Saturday, December 4, 2021

ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - చిన్న కథానిక అసలైన మూర్ఖులు రచన- కర్లపాలెం హనుమంతరావు

 



ఈనాడు - హాస్యం - వ్యంగ్యం - చిన్న కథానిక 

అసలైన మూర్ఖులు 

రచన- కర్లపాలెం హనుమంతరావు

( ఈనాడు - గల్పిక - 20 -08 -2002 న ప్రచురితం ) 


ఇదివరకు ఆదివారం రోజుల్లోనే వచ్చేవాడు. సోమరాజు మా ఇంటికి.

ఇప్పుడు ఎప్పుడుపడితే అప్పుడు మూడొచ్చిందంటూ వచ్చి కూర్చుంటున్నాడు ..


వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుంచీ ఇదే వరస.


వి.ఆర్.ఎస్. ఎందుకు తీసుకున్నావ సలు అని అడిగాను ఒక రోజు.  అందరూ తీసుకుంటున్నారు. నేనూ తీసుకున్నా' అనేశాడు సోమరాజు. 


అందరూ చేస్తున్నారని అదే పనిని గుడ్డిగా చేసే వాళ్లనేమంటారు?


' గొర్రెలు ' అన్నాడు తాపీగా కొద్దిసే సాగి , 


గొర్రెలు అలా చేస్తాయని నిర్ధారణగా నీకు తెలుసా?


ఏమో... అందరూ అంటారుగా! 


అందరూ అంటే విని నిర్ధారణ చేసుకో కుండా నిజమని నమ్మే నీబోటి వాళ్ళనేమనాలి మరి?


'చాయ్' వచ్చి నన్ను రక్షించింది. 


నాకూ, మా ఆవిడకూ మధ్య ఒక ఒప్పందం ఉంది. నా కోసం వచ్చేవాళ్లు ఒక పది నిముషాలు మించి ఉండకూడదను కుంటే మంచినీళ్ళు పంపిస్తుంది. అరగంటయితే చాయ్... గంటవరకూ కాఫీ... అదీ ఆవిడ కోడ్ . 


వాళ్ల పనిమీదే వచ్చేవాళ్లకు మంచినీళ్ళు, అందులో మాకూ లాభముందనుకుంటే చాయ్, అచ్చంగా మాకే లాభమయితే కాఫీ పంపటం మా ఆవిడ మరో పాలసీ కూడా .


సోమరాజు మా ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగకుండా పోయిన రోజులు బోలెడన్ని  వి.ఆర్.ఎస్. తరవాత పరిస్థితి మారి పోయింది. అతణ్ని ఒక పాతికవేలు అప్పు అడగమని మా  శ్రీమతి పోరుపెడుతోంది. 

ఆవిడ పంపిన చాయ్ తాగే హుషారులో 'మంచి కాన్సెప్ట్ ఉంది. కథ రాసుకుంటావా గురూ !' అనడిగాడు. 


కాదంటే ఎలా? పాతికవేలు లోను అడ గాలి కదా! తలూపి చెవులప్పగించి

కూర్చున్నాను.


సోమరాజు చెప్పడం మొదలు పెట్టాడు. 


అనగనగా ఒక రాజు. ఆ రాజుకు అన్నీ కొత్త ఐడియాలే వస్తుంటాయి. 


ప్రేమికుల దినం, తండ్రుల దినం, తల్లుల దినం లాగా మూర్ఖులక్కూడా ఒక దినం చేయాలనుకు న్నాడాయన. మంత్రిని పిలిచి, మన రాజ్యంలో మూర్ఖులొక ఐదుగుర్ని చూడు. మూర్ఖుల దినం జరిపి సన్మానం చేద్దాం అన్నాడు. 


మంత్రిగారు మూర్ఖుల వేటకు బయలు దేరారు. 


ముందుగా నీలాంటి ఒక కవిని కలిశాడు.


'నేను కవిని కాదు. రచయితను ' అన్నాను ఉక్రోషంగా.


'ఎవరైతే ఏంలే... రాసుకొనే వాడు: కవి రాసింది కొద్దిగా చూశాడు. ఒక్క  ముక్కా బుర్రకెక్కింది కాదు . 


' సామాజిక స్పృహ' అంటే అట్లాగే ఉంటుంది. ఒక్కో సారి నాకే అర్ధమయిచావదు నా కవిత్వం' అనేశాడాకవి. మంత్రిగారికి మొదటి క్యాండిడేట్ దొరికాడు. 


 మూర్ఖుల దినం రోజున రాజుగారిని కలవమని ఆహ్వాన 

పత్రమిచ్చి ముందుకు కదిలాడు.


టక్కు, టయ్యీ కట్టుకున్న జెంటిల్మన్ ఒకాయన నేలమీద ఏవో గీతలు గీస్తూ కనిపిస్తే ఠక్కున ఆగి 'ఏం చేస్తున్నావూ?' అనడి గారు మంత్రిగారు. 


'కృష్ణాగోదావరి జలాలను ఈ దారినే మళ్లిస్తారుట . ఇక్కడ బ్రిడ్జి కట్టేందుకు 

టెండరు పిలిస్తే బిడ్డింగెంతకు  వేయాలో ఎస్టిమేషనేస్తున్నా' 


జలాలనెవరు తరలిస్తున్నారు? ఎప్పుడు తరలిస్తున్నారు?


' ఏమో... రాజుగారే అన్నారటగా! '  అని భుజాలెగరేశాడా పెద్ద మనిషి.  మంత్రిగారికి రెండో మనిషి కూడా తేలిగ్గానే దొరికాడు.


సంతోషంలో మరికాస్త ముందుకుపోతే... ఒక ఆడమనిషి చేతిలో పాలచెంబుతో హడావుడిగా పరిగెడుతూ కనిపించింది. 

అతికష్టం మీద ఆవిడను ఆపి  విషయమడిగితే ' వినాయకుడి విగ్రహం పాలు తాగుతోందిగా! అప్పుడే మా పక్కింటి వాళ్లు పావుశేరు పాలు తాగించారు .  నేను కనీసం అరశేరన్నా తాగించొద్దా! ' అంది ఆవేశంగా రాజుగారి మూడో సన్మానగ్రహీత ఆ ఆడమనిషి. 


అనుకున్నదానికన్నా తేలిగ్గానే దొరుకుతున్నారు మనుషులు. 


'ఐదు బహుమతులు చాలవు. వచ్చేసారి కనీసం యాభయ్యన్నా పెట్టించాలని అనుకొన్నారు మంత్రిగారు. 


పుట్టంగానే పిల్లల్ని ఫౌండేషన్ కోర్సుల్లో వేసేవాళ్లు, మాఫియా డబ్బుల్తో తీసిన భక్తి సినిమాలు చూసి మతిపోగొట్టుకొనే వాళ్లు, ఆడుక్కొనేందుకు గాంధీ వేషం వేస్తే గానీ ఆదరించని ఉదారులు, దేవుడి పేరు చెప్పి దౌర్జన్యాలు చేస్తున్నా చెంపలేసుకొనే భక్త శిఖామణులు... టీవీ సీరియల్సు చూసి కళ్ల నీళ్ళు పెట్టుకునే ఆడవాళ్ళు.. ఇలా గజానికో నిజమైన మూర్ఖశిఖామణి ఉన్న పుణ్య భూమిలో యాభై బహుమతులు మాత్రం

ఏమూలకొస్తాయి! 


పెద్దగుంటలో డాలర్లు పోస్తూ కనిపిం చాడో పెద్దాయన ఈసారి.  


విషయమేమిటనడిగితే ' తెల్లారేసరికల్లా డాలర్లు డబ్బులవుతాయి. మా బంధువొకాయన ఈ గుంటలోనే పోశాడు. మా అబ్బాయి అమెరికాలో సంపాదిస్తున్నాడు. నేనిలా వాటిని పెంచుతా' అన్నాడు గుంట పూడ్చుకుంటూ . ఆ గుంట పేరు ' ఖుషీ '  అవి బ్యాంకుట. 


 మంత్రిగారికి జాలేసింది. రాజ గారి సభకు రమ్మని పిలిచాడు.. కనీసం ఆ బహుమతైనా మిగుల్చుకుంటాడో లేదో అనుకొంటూ' 

... 


డబ్బనగానే గుర్తుకొచ్చింది. పాతిక వేలు లోను విషయం. 


కదిపాను సోమరాజుని .


 'ఎందుకూ? నువ్యూ  ఆ గుంటలో పోస్తావా?' అని నవ్వి లేచి నిలబడ్డాడు. 


సోమరాజు ఐదో కాండిడేటెవరో కూడా చెప్పమని అడుగుదామనుకొనే లోపలే బైట కాలింగ్ బెల్ మోగింది. 


లేచి వెళ్ళి తలుపు తీశాను. 


నవ్వుతూ ఒకాయన లోపలకొచ్చి నా చేతులు ఊపాడు. 'కంగ్రాట్యులేషన్స్' అంటూ. 


నా చేతిలో ఒక కవరుంచాడు. అది 'రాజుగారి మూర్ఖుల సభకు ఆహ్వానం' ! ' మీరు తప్పకుండా రావాలి . మంచి బహుమానం ఉంటుంది' అని అన్నాడాయన. 


మా ఆవిడ కాఫీ పంపించింది. 


ఆ వచ్చి నాయన మంత్రి అని పసిగట్టింది కాబోలు. ఆ రాత్రి నేనూరికే మధనపడుతుంటే ' పని వదిలేసిన పనిలేని సోమరాజు చెప్పే పని కిమాలిన కబుర్లు పనిమానుకుని వినే మీరే ఆ అయిదో కేండిడేటుగా అర్హులు'  అనుకొని వుంటారు మంత్రిగారు. ఏదైతేనేం.. బహుమతి వచ్చిందిగా' అని ఊరడించింది మా ఆవిడ. 


- కర్లపాలెం హనుమంతరావు 

( ఈనాడు - గల్పిక- 20 -08 -2002  న ప్రచురితం ) 

No comments:

Post a Comment

మతాల స్వరూపాలు కొడవటిగంటి రోహిణీప్రసాద్, 08-09-2010

  మతాల   స్వరూపాలు కొడవటిగంటి   రోహిణీప్రసాద్ ,  08-09-2010  మతభావనలు ,  మనిషికీ   నరవానరానికి   తేడాలు   తలెత్తినప్పటినుంచీ   మొదలైనవిగానే ...