరు కపిలవాయి లింగమూర్తి ఒక క్రమంలో చక్కగా వివరించారు. తెలుగు పడతుల కపోలాలు, కుచాలు, ఊరువులు ఏనుగు దంతాలు, కుంభాలు, కరాలవలె శోభిల్లుతుంటాయి కనక ఆ అమ్మను ముమ్మూర్తులా పోలినట్లుండే గజాననుడు సంచిత భాగ్యవంతుదవుతాడని సిద్ధసతులద్వారా శుభాశ్శీసులు పలుకుతాడు కన్నప్పచరిత్ర కావ్యకర్త.
అది బాలగణపతి తొట్టిఉయ్యాలలూగేనాటి ముచ్చట. తల్లిపాలు తాగే వయసులో గణపతి చేసిన అల్లరి అల్లసానివారు మనుచరిత్రలో 'అంకము జేరి' పద్యంలో పొంకంగా వివరించనే వివరించారు. తొట్టెలో పెట్టే తండ్రి పైబట్ట గుంజి అప్పచ్చికోసం అల్లరి పెట్టే బుజ్జిగణపయ్య రఘునాథ నాయకుడి పార్వతీ పరిణయంలో అలరిస్తాడు. పాలు తగ్గించి అప్పాలకోసం పిల్లలు మారాం చేసే పసిదశ దాటి తల్లిదండ్రులకు ముద్దులిచ్చే వయసునాటి ముచ్చట్లను అప్పకవి పద్యం చేసారు. 'జనక భుజద్వయాగ్రమున చక్కగ నిల్చి తదుత్తమాంగమం/దునగల వాహినీ విమలతోయములందున నీడ గాంచి నా యనుజుని మీద బెట్టుకొనె నప్పయటంచును తల్లితోడ జె/ప్పిన' అమాయక బాలగణపతి 'అలమేలుమంగా పరిణయం'లో కనిపిస్తాడు. వెండికొండను బొంగరంగా.. భుజంగేంద్రుణ్ని తాడుగా చేసి బొంగరాలు ఆడే బిడ్డకు గిరిపుత్రి నచ్చచెప్పే ముచ్చట విక్రమార్క చరిత్రంలోది. తల్లిదండ్రుల మాటలు ఆలకించి ఆచరించే వినయశీలత వుట్టిపడే ఆ కౌమార్యం గడిస్తే ఇక వసుచరిత్రలోని 'దంతాఘట్ట' ఘట్టమే. ఇక్కడ ఎదిగిన కుమారాగ్రేసురుడుగా గజాననుడు కనిపిస్తాడు. సరస భూపాలీయంలోని పద్యం పితృస్వాంతాలు అలరింపచేసే గణపతి ప్రౌఢత్వాన్ని ప్రస్తుతిస్తుంది. 'అరుదుగ వామభాగ లలనా కలనా చలనాత్ముడైన యా/హరుగురు గాంచి తానును తదాకృతి యేకదంతుడై/కరి కరణీగుణంబులు మొగంబున దాల్చి జగంబులేలే' కరుణాసనాథుడిగ రూపాంతరం చెందేదాకా తెలుగువాళ్ళు గణపయ్యను తమవాడిగా పెంచి పోషించుకొని సేవించుకున్నారు.
గజరూపం, ఏకదంతం, మూషికవాహనం, బ్రహ్మచర్యం, లంబోదరం-ఐనా యుగయుగాలుగా అశేష భక్తజనావళి నివాళి ! క్షేత్రతస్కరుడైన ముషికాసురుణ్ని మర్దించే పంటల దేవుడిగా గజాననుడిని రావుబహుదూర్ బి ఏ గుప్తా సిద్ధాంతరీకరించారు. ధాన్యాన్ని తూర్పారపట్టే చేటల్లాంటి చెవులు, నాగలిని పోలిన ఏకదంతం, గాదె మాదిరి వినాయకుడు పంటల దేవుడనడానికి గుప్తాజీ చూపిస్తున్న నిదర్శనాలు. ధర్మసింధువో, నిర్ణయసింధువో నిర్ణయించిందని కాదు. వర్షర్తువు. ఉత్తరార్థం. ప్రకృతి ప్రౌఢత్వం సంతరించుకుని పరిపాక రమణీయకంగా ప్రదర్శితమయ్యే ఆహ్లాదకర వాతావరణం. తొలికారు సస్యలక్ష్మి ఫలోన్ముఖంగా కళకళలు పోతూ అభ్యుదయపథాన నిర్విఘ్నంగా కొనసాగాలనే కాంక్షకు ప్రతిరూపంగా ఈ చవితి సంబరాన్ని భావించడం సబబు.
విస్సా అప్పారావుగారి ఉపపత్తి ప్రకారం చూసుకున్నా ఈనాటి అంబర దృశ్యరహస్యమే ఈ సంబరం వెనకున్న ప్రేరణ. చిన్న ఎలుకలాంటి నక్షత్రాల గుంపుమీద విఘ్నేశ్వరాకారంలో మరో నక్షత్రాల గుంపు.. ఉషోదయానికి పూర్వమే పూర్వాకాశాన మెరిసే భాద్రపద శుద్ధ చవితికి మించిన మంచి ముహూర్తం మరేముంటుంది!
భవిష్యపురాణం ప్రకారం విఘ్న నియంతే కాదు.. విద్యాధిదేవత కూడా వినాయకుడు. వ్యాసమహర్షి భారతేతిహాసానికి రాయసగాడు. ప్రాచీనాచార్యుల భావనలో బ్రహ్మణస్పతి. రుగ్వేదం స్తుతించిన బృహస్పతి. యాస్కరాచార్యుడి నిరుక్తం లెక్కన వాక్కుకీ అధిపతి. అక్షరాభ్యాసాది ఏ ఉత్సవానికైనా తొలి దైవతం వినాయకుడే.
ఎన్నెన్నో పురాణగాథలు సహస్రాబ్దాలుగా కలగాపులగమై ఇవాళ మనం జరుపుకునే పండుగ రూపం సంతరించుకున్నదన్న తిరుమలవారి మతమే సత్యం. రావూరివారు అన్నట్లు మనసుకి ఆనందరసానుభూతి అందే క్షణాలన్నీ పండుగలే. పెదాలమీద చిరుదరహాసాలు మెరవడమే ఏ పూజకైనా ఫలశ్రుతి. నిత్యజీవన యాత్రలో పొట్టకూటికి సతమతమయ్యే సగటు జీవికి ఇహాన్నుంచి ఈ రోజు ఉపశమనం. పరాన్ని గూర్చి యోచించే సదవకాశం. వినాయక చవితి శుభాకాంక్షలు.
- కర్లపాలెం హనుమంతరావు
No comments:
Post a Comment