ఈనాడు - గల్పిక- హాస్యం ' వ్యంగ్యం
పెళ్లి రాజకీయాలు
రచన - కర్లపాలెం హనుమంతరావు
ఈనాడు - సం.పు- 20-04-2014 న ప్రచురితం )
ఎదిగిన మగబిడ్డలు గుండెలమీద గాడిపొయ్యి లాంటివాళ్లు.
భ్రూణహత్యలవల్ల ఆడపిల్లలు తగ్గిపోతుంటే, రేపు మగవంక అనేవాడికి జోడీ దొరుకుతుందా?
గెలిచే పార్టీ టికెట్ దొరక డంకన్నా, చట్టసభలకు నీతిమంతుడైన నాయకుడు ఎన్నిక కావడం కన్నా, మగవాడికి పిల్ల దొరకడం కష్టమైపోతోంది.
అలాంటి కష్టమే ఇప్పుడు మా ప్రసాదుకు వచ్చిపడింది.
పార్టీ టికెట్ కోసం నాయకులు ఎన్నిపాట్లు పడుతున్నారో అంతకన్నా ఎక్కువగా శ్రమ పడ్డాక, ఎలాగైతేనేం చివరికి మా ప్రసాదు ముక్కుకూ ఓ 'దొండ పండు' దొరికేలా అనిపించింది.
పార్టీ అధిష్ఠానం టికెట్ ఇస్తాననగానే పనైపోదుగా!
'బి' ఫారం చేతిలో పడాలి.. గడువు లోగా నామినేషన్ వేయాలి. . దానికి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి తకరారూ రాకుండా ఉండాలి. . ఉపసంహరణ ఒత్తిళ్లు కాచుకోవాలి.
అసలు టికెట్ తెచ్చుకుని బరిలో నిలబడటమన్నది ఎన్నికల్లో గెలవడంకన్నా కష్టంగా ఉంది కదా!
దొండపండు ఖాయమనుకున్న మా ప్రసాదుకు పెళ్లికి ముందు అంతకన్నా పెద్దకష్టం వచ్చి పడింది. . ముందు ఆడపిల్లవాళ్లను పెళ్లికి ఒప్పించడం!
గుణగణాలు, వంశం, ఆర్థిక స్తోమతు, చదువు గట్రాగట్రా ప్రజాప్రతినిధికైతే అక్క రేదేమోగాని- పెళ్లికొడుక్కి ఉండి తీరాలి మరి. సరిగ్గా ఇక్కడే మా ప్రసా దుకు గొప్ప చిక్కొచ్చిపడింది.
తాను అవునని తల ఊపడానికి ముందు కొన్ని పరీక్షలు అవసరమని షరతు పెట్టింది కాబోయే పెళ్లికూతురు. ఓటర్లంటే నేత ఎన్నికకు వెనకాడటంలేదు గాని, ఈతరం అమ్మాయిలుమాత్రం పెల్లికి ముందే అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాముడంతటి దేవుడికే తప్పలేదు- ' శివధనుర్భంగం' లాంటి వర పరీక్షలు! ఇహ మా ప్రసాదు ఎంతా?
పెళ్లికూతురు ముందుగా ప్రసాదును నేత్రవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లింది.
' బోర్డుమీద కనిపించే వాటిని బిగ్గరగా బయటకు చదువుతూపోండి . . చాలు' అన్నాడు నేత్రవైద్యుడు .
అయిదు నిమిషాల్లో పరీక్ష ముగిసింది. తరువాత మరో వైద్యుడి దగ్గర చెవి పరీక్షలు.
తెరమీద రాజకీయ నాయకుల ప్రసంగాలు విని, సారాంశాన్ని గుర్తున్నంత వరకు కాగితంపై రాయడమే ఈ పరీక్ష' అన్నాడు వైద్యుడు.
ఆడుతూపాడుతూ ఆ పరీక్షా పూర్తి చేశాడు మా ప్రసాదు.
ఇక చివరి పరీక్ష. కొన్ని వార్తాపత్రికలు చదవడం!
అయితే, రాజకీయ నేతల ప్రసంగ సరళి గురించి ఓ పది మాటలు రాస్తే చాలు' అంది పెళ్లి కూతురు.
సివిల్ సర్వీసు ప్రాథమిక స్థాయి పరీక్షలు రెండుసార్లు గట్టెక్కిన గట్టిపిడం మా ప్రసాదు. ఇలాంటి చిల్లర పరీక్షలు అతడికి బెల్లం ఉండతో సమానం.
ఫలితాలు మర్నాడు విడుదలవుతాయనగా ఆ రాత్రంతా నిద్రలేదు మా ఇంట్లో ఎవరికీ. ఎన్నికల ఫలితాలప్పుడైనా అభ్యర్థికి అంత ఉత్కంఠ ఉండదేమో!
మర్నాడు- ' కళ్లులేని కబోదిని, ఏదీ సరిగా వినపడని బధిరుణ్ని పెళ్లాడటం కుదరదు' అంది వైద్యుల నివేదికలు మా ముందు పారేసి పెళ్లికూతురు.
ప్రసాదకు రాజకీయ పరిజ్ఞానం శూన్యమని తేల్చేసింది.
' ఆదర్శ కుంభకోణం అని తాటికాయంత అక్షరాలుంటే ఒక్క 'ఏ' అనే అక్షరంతో సరిపెట్టేస్తాడా! 'బోఫోర్సు కుంభకోణం అని బొప్పాయి కాయంత అక్షరాలున్నా పూర్తిగా చద వడానికి అంత బద్దకమా? 'బి' అన్న ఒక్క అక్షరం చదివితే సరిపోతుందా?
కోల్గేటు కుంభకోణం, ఖాళీ ' సి ' గా , డయల్ కుంభకోణం కేవలం 'డి' అక్షరంగా పొడిగా చెబుతాడా? ఎమ్మార్ స్కాము అంతలా కుదిపేసింది గదా... దాన్ని ముక్తసరిగా 'ఇ' అనేసి ఊరుకుంటే ఏమిటర్ధం!
కంటిముందు కనబడే అన్యాయాలను గుర్తుపట్టని గుడ్డిమనిషిని కట్టుకోమనడం న్యాయమేనా? అని కడిగిపారేసింది పెళ్లికూతురు.
మా ప్రసాదు నోరు మెదిపితే ఒట్టు! !
అయిదో తరగతి పిల్లాడు దేశభక్తి మీద రాసుకొచ్చిన చూసిరాతకన్నా అన్యా యంగా రాసుకొచ్చాడు నేతల ప్రసంగాల గురించి . నేతల దుర్భాషల్లో ఈ అబ్బాయి ఏనుగు చెవులకు ఒక్క అభ్యంతర పదమైనా వినిపించనే లేదే ? బధిరత్వంలో బ్రహ్మదేవుడికి గురువు అనుకోవాలా? ఈ చెవిటి మాలోకాన్ని
చేసుకుంటే సుఖపడేది సున్నా' అని తేల్చేసింది ఆ పిల్ల.
'ఇక రాజకీయ పరిజ్ఞానంలోనూ అంతే లచ్చనంగా ఉంది.
ఇతగాడి స్థాయి. ఈ మధ్యనే పుట్టి అనేక సంచలనాలు నమోదు చేసుకొన్న కొత్తపార్టీ పేరు చెప్పమంటే కేజ్రీవాలో .. ఆమ్ ఆద్మీ పార్టీనో అని అంటడనుకున్నా! రాఖీ సావంత్ ' పచ్చిమిర్చి' పార్టీ అన్నాడు. రామకోటి లాగా రాసేశాడండీ ఆ మహా తల్లి పేరు. వెరీ శాడ్ !
ఈ తరహా గుడ్డి, చెవిటి, మూగ మొద్దును జీవితాంతం భాగ స్వామిగా భారించాలంటే.. సారీ .. మనస్ససలు యస్ .. ఓకే అనడం లేదు' అని కుండబద్దలు కొట్టి మరీ ఎగ్జిటయిపోయింది. ఆ పిల్ల చివరాఖరికి .
"హలో మేడం! గుడ్డి, చెవుడు అంటే సరే ! మూగతనం అనే అభాండం నిజంగా చాలా అన్యాయం' అని ఇంతెత్తున లేవబోయా నేను .
' సార్! కొద్దిగా తగ్గండి ! మీరట్లా మిరపకాయ కొరికినట్లు ఎగురుతున్నారు.. గానీ, ఈ అబ్బాయి ఏమన్నా నోరు తెరిచాడా ఇప్పటిదాకా! కంటిముందు జరిగే అన్యాయాలనీ , చెవుల్లో రోజూ రొదపెట్టే చీదర పదాలనీ చూస్తూ వింటూ కూడా నోరెత్తలేనివాణ్ని మూగి అనికాక ఇంకేమనాలి మాష్టారూ? నా 'వీక్యూ' టెస్టు లో ఈ అబ్బాయి అట్టర్ ఫైల్ ' అనేసిందా అమ్మాయి: '
' వీక్యూ' అంటే ఓటింగు సామర్థ్యం సూచించే సమాచారంట
ఐక్యూ మోడల్లో ;
ఏ మాటకు ఆ మాటే! మాటల మధ్యలో ఆణి ముత్యాల్లాంటి రెండు ముక్కలు చాలా చక్కగా చెప్పిందా అమ్మాయి.
అవిటితనం మన లోపం కాదు. అన్నీ ఉండీ సరిగ్గా వాడుకోకపోవడమే మన లోపం. కులం కొరుక్కు తినే పదార్థం కాదు, కూడూ పెట్టదు. మతం వ్యక్తిగతం. జాతకం అంధుల ఆధారంలేని విశ్వాసం. ధనం సంపాదిస్తే వస్తుంది. ఖర్చుపెడితే పోతుంది . కలకాలం చెక్కుచెదరకుండా ఉండేది సంస్కారం . చుట్టూ జరిగే మోసాలను పట్టించుకోకపోవడం ఒక ఎత్తు. ఆ మోసా లకు కారకులైనవాళ్లను పనిగట్టుకొని మోసెయ్యడం మరో ఎత్తు. అన్నీ ఉండి, ఏవీ సక్రమంగా వాడని మందబుద్ధిని చేసుకుంటే రేపు పుట్టబోయే బిడ్డలూ అంతే మొద్దురాచిప్పలు కారని గ్యారంటీ ఏమిటి? అందుకే ఈ సంబంధం నాకు వద్దు" అనేసింది ఆ గడుగ్గాయి.
ఇన్ని మాటలు విన్న మా ప్రసాదు ఏమవుతాడోనని భయపడ్డాం మేం.
మేం భయపడ్డట్లు ఏమీ కాలేదు. పైపెచ్చు మెరుగుపడ్డాడు కూడా!
జరుగుతున్న రాజకీయాలను విమర్శనా దృష్టితో పరిశీలిస్తున్నాడిప్పుడు .
ఈ మధ్య ఎన్నికల ప్రచారానికని ఇంటికొచ్చిన అభ్యర్థుల్ని నిలదీస్తున్నాడుకూడానూ .
పోయినసారిలా బద్ధకించకుండా ఈసారి పోలింగు కేంద్రం దాకా వెళ్లి సరైన అభ్యర్థినిఎన్నుకోవడంలో తనవంతు పాత్ర చక్కగా పోషిస్తాడనే అనుకుంటా!
మళ్ళీగాని కంటబడితే, ఆ దొండపండుకు మా కాకి నచ్చవచ్చేమో !
ఏమో! రాజకీయాల మాదిరిగా పెళ్లి వ్యవహారాలలో కూడా ఏదీ అసంభవం కాదు. చూద్దాం!
రచన - కర్లపాలెం హనుమంతరావు
ఈనాడు - సం.పు- 20-04-2014 న ప్రచురితం )
No comments:
Post a Comment