ఈనాడు - గల్పిక:
మగాళ్లూ .. మారండి!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 08 -03 - 2014
బ్రహ్మదేవుడు ఏ చిరాకులో ఉండి సృష్టించాడోగాని ఆడదాని బతుకు ఎప్పుడూ గండ్రగొడ్డలి కింద ఎండుకొమ్మే కదా! ప్రపంచంలోనూ ఆడదానికి అన్ని విధాలా అవమానాలే! బ్రహ్మకు రిమ్మ తెగులు . పర మ మేశ్వరుడు భార్యకు సగం శరీరం ఇచ్చినట్లే ఇచ్చి మరో గంగానమ్మను నెత్తికెత్తుకున్నాడు. విష్ణుమూర్తిది మరీ అన్యాయం .. కట్టుకున్నదాన్ని కాళ్ల దగ్గర కట్టిపడేశాడు.
' ఆడదానికిచ్చే స్వాతంత్య్రం ప్రమాదకరం' అని మనువెవరో అన్నారట. ఆ మహానుభావుడి మిగతా సూక్తులన్నిటినీ గాలికొదిలేసిన మన మగమహారాజులు, ఈ ఒక్క ముక్కను మాత్రం పట్టుకుని ఇరవై ఒకటో శతాబ్దంలోనూ వేదంలా పాటిస్తున్నారు!
ఒక మగాడనే ఏమిటి- గ్యాసు బండలు, యాసిడ్ సీసాలు, సెల్ఫోన్లు కెమెరాలు, సినిమా బొమ్మల్లో బూతర్థాలు, కట్నం వేధింపులు, అత్యాచారాలు, అతి ఆచారాలు, అనారోగ్యాలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు, లైంగిక వేధింపులు, తక్కువ జీతాలు ఆబ్బో.. జుల్లెడ చిల్లులకన్నా చాలా ఎక్కువ ఆడదాని సమస్యలు.
వేళకు వంటచేసి వడ్డించడానికి, బిడ్డల్ని కనిపెంచడానికి, ఇల్లును కనిపెట్టుకుని ఉండటానికి, బయట ప్రదర్శించుకుని దర్పాలు ఒలకపోయడానికి, తమ వేణ్నీళ్ల సంపాదనలో చన్నీళ్లలా జీతం రాళ్లు కలుపుకోవడానికి, సినిమా హాలు క్యూలో నిలబడి టికెట్లు త్వరగా తీయడానికి, బస్సుల్లో ఆడాళ్ల సీట్లు అక్రమంగా ఆక్రమించుకోవడానికి, బ్యాంకుల్లో దొంగ ఖాతాలు తెరవడానికి, ఆదాయం పన్ను లెక్కలు పక్కదారి పట్టించడానికి మాత్రమే భగవంతుడు ఆడదాన్ని తనకు జోడీగా కుదిర్చాడనుకుంటున్నాడు మగవాడు!
బల్లిని చూసి భయపడేంత సున్నితమైన మనసు ఆడదానిది. అయినా ఒక బిడ్డకోసం నెలల తరబడి శరీరాన్ని పోషిస్తుంది. చివరకు కత్తికోతలకూ వెరవకుండా ప్రసవానందాన్ని అనుభవిస్తుంది. గంట పనిచేస్తే వందలు డిమాండు చేసే వ్యాపారపు లోకంలో ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు సహస్రావతారాలతో సమర్థంగా శ్రమించే ఆడదాని శుశ్రూషకు పైసల్లో విలువ కడితే పదిమంది బిల్ గేట్బు సంపదలు కూడా ఒక వారానికి సరిపోతాయా?
పక్షి గాలిలో ఎగిరినంత ఒడుపుగా, చేప నీటిలో ఈది నంత సులభంగా, పులి భూమ్మీద కదిలినంత ఉత్తేజంగా ఇంటి ప్రపంచంలో కలియదిరుగుతుంది ఆడది. ఇంటి నాలుగోడల నడుమ ఆమె నడిచే దూరం ముందు ఏ ఒలిం పిక్స్ మారథాన్ పరుగైనా... బలాదూర్. ఇంటి బరువు బాధ్యతలను మోసే ఆమె శక్తిసామర్ధ్యాల ముందు ఎంత మంది నిలబడగలరు?
ఇంటికి అత్యవసర వైద్యురాలు ఆమె. ఏ శిక్షణా లేని బిడ్డల ఉపాధ్యాయురాలు. అనుక్షణం పిల్లల్ని కంటికిరెప్పలా సంరక్షించే వార్డెన్ . కుటుంబ సభ్యు లెవరికైనా కష్టం కలిగినప్పుడు ఓర్పుగా ఓదార్చే కౌన్సిలర్. ఇంట్లో ఎవరి ఇష్టాయిష్టాలేమిటో పెదవి విప్పకుండానే తెలుసుకుని అందరి కష్టాలు పోగొట్టగల సమర్ధురాలు.
సంసారమనే విమానానికి పైలెట్ ఆమే . ఎయిర్ హో స్టెస్యూ ఆమే . రచ్చలో కూర్చున్న భర్త పెత్తనం చలాయిస్తున్నా కలికి కామాక్షి మాదిరి ఆమె ఒదిగి నడుచుకుంటున్నందు వల్లనే ఇల్లు భూలోక కైలాసంలా వర్ధిల్లుతోంది. ఆధార్ కార్డు కూడా ఓ పట్టాన దొరకని కాలంలో ఆడ దాని ఆధారం అత్యంత ఉదారంగా దొరకడం ఈ గడ్డమీద మగవాడు చేసుకున్న అదృష్టం.
మెడలో మూడు ముళ్లు పడి ఏడడుగులు నడిచిన ముహూర్తం నుంచే తన
ఒంటితీరును, ఇంటిపేరును భర్త వంశానికి మీదుకట్టే త్యాగమయి స్త్రీ. రాముడు వచ్చి పోరాడేవరకు రావణాసురుడినయినా గడ్డిపోచతో నిలువరించగల ధీరోదాత్త ఆమె. పెళ్ళినాటి కాళ్ల పారాణి ఆరక మునుపే కట్టుకున్న భర్త సోదర సేవంటూ అడ వులు పట్టిపోతున్నా దుఃఖం పెదవులు దాటి రానీయనంత సంయమనశీలి ఆ లలన. పతిదేవుడి ప్రాణం కోసం మృత్యుదేవుడితోనైనా తలపడేందుకు ఆమె సిద్ధం. ప్రేమిం చినవాణ్ని తనవాడిని చేసుకునేందుకు చాటుమాటు రాయబేరాలకూ జడవని సాహసీ ఆమే. పుట్టుగుడ్డి భర్తకు దక్కని దృశ్య భాగ్యం తనకూ అక్కర్లేదని కళ్లకు గంతలతో చీకటి జీవితం గడపడం- ఆమెకుగాక ఎవరికి సాధ్యం?
మగవాడికన్నా బుద్ధిలో నాలుగు రెట్లు, సాహసంలో ఎనిమిది రెట్లు అధికురాలైనా ఆమె ఒదిగి ఒదిగి ఉన్నది కాబట్టి- లోకం జీవనదిలా సారవంతంగా సాగుతోంది. యుగయుగాలుగా తెగ చిక్కుబడ్డ పీటముడిని విడదీయా లంటే మగవాడికి కావాల్సింది ఒక నేర్పే కాదు, మగ నాలితో కలిసిసాగే ఓర్పు కూడా!
సునీత విలియమ్స్, ఇందిర, సూకీ... ఎన్ని వందల కోట్ల మందిలో ఒక్కరు? నిన్నటి నిర్భయ, నేటి 'అనూహ్య'ల విషాదగాథల సంగతేమిటి? ఇప్పటిదాకా ఇంటివరకే తంటా. పెరిగే ఆధునిక అవసరాల కోసమై వీధుల్లోకొస్తున్న అంగనలను అంగడి బొమ్మల్లా చూసి చొంగ కారుస్తున్నారు పురుష పుంగవులు. 'అమ్మా అమ్మా' అంటూ ఒక వంక పూజలూ, పురస్కారాలు. మరో వంక అమ్మ .. ఆలి .. చెల్లి పేర దూషణలతో బడితె పూజలూ, తిరస్కారాలు!
ఆత్మరక్షణకోసం ఆడది వాడే 'మిరియప్పొడి' పార్లమెంటు దాకా పాకింది కానీ, ఆమె బతుక్కు 'రక్షణ' కల్పించే మహిళా బిల్లుకు మాత్రం మోక్షం దక్కలేదు... ఇన్ని దశాబ్దాలు గడిచినా! 'ఆమ్ ఆద్మీ పార్టీ 'చీపురు' కు పెరుగుతున్న ఆదరణ మాత్రమైనా చీపురు కట్టనువాడే ఆడమనిషికి దక్కడం లేదంటే, పురుషుల రువాబుకు ఏమని పేరు పెడితే సబబు ? !
'ఆడపుటక మగసమాజం పానకంలో ' పుడక | అనుకోవటం మానుకోవాలి. తిరగక మగాడు తిరిగి ఆడది చెడటం ఏమిటి? తిరుగుళ్లు మనోవికాసం కోసమే అయినప్పుడు ఆడ దాని 'మనోవికాసం' మగ సమాజానికి అంత చేటా? అంత ర్జాతీయ మహిళా దినోత్సవాలు ఆర్భాటంగా జరుపుకొంటే చాలదు. మగవాడి అంతరంగం ముందు మారాలి. ఆనాడు ప్రతిదినమూ మహిళా దినోత్సవమే!
- కర్లపాలెం హనుమంతరావు
( ఈనాడు - గల్పిక- 08 -03 - 2014)
No comments:
Post a Comment