గురు సాక్షాత్ .. పరబ్రహ్మమ్ ! - ఈనాడు- గల్పిక- హాస్యం - వ్యంగ్యం
ఈనాడు - గల్పిక -హాస్యం - వ్యంగ్యం
గురువుల కథ
కర్లపాలెం హనుమంతరావు
( గురు సాక్షాత్.. పరబ్రహ్మమ్ ! పేరుతో ఈనాడు - గల్పిక - 07- 08 -2002 ప్రచురితం )
'రావణాసురుడి ఇంటి పేరేంటో తెలుసా నీకు
'ఆ రోజుల్లో ఇంటి పేర్లూ... అవీ లేవనుకుంటా గురూ!'
'అది నీ అజ్ఞానం శిష్యా... రావణా సురుడి గారింటి పేరు 'గాదె' వారని సోదా హరణంగా సెలవిచ్చారో సారువారు' గర్వించి చెడిపోయెగాదె రావణాసురుడు' అనే పద్యం పాదంలోని పదాన్ని పీకిన ఆ ప్రావీణ్యాన్ని చూశావా! ఆహా! ఏమాజ్ఞానం!'
' నిజమే సుమా! పంతుళ్లు పండితులు కనక పాత మాటలకలా కొత్తర్థాలు పీకగల ప్రావీణ్యం ఉండి ఉంటుంది. పామరులం. మాబోటి వారలకలా తోచి చస్తాయా'
'అయ్యవార్ల ఉద్యోగాలకంత బృహత్తర బాధ్యత వుంది కనకనే, ప్రభుత్వం వారు కూడా పూర్వంలాగా ఉపాధ్యాయ ఉద్యో గాలను ఊరకే ఊరుసంతర్పణ చేయకుండా వృత్తి పరీక్షలూ అవీ పెట్టి మరీ దక్షతను పరీక్షించి గాని నియామకాలు చేయరాదని నియమం పెట్టుకున్నారు కదా! '
'అవునవును ఏటేటా జరిగే ఈ పంతుళ్ల పరీక్షల తంతు ఏటపోతుల జాతర్జాగా ఎంతో సందడిగా సాగుతుంటుంది. లక్షల్లో ఉంటారయ్యా అభ్యర్థులు! భావిభారత పౌరుల్ని తీర్చిదిద్దేందుకింతమంది కంకణ బుద్ధులై ఉన్నారన్న సంగత్తలుచుకుంటేనే ఒళ్లు పులకించిపోతుంది.'
' పరీక్ష పత్రాల్లో ఆ భావి ఉపాధ్యాయ అభ్యర్థులు వ్రాసే సమాధానాలు వింటే ఒళ్లు జలదరిస్తుంది కూడా! మహాత్మాగాంధీ గారి భార్య పేరేంటని అడిగితే రోహిణీ హట్టంగ ని మొహమాటం లేకుండా రాసేసాడో మేధావి టీచరు . సైకిల్ తయారుచేసిందెవరని అడిగితే.. నటరత్న, విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారకరామారావని జవాబు! పంచపాండవులకా పేరెందుకొచ్చిం దయ్యా అంటే... పంచెలు కట్టుకు తిరుగుతారు కనక వాళ్లను పంచపాండవులంటారని ఆన్సర్ రాశాడొకానొక భావి పంతులు . ఎంత సెన్సాఫ్ హ్యూమర్!'
' గ్రామర్ లేకపోతేనేం.. హ్యూమరుందని సంతోషించొచ్చు కదా! కొశ్చన్సంత కష్టంగా ఉంటే వాళ్లు మాత్రమేం చేస్తారు.. పాపం! అసలే ఎండాకాలం చదువులు... నీటికొ రత.... కరెంట్ కోత.. ఉక్కపోత.... వందల మంది పంతుళ్లు మందలుగా కావాలనుకొన్నప్పుడు వాళ్లే చూసీచూడనట్లు సర్దుకుపోవాల్సింది.'
' పేపరు దిద్దేవాళ్లకదే ఐడియా వచ్చినట్లుంది . మార్కులు వేసేటప్పుడు కొంచెం లిబరల్ గానే ఉన్నారని విన్నాను. మంచానికెన్ని కోళ్లన్న కొశ్చనికి నాలుగు మార్కుల యితే, మూడని రాసిన వాడికి మూడు, రెండని రాసిన వాడికి రెండూ, ఒకటని రాసిన వాడికి ఒకటీ... వేశారుట:' '
' అసలు కోళ్లేవీ లేవనీ రాస్తేనో? '
'అన్ ట్రయిన్డుకయితే గ్రేసు మార్కులేసి పాసుచేయాల్సిందేనని రూల్సు పాసయ్యా యని విన్నాను. ఇంత తేలిగ్గా దిద్దినా అనుకున్నంత మంది పంతుళ్లు తేలనేలేదని తెగ బాధపడిపోతోంది ప్రభుత్వం . పరీక్ష పోయినవాళ్లు మాత్రం ప్రశ్నలో 'కోళ్లు' అని ఉండకూడదు ' కాళ్లు' అంటే కనప్యూజనుండేది కాదని కోర్టుకెళ్లారు. అది వేరేకథ'
' పోనీలే... పాసయినవాళ్లన్నా ఆ చిలకమర్తి వారి గణపతి బాపతు కాకుండా సక్రమంగా చదువులు చెబితే అదే పదివేలు'
' రావణాసురుడి గారికి 'గాదె' అని ఇంటి పేరు ఫిక్స్ చేసింది గిరీశాన్ని మరిపించే అలాంటి గురువుగారే బాబూ'
' ఈ గొడవంతా ఎందుకని కొద్దిమంది బుద్ధిమంతులు సద్దుచేయకుండా క్లాసుల్లోనే నిద్రపోతున్నారని గ్రామ కమిటీ పెద్దలు వాపోతున్నారు.'
' గురక కూడా గురువు చెప్పే ఒకరకమైన పాఠమే కదా గురూ!'
' ఈ మాటే ఇన్స్పెక్షనుకెవరైనా వచ్చి ఇదేమని అడిగితే, బి.ఇడి, బెడ్ మా డిగ్రీ
లోనే ఉందని బుకాయించే గురువులకు కరవులేదు. అలాంటి ప్రబుద్ధుడే ఒకాయన మొన్నామధ్య పదోతరగతి పేపర్లు దిద్దుతూ నిద్రలో తూలి తొంభైకి బదులు ఇరవైయ్యని వేసేసి చెయ్యి దులిపేసుకున్నాట్ట. పెద్ద గోలయింతరువాత పేపరు తెప్పించి చూస్తే పొరపాటు బైటపడి నాలుక్కర్చుకున్నాట్ట. ఇంగ్లీషు తొమ్మిదికి, తెలుగు రెండుకీ తేడా తెలుసుకోలేకపోయానని తెగ పశ్చాత్తాప పడిపోయాడట, పాపం! '
' పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని నమ్మే జాతిలో పుట్టాడు గనక బ్రతి కిపోయాడులే'
'ఇలాంటి గొడవలవుతాయనే కొంత మంది గురువులు తక్కెట్లో పేపరేసి బరువునుబట్టి మార్కులేసే సులువు సూత్రం కనిపెట్టేరు. ఈ ' వెయిటేజీ' సిస్టంవల్ల వర్కెంతో ఈజీ అయిందని అధికారులు కూడా తెగ ఇదయిపోతున్నారని విన్నాను. ఎంతయినా పంతుళ్ల బుర్రలు పాదరసాలు!'
'అలాంటి పాదరసం బుర్ర తాలూకు పంతుళ్లు కొంతమంది మొన్న జరిగిన టెన్త్ సప్లిమెంటరీలో ఫస్టుక్లాసుకు వెయ్యి... పాసుకు అయిదొందలని పాట పెట్టినట్లు వినికిడి'
' పేపరుకు రూపాయిన్నర చొప్పున ఎన్ని పేపర్లు రుద్దుకుంటే పదిరూపాయలొచ్చేను స్వామీ! బడికన్నా ఈ రాబడే బాగుంది. అందరూ వంతులేసుకుని పాపం, పంతుళ్లనాడిపోసుకొనే వాళ్లేగానీ, వాళ్ల బాధలు పట్టించుకునే నాథుడేడీ? గొంతు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని వాళ్లు గోల పెడుతున్నారు. బాధ్యతలే తప్ప బొత్తిగా హక్కు ల్లేని కంచి గరుడ సేవకదరా గురుడా ఈ కొలువని వాపోవని గురువే లేడు. నెలనెలా ఠంచనుగా వస్తాయన్న గ్యారంటీ లేని చాలీ చాలని జీతాలు... నేలమీద కూర్చుని, గురుకులాల్లో లాగా చెప్పాలి పాఠాలు... '
' ఊళ్లోకి ఏ పెద్ద తలకాయ దిగినా ఊరే గేందుకు పిల్లల్ని పోగేసుకుని ముందుండాల్సిన పేమెంటు లేని గవర్న మెంటు సర్వెంట్లు... సర్వేలంటే చాలు సర్వదా సర్కారుకు చటుక్కుమని గుర్తొచ్చే బంట్లు... జనాభా లెక్కల సేకరణ మొదలు ఎన్నికల క్రతువు నిర్వహణ వరకూ, దోమ కాటు నివారణోత్సవాల జాతర నుంచీ, ధూమపాన వ్యతిరేక ప్రచార పరుగుల దాకా... కూరలో కరివేపాకులాగా పంతుళ్ల పాత్ర తప్పనిసరి కదా ! '
'తప్పదు. అది బ్రహ్మ నొసట రాసిన తలరాత. సందర్భమొచ్చింది కనక ఒక చిన్న కథ చెబుతా విను. రకరకాల జీవుల్ని తయారు చేయటం విధాతగారి విధి కదా! కవుల్నీ. గాయకుల్నీ, నటుల్నీ, నాయకుల్నీ, పండి తుల్నీ, పామరుల్నీ... ఇలా వివిధ రకాల ఆకారాల్ని చెక్కేసింతరవాత... అక్కడ రాలి పడిన ముక్కలన్నింటినీ ఏరిపారేసే ముందు... సరదాగా ఒక ముద్దచేసి ఇంత ప్రాణంపోసి భూమ్మీదికి విసిరేస్తే... ఆ శాల్తీ పైకప్పులేని బళ్లో డబ్బుమని పడిందట. అలా బళ్లో పడ్డ పంతులుగారు 'నీకు గుడే లేకుండా పోవుగాక ! ' అని కోపంతో, పాపం ఆ బ్రహ్మగారికే శాపం పెట్టాడట! భూమ్మీద నీ గతి కూడా అంతేలే... ఫో అని తిరిగి బ్రహ్మ కూడా శాపం పెట్టాడని... కథ.
'బాగుంది. అందుకే కదా మనం గురువును సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమని గౌర వించుకుంటూ ప్రతియేడూ గురుపూజలూ అవీ చేసుకుంటూ, ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులూ, రివార్డులూ ఇచ్చుకుంటుంటాం. భూమ్మీద త్రిమూర్తులను గుర్తుకు తెచ్చేది గురువేనని మన సంప్రదాయం చెబుతోంది. సమాజం నమ్ముతోంది.'
'పట్నాల్లో తిష్ట వేసినా పంతుళ్లని పల్లెజనం 'మావూరికిరండని' మర్యాదగా పిలుస్తున్నదీ అందుకే' .
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక - 07- 08 -2002 ప్రచురితం )
No comments:
Post a Comment